రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

24, జనవరి 2018, బుధవారం

590 : స్ట్రక్చర్ సంగతులు -2

        స్ట్రక్చర్ తో ఏ ప్లే చేసినా అది పే చేయాలంటే ముందు మార్కెట్ యాస్పెక్ట్ కి సింహాసనం వేయాల్సిందే. మార్కెట్ యాస్పెక్ట్ తో చెలిమి చేయని క్రియేటివ్ యాస్పెక్ట్ ఫ్లాప్ మూవీ నిస్తుంది.  ఎలాగంటే, ‘మళ్ళీ రావా’ లో చిన్నప్పటి ప్రేమకథని మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులుగా చివరంటా చూపించుకుంటూ పోయారు. ఇది విసుగు తెప్పించే వ్యవహారం. మార్కెట్లో నిలబడదు. చిన్నప్పటి ప్రేమ ఒకే ఫ్లాష్ బ్యాకుగా చూపించి అవతల పడేస్తేనే  ఇప్పటి మార్కెట్లో తట్టుకుంటుంది. అసలా మాటకొస్తే చిన్నప్పటి ముచ్చట్లు ఇవాళ్టి మార్కెట్ కాదు. ఇవ్వాళ  ఫ్లాష్ బ్యాకులు కాదు, లైవ్ స్టోరీస్ కావాలి. రాంగోపాల్ వర్మ ఎలాటి ప్లేలు చేయకుండా, కనీసం ఫ్లాష్ బ్యాకుల జోలికి పోకుండా, స్ట్రక్చర్ (ABC) తో సాంప్రదాయ స్ట్రెయిట్ నేరేషన్ సినిమాలే ఎందుకు తీస్తూంటారో ఆలోచించాలి. ఎందుకంటే కథని అనుభవించడానికి అవాంతరాలు లేని క్యాజువాలిటీ (కాజ్ అండ్ ఎఫక్ట్) నిరంతరంగా, కళ్ళముందు  ఒకేసారి జరుగుతున్నట్టు టెన్షన్ తెగిపోకుండా  లైవ్ గా ప్రవహిస్తూంటుంది గనుక. ఇలాటి ABC సినిమాలతోనే చరిత్ర మొదలైంది, ఇలాటివే అత్యధికంగా వెలువడ్డాయి, వెలువడుతున్నాయి, వెలువడుతూ వుంటాయి...

         
కాబట్టి స్ట్రక్చర్ తో ప్లే చేయడానికి ఏ క్రియేటివిటీకి పాల్పడాలని ఉబలాటపడినా మొదట దానికి మార్కెట్ యాస్పెక్ట్  వుందా అని ఆలోచించాలి. ఈ క్రియేటివిటీని కూడా కమర్షియలేతర వరల్డ్ మూవీస్ నుంచో, ఆర్ట్ సినిమాల నుంచో, షార్ట్ ఫిలిమ్స్ నుంచో తీసుకుని పాల్పడ్డా బెడిసి కొడుతుంది.  కొన్ని వరల్డ్ మూవీ టెక్నిక్స్ కమర్షియల్ సినిమాలకి పనికొస్తాయి, కాదనలేం. అయితే పనికొస్తాయని హాలీవుడ్ తన ప్రయోగశాలలో నిగ్గు తేలిస్తేనే తెలుగులో చేపట్టాలి. హాలీవుడ్ పక్కా డబ్బుల కోసమే ఏ ప్రయోగమైనా చేస్తుంది. ఒకవైపు వరల్డ్ మూవీ టెక్నిక్స్ మీద కూడా కన్నేసి వుంచే హాలీవుడ్, వాటి కమర్షియల్ విలువ నిగ్గు తేల్చడానికి ప్రయోగ శాలలో పోస్ట్ మార్టం చేస్తూంటుంది. చాలా అరుదుగా వరల్డ్ మూవీ టెక్నిక్స్ కి డబ్బులొచ్చే కమర్షియల్ విలువలున్నాయని సర్టిఫై చేసి ఆ  మేరకు సినిమాలు తీస్తుంది. అలా  వచ్చిందే అకిరా కురసావా  తీసిన జపనీస్ క్లాసిక్ ‘రోషోమన్’ లోంచి, ఒకే సంఘటనకి భిన్న దృక్కోణాల కథనాలనే ‘రోషోమన్ ప్లే’, రష్యా నుంచి ‘ఫేబులా / సియోజై (Syuzhet) ప్లే’ వగైరా అతికొన్ని టెక్నిక్స్ ... కాబట్టి కమర్షియల్ సినిమాలకి  ప్రయోగాలు చేయాలనుకున్నప్పుడు హాలీవుడ్ సర్టిఫై చేసి వుండాలి - అప్పుడా ప్రయోగంతో డ్రంకెన్ డ్రైవింగ్ చేసినా దబాయించడానికి సర్టిఫికేట్ అంటూ వుంటుంది – ఎక్కడిదో అర్ధంగాని, రూపాయి బిళ్ళ రాని వరల్డ్ మూవీస్  సర్టిఫికేట్  మొహాన పడేస్తే, ప్రేక్షకులు అంత ఈజీగా క్షమించి వదలరు. 

          ఇక్కడో రెండు సందర్భాలు చెప్పుకోవాలి. ఒకసారి ఒక దర్శకుడు కొన్ని రోజులు సిటింగ్ వేశాడు. తనది రివర్స్ స్క్రీన్ ప్లే అన్నాడు. అంటే ఏమిటని అడిగితే,  వెనుకనుంచి కథ నడుస్తుందని అన్నాడు. వెనకనుంచి కథనడవడమంటే, బస్సు దిగిపోతున్న వాడు, రీలు వెనక్కి తిప్పితే వెనక్కి బస్సులోకి  వచ్చి పడే పద్ధతేనా అంటే, అలా వెనక్కి వెనక్కి కథ వెళ్తుందా అంటే, కాదన్నాడు. ఆయన చెప్పుకుపోతున్న థ్రిల్లర్ కథ సీన్లు పట్టుకోవడం కష్టమైంది. కథ ఆగడం,  వెనక్కి వెళ్ళడం, మళ్ళీ కథ ఆగడం,  వెనక్కి వెళ్ళడం ...ఇదే రివర్స్ స్క్రీన్ ప్లే అని తేల్చాడు. దీనికి రిఫరెన్స్ లేదన్నాడు. తన సొంత క్రియేటివిటీ అన్నాడు. నిజానికి అవన్నీ ఫ్లాష్ బ్యాకులే. ఏ పాత్రకి పడితే ఆ పాత్రకి స్ట్రక్చర్లో ఇమడని ఫ్లాష్ బ్యాకులు. రివర్స్ స్క్రీన్ ప్లే అని ఎక్కడా వినలేదనీ, రివర్స్ క్రోనాలజీ వుందనీ,  ఆ హాలీవుడ్ సినిమాలు చూద్దామనీ అంటే ఒప్పుకోలేదు. తను రాసిన వాటినే స్ట్రక్చర్లో పెట్టాలన్నాడు. సాధ్యంకాక వదిలేస్తే, తోచింది చేసుకుని సినిమా విడుదల చేస్తే, ఒకే ఒక్క మల్టీ ప్లెక్స్ లో ఒకే ఒక్క రోజు ఆడింది. దీంతో తను ఏం సాధించినట్టు? మార్కెట్ యాస్పెక్ట్ నిచ్చే స్ట్రక్చర్ కంటే,  ఏ ఆధారమూలేని, గాలిలో దీపం పెట్టినలాంటి తన సొంత క్రియేటివ్ యాస్పెక్టే ఎక్కువా? 

        ఒకసారి ఎల్బీ స్టేడియంలో హిందీ సంగీత దర్శకుడు విఖ్యాత రవి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రోగ్రాంలో,  రవి పాట పల్లవి నొకదాన్ని ఎస్పీ ప్రస్తావిం
చారు. మహేంద్ర కపూర్ పాడిన  ‘చలో ఇక్  బార్ ఫిర్సే,  అజ్నబీ బన్ జాయే హమ్  దోనో’  అని. ఈ పాట ఎప్పట్నించో తెలిసిందే. అర్ధం కూడా తెలిసిందే. కానీ ఎస్పీ చెబుతూంటే, ఇందులో స్టోరీ పాయింటు వుంది కదాని అప్పటిగ్గానీ తట్టలేదు! ‘మళ్ళీ మన మొకసారి అపరిచితులై పోదా’ మని ప్రేమికుడు పాడే ఈ పల్లవిలో కొత్త స్టోరీ పాయింటే వుంది. ప్రేమికులు కొంత కాలంపాటు  ప్రేమించుకున్నాక, మళ్ళీ అపరిచితులుగా మొదలై మళ్ళీ ప్రేమలో పడ్డంగా ఐడియా బ్రహ్మండంగానే వుంది క్రియేటివ్ యాస్పెక్ట్ కి. నిజానికి యువ ప్రేక్షకులకి కావాల్సింది ఇలాటి ప్రేమలో ప్రయోగాలే. అలా దీనికి మార్కెట్ యాస్పెక్ట్ కూడా కన్పిస్తోంది. కానీ ఈ ప్రయోగాన్ని తెరకెక్కించడమెలా? ప్రేమికులు జ్ఞాపకాల్ని తుడిచేసుకుని మళ్ళీ కొత్తగా ఎలా పరిచయమవుతారు? స్ట్రక్చర్లో బిగినింగ్ అంతా వాళ్ళ మొదటి ప్రేమని చూపించవచ్చు. ప్లాట్ పాయిట్ వన్ వచ్చేసరికి, ఓ సంఘటనతో వాళ్ళు మళ్ళీ  అపరిచుతులుగా మారిపోయి, మళ్ళీ ప్రేమని ప్రారంభించి చూద్దామని ‘గోల్’ పెట్టుకోవచ్చు. ఇక మిడిల్ అంతా  అపరిచితులుగా పరిచయమయ్యే స్ట్రగుల్, మళ్ళీ కొత్తగా ప్రేమ...అదెలాటి  ప్రేమవుతుందో, అప్పుడేమవుతుందో నన్న సస్పెన్స్ అంతా క్రియేట్ చేయవచ్చు. కానీ మళ్ళీ అదే మొదటి ప్రశ్న : ప్రేమికులు ఆ మొదటి పరిచయ జ్ఞాపకాల్ని, ఆ సాన్నిహిత్యాన్నీ  ఎలా తుడిచేసుకుని, మళ్ళీ  కొత్తగా మొదలవగల్గుతారు? యాక్సిడెంట్ తో పోయే జ్ఞాపక శక్తి కాదిక్కడ. ఇదైతే నమ్ముతారు ప్రేక్షకులు. కానప్పుడు జ్ఞాపకాల్ని తుడిచేసుకున్నారంటే నవ్విపోతారు. తుడిచేసుకున్నట్టు నాటకమాడుతున్నారని అట్టర్ ఫ్లాప్ చేస్తారు.

          పాటలో వున్న మూడు చరణాల్లో ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని చూస్తే, బ్రహ్మాండంగా వున్నాయి. నీ మీద నేనేం నమ్మకం పెట్టుకోకుండానే మళ్ళీ ప్రేమిస్తా, నువ్వుకూడా చూపులతో దొరికిపోకూడదు, నీతో తొలిసారిగా మాటాడేప్పుడు నాగుండె వేగం పెరగకుండా చూసుకుంటా, నువ్వు నీ కళ్ళ ల్లో గతం తాలూకు ఏ బాధా కన్పించనీయకూడదు...లాంటి భావాలున్నాయి. ఏదో తిప్పలుపడి  ఈ భావాల్ని తెరకెక్కించినా, ఇలాగే  కథ నడపినా, మళ్ళీ అదే మొదటి ప్రశ్న!  అసలు వీళ్ళు మొదటి పరిచయ జ్ఞాపకాల్ని  నామరూపాల్లేకుండా దులిపేసుకున్నారని నమ్మించాలిగా? స్ట్రక్చర్లో  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఇది నమ్మించలేక పోతే  స్ట్రక్చరల్ గా ఈ క్రియేటివ్ ఆలోచన పనికి రాదు. సినిమాలో ఈ పాట నేపధ్యంలో ప్రేమికులు విడిపోతారు. కాబట్టి జరిగిన బాధాకర విషయాలు మర్చిపోయి, మళ్ళీ పరిచయమవుదామని ప్రేమికుడు ప్రతిపాదిస్తున్నాడు. ఇందులో అర్ధముంది. అలాగే ఆమె అతను చేసిన తప్పులు మర్చిపోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ హేపీగా వున్న  ప్రేమికులు, సరదాకి – ఈ ప్రేమ జ్ఞాపకాల్ని తుడిచేసుకుని, థ్రిల్లింగ్ గా మళ్ళీ పరిచయమై చూద్దామని ప్రయోగం చేయాలనుకోవడం పూర్తిగా వేరు. దీన్నెవరూ నమ్మలేరు. దీన్ని  అప్పుడప్పుడు కొందరితో చర్చించి చూసినా అసాధ్యమనే జవాబే వచ్చింది. అంటే మార్కెట్ యాస్పెక్ట్ వున్నప్పటికీ,  దాంతో కలిసిపోయే క్రియేటివ్ యాస్పెక్ట్  లేని ఐడియా, దాని  తాలూకు ప్లే  పనికి రావన్న మాట. 

          కాబట్టి స్ట్రక్చరాస్యతని కలిగి వుండడంతో బాటు, మార్కెట్ యాస్పెక్ట్ వున్న ప్లేకి క్రియేటివ్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ వున్న ప్లేకి మార్కెట్ యాస్పెక్ట్ కూడా వున్నప్పుడే ఏ ప్లే అయినా పే చేస్తుంది. ఈ స్పృహ వుండడం ఈ ప్లేలు చేయడానికి ప్రధాన అర్హతలు. ఇప్పుడు ఒక్కో ప్లే సంగతులు చూద్దాం...

          1.నాన్ లీనియర్ :  అంటే ఫ్లాష్ బ్యాక్ పధ్ధతి.  బిగినింగ్ (A) - మిడిల్ (B) - ఎండ్ (C) వరసక్రమంలో వుండని విభాగాల జంబ్లింగ్ అన్నమాట. ఫ్లాష్ బ్యాక్స్ తో కథ చెప్పే సినిమాల ప్లే ఇదే. B తో ప్రారంభమై, A తో కొనసాగి,  B కి వచ్చి, C తో ముగిసే కథలు. తెలుగు ‘ఖైదీ’ మంచి ఉదాహరణ. డన్ కర్క్, పల్ప్ ఫిక్షన్లు కొన్ని హాలీవుడ్ ఉదాహరణలు. తమిళ డబ్బింగ్ బాషా, తెలుగులో  వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలూ ఈ ప్లేతోనే వుంటాయి. మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాక్ కథలు కూడా ఈ ప్లేలోకే వస్తాయి. ఇంతవరకే, ఇంతకి మించి ఇంకేవీ ఫ్లాష్ బ్యాకులు కావు. ఒకే ఫ్లాష్ బ్యాక్, లేదా కొన్ని విడతలుగా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులూ అనే ప్లేలు రెండు మాత్రమే నాన్ లీనియర్ కింది కొస్తాయి. ఇవి ముఖ్యంగా ఒక పాత్ర స్వగతంగానో, ఇంకోపాత్ర చెప్పే వృత్తాంతంగానో, లేదా దర్శకుడి దృక్కోణంగానో వుంటాయి. ఇంకా మల్టీ లేయర్ ఫ్లాష్ బ్యాకులుంటాయి. అంటే ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాక్ (హిందీ ‘గ్యాంగ్ స్టర్’). ఇది కూడా కమర్షియల్ గా ప్రయత్నించవచ్చు. అయితే ఏ ఫ్లాష్ బ్యాక్ అయినా ప్రధాన కథ అవదని గుర్తించాలి. ప్రధానకథ  లేకపోతే ఫ్లాష్ బ్యాక్ లేదు. ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రధాన కథ ఏదైనా సందర్భంలో డిమాండ్ చేసే గతం తాలూకు సమాచారాన్ని అందించే వనరు మాత్రమే. ఫ్లాష్ బ్యాక్ అనేది గతం తాలూకు స్మృతులే తప్ప కథకాదు. ఈ స్మృతుల్లోంచి తగిన  సమాచారం అందగానే ప్రధాన  కథ ఎదుట వుండే ప్రశ్న – ఐతే ఇప్పుడేంటి? అని. ఫ్లాష్ బ్యాకుల్లోని సంగతుల్ని పరిష్కరించేదే ప్రధాన కథ. కాబట్టి ఐతే ఇప్పుడేంటి?  అన్న ప్రశ్న ప్రేక్షకులకి ఇంపార్టెంట్ కానీ ఫ్లాష్ బ్యాకుల్లో ఎంత సమాచారమూ కాదు, ఎన్ని స్మృతులూ కావు. కాబట్టి వీలయినంత క్లుప్తంగా ఫ్లాష్ బ్యాకుని ముగించి ప్రధాన కథలో టని తాలూకు ప్రశ్నని పరిష్కరించడం మీద దృష్టి పెట్టినప్పుడే, ప్లాట్ పాయింట్స్ అన్నీ ప్రధాన కథకి వున్నప్పుడే ఆ ప్రధాన కథా,  ఫ్లాష్ బ్యాకులూ సక్సెస్ అవుతాయి. 

         ఇలాకాక, ‘మళ్ళీ రావా’ లో ప్రధానకథకి చెరోపక్క చప్రాసీల్లాగా రెండు వేర్వేరు కాలాల్లో జరిగే మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులుంటాయి. విడివిడిగా చూస్తే, చిన్నప్పటి ఫ్లాష్ బ్యాకులు, పెద్దయ్యాక ఫ్లాష్ బ్యాకులుగా మొత్తం కలిపి ఫ్లాష్ బ్యాకుల సినిమా అనే అన్పిస్తుంది. కానీ  కాదు. భిన్నకాలాల కథలు ప్రధాన కథతో సమాంతరంగా నడుస్తున్నాయి కాబట్టి,  ఇది వేరే ‘మల్టిపుల్ టైం లైన్’  ప్లే అవుతుందే తప్ప, నాన్ లీనియర్ ప్లేలో ఫ్లాష్ బ్యాక్  అవదు.  ఈ తేడా దృష్టిలో పెట్టుకుంటే స్ట్రక్చర్ కి న్యాయం చేయగల్గుతారు. ఇలాగే ఒకే సంఘటన గురించి  కొన్ని పాత్రలు వాటి వాటి దృక్కోణాల్లో చెప్పే కథనాలు ఫ్లాష్ బ్యాకులే అయినప్పటికీ, దీన్ని వేరే ‘రోషోమన్’ ప్లేగా గుర్తించినప్పుడే స్ట్రక్చర్ కి న్యాయం చేయగల్గుతారు.
          నాన్ లీనియర్ ప్లేతో విభేదించే,  హైపర్ లింక్ ప్లే, ఫేబులా / సియోజై ప్లే కూడా ఫ్లాష్ బ్యాక్స్ తోనే వున్నప్పటికీ, వాటిని ఉపయోగించే విధానంలో తేడాల వల్ల అవి నాన్ లీనియర్ కిందికి రావు. వీటన్నిటినీ గురించి తర్వాత కింద తెలుసుకుందాం. 

         
2. రియల్ టైం : ఇప్పటికప్పుడు మన కళ్ళ ముందు లైవ్ గా  జరుగుతున్నట్టుండే కథలివి.  ఇదెలా  వుంటుందంటే, ఉదాహరణకి ‘గరుడవేగ’  ఫస్టాఫ్ లో ఒక ఎపిసోడ్ వుంటుంది – దుండగులు బాంబులు అమర్చిన ప్రదేశాన్ని మూడు గంటల్లోగా  కనుక్కుని పేలకుండా చేయాల్సిన అత్యవసర పరిస్థితి. ఈ మూడు గంటల టైం లైన్లోనే  వేగంగా ఏకత్రాటిపై సీన్లు పరిగెడతాయి. ఇంటర్వెల్ కల్లా కొలిక్కొస్తాయి. ఇది ప్రధాన కథలో ఒక ఎపిసోడ్ మాత్రమే. ఇదే ఉదాహరణని పూర్తి నిడివి ప్రధాన కథకి అన్వయిస్తే – రియల్ టైం ప్లే అవుతుంది. ‘గరుడవేగ’ లో వున్నట్టు ఒక ఎపిసోడ్ ఈ ప్లేతో వున్నా, మొత్తం ఈ సినిమా రియల్ టైం ప్లే కిందికి రాదు. ఆద్యంతం ‘ఒక టైం లైన్ ప్రకటించిన’ కథలే రియల్ టైం ప్లే అవుతాయి. ఇవి టైం లాక్ తో వుంటాయి. టైం లాక్ వల్లే ఫలానా కార్యం ఆ గడువులోగా సాధించాలన్న గోల్ ఏర్పడుతుంది. అయితే ఆద్యంతం అంటే కథ ప్రారంభమైనప్పటి నుంచి. అంతే గానీ బిగినింగ్ నుంచే ఈ ప్లే వుండదు. బిగినింగ్  ముగిసి సమస్య అర్ధమై, గోల్ ఏర్పడిన ప్లాట్ పాయింట్ వన్ వచ్చినప్పుడే,  కథ ప్రారంభమవుతుంది కాబట్టి- అక్కడ్నించీ మిడిల్, ఎండ్ ఈ ప్లేతో  వుంటాయి. 

       ఇలాకాక ‘భలే మంచి రోజు’ లాంటి సినిమాల్లో కథ ఒకరోజులో ముగిసిన దేనికి ముందే ప్రకటించిన టైం లాక్ లేదు కాబట్టి ఇది రియల్ టైం ప్లే కిందికి రాదు. టైం లిమిట్ చెప్పకుండా ప్రారంభమయ్యే ప్లేలు రియల్ టైం లోకి రావు. ఒక గడువు చెప్పి టైం లాక్ చేసిన ప్లేలే రియల్ టైంలో లైవ్ చూస్తున్న అనుభవాన్నిస్తాయి. దీనికి  రెండు హాలీవుడ్ ఉదాహరణలు : ‘నిక్ ఆఫ్ ది టైమ్’, ‘హై నూన్’ రియల్ టైం ప్లేలో ఫ్లాష్ బ్యాకులకి ఎత్తి అవకాశమూ లేదు. టైం జంపులకి కూడా ఆస్కారం లేదు. సీదా సాదా ABC స్ట్రక్చర్లో వుంటాయి.
(మిగిలిన ప్లేలు రేపు)

సికిందర్