రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, August 23, 2018

676 : స్పెషల్ ఆర్టికల్


      అమీర్ ఖాన్ – అమితాబ్ బచ్చన్ ల మల్టీ స్టారర్  ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ దీపావళికి విడుదలకి సిద్ధమవుతోంది. అమీర్ ఖాన్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో (210 కోట్లు) నిర్మిస్తున్న ఈ చారిత్రక మెగా పీరియడ్ మూవీ కోసం ఏడాది పాటు ఏకంగా రెండు షిప్పులు నిర్మించారు. షిప్పుల మీద జరిగే పోరాటం ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని సొంతంగా షిప్పులు నిర్మించుకున్నారు. ఈ భారీ షిప్పుల బరుపు సుమారు రెండు లక్షల కేజీలు. వెయ్యి మంది కార్మికులు, అంతర్జాతీయ డిజైనర్లు, షిప్ మేకర్లూ కలిసి, యూరప్ లోని మాల్టా సముద్ర తీరంలో వీటిని నిర్మించారు. 

        1839 లో ఫిలిప్ మీడోవ్స్ టేలర్ అనే రచయిత రాసిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఏ థగ్’ అన్న నవల ఆధారంగా దీనిని నిర్మిస్తున్నారు. ఈ నవల19 వ శతాబ్దపు గొప్ప క్రైం నవలగా పాపులరైంది. విక్టోరియా రాణి కూడా దీన్ని చదివిందని చెప్పుకుంటారు. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనతో ఈ నవలలోని కథకి సంబంధముంది. చరిత్రకి కల్పనని జోడించి ఈ నవల రాశాడు టేలర్. కథ ప్రకారం, ఇందులో కల్పిత హీరో పాత్ర అమీర్ అలీ యాంటీ హీరోపాత్ర. 18 వ శతాబ్దం పూర్వార్ధం నుంచి, 1832 వరకూ దీని కథాకాలం. నేరము - శిక్ష అనే కాన్సెప్ట్ తో నడిచే ఈ కథలో, 600 సంవత్సరాల సుదీర్ఘ నేర చరిత్ర గల థగ్గులనే బందిపోట్ల తెగ పాల్పడిన దారుణ నేరాల గురించి వుంటుంది. దారి కాచి ప్రయాణీకులని నిర్దయగా హతమార్చి దోచుకోవడమే వీళ్ళ వృత్తి. ఉపఖండంలో ఆరు శతాబ్దాల పాటు రక్తాలు పారించిన ఈ హంతక తెగ, చివరికి బ్రిటిష్ పాలకులతో తలబడే ఘట్టంతో నవల ముగుస్తుంది. ఈ తెగలో ముస్లిములు ఎక్కువ, హిందువులు కొందరు. వీళ్ళందరూ కాళీమాత పుత్రులుగా నమ్ముతారు. ఆమె స్వేద బిందువుల్లోంచి ఉద్భవించామని విశ్వసిస్తారు. అయితే కాళీమాత పుత్రులుగా చెప్పుకున్నప్పటికీ, తమ అసలు మూలాలు  బ్రాహ్మణీయ పురాణాల్లో వున్నాయని భావిస్తారు. 

      ఈ నవలలో పాత్రలు వరుసగా, అమీర్ అలీ (అమీర్ ఖాన్ పాత్ర) : పఠాన్ గా పుట్టి అనాధగా మారే ఇతను థగ్గుల పెంపకంలో పెరిగి థగ్గుగా మారతాడు; ఇస్మాయిల్ (అమితాబ్ బచ్చన్ పాత్ర) : అమీర్ పెంపుడు తండ్రి, సీనియర్ థగ్గు; బద్రీనాథ్ : హిందూ థగ్గు, తెగలో పూజారి; పీర్ ఖాన్ : ముస్లిం థగ్గు, ఫకీరుగా మారతాడు; గణేశా : తెగలో వుండే ఇతను అమీర్ కి విరోధిగా మారతాడు; చీటూ : పిండారీ తెగకి చెందిన ఇతన్ని అమీర్ కిరాయి సైనికుడుగా చేర్చుకుంటాడు.

          సుప్రసిద్ధ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ ఎపిక్ యాక్షన్ లో ఇతర పాత్రల్లో కత్రినా కైఫ్, ‘దంగల్’ ఫేమ్ ఫాతిమా సనా షేక్, లాయెడ్ ఓవెన్, జాకీ ష్రాఫ్, రోణిత్ రాయ్ తదితరులు నటిస్తున్నారు. అమీర్, అమితాబ్ ఇద్దరు బిగ్ స్టార్స్ ఆకర్షణ వుంది కాబట్టి బడ్జెట్ గురించి భయపడ్డం లేదనీ ఆదిత్యా చోప్రా భరోసా.1500 వందల కోట్లు వసూలు చేయవచ్చని అంచనా. ఇందులో అమీర్ పారితోషికం ఎంతంటే, 2001 లో ‘లగాన్’ నుంచీ అమీర్ ఒక పాలసీని అనుసరిస్తున్నారు. వంద రెండు వందల కోట్ల బడ్జెట్లో తను ముందే పారితోషికం తీసుకుంటే, ఇతర నటీనటులకి, టెక్నీషియన్లకి, ప్రొడక్షన్ కీ అతి  తక్కువ మిగులుతుంది. నిర్మాత మళ్ళీ అప్పుతెచ్చే భారం పడకూడదు. అదే సమయంలో సినిమా ఫ్లాప్ అయితే, తను సేఫ్ అయిపోయి నిర్మాత సర్వం కోల్పోకూడదు. అందుకని స్క్రిప్టు ని నమ్మాక, రూపాయి అడ్వాన్సు గానీ, పారితోషికం గానీ తీసుకోకుండానే నటిస్తారు. సినిమా విడుదలయ్యాక, ప్రమోషన్ కి పెట్టిన బడ్జెట్ వసూలయ్యే దాకా, ఆతర్వాత పూర్తి వ్యయం వెనక్కి వచ్చి లాభాల లెక్కలు తేలేదాకా ఆగుతారు. అప్పుడు భారీ వాటా తీసుకుంటారు. నిర్మాతలు కూడా సంతోషంగానే ఇస్తారు. మళ్ళీ ఇంకో సినిమా కోసం వస్తారు. ఇదంతా అమీరే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 

        ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ కి రచయిత, దర్శకుడు, ‘రేస్ -3’ ఫేమ్ విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. అజయ్ – అతుల్ సంగీతం, మనూష్ నందన్ కెమెరా. నలభై మంది దేశ విదేశ స్టంట్ డైరెక్టర్లు, కళాకారులూ పని చేశారు. అమీర్ ఖాన్ తన పాత్ర గురించి చెప్తూ, ఫాతిమా సనా షేక్ పాత్ర చుట్టూ ఇది తిరుగుతుందనీ, ఏ మాత్రం నీతి నియమాలుండవనీ, డబ్బుకోసం తల్లిని కూడా అమ్మేసే రకమనీ చెప్పుకొచ్చారు.

          ఇదిలావుంటే, కథల కోసం ఇక చరిత్రలోకి తొంగి చూస్తున్న బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, తెలియకుండా ఒకే మడుగులో అడుగేస్తున్నారు. ఒకే రకమైన చారిత్రక పాత్రలతో సినిమాలు తీస్తున్నారు. ఒకే వరసలో విడుదల చేస్తున్నారు.ఇది వాళ్ళకే తలనొప్పిగా మారింది. తమలాంటిదే ఇంకొకరు తీస్తున్నారని ఎవరికీ తెలియడంలేదు. గతంలో కూడా ఇదే జరిగింది. భగత్ సింగ్ మీద తీసిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి! 

      ‘లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’  అని అజయ్ దేవగణ్  తో రాజ్ కుమార్ సంతోషి తీశారు.  బాబీ డియోల్ తో ‘23 మార్చి 1931 – షహీద్’ అని గుడ్డూ ధనోవా తీశారు. రెండూ 2002 జూన్  7 న విడుదలయ్యాయి! వారం గడిచిందో లేదో, సోనూ సూద్ తో  సుకుమార్ నాయర్ తీసిన ‘షహీదే  ఆజం’ విడుదలయ్యింది!

          గత సంవత్సరం కూడా, జైలు నుంచి తప్పించుకుని పారిపోయే ఒకే కథతో ‘లక్నో సెంట్రల్’, ‘ఖైదీ బంద్’ ఒకేసారి విడుదలయ్యాయి. అమీర్ ఖాన్ కూడా ఇదే అనుభవమైంది. ‘దంగల్’ లాంటిదే సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ చూసి షాకయ్యారు. అటు సల్మాన్ కూడా ‘దంగల్’ చూసి కంగు తిన్నారు.  

          ఇప్పుడు పీరియడ్ బందిపోట్ల వంతు వచ్చింది. అమీర్ ఖాన్ బందిపోట్ల రగడ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ వుండగా, సైఫలీ ఖాన్ ‘హంటర్’ కూడా వస్తోంది. ఇందులో 1780 లో రాజస్థాన్ లో బందిపోటుగా మారిన నాగ సాధువు పగదీర్చుకునే రక్త చరిత్ర వుంటుంది. దీంతో పాటు రణబీర్ కపూర్ కూడా ‘షంషేరా’ అనే బందిపోటుగా ముస్తాబవుతున్నాడు. 1800 లలో చెలరేగిన ఒక డాకూ తెగ కథ!

         అయితే వీటి విడుదలలకి ఎక్కువ గ్యాప్ వుండడంతో తేలిగ్గా వూపిరి పీల్చుకుంటున్నారు. ఈ సంవత్సరం దీపావళికి అమీర్ బందిపోటు విడుదలైతే, వచ్చే సంవత్సరం సైఫలీ బందిపోటు విడుదలవుతుంది. ఆ పై సంవత్సరం రణబీర్ బందిపోటు!

          ఇలా  బందిపోటు సినిమాలు చాలవనట్టు ఇంకో తలనొప్పి కూడా మొదలయ్యింది. అక్షయ్ కుమార్ తో కరణ్ జోహార్ 1897 నాటి సరగర్హీ పోరాట గాథని ‘కేసరి’ టైటిల్ తో తీస్తూంటే, రాజ్ కుమార్ సంతోషీ కూడా రణదీప్ హూడాతో ‘బ్యాటిల్ ఆఫ్ సర్గర్హీ’ తీస్తున్నారు! ఐతే ఇదే చారిత్రక పోరాట గాథ తో గత ఫిబ్రవరి –మార్చిలో ’21 సర్ఫరోష్  - సరగర్హీ 1897’ అనే టీవీ సిరీస్ ప్రసారమై పోయింది!

సికిందర్
(తెలుగు రాజ్యం డాట్ కాం) 

675 : పరిచయం


   
       రాయల హరిశ్చంద్ర – పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమాల్లో ఆయన రూపం ప్రేక్షకులు చాలా సార్లు చూసే వుంటారు. ఎప్పుడో ‘ఒక్కడు’ తో ప్రారంభించి, అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చారు. అప్పుడు రాని గుర్తింపు ‘బాహుబలి’ తో అపూర్వంగా వచ్చింది. దీంతో ఆయన బిజీ క్యారక్టర్ ఆర్టిస్టు అయిపోయారు. ఇప్పుడాయన్ని గుర్తు పట్టని ప్రేక్షకుల్లేరు. ఇటీవలే రైతుల ఆత్మహత్యల కథతో తెలంగాణాలో తీసిన  ‘మిట్టీ’ అనే హిందీ సమాంతర సినిమాలో ముఖ్య పాత్ర ధరించారు. డాక్టర్ రాయల హరిశ్చంద్ర గురించి చెప్పాలంటే ఆయన నాటకం ప్రాణంగా ఎదిగిన కళాకారుడు. నాటకాల్లో నటన, దర్శకత్వం రెండూ నిర్వహిస్తూ తెలుగు నాటక రంగంలో ఏనాడో గుర్తింపు పొందారు. థియేటర్ ఆర్ట్స్ లో ఆయన యూనివర్సిటీలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా వున్నారు. మేకప్ కళాకారుడిగా కూడా శిక్షణ ఇప్పిస్తూంటారు. ఆయనతో 2005 లో ఈ వ్యాసకర్తకి పరిచయం కలిగింది. మిత్రుడు ఘనశ్యాం సదాశివ్ ఇంటికి తీసుకు వచ్చి పరిచయం చేశాడు. ఆ పరిచయం గాఢమైన స్నేహంగా మారడమే గాక, ఈ వ్యాసకర్తని నాటక రచన వైపు దారి తీయించింది. అమెరికా పెళ్లి సంబంధాల మీద ‘హెన్ కౌంటర్’  అని  ఈ వ్యాసకర్త రాసిన నాటకాన్ని హరిశ్చంద్ర  ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించారు. హైదరాబాద్  బీహెచ్ఈఎల్ లో 2010 జరిగిన ఆలిండియా నాటక పోటీల్లో ప్రదర్శించారు. దానికి అయిదు ఉత్తమ  బహుమతులు లభించాయి. ఆ తర్వాత ఇదే నాటకాన్ని 'రసరంజని' సారధ్యంలో   త్యాగరాయ గాన సభలో రెండు రోజులు ప్రదర్శించారు. దీనికంటే ముందు తెలుగు యూనివర్సిటీలో ఆయన సినిమా దర్శకత్వం కోర్సు చేస్తున్నప్పుడు, ఈ వ్యాసకర్త చేత ఒక షార్ట్ ఫిలిం రాయించి నిర్మించారు కోర్సులో భాగంగా. దీనికి రెండో బహుమతి పొందారు. ఓ మూడేళ్ళ క్రితం మరొక నాటకాన్ని ప్లాన్ చేశాం. ఆధునిక దాంపత్యాల మీద ఈ వ్యాసకర్త రాసిన ‘నడిసంద్రపు సిరి’ నాటకం కారణాంతరాల వల్ల ముందు కెళ్ళలేదు. ఈలోగా ఆయన సినిమాల్లో బిజీ అయిపోయారు. 

          వ్యాసకర్తకి డాక్టర్ హరిశ్చంద్రని పూర్తి నిడివి సహాయ పాత్రలో చూడాలని ఆశయం. ఈ ఆశయం ఘనశ్యాం దర్శకత్వంలో 2013 నెరవేరాల్సింది. ఘనశ్యాం నిరీక్షణలో వున్నాడు. ఓ రెండు నెలల క్రితం ఈ వ్యాసకర్త రాస్తున్న ఇంకో మూవీకి డాక్టర్ హరిశ్చంద్రని డాక్టర్ పాత్రలో ఫైనల్ చేశాం. ఈ మూవీ దర్శకుడు నిర్మాతతో గొడవపడి వెళ్ళిపోయాడు. అయినా హరిశ్చంద్రకి  ఇంకెక్కడో తప్పకుండా రాసి పెట్టి వుంది. పూర్తి నిడివి సహాయ పాత్రలో తప్పకుండా తెరపై కొస్తారు. ఒకటని కాదు, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల ఫౌండేషన్ ఆయనకుంది. విలన్ గా కూడా... ఈ సందర్భంగా బ్లాగు పాఠకులకి ఆయన్ని పరిచయం చేసే వీడియోని ఇక్కడ పొందు పర్చాం -  తప్పకుండా చూడగలరు.

సికిందర్