రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, March 13, 2018

618 : క్రియేటివిటీ సంగతులు

‘      ప్లేలన్నీ ఎలా ప్లే చేస్తాయి?’  శీర్షికన గత వ్యాసంలో (ఈ పోస్టు కింద లింకు క్లిక్ చేయండి) మొదటి రెండు ప్లేలు – నాన్ లీనియర్, రియల్ టైం – గురించి చెప్పుకున్నాం. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఒకటే, అది సార్వజనీనం. దాని లోపల చేసే రకరకాల ప్లేలు క్రియేటివిటీ అవుతుంది. బస్సుకి స్ట్రక్చర్ ఒకటే, అది సార్వజనీనం. ఆ స్ట్రక్చర్ మీద వివిధ మోడల్స్ ని రూపొందించుకోవడం క్రియేటివిటీ. ప్రపంచంలో ఏ  స్ట్రక్చర్ అయినా  భౌతిక సూత్రాల మీదే ఆధారపడుతుంది. భౌతిక సూత్రాలు సార్వజనీనం కాబట్టి దేని స్ట్రక్చర్ అయినా  ఎక్కడైనా ఒకలాగే వుంటుంది. అలాగే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కూడా. ఈ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో క్రియేటివ్ ప్లేలు తొమ్మిది రకాలు వుంటాయని హాలీవుడ్ ఆధారంగా చెప్పుకున్నాం. హాలీవుడ్ ఓకే చేసిన ప్లేలనే కమర్షియల్ సినిమాలకి అనుసరించాలని కూడా చెప్పుకున్నాం. ఇలా తొమ్మిది రకాల ప్లేలలో గత వ్యాసంలో చెప్పుకున్న నాన్ లీనియర్, రియల్ టైం రెండూ కాక మరో ఏడు వున్నాయి. అవి : మల్టిపుల్ టైం లైన్, హైపర్ లింక్, ఫేబులా, రివర్స్ క్రోనాలజీ,  రోషోమన్,  సర్క్యులర్, ఒనీరిక్ మొదలైనవి. ఇప్పుడు మూడోదైన  మల్టిపుల్ టైం లైన్ తో ప్రారంభించి తెలుసుకుందాం. 

         
3. మల్టిపుల్ టైం లైన్ : 
    వేర్వేరు కాలాల్లో జరిగిన కథల్ని సమాంతరంగా ఇప్పుడు జరుగుతున్న ప్రధాన కథకి అనుసంధానించి చెప్పుకు రావడమే మల్టిపుల్ టైం లైన్ ప్లే. ‘మళ్ళీ రావా’ లో హీరో చిన్నప్పటి కథ ఒకవైపు, పెద్దయ్యాక హీరోయిన్ తో ఇంకో కాలంలో ఇంకో కథ ఇంకోవైపు నడుస్తాయి. ఈ రెండిటి మధ్య  వీటిని ప్రేరేపించే ప్రస్తుత ప్రధాన కథ వుంటుంది. గాడ్ ఫాథర్ – 2, ది ఫౌంటెయిన్ లని కూడా ఇలా చూడొచ్చు. ఇంకా సైన్స్ ఫిక్షన్ లో ఈ ప్రయోగం వుంటుంది. ఆదిత్య - 369, బ్యాక్ టు ది ఫ్యూచర్ లని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్లేలో విభిన్న కాలాల కథలు ఎక్కడా ఒకదానితో  ఒకటి స్పర్శించవు. కాకపోతే గత కాలపు కథల్లో వున్న పాత్రల  ప్రస్తుత కాలపు ప్రధాన కథలో పంథాని  ప్రభావితం చేసే విధంగా వుంటాయి. సైన్స్ ఫిక్షన్ తప్పించి, ఇతర జానర్స్ లో విభిన్న కాలాలంటే అవన్నీ విభిన్న కాలాల  ఫ్లాష్ బ్యాకులే మళ్ళీ రావాలోలాగా . వీటితో జాగ్రత్తగా ఉండకపోతే మొత్తం కథ గజిబిజి అయిపోతుంది. మల్టిపుల్ టైం లైన్స్  ఒక ప్రధాన కథని ఆశ్రయించి వుంటాయి. ప్రధాన కథలో పాత్రలు గతాన్ని తల్చుకున్నప్పుడు ఎన్ని గతాకాలాలు తల్చుకుంటే అన్ని టైం లైన్స్ లో అప్పటి కథలు కనపడతాయి. ప్రేక్షకుల్ని తికమక పెట్టకుండా వీటిని నడపాలంటే ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ అమెరికా చూడవచ్చు. ఇందులో 1920 – 30 – 60 మూడు కాలాల కథలు సజావుగా సాగుతాయి. 

          4. హైపర్ లింక్ : 
      ‘శివ’ లాంటి లీనియర్ కథల్లో సంఘటనలు  చైన్ రియాక్షన్ లా వుంటాయి. అంటే ఒక సంఘటన ఇంకో సంఘటనకి దారి తీయడం, ఈ సంఘటన మళ్ళీ ఇంకో సంఘటనకి దారితీయడం...ఇలా...ముగింపు వరకూ ఎడతెగని యాక్షన్ రియాక్షన్ల ప్లేగా వుంటాయి.  అంటే ‘అ’ తో మొదలైతే ‘అంఅః’ దాకా ఆగకుండా సాగే  సంకుల సమరమన్న మాట. మధ్యమధ్యలో ఎక్కడా ఉ అనో, ఐ అనో, ఓ అనో సంఘటనలు మిస్ కాకుండా – లింకు కోల్పోకుండా వుంటాయి.  హైపర్ లింక్ విషయానికొస్తే మల్టిపుల్ టైంలైన్ అయినా కావొచ్చు, లేదా ఒకే కాలంలో వేర్వేరు పాత్రల  విడివిడి కథలు కావచ్చు,  అవన్నీ ఒకదానితో వొకటి లింక్ అయి వుంటాయి. ఒక టైంలైన్ లో, లేదా ఒక కథలో ఒకరికి జరిగే సంఘటన ప్రభావం, ఇంకో టైం లైన్లో,  లేదా ఇంకో కథలో ఇంకో పాత్రని ప్రభావితం చేస్తూంటాయి. ఈ పాత్రలన్నీ చివరికొచ్చేసరికి ఒకే ముగింపుకి  కనెక్ట్ అవుతాయి. ఈ హైపర్ లింక్ ప్లే మనుషులంగా మనం ఎక్కడెక్కడో ఎవరెవరితోనో కనెక్ట్ అయి వుంటామన్న ఫీల్ ని ప్రేక్షకులని కలగజేస్తుంది. దీని ప్రధానోద్దేశం ఇదే. హేపీ ఎండింగ్స్, ట్రాఫిక్, మంగోలియా, వేదం, మెట్రో (తమిళ డబ్బింగ్) కొన్ని ఉదాహరణలు. 

          5. ఫేబులా - సియోజై (Syuzhet) ప్లే :  
      ఇది రష్యన్ నుంచి హాలీవుడ్ కమర్షియల్ చేసుకున్న ప్లే. ఈ కథలు ముగింపుతో ప్రారంభమవుతాయి. ఈ ముగింపుకి ఎలా చేరుకుంది కథ అనే కథనాన్ని చేసుకుపోతుంది. అంతే గానీ ఎందుకు చేరుకుందనే ప్రశ్నతో కాదు. ‘ఎందుకు’ చేరుకుందనే ప్రశ్నతో కథనం చేస్తే ఒక్క ముక్కలో ఆ కారణం చెప్పేయ వచ్చు. అందుకని  ‘ఎలా’ చేరుకుందనే కథనం ప్రారంభమవుతుంది.  ఇందులో ఫెబులా అనేది ఫ్లాష్ బ్యాకుల్లో వచ్చే కథనమైతే, సియోజై అనేది, ఆ గతాన్ని  తెలుసుకునే క్రమంలో ప్రస్తుత కాలపు పాత్ర కథ. ‘సిటిజన్ కేన్’ క్లాసిక్ ఉదాహరణ. ఇందులో ప్రధాన పాత్ర మరణం దగ్గర్నుంచి కథ ప్రారంభమవుతుంది. అతను  రోజ్ బడ్ అనే మాట చెప్పి మరణిస్తాడు. అ మాట పట్టుకుని జర్నలిస్టు అతడి జీవితాన్ని శోధిస్తూ పోతాడు. జర్నలిస్టు వివిధ వ్యక్తుల్ని కలవడం వర్తమాన కాలపు కథ అయితే (ప్ప్రెజెంట్ టైం), ఇది ‘సియోజై’ అవుతుంది. ఆయా వ్యక్తులు వివిధ టైం లైన్స్ లో మరణించిన ప్రధాన పాత్ర గురించి చెప్పే విషయాలు ఫ్లాష్ బ్యాకులతో ‘ఫెబులా’ అవుతుంది. మళ్ళీ ఈ వ్యక్తులు క్తులు చెప్పే ఒక్కో ఫ్లాష్ బ్యాకుతో టెన్షన్, సస్పన్స్  పెరుగుతాయి. వీటిని  ఫెబులా తెలుసుకుంటున్న పాత్ర (ఇక్కడ జర్నలిస్టు) అనుభవిస్తుంది. ‘వెనిల్లా స్కై’ కూడా దీని కిందికే వస్తుంది. 

          రివర్స్ క్రోనాలజీ :  
      ఇది కథని వెనుక నుంచి చెప్పడం. అయితే దీనికీ ఫేబులా - సియోజై (Syuzhet) ప్లేకీ తేడా ఏమిటంటే, ఫేబులా - సియోజై (Syuzhet) ప్లే వెనక్కి వెళ్ళే కథనం ఒక క్రమంలో వుంటే, రివర్స్ క్రోనాలజీ వెనక్కెళ్ళే  కథనానికి ఒక క్రమం వుండదు. సీన్లు వెనకా ముందూ అవుతూంటాయి. ప్రారంభం ముగింపు తోనో, లేదా ముగింపు మందు నుంచో వుండవచ్చు. ఐతే ఇదే టెన్షన్ పుట్టించేలా వుంటుంది. ‘మెమెంటో’ దీనికుదాహరణ. పాత్ర అసలెవరు? అన్న ప్రశ్నతో ప్రారంభమై, ఎందుకీ చర్యలకి పాల్పడుతోంది, అసలేం జరిగింది – అనే అనుబంధ ప్రశ్నలని రేకెత్తిస్తూ, సమాధానం దొరుకుతోందనగా ఆ సీను బ్రేక్ అయి ఇంకో సంబంధం లేని సీనుతో మొత్తంగా ఆ పాత్ర మానసిక సంక్షోభాన్ని ప్రతిబింబిస్తూ మూలకారణానికి చేరుకుంటుంది కథ.
(సశేషం)

సికిందర్  
ప్లేలన్నీ ఎలా ప్లే చేస్తాయి? -2