రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, జూన్ 2016, ఆదివారం

కామెడీ సంగతులు- 1






సినిమా కామెడీ సీజనల్. ఒక సీజన్ లో ఒక ట్రెండ్ లో ఒకటైపుతో మొదలైన కామెడీ అదేపనిగా  విసుగెత్తే వరకూ రిపీటై అంతరించిపోతుంది. మళ్ళీ ఇంకో టైపు మొదలవుతుంది. కన్ఫ్యూజ్ కామెడీలు, హర్రర్ కామెడీలూ ఇలా వచ్చివెళ్లినవే. ఒకప్పటి వరకూ  కమెడియన్లకే పరిమితమైన  కామెడీ విభాగం – ఏకంగా స్టార్లు కామెడీ చేయడంతో అదో ఫ్యాషన్ గా  కామెడీ విభాగం స్టార్ల హస్తగతమైపోయింది.  కమెడియన్లు అడుక్కి జారిపోయారు. అంతేకాదు, స్టార్లే కామెడీ చేయడంతో అల్లరి నరేష్, సునీల్ లలాంటి కామెడీ హీరోలకీ గడ్డు కాలం వచ్చింది. గతంలో కామెడీ హీరోలు గా రాజేంద్ర ప్రసాద్, నరేష్, చంద్రమోహన్  ల వంటి వాళ్ళు ఎదురులేకుండా  వెలిగిపోయారంటే  అందుక్కారణం  అప్పట్లో హీరోలు కామెడీ చేసే వాళ్ళు కాదు. కమెడియన్ల పని కమెడియన్లు,  వాంప్ ల పని వాంప్ లు చేసుకునే వాళ్ళు. కమెడియన్ల పని స్టార్లూ, వాంప్ ల పని హీరోయిన్లూ చేయడంతో రెండిటి కళాకారులూ గల్లంతయ్యారు. అయితే కామెడీ ఎప్పుడైతే స్టార్ల చేతికి వెళ్ళిపోయిందో, అప్పుడది  కృత్రిమంగా, ఒక టెంప్లెట్ గా, మొక్కుబడి వ్యవహారంగా  మారిపోయింది. 


        ఏ స్టార్ సినిమాలోనైనా స్టార్లు చేసే కామెడీ ఏమిటో ఓసారి చూడండి : ఫస్టాఫ్ అంతా  హీరోయిన్ ని ప్రేమలో పడేసేందుకే కామెడీ చేస్తారు; సెకండాఫ్ లో బ్రహ్మానందం తోనో మరోకరితోనో  బకరా కామెడీ ఏదో చేస్తారు. ప్రధాన కథని మాత్రం యాక్షన్ తో ఉండేలా చూసుకుంటారు. ఒక పూర్తిస్థాయి కామెడీ సినిమాని  స్టార్లు తలపెట్టలేరు. తమ ఇమేజికి తక్కువనుకుంటారు. నిజమే, కామెడీ అనేది నీచ స్థాయి వ్యక్తిత్వాల వ్యవహారమన్నాడు అరిస్టాటిల్. సర్కస్ లో జోకర్, గ్రామాల్లో తుపాకీ రాముడు, తోలు బొమ్మలాటల్లో కేతిగాడు,  జుట్టు పోలిగాడు, ఛార్లీచాప్లిన్ పాపులర్ చేసిన దేశదిమ్మరి పాత్రలూ వాళ్ళ వెకిలి పోకిరీ చేష్టలతో నవ్వించే నీచస్థాయి వ్యక్తిత్వపు పాత్రలే. అందుకని  స్టార్లు గౌరవంగా తమ ఇమేజిని కాపాడుకుంటూ ఓ టెంప్లెట్ కామెడీతో  సరిపెట్టేస్తారు. హిందీలో అప్పుడప్పుడైనా అక్షయ్ కుమార్ లాంటి యాక్షన్ హీరో హీరా ఫేరీ, ఎంటర్ టైన్ మెంట్, షౌకీన్స్, హౌస్ ఫుల్- 3 లాంటి పూర్తి స్థాయి హస్యకథా చిత్రాలు చేస్తూ వస్తున్నాడు. కాబట్టి తెలుగులో కామెడీ సీజనల్ గానూ, స్టార్ల చేతిలో  కంపార్ట్ మెంటలైజ్డ్ గానూ మారిపోయింది. ఫస్టాఫ్ కథతో సంబంధం లేని హీరోయిన్ కోసం కామెడీ, సెకండాఫ్ కూడా కథతో సంబంధంలేని బ్రహ్మానందంతో- కాకపోతే మరొకరితో కామెడీ అనే రెండు టెంప్లెట్స్ ని  పెట్టుకుని కామెడీని లాగించేస్తున్నారు. ఈ రకంగా కామెడీ ట్రాకులుగా ముక్కలయ్యింది. ప్రధాన కథ కామెడీగానూ వుండదు, ప్రధాన కథతో సంబంధం కూడా వుండదు కాబట్టి ఒక్కో ట్రాకు ఒకొక్కరూ అవుట్ సోర్సింగ్ కూడా తీసుకుని రాసెయ్యొచ్చు!

        కామెడీ ఎలా రాయాలో తెలియజేయమని ఒక అసోసియేట్ దర్శకుడు కోరిన మీదట కామెడీ జానర్ లోకి ప్రయాణించడం ప్రారంభిస్తే, రెండు విషయాలు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి : పైన చెప్పుకున్న తరహా స్టార్ల టెంప్లెట్  కామెడీలు మార్కెట్ ని ఆక్రమించడం ఒకటైతే, అసలు పూర్తి స్థాయి హాస్య చిత్రాలనేవి  కనుమరుగైపోవడం రెండోది. ప్రేక్షకులు మొదటి దానికే అలవాటు పడిపోయి, రెండో దాని ఉనికినే గుర్తించడం లేదు. ప్రపంచమొక నాటక రంగమన్నాడు షేక్స్ పియర్. తెలుగు ప్రేక్షకులేమను కుంటున్నారంటే, తెలుగు సినిమాలోక హస్య నాటకరంగమనీ వాటిలో హాస్యం లేకపోతే  చూడలేమనీ అనుకుంటున్నారు. అయితే విచారకరంగా వాళ్ళు వినోదించడానికి ఇష్టపడుతున్నది మాత్రం అర్ధ/అనర్ధ  హాస్య నాటకరంగాన్నే. ఫస్టాఫ్ లో ఒక టెంప్లెట్ కామెడీ, సెకండాఫ్ లో  ఇంకో టెంప్లెట్ కామెడీ, మధ్యలో పిసరంత ఏదో కథ వుంటే చాలు, అదే సినిమా అనుకునే పరిస్థితి వచ్చింది. 

         ఈ వాతావరణ పరిస్థితుల్లో కామెడీ రాయడమెలా అన్న ప్రశ్నే అప్రస్తుతమై
పోతుంది. హీరోయిన్ ని ప్రేమలో పడేసే టెంప్లెట్ కామెడీ రాయడానికి ఏ సూత్రాలూ వుండవు. ఎందుకంటే అదే కథ కాదు కాబట్టి. కథ ప్రారంభ మయ్యేసరికి అది కనుమరుగైపోతుంది కాబట్టి. అది నిర్వహించేది  కేవలం స్పేస్ ఫిల్లర్ పాత్రే  కాబట్టి. కామెడీ చేసి హీరోయిన్ని ప్రేమలో పడేశాడు, అక్కడ్నించీ ఆ ప్రేమ కథేమిటి? అన్నప్పుడు దాన్ని పూర్తిస్థాయి కామెడీ కథగా పొడిగించ వచ్చు. కానీ ప్రేమలో పడేశాక హీరో యాక్షన్ కథ వైపు వెళ్ళిపోతే ప్రేమకథ అక్కడితో ఆగిపోతుంది. ఫస్టాఫ్ లో ఆ కాస్తా అరగంట, ముప్పావుగంట- పోనీ గంట పాటు కథతో సంబంధంలేని టెంప్లెట్ కామెడీ రాయడానికి కావలసినవి రెండే రెండు :  ఎత్తుగడలు, పంచ్  డైలాగులు. ఎత్తుగడలు హీరోయిన్ని పడెయ్యడానికి, పంచ్  డైలాగులు హీరోయిజాన్ని పండించడానికి. ఈ ఆర్నెలల్లో విడుదలైన ‘నేనూ శైలజ’ నుంచీ ‘జంటిల్ మన్’ వరకూ  18 స్టార్ సినిమాలని చూస్తే ఎత్తుగడల, పంచ్  డైలాగుల క్రమం తెలిసిపోతుంది. ఇవన్నీ కొంచెం తేడాతో ఒకేరకంగా వుంటాయి. ఏ స్టార్ సినిమా అయినా  సినిమా మొదలెట్టగానే  హీరోయిన్ని ప్రేమలో పడెయ్యడమనే కార్యక్రమం తప్ప మరో కామెడీతో ప్రారంభంకాదు. ప్రతీ స్టార్ సినిమాలో ఇదే రొటీన్ ని విసుగులేకుండా మనసారా ఆనందిస్తున్న ప్రేక్షకులు ఎంతైనా మహానుభావులే అనుకోవాలి. 

        ఇలా స్టార్లు- ప్రేక్షకులూ కలిసి  కామెడీని  టెంప్లెట్స్ లో చెరబట్టాక, కింకర్తవ్య మేమిటి? పూర్తిస్థాయి హాస్యకథా చిత్రాలు తీయడమే! కామెడీ సినిమాలంటే ఇవే. వీటి దురదృష్టమేమిటంటే ఒకటి : ప్రేక్షకులు వీటి ఉనికినే గుర్తించక పోవడం, రెండు : గుర్తించినా స్టార్ సినిమాల కామెడీల దృష్ట్యా వీటిని  ‘బి’ గ్రేడ్ సినిమాలుగా పక్కన పడెయ్యడం, మూడు : అసలు వీటిని తీసే, రాసే దర్శకులే రచయితలే లేకపోవడం! 

        కాబట్టి కామెడీ రాయడమెలా అన్నప్పుడు ఒక పూర్తి స్థాయి హాస్య కథా చిత్రాన్ని రాయడమెలా అనే అర్ధంలోనే ఆ ప్రశ్నని చూడాలి తప్ప, స్టార్ సినిమాల్లో కరివేపాకు కామెడీ అని కాదు. ఆ దృష్టితో కామెడీని చూస్తే  ఈ వ్యాసాల పరంపర చదివి ప్రయోజనం లేదు. సమీపభవిష్యత్తులో కూడా స్టార్ సినిమాల్లో కామెడీ కథ వుండే అవకాశంలేదు. కథతో సంబంధంలేకుండా, హీరోయిన్ తో ఒక ట్రాకు, కమెడియన్ తో ఒక ట్రాకూ వుంటాయంతే. వీటిని రాయడానికి పెద్దగా క్రియేటివిటీ అవసరం లేదు. ఒక పధ్ధతి అంటూ కూడా ఏమీ లేదు. ఒక పూర్తి స్థాయి కామెడీ కథ రాయడానికే చాలా పద్ధతీ, క్రియేటివిటీ అవసరం. నేర్చుకోవాల్సింది దీన్ని. కానీ ఇది నేర్చుకుని ఏం చేస్తారు? కామెడీ సినిమాలకి కాలం తీరిపోయిందిగా? ఇక్కడే ఇంకో ప్రశ్న వేసుకోవాలి- ప్రేక్షకులు కామెడీ సినిమాలని ‘బి’ గ్రేడ్ సినిమాలుగా పక్కన పడేస్తున్నది నిజంగానే  స్టార్ సినిమాల్లో కామెడీల్ని చూసేనా? లేకపోతే - ఇవివి సత్యనారాయణ, సింగీతం శ్రీనివాస రావు, బాపు, జంధ్యాల, రేలంగి నరసింహారావు, విజయ బాపినీడు, వంశీ, శివనాగేశ్వరరావు ల్లాంటి హస్యకథా  చిత్రాల దర్శకులు ఇప్పుడు లేరనా? 

       కచ్చితంగా ఇది కూడా కారణమే. ఈ శతాబ్దపు ఈ పదహారేళ్ళ కాలంలో కామెడీ సినిమాలతో కొత్తగా వచ్చిన దర్శకులూ రచయితలూ ఎవరూ లేరు. పైన చెప్పుకున్న ప్రసిద్ధ దర్శకుల తరం తర్వాత కొత్త తరంలో హాస్యకథా  చిత్ర దర్శకులెవరూ పుట్టుకురా లేదు. కాలేజీ బూతు కామెడీ దర్శకులు కొందరు పుట్టుకొచ్చి వెళ్ళిపోయారు. ప్రేమల గురించి గొప్ప గొప్ప పాఠాలు చెప్పే ప్రేమ సినిమాల దర్శకులే పుట్టుకు వస్తున్నారు తప్ప- పక్కా కామెడీ దర్శకుణ్ణి  నేనూ అంటూ వచ్చిన వాళ్ళెవరూ లేరు. కామెడీ హీరో అల్లరి నరేష్ ని పెట్టుకుని కూడా సక్సెస్ కాలేకపోయారు. నిజానికి ఏడాదికి 60 -70  మంది కొత్త దర్శకులు ప్రతివాళ్ళూ పనికిరాని ప్రేమ సినిమాలతో కాకుండా, కొందరైనా ఒక ‘అహనా పెళ్ళంట’, ఒక ‘బృందావనం’, ఒక ‘లేడీస్ టైలర్’ లాంటి పూర్తి స్థాయి హస్యకథా చిత్రాలతో వస్తే,  అప్పుడు తెలుగునాట కామెడీ సినిమాలనేవి బతికున్నట్టు లెక్క. ఎక్కడా లేనంత మంది కమెడియన్లు తెలుగులో వున్నారు, వీళ్ళని సరీగ్గా ఉపయోగించుకునే కామెడీ దర్శకులూ రచయితలే లేరు. 

        పైన చెప్పుకున్న హస్యదర్శకుల తరం తర్వాత కొత్త హస్యదర్శకులెలా పుట్టుకు రాలేదో, అలా ముళ్ళపూడి వెంకట రమణ, భమిడిపాటి రాధాకృష్ణ మూర్తి, డివి నరసరాజు, జంధ్యాల, ఆదివిష్ణు, వంశీ, ఎల్బీ శ్రీరామ్ ల వంటి దిట్టమైన హస్యరచయితలు కూడా తర్వాతి తరంలో పుట్టుకురా లేదు. 

        ఇప్పుడేం  చేద్దాం. రంగంలో టెంప్లెట్ కామెడీ కర్తలు తప్ప, పూర్తి నిడివి కామెడీ కథా చిత్రాలకి దశాబ్దంన్నర కాలంగా ఎవరూ మిగలనప్పుడు, ఇటు వైపు ఆసక్తి కనబర్చే వాళ్ళు కూడా లేనప్పుడు, కామెడీ రాయడమెలా అని బుర్రబద్దలు కొట్టుకోవడం అవసరమా? వస్తున్న కొత్త దర్శకుల్ని ఈ పనికిరాని చెత్త ప్రేమ సినిమాలు కాదు, చక్కగా  ఇంటిల్లిపాదీ చూసి పొట్ట చెక్కలు చేసుకునే కామెడీ సినిమాలు తీయమని చెబితే వింటారా? ఎవ్వరూ వినరు.  అవే చెత్త ప్రేమలు తీసి అందరితో బాటూ అదే చెత్త బుట్టదాఖలై పోవడంలోనే పరమానందముంది. టెంప్లెట్ కామెడీలే కామెడీ అని భ్రమిస్తున్న  ప్రేక్షకులు కూడా ఆ భ్రమల్లోనే వుండిపోతారు. జాలిపడ్డం తప్ప మనం చేయగల్గిందేమీ లేదు. ఇదంతా నిరాశావాదం. 

     ఇక ఆశావాదం. నిరాశావాదం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న దర్శకులకీ ప్రేక్షకులకీ ఉండొచ్చు గానీ, ఇలాటి రాతలు రాసేవాడికి కాదు. ఆశావాదంతో ఏదో ఒకటి రాస్తూనే వుండాలి కాబట్టి- పైన ప్రస్తావించుకున్న అసోసియేట్ దర్శకుడి కోరికని మన్నించి – కామెడీ ఎలా రాయాలీ అని ఆలోచించక తప్పదు. భవిష్యత్తులో ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకడు దేవుడు దయతల్చి, కామెడీ తీద్దామని నిద్రలేచి చూసుకున్నప్పుడు, ఎదురుగా ఈ రాతలు బంపర్ ఆఫర్ లా కన్పిస్తే చాలన్న ఆశావహ దృక్పథంతో మొదలెడదాం...

        ముందుగా బీ. ఓ మల్లే అనే ఫిలిం మేకర్ అందించిన కామెడీ గణితం ఏమిటో చూద్దాం :
        ఒక నూటా యాభై పేజీల కామెడీ స్క్రిప్టు (డైలాగ్ వెర్షన్) రాశారనుకుందాం. అందులో ఒక్కో పేజీ చదివితే ఎన్ని సార్లు నవ్వొస్తోందో ఆ అంకె ఆ పేజీ కింద రాసుకోవాలి. కొన్ని పేజీల్లో ఎక్కువ సార్లు నవ్వి, కొన్ని పేజీల్లో  అసలే నవ్వురాక పోవచ్చు. ఆ మొత్తమంతా  కూడాలి. ఆ లాఫ్ కౌంట్ 200 వచ్చిందనుకుందాం. దీన్ని స్క్రిప్టులో వున్న పేజీల సంఖ్యతో భాగించాలి. ఈ శేషాన్ని 10 తో గుణించాలి. ఈ ఫలితానికి 5 కలపాలి. మళ్ళీ ఈ ఫలితంలోంచి 30 తీసేయాలి. అప్పుడు మిగిలిందే కామెడీ పవర్. 

        150 పేజీల లాఫ్ కౌంట్ 200 వచ్చిందనుకుందాం, అప్పుడు-
        200
÷ 150 x 10 + 5 - 30 = - 11. 66
        ఈ ఫలితం ఎంత తగ్గితే అంత యౌవనంగా కామెడీ వున్నట్టు.

-సికిందర్