రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, డిసెంబర్ 2016, శనివారం

రివ్యూ!

రచన - దర్శకత్వం : వైశాఖ్
తారాగ‌ణం: మోహ‌న్‌లాల్‌, క‌మ‌లినీ ముఖ‌ర్జీ, జ‌గ‌ప‌తిబాబు, లాల్‌, విను మోహ‌న్ బాల త‌దితరులు
క‌థః ఉద‌య్ కృష్ణ‌, సంగీతం: గోపీసుంద‌ర్‌, ఛాయా గ్రహ‌ణం: షాజీ కుమార్‌
బ్యానర్ :
 శ్రీ స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్
నిర్మాత: సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి
విడుదల : డిసెంబర్ 2, 2016
***


      మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ మధ్య తెలుగు ప్రేక్షకుల  మధ్యకి వరసగా వచ్చేస్తున్నాడు. మనమంతా, జనతా గ్యారేజ్ ల వంటి డైరెక్టు తెలుగు సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో గుర్తిపు సంపాదించుకున్న మోహన్ లాల్, ఇప్పుడు  మూడో ప్రయత్నంగా మలయాళ డబ్బింగ్ ‘మన్యం పులి’ (పులి మురుగన్) తో విచ్చేశాడు. మలయాళం లో ఇది నూట పాతిక కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటున్నారు. భారీ సెట్టింగులు, లొకేషన్లు, కాస్ట్యూమ్స్, తారాగణం, గ్లామర్ మొదలైన రెగ్యులర్ కమర్షియల్ హంగులేవీ లేకుండానే పాతిక కోట్ల బడ్జెట్ తో తీసి, నూట పాతిక కోట్లు సంపాదించుకోవడం రికార్డే. అదీ కేరళ లాంటి చిన్న మార్కెట్ లో. ఏమైనా సినిమా తీయడంలో ఈ కొత్త బేసిక్స్ ని ఆహ్వానించాల్సిందే. అయితే ఇది ప్రేక్షకుల బేసిక్ ఇన్ స్టింక్ట్స్ ని సొమ్ముచేసుకోవడం అవుతుందేమో ఆలోచించాలి...

 కథ       అది పులియూర్ అనే మన్యం ప్రాంతం. అక్కడ  పులులు మనుషుల్ని చంపి తింటూంటాయి. పదేళ్ళ కుమార్ అలియాస్ కుమారస్వామి తండ్రిని కూడా పులి తినేస్తుంది. అంతకి ముందే తల్లి చనిపోతుంది. చిన్నపిల్లాడుగా వున్న  తమ్ముడు మణి తో మిగులుతాడు. తండ్రిని చంపిన పులిని చంపడం కోసం తర్ఫీదు  పొందుతాడు. ఆ పులిని వలపన్ని చంపేస్తాడు. పెద్దయ్యాకా మన్యంలోనే స్థిరపడి లారీ డ్రైవర్ గా బ్రతుకుతూంటాడు. మరోవైపు మనుషులని చంపుతున్న పులుల్ని చంపుతూంటాడు. దీంతో చట్టం దృష్టిలో పడతాడు. ఫారెస్ట్  రేంజర్ (కిషోర్) కుమార్ ని పట్టుకోవాలని ప్రయత్నిస్తూంటాడు. కుమార్ ప్రేమిస్తున్న మన్యం పిల్ల మైనా (కమలినీ ముఖర్జీ) మీద కన్నేస్తాడు. అతన్నుంచి తప్పించుకున్న ఆమెని  కుమార్ పెళ్లి చేసుకుంటాడు. కూతురు పుడుతుంది, అయినా రేం జర్ ఆమెని వదిలిపెట్టడుతాడు. రేంజర్ ని చిత్తుగా తంతాడు కుమార్. రేంజర్  ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళిపోతాడు. కుమార్ తమ్ముడి స్నేహితులు ఆయుర్వేద పరిశోధనలకోసం మన్యం వస్తారు. ఆ గంజాయి మొక్కల్ని లారీ కెక్కించుకుని కుమార్ ని రమ్మంటారు. ఆయుర్వేద కంపెనీలో తమ్ముడికి జాబ్ ఇప్పిస్తామని తీసుకుపోతారు. అక్కడ డాడీ గిరిజ (జగపతి బాబు) అనే కంపెనీ ఓనర్ దగ్గర బస చేస్తారు.  కట్ చేస్తే, ఆ డాడీ కుమార్ ని చంపడం కోసం తిరుగుతూంటాడు. ఎందుకు? కుమార్ వల్ల ఇతడికేం నష్టం జరిగింది? ఏమిటా కథ?...అన్నది తెర మీద చూడాలి.

ఎలావుంది కథ  
       చాలా అతుకుల బొంతలా వుంది. మొదటి అరగంట చూసి నిద్రపోయి, చివరి అరగంట చూస్తే చాలు- ఎందుకంటే ఇవి యాక్షన్ సీన్సు గనుక. యాక్షన్ సీన్స్ తప్ప ఈ సినిమాలో కథని భరించడం కష్టం. మృగం (పులి) మానవ  మృగం (జగపతిబాబు పాత్ర) అనే కాంట్రాస్ట్ పెట్టి వీటితో హీరో తలపడే కథ పూర్తిగా ఉద్దేశం అంతుచిక్కని అతుకులబొంత కథ. పులి- పులి వేట అనగానే ఎవరికైనా జిమ్ కార్బెట్ (1875-1955) గుర్తుకొస్తాడు. ఆనాడు బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ హంటర్ అయిన ఇతను నరమాంస భక్షక పులుల్ని సంహరించేవాడు ప్రభుత్వ  ఆదేశాలతో. మనిషిరక్తం రుచి మరిగిన పులులు  సమీప గ్రామాల్లోకి వచ్చి దాడి చేసేవి. వీటిని పట్టుకుని షూట్ చేసేందుకు జిమ్ కార్బెట్ అడవుల్లో చేసే ప్రాణాంతక సాహసాలు గగుర్పాటు కల్గించే విధంగా వుంటాయి. మన్యంపులి కథలో పులులు గ్రామాల మీద దాడి చేయవు. అడవుల్లో ఉంటున్న వాళ్ళ  మీదే  పడుతూంటాయి. ఒక సీనులో ఒక పాత్ర ఓ పాముని పట్టుకుని సురక్షితంగా వదిలిపెడుతూ- ఇది వున్న చోటుకి మనం రావడం తప్పంటాడు. అందుకని దాన్ని చంపకుండా పక్కకి తీసికెళ్ళి వదిలేస్తాడు. మరి ఇది పులులకీ వర్తించదా? పులులుండే చోట మనుషులు ఎందుకుండాలి? అవి చంపుతున్నాయని వాటినెందుకు చంపడం? రెండోది, బాల్యంలో హీరో తండ్రిని చంపిన పులి అదే అని ఎలా గుర్తు పట్టి చంపాడు? జిమ్ కార్బెట్ గ్రామం మీద దాడి చేసిన పులి అడుగుజాడల్ని పరిశోధించి, వాటి ఆధారంగా అడవుల్లో సదరు పులిని అన్వేషించే వాడు. దానికోసం మంచె కట్టుకుని దాని మీద రేయింబవళ్ళు గడిపేవాడు. జిమ్ కార్బెట్ ఒక లెజెండ్. పులులతో తన అనుభవాల గురించి ఆయన రాసిన పుస్తకం చదివితే పులుల గురుంచి అంతా తెలిసిపోతుంది- వాటి స్వభావం, జీవనం, జిత్తులు సమస్తం. జిమ్ కార్బెట్ పేర ఉత్తరాఖండ్ లో నేషనల్ పార్క్ ఏర్పాటయ్యింది. 

        మన మన్యం హీరో అసలే అంతరించిపోతున్న పులి జాతిని అలా చంపుతూంటే మనకే కోపం వస్తుంది. దాన్ని హీరోయిజంగా తీసుకుని ఎలా ఎంజాయ్ చేయగలం. ఎప్పుడో చిన్నప్పుడు ఒక పులి దాని స్వభావం కొద్దీ తండ్రిని చంపిందని జీవితాంతం పులుల మీద ద్వేషం పెంచుకునే మానసికంగా ఎదగని, ఓ మానసిక పీడితుడి కథని ఓ హీరో మీద చూడ్డం  విజ్ఞులకి కష్టమే. ఈ కథ పర్యావరణానికే గాక, చట్టాలకీ వ్యతిరేకమని భావించాల్సి వుంటుంది. 

ఎవరెలా చేశారు
       
డ్డలుంగీ కట్టుకుని మాస్ పాత్ర నటించిన సూపర్ స్టార్ మోహన్ లాల్ అసలీ పాత్రద్వారా ఏం చెప్పాలనుకున్నాడో అర్ధంగాదు. పులుల్ని చంపే యాక్షన్ సీన్స్ కోసం మాత్రమే తనని చూడాలనుకున్నట్టు తయారయ్యిందే తప్ప మరొకటి కాదు. తన కుటుంబం పట్ల, స్నేహితులపట్లా  కనబర్చే మానవీయ కోణం ఏ దశలోనూ పులుల పట్ల ప్రదర్శించని -క్యారక్టర్ గ్రోత్, క్యారక్టర్ ఆర్క్ లేని, కథలో ఒక గోల్ లేని, దిశాదిక్కూ లేని పాత్రగా మిగిలిపోయాడు. ఒక చోట కమలినీ ముఖర్జీ పాత్రచేత తన్నించుకోవడం, ఇంకోచోట జగపతి బాబు పాత్ర కాళ్ళు పట్టుకోవడం లాంటి భేషజాలు లేని వ్యక్తిత్వాన్ని ఒక స్టార్ గా ప్రదర్శించినా- కాస్త మనసున్న ప్రేక్షకుల కోసం, ఇదే వినయాన్ని  కనీసం చివర్లోనైనా  పులులతో కూడా చాటుకోవాల్సింది. 

        కమలినీ ముఖర్జీది ఉత్తుత్తి రుసరుస లాడే పాత్ర కామెడీ కోసం. జగపతిబాబు పాత్ర ఇచ్చే బిల్డప్పులు ఓపెనింగ్ లో, ఇంటర్వెల్ లో ఎందుకోసమా అని చూస్తే చివర తేలేది సరుకులేని మ్యాటరే. 

        తెలుగులో మంచి సంగీతం ఇస్తున్న గోపీ సుందర్ ‘మన్యం పులి’ లో షాకింగ్ గా తలనొప్పి మ్యూజిక్ ఇచ్చాడు. నేపధ్య సంగీతం కూడా చాలా పూర్ గా వుంది- దీన్ని కవర్ చేయడానికి హోరెత్తించే సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ రుద్దారు. డబ్బింగ్ కూడా నీటుగా లేదు- బి గ్రేడ్ సినిమాల్లో లాగా ప్రతీ డైలాగూ అరిచి (లౌడ్) మాట్లాడ్డమే. షాజీ కుమారన్ కెమెరా వర్క్, పీటర్ హెయిన్స్ యాక్షన్ కోరియోగ్రఫీ, సీజీ వర్క్, ఇవే సినిమాలో కాస్త నయమన్పించే అంశాలు.

        దర్శకుడు వైశాఖ్ దర్శకత్వంలో, రచనలో పూర్తిగా విఫలమయ్యాడు- విఫలమయ్యాడు అనేకంటే చవకబారు పనితం కనబర్చాడనండం న్యాయం. చాలా పాత కాలం ‘బి’ గ్రేడ్ సినిమా చూస్తున్నట్టు వుంటుంది. సీన్లు, కామెడీ, కథ అల్లిక మొదలైనవి చవకబారుగా వున్నాయి. ఎక్కడా కథనంలో టెన్షన్ అనేదే వుండదు. సీన్లు చప్పగా వచ్చిపోతూంటాయి. స్క్రీన్ ప్లే అనే మాటే ఇక్కడ వర్తించదు. కేవలం పేటర్ హెయిన్స్ యాక్షన్ ప్లే గురించే చెప్పుకోవాలి. ఇదంతా మాస్ కి వర్కౌట్ అయిపోతుంది. మలయాళం లో కామెడీ సీన్లు వర్కౌట్ అయ్యాయోమో గానీ, తెలుగులో వీటిని తీసిపడేస్తే చీకాకు తప్పుతుంది.  

చివరికేమిటి
        రోజుల్లో పులుల్ని చంపడం నేరంగా కాదు, హీరోయిజంగా చూపించారు. ఇదే ఈ సినిమా ఇస్తున్న మెసేజ్. ఇందుకే హిట్టయింది. ఇక ఈసారి ఇంకో అడుగు ముందుకేసి వీరప్పన్ ఏనుగుల్ని ఎలా చంపాడో ఆ కథతో కూడా తీస్తే బాగా హిట్టవుతుంది. డిస్కవరీ ఛానెల్లో అమాయక జంతువుల్ని వెంటాడి చంపే పులుల్ని  షూట్ చేసి చంపినట్టు కూడా చూపిస్తే ఛానెల్ టీఆర్పీ బాగా పెరిగిపోతుంది...

-సికిందర్
http://www.cinemabazaar.in