రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, July 22, 2015

స్క్రీన్ సెన్స్


తెలుగు సినిమా స్క్రీన్ ప్లే
స్ట్రక్చర్- 5

          క ఐడియాని వర్కౌట్ చేసి, ఆ ఐడియాని సినాప్సిస్ గా రాసుకుని స్పష్టత తెచ్చుకున్న తర్వాత ప్రారంభించేదే పూర్తి స్థాయి కథనం – లేదా ప్లాటింగ్- లేదా ప్లానింగ్ –లేదా వన్ లైన్ ఆర్డర్. ఇక్కడ్నించే  అసలైన స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. దీని ప్రకారమే ఆ తర్వాత ట్రీట్ మెంట్ లేదా స్క్రీన్ ప్లే తయారు చేయడం వుంటుంది. కనుక వెనుకటి అధ్యాయాల్లో మొదట ఐడియానీ, తర్వాత లాగ్ లైన్ నీ, ఆ తర్వాత సినాప్సిస్ నీ ఎలాగైతే  బిగినింగ్ – మిడిల్ - ఎండ్ అనే స్ట్రక్చర్ లో పెట్టుకుని రూపొందించుకోవాలని చెప్పుకోవడం జరిగిందో, ఆ చట్రంలో కథకి తగ్గ సీనిక్ ఆర్డర్ వేసుకోవడాన్నే వన్ లైన్ ఆర్డర్, లేదా దృశ్యమాలిక  అంటారు.
         
          వెండితెర  మీద సినిమా ప్రారంభమైనప్పుడు సీను తర్వాత సీనుగా ఒక క్రమపద్ధతిలో సీన్లు నడుస్తాయి. అలా  ఓ క్రమపద్దతిలో కూర్చిన ఈ సీన్లన్నీ కలిపి సినిమా నిడివిని బట్టి 60, 70, 80 ఎన్నైనా ఉండొచ్చు. ఇలా కథని సీన్లుగా విభజించి, ఒక్కో సీనుకి ఒకటి రెండు లైన్లలో విషయాన్ని ఒక దాని కింద ఒకటిగా రాసుకుంటూ పోతూ, నంబర్లు వేసుకోవడాన్నే వన్ లైన్ ఆర్డర్ అంటారు.

1. హీరో కారు దిగి ఇంట్లో కొస్తూ గులాబీ పువ్వు తెంపాడు.
2. విలన్ మార్కెట్లో కారాపి ఏరికోరి ఒక గులాబీ కొన్నాడు.
3. బస్సెక్కి పోతున్న హీరోయిన్ జడలో గులాబీ వుంది.
ఇలా...

          సీనుని బట్టి ఒక్కోసారి సబ్ సీన్లు కూడా ఉండొచ్చు. వాటిని ఏ,బి, సి, డి లుగా గుర్తులు ఇచ్చుకోవడం జరుగుతుంది.

1.  హీరో కారు దిగి ఇంట్లో కొస్తూ గులాబీ పువ్వు తెంపాడు.
1/ a.  ఇంట్లో వున్న హీరో తల్లి జడలో వున్న వాడిన గులాబీని తీసి చెత్త బుట్టలో వేసింది.


          సబ్ సీన్లు ఒకే లొకేషన్లో  అవుట్ డోర్ లో, ఇండోర్ లో నడుస్తున్నప్పుడు వస్తాయి. పై సీనులో హీరో కారు దిగడం అవుట్ డోర్ లొకేషన్, అలాగే హీరో తల్లి ఇంట్లో వుండడం ఇండోర్ లొకేషన్. అప్పుడు పై సీను వివరం ఇలా వుంటుంది..

1 / ఎక్స్.   హీరో కారు దిగి ఇంట్లో కొస్తూ గులాబీ పువ్వు తెంపాడు.
1/ a / ఇం.   ఇంట్లో వున్న హీరో తల్లి జడలో వున్న వాడిన గులాబీని తీసి చెత్త బుట్టలో వేసింది.

          ఇక్కడ ఎక్స్. అంటే ఎక్స్ టీరియర్, అంటే అవుట్ డోర్ అనీ;  ఇం. అంటే ఇంటీరియర్ అంటే ఇండోర్ అనీ అర్ధం.
          ఇక సీన్లు పగలు (డే), రాత్రి (నైట్),  సాయంకాల (ఈవ్) వేళల్లో ఎప్పుడైనా జరుగవచ్చు. అప్పుడు వన్ లైన్ ఆర్డర్ సమగ్ర రూపం కథనాన్ని బట్టి ఇలా వుండొచ్చు...

1 / ఎక్స్/ డే -   హీరో కారు దిగి ఇంట్లో కొస్తూ గులాబీ పువ్వు తెంపాడు.
1/ a / ఇం/ డే -   ఇంట్లో వున్న హీరో తల్లి జడలో వున్న వాడిన గులాబీని తీసి చెత్త బుట్టలో వేసింది.
2 / ఎక్స్ / డే -  విలన్ మార్కెట్లో కారాపి ఏరికోరి ఒక గులాబీ కొన్నాడు.
3 / ఎక్స్ / ఈవ్ -  బస్సెక్కి పోతున్న హీరోయిన్ జడలో గులాబీ వుంది.

          వచ్చిన చిక్కల్లా ఈ వన్ లై ఆర్డర్ ని ఎలా వేయాలనడం దగ్గరే. ఎలా ప్రారంభించాలి, ఎక్కడెక్కడ ఏ ఏ సీన్లు వేయాలి, వేసేటప్పుడు ఏ ఏ స్క్రిప్టింగ్ అంశాల్ని దృష్టిలో పెట్టుకోవాలి అన్న స్పృహ లేకుండా గుడ్డిగా తోచినట్టూ వేసుకుంటూ పోతే, అనుకున్న కథ రాక పోగా చాలా  గందరగోళం ఏర్పడుతుంది. అది కొట్టేసి మళ్ళీ ఇంకో ఆర్డర్, అది కూడా కొట్టేసి ఇంకో ఆర్డర్..ఇలా కాలం గడిచిపోతున్నా అంతులేని ప్రహసనంగా సాగుతూంటుందే తప్ప కొలిక్కి రాదు. ఆర్డర్ లో ఏ సీను ఎప్పుడేయాలనే దానికి ప్రాతిపదిక ఉండదు. ఒకరు కథ ప్రకారం ఎప్పుడో క్లయిమాక్స్ లో రావాల్సిన హీరో హీరోయిన్ల తల్లిదండ్రుల ప్రేమకథతో కూడిన ఫ్లాష్ బ్యాక్ ని తెచ్చి ఫస్టాఫ్ లోనే పదో సీనుగా వేశారు. దీనికి ప్రాతిపదిక ఏమిటి? ఏమీ లేదు. పైగా ఇదెంత నష్ట దాయకమంటే, శుభమా అంటూ సినిమా ప్రారంభిస్తూ అప్పుడే ముసలివాళ్ళ ఫ్లాష్ బ్యాక్ తో యూత్ అప్పీల్ ని దెబ్బ తీయడమే!
         
          ఒక ఎంతో కొంత అనుభవమున్న దర్శకుడు, కథకి ఎలా ఆర్డర్ వేయాలో అంతుపట్టక, చివరికి ఫలానా సినిమా చూసి ఆర్డర్ వేసుకు రమ్మని రచయితని పురమాయించారు. దాన్ని ముందు పెట్టుకుని లవ్ ఎప్పుడు మొదలెట్టారు, ఆ సీన్లు ఎలా వచ్చాయి, సెంటి మెంట్లు ఎలా పండాయి, కామెడీ ఎప్పుడెప్పు డేశారు, పాటలు ఎక్కడెక్కడ పెట్టుకున్నారు...ఇలా చూసుకుంటూ తాము కూడా ఆర్డర్ వేసుకుంటారన్న మాట! ఎందుకీ పాట్లు?
         
          చాలా చోట్ల ఇదే తంతు సాగుతూంటుంది. దర్శకులవుదాముకునే కో-డైరెక్టర్లు తక్కువ, అసోషియేట్ లే ఎక్కువ. అయితే ఈ అసోషియేట్ దర్శకుల్లో నూటికి తొంభై శాతం మందికి ఆర్డర్ వేయడం తెలీదంటే అతిశయోక్తి కాదు. పైగా ఆర్డర్ వేయబోయిన అనుభవమున్న రచయితలతో ఎందుకో తీవ్రంగా విభేదిస్తారు, తమ కథని పాడు చేస్తున్నారని ఎందుకో విపరీతమైన ఆందోళనకి గురవుతారు. ఎందుకీ పాట్లన్నీ?
         
          ఇవ్వాళ్ళ రకరకాల పత్రికల్లో, వెబ్ సైట్లలో ఎందరెందరో సినిమా రివ్యూలు రాస్తున్నారు. పదేళ్ళ క్రితం ఒకసారి దర్శకుడు దశరథ్ వీళ్ళు ఏ పర్ సెప్షన్ తో రివ్యూలు రాస్తున్నారని ఈ వ్యాసకర్తని ప్రశ్నించారు. ఇందులో చాలా వరకూ నిజమున్నా, ఇంకో రకం సినిమా వాళ్ళున్నారు : వీళ్ళు సినిమా బాగాలేదంటూ రివ్యూలు రాయడం కాదు, దమ్ముంటే కథ రాసి చూపెట్టాలి, సినిమా తీసి ప్రూవ్ చేసుకోవాలి- అంటూ రివ్యూ రైటర్లకి సవాళ్లు విసరడం ఇప్పటికీ మానుకోవడం లేదు. లోగుట్టు ఏంటంటే ఇలా సవాళ్ళు విసిరే తమలో చాలా మందికి  వన్ లైన్ ఆర్డర్ వేయడమే  రాదు! ఇక సినిమాలెలా తీస్తారో పెరుమాళ్ళు కెరుక! ఖచ్చితంగా ప్రతీ యేటా తొంభై  శాతం ఫ్లాపులే తీస్తారు.
         
          ఏ సినిమా కథకైనా సిడ్ ఫీల్డ్ రెండురోజుల్లో ఆర్డర్ వేస్తారు. అదెలా? పద్దతీ శాస్త్రం తెలుసు కాబట్టి.  ఇతరులు చెప్పే కఠినమైన శాస్త్రాల్ని సులభతరం చేసి సామాన్యులకి అర్ధమయ్యేట్టూ పాపులర్ చేసింది తనే కాబట్టి. దీన్ని మనం పాటిస్తే తప్పేమిటన్న ప్రశ్నకి ఇప్పటికీ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు టాలీవుడ్ లో తక్కువే. అదేదో విదేశీ సంస్కృతి అనుకుంటారు. సినిమా అనే కళే హాలీవుడ్ నుంచి  దిగుమతి అయినప్పుడు, ఎన్నో హాలీవుడ్ సినిమాలు స్ఫూర్తికీ, చక్కగా కాపీ చేసుకోవడానికీ అలవాలమై న్నప్పుడు- అవలా తయారవడానికి మూలమైన స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని పరాయిది అనుకోవడమేమిటి?
         
          ఓ ఐదారు ఫ్లాపులు తీసిన ఒక సీనియర్ దర్శకుడు ఎట్టకేలకు శాస్త్రం విలువని గుర్తించి,  “డిస్కషన్స్ లో మీరు  స్ట్రక్చర్ కీ, క్యారక్టర్ కీ (ఇది పాసివ్ పాత్ర గా మారిపోకుండా ) కాపలా వుండండి” అని అన్నారంటే ఎందుకు?
         
          కాబట్టి అన్ని పాట్లూ పొరబాట్లూ ఫ్లాపులూ స్ట్రక్చర్  స్పృహతో వన్ లైన్ ఆర్డర్ వేసుకోక పోవడం వల్లే!
           
          మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం : స్ట్రక్చర్ వేరు, క్రియేటివిటీ వేరు. స్ట్రక్చర్ ని క్రియేటివిటీ తో కన్ఫ్యూజ్ చేయకూడదు. కథకి స్ట్రక్చర్ సార్వజనీనమైనది, ప్రపంచంలో ఎక్కడైనా ఒకలాగే  వుంటుంది. క్రియేటివిటీ స్థానిక మైనది, వ్యక్తిగత మైనది. స్ట్రక్చర్ శిలాశాసనం, ఈ భూగోళం ఉన్నంత వరకూ అది మారనే మారదు.  క్రియేటివిటీ కాలాల్ని బట్టి ఎప్పటికప్పుడు మారుపోతూంటుంది. స్ట్రక్చర్ లేకుండా కథని తయారు చేయలేరు, అది పునాదుల్లేకుండా ఇల్లు కట్టుకోవడం లాంటిది.  క్రియేటివిటీ ఆ పునాదులమీద కావాల్సిన డిజైన్లో ఇంటికి అందం చేకూర్చేది. బిగినింగ్- మిడిల్- ఎండ్  అనే మూడు విభాగాల  స్ట్రక్చర్ మారదుగాక మారదు. ఆ విభాగాల్లో వేటికవిగా బిజినెస్  స్వరూపాలు కూడా మారవు.

          బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయం, కథానేపధ్యం ఏర్పాటు, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, చివర్లో సమస్య ఏర్పాటూ మాత్రమే  వుండాలి, మరొకటి ఉండరాదు.
         
          మిడిల్ లో ఆ సమస్యతో యాక్షన్ – రియాక్షన్ ల  పోరాటం,  ఆ సమస్యకి పరిష్కార మార్గం కనుగొనడం మాత్రమే వుండాలి, ఇక్కడ కూడా మరొకటి చొరబడ కూడదు.
         
          ఎండ్ విభాగం లో ఆ పరిష్కార మార్గంతో  ప్రత్యర్థిని శాశ్వతంగా ఓడించి విజయబాట పట్టడం ఉండాల్సిందే! అంటే, ఈ మొత్తం స్ట్రక్చర్ లో ఇక్కడ స్వేచ్చ లేదు, సొంత కవిత్వానికి ఆస్కారం లేదు. .
         
          ఈ విభాగాల లోపల వేసుకునే సీన్లతో స్వేచ్చ వుంది, సొంత కవిత్వం కూడా వుంటుంది. స్ట్రక్చర్ ప్రకారం, ఆ స్ట్రక్చర్ లో విభాగాల బిజినెస్సుల ప్రకారం వేసుకునే సీన్లని ఎలా ఎంత కళాత్మకం గా తీర్చిదిద్దుకోవచ్చో ఆ క్రియేటివ్ ప్రదర్శనంతా చేసుకోవచ్చు.  క్రియేటివిటీకి కొలమానాల్లేవు. ఒక సీనుని ఒక దర్శకుడు ఒకలా తీస్తే, ఇంకో దర్శకుడు ఇంకోలా తీస్తాడు.  క్రియేటివిటీ వ్యక్తిగతమనదే గాక, స్థాని కమైనది కూడా. స్థానికమైనది ఎలాగంటే- టాలీవుడ్ లో ఇక్కడి సీను ఇక్కడి నేటివిటీతో తీస్తే, అదే సీన్ని బాలీవుడ్ లో అక్కడి నేటివిటీలో వేరేగా తీస్తారు. కాబట్టి మారేది స్ట్రక్చర్ లోపల  సీన్ల రూపకల్పనే తప్ప, ఆ మొత్తం స్ట్రక్చర్ కాదు. స్ట్రక్చర్ వేరు, క్రియేటివిటీ వేరు. స్ట్రక్చర్ ని క్రియేటివిటీ తో కన్ఫ్యూజ్ చేయకూడదు.
         
          అలాగే స్క్రీన్ ప్లే వేరు, దర్శకత్వం వేరు. దర్శకుడు తన క్రియేటివ్ పవర్స్ తో షాట్లు తీసే విధానంగానీ, టేకింగ్ గానీ స్క్రీన్ ప్లే అన్పించుకోవు. అది దర్శకత్వం అన్పించుకుంటుంది. స్క్రీన్ ప్లే అంటే కథకి స్ట్రక్చర్, వన్ లైన్ ఆర్డర్, పాత్ర చిత్రణలు, టెంపో, సస్పెన్స్, థ్రిల్స్ వగైరా స్టోరీ టెల్లింగ్ టూల్స్ మొదలైన వాటన్నిటినీ సమకూర్చి పెట్టే   స్క్రిప్టు పరమైన కసరత్తే.  ఇవన్నీ సీన్ల క్రమంగా తెరమీద కన్పిస్తాయి- ఆ సీన్లని చిత్రీకరించిన విధానం స్క్రీన్ ప్లే అనుకోరాదు.
         
          ఈ స్పష్టత వున్నప్పుడు పనులు సులభంగా, వేగంగా జరుగుతాయి. ఎలాగంటే, వన్ లైన్ ఆర్డర్ వేస్తున్నప్పుడు అది దర్శకత్వంలో భాగం  కాదు, స్క్రీన్ ప్లే రచనలో ఒక వంతు కసరత్తు మాత్రమే . కాబట్టి ఆ వన్ లై ఆర్డర్ లో ఒక్కో సీను అనుకుంటున్నప్పుడు అప్పుడే విజువలైజ్ చేసుకోనవసరం లేదు. ఆర్డర్ ప్రకారం లో ఒక సీను అనుకుంటున్నప్పుడు, అది విజువల్ గా బావుంటుందా లేదా ఆలోచిస్తూ కూర్చుంటే ఎటూ తెమలదు. ఈ విజువలైజేషన్ సంగతి  లైన్ ఆర్డర్ వేసుకున్నతర్వాత చేపట్టే ట్రీట్ మెంట్ అప్పుడూ, ఫైనల్ గా డైలాగ్ వెర్షన్ అప్పుడూ చూసుకోవాల్సిన పని.
           
          లైనార్డర్ కేవలం మౌలికంగా కథని మాత్రమే  ఏర్పాటు చేస్తుంది. సీన్ల మధ్య సంబంధాన్ని కలుపుతుంది. సీన్ల మధ్య సంబంధమంటే- ఆ సీన్లలో వుండే పాత్రలు, పాత్రచిత్రణ, వాటి చర్యలు, భావోద్వేగాలు, సస్పెన్స్, థ్రిల్, టెంపో మొదలైన వాటి కంటిన్యూటీ-  వీటన్నిటినీ కలుపుకుని వుండే  సంబంధం. కాబట్టి ముందు వన్ లైన్ ఆర్డర్ గా కథ ఎలా వస్తోందో మాత్రమే చూసుకుంటూ పోవాలే తప్ప, అప్పుడే తెరమీద ఎలా కన్పిస్తుందబ్బా అని పోస్ట్ మార్టం చేపట్టకూడదు. ముందు అర్ధవంతమైన కథా నిర్మాణం మీదే దృష్టి పెట్టాలి. దీని వల్ల వన్ లైనార్డర్ అనే పని చాలా సులభమవడమే గాక, వేగవంతంగా పూర్తవుతుంది.
         
          సిడ్ ఫీల్డ్ రెండ్రోజుల్లో ఆర్డర్ వేసేయగలరంటే, విజువలైజ్ చేసుకుంటూ కూర్చుంటూ కాదు. ఇంకా కథే పూర్తి కాలేదు అప్పుడే విజువలైజేషన్ ఏమిటి? ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి. టిఫిన్ చేస్తూ కాఫీ కూడా తాగేస్తారా? కనుక ముందు సినాప్సిస్ లో క్లుప్తంగా వున్న కథని పెద్ద కథగా విస్తరించాలన్న ఏకైక దృక్పథంతో మాత్రమే సిడ్ ఫీల్డ్  కా స్పీడు వచ్చేస్తుందన్న మాట!!
         
          కాబట్టి వన్ లైన్ ఆర్డర్ వేయడానికి మొట్ట మొదటి ప్రాతిపదిక క్లుప్తం అనుకున్న కథ, లేదా రాసుకున్న సినాప్సిస్.  మరి లైనార్డర్ వేసేటప్పుడు ఆ సినాప్సిస్ ని ఎలా ఫాలో అవ్వాలి? సినాప్సిస్ లో 12 అంశాలు ప్రతిబింబించాలని గత అధ్యాయంలో చెప్పుకున్నాం. 1.ప్రధాన పాత్ర పరిచయంతో బాటు దాని రోజువారీ జీవితం, 2. ప్రధాన పాత్ర ఎదుర్కొనే సమస్య, [ బిగినింగ్ సమాప్తం, మిడిల్ ప్రారంభం] 3. సమస్యతో సంఘర్షణ, 4. ఒక పరిష్కారం కోసం వెతుకులాట, 5. మినీ పరిష్కర మార్గం తో కొత్త ప్రయత్నం 6. ఓటమి, 7. ఆ ఓటమిలోంచి కొత్త మార్గం, 8. ఇక వెనక్కి రాలేని సంక్లిష్ట పరిస్థితి, 9. నిరాశా నిస్పృహలు, 10. మళ్ళీ కొత్త పరిష్కార మార్గం, [ మిడిల్ సమాప్తం, ఎండ్ ప్రారంభం] 11. దాంతో ముగింపు దిశగా అంతిమ పోరాటం, 12.ముగింపూ అన్నవి. సమస్య [బిగినింగ్]- సంఘర్షణ [మిడిల్] పరిష్కారం [ఎండ్] .. ఇదీ సినాప్సిస్ స్ట్రక్చర్!

          వీటితోబాటు కొన్ని ఎలిమెంట్స్ తెలుసుకోవాలి : ఓపెనింగ్ సీన్, హీరో ఎంట్రీ, హీరోయిన్ ఎంట్రీ, విలన్ ఎంట్రీ, సహాయ పాత్రల ప్రపంచం, అందరి సుఖమయ లోకం, ఈ లోకాన్ని అప్సెట్ చేసి ఆందోళన సృష్టించే సంఘటన, తిరిగి ఆ లోకం లో శాంతిని స్థాపించే లక్ష్యంతో హీరో ప్రయాణం, ఈ ప్రయాణం లో విలన్ తో యాక్షన్ రియాక్షన్ ల ప్లే, హీరోకి ఎదురయ్యే విషమ పరీక్షలు, మరో వైపు హీరో లవ్ ఇంటరెస్ట్ సంగతి, పాటల  ప్లేస్ మెంట్, అవసరమైన యాక్షన్ దృశ్యాల కల్పన, అవసరమైన  కామెడీ దృశ్యాల సృష్టి, ఇంటర్వెల్ బ్యాంగ్ ( దాదాపు దశాబ్దంన్నర కాలంగా అమల్లో ఉంటున్న అవే ఓపెనింగ్ బ్యాంగ్ లు, ఇంటర్వెల్ బ్యాంగులు ఇప్పుడు ప్రేక్షకులని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోతున్నాయి. వీటిని వీలయినంత త్వరగా మార్చాల్సిన అవసరముంది :  క్రియేటివిటీ అంటే ఇంతే..ఒక ధోరణికి కాలం చెల్లిపోయిందని సకాలంలో గుర్తించి వెంటనే మరో ధోరణిని ప్రవేశపెట్టడమే చలనశీలమైన క్రియేటివిటీ లక్షణం)  క్లయిమాక్స్, ముగింపూ మొదలైన ఓవరాల్  ఎలిమెంట్స్ తెలుకుని వుండాలి.
          
          ఇక సినాప్సిస్ లోని విషయం మొత్తాన్నీ ఒకేసారి ఎత్తుకుని ప్రారంభించాలా? అవసరంలేదు. సినిమా మొత్తాన్నీ ఒకసారి ప్రేక్షకులకి చూపెట్టడం లేదు. మధ్యలో విరామం ఇచ్చి చూపిస్తారు. చూసే వాళ్ళకే భారమన్పించకుండా ఒక విరామం ఇస్తున్నప్పుడు, రాసే వాళ్లకి రెండు అవసరం. అవి బిగినింగ్ ముగిశాక ఒకటి, మిడిల్ ముగిశాక మరొకటి. అంటే సినాప్సిస్ లో ఒక విభాగం ఆర్డర్ పూర్తయ్యాక తర్వాతి విభాగాని కెళ్ళడం ఉత్తమమ మన్నమాట.
          
          ఒక విభాగం తర్వాత మరొక విభాగం వారీగా పని చేసుకుంటూ పోవడం విజ్ఞత అన్పించుకుంటుంది. అప్పుడు స్క్రీన్ ప్లే మీద ఎక్కువ పట్టు లభిస్తుంది. మొదట కథని ఎన్ని సీన్లలో చెప్పాలుకుంటున్నామో  నిర్ణయించుకోవాలి. 80సీన్లలో అనుకుంటే ఆ సీన్లని విభాగాల వారిగా వాటి నిష్పత్తి ప్రకారం ఇలా విభజించుకోవాలి:  బిగినింగ్ 20 సీన్లు,  మిడిల్ 40 సీన్లు, ఎండ్ 20 సీన్లు..


          ఇప్పుడు బిగినింగ్  విభాగాన్ని తీసుకుని ఆ 20 సీన్ల కథనే  వర్కౌట్ చేయడం మొదలెట్టాలి. అంతకి మించి దృష్టి సారించకూడదు. ఈ విభాగం ఆర్డర్ వేయడం  పూర్తయ్యాకే, మిడిల్ విభాగం ఆర్డర్ 40 సీన్ల కెళ్ళాలి.  మిడిల్ విభాగం  ఆర్డర్ పూర్తయ్యాకే, ఎండ్ విభాగం 20 సీన్ల సంగతి చూడాలి.  ఇలా కంపార్ట మెంట లైజ్ చేసుకుని  ఆర్డర్ వేసుకోవడం వల్ల  కన్ఫ్యూజన్ వుండదు. దృష్టంతా ఆ విభాగం కథ మీదే, బిజినెస్ మీదే వుంటుంది.
          
           ఇప్పుడు గత చాప్టర్ లో ప్రస్తావించుకున్న ‘శివ’ సినిమా సినాప్సిస్ లోని బిగినింగ్ విభాగాన్నే ముందుగా తీసుకుందాం : 
         
కాలేజీ ఎదుట అనుచరులతో ఎదురుచూస్తున్న గణేష్, జేడీ  సైగతో విద్యార్థిని హత మారుస్తాడు.
          
         జేడీ ఒక విద్యార్థి నాయకుడు. కాలేజీ లో ఎదురు లేని వాడు. ఆ కాలేజీ స్టూడెంట్ యూనియన్ కి ఏకపక్ష ప్రెసిడెంట్. గణేష్ ద్వారా జేడీ కి ఆ ప్రాంతం మీద గుత్తాధిపత్యం చెలాయిస్తున్న భవానీ అనే పెద్ద గూండాతో పరిచయం ఉంటుంది. ఇలా విద్యార్థులతో ఏర్పడిన  ఈ సంబంధంతోనే, మాచిరాజు అనే రాజకీయనాయకుడి నేర కార్యకలాపాలకి విద్యార్థులని ఉపయోగించుకుంటూ, మాచిరాజుకి వెన్నుదన్నుగా ఉంటాడు భవానీ.
          
           ఈ కాలేజీలోనే స్టూడెంట్ గా చేరతాడు శివ. అక్కడ మల్లి అనే విద్యార్ధి తో, ఆశా అనే ఇంకో విద్యార్థినితో స్నేహం పెంచుకుంటాడు.  అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం, లెక్చరర్లని అవమానపరచడం వంటి పన్లతో అల్లరి చేస్తున్న జేడీకి శివ తారసపడతాడు. మొదటిసారి స్నేహితులు చెప్పారని జేడీ ని క్షమించినా, మళ్ళీ ఈసారి ఆశా తో మిస్ బిహేవ్ చేయడంతో, రెచ్చిపోయిన శివ సైకిలు చైను లాగి, జేడీ నీ అతడి గ్యాంగునీ చితగ్గొట్టేస్తాడు. అన్నాళ్ళూ ఎవరూ తనని ఎదిరించలేరన్న ధీమాతో ఉన్న జేడీ, ఈ శివ తెగింపు చూసి నిశ్చేష్టుడౌతాడు.
          
          ఈ బిగినింగ్ ని పరీశిలిస్తే, ఇందులో బిగినింగ్ తాలూకు బిజినెస్ అంతా వుంది : 1. ప్రథాన పాత్రని, ఇతర ముఖ్య పాత్రల్ని పరిచయం చేసి, కథా నేపధ్యాన్ని సృష్టించడం 2. ప్రధాన పాత్రకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే  శక్తుల్ని చూపడం, 3. సమస్య తలెత్తే దిశగా పరిస్థితుల కల్పన 4. సమస్య ఏర్పాటు.
          
          ఈ బిజినెస్ ని ఎలా విస్తరించారో చూద్దాం :

          1. ప్రధాన పాత్ర శివతో పాటు, హీరోయిన్ ఆశానీ, ఇతర ఫ్రెండ్స్ పాత్రల్ని పరిచయం చేయడం; విలన్ భవానీ తో పాటు అతడి తాలూకు జేడీ,గణేష్, మాచిరాజు పాత్రల్ని పరిచయం చేయడం; విలన్ భవానీ పడగ నీడలో కాలేజీ వాతావరణం వున్నట్టు కథా నేపధ్యాన్ని సృష్టించడం...
 
          2. ప్రధాన పాత్ర శివకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే శక్తులుగా  జేడీ, గణేష్ లని చూపడం

         3.  జేడీ చేష్టలతో శివకి సమస్య తలెత్తే దిశగా పరిస్థితుల కల్పన

         4.  సైకిల్ చైన్ లాగి జేడీ మీద తిరగబడ్డంతో శివకి భవానీతో సమస్య ఏర్పాటు అవడం.
          
          ఇప్పుడు సీన్ల వారీగా ఎలా ఆర్డర్ వేశారో చూద్దాం...



(ఇంకా వుంది) 


సికిందర్