రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, మార్చి 2022, ఆదివారం

1147 : స్క్రీన్ ప్లే సంగతులు

స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే 36 ఏళ్ళు పడుతుందేమోనని, వచ్చే తరాలు చదువుకునే ప్రాచీన గ్రంథ కోశం అవుతుందేమోననీ భయపడాల్సి వచ్చింది. కథ రాయడానికి దర్శకుడికే 18 ఏళ్ళు పట్టినప్పుడు దాన్ని పరామర్శించడానికి 36 ఏళ్ళు పట్టడంలో ఆశ్చర్యం లేదు. కారణం,   స్క్రీన్ ప్లే సంగతులు ఎలా రాయాలో అంతు చిక్కకపోవడం. జాతీయ మీడియాలో వెలువడిన కొన్ని రివ్యూల్లో   సినిమా కథ అర్ధమవడం కష్టమై పోయిందన్నారు. అసలు  రాధేశ్యామ్ టైటిల్ తో కథకేం సంబంధమో తెలియలేదన్నారు. ఇంత ప్రతిష్టాత్మక పానిండియా మూవీకి ప్రముఖ జాతీయ డిజిటల్ మీడియా, పెద్ద పత్రికలూ కలిసి నిర్మొహమాటంగా 1, 1.5 రేటింగ్స్ మాత్రమే ఇచ్చాయంటే షాకింగ్ గానే వుంటుంది. దీనికి దర్శకుణ్ణి ఒక్కణ్ణే బాధ్యుణ్ణి చేయనవసరం లేదు. కథ అంతిమ రూపం తీసుకునే వరకూ ఎందరి జోక్యాలు, జోస్యాలు వుంటాయో తెలియనిది కాదు. ఈ కథతో ప్రధాన సమస్య ఏమిటంటే, ఇది కథ కాకుండా గాథ కావడం! తయారు చేసుకునే కథలన్నీ కథలే అనుకోవడంతో, వాటిలో మాటువేసి వుండే గాథల్ని కథల్లాగే ట్రీట్ చేయడం వల్ల ఇలా మొదటికే మోసం వస్తోంది.  

        దీంతో రాధేశ్యామ్ స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే విషయాన్ని సమూలంగా గాథలా మార్చి రాస్తూ వివరించాల్సిందే. ఇలా చేస్తే చదవడానికి భారమైపోతుంది. కనక సంక్షిప్తంగా ఆపేరేటింగ్ టూల్స్ మాత్రమే చూద్దాం : 1. రోమాన్స్ లో ఇది రోమాంటిక్ కామెడీ కాదు, రోమాంటిక్ డ్రామా జానర్. 2. రోమాంటిక్ డ్రామాల్లో హీరో హీరోయిన్లవి పాసివ్ పాత్రలై వుంటాయి, 3. రోమాంటిక్ డ్రామాలు గాథల తరగతికి చెందుతాయి, 4. గాథ ఐడియా లేదా కాన్సెప్ట్ విషయ గాంభీర్యంతో వుంటుంది, 5. గాథ కూడా త్రీయాక్ట్స్ స్ట్రక్చర్లో వుంటుంది, 6. గాథ ముగింపు విషాదాంత మవచ్చు, లేదా సుఖాంత మవచ్చు.

ముందుగా కాన్సెప్ట్ సంగతి
మన రాత మన చేతుల్లో వుండదని, చేతల్లోనే వుంటుందనీ చెప్పడం కాన్సెప్ట్. ప్రభాస్ ప్రేమించిన పూజా ప్రాణాపాయంలో వుంటుంది. ఇది విధి రాత అనుకుని సరెండర్ అవకుండా, పొరాడి విధిని జయించాలని కాన్సెప్ట్ అనుకుని కథనం చేశారు. ఈ కాన్సెప్ట్ తప్పయితే, దీనికేం చేశారంటే- ఈ కాన్సెప్ట్ కి జ్యోతిషం వర్సెస్ సైన్సు పోరాటమని ఇంకో కాన్సెప్ట్ జోడించారు. ఈ కాన్సెప్ట్ కూడా తప్పే. అసలు రెండు వేర్వేరు కాన్సెప్ట్స్ తో ఒక గాథ ఎలా వుంటుంది. కథ కూడా వుండదు. అలాటిది రెండూ తప్పుడు కాన్సెప్టులే జత కలిస్తే గాథ పరిస్థితేంటి?

        ఈ జ్యోతిషానికీ సైన్సుకీ పోరాటమనే రెండో కాన్సెప్ట్ తో, జ్యోతిష గురువుగా కృష్ణం రాజు వచ్చేసి, ఒరిజినల్ కాన్సెప్ట్ లో జోక్యం చేసుకుంటూ వుండడంతో, అసలేం గాథ చెప్తున్నారో అర్ధంగాని గందరగోళం నెలకొంది.

        ఈ జ్యోతిషం వర్సెస్ సైన్స్ రెండో కాన్సెప్టులో సైన్స్ కంటే జ్యోతిషం గొప్పదని నిరూపించడం ఉద్దేశం. ఇదే పాయింటు కృష్ణం రాజు శిష్యుడైన ప్రభాస్ కూడా లేవదీస్తూ డాక్టర్ తో ఘర్షణకి దిగుతాడు. ఆ డాక్టర్ కూడా అర్ధం లేకుండా వాదిస్తాడు. ఒక పక్క పూజా నయం కాని క్యాన్సర్ తో వుంది, ఇంకో రెండు మూడు నెలల్లో చనిపోతుందని డాక్టర్ అంటాడు. ఇంతకి ముందు ఆమె హస్త రేఖల్లో ప్రభాస్ దీర్ఘాయుష్షు చూశాడు కాబట్టి ఆమె చనిపోదని, బ్రతుకుంటుందనీ వాదిస్తాడు.      

        ప్రభాస్ జోస్యం సంగతెలా వున్నా, వైద్యపరంగా ఆలోచిస్తే ఆమె బ్రతుకుతుందని ప్రభాస్ అనడం పాజిటివ్ విజనేగా? రోగికి నువ్వు బ్రతుకుతావని ఆత్మవిశ్వాసం కల్పించడం నెగెటివ్ విజన్ ఎలా అవుతుంది. కౌన్సెలింగ్ గాక మూఢత్వ మెలా అవుతుంది. ఇక్కడ జ్యోతిషం వచ్చేసి సైన్స్ కెక్కడ అడ్డు పడింది. నీ జ్యోతిషంతో రోగికి మోసం చేస్తున్నావని డాక్టర్ అనడమేమిటి? ప్రభాస్ బ్రతుకుతుందని జోస్యం మాత్రమే చెప్పాడు- చెప్పి, ఈ రోగానికి మందులు అక్కర్లేదనీ, ఉంగరాలూ తాయెత్తులూ కడతాననీ అనలేదే? డాక్టర్ ఎందుకలా రెచ్చిపోవడం.

కాన్ఫ్లిక్ట్ సంగతి

కాబట్టి ఇలా ఈ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సెకండాఫ్ గాథని ఇలాగైనా నడిపించగల కాన్ఫ్లిక్ట్ లో కామన్ సెన్స్ లోపించడంతో - జ్యోతిషం వర్సెస్ సైన్స్ రెండో కాన్సెప్ట్ పూర్తిగా విఫలమైంది. మళ్ళీ ప్రభాస్ ఈ కాన్సెప్ట్ మీంచి ఒరిజినల్ కాన్సెప్ట్ కొచ్చి - ఇది విధికీ ప్రేమకూ మధ్య యుద్ధమని ఫైనల్ గా తేలుస్తాడు ఇంటర్వెల్లో! విధికీ ప్రేమకూ యుద్ధం కూడా ఎలా అయింది? పూజా హస్త రేఖలు బాగానే వున్నాయే దీర్ఘాయుష్షుని  సూచిస్తూ? ఆమె జీవిత రేఖ సరిగా లేకుండా, దీనికి అనుగుణంగానే  క్యాన్సర్ వచ్చుంటే, డాక్టర్ చెప్పినట్టు రెండు మూడు నెలలే బ్రతుకుతుందనుకుంటే- అప్పుడు ఈ విధిని ఎదిరించడానికి ప్రేమకూ విధికీ యుద్ధమని అంటే అర్ధముంటుంది గాని!

        అంటే ఆమెకి దీర్ఘాయుష్షు వుందని ప్రభాస్ చెప్పిన జోస్యం తప్పని తేలిందన్న మాట. వెనుక సీన్లో ఆమె చేయిచూసి అద్భుత భవిష్యత్తు వుందని చెప్తున్నప్పుడు, ఆమె ముక్కులోంచి రక్తపు చుక్క  అదే అరచేతిలో రాలి అప్పుడే పడుతుంది క్యాన్సర్ అన్నట్టుగా. ఇలా ఆ క్షణంలోనే అతడి జోస్యం తప్పని తేలిపోలేదా? ఆమె జీవితరేఖని ఆటంకపర్చే ఈ ప్రాణాంతక అనారోగ్యాన్ని చూడకుండా సంపూర్ణ ఆయుష్షని ఎలా అంటాడు?

        దీనికంటే వెనుక సీన్లో- రైల్లో ప్రయాణికులు చేతులు చాపి జాతకాలు చెప్పమన్నప్పుడు, ఆ చేతుల్లోకి చూస్తూ అంత మందికి చెప్పలేక, రైలు దిగి వెళ్ళిపోతాడు. రైలు వెళ్ళిపోతుంది. వెంటనే ప్రమాదం పసిగడతాడు. తను చూసిన హస్త రేఖల్లో వాళ్ళకి మృత్యువే పొంచి వుందని ఇక రైలాపడానికి పరుగు దీస్తాడు. రైలు యాక్సిడెంట్ అయి వాళ్ళంతా చనిపోతారు. ఇలా తన జోస్యం నిజమైంది. మరి ఇదే జ్యోతిష పాండిత్యంతో పూజా చేతి గీతల్లో క్యాన్సర్ ని - మృత్యువుని ఎందుకు చూడలేకపోయాడు.

     కాబట్టి పూజా జాతకరీత్యా విధికీ ప్రేమకూ యుద్ధం కాన్సెప్ట్ కూడా కాలేదిది. అసలు సంగతేమిటంటే, తన చేతిలోనే పెళ్ళి రేఖ లేదని ప్రభాస్ కి తెలుసు. దీంతో ఈ విధినెదిరించాలని ఎప్పుడూ అనుకోలేదు. విధి దాకా ఎందుకు, ఒక ప్రసిద్ధ పామిస్టుగా తన సమస్యని తానే పరిష్కరించుకో లేనప్పుడు ఇతరుల సమస్యల్నేం పరిష్కరిస్తాడు. భవిష్యత్తుని మార్చుకునే అవకాశం వుందని జ్యోతిష శాస్త్రం చెప్పడం లేదా? ఇది తెలియనట్టు కామన్ మాన్ లాగా బిహేవ్ చేయడమేమిటి.

ప్రభాస్ సంగతి

    ఇలా తనకి పెళ్ళి యోగం లేదనుకుంటున్నాడు గనుక, అమ్మాయిల్ని భ్రమల్లో పెట్టి కోరికలు తీర్చుకుని వదిలేస్తూ వుంటాడు. ఇది చాలా బ్యాడ్ క్యారక్టర్ ప్రభాస్ కి. ఇంతకంటే డ్యామేజ్ ఏం కావాలి గాథకి. పూజాని చూశాక ప్రేమలో పడతాడు. ఇప్పుడామెని పెళ్ళి చేసుకోవాలంటే తన పెళ్ళి రేఖే అడ్డు. అటువంటప్పుడు ఇప్పుడైనా ఒక గొప్ప హస్త సాముద్రికుడుగా తన సమస్యని పరిష్కరించుకోక, ఏదో విధి అంటూ పూజాకి ముడిపెట్టి ప్రేమ పోరాటమనడ మేమిటి?

        పూజా అనారోగ్యం విషయమే చూస్తే, స్పిరిచ్యువల్ గురువులే (బ్రహ్మకుమారి శివానీ, జగ్గీ వాసుదేవ్) ఏమంటారు. చాలా అనారోగ్యాలు ఆలోచనా తీరు మార్చుకుంటే నయమవుతా యంటారు. కానీ ప్రాణాంతక రోగాలు ఆలోచనా తీరు మార్చుకుంటేనో, దైవ ప్రార్ధనలు చేస్తేనో నయం కావంటారు. కాబట్టి ఈ ప్రయోగాలు మాని వైద్యం చేయించుకో మంటారు. అందుకని ప్రభాస్ ఆమె క్యాన్సర్ సంగతి డాక్టర్ కి వదిలేయాలి. ఆమెకి విధియే చుట్టుముట్టిందని అనుకుంటే, వైద్య సాయంతోనే ఆ విధితో పోరాడాలి తప్ప మాయలు మంత్రాలతో కాదు. కనుక ఆమెని డాక్టర్ కి వదిలేసి, తన చేతి రాతేంటో దాని సంగతి చూసుకోవాలి.     

            విధి అనే భావజాలం ముసుగేసిన దేవుడి బాక్సాఫీసు ఫార్ములాగా సినిమాలకి బాగానే సక్సెస్ నిస్తోంది. అయితే అసలు విధి అంటే ఏమిటి? మన పాత కర్మలే తిరిగి మన ముందుకొచ్చి సైల్యూట్ కొట్టడం. చేసింది మంచి కర్మలైతే మంచి రోజుల్ని విధి గిఫ్ట్ గా ఇచ్చేస్తుంది. చేసినవి చెడు కర్మలైతే చెప్పుల దండ మెళ్ళో వేసి వెళ్ళి పోతుంది. ఈ పని చేసేది పైన కూర్చుని ఎవరో కాదు. విధి, విధాత మనమే. ఉద్ధరించుకునేదీ, వాటం చూసి  వధించుకునేదీ మనమే. చెడు రోజులొస్తే, చేసిన చెడు కర్మల్ని మించేలా మంచి కర్మలు చేసినప్పుడు-  మంచి రోజులొచ్చేస్తాయి. ఇంతే, ఇంతకంటే రాకెట్ సైన్స్ లేదు. కర్మల బ్యాలెన్సింగే జీవితం.

        మన రాత మన చేతుల్లో వుండదని, చేతల్లోనే వుంటుందనీ చెప్పడమే రాధేశ్యామ్ కాన్సెప్ట్ అయితే, ప్రభాస్ ఎక్కడా తన విషయంలో గానీ, పూజా విషయంలో గానీ చేతల్లోకి దిగడు! ఈ లోగా డాక్టరే ప్రకటిస్తాడు క్యాన్సర్ కి మందు వచ్చిందని! అంటే సైన్సే  గెలిచిందా? ఇంత గందరగోళంగా వుంటే ఎలా!

        ఇలా రెండు లోపభూయిష్ఠ కాన్సెప్టుల్ని కాక్ టైల్ చేస్తూ ఒక ఒరలో ఇమిడ్చినప్పుడు, ఆ ఐడియా దశలోనే ఫ్లాప్ ని పసిగట్టి వుండాలి, ఐడియాని విస్తరించి గాథ చేసుకునే దాకా ఎందుకు. బ్రహ్మోత్సవం చూడలేదా? ఇలాటిదే. ఈ నిర్మాణం లేని ఐడియాతో గాథ చేసిన విధానానిక్కూడా అదృష్ట రేఖల్లేవు. ఇందులోకి వెళ్ళడం ఆపుదాం. ఇప్పటికే హెవీ అయివుంటుంది. ఇక్కడితో ఆపి, రేపు కథా (గాథా) కథనాల స్క్రీన్ ప్లే సంగతులు చూద్దాం. అది తేలికగా, సరదాగా వుంటుంది.

—సికిందర్