రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, February 4, 2020

914 : సందేహాలు - సమాధానాలు





Q : వివిధ టెక్నీషియన్స్ ని మీరు చేసిన ఇంటర్వ్యూలు చదివాను. వివిధ శాఖల టెక్నికల్ విషయాలు చాలా తెలుసుకో గలిగాను. అయితే ఇప్పుడు టెక్నాలజీ బాగా అప్డేట్ అయింది. మీరు చేసిన ఇంటర్వ్యూల కాలానికీ నేటికీ ఈ గ్యాపు వుంది. ఇప్పుడు తాజాగా  మళ్ళీ ఇంటర్వ్యూలు చేయలేరా?
పేరు రాయని టెక్నీషియన్
A : మళ్ళీ ఇంటర్వ్యూలు కష్టం. అప్పట్లోనే వివిధ శాఖల నుంచి 45 మంది నిపుణుల్ని ఇంటర్వ్యూ చేశాం. క్రాఫ్టులు ఇరవై నాల్గే లేవు, ఇంకా చాలా పెరిగాయి. అవి కూడా కవర్ చేశాం. పాత తరం నిపుణులతో బాటు కొత్త తరం నిపుణుల్నీ ఇంటర్వ్యూ చేశాం. ఇప్పుడు అప్డేట్స్ అంటే సాధనాలు మారి వుంటాయి తప్ప, పని అదే. ఎడిటింగ్ లో కొత్త ఎడిటింగ్ పద్ధతులు రాలేదు, డీటీఎస్ లో కొత్త ఎఫెక్ట్స్ రాలేదు. డీఐ లోనూ డిటో. పైగా టెక్నాలజీ ఎంత మారినా ఎడిటింగ్ సాంప్రదాయ పద్ధతికే మారుతున్నట్టు ‘అరవింద సమేత వీర రాఘవ’ ని ఉదహరిస్తూ ఒక ఎడిటర్ చెప్పారు. ప్రేక్షకులు సాంప్రదాయాన్నే కోరుకుంటున్నారన్నారు. కనుక అప్డేట్ అవడం సాధనాల పరంగానే తప్ప, విషయపరంగా ఏమీ వుండదు. ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తే కొత్త కెమెరాలు ఎమోచ్చాయి, కొత్త డోల్బీ సిస్టం ఎమోచ్చిందీ  అని మార్కెట్ ఉత్పత్తుల గురించి మాట్లాడుకోవాలి, అంతే. ఇది పాఠకులకి / ప్రేక్షకులకి ఆసక్తి కల్గించక పోవచ్చు.   
Q :  తెలుగు సినిమాల్లో మామూలుగా కథ ఇంటర్వల్ దగ్గర మొదలవుతుంది. పెద్ద సినిమా నుంచి చిన్న సినిమా వరకు దాదాపు అన్ని సినిమాల్లో ఇదే పరిస్థితి.అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటారు? కథలో దమ్ము లేకపోవడం వలన? లేదంటే మొదటి అరగంటలోనే కథలోకి వెళ్ళిపోతే మిగతా గంటన్నర కథను చెప్పే సత్తా దర్శకులు, రచయితల దగ్గర లేకపోవడం వలన? మొదటి అరగంటలోనే కథలోకి వెళ్ళి అద్భుతంగా కథ చెప్పిన సినిమాల ఉదాహరణలు ఇవ్వగలరు.
        మరొక సందేహం. విలన్ కోసం హీరో వెతుకుతుంటే అతను ఖచ్చితంగా యాక్టివ్ క్యారెక్టర్. కానీ విలన్ నుంచి తప్పించుకుంటూ హీరో వెళ్లడం అన్నది యాక్టివ్ క్యారెక్టరేనా? అలాంటి కథలు కరెక్టే నంటారా?
రవి, సహకార దర్శకుడు
A : అన్ని సినిమాల్లో అలా జరగదు. ఫస్టాఫ్ అరగంటా ముప్పావు గంటలోనే కథ ప్రారంభమవుతుంది. పెద్ద సినిమాల్లో టెంప్లెట్ సినిమాల్లోనే ఇంటర్వెల్ దగ్గర కథ ప్రారంభమవుతుంది. మొదటి అరగంటలో కథ ప్రారంభం కావడం పధ్ధతి. ఫస్టాఫ్ లో మూడు పాటలుంటాయి కాబట్టి పెద్ద హీరోల సినిమాలు 45 నిమిషాలు తీసుకుంటే ఫర్వాలేదు. గంటం పావు కొచ్చే ఇంటర్వెల్ వరకూ అంటే టైం వేస్టే. ‘శివ’, ‘ఒక్కడు’ లాంటి భారీ సినిమాల్లో అన్ని పాటలతో కూడా అరగంటలోనే కథా ప్రారంభముంటుంది. చిన్న హీరోల సినిమాల్లో పాటలకి పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదు. ఇచ్చినా మాంటేజెస్ తో మూడో నాల్గో సినిమా మొత్తానికీ వుంటున్నాయి. ఈ సినిమాల్లో కూడా ఫస్టాఫ్ 45 నిమిషాలకి, లేదా ఇంటర్వెల్ కి సాగ లాగి కథ ప్రారంభించడం సహన పరీక్షే అవుతుంది ప్రేక్షకులకి. 30 నిమిషాలకే కథ ప్రారంభించాలంటే కాన్ఫ్లిక్ట్ ని మొదట మేకర్లు ఎదుర్కోవాలి, పాత్రల సంగత్తర్వాత. కథా ప్రారంభమంటే కాన్ఫ్లిక్ట్ లేదా సంఘర్షణ ప్రారంభమే కాబట్టి, ఈ సంఘర్షణని ఫస్టాఫ్, సెకండాఫ్ కలిపి గంటకి పైగా నిర్వహిస్తే ప్రేక్షకులు చూడలేరన్న నమ్మకంతో, చిన్న హీరోల సినిమాల కథల్ని కూడా ఇంటర్వెల్ వరకూ తెగ లాగి అప్పుడు ప్రారంభిస్తున్నారు.
        స్ట్రక్చర్ ప్రకారం రెండు గంటల సినిమా వుందనుకుంటే, ఫస్టాఫ్ లో వచ్చే బిగినింగ్ విభాగం 30 నిముషాలు, ఆ తర్వాత ప్రారంభమయ్యే మిడిల్ - 1 విభాగం ఇంటర్వెల్ వరకూ 30 నిమిషాలు, ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో వచ్చే మిడిల్ - 2 విభాగం ఇంకో 30 నిమిషాలూ వుండి, చివరి 30 నిమిషాలు ఎండ్ విభాగం వుంటుంది. అంటే బిగినింగ్, ఎండ్ విభాగాలు 30 నిమిషాల చొప్పున వుంటే, మధ్యలో మిడిల్ రెండు విభాగాలూ కలిపి 60 నిమిషాలు వుంటుంది. ఈ 60 నిమిషాలు లేదా గంట పాటూ వుండేదే సంఘర్షణతో కూడిన, పాయింట్ తో కూడిన కథ. ఈ గంట సేపు కథ నడిపే దగ్గరే వస్తోంది సమస్య. రెండున్నర గంటల సినిమాకైతే గంటన్నర నడపాలి! గంటన్నర అంటే 50 సీన్లు!
        బిగినింగ్ విభాగంలో గంట సేపు వృధాగా సాగే కామెడీ సీన్ల మీద, ఎండ్ లో అరగంట సాగే క్లయిమాక్స్ సీన్ల మీదా కాలక్షేపంగా రోజుల తరబడి డజనుమంది డిస్కషన్ల మీద డిస్కషన్లు, సిగరెట్ల మీద సిగరెట్లు పీకి - ఆ సీన్లని ముస్తాబు చేసే కాలాన్నీ, శ్రమనీ ఓ గంట పాటు సాగే మిడిల్ కథ మీద వెచ్చించడానికి ఒప్పుకుంటే సినిమా లెప్పుడో బాగుపడేవి.
        అప్పట్లో కోడి రామకృష్ణ తీసిన ఏ సినిమా అయినా, స్టార్లతో తీసిన సినిమాలైనా కొలిచి తీసినట్టు రెండు గంటలా 10 నిమిషాలే వుండేవి. ఎలా సాధ్యమైంది? పరిశీలిస్తే తెలుస్తుంది. మొన్న స్ట్రక్చర్ అవగాహన వున్న ఒకరు పది నిమిషాలకే కథ ప్రా రంభిస్తానన్నారు. ప్రారంభించవచ్చు. అది ‘చక్కిలిగింత’ లాగా ఇంటర్వెల్ కే కథ అయిపోకుండా వుంటే చాలు. ‘అన్ ఫెయిత్ ఫుల్’ లో ఐదు నిమిషాలకే కథ ప్రారంభమవుతుంది. కథా బలం కోరుకుంటే ఇవన్నీ స్టడీ చేయాలి. తేజ తీసిన సినిమాల్లో కథ అరగంటకే ప్రారంభమవుతుంది. మూడు గంటల బ్లాక్ అండ్ వైట్ కాలపు పాత సినిమాలు చూసినా అర్ధమవుతుంది. సకాలంలో,  అంటే 30, 45 నిమిషాల్లోనే కాదు, ఇంకా ఆ లోపు కథ ప్రారంభమైనా ఇప్పుడు ప్రేక్షకులు చూస్తున్నారు. ఇంకా ఫస్టాఫ్ లో కథలోకి వెళ్ళని కామెడీలూ, ప్రేమలూ, పాటలూ కోరుకోవడం లేదు. ‘బ్రోచేవారెవరురా’ లో హీరోయినున్నా రోమాన్స్ లేదు, ‘మత్తువదలరా’ లో అసలు హీరోయినే లేదు.
        మిడిల్ నిడివిని బట్టే కథా బలం వుంటుంది. ఫస్టాఫ్ కామెడీ సీన్ల రైటర్లు / డైరెక్టర్లు మిడిల్ ‘స్టోరీ సీన్ల’ ఎక్స్ పర్ట్స్ గా మారితే తప్ప మార్పురాదు.
       
ఇక రెండో సందేహానికి జవాబు : ఇది విలన్ ఎవరనే దాని మీద ఆధారపడుంటుంది. హీరోకి ప్రత్యర్ధి పాత్రలన్నీ విలన్ అనే బ్యాడ్ క్యారక్టర్స్ గా వుండవు. రోమాంటిక్ కామెడీల్లో  హీరోకి ప్రత్యర్ధి పాత్ర హీరోయిన్. ఈమె బ్యాడ్ క్యారక్టర్ కాదు. ఫ్యామిలీ సినిమాల్లో తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ వుంటే ఆ తండ్రి ప్రత్యర్ధి పాత్ర కావచ్చు, బ్యాడ్ క్యారక్టర్ కాదు. యాక్షన్ సినిమాల్లో హీరోకి ప్రత్యర్ధిగా చట్టాన్ని పరిరక్షించే పోలీసు అధికారి వుంటే అతను విలన్ కాదు. ఇతన్నుంచి తప్పుడు కేసులో ఇరుక్కున్న హీరో పారిపోవచ్చు. ఎంతదాకా? ఇంటర్వెల్ దాకే. ఇంటర్వెల్ దాకా పాసివ్ గానే వుంటాడు. ఎందుకంటే పరిస్థితిని ఆకళింపు చేసుకోవాలి కాబట్టి. ఇంటర్వెల్లో పరిస్థితిని ఆకళింపు చేసుకుని యాక్టివ్ గా మారిపోతాడు. అంటే ప్రతివ్యూహాలు పన్ని ఆ పోలీసు అధికారిని తను ముప్పు తిప్పలు పెట్టడం ప్రారంభిస్తాడు. ఇది సర్వసాధారణంగా వుండే యాక్షన్ హీరో క్యారక్టర్ ఆర్క్.
        హీరో తప్పు చేసిన యాంటీ హీరో అయితే, ముగింపు ముందే రాసి పెట్టేసి వుంటుంది. చట్టానికి లొంగి పోవడమో, ప్రాణాలు తీసుకోవడమో, చట్టం చేతిలో చావడమో జరుగుతుంది. ఏది జరిగినా, ఓటమిలో కూడా పోరాటమే వుంటుంది. ఓటమిలో కూడా పోరాటం లేకపోతే పాసివ్ పాత్ర అవుతాడు హీరో. పోరాడి గెలిచినా, ఓడినా యాక్టివ్ పా త్రే అవుతాడు.
        ఇక ప్రత్యర్ధిగా మఫియాగానీ, మాఫియా టైపు పాత్ర గానీ వుంటే, అతను పచ్చి విలనే. అతన్నుంచి హీరో కథని బట్టి కొంత మేర పాసివ్ గా పారిపొయినా, ఆ తర్వాత యాక్టివ్ గా మారి ఎదురు దాడులు చేయాల్సిందే. సెకండాఫ్ లో కూడా ఎప్పుడు చూసినా హీరో మీద విలనే  దాడులు చేస్తూ, ఆ దాడుల్ని హీరో తిప్పి కొట్టేవరకే చేస్తూంటే, పాసివ్ అయిపోతాడు. చూస్తే గొప్ప యాక్షన్ సీన్స్ లో పాలుపంచుకుంటున్నట్టే ప్రేక్షకుల చేత కేరింతలు పెట్టిస్తాడు గానీ, నిజానికి అది చేతకాని తనం. అంటే పాసివ్ రియాక్టివ్ పాత్ర లక్షణం. ‘అశోక్’ లో ఎన్టీఆర్ పాత్ర ఇలాటిదే. ఎంతసేపూ ఆత్మ రక్షణ చేసుకుంటూ విలన్ దాడుల్ని ఎదుర్కోవడం గాక, విలన్ని ఆత్మ రక్షణలో పడేసి తను దాడులు జరిపినప్పుడే యాక్టివ్ క్యారక్టర్ అవుతాడు.
        బ్యాక్ డ్రాప్ తో అంటుకట్టని స్టార్ సినిమాలుంటాయి - మహేష్ బాబు నటించిన ‘బాబీ’ లాంటివి. ఇందులో మహేష్ బాబు, ఆరతీ ఆగర్వాల్ పాత్రల తండ్రులు కరుడుగట్టిన మాఫియాలు. దాడులు చేసుకుంటూ నగరాన్ని అట్టుడికిస్తూంటారు. అయినా నగరమిలా ఎందుకు తగలబడుతోందన్న ఆలోచనే లేకుండా హీరో పాత్రగా మహేష్ పాత్ర ఆరతీ పాత్రతో ఎంతసేపూ ప్రేమాయణమే సాగిస్తూంటుంది. ఎంతకీ మహేష్ పాత్ర బ్యాక్ డ్రాప్ లో తండ్రులతో జరుగుతున్న నేరాలు ఘోరాలతో కనెక్ట్ అవనే అవదు. ఇలా బ్యాక్ డ్రాప్ ని స్పర్శించని హీరో బలహీన పాసివ్ పాత్రే అవుతాడు. కథలో ఏం జరుగుతోందో కథానాయకుడికి తెలియకపోతే ఆ పాత్ర కథానాయక పాత్రేకాదు. యాక్టివ్ పాత్ర వ్యక్తిత్వ వికాసం, పాసివ్ పాత్ర వ్యక్తిత్వ వినాశం. ఎందుకు కథా నాయక పాత్ర యాక్టివ్ పాత్రే అయివుండాలో శాస్త్రీయంగా చెప్పాలంటే, అది సినిమా చూస్తున్న ప్రేక్షకుల కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ని మధించే సైకలాజికల్ అంశం. ఇది వివరిస్తే ఓ పట్టాన ఎవరికీ అర్ధంగాదు, వదిలేద్దాం.
Q : ‘బ్యాలెన్స్’ అనే ఒక షార్ట్ ఫిల్మ్ మస్తిష్కపు అంతరాల్లోకి వెళ్లి స్వార్ధానికి, స్వార్దానికి - నిస్వార్థపు స్వార్దానికి మధ్య అంతరాలని మెలిపెట్టే ఒక మెలిక ఉందని ఒక ఒపీనియన్ వ్యక్తపరిచినట్లుగా కనిపిస్తుంది. దయచేసి మీ యొక్క అభిప్రాయం తెలుపగలరు.
పేరు రాయలేదు
A : ఈ జర్మన్ షార్ట్ ప్రపంచ దేశాల గురించి. ప్రపంచ దేశాలు ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేయడం గురించి. ఒక దేశం ఒక పక్కకు వెళ్ళిపోతే ఆ బ్యాలెన్స్ తప్పకుండా మిగతా దేశాలు ప్రయత్నించడం గురించి. పరస్పరం మాటా మంతీ లేని దేశాలు, పైచేయి కోరుకునే దేశాలు, స్వార్ధాలతో పోరాడుకునే దేశాలు. వీటి మధ్యకి వచ్చే మ్యూజిక్ బాక్స్ వనరులకి అర్ధం. వనరులు హస్తగతం చేసుకోవడానికి ఘర్షించుకుని ప్రపంచాన్ని బ్యాలెన్సు తప్పించడం, తామూ పతనమై పోవడం. చివరికి మిగిలిన ఆ ఒక్క దేశం వనరులు హస్తగతం చేసుకోలేక, చేసుకోబోతే బ్యాలెన్సు తప్పే పరిస్థితుల్లో అచేతనమై పోవడం. ఇది జర్మన్ ఎక్స్ ప్రెషనిస్టు సర్రియలిస్టిక్ (అధివాస్తవికత) కథా ప్రక్రియ. ఫిలిం నోయర్ జానర్ జర్మన్ ఎక్స్ ప్రెషనిస్టు నించి వచ్చిందే. దీన్ని హాలీవుడ్ అంది పుచ్చుకుని కాలక్రమంలో ఫిలిం నోయర్, నియో నోయర్, టీన్ నోయర్ థ్రిల్లర్స్ గా కమర్షియలైజ్ చేసి సొమ్ములు చేసుకుంది. ‘బ్యాలెన్స్’ 1989 లో ఆస్కార్ అవార్డు పొందిన ఏడు నిమిషాల యానిమేటెడ్ షార్ట్. ఇంతే మనకి బోధపడింది. 
సికిందర్