రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, February 5, 2022

1126 : రివ్యూ


 

రచన - దర్శకత్వం: సుధీర్ రాజు
తారాగణం : శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, చంద్రమోహన్, సుధ, హేమ, మురళీ శర్మ, పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్,  సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ తదితరులు
మాటలు: విక్రమ్ రాజ్
, స్వామి మండేలా, సంగీతం: సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం : బుజ్జి
నిర్మాతలు: ఏ.ఎస్.కిషోర్,  కొలన్ వెంకటేష్
***

            1991 నుంచీ 120 కి పైగా సినిమాలు నటించి ఫ్యామిలీ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ 2022 లో హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ ప్రయోగం చేశారు. పాత ఫ్యామిలీ సినిమాల హీరో అయిన తను, ఈ మధ్య విలన్ పాత్రలేస్తూ అఖండలో కూడా కన్పించారు. ఇప్పుడు పాత ఫ్యామిలీ సినిమా హీరోగా పాత టైటిల్ కోతల రాయుడు తో, పాత ఫ్యామిలీ సినిమా నటిస్తూ, కొత్త ప్రేక్షకుల మీద పాత ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం చేసిన కొత్త దర్శకుడు, నిర్మాతలు బహుశా పాత కాలం లోంచి వచ్చారు. అందరూ పాత కాలం లొంచే వస్తారు, కానీ పాతగానే వుండిపోరు. శ్రీకాంత్ సహా దర్శకుడు నిర్మాతలూ పాతగానే వుంటూ పాతదనంతో మక్కువ తీర్చుకున్నారు. ఈ మక్కువ ఎలా వుందో చూద్దాం...

కథ
    ఓ ట్రావెల్ కంపెనీలో మేనేజర్ గా పని చేసే అజయ్ (శ్రీకాంత్) విలాసవంతమైన జీవితం గడుపుతూంటాడు. కోతలు కొస్తూ డబ్బు సంపాదిస్తూ, విచ్చల విడిగా ఖర్చు పెట్టేస్తూంటాడు. ఇలాటి వాడు బాగా డబ్బున్న ధనలక్ష్మి(నటాషా దోషి) ని ప్రేమిస్తాడు. పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. నిశ్చితార్ధం కూడా జరుగుతుంది. ఇంతలో నిశ్చితార్ధం క్యాన్సిల్ అవుతుంది. ఇక సంధ్య (డింపుల్) అనే ఇంకో అమ్మాయిని ని ప్రేమిస్తాడు. కానీ అసలు ధనలక్ష్మితో నిశ్చితార్ధం ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? మరి సంధ్యని పెళ్ళి చేసుకున్నాడా? ఈ క్రమంలో ఎదురైన అనుభవాలేమిటి? సమస్యలేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    ఇది కథయితేగా ఎలావుందో చెప్పుకోవడానికి. కోతల రాయుడు పని కోతల రాయుడు పాత్ర చేయకుండా, కథకుడే కోతల రాయుడైతే ఎలా వుంటుందనడానికి శాంపిల్ ఈ సినిమా కథ. కథకుడు కథ వదిలేసి చాలా కోతలు కోశాడు. కథతో సంబంధంలేని కామెడీలు చేశాడు. డ్రామాలు చేశాడు. అసలు ధన లక్ష్మితో నిశ్చితార్ధం ఎందుకు క్యాన్సిల్ అయిందో, ఈ సమస్యేంటో, పరిష్కారమేంటో చెప్పకుండా, ఏవేవో కోతలు సొరకాయల్లా తెగ కోస్తూ ఇదే కథ అనుకున్నాడు. పాతకాలంలో ఇలా వున్నాయా కథలు? పాత కాలపు కథకుడికి మతి మరుపు కూడా వున్నట్టుంది. కథలెలా వుంటాయో మర్చిపోయి, తలా తోకాలేని కథ పట్టుకుని, కోతల రాయుడులా తెలివైన కొత్త ప్రేక్షకుల మధ్యకి వచ్చాడు.

నటనలు- సాంకేతికాలు

    ఫ్యామిలీ సినిమాల హీరోగా శ్రీకాంత్ మరోసారి వెండి తెరమీద ఈ సినిమాతో ప్రకాశించాడు. ఈ ప్రకాశం వేషం, స్టయిలింగ్, నటనల వరకే. పాత్ర గురించీ, పాత్రకున్న కథ గురించీ చెప్పుకోకూడదు. ఇలా పాత శ్రీకాంత్ ని గుర్తుకు తెచ్చినప్పుడు, గుర్తుండే విషయంతో కూడా రావాలని ఎందుకు గుర్తుపెట్టుకో లేదో మరి. ఎలాపడితే అలా సినిమాలు ఒప్పుకుని నిర్మాతలు నష్టపోవడానికి కారకుడు కాకూడదని జాగ్రత్తలు తీసుకునే తను,  ఈసారి ఎలా మోసపోయాడో తెలీదు. ఇలా హీరోగా ప్రయోగాలు చేసేకన్నా విలన్ గా స్థిరపడితే మేలు.

        హీరోయిన్లు నటాషా, డింపుల్ లు గ్లామర్ ని బాగానే ఆరబోశారు. ముక్కలు ముక్కలుగా వున్న కథని  గ్లామర్ తో కవర్ చేయడానికి శ్రమిస్తున్నట్టు కసరత్తులన్నీ చేశారు. ఎన్ని కసరత్తులు చేసినా ఫలితం లేకుండాపోయింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, హేమ కలిసి ఒక కామెడీ ఎపిసోడ్ వేసుకున్నారు. కథతో సంబంధం లేకుండా జబర్దస్తీగా ఒక కామెడీ షో. పోసాని, మురళి శర్మలు కథ లేని సినిమాకి విషయంలేని పాత్రలు. ఇంకా చాలా మంది నటీనటులూ వాళ్ళ పాత్రలూ వున్నాయి నిండైన కుటుంబ సినిమా అన్పించుకోవడానికి.

        కొత్త దర్శకుడు సుధీర్ రాజుకి కథాకథనాలూ దర్శకత్వమూ ఏదీ సాధ్యం కాలేదు. సినిమా పేరుతో ప్రేక్షకుల నెత్తిన ఓ తమాషాని రుద్ది చేతులు దులుపుకున్నాడు. పూర్తిగా లేని కథ, కథతో సంబంధంలేని, లాజిక్ లేని సీన్లు, పాత్రలు, కామెడీలూ ... ఇలా ప్రతి నిమిషమూ ప్రేక్షకుల్ని ముళ్ళ మీద కూర్చోబెట్టి ఆనందం తీర్చుకున్నాడు. దీని పాటల చిత్రీకరణ కోసం సిక్కిం కూడా వెళ్ళాడు. సునీల్ కశ్యప్ తో పాటలు మాత్రం సరిగ్గానే చేయించుకున్నాడు. కెమెరామాన్ బుజ్జి నుంచి కూడా టాలెంట్ ని పిండుకున్నాడు. పిండడానికి తనదగ్గరే ఏమీ లేకుండా పోయింది.

—సికిందర్