రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

601 : మాయా లోకంహీరో : నీ దగ్గర టెంప్లెట్  ఏమైనా నిల్వ వుందేంటి? 

డైరెక్టర్ : వున్నాయండి రెండు మూడు... 
హీరో :  ఏ సైజువి? రెండుగంటలా? రెండున్నర గంటలా?
డైరెక్టర్ : మీకు సరిపోయే సైజు రెండుంపావు గంటలది వుందండి. 
హీరో :  పట్రా, వేసుకుని చూస్తా...అవునూ, మనం తెలుగు వాళ్ళం స్క్రీన్ ప్లేలు వాడడం మాని పారే సి,  అచ్చు గుద్దినట్టు ఒకే మోడల్ టెంప్లెట్లే వాడేస్తున్నామని ఎవరైనా పసిగట్టా
రంటావా? 
డైరెక్టర్ : సమస్యే లేదు. అమాయకులేం పసిగడతారండీ, భలేవారు – గాడిదకీ గుర్రానికీ తేడా ఎక్కడ తెలుసండీ? 
హీరో :  ఓకే, ఐతే మనం గాడిదల్నే తోలుతున్నామన్న మాట... 
డైరెక్టర్ : అందుకే అవి ఎనక్కాల్తో తంతున్నాయండీ.
హీరో : అయినా సిగ్గు లేకుండా వాటి వెంటే పడుతున్నామంటావా?
డైరెక్టర్ : నిస్సిగ్గుగా!
హీరో :  ఈ తన్నించుకోవడంలో తేడా లేమైనా వున్నాయా? అంటే మెత్త మెత్తగా అనీ...హోల్మొత్తంగా అనీ ...? 
డైరెక్టర్ : అది చూసే అమాయక ప్రేక్షకుల్ని బట్టి వుంటుందండి. దేన్ని ఎలా ఎప్పడు తంతారో  వాళ్ళకే తెలీదు. ఒక్కో టెంప్లెట్ ని ముద్దుముద్దుగా తన్ని సెల్ఫీలు తీసుకుంటారు. ఒక్కో టెంప్లెట్ ని ఎడాపెడా తన్ని అక్కడే సఫా చేసిపోతారు. 
హీరో :  ఐతే ఇప్పుడు చెప్తున్నా జాగ్రత్తగా విను...టెంప్లెట్ లో సెల్ఫీ టెంప్లెట్ అనేది నాక్కావాలి. సఫా టెంప్లెట్ అవతలోడికివ్వు...
డైరెక్టర్ :  టెంప్లెట్ లో  సెల్ఫీ  టెంప్లెట్టా? అది చాలా కష్టమండి... 
హీరో : కష్ట పడ్డం నేర్చుకో. స్క్రీన్ ప్లేలు మానిపారేసి కష్టపడ్డ మంటే ఏంటో తెలీక  గాలికి తిరుగుతున్నావ్. ఇంకెంత కాలం నిన్ను భరించాలి. సెల్ఫీ టెంప్లెట్ తో వచ్చి కనపడు. అమాయకులు కనిపెట్టేసే లోగా కనపడు. వాళ్ళు స్క్రీన్ ప్లేలో ...స్క్రీన్ ప్లేయమ్మా ...అని అరిచి గీ పెట్టడం నేర్చుకునే లోగా, సెల్ఫీ టెంప్లెట్స్ లాలీ పాప్స్ నోట్లో పెట్టేయ్. సీయూ విత్ ఏ సూపర్ హిట్ సెల్ఫీ టెంప్లెట్. ఐ డోంట్ వాంట్ ఎనీ గాడిద తన్నులూ ఎనీ మోర్...

***

600 : రివ్యూ!

టెంప్లెట్ - దర్శకత్వం: వి.వి.వినాయక్
తారాగణం: సాయిధరమ్తేజ్, లావణ్యా త్రిపాఠీ, నాజర్, బ్రహ్మానందం, పోసాని, కాశీ విశ్వనాథ్, షాయాజీ షిండే, రాహుల్దేవ్, దేవ్గిల్ తదితరులు
కథ
, మాటలు: ఆకుల శివ సంగీతం: థమన్, ఛాయాగ్రణం: ఎస్‌.వి. విశ్వేశ్వర్
బ్యానర్ : సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి
నిర్మాత: సి.కళ్యాణ్
విడుదల : ఫిబ్రవరి 9, 2018

***
        సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గత ‘జవాన్’ తో కూడా విఫలమై ఇక ‘ఇంటిలిజెంట్’ తో ఇంటలిజెంట్ ప్రయత్నం చేద్దామని వినాయక్ అండ చూసుకుని వచ్చేశాడు. టాప్ దర్శకుడు వివి వినాయక్ సుప్రీం హీరోకి సూపర్ సక్సెస్ ఇద్దామని మరోసారి తన హిట్ ఫార్ములాకి శ్రీకారం చుట్టారు. ‘జై సింహా’ తీసిన సి కళ్యాణ్ కూడా వెంటనే వీళ్ళిద్దరి సినిమా నిర్మించేశారు. ఒక చూడ ముచ్చటైన కాంబినేషన్ కుదిరింది. బడ్జెట్ కూడా భారీగానే వుంది. ప్రేక్షకుల్ని ఎంతో వినోదింప జేయాలనే ఉద్దేశంతో ఇంత బడ్జెట్ కి సాహసించి వుంటారు. మరి ఇదంతా వర్కౌట్ అయిందా? ఈ హాట్ హాట్ గా అమ్ముడు బోయే కాంబినేషన్, హై బడ్జెట్,   ప్రేక్షకులకి ఒక అద్భుత ఆనందాన్ని ఇచ్చేట్టు వున్నాయా? ప్రేక్షకులేం ఆశిస్తారు? ఆశించినట్టు ఈ చూడ ముచ్చటైన కాంబినేషన్ చూడ ముచ్చటైన చలన చిత్రాన్నిచ్చినా? చలనం లేని బద్దకాన్ని ప్రదర్శించిందా?....ఓసారి లుక్కేద్దాం!

కథ
        చిన్నప్పట్నించీ తేజ (సుప్రీం హీరో) చాలా బుద్ధిమంతుడు. తల్లి దండ్రుల మాట వినే  ఎంతో వినయసంపన్నుడు. జీవితంలో చక్కగా ఎదిగి తమ ఆశలు నేరవేరుస్తాడని మధ్యతరగతి జీవులైన ఆ తల్లిదండ్రులు మంచి నమ్మకంతో వుంటారు. తల్లికి సంగీతంలో మంచి ప్రవేశం కూడా వుంటుంది. బుల్లి తేజ స్కూల్లో తోటి పిల్లవాడికి సాయం చేయడమంటే ఏమిటో కూడా చక్కగా నేర్పుతాడు. ఇక గొప్ప సంఘ సేవకుడూ,  సాఫ్ట్ వేర్ కంపెనీ యజమానీ అయిన నందకిషోర్ (నాజర్) స్కూలుని సందర్శించి,  ఫస్ట్ వచ్చిన తేజకి బహుమతిని అందిస్తాడు. నువ్వేమవుతావు బాబూ అని గారంగా అడిగితే, సాఫ్ట్ వేర్  ఇంజనీర్ నవుతానని ఎంతో గొప్పగా చెప్తాడు బుల్లి తేజ. ముచ్చటేసి, ముద్దు చేసి,  బుల్లి తేజని తనే చదివిస్తాడు నందకిషోర్. బుల్లి తేజ బడా తేజగా మారి,  సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా నందకిసోర్ కంపెనీలోనే చేరి కన్నకలలు నిజం చేసుకుంటాడు. ఇలా వొక అద్బుతమైన చిన్ననాటి కథ ఆవిష్కృతమవుతుంది. ఇంకా ఈ చిన్నప్పటి చాక్లెట్ కథలేమిటని అనుకోవద్దు. తెలుగు సినిమాలు చూస్తూ ఈ చాక్లెట్ చేష్టలు భరించాల్సిందే. నీతికథలు తెలుసుకోవాల్సిందే.  

          ఇప్పుడు సాఫ్ట్ వేర్ తేజ మిత్రుడి కోసం గూండాలతో ఫైట్ చేసి పాట వేసుకుంటాడు. కామెడీ చేస్తాడు. అప్పుడు స్కూటీ మీద వస్తూ ఓ అందమైన అమ్మాయి (లావణ్యా త్రిపాఠీ)  పరిచయమవుతుంది. ముందు అతన్ని అపార్ధంచేసుకుని పోలీసులకి పట్టించినా, తర్వాత అతడికి  ఆడవాళ్ళ పట్ల అపారమైన గౌరవ మర్యాదలున్నాయని గ్రహించి ప్రేమలో పడుతుంది. తీరా ఈమె తన బాస్ కూతురేనని తెలుస్తుంది తేజకి. ఇంతలో బాస్ నందకిషోర్ కి మాఫియా బెదిరింపులొస్తాయి. నందకిషోర్ తన ఉద్యోగులకి రకరకాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ తమకి ఇబ్బందులు తెస్తున్నాడని,  మిగతా సాఫ్ట్ వేర్ కంపెనీలు విక్కీ భాయ్ (రాహుల్ దేవ్)  అనే మాఫియా నాశ్రయించాయి. ఆ మాఫియా బెదిరింపులకి తట్టుకోలేక ఇప్పుడు నంద కిషోర్ ఆత్మహత్య చేసుకుంటాడు, కంపెనీని విక్కీ భాయ్ తమ్ముడి (దేవ్ గిల్) కి రాసేసి. 

          నంద కిషోర్ నిజంగానే ఆత్మ హత్య చేసుకున్నాడా? నిజంగానే కంపెనీని రాసేశాడా? ఇప్పుడు తేజ ఏం చేశాడు? ఇది అబద్ధమని నిరూపించి కంపెనీని ఎలా కాపాడుకున్నాడు? దుర్మార్గుల్ని ఎలా శిక్షించాడు?....ఇవి తెలుసుకోవాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే. 

ఎలావుంది కథ?
       ఇంకా ఇలా 1980 ల నాటి కథలే  వర్కౌట్ కావు, ఇంకా అప్డేట్ అవ్వాలి. అనిచర్వనీయంగా 1950 ల నాటికి అప్డేట్ అయి, అలాటి  సినిమాలు తీస్తే తెలుగు సినిమాలు ఎంతైనా బతికి బాగుపడతాయి. నిర్మాతలూ బయ్యర్లూ పది కాలాలు బాగుంటారు. కాబట్టి స్టార్లూ డైరెక్టర్లూ తమ కళాతృష్ణని ఇంకా ముందుకు, అంటే 1950 ల నాటి కెళ్ళి  తీర్చుకోవాలి. అవి కూడా ఇలాగే టెంప్లెట్ లో పెట్టి తీస్తే ఇంకా బాగా వర్కౌట్ అవుతాయి. ఎంత ముందు కెళ్ళినా టెంప్లెట్ అనేది మర్చిపోవద్దు. టెంప్లెట్ తో టాలీవుడ్ మనోభావాలు చాలా ముడిపడి వున్నాయి. అసలే ఇది మనోభావాల కాలం. సుప్రీం హీరో తనకి పాత మూస తప్ప ‘ఔటాఫ్ బాక్స్’ కథలు విన్పించే వాళ్ళే  రావడం లేదని వాపోయాడు. వాళ్లకి  ఇక  ‘ఔటాఫ్ బాక్సాఫీసు’ కథలే 1950 ల నాటివి చెప్పాలని మొట్టి కాయేయాలి. ఎంత ‘ఔటాఫ్ బాక్సాఫీసు’ కథైతే అంత ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ ఇస్తామని నోట్లు చూపించాలి. 

ఎవరెలా చేశారు 
       సుప్రీం హీరో చాలా విసుగ్గా చేసిన సినిమా ఇదే. ఫలితం ముందే తెలుసు కాబట్టి, ఇంకా హీనంగా కూడా చేయవచ్చని అతడికి తెలుసు. కానీ దయతల్చి వదిలేశాడు. తేజగా వున్న తను కాస్తా,  మాఫియా విక్కీ భాయ్ అంతు  చూసే ధర్మా భాయ్ గా మారేక, నేనే ధర్మా భాయ్ అని అరవడంలో కూడా పక్షపాతం  చూపించాడు. ఫైట్స్ చేసే టప్పుడు మాత్రం సహజంగానే వీర ప్రతాపం చూపించాడు, విసుగులోంచి విముక్తి కోసమన్నట్టు. ‘అజ్ఞాత వాసి’  లో కంపెనీ హాం ఫట్ అయ్యే పరిస్థితిని  ఒక మెగా హీరోగా పవర్ స్టార్ ఎంత బాగా చక్కదిద్దలేదో, దాన్ని అధిగమించి మాత్రం ఇంకో మెగా హీరో అయిన తను సుప్రీం హీరో,  మాఫియాల్ని ఎడా పెడా బాదుతూ చక్కదిద్దాడు. ఇక విసుగు లేకుండా బాదుడే సినిమా అన్నట్టు డిసైడ్ అయిపోయాడు. ప్రేక్షకులాశించే కామెడీ, లవ్ అయితే తనకి పెట్టనే లేదు దర్శకుడు. పాటలూ మొక్కుబడే. థమన్ కూడా సరీగ్గా పట్టించుకోలేదు ‘ఇంటిలిజెంట్’ ని. 

         హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ చక్కగా సుప్రీం హీరోని ఫాలోయిపోయింది విసుగు విషయంలో.  ఎక్కడా రోమాన్సే లేని ఈమె ఎందుకుందో తెలియని పరిస్థితి. ఇక బ్రహ్మానందం కామెడీ అయితే ‘చప్ప’ నవసరం లేదు. నాజర్, పోసాని, కాశీ విశ్వనాథ్, షాయాజీ షిండే, రాహుల్ దేవ్, దేవ్గిల్, జయప్రకాష్ రెడ్డి, ఆశీష్ విద్యార్థి, పృథ్వీ, సప్తగిరి, రాహుల్ రామ కృష్ణ, తాగుబోతు రమేష్, నల్ల వేణు, విద్యుల్లేఖా రామన్...ఇలా భారీ తారాతోరణం నలుచెరగులా వ్యాపించి వుంటారు వాపోతూ – ఆకుల శివ తప్ప. ఈ కథ, మాటలు ఎంతో కసిగా రాసింది తనే కాబట్టి,  ఆ మాత్రం మాఫియా కిల్లర్ గా షంషేర్ గా నటించకపోతే మాట వస్తుంది. ఈ సినిమాతో ఫైనల్ గా తేలిందేమంటే, ఆకులశివ తనకున్న వాయిస్ తో బెస్ట్ యాక్టర్ అవుతాడని! 

చివరికేమిటి 
       ఇది వినాయక్ దర్శకత్వం వహించినట్టులేదు. చాలా అలసట కన్పిస్తోంది. ఆయన అలసిపోయారు. లేకపోతే సీన్లు ఇంత నీరసంగా వుండవు. టెంప్లెట్ లో పెట్టిన కథా కథనాలు కూడా అవుట్ డేటెడ్ గా, ‘బి’ గ్రేడ్ ప్రమాణాలతో వుండవు. తీసిన షాట్లు ఇదివరకటిలా లేవు. అసలు ఇలాటి సినిమా తీయవచ్చని ఎలా అనుకున్నారో తెలీదు. ఇదొక కథ అని ఎలా అనిపించిందో అంతకన్నా తెలీదు. ఇంటర్వెల్ వరకూ ఓపిక పట్టి చూశాక, ఏ ప్రేక్షకుడైనా ఇంకా సెకండాఫ్ చూడాలని ఎందుకనుకోవాలో ఆయనే చెప్పాలి. మొదటి సీను నుంచీ కథ చెప్పేసుకుంటూ పోతున్నారు ప్రేక్షకులు. వినాయకంటే క్లాస్ నుంచీ మాస్ దాకా ఒక నమ్మకం వుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకున్నారు. కోటిన్నర బడ్జెట్ తో,  చిన్నా చితకా వాళ్ళతో ఇలాటి సినిమాలు అనేకం వస్తూంటాయి. దీనికి పదుల కోట్ల బడ్జెట్ ఎందుకో అర్ధంగాదు. ఇవన్నీ కలుపుకుని వినాయక్ ఈసారి ఒక సూపర్ డూపర్ ఫ్లాప్ తీయడంలో ఘన విజయం సాధించారు.

సికిందర్