రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, October 31, 2014

స్క్రీన్ ప్లే సంగతులు...


పారిపోయిన ఖైదీల్లా ఇదేంటి!
వాయిసోవర్ తో పరిచయమనే ప్రక్రియే లేదు!



        టీవీలో ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’  లాంటి ప్రోగ్రాం ఏదో వస్తోందనుకుందాం. అందులో ఒక నేరస్థుడి ఫోటో చూపిస్తూ - ‘ఇతను ఇంద్రజిత్ జిత్తుల. వయస్సు నలభై వుంటుంది. ఐదడుగు లుంటాడు. కారు నలుపు. తెలుగు మాత్రమే వచ్చు. ఒక కన్నుతోనే చూస్తాడు. దొంగల కొండ స్వస్థలం. హత్య కేసులో చర్లపల్లి జైల్లో వున్నాడు. మొన్న కోర్టుకి తీసుకు పోతూండగా తప్పించుకుని పారిపోయాడు. చాలా ప్రమాదకరమైన నేరస్థుడు... ఇతను బయట తిరగడానికి వీల్లేదు. ఇతడి గురించిన సమాచారం అందించిన వారికి...’ అంటూ యాంకర్ చెప్పుకు పోతున్నాడనుకుందాం...


          ఇలాటిదే ఇంకో ప్రోగ్రాం లో పరారైన మరో కరుడుగట్టిన నేరస్థుడి గురించి పూర్తి వివరాలిచ్చా రనుకుందాం- ఈ ప్రోగ్రాములు చూసి మనం సినిమా కెళ్తే,  అక్కడ టైటిల్స్ పూర్తవగానే హీరోని చూపిస్తూ- ‘పండు గాడు వీడు. మహా అల్లరి గాడు సుమండీ! చిన్నప్పుడు బామ్మ నేర్పిన అల్లరి అట.  బామ్మ వీడికి జడ లేసి వంశంలో ఆడపిల్ల ల్లేని ముచ్చట కూడా తీర్చుకునేది. అదిగో దాని తాలూకు గుర్తే ఆ పిలక! అందుకే వీడికి ఆడపిల్లలంటే సిగ్గండీ. వీడు ఇంటర్ మూడు సార్లు తప్పి పుస్తకాల ఖర్చూ ఆదా చేస్తున్నాడు. అదిగో- అదిగో-వాడి నడక స్టయిల్ చూశారా..ఎంటా కుంటి నడక అంటారు? ఎంతకీ వీడు ఆడపిల్లల వెంట పడి చావడంలేదని, వీడి నాన్న ఠపీ విరగ్గొట్టిన కాలు కదూ అలా అయిపోయిందీ...’ ఇలా కామెంటరీ సాగుతోందనుకుందాం...

          ఇప్పుడు పై నేరగాళ్ళ ప్రకటనలకీ, సినిమాలో హీరో పాత్రని పరిచయం చేసిన పద్దతికీ ఏమైనా తేడా ఉందా? పాత్రలేమైనా ప్రేక్షకులనుంచి పారిపోయిన ఖైదీలా, ముందే కుదేసి ఇలా వ్యాఖ్యానాలు చేయడానికి? కానీ ఇలాగే ఉంటోంది పాత్రల పరిచయ విధానం..హిందీ ‘బూమ్’ సహా మన తెలుగులో ఇటీవల వచ్చిన ‘ఒకరికొకరు’, ‘జ్యూనియర్స్’, ‘అమ్మాయిలూ-అబ్బాయిలు’, ‘బాయ్స్’, ఇంకా తాజాగా ‘ఓరి నీ ప్రేమ బంగారంగానూ’  సినిమాల్లో!
          దీనివల్ల ఒరిగేదేమిటి- ప్రారంభంలోనే చమత్కారాలు చేసే అత్యుత్సాహాన్ని తీర్చుకోవడం తప్ప? ఇలా చేస్తే పాత్రేంటో ప్రేక్షకులకి ముందే తెలిసిపోయి- పాత్ర తాలూకు సస్పెన్స్ అంతా పోతుంది. తెర వెనుక నుంచి ఒక గొంతుక (వాయిసోవర్) ఈ పరిచయాలు చేస్తూంటుంది. కానీ సరయిన సినిమా టెక్నిక్ లో వాయిసోవర్ పాత్రని పరిచయం చేయడమనే విధానమే లేదు. అది ‘లో కేటగిరీ’ కళా ప్రదర్శన అవుతుంది.   పాత్ర తీరుని ని అది పాల్పడే చర్యలు గానీ, లేదా ఈ పాత్ర తో ఇంకో పాత్రకి అనుభవమైనప్పుడు ఈ పాత్ర గానీ పరిచయం చేయడం సరైన విధానం. ఒకప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్  అననే అన్నాడు – తన గురించి తాను అంతా వాగేసే పాత్ర మహా బోరు.  అలా పాత్ర వాగినా, వాయిసోవర్లో కథకుడు సంబరపడినా పాత్రలో సరుకంతా సఫా - అని!
          పరిశీలిస్తే పాత్రల్ని ఈ విధంగా పరిచయం చేసిన సినిమాలాన్నీ ఫ్లాపయ్యాయి- లేదా పెద్దగా  సక్సెస్ కాలేదు.
          ‘బూమ్’ లోనైతే మరీ దారుణం. మహా నటుడు అమితాబ్ బచ్చన్, జాకీష్రాఫ్, జావెద్ జాఫ్రీ, సూపర్ మోడల్స్ కత్రినా కైఫ్, పద్మలక్ష్మి, మధూ సప్రే మొదలైన వాళ్ళు – తెరపైకి ఎప్పుడు మొదటి సారి వస్తే అప్పుడు- నేరస్థుల ఫోటోలు మగ్ షాట్స్ వేస్తున్నట్టు, బ్రౌన్ కలర్లో గబగబా వాళ్ళ ఫోటో లేస్తూ- క్రిమినల్స్ గురించి చెబుతున్నటే వాళ్ళ పాత్రల గురించి లొడలొడా వాగేస్తూంటాడు వాయిసోవార్ కళాకారుడు!
          ఇది దర్శకుడి డొల్లతనాన్ని పట్టిచ్చేస్తుంది. ఇతను పాత్రల్ని కథ ద్వారా పరిచయం చేయలేని సోమరిపోతనీ, తన పాత్రల్ని తను పరిచయం చేయడాన్నే బోరుగా ఫీలవుతున్నాడనీ, అర్ధం వచ్చేలా చేస్తుంది. దర్శకుడికే బోరు కొడితే ప్రేక్షకు లెందుకు ప్రేమతో చూడాలి ఆ పాత్రల్ని?
          కామెడీ సినిమాయే కదా అని కూడా పాత్రల్ని ఇలా అల్లరి చిల్లరిగా పరిచయం చేయడమే కాదు, ఇతర సినిమాల్లో ఎంత గౌరవనీయంగానూ వాయిసోవర్ ద్వారా పరిచయం చేయడం దృశ్యమాధ్యమైన సినిమా విధానమే కాదుA movie is told with pictures, not words- Syd field
             మొదటే వాయిసోవర్ లో పాత్ర గతం, వర్తమానం, వ్యక్తిత్వం వంటి తురుపుముక్కల్ని పారేసుకోవడం ప్రపంచంలో మరెక్కడా జరగదు. కథనంలోనే పాత్ర లక్షణాలు బయట పడుతూ ఆశ్చర్యానికీ, ఆనందానికీ గురి చేస్తూండాలి.

          సౌండ్ రికార్డింగ్, ఎడిటింగ్ విధానాలని తెలిపే శాస్త్రాల్లో మోనోలాగ్, నేరేషన్, టైం లాప్స్, స్పేస్ బ్రిడ్జింగ్, మూవ్ మెంట్ బ్రిడ్జింగ్ మొదలైన సౌండ్ ట్రాన్సిషన్ పద్ధతుల గురించే చెప్పారు తప్ప, పాత్రల్ని పరిచయం చేసే  వాయిసోవర్ ప్రక్రియ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అసలటువంటిది లేదు.
          కథకి నేరేషన్ ఇవ్వొచ్చు వాయిసోవర్ ద్వారా. అది కథని ముందుకి నడిపించేందుకు ( స్పేస్ బ్రిడ్జింగ్) పనికి రావొచ్చు. ఉదాహరణకి ఛాయాగ్రాహకుడు రసోల్ ఎల్లోర్ దర్శకుడిగా మారి తీసిన  ‘ఒకరికొకరు’ లో ఇంటర్వెల్ తర్వాత విన్పించే వ్యాఖ్యానం. దీన్ని ‘డైజెసిస్’ అంటారు. న్యూస్ రీళ్ళల్లో మనకి విన్పించే వ్యాఖ్యానం ఈ డైజెసిస్సే. ఇలా రికార్డు చేసిన ధ్వనిని డైజెటిక్ సౌండ్ అంటారు. ఇలా కథా గమనం గురించి కథకుడు వ్యాఖ్యానం చేసే డైజెటిక్ సౌండ్ కాక, పాత్ర తన గురించి తాను చెప్పుకునే వాయిసోవర్ కూడా వుంటుంది. దీన్ని ఇంట్రా డైజెటిక్ సౌండ్ అంటారు.  ఈ వాయిసోవర్ లో పాత్ర తన కథ తాను చెప్పుకుంటున్నప్పుడు, కచ్చితంగా ఫ్లాష్ బ్యాక్ ప్రారంభం కావాలి. మళ్ళీ సినిమా ముగింపులో పాత్ర ముక్తాయింపుగా ఇంకో వాయిసోవర్ ఇచ్చుకోవచ్చు. ఉదా: ‘ఖ్వాయీష్’ అనే హిందీ సినిమా. హాలీవుడ్ ‘లవ్ స్టోరీ’ ని కాపీకొట్టి తీసిన ఈ సినిమాలో కథ హీరో స్వగతం  (వాయిసోవర్) తో ప్రారంభమై, ఫ్లాష్ బ్యాక్ లో కెళ్ళి, అదంతా పూర్తయ్యాక- సినిమా ముగింపులో మళ్ళీ స్వగతంలో ముక్తాయింపు నిస్తుంది.
          చాలా సినిమాల్లో ఇంకో వింత కూడా చూస్తూంటాం. పాత్ర స్వగతంతో ప్రారంభమైన కథ, దాన్ని ముగిస్తూ మళ్ళీ వాయిసోవర్ ఇచ్చుకోకుండా ముగిసిపోతుంది. 
          ప్రేక్షకులు ఎంత కోరుకోకున్నా ఇలాటి సినిమాలు వచ్చి పడుతూనే వుంటాయి. అలవాటయి పోయిన ప్రాణం. వాయిసోవర్లో పాత్రల్ని పరిచయం చేసే తమ అపూర్వ  ‘క్రియేటివిటీ’ కి ఏం పేరు పెట్టాలో ఆ క్రియేటర్లే సూచిస్తే బావుంటుంది. తెలుగు సినిమాలకి జాతీయ అవార్డులు రావాలంటే ఇలా టెక్నాలజీ దుర్వినియోగం ఆపుకోవాలి, టెక్నిక్ తెలుసుకోవాలి.


-సికిందర్ 

అక్టోబర్ 2003, ‘ఆంధ్రభూమి’ కోసం