రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, May 11, 2020

942 : స్క్రీన్ ప్లే సంగతులు

ఎండ్ విభాగం
        విషయం 8.
గెస్ట్ హౌస్ దగ్గర శవం దొరికిందనగానే అల్లకల్లోలమవుతాడు విక్రం. నేహా గుర్తు కొస్తుంది. చెల్లెలు గుర్తుకొస్తుంది. ఆ చెల్లెల్ని దుండగులు అపహరించి సజీవ దహనం చేసిన దృశ్యం డిస్టర్బ్ చేస్తుంది. గెస్ట్ హౌస్ దగ్గర గుర్తు తెలియని శవాన్ని చూసి వాంతి చేసుకుంటాడు. ఆ శవం ప్రీతిదని తెలుస్తుంది. షీలా రెండో కారు మీద మట్టి గెస్ట్ హౌస్ మట్టితో కలుస్తోందని తెలుస్తుంది. షీలాని టార్చర్ చేస్తూంటే  ఫోరెన్సిక్స్  షిండే కాల్ చేసి, ప్రీతి చేతి గోళ్ళలో అజయ్ డీఎన్ఏ దొరికిందని అంటాడు. అజయ్ ని పట్టుకుంటే తన కేమీ తెలీదని అంటాడు. షిండే మళ్ళీ కాల్ చేసి ప్రీతి పళ్ళ మీద ఆమె తండ్రి డీఎన్ఏ, తొడమీద సరస్వతి వెంట్రుకా దొరికాయని అంటాడు. వాళ్ళని ప్రశ్నిస్తే తాము చంపలేదని అంటారు. లతా అనే అమ్మాయి కాల్ చెసి, వైట్ అంబాసిడర్ లో వచ్చిన ఒకడు తనని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని అంటుంది. వాడి పోలికలు ఆమె చేత చెప్పించి స్కెచ్ ఆర్టిస్టు చేత బొమ్మ వేయిస్తే, పోలికలు కలవడం లేదని అంటుంది. టోల్ బూత్ ఫుటేజీ చూస్తే ఆ సమయంలో ఒక కార్గో ట్రక్ కన్పిస్తుంది. ప్రీతి మాయమైన రోజున ఫుటేజీలో కూడా ఇంకో కార్గో ట్రక్ కన్పిస్తుంది. ఈ ట్రక్కులు వేర్వేరు అయినా డ్రైవర్ ఒక్కడే. వాణ్ణి మెకానిక్ ఫాహద్ గా గుర్తించి పట్టుకుంటే, వాడు చెప్పేస్తాడు. వాడు చెప్పిన ప్రకారం రోహిత్ ని ప్రశ్నించడానికి వెళ్తే కాల్పులు జరుపుతాడు రోహిత్. విక్రం జరిపే ఎదురు కాల్పులో చనిపోతాడు. అతడి భార్య స్వప్న ఏడుస్తుంది. అదే ఇంట్లో నేహా బంధించి వుంటుంది. స్వప్న తనెందుకిలా చేసిందో చెప్పేస్తుంది...


        చిన్నప్పుడు ప్రీతి అనాధాశ్రయంలో వున్నప్పుడు, ఆమెతో బాటు స్వప్న, స్వప్న చెల్లెలు అలేఖ్యా వుండే వాళ్ళు. అలేఖ్యకి గుండె జబ్బుంది. మోహన్ తమ్ముడు శివ, మరదలు ప్రియ ఒకర్ని దత్తత తీసుకోవడానికి వచ్చినప్పుడు, అలేఖ్యకి దత్తత వెళ్ళే  అవకాశమిస్తే వాళ్ళు గుండె జబ్బు నయం చేస్తారని ప్రీతికి నచ్చజెప్పింది స్వప్న. ప్రీతి కాదని తను దత్తత వెళ్లిపోవడంతో, ఫలితంగా స్వప్న చెల్లెలు చనిపోవడంతో, ప్రీతి మీద పగబట్టి చంపేసింది స్వప్న. ఒక సాక్ష్యాధారం సూది నేహా దగ్గరికి రావడంతో, వాటినామె వెల్లడించకుండా ఆమెని కూడా కిడ్నాప్ చేయించి బంధించింది.

        వివరణ: అదే గెస్ట్ హౌస్ దగ్గర శవం దొరకడం సంభవమా? ఆ గెస్ట్ హౌస్ దగ్గరే శవం కోసం ఇంతకి ముందు పోలీసులు అంత హంగామా చేశారు. గెస్ట్ హౌస్ నిర్వాహకులు ఇక అప్రమత్తమై సెక్యూరిటీ పెంచుకోకుండా వుండరు. అలాంటప్పుడు స్వప్న ప్రీతిని చంపిన తర్వాత, రోహిత్ ఒక చోట పాతిపెట్టిన శవాన్ని తీసి ఇప్పుడు గెస్ట్ హౌస్ దగ్గర పడేసే అవకాశమే వుండదు. గెస్ట్ హౌస్ దగ్గర సెక్యూరిటీ లేకుండా చేసి కథకుడు తోడ్పడడం వల్ల పడేశాడేమో. ఒక చోట పాతిపెట్టిన శవాన్ని ఎందుకు తీశాడు రోహిత్? దాని పళ్ళకి ఆమె తండ్రి డీఎన్ఏ, గోళ్ళకి అజయ్ డీఎన్ఏ, తొడకి సరస్వతి వెంట్రుక తెచ్చి మేకప్ మాన్ లా అతికించి వాళ్ళని ఇరికించాలి కాబట్టి. ఈ చేష్ట వూహించడానికే బ్యాడ్ గా వుంది. ఇష్టారాజ్యంగా కథ చేసేయడం. కథకుడు అన్ని చిక్కుముళ్ళు వేసుకున్నాడు. విడదీయలేక అసంబద్ధ కథనం చేస్తున్నాడు.

        టోల్ బూత్ రెండు ఫుటేజీల ప్రకారం, ప్రీతి మాయమైన రోజున కన్పించే కార్గో ట్రక్ మొదటి ఫుటేజీ సెప్టెంబర్ నెలని సూచిస్తోంది. ఇప్పుడు తాజా ఫుటేజీలో డిసెంబర్ నెల. అంటే ప్రీతి మరణించి మూడు నెలలైందన్న మాట. అంటే ఈ మూడు నెలల తర్వాత కుళ్ళిపోయిన శవం కాదు, ఎండిపోయిన ఆస్థిపంజరం మాత్రమే దొరకాలన్న మాట. కానీ ఈ కథలో కుళ్ళిన శవం దొరికింది. ఇదెలా సాధ్యం? ఆస్థి పంజరమైతే రోహిత్ ఫేక్ ఎవిడెన్సుని దానికి అతికించలేడని, కుళ్ళిన శవాన్ని పెట్టేశారా? 

        రోహిత్ ఇంకో పని కూడా చేశాడు. షీలాని కూడా ఇరికించేందుకు ఆమె రెండో కారుకి గెస్ట్ హౌస్ దగ్గర మట్టిని అంటించి అది ఎవిడెన్స్ గా చూపించాడు. షీలా విక్రం కస్టడీలోనే వుంది. ఇప్పుడిప్పుడే  దొరికిన శవాన్ని ఆమె కారులో ఎప్పుడు తెచ్చి గెస్ట్ హౌస్ దగ్గర పడేసి పోయింది? ఈ అనుమానం విక్రం కి రావద్దా? పైగా పని ముట్లతో ఆమెని థర్డ్ డిగ్రీ టార్చర్ కి గురి చేయడం. పాలీగ్రాఫ్, నార్కో రెండు టెస్టులు  సరీగ్గా చేయించడం చేతగాక థర్డ్ డిగ్రీకి పాల్పడుతున్నాడు!

        విక్రంని ఎంత అమాయకుణ్ణి చేసి, పాసివ్ క్యారక్టర్ గా చేసి ఆడుకుంటున్నారంటే, ఒక ఆట ఇంటర్వెల్ కాడ్నించీ షీలా ఆడుకుంది, ఇప్పుడు ఇంకో ఆట రోహిత్ ఆడుకుంటున్నాడు. ఒకరు ఫేక్ లెటర్ తో, మరొకరు ఫేక్ ఎవిడెన్సుతో. ఈ ట్రాప్ లో పడి  ప్రీతి పేరెంట్స్, షీలా, సరస్వతి, అజయ్ మొత్తం సిండికేట్ అయి ప్రీతిని చంపేశారని చెప్పుకుని డిస్టర్బ్ అయిపోతూ, ఫేక్ సస్పెన్స్ ని సృష్టిస్తున్నాడు విక్రం. చాలా బ్యాడ్ క్యారక్టరైజేషన్. చెల్లెలి ఫైనల్ ఫ్లాష్ బ్యాక్ వేసుకున్నప్పుడు, అందులో ఇద్దరు దుండగులు ఆమెని ఇంట్లోంచి అపహరించుకు పోతూంటారు. దీని ముందు ఫ్లాష్ బ్యాక్ లో మనకి చూపించిన ప్రకారం, ఆ చెల్లెలు కిటికీ లోంచి ఇద్దరు తొంగి చూశారని అంటే, పని వాళ్ళని అడిగి వూరుకుంటాడు విక్రం. ఇలా చెల్లెలి చావుకి కూడా తనే బాధ్యుడయ్యాడు సరైన చర్య తీసుకోకుండా పాసివ్ క్యారక్టర్ విక్రం. ఇంతకీ ఈ ఫ్లాష్ బ్యాక్ అసలు కథ ‘హిట్’  సీక్వెల్ లో తెలియవచ్చేమో.

        వెంటవెంటనే ఫోరెన్సిక్స్ షిండే రెండు సీన్లలోనే బోలెడు సమాచారమందించేస్తూ కథ ముగించేయాలని తొందరపడుతున్నాడు... ప్రీతి శవం దొరికిందని, షీలా రెండో కారు మీద మట్టి గెస్ట్ హౌస్ మట్టితో కలుస్తోందని, ప్రీతి చేతి గోళ్ళలో అజయ్ డీఎన్ఏ దొరికిందని, ప్రీతి పళ్ళ మీద ఆమె తండ్రి డీఎన్ఏ, తొడమీద సరస్వతి వెంట్రుకా దొరికాయని... ఇలా తడవతడవకీ ఫోన్లు చేస్తూ కథ ముగించెయ్యాలని సమాచార వెల్లువకి తెరతీశాడు.

        ఏ లాబ్ కీ ఇలా క్షణాల మీద తెలుసుకోవడం అస్సలు సాధ్యం కాదు. అది అజయ్ డీఎన్ఏ అని షిండే కెలా తెలుసు? సరస్వతి వెంట్రుక అని ఎలా తెలుసు? ఫస్టాఫ్ లో విక్రం అసహజంగా ప్రీతి పేరెంట్స్ లాలాజలం, వేలిముద్రలు శాంపిల్స్ సేకరించడం చూశాం. అదెందుకంటే, ఇలా ప్రీతి పళ్ళ మీద డీఎన్ఏ ఆమె తండ్రిదని షిండే వెరిఫై చేయడానికన్న మాట. అంటే రోహిత్ ప్రీతి పళ్ళకి ఆమె తండ్రి డీఎన్ఏ అంటిస్తాడని విక్రం ముందే వూహించి, ఫస్టాఫ్ లో అలా శాంపిల్స్ సేకరించి ముందస్తుగా షిండేకి అందించాడన్న మాట. ఏం కథ ఇది?


        ఇంతా చేసి ఈ సమాచార వెల్లువతో ఒక చిన్న లీడ్ పట్టుకుని ముందుకు సాగలేకపోయాడు విక్రం. అతను ఆలోచించగల్గితేగా? ఎవరో ఆధారాలందిస్తే తప్ప మళ్ళీ ముందుకు సాగలేని పాసివ్ క్యారక్టర్. లత ఆధారమందించింది. ఎవరో తనని  కిడ్నాప్ చేయబోయాడని. స్కెచ్ ఆర్టిస్టు చేత వాడి బొమ్మ వేయించాడు విక్రం. అతను బొమ్మ సరిగ్గా వెయ్యలేదని అవమానం కూడా చేసి పంపించాడు. కథలోనే షీలా అనే బొమ్మలేసే బంపర్ ఆర్టిస్టు వుంది. ఆమె వచ్చి ఆ వూహా చిత్రం వెసిందంటే విక్రం దిమ్మ దిరిగేది. దెబ్బకి తన ఫ్రెండ్ ప్రీతి కిడ్నాపర్ ని పట్టించి పారేసేది. క్యారక్టర్ ఎలివేట్ అయి నిజమైన షైనింగ్ స్టార్ అయ్యేది. ఒక్కటైనా సజీవమైన ఆకట్టుకునే పాత్ర వుండాలిగా? విక్రం ఇంకా టోల్ బూత్ ఫుటేజీలు వెతుక్కునే పనుండేది కాదు. అదంతా వృధా షూటింగు ఖర్చు. కిడ్నాపర్ మెకానిక్ ఫాహద్ బొమ్మని షీలాయే సర్వాంగ సుందరంగా వేసిచ్చేసేది! బొమ్మ వేయించిన లత కూడా పొరపాటు చేసింది. నే చెప్పే బొమ్మ మేడం షీలా గారే క్రియేటివ్ గా వేయాలని డిమాండ్ చేసి వుండాల్సింది... విక్రంకిలా లీడ్ అందించాలి మరి. సొంతంగా ఆలోచించలేడు.

        మొత్తానికి ఎప్పుడో దూది వల్ల దొరికిపోవాల్సిన ఫాహద్ ఇప్పుడు ఇలా దొరికాడు. ఆ సూది మీద అతడి వేలిముద్రల ఎవిడెన్స్ గురించి కూడా విక్రంకిప్పుడే తెలిసింది. హంతకురాలిగా పట్టుపడ్డ స్వప్న చెప్పేయడంతో. కానీ ఫస్టాఫ్ లో మనం చూసినట్టు శ్రీనివాస్ దూదితో బాటు ఈ సూది గురించి అప్పుడే విక్రం కి లీడ్ ఇచ్చాడు. విక్రం కథకోసం పట్టించుకోలేదు. విక్రం, కథకుడు ఇలా కుమ్మక్కై అడుగడుగునా ప్రేక్షకుల్ని ఫూల్స్ చేస్తున్నారు వంద రూపాయల టికెట్టు వసూలు చేసి.

        ఇప్పుడు స్వప్న విక్రం కేం చెప్పింది? సూది మీద వేలిముద్రలు తీస్తున్న నేహా, అవి ఫాహద్ వేలిముద్రలతో కలుస్తున్నాయని రోహిత్ కి చెప్పినట్టు చెప్పింది. అందువల్ల ఈ విషయం ఆమె బయట పట్టకుండా కిడ్నాప్ చేసి బంధించినట్టు చెప్పింది. ఇక్కడ మనకొచ్చే సందేహలేమిటంటే, సూది మీద వేలిముద్రలు తీయడం సాధ్యమా? పాక్షిక వేలిముద్రలే దొరికాయి నేహాకి. పాక్షిక వేలిముద్రలే అనుకుందాం, సగం సగం పాక్షిక వేలిముద్రలతో ట్యాలీ చేసి అవి ఫలానా వ్యక్తివని చెప్పగలరా? కోర్టు తిప్పికొడుతుంది. ఈ వేలిముద్రల్ని ట్యాలీ చేయడానికి ఆమెకి ఫాహద్ నమూనా వేలిముద్ర లెక్కడివి? పాత నేరస్థుల డేటా బేస్ చెక్ చేస్తూంటే అందులో ఫాహద్ వున్నాడట! కథని సులభం చేయడం కోసం పాత్రల్ని ఎలాపడితే అలా చిత్రిస్తున్నాడు కథకుడు. మెకానిక్ ఫాహద్ ని ఇక్కడ సీను అవసరం కోసం పాత నేరస్థుడిగా చిత్రించేశాడు. పాత నేరస్థుడితో ఎస్సై ఇబ్రహీం స్నేహం చేస్తున్నట్టు చూపించాడని మర్చిపోయాడు! ఇప్పుడు ఈ ఫాహద్ ని పట్టుకోబోతూంటే ఇబ్రహీం వచ్చేసి సహకరించి మంచోడైపోయాడు. విక్రం ని కాపాడుతూ ప్రాణత్యాగం కూడా చేసి నిర్దోషిగా నిరూపించుకున్నాడు!

        ఇక నేహా గురించి. ఈమెని ఎప్పుడు కిడ్నాప్ చేసి వుండాలి? విక్రం సెలవు మీద వెళ్లి తిరిగి వచ్చే ముందు కిడ్నాప్ చేసి వుండాలి. ఇప్పటికి సుమారు నెల గడిచిందనుకుందాం. ఇంతకాలం ఆమెని బంధించి వుంచడం సాధ్యమా? నేహా తప్పించుకునే ప్రయత్నమే చేయలేదా? ఎంతకాలం బంధించి వుంచాలనుకుంది? ఆమె బయటికొస్తే ఎప్పటికైనా తనకి ప్రమాదమే. చంపెయ్యా
లనుకోలేదా? స్పష్టత లేదు కథకుడికి. నేహా కంప్యూటర్ లో వున్న ఎవిడెన్స్ ని కూడా లేకుండా చేయాలిగా? ఇది కూడా ఆలోచించలేదు కథకుడు.

        ఇక అతి రహస్యం బట్టబయలు సంగతి... మొత్తానికి విలనెవరు...విలనెవరూ అని వూరిస్తూ డీలా పడిన కథ స్వప్న అనే ఓ మైనర్ క్యారక్టర్ ని విలన్ గా రివీల్ చేసింది. ఇక్కడే ఉస్సూరు మన్పించేలా వుంది. నిన్న ఒక అసోసియేట్ ఒక హాలీవుడ్ సినిమా ముగింపు గురించి చెప్పాడు. హీరోయిన్ హత్య చేసిందని చూపిస్తూ చూపిస్తూ చివరికామె హత్యచేయలేదని తేల్చి సినిమా గాలి తీశారట. ఇలాటి సస్పెన్స్ ని ప్రేక్షకులు ఎంతో మెంటల్ వర్క్ చేసుకుంటూ చూస్తూంటారు. చివరికి ఏమీ లేదు హుష్ కాకీ పొమ్మంటే, ఆ మెంటల్ వర్క్ అంతా వృధా అయిపోయి తెల్లమొహం వేయాల్సి వస్తుంది. ఇలా వుందన్న మాట కథకుడి ఘనకార్యం.

        ప్రీతిని చంపడానికి స్వప్న చెప్పిన కారణం, ఇంతసేపూ మెయింటెయిన్ చేసిన ఎండ్ సస్పెన్సుకి సరిపోయిందా? ఎప్పుడో చిన్నప్పటి కచ్చతో ఇప్పుడు చంపడం నమ్మేలా వుందా? సైకాలజీలో కలెక్టింగ్ ది స్టాంప్స్ అనే మానసిక రుగ్మత వుంటుంది. చిన్నప్పుడు పిల్లలు దెబ్బ లాడుకుంటారు. ఒకరికి ఇంకొకరు ఏదో చిన్న నష్టం చేస్తారు. ఏళ్ళు గడిచి పెద్దవాళ్ళయి ఆ తగాదాలే మర్చిపోతారు. అయితే భూమిలోపల రాతి పలకలు కదిలి భూకంపం వచ్చినట్టు, చిన్నప్పటి తగాదాలో నష్టపోయిన వ్యక్తి మెదడులో వున్నట్టుండి జ్ఞాపకాల పొరలు కదిలి చిన్నప్పటి తగాదా పెనుభూతమై కన్పిస్తుంది. అంతే, దాంతో పగ దీర్చుకోవడం మొదలెడతాడు. ఎలా? ఆ రెండో వ్యక్తి పోతూంటే వెనుక నుంచి కొట్టి పారిపోతాడు. నిద్రపోతూంటే ఇంటిమీద రాయి విసిరి పారిపోతాడు. భార్యతో బజారెళ్తూంటే పేడజల్లి పరారవుతాడు. ఇలాటి చేష్టలు చేస్తూంటాడు. రెండో వ్యక్తి ఉపాయంగా పట్టుకుని నిలదీస్తే – అప్పుడెప్పుడో మన  చిన్నప్పుడు నీ బొమ్మ బస్సుతో నా బొమ్మ బస్సుని గుద్ది పాడు చేయలేదా? నా బొమ్మ బస్సు మొత్తం పాడయింది, నిన్ను వదిలిపెట్టను - అంటున్న ప్రాణమిత్రుణ్ణి చూసి నవ్వాలో ఏడవాలో అర్ధంగాదు రెండో వ్యక్తికి. తీసికెళ్ళి మానసిక చికిత్స చేయిస్తాడు.


      ఇదీ సంగతి. ఇలావుంది ఎండ్ సస్పెన్స్ ముగింపు. చిన్నప్పుడు స్వప్న మాటని కాదని ప్రీతి దత్తత వెళ్లి పోవడంలో ఆ వయసులో ఆమె కావాలని చేసిందేముంది? స్వప్న చెల్లెలి చావుకి ఆమె కారణమెలా అవుతుంది. ఇంత పెద్దయ్యాక స్వప్న ఇలాగే  ఆలోచిస్తుందా? ఆలోచించి చంపేస్తుందా? జస్టిఫికేషను లేని ముగింపుతో ఈ క్రైం కథ తేలిపోయింది.

      మరొకటేమిటంటే, ఈ చివరి సన్నివేశంలో కూడా స్వప్న చేతిలో విక్రం పాసివే. ఏది ఎలా ఎందుకు చేసిందో ఆమె డెమో ఇస్తూంటే చూసి తెల్లబోవడం తప్ప, అవన్నీ తను కనిపెట్టి ఆమెకి డెమో ఇచ్చి షాకివ్వాలన్న యాక్టివ్ పాత్ర చిత్రణకి నోచుకోలేకపోయాడు. ఇక ఆమె ఏది ఎందుకెలా జరింగిందో మాంటేజెస్ తో వివరిస్తూంటే, మొదట్నుంచీ ఆ జరిగినవి ఆడియెన్స్ ఎలా గుర్తు తెచ్చుకుని కనెక్ట్ చేసుకుంటారు - పాసివ్ గా ఏదో చూడ్డం తప్ప. ఎండ్ సస్పెన్స్ తో ఇదే పీకులాట.

        ఎండ్ సస్పెన్స్ అనేది సినిమాకి అన్నివిధాలా చేటు. ఎంతసేపూ అనుమానితులతో తంటాలు పడ్డమే తప్ప హంతకుడితో డ్రామా, యాక్షన్ కన్పించని హీరో ఏకపక్ష కథనంతో సహన పరీక్షే గాక, చివరికి రివీలయ్యే హంతకుడు సినిమా షెల్ఫ్ లైఫ్ ని కూడా నాశనం చేస్తాడు. సినిమా చూసిన ప్రేక్షకుడు హంతకుడు ఫలానా వాడురా అని బయటి కొచ్చి చెప్పేస్తే, చూడాలనుకున్న వాళ్ళకి ఏ సస్పెన్సూ వుండదు. ఒకసారి చూసిన ప్రేక్షకులు బావుందని రిపీట్ ఆడియెన్స్ గా వచ్చే అవకాశమూ వుండదు.

        ఈ కథ మొత్తం ప్రతీ సీనూ లోపభూయిష్టంగా, గజిబిజిగా వుందని చెప్పడానికి చాలా విచారించాల్సి వస్తోంది. అదృష్టమేమిటంటే నిర్మాతా హీరో ఓకే చేసేశారు. ప్రేక్షకులూ హిట్ చేసేశారు. అసలు సినిమాలు ఇలా తీస్తే చాలేమో. తీయడానికీ, ప్రేక్షకులు చూడ్డానికీ పెద్దగా మెదడుతో పనిలేకుండా, అందులోనూ ఇన్వెస్టిగేషన్ కథని!

        ఈ స్క్రీన్ ప్లే సంగతులు ఇంత వివరంగా ఎందుకంటే, మరొకరు ఇలా తీయకుండా జాగ్రత్త పడతారని. ఎండ్ సస్పెన్ కి ఇకనైనా దూరంగా వుంటారని. సినిమా అనేది చూసే ప్రేక్షకులకి క్విజ్ పోటీనో, ఐక్యూ పరీక్షో కాదు. ఆ వేదికలు వేరే వుంటాయి. అక్కడ ఇలాటి సినిమాల్ని డెమో చూపిస్తూ ప్రశ్నలడగాలి ప్రేక్షకుల్ని. సినిమా హాళ్లలోనో, అమెజాన్లోనో కాదు.

(ఐపోయింది)
సికిందర్