రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, జూన్ 2014, శుక్రవారం

రివ్యూ..


మళ్ళీ అదే ఎపిసోడ్ల వైఫల్యం!


రచన- దర్శకత్వం : దేవ కట్టా
తారాగణం: నాగ చైతన్య అక్కినేని, సమంత, రాకుల్ ప్రీత్ సింగ్, సాయి కుమార్, ఆశీష్ విద్యార్థి, జీవీ, జెపి, బ్రహ్మానందం, ఎమ్మెస్, వేణు మాధవ్ తదితరులు.
సంగీతం: అనూప్ రూబెన్స్,    కెమెరా: శ్రీకాంత్ నరోజ్,  ఎడిటింగ్ : గౌతమ్ రాజు.

 నిర్మాత : కె. అచ్చి రెడ్డి , సెన్సార్ :  ‘A’ ,     విడుదల : 27 జూన్, 2014,     
*****
మొన్ననే క్లాసిక్ కుటుంబ కథా చిత్రం  మనం’  సూపర్ సక్సెస్ తో మరింత క్రేజ్ ని పెంచుకున్న  అక్కినేని నాగ చైతన్య,  ‘ఆటో నగర్ సూర్య’ తో  ఇక చెలరేగిపోతాడన్న అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడింది. దురదృష్టవశాత్తూ ఒకటే పరంపరగా విడుదల వాయిదాలు పడుతూ వచ్చిన ‘ఆటో నగర్ సూర్య’ షరామామూలు ఫలితాన్నే ఇస్తుందని ఎవరూ ఊహించి వుండరు. ఎంతటి బడా సినిమా అయినా  విడుదల వాయిదాలు  పడితే హిట్టయిన సందర్భాలు లేవు. ఐతే ‘ఆటో నగర్ సూర్య’ కూడా ఈ ప్రమాదంలో పడాలనిలేదు. దర్శకుడు దేవకట్టా  సరైన ‘దృష్టి’ తో ఈ సినిమా తీసివుంటే దీనికీ గండం వుండేది కాదు.

దర్శకుడు దేవకట్టా తో వచ్చిన సమస్యేమిటంటే,  ఆయన భారీ కథలకి లేత హీరోల్ని ఎన్నుకుంటారు. గత చిత్రం ‘ప్రస్థానం’ లో అంత బరువైన కథకి, పాత్రలకీ  సరిపోని శర్వానంద్, సందీప్ కిషన్ లలాంటి యంగ్ హీరోల్ని తీసుకున్నట్టే,  ప్రస్తుత భారీ డైలాగుల బరువైన సినిమాకీ అంతే యంగ్ స్టార్ నాగ చైతన్య ని తీసుకున్నారు. యాక్షన్ హీరోగా రాణించాలని విఫలయత్నం చేస్తున్న నాగచైతన్య చేత ఇంత సీరియస్ సినిమా దేవకట్టా చేస్తారని ఎవరూ ఊహించరు.  ఈ రోజుల్లో పెద్ద స్టార్స్ సినిమాలకే యాక్షన్ ని ఫక్తు ఎంటర్ టైనర్ గా చేసి చూపిస్తున్న ట్రెండ్ నడుస్తోంది. ఇలాటి కమర్షియల్ యాక్షన్ సినిమాల ట్రెండ్ కి  దేవ కట్టా ఎంత కొత్త అన్పిస్తారంటే, ఆయన ఎన్నుకున్న ఈ కథ ఎంత పాతకాలం నాటిదో అంత!

ఇంకో అనాధ బాధ!

ఐదేళ్ళప్పుడు సూర్య ( నాగ చైతన్య) అనాథ అవుతాడు. అప్పుడు  తల్లి కులాంతర వివాహం చేసుకుందన్న అక్కసుతో మేనమామ ( సాయికుమార్ )సూర్యని చేరదీయడు. దీంతో  ఆటోనగర్ లో పనిలో చేరి కాలక్రమంలో ఓ హత్య కేసులో ఇరుక్కుని జైలు పాలవుతాడు.  అక్కడే  ఇంజనీరింగ్ కూడా పూర్తి  చేసి విడుదలవుతాడు.

అతడికో కల వుంటుంది- బ్యాటరీతో నడిచే కారు తయారు చేయాలని. ఆటోనగర్ లో ఈ పని ప్రారంభించబోతే నగర మేయర్ ( మధు), అతడి రౌడీ వర్గం ( జయప్రకాష్ రెడ్డి, అజయ్, జీవా ) అడ్డుపడుతూంటారు.  వీళ్ళంతా ఆటోనగర్ మీద, అక్కడి వర్కర్స్ యూనియన్ మీదా  అధికారం చెలాయిస్తూ అక్రమ సంపాదనలకి  అలవాటు పడివుంటారు. ఈ కొత్త  వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఇక ఎదురుతిరగడం  మొదలెడతాడు సూర్య.
ఇంకోవైపు మేనమామ కూతురుగా సిరి (సమంత) వుంటుంది. ఈమెతో ప్రేమకి మేనమామ అడ్డుగా వుంటాడు. ఈ ప్రేమ సంగతి అలావుంచితే, అతడి ధ్యేయం ఇప్పుడు ఒక్కటే - ఆటోనగర్ లో రౌడీ రాజ్యాన్ని అంతమొందించడం. ఇదీ కథ!

నటనలు- సాంకేతికాలు

2011 లో రాంగోపాల్ వర్మ తీసిన ‘బెజవాడ’, అంతకి ముందు వాసూ వర్మ దర్శకత్వంలో 2009 లో ‘ జోష్’, మళ్ళీ 2011 లో అజయ్  భుయాన్ దర్శకత్వంలో ‘దడ’ అనే మూడు యాక్షన్ చిత్రాల్లో నటించి విఫలమైన నాగ చైతన్య తిరిగి అదే యాక్షన్ హీరో గా నిరూపించుకోవడం  కోసం ఈసారి  చేసిన ప్రయత్నం కూడా పారలేదు.  ఈసారి మాస్ పాత్ర నటించడంలో కొంత ఇంప్రూవ్ ఐనప్పటికీ, అతను సాఫ్ట్ రోల్స్ లో రోమాంటిక్ పాత్రలు పోషిస్తేనే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుకునే అవకాశం వుంది.

సమంత కి సరైన పాత్రేలేదు. ఈ తరహా మూస ఫార్ములా సినిమాల్లో హీరోయిన్ పాత్ర గల్లంతవడం మామూలే. ‘దూకుడు’ ద్వితీయార్ధంలో సమంత సమూలంగా మాయమైనట్టుగానే, ఇక్కడ కూడా ఆ ఉన్న కురచ పాత్ర కాస్తా సెకండాఫ్ లో ఐపు లేకుండా పోయింది.

మిగతా పాత్రల్లో పాత  విలన్లందరూ పోటీలు పడి వీలైనంత పాత  ధోరణిలోనే నటించుకుపోయారు. సెకండాఫ్ లో   నైతే మరీ పాత సినిమా విలన్స్ లా అరుపులు అరిచారు. బ్రహ్మానందం- వేణుమాధవ్ ల కామెడీ  విషయానికొస్తే, దీన్ని కామెడీ అని కూడా ఎలా అంటారో దర్శకుడే స్పష్టం చేయాల్సిన అవసరం వుంది.

సాంకేతికంగా చూస్తే కెమెరా వర్క్ లో చాలా ఎగుడు దిగుళ్ళు న్నాయి. అసలీ సినిమా కథాకాలం 1970- 90 ల నాటిది. ఆ కాలాన్ని ప్రతిబింబించే వాతావరణ కల్పన కోసం చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టి, ఆ కాలంలో  తీసిన పాత సినిమా చూస్తున్నట్టే తయారయ్యింది.

అనూప్ రూబెన్స్ సంగీతంలో  ‘మన్ చలీ’ అనే ఒక్క పాట తప్ప మరేదీ ఆకట్టుకోదు.  ఆకట్టుకోక పోగా,    అకస్మాత్తుగా కథకి అడ్డుతగుల్తూ వచ్చిపోతూంటాయి.

దర్శకత్వపు తీరుతెన్నులు

దర్శకుడు దేవకట్టా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడే అక్కడ సినిమా దర్శకత్వం కోర్సు చేశారు. స్క్రీన్ ప్లే మీద అనర్గళంగా మాట్లాడగలరు. కానీ, సినిమా తీసే  విషయానికి వస్తే మాత్రం ఆ జ్ఞాన సంపద ఏమై  పోతుందో అర్ధంగాదు. పాత్ర చిత్రణ గురించి, పాత్ర ప్రయాణం గురించీ వివరించే జోసెఫ్ క్యాంప్ బెల్ రాసిన  ‘ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’ గ్రంథ పఠనమంతా ఏమై పోతుందో తెలీదు. ఈ సినిమాకి ఆయన ఒక దర్శకుడిగా కంటే మాటల రచయితగా ఎక్కువ నిరూపించుకోవాలని ఉబలాటపడ్డారు. పట్టుకున్న కలానికి పట్టుపగ్గాలే లేనట్టు పుంఖాను పుంఖాలుగా డైలాగులు రాసుకుంటూ పోయారు. ఈ డైలాగులు కాలం చెల్లినవి. ఈ రోజుల్లో ఇంతేసి భారీ డైలాగులు చూడం. పైగా రాస్తున్నది ఒక యువ స్టార్ కోసం అన్న దృష్టి కూడా లేకుండా అలాటి డైలాగులు జొప్పించారు.

‘మీరంతా మారిపోయారు బాబాయ్, నిజం చెప్పాలంటే దూరంగా పారిపోయారు’ - అనే అరిగిపోయిన ప్రాస డైలాగు,

‘నేనింకా  పసివాడినే, మనిషే వ్యవస్థ అని తిరుగుతున్న ఆరేళ్ళ పసోడిని’ - అనే అజ్ఞానపు డైలాగు,

‘నేను అనాథనే కానీ  అనామకుడ్ని కాదు, నా పేరు సూర్య, ఆటో నగర్ సూర్య’ - అనే బలహీన  డైలాగు,

‘నాకు తెలిసి మనుషుల్లో నాలుగే జాతులున్నాయ్, తినేదానికన్నా ఎక్కువ పండించేవాడు, కనీసం తినగలిగినంత మాత్రమే పండించేవాడు, పండించే కెపాసిటీ లేక అడుక్కు తినేవాడు, ఈ ముగ్గుర్నీ దోచుకు తినే నాలుగో జాతి –లోఫర్ జాతి’  – లాంటి భారీ డైలాగులూ చాలా వున్నాయి...

వ్యవస్థ మనిషిని నిర్ణయించదనీ,  మనిషే ఒక వ్యవస్థ అనే అర్ధంలో ఇంకో డైలాగూ  వుంది. సంఘ జీవి అయిన మనిషి సమాజం మీద ఆధారపడకుండా స్వతంత్రంగా తనకు తానే ఒక  వ్యవస్థ అవుతాడా? అంటే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనా? నీ కట్టు బాట్లు, సాంప్రదాయాలు, సెంటిమెంట్లు, నీతీనిజయితీలూ నీవరకు ఉంచుకో, బయట నువ్వు తిరిగే సొసైటీ యావత్తూ అత్యాశ, స్వార్ధం, ఈర్ష్యాసూయలు, అధికార దాహం  అనే నాలుగు మూల స్థంభాలమీద ఏర్పడి ఉంది, వీటిని కాదనుకుని పోలేవు- అని జిడ్డు కృష్ణమూర్తి ఏనాడో తేల్చేశాడు కదా?

చచ్చినట్టూ మనిషనే వాడు ఉన్న మత వ్యవస్థలో, అది అదుపు చేసే రాజకీయ వ్యవస్థలో పనిచేసుకు బతకాల్సిందేగా? కాకపొతే బతకలేనప్పుడు ఎదురుతిరుగుతాడు, అంతే. తానుంటున్న వ్యవస్థ అనే ఛత్రాన్ని మాత్రం తప్పించలేడు. వ్యవస్థ  అనేది ఆటవికతనం నుంచి పరిణామం చెంది ఏర్పడ్డ నాగరికత. మనిషిగా దర్శకుడే ఒక వ్యవస్థ ఐతే, ఈ సినిమా విడుదల ఇన్నిసార్లు ఎందుకాగుతుంది?

ఈ డైలాగుల ఆర్భాట మంతా  డైలాగుల కోసమే అన్నట్టు వుందే తప్ప, వీటిని ఆచరించి చూపే పాపాన హీరో పోడు సరికదా, దర్శకుడు  డైలాగుల మీద చూపించిన ‘శ్రద్ధ’  మిగతా కథా కథనాల మీద చూపించే ప్రయత్నం అస్సలు చేయలేదు.

ఈ కథా కథనాలు మరోసారి సినీ మాధ్యమానికి  పొసగని  ఎపిసోడ్ల  టైపు,  స్టార్ట్ అండ్ స్టాప్ డాక్యుమెంటేషన్ టెక్నిక్ తీరు !

స్క్రీన్ ప్లే సంగతులు!


ఈ సినిమాలో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గురించి చెప్పుకోవడాని కేమీలేదు, ఎందుకంటే దురదృష్ట వశాత్తూ ఇది స్క్రీన్ ప్లే కాలేకపోయింది. స్క్రీన్ ప్లే అంటే సినిమాకి పనికొచ్చేది, అంతేగానీ ఈ సినిమాలో ఉన్నట్టుగా టీవీ ఎపిసోడ్లు కాదు. స్క్రీన్ ప్లేకి ఒకటి -రెండు- మూడు-అని మూడంకాలుంటాయి. టీవీ ఎపిసోడ్లకీ మూడంకాలుంటాయి,  అయితే అవి ఏ ఎపిసోడ్ కా ఎపిసోడుగా వుంటాయి. సమస్య- సంఘర్షణ- పరిష్కారం అనే పద్ధతిలో వాటి సీన్లు నడిచి, ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ కథ ముగిసి పోతూంటుంది.  సినిమా స్క్రీన్ ప్లే అలాకాదు. ఒకే ఏక మొత్తం కథకి, ఒకే ప్రధాన సమస్య గా, దాంతో మాత్రమే సంఘర్షణనగా, దానికి మాత్రమే పరిష్కారంగా ఒకే ఒక్క కథ వుంటుంది.


ప్రస్తుత సినిమాలో ఒక ప్రధాన సమస్య – దాంతో సంక్షోభం అనే నడక లేదు. ఎన్నో సమస్యలు, ఎన్నో సంక్షోభాలు, ఎన్నో ముగింపులూ!  ఉదాహరణకి- డీజిల్ కారు తయారు చేస్తే, దాంతో ప్రత్యర్ధుల సంఘర్షణ, దానికో ముగింపు, తర్వాత బ్యాటరీ కారు తయారు చేస్తే, దాంతో ప్రత్యర్ధుల సంఘర్షణ, దానికో ముగింపు, మళ్ళీ తర్వాత కొచ్చిన్ ప్రయాణం కడితే, అక్కడ సంఘర్షణ, దానికో ముగింపూ,  ఇంకాతర్వాత, యూనియన్ లో సభ్యత్వ సమస్యతో ఇంకో  సంఘర్షణా దానికో ముగింపూ. మళ్ళీ తర్వాత వాహనాల వేలం పాట సమస్య, దాంతో సంఘర్షణా, దానికో ముగింపూ....ఇలా ఎపిసోడ్లమయంగా సాగే కథనంతోనే 2003 లో ‘టైగర్ హరిశంద్ర ప్రసాద్’ ఫ్లాపయ్యింది. 2014 లో తమిళ డబ్బింగ్ ‘సిటిజన్’ ఫ్లాపయ్యింది. ఎంతో అనుభవజ్ఞుడైన స్టీవెన్ స్పీల్బెర్గ్ కూడా ఈ ఎపిసోడిక్ స్ట్రక్చర్ కి పాల్పడ్డం తో 2001 లో ’వార్ హార్స్’ ఫ్లాపయ్యింది.

కథ మీద కాక,  సీన్ల మీదా  సీక్వెన్సుల మీదా దృష్టి పెట్టడం వల్ల  ఇలా జరుగుతుంది. దీన్నే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అంటారు. ఇది సినిమాలకి కాకుండా టీవీకీ, డాక్యుమెంటరీ చిత్రాలకీ పనికొస్తుంది.

ఇంటర్వెల్ కొచ్చేసరికి కూడా ఒక ప్రధాన సమస్య (మెయిన్ పాయింటు) లేదు. ఇంటర్వెల్లో వాహనాల వేలం పాటలకి భీకర పోరాటాలు పెట్టి,  హీరోకే ఆ  విజయాన్ని అందించి, వేలం పాట పత్రాల మీద “క్లోజ్డ్!”  అని పెద్ద శబ్దంతో ముద్ర కొట్టించడం ఎలా ఉందంటే- ఈ సినిమా ఫట్ ! – అన్నట్టే వుంది!

There is no hook at the mid - point to sustain the audiences interest anymore   -అన్నమాట! ఇక ఎందుకోసం  ప్రేక్షకులు ద్వితీయార్ధం చూడాలి? మళ్ళీ ద్వితీయార్ధలో చూపించింది కూడా  ఆ వేలం పాట చేజారిపోయిందని విలన్లు మళ్ళీ ఇంకో దాడికి పూనుకోవడమే. ఇలా దాడులకి ప్రతిదాడులతోనే హీరో క్యారక్టర్ ని రియాక్టివ్ గా చేసి నడిపించారు సినిమా ప్రారంభం నుంచీ. చివరికి విలన్ కొడుకుని హీరో కిడ్నాప్ చేశాకకూడా, మళ్ళీ ఎపిసోడ్ల పద్ధతే కొనసాగించారు.

దీంతో ఎక్కడా సస్పెన్స్, టెన్షన్, థ్రిల్ అనేవి లేకుండాపోయాయి. పైగా రెండు గంటలా 40 నిమిషాల నిడివి ఒకటీ. మర్నాడు  12 నిమిషాలు కత్తిరించారు. గంట కత్తిరించినా ఈ సినిమా బోరుని తప్పించలేరు.  ఎందుకంటే ఈ సినిమానే విషయం లేని నస కాబట్టి.

రాముడు అనే మంచి బాలుడు ఉదయం లేచి పళ్ళు తోముకున్నాడు, స్నానం చేశాడు, తయారయ్యాడు, తిన్నాడు, ఆఫీసుకి పోయాడు, పనిచేశాడు, తిన్నాడు, సాయంత్రం తిరిగొచ్చాడు, బట్టలిప్పుకుని స్నానంచేశాడు, రిలాక్స్ అయ్యాడు, మళ్ళీ  తిన్నాడు,  మళ్ళీ పడుకున్నాడు- ఇది నస!

రాముడు అనే మంచిబాలుడు ఉదయం  పళ్ళు తోముకుంటోంటే నిన్న బాస్ తిట్టిన తిట్లు గుర్తొచ్చాయి, బ్రష్ పడేసి స్నానం చేస్తూ బాస్ ని తన్నాలనుకుని  జారిపడ్డాడు. కాలు బెణికింది. నొప్పి కాలితో  అలాగే  ఆఫీసు కెళ్ళాడు. బాస్ మళ్ళీ తిట్టాడు. కాలు బావుంటే ఈసారి జాడించి తన్నే వాణ్ణి  అనుకున్నాడు. నొప్పి కాలితో సరిగ్గా పని  చేయలేక పోయాడు. ఇంకింత ఫైరయ్యాడు బాస్. వాడి మొహాన ఫైలు పెట్టి కొట్టి, ఇంటికొచ్చి భార్యని తన్నాడు- భార్య కోర్టు కెక్కింది- బాస్ పోలీసుల్ని పిలిపించాడు. ఇదీ పస. అసలు కథకి పెద్ద టర్నింగ్ పాయింట్!

విచారకరంగా ఇరవై కోట్ల బడ్జెట్ తో అట్టహాసంగా తీసిన ప్రస్తుత సినిమాకి మొదటి ఉదాహరణే  వర్తిస్తోంది!

పాత్రోచితనుచితాలు! 
జోసెఫ్ క్యాంప్ బెల్ 
ఐదేళ్లపుడు అనాధ అయిన హీరో తర్వాత చదువుకుంటున్నట్టు కన్పించడు. ఓ మెకానిక్ దగ్గర పనిలోకి చేరతాడు. పదహారేళ్ళ వయసులో  డీజిల్ తో నడిచే కారు కనిపెడతాడు. అడ్డొచ్చిన వడ్డీ వ్యాపారస్థుణ్ణి చంపి జైలు కెళ్తాడు. జైల్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతూ, బ్యాటరీతో నడిచే కారు డిజైన్ చేస్తాడు.

ముందు కనిపెట్టిన డీజిల్ తో నడిచేకారు ఏమయ్యింది? దాంతో దేశంలోనే గొప్పవాడు ఐపోవచ్చుగా? అది మర్చిపోయి మళ్ళీ బ్యాటరీ కారు ఏమిటి? జైల్లో తను చదివింది ఇంజనీరింగ్ డిగ్రీయా, లేక డిప్లొమానా? డిగ్రీకి అవకాశంలేదు. దూరవిద్యద్వారా  ఆటోమొబైల్ డిప్లొమా చెయ్యొచ్చు. అసలు స్కూలు కెళ్ళినట్టు కన్పించని కుర్రాడికి  ఏకంగా ఇంజనీరింగ్ చదివే అక్షరజ్ఞానం, ఆంగ్ల పరిజ్ఞానం ఎలా వచ్చాయి? అతను మైనారిటీ తీరని బాల నేరస్థుడే. అతన్ని సాధారణ జైల్లో ఉంచరు. ఎంత పెద్ద నేరం చేసినా మూడేళ్లకి మించి శిక్ష వెయ్యరు. ఇంతకీ ఇతను మూడేళ్ళే  జైల్లో ఉన్నట్టా, లేక డిగ్రీ చేస్తే అది పూర్తి  చేసి ఐదేళ్లకి బయటికి వచ్చాడా?

అసలు పదహారేళ్ళ మైనర్ కుర్రాడి మీద ఓ పెద్ద రౌడీ ముఠా దాడి చేస్తే, ఆత్మరక్షణ కోసం ఆ అమాయక కుర్రాడు చంపితే కోర్టు శిక్షిస్తుందా? పైగా ఒక కేస్ హిస్టరీ లేని, జీనియస్ అన్పించుకున్న కుర్రాణ్ణి? అతడి భవిష్యత్తునీ?
ఇంజనీరింగ్ చేశాడంటే శిక్షా కాలంలో అతను చాలా సంస్కరింప బడ్డట్టే. అలాటివాడు బయటికొచ్చాక ఏం చేస్తాడు?  అసలు అతడి ధ్యేయ మేమిటి? అసలు ముందు కనిపెట్టిన ఆ డీజిల్ కారు పేటెంట్ అమ్ముకుని బాగుపడ్డం మానేసి, ఇంకో బ్యాటరీ కారూ  అంటూ బయల్దేరాక, మళ్ళీ తనని  జైలుపాలు చేసిన ఆ కుళ్ళు ఆటోనగర్ కే పోతాడా, లేక ఇంకో కొత్త  చోట తన కొత్త ప్రాజెక్టు పనితో కొత్త జీవితాన్ని మొదలెట్టుకుంటాడా?

పాత్రే ఇంత గందరగోళంగా ఆవిష్కృత మైనప్పుడు, ఇక అది కథ నడిపే పధ్ధతీ అంతే అల్లకల్లోలంగా వుంటుంది. నిజానికి పాత్ర ఇలా ప్రయాణించా లనుకోలేదు, దర్శకుడే  తను ఫిక్స్ అయిపోయిన కథకోసం పాత్రౌచిత్యాన్ని ఇలా దెబ్బ తీశాడు. పాత్రకి ఓ దిశా, గమ్యం, ధ్యేయం లేకుండా చేశాడు. దీంతో పాత్ర ప్రాథమ్యాలు మరచి ప్రవర్తించింది. జైల్లో కష్ట పడి చదివి ఏర్పర్చుకున్న జీవితలక్ష్యాన్ని తీసి మూలకి విసిరేసి, అసాంఘిక శక్తులమధ్య తనూ లుంపెన్ శక్తిగా మారిపోయి వ్యర్థ జీవితాన్ని ఎంచుకుంది. కథలో హీరోయిన్ లాగే, బ్యాటరీ కారూ ఏటో మయమై పోయింది!
దర్శకుడు తన కథని త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో ఆలోచించి వుంటే ఇలా జరిగేది కాదు. జోసఫ్ క్యాంప్ బెల్ పాత్ర ప్రయాణ నమూనా ఈ క్రింద చూడండి.

స్ట్రక్చర్ మరచి ఎపిసోడ్ల సొద 
 ఎత్తుకోవడంతో-

సిడ్ ఫీల్డ్ చెక్ లిస్టులో గుర్తిస్తే- 

1. the main character has no point of view,
2. the story seems confusing,
3. story goes off in too many directions,
4. the   material is flat and boring,
5. main  character is too passive and reactive,
6. the story is predictable and contrived,
7. the main character is too reactive, too internal, seems to disappear off the page,
8. dramatic need of the main character is vague, undefined

ఇన్ని పాత్ర సంబంధమైన లోపాలవల్ల కథే చెడిపోయింది.

ఇక- పాత్ర బలిమి విషయానికి వస్తే, కుర్ర వయసులో అతనేం మొనగాడని నగర మేయర్ సహా కరుడుగట్టిన హంతక ముఠాకి సవాళ్లు విసురుతాడు? తనకి ఎవరి బ్యాకింగ్ వుంది? ఎవరు గాడ్ ఫాదర్ గా వున్నారు? తనలాంటి నల్గురు కుర్రాళ్ళని పెట్టుకుని ఏం చూసుకుని చెలరేగి పోతున్నాడు. విలన్ల ముందు అతను బచ్చా. క్షణంలో అతన్ని లేపెయ్యగలరు. కానీ ఇక్కడ  విలన్లని కూడా దెబ్బ తీస్తూ పాత్ర చిత్రణలు జరిగాయి. పోలీస్ కమీషనర్ సహా అందరూ బఫూన్లుగా మారిపోయారు. పోనీ హీరో జైలు నుంచి విడుదలై ఇంతప్పుడే ఒక  మర్డర్ చేసొచ్చిన దేవాంత తకుడనే బిల్డప్ తో, దగాపడిన తన జీవితం సాక్షిగా,  మాంచి ఎమోషనల్ థ్రస్ట్ తో విలన్ల గుండెల్లో దడ పుట్టిస్తూ వచ్చాడా అంటే అదీలేదు. కామెడీగా వచ్చాడు. ఏ విచారమూ లేదు.  

పాత్రల ప్లేస్ మెంట్ తో జరిగిన మరో తప్పిదం- ప్రధాన విలన్ని చివరిదాకా హీరో ముందుకు తేకుండా అనుచరులతోనే పోరాటాలు చూపడం. దీంతో కూడా విసుగెత్తిపోయింది సినిమా. ఆ ప్రధాన విలన్ ఇంటర్వెల్లో నైనా ప్రత్యక్షమయ్యే కమర్షియల్ కథన చాతుర్యం కొరవడ్డం విచిత్రం.

ఒకభారీ బడ్జెట్ సినిమాకి బేసిక్స్ లేని స్క్రిప్టుతో ముందు కెళ్ళడంతో ఎప్పుడో జరగాల్సిన నష్టం జరిగిపోయింది, విడుదల వాయిదాలు పడ్డం జస్ట్ ఒక ఎక్స్ క్యూజ్ మాత్రమే, అంతే!

- సికిందర్