రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, March 24, 2018

627 : సందేహాలు -సమాధానాలు



Q :    మీరు స్క్రీన్ ప్లేకి ‘శివ’ స్ట్రక్చర్ ని వాడమంటే ఇక్కడ అర్ధం గావడం లేదు. మేము ప్రేమ కథో, ఇంకేదో కథో రాయాలనుకుంటున్నామే గానీ, మాఫియా కాదంటున్నారు. ‘శివ’ స్ట్రక్చర్ అలాటి మాఫియా సినిమాలకే అనుకుంటున్నారు. ‘శివ’ ప్లాట్ పాయింట్ వన్ లో నాగార్జున జేడీ ని కొడతారు. మా ప్రేమ కథలో అదెలా పెట్టాలి? ఎవరు ఎవర్ని కొట్టాలి? అంటున్నారు. ఇదే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రేమ కథకైతే  సంఘర్షణ ఎలా పుట్టవచ్చో  ఉదాహరణగా ‘బొమ్మరిల్లు’ ని వివరించినా అర్ధం జేసుకోవడం లేదు. ఇక ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మెయిన్ క్యారక్టర్ కి ఏర్పడే గోల్ లో,  నాల్గు ప్రాపర్టీస్ వుండాలన్నా కొట్టి  పారేస్తున్నారు. ‘శివ’ లో బిగినింగ్ విభాగంలో లాగే,  ‘బొమ్మరిల్లు’ బిగినింగ్ విభాగంలో కూడా  ఆ నాల్గు ప్రాపర్టీస్ ఎలా ప్లే  అయ్యాయో చూడమన్నా ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలి? ఇది ఒక చోటని కాదు, చాలా చోట్ల చూస్తున్నాను ఇలాటి పరిస్థితి.
 
జె దుర్గా స్వామి, కో డైరెక్టర్
A :    ‘శివ’ ప్లాట్ పాయింట్ వన్ లో నాగార్జున జేడీ ని కొడతారు, మా ప్రేమ కథలో అదెలా పెట్టాలి? ఎవరు ఎవర్ని కొట్టాలి? అన్నప్పుడే వాళ్ళెంత బుద్ధిమంతులో అర్ధమవుతోంది. బుద్ధిమంతులకి ఇంకేం చెప్తాం. ‘శివ’ నే ప్రేమ కథ గానో, కుటుంబ కథగానో మార్చమంటున్నామని వాళ్ళ బుద్ధికి అంది బెదిరి పోతున్నట్టుంది.  సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్ కి ఉదాహరణగా ‘శివ’ని చూపించడం పాపమై పోయింది. వాళ్ళు సిడ్ ఫీల్డ్ పుస్తకం చదివినా,  అందులో ఆయన చూపించే  హాలీవుడ్ నమూనాలకి ఇంకా బెదిరిపోవచ్చు.  ‘సిటిజన్ కేన్’ ని మా ప్రేమ కథగా ఎలా తీయాలని  గోలగోల చేయవచ్చు. కాబట్టి వాళ్ళ అవగాహనకి వాళ్ళని వదిలెయ్యాలి.  

Q :   ఐడియాలో మార్కెట్ యాస్పెక్ట్, యూత్ అప్పీల్ వుండాలని మీరు చెప్తూంటారు కదా... మరి ఈ వారం విడుదలైన ‘కర్తవ్యం’ తమిళ డబ్బింగ్ లో, పూర్వపు ‘అన్నమయ్య’, ‘ఆ నల్గురు’ లాంటి కథల్లో యూత్ అప్పీల్ వుండదు కదా... మరి అలాంటి కథలు రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
అశోక్ పి, అసోషియేట్
A :   రెగ్యులర్ కమర్షియల్ కథల్లో  యూత్ అప్పీల్ గ్లామర్ ప్రధానంగా వుంటుంది. సీరియస్ సామాజిక కథల్లోనో, లేక భక్తి కథల్లోనో వాటిలోని సెంట్రల్ పాయింటుతో బాటు వాటిలో నటించే తారాగణం  యూత్ అప్పీల్ ని ప్రేరేపిస్తాయి. అయితే భక్తీ సామాజికాలని  కేవలం యూత్ అప్పీల్ తో తీసే అవస్థ వుండదు. వాటికి  అన్ని వర్గాల ప్రేక్షకుల వ్యవస్థ వుంటుంది. కాబట్టి అవి సేఫ్ అవుతూంటాయి. అవి కూడా ఈ రోజుల్లో ఎప్పుడోగానీ రావు. కానీ ఎప్పుడూ వచ్చే రెగ్యులర్ కమర్షియల్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకులు వుండడం లేదు. కాబట్టి యూత్ ని, మాస్ ని టార్గెట్ చేస్తూ వాటి అప్పీల్స్ తో తీస్తూంటారు. మళ్ళీ ఇలాటి సినిమాలకి యూత్ లో కూడా సినిమాలకి వస్తున్న గర్ల్స్ అతి తక్కువ. ఎందుకంటే యూత్ అప్పీల్ పేరుతో  బాయ్స్ వేషాలే అతిగా చూపించి గర్ల్స్ రాకుండా చేస్తున్నారు. కాబట్టి యూత్ అప్పీల్ కి బాక్సాఫీసులో సగం దాదాపు లేనట్టే .
‘కర్తవ్యం’ సామాజికం. బోరు బావుల్లో పడిపోతున్న పిల్లల గురించి. ఈ ఘటనలు తరచూ జరిగి ఆసక్తి రేపుతున్నాయి కాబట్టి ఈ సెంట్రల్ పాయింటు యూత్ ని కూడా ఆకర్షించవచ్చు. పైగా నయనతార లాంటి గ్లామర్ తార వుంది.  అయినా తెలుగులో ఫ్లాప్ అయింది. అదే కార్తీ లాంటి పాపులర్ హీరో వుంటే తెలుగులో యూత్ అప్పీల్ వచ్చేదేమో అదే బోరుబావుల సామాజికానికి. కొన్ని కొన్ని సామాజికాల్ని యూత్ లోకి తీసి కెళ్లాలంటే పాపులర్ తారలు అవసరపడతారు.
          ‘ఆ నల్గురు’  తండ్రీ కొడుకుల కథ కాబట్టి సహజంగానే కొంత యూత్ అప్పీల్ వుంటుంది. మిగతా వర్గాలనీ ఆకర్షిస్తుంది. యూత్ అప్పీల్ కి  ఆర్ధిక కోణాలు తోడయ్యాయి. మానవ సంబంధాల్లో ఆర్ధిక సంబంధాలు కన్పించకపోతే ఏ యూత్ అప్పీలూ వుండదు. అందుకే ఇప్పటి సినిమాల్లో ఎకనమిక్స్ లేదా, ఇంకో యూత్ అప్పీల్ అయిన రోమాంటిక్స్ కన్పించాలనేది.  ఆనాటి ‘ఆకలి రాజ్యం’ లో నిరుద్యోగమే యూత్ అప్పీల్. నిరుద్యోగమంటే ఎకనమిక్స్  కాబట్టి.
‘నీదీ నాదీ ఒకే కథ’  కూడా యూత్ అప్పీల్ వున్న సామాజికమే. ఎకనమిక్సే.  కాకపోతే ఏం తేల్చారన్నది వేరే విషయం. యూత్ అప్పీల్ కి నెగెటివ్ పాజిటివ్ లని వుండవు - ఎటు చూపిస్తే అటు పడిపోతారు. ఇంకా నెగెటివ్ కే ఎక్కువ పడిపోతారు. ‘అర్జున్ రెడ్డి’ కి కూడా ఇలాగే పడిపోయారు.
          ఇక ‘అన్నమయ్య’ లాంటి భక్తి కథలకి గ్లామర్ తారలు తోడయితే, యూత్ అప్పీల్ దానికదే వుంటుంది, ఇతర వర్గాల ప్రేక్షకుల మన్నన సరేసరి. భక్తికి ఇప్పుడు కూడా యూత్ అప్పీల్ వుంది. ఇటీవల యూత్ లో దైవ భక్తి బాగా పెరిగిపోయింది. కాకపోతే ఇంకా పాతదేవుళ్ళే  కాకుండా,  యూత్ ని ఆకర్షిస్తున్న దేవుళ్ళు ఇంకెవరో కనిపెట్టి, అలాటి వీసా బాలాజీల మీద తీస్తే బ్రహ్మరథం పట్టొచ్చు. భక్తి కథల్లో కూడా ఇప్పుడు ఎకనమిక్సే కన్పించాలి. మోక్షం భిక్షం అంటే  తిప్పి కొడతారు.
          ఇలా సామాజిక,  భక్తి సినిమాల్లో యూత్ అప్పీల్ వుండదని  కాదు, వుంటుంది. వాటిని ఎలా ఉపయోగించాలనేది అప్పుడున్న యూత్ మెంటాలిటీని బట్టి వుంటుంది. యూత్ మెంటాలిటీ ఒక్కటే – ఎకనమిక్స్. లేదా రోమాంటిక్స్ లేదా ఈ రెండిటి మిశ్రమం.  అయితే సామజిక, భక్తి కథల్లాగా యాక్షన్ కథల్ని కూడా సీరియస్ గా తీస్తే యూత్ అప్పీల్ వుంటుందా? రెండు పెద్ద యాక్షన్ స్క్రిప్టుల్లో ఎకనమిక్స్ గానీ, రోమాంటిక్స్ గానీ లేక డ్రైగా కన్పిస్తూంటే వాటికి యూత్ అప్పీల్ వుంటుందా? ఇదే మార్కెట్ యాస్పెక్ట్ ని చూడకపో
వడమంటే. కేవలం క్రియేటివ్ యాస్పెక్ట్ ని పట్టుకుపోవడమంటే. చూద్దాం ఫలితాలెలా వస్తాయో.

Q :    ఏ జానర్ కి జానర్ డిమాండ్ చేసే లక్షణాలు వుంటాయిని ఒక వ్యాసంలో మీరు చెప్పారు. దయచేసి జానర్ లక్షణాలను డిమాండ్ చేస్తుందో,  సజాతి, విజాతి జానర్స్ ఏవేవో వివరిస్తారని ఆశిస్తున్నాను.
రాజ్, అసోషియేట్
A :  ఈ క్రింది రెండు లింకులు క్లిక్ చేసి చూడండి.
       జానర్ మర్యాద -1  జానర్ మర్యాద -2

        



సికిందర్