రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, February 3, 2018

598 : రివ్యూ!




రచన - దర్శకత్వం: వెంకీ కె.
తారాగణం : నాగశౌర్య,  రశ్మిక,  నరేష్,  వెన్నెల కిషోర్, సత్య, వైవా హర్ష, పోసాని కృష్ణమురళి తదితరులు.
సంగీతం: మహతీ స్వర సాగర్, ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్   బ్యానర్‌: ఐరా క్రియేషన్స్ 
నిర్మాత: ఉషా ముల్పూరి
విడుదల :  ఫిబ్రవరి 2, 2018
***
      లవర్ బాయ్ హీరో నాగశౌర్య కొత్త దర్శకుడితో మరో కొత్త ప్రయత్నంగా విజయాన్ని కాంక్షిస్తూ వచ్చాడు. కొంత కాలంగా ప్రచారంలో వుంటూ ఆసక్తి రేపుతున్న ‘ఛలో’ తో అనిల్ కపూర్ ‘సాహెబ్’ లాగా, చిరంజీవి ‘విజేత’ లాగా ఎక్కడికో బయల్దేరినట్టు డఫెల్ బ్యాగు తగిలించుకుని విచ్చేశాడు. ఎక్కడికి బయల్దేరినా చేరాల్సింది తను కోరుకుంటున్న ఒక్క హిట్టు గట్టుకే. మరి ఆ డఫెల్ బ్యాగులో  హిట్టుకి తగ్గ ట్రావెల్ సరంజామా అంతా వుందా, లేక ఉత్తి బ్యాగేనా అది? ఆర్ట్ డైరెక్టర్ ఉత్తి బ్యాగే ఇస్తాడని మనకి తెలుసు. అందులో తన ఆలోచనలు, కొత్త దర్శకుడి  ఆలోచనలూ వుండాలిగా? అవి వున్నాయా? వుంటే ఏ మేరకున్నాయి? ఎంతవరకూ ప్రేక్షకుల్ని అలరించడానికి సరి తూగుతున్నాయి? ప్రేక్షకులు అలక పాన్పెక్కకుండా ఎంతవరకూ కాపాడుతున్నాయి?...ఒకసారి ఈ కింద టూరేసి చూద్దాం...

కథ 
      హరి (నాగశౌర్య) కి చిన్నప్పట్నుంచీ ఎవరైనా గొడవలు పడుతూంటే చూసి ఎంజాయ్ చేయడం అలవాటు. నాల్గు తన్ని తన్నించుకోవడంలో ఆనందం.  ఇది భరించలేక తండ్రి (నరేష్) ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఆంధ్రా –తమిళనాడు సరిహద్దులో తిరుప్పురం అనే వూరుకి పంపేస్తాడు. పక్కనే తెలుగు వూరు వుంటుంది. ఆ తెలుగు వాళ్ళకీ,  తమిళులకీ పడక కొట్టుకుంటూ వుంటారు. రెండూళ్ళ మధ్య కంచె వేసుకుని, దాటి వస్తే చంపేస్తూంటారు. తెలుగు వూళ్ళో చేరిన హరి కాలేజీలో జాయినవుతాడు. రెండూళ్ళ ఆ ఉమ్మడి కాలేజీని తమ సాంప్రదాయ గొడవల్నుంచి మినహాయిస్తారు. రెండూళ్ళ విద్యార్ధులందరూ  అక్కడే చదువుకుంటూ వుంటారు.  అక్కడ హరి కార్తీక (రశ్మిక) ని  చూడగానే ప్రేమలో పడిపోతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. తీరా చూస్తే ఈమె తెలుగు అమ్మాయి కాదనీ, అవతలి వూరు ఘరానా మనిషి తమిళ వీరముత్తు కూతురనీ  తెలుస్తుంది. కూతురి వ్యవహారం తెలుసుకున్న వీరముత్తు హరిని  చంపమని ముఠాని తోలుతాడు. హరి పారిపోతాడు. 

          ఇప్పుడు కార్తీకని పొందాలంటే హరి ఏం చేశాడు?  రెండూళ్ళ  మధ్య గొడవల్ని  చల్లా ర్చాలంటే ఏం చేశాడు? అలా చేసి కార్తీకని పొందగలిగాడా? ... అన్నదే మిగతా కథ.  

ఎలావుంది కథ 
      రోమాంటిక్ యాక్షన్ కామెడీ  జానర్ గా ప్రారంభమై,  అంతలో యూటర్న్ తీసుకుని,  బాధాకరంగా జానర్ మర్యాదని వదిలేస్తూ,  రోమాంటిక్ డ్రామా జానర్లోకి తిరగబెట్టింది. సగం వరకూ యూత్ అప్పీల్,  మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్  యాస్పెక్ట్ లకి  మంచి న్యాయంచేకూరుస్తూ కూడా, మిగతా సగాని కొచ్చేసరికి ఇవి అవసరం లేదనుకుని వదిలేసి, ఏటో వెళ్ళిపోయింది.  హీరోహీరోయిన్ల ప్రేమకి రెండూళ్ళు అడ్డు అనే ఐడియా ఇప్పటిది కాదు. గతంలో చాలా వచ్చాయి, ఇప్పుడింకా  ఒకటో రెండో కూడా రాబోతున్నాయి. కాబట్టి  ప్రస్తుత కథలో ప్రాంతాలు మార్చినంత మాత్రాన  కొత్తదనమేమీ రాలేదు. సాంస్కృతిక పరమైన విభేదాల కథ కూడా కాదు. కనుక ఏదో మెసేజీ వినాల్సిన బాధ కూడా ప్రేక్షకులకి లేదు. రెండూళ్ళ  జిగ్రీ దోస్తులైన ఇద్దరు తెలుగు తమిళ తాతలు మదమెక్కి తన్నుకుని,  రెండూళ్ళ మధ్య గీత గీసిపోయిన మూర్ఖత్వమిది. దీన్ని పట్టుకుని అసలు నిజమేంటో తెలీని ఇప్పటి జనం, తాతల మూర్ఖత్వాన్నే కంటిన్యూ చేస్తూ కొట్టుకు ఛస్తున్నారు. ఈ నేపధ్యంలో హస్యభరితంగా టైం పాస్ ప్రేమ కామెడీ చెప్పాలి. కానీ  పాతదే అయినా,  ఎంతో యూత్ ఫుల్  కాన్సెప్ట్ గా కొత్తగానే , హాస్య భరితంగానే  కొనసాగిస్తూ పోతున్న కొత్త దర్శకుడైన కథకుడు, తీరా ఒక్కసారిగా నస భరితం చేయడం చాలా శోచనీయమైన విషయం. నాణేలకి సైడ్ ‘బి’ వుంటుంది గానీ, ‘షోలే’ నాణేనికి రెండు  వైపులా సైడ్ ‘ఏ’ లే వుంటాయి. సినిమాల కథలు కూడా ‘షోలే’ నాణెం లాంటివే. పూర్వార్ధంలాగే ద్వితీయార్ధమూ కొనసాగాలని నాల్గు డబ్బులిచ్చుకుని కూర్చున్న ప్రేక్షకుడు ఆశిస్తాడు. అలా లేనిపక్షంలో బాక్సాఫీసు దగ్గర అచ్చు బొమ్మ జూదమాడేస్తాడు. 

ఎవరెలా చేశారు 
     నాగశౌర్యకి  చాలాకాలం తర్వాత ఓ మంచి సినిమాయే దొరికింది.  కాకపోతే పాక్షికంగా మాత్రమే. తను కథ వినేటప్పుడు - తన పాత్ర పుట్టు లక్షణమైన కొట్లాటల పిచ్చి, సెకండాఫ్ లో చచ్చిపోయిందేమిటని అనుమానమే రాలేదా? యాక్టివ్ క్యారెక్టర్ పాసివ్ క్యారెక్టర్ అయిందేమిటని అన్పించనే లేదా? ఇక్కడే తను సినిమాని నిలబెట్టడంలో పూర్తిగా సఫలం కాలేకపోయాడు. రోటీన్ మూస –మాస్- ఆవారా పాత్రచిత్రణలకి  భిన్నంగా,  ఎంతో ఫ్రెష్ గా, విలక్షణమైన ఫన్నీ పాత్రగా అలరిస్తున్న తను, నవ్విస్తున్న తను, ప్రేక్షకుల చేత ఈలలేయించుకుంటూ వున్న తనే, తీరా సెకండాఫ్ కొచ్చేసరికి  ఆ కిక్ నంతా వదిలేసుకోవడమేమిటి? అక్కడ్నించీ యూత్ అప్పీల్ కి దూరమైపోవడమేమిటి? ముగింపు ఉస్సూరు మన్పించడమేమిటి? అంతవరకూ సన్నివేశ బలాలతో,  వాటిలోంచి పుట్టిన పర్ఫెక్ట్ పాటలతో అంతకంతకూ పాత్రని ప్రేక్షకులు ప్రేమించేలా చేసుకోగల్గిన తను, ఒక్క పాట విషయంలో పప్పులో కాలేసినట్టు గమనించలేదా? అప్పటికే డీలా పడిపోయిన కథని లేవనెత్తకుండా, ఇంకా డీలా పడిపోయేలా చేస్తూ,  బార్ లో ఆ భగ్న ప్రేమ తాలూకు తాగుడు పాటేమిటి?  

          నాగశౌర్యకి ఈసారి మంచి క్రియేటివ్ విజన్, తనదైన ఒక శైలి నేర్పాటుచేసుకుని ముద్ర వేయాలన్న తపనా గల, కొత్త దర్శకుడు దొరికాడు. కానీ కథకుడుగా పాక్షిక రైటింగ్ పవరే వుండడంతో,  కొత్త దర్శకుడి చేతిలో తను పూర్తిగా రాణించలేకపోయాడు. ఈ సినిమా తో నాగశౌర్య  మెసేజీ లేమీ ఇవ్వలేదు గానీ, సినిమాయే శౌర్యకి గట్టి మెసేజి ఇస్తోంది – భవిష్యత్తులో పూర్తిస్థాయి రైటింగ్ పవర్ వుండేట్టు కూడా చూసుకోవాలని. 

          కొత్త హీరోయిన్ రస్మిక,  వూళ్ళల్లో వుండే  కామన్ గర్ల్ పాత్రకి సరిపోయే శారీరక తత్వంతో, హీరోతో ఎత్తు చాలకపోయినా  సహజ నటనతో,  కాలేజీ అమ్మాయిలతో కలిసిపోయే క్రేజీ యూత్ అప్పీల్ తో వుంది. సహజ నటనే అయినా, స్పాంటేనియస్ గా నటించడం తెలియడంతో ఆమె వున్న సీన్లు చైతన్యవంతంగా వున్నాయి.

       ఇక తెలుగు, తమిళ కాలేజీ గ్యాంగ్ అంతా ఫన్నీ కమెడియన్స్. వీళ్ళల్లో సత్యకి ఫుటేజీ ఎక్కువ. ఎవరూ వెకిలి కామెడీలు చేయకపోవడం పెద్ద రిలీఫ్. లెక్చరర్ గా పోసానీ కామెడీ పర్ఫెక్ట్. ప్రిన్సిపాల్ గా రఘుబాబు కూడా మోటు కామెడీకి దూరంగా,  నీటుగా తక్కువ మాటలతో నవ్వించడం ఎక్సెలెంట్. సెకండాఫ్ లో పెళ్లి కొడుకుగా వెన్నెల కిశోర్ ది మెంటల్ కామెడీ.
         
మహతీ స్వర సాగర్ ఇచ్చిన సంగీతం చాలా పెద్ద ఎసెట్ ఈ సినిమాకి. ఆ రెండూళ్ల నేటివిటీని  దృష్టిలో పెట్టుకుని కూర్చిన నేటివ్ బాణీలూ, అందుకు తగ్గ సాహిత్యం పాటల్లో ఇన్వాల్వ్ చేసేట్టున్నాయి ప్రేక్షకుల్ని. చాలాకాలం తర్వాత తెలుగు తెరమీద ఇది చూస్తున్నాం. ఒక్క చివరి బార్ సాంగ్ మాత్రం కథ బలహీనపడ్డ నేపధ్యంలో గల్లంతయ్యింది. 

          అలాగే సాయిశ్రీరాం ఛాయాగ్రహణం మంచి విజువల్స్ ని క్రియేట్ చేయగల్గింది విషయ పరమైన ఫీల్ ని దృష్టిలో పెట్టుకుని. కొత్త దర్శకుడి షాట్ కంపోజింగ్ లో లాలిత్యముండడంతో  కెమెరా వర్క్ నాణ్యత కూడా పెరిగింది. అందమైన కొత్త లొకేషన్స్ బాగా కలిసి వచ్చాయి.  బ్రిటిష్ కాలంనాటి కాలేజీ, హాస్టల్ భవనాలు కాలేజీ సీన్స్ కి మంచి డాబుసరి నేపధ్యాలు. ప్రొడక్షన్ ప్రమాణాలన్నీ ఉన్నతంగా వున్నాయి. 

చివరికేమిటి 
        కొత్తదర్శకుడు వెంకీ ‘ఛలో’ అన్నాడే గానీ, సెకండాఫ్ ని కూడా వెంట తీసికెళ్ళ లేదు. ఫస్టాఫ్ తో సెకండాఫ్ ‘చలేంగే సాథ్ మిల్ కే’  అని చేయిచాపి అడుగుతున్నా, కలిసి సాగేందుకు ఫస్టాఫ్ ఒప్పుకోలేదు. రెండూళ్ళ పంచాయితీ లాగే అయింది. ఇంత మాత్రానా కొత్త దర్శకుణ్ణి తక్కువ చేయడానికి వీల్లేదు. అతడి క్రియేటివిటీనీ, సెన్సాఫ్ హ్యూమర్ నీ  గుర్తించాల్సిందే. ఈ సెన్సాఫ్ హ్యూమర్ తో కూడిన డైలాగుల్ని కింది క్లాసు ప్రేక్షకులు కూడా తెగ ఎంజాయ్ చేయడాన్నిబట్టే కొత్త దర్శకుడి టాలెంట్ తెలుస్తోంది. డైలాగులకి ఈ తాజాదనం పాత్రలు మాటాడ్డం వల్ల వచ్చింది. దీంతో టెంప్లెట్ మూస డైలాగుల బాధ తప్పింది. టెంప్లెట్ మూస డైలాగులు పాత్రలు మాట్లాడేవి కావు, అవి దర్శకుడో రైటరో సినిమా ప్రపంచంలో మునిగి వుండి  రాసేవి. పాత్రలు సినిమా ప్రపంచంలో ఛస్తే వుండవు, , అవి వాటివైన  కథా ప్రపంచంలోనే వుండి మాట్లాడాలనుకుంటాయి. అందుకని అవి మాట్లాడితే మూస వాసనెయ్యదు. 


          కొత్త దర్శకుడి దగ్గర అపారమైన క్రియేటివ్ టాలెంట్ వుంది. దీనికి స్ట్రక్చర్ జతపడక పోవడంతో  సెకండాఫ్ కి సమస్య వచ్చింది. ఇది చూసైనా ఇప్పటికైనా ఇంకెవరైనా స్ట్రక్చర్ కూడా ఎంత ముఖ్యమో  గ్రహిస్తే క్రియేటివిటీకి అర్ధముంటుంది.  ఈ కొత్త దర్శకుడే విలన్ తో ఒక డైలాగు అన్పిస్తాడు - ఇక పంచాయితీలుండవ్, పంచనామాలే వుంటాయని. ఇలాగే  ఈ ఫస్టాఫ్ - సెకండాఫ్ ల పంచాయితేమిటో, పంచనామా ఏమిటో,  స్క్రీన్ ప్లే సంగతులు చేసి సోమవారం చూద్దాం.

సికిందర్