రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, ఆగస్టు 2023, మంగళవారం

1355 : స్పెషల్ ఆర్టికల్


 

            వర్-ది-టాప్ (ఓటీటీ) కంపెనీల ఆగమనంతో సినిమా హాళ్ళు సంక్షోభంలో పడ్డాయన్న ఆందోళన కాలక్రమంలో తగ్గిపోతూ వస్తోంది. సినిమా ప్రపంచం గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన మార్పుకి గురైంది. సినిమాలు, టీవీ షోలు, డాక్యుమెంటరీలు మొదలైన వినోద కాలక్షేపపు విస్తృత కంటెంట్‌ ని ఓటీటీలు అందించడంతో ప్రేక్షకులు సినిమా హాళ్ళకి వెళ్ళడం తగ్గించేశారన్న అంచనాల్ని గణాంకాలతో వెల్లడిస్తూ వచ్చారు మార్కెట్ రీసెర్చర్లు. అయితే దీనికి భిన్నంగా, పీవీఆర్- ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ గ్రూపు సంస్థ క్వాలిటీ లేని హిందీ సినిమాల వల్ల తమకు నష్టాలు సంభవిస్తున్నాయని ఇటీవల ఆరోపించడం మొదలెట్టింది. దీన్ని తట్టుకోవడానికి హాలీవుడ్, కొరియన్ సినిమాలు ఆడించుకుంటున్నామని ప్రకటించుకుంది.

        ది నిజం? ఓటీటీలతో సినిమా హాళ్ళకి ప్రమాదమా, లేక హిందీ సినిమాల క్వాలిటీ రాహిత్యంతో థియేటర్లకి నష్టాలా? ఏది నిజం? రెండోదే నిజం కావచ్చని ఈ నెల విడుదలైన గదర్ 2, ఓఎంజీ2 హిందీ సినిమాలు సంకేతాలిస్తున్నాయి. మొదటిది భారీ హిట్టయి, రెండోది బ్రేక్ ఈవెన్ తో హిట్టయి సినిమా హాళ్ళకి ప్రాణం పోశాయి. క్వాలిటీ విషయానికొస్తే మొదటి దానికి పరమ చెత్త అని 1, 1.5 రెంటింగ్స్ తో రివ్యూలొచ్చాయి. సినిమా చూస్తే పరమ హిట్టయి రివ్యూలని వెక్కిరిస్తోంది.
       
పైగా పీవీఆర్- ఐనాక్స్ అభిప్రాయం కూడా తప్పని రుజువు చేస్తోందీ సినిమా. ఇప్పుడు గదర్2 లాంటి క్వాలిటీ లేని హిందీ సినిమాయే తమకి కనకవర్షం కురిపిస్తోంది. బాక్సాఫీసు 400 కోట్లకి చేరువలో వుంది. కారణం
, పక్కా మాస్ మూవీ కోసం మొహం వాచి వున్న నార్త్ ఇండియా రూరల్ ప్రేక్షకుల ఆకలిని తీర్చేయడం. మారు మూల మూతబడడానికి సిద్ధంగా వున్న పాత తరం సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ళు కూడా గదర్ 2 తో ప్రాణం పోసుకుని, సినిమా అంటే ఇది కదాని బూజు దులుపుకుంటున్నాయి.
       
పీవీఆర్- ఐనాక్స్ చెప్పే క్వాలిటీ ఓఎంజీ2 లో తప్పకుండా వుంది. క్వాలిటీతోనే ఇది 100 కోట్లు కలెక్షన్లు దాటింది. అంటే ఓటీటీల వల్ల ప్రేక్షకులు సినిమా హాళ్ళకి దూరం కాలేదని
, వాళ్ళకి కావాల్సిన సినిమా వస్తే థియేటర్లలో పెద్ద తెరపై చూడడానికి క్రిక్కిరిసి పోతారనీ ఈ రెండు సినిమాలూ చెబుతున్నాయి. ప్రశ్నేమిటంటే, వాళ్ళకి కావాల్సిన సినిమా అంటే ఏది? ముందుగా ఎలా నిర్ణయించడం? నిర్ణయించి అలాటి సినిమా ఎలా తీయడం? గదర్ 2 ని సక్సెస్ ఫార్ములా ముందు నిర్ణయించి తీశారా? తీస్తే అంత అడ్డగోలుగా ఎందుకుంటుంది? పోనీ అడ్డగోలుగా తీస్తే సినిమా హిట్టవుతుందని నమ్మి తీయ వచ్చా? కాబట్టి ఇదంతా జూదం. అదృష్టం మీద ఆధారపడి వుంటుంది. మేకర్స్ చేయాల్సింది క్వాలిటీని అందించడమే. ఇది సులభం. ఎంత సులభమో ఓఎంజీ2 చెప్తోంది. గదర్ 2 జూదం. ఎప్పుడో గానీ జాక్ పాట్ కొట్టవు ఇలాటి సినిమాలు.  
       
హిందీలో ఈ రెండు సినిమాలే కాదు
, సౌత్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ కూడా ఓటీటీల వల్ల సినిమా హాళ్ళకి నష్టమన్న అభిప్రాయాన్ని తుడిచేసింది. 10 రోజుల్లో 500 కోట్ల థియేటర్ కలెక్షన్లతో విజయయాత్ర కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు దాటింది. క్వాలిటీ పరంగా ఇది గదర్ 2 కి పూర్తిగా భిన్నం. క్వాలిటీగా తీసిన మాస్ కమర్షియల్ ఇది. ఇందులో రజనీ పాత్ర రెగ్యులర్ ఫ్యాన్ ఎలిమెంట్స్ తో వుండదు. అయినా పంచ్ డైలాగులు, రోమాన్సులు, కామెడీలు, పాటలు, స్టెప్పులు, ఫైట్లు అని ఫ్యాన్స్ మడి గట్టుకుని కూర్చోకుండా భుజానెత్తుకున్నారు.
       
ప్రేక్షకులకి క్వాలిటీ వీక్షణానుభవమివ్వడానికి అనునిత్యం థియేటర్లు ఆధునిక సాంకేతిక ఆవిష్కణల్ని సమకూర్చుకుంటున్నాయి.
చాలా థియేటర్లు ఐమాక్స్, 4 డీ ఎక్స్ స్క్రీన్స్ తో మరింత లీనమయ్యే వీక్షణానుభవాన్ని అందిస్తున్నాయి. కానీ వీటిలో ప్రదర్శించే సినిమాలు మాత్రం పూర్ క్వాలిటీతో పేరు గొప్ప వూరు దిబ్బ అన్నట్టు థియేటర్ల పరువే  తీస్తున్నాయి.
       
ఓటీటీలతో సినిమా హాళ్ళకి ఎక్కడ సమస్య వస్తోందంటే
, సినిమాలు విడుదలైన నాల్గైదు వారాల్లో ఓటీటీల కిచ్చేస్తున్నారు. దీంతో పట్టుమని రెండు వారాలు హిట్టయిన సినిమాలు కూడా థియేటర్లలో ఆడడం లేదు. నాల్గు వారాల్లో ఓటీటీలో వస్తుంది కదాని ప్రేక్షకులు ఉపేక్షిస్తున్నారు. ఇది చాలనట్టు మీడియా ధోరణి కూడా వుంది. సినిమా విడుదలైన రోజునుంచే - ఈ సినిమా ఏ ఒటీటీలో? ఎప్పుడు వస్తుంది? ఇదిగో ఓటీటీ డేట్ ఫిక్స్- అంటూ అనాలోచితంగా పోటీలు పడి మీడియాలో రాతలు రాసేస్తున్నారు. సినిమా విడుదలైంది సినిమా హాళ్ళ కోసమా, ఓటీటీల కోసమా? ఈ సినిమా బ్రహ్మాండంగా వుంది వెళ్ళి థియేటర్లో చూడండని ప్రోత్సహించకుండా, థియేటర్లని దెబ్బ కొట్టేలా ఓటీటీ న్యూస్ ఇవ్వడమేమిటో వాళ్ళ ముతక జర్నలిజానికే తెలియాలి. ప్రేక్షకులకి జ్ఞాపకాల్ని మిగిల్చేవి సినిమా హాళ్ళే. ఓటీటీలు కాదు. నేటి హైటెక్ యూత్ కైనా రేపు ముసలి తనంలో ఫలానా సినిమా ఫలానా థియేటర్లో చూశాం కదాని ఆనాటి ముచ్చట్లు చెప్పుకునేలా చేసేవి థియేటర్లే!

—సికిందర్