రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, మార్చి 2017, బుధవారం

రివ్యూ!



రచన – దర్శకత్వం : కార్తీక్ నరేన్
తారాగణం : రెహమాన్, ప్రకాష్ విజయరాఘవన్, అశ్విన్ కుమార్, అంజనా జయప్రకాష్, యషికా ఆనంద్, శరత్ కుమార్, వినోద్ వర్మ, కునాల్ కౌశిక్ తదితరులు
మాటలు : శ్రీరాం ప్రసాద్ గోగినేని,  సంగీతం : జేక్స్ బిజోయ్, ఛాయాగ్రహణం : సుజిత్ సరంగ్, కూర్పు : శ్రీజిత్ సరంగ్
బ్యానర్ :
శ్రీ తిరుమ తిరుపతి వెంకటేశ్వ ఫిలింస్
నిర్మాత : చదలవాడ పద్మావతి
విడుదల : మార్చి 10, 2017

***


        ప్పుడు కొత్తగా వస్తున్న దర్శకుల్లో అనేకులు  అరిగిపోయిన రోమాంటిక్ కామెడీలతో,  హార్రర్ కామెడీలతో టైం పాస్ చేస్తూంటే, కొందరు తెలివైన షార్ట్ ఫిలిం మేకర్లు ఈ చాదస్తాలు మానుకుని,  రియలిస్టిక్ క్రైమ్ తో కొత్త పుంతలు తొక్కుతూ యువప్రేక్షకుల్ని తమ వైపు
తిప్పేసుకుంటున్నారు. రోమాంటిక్  కామెడీలతో, హార్రర్ కామెడీలతో విసిగిన ప్రేక్షకులు వీళ్ళ సినిమాలపైపు తరలిపోతున్నారు. మంచి ఓపెనింగ్స్ తో, మౌత్ టాక్ తో, సంచలనాలతో, 
చిన్న - మధ్య తరహా సినిమాల మార్కెట్ ని షార్ట్ ఫిలిం మేకర్లు తన్నుకు పోతున్నారు. మీనింగ్ ఫుల్ సినిమాలకి వీళ్ళు కొత్త అడ్రెస్ అవుతున్నారు, బిజినెస్ అడ్డాగా మారుతున్నారు. 
       
       కార్తీక్ సుబ్బరాజ్, అశ్విన్ శరవణన్, సుజిత్, సంకల్ప్ రెడ్డి, లోకేష్ కనక రాజ్, ఆల్ఫోన్స్ పుతరేన్, కార్తీక్ నరేన్...లాంటి షార్ట్ ఫిలిం మేకర్లు క్రైమ్ జానర్ తో కొత్త ప్రయోగాలు చేస్తూ దేశ దృష్టిని ఆకర్షిస్తున్నారు.  ఇప్పుడు వచ్చేసి కార్తీక్ నరేన్ తమిళంలో ‘ధురువంగళ్ పతినారు’ – (తీవ్రతలు పదహారు)- ని ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళి యూరప్ కి చెందిన నియో నోయర్ క్రైం మిస్టరీ జానర్ తో  తన ప్రయోగం చేసి చూపించాడు. యూరోపియన్ జానర్స్ తో దేశీయంగా ప్రయోగాలు చేయాలంటే క్రైంజానర్ లో మాత్రమే సురక్షితంగా చేసి బయటపడగలమని సంకేతం పంపాడు. 2015 లో  తమిళంలో ‘మాయ’ (‘మయూరి’) అనే హార్రర్ తో అపూర్వంగా యూరోపియన్ జానర్ ని ఇండియనైజ్ చేయగల్గిన అశ్విన్ శరవణన్ తర్వాత, కార్తీక్ నరేన్ సక్సెస్ అయ్యాడు. తెలుగులో ‘16- ఎవ్విరీ డిటెయిల్ కౌంట్స్’  ( ప్రతీ ఆధారం కీలకమే) గా డబ్బింగ్ చేసిన ఈ క్రైం మిస్టరీ- తెలుగులో అపరాధపరిశోధక కథలతో సినిమాల్ని నోచుకోని ప్రేక్షకులకి ఇదొక అవకాశం. మరుగున పడిపోయిన జానర్స్ ని అలాగే తొక్కి వుంచి, అరటితొక్క సినిమాలతో ప్రేక్షకుల్ని మభ్య పెట్టే కాలం అంతరించిపోతోంది... లోపలినుంచి మార్పు రాకపోతే బయటి నుంచి షార్ట్ ఫిలిం మేకర్లనే దూతల్ని  పంపి కచ్చితంగా మార్పు తీసుకొస్తుంది కాలం...

కథ 
      ఒక రిటైర్డ్ పోలీస్ ఇన్స్ పెక్టర్,  పోలీస్ శాఖలో చేరాలనుకుంటున్న ఇంకో యువకుడికి చెప్పుకొచ్చే ఒక పెండింగ్ కేసు వివరాల కథ ఇది. ఐదేళ్ళ క్రితం ఈ కేసులో నిందితుల్ని  పట్టుకునే ప్రయత్నంలో కాలు పోగొట్టుకుని ఉద్యోగానికి దూరమైన ఇన్స్ పెక్టర్ దీపక్ (రెహమాన్), ఐపీఎస్ అవాలనుకుంటున్న అశ్విన్ (అశ్విన్ కుమార్) అవగాహన కోసం చెప్పుకొచ్చే ఈ కేస్ డిటెయిల్స్ ప్రకారం - ఓ వర్షపు రాత్రి ఒక అపార్ట్ మెంట్ లో మాస్కు ధరించిన వ్యక్తి ఇద్దర్ని షూట్ చేస్తాడు. వాళ్ళు  శృతి (యషికా ఆనంద్), రాజీవ్  (కునాల్ కౌషిక్ )అనే లవర్స్. అదే రాత్రి వర్షంలో ప్రవీణ్, మనో, ప్రేమ్ అనే ముగ్గురు ఎంబీఏ స్టూడెంట్స్  తాగి కారులో వస్తూ ఒకణ్ణి గుద్దేస్తారు. వాడు చచ్చిపోతే డిక్కీలో వేసుకెళ్ళిపోతారు. దారిలో ట్రాఫిక్ పోలీసులు ఆపితే ఆ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ మీద దాడి చేసి తప్పించుకుంటారు. యాక్సిడెంట్ స్పాట్ లోనే అక్కడే ఇంకొకడు రివాల్వర్ తో కాల్చుకుని చచ్చిపోయాడని పేపర్ బాయ్ వెళ్లి పోలీసులకి చెప్తాడు.  అదే  పేపర్ బాయ్ యాక్సిడెంట్ దృశ్యం కూడా చూశానని చెప్తాడు. ఉదయానికల్లా ఈ కాల్పులు, యాక్సిడెంట్ సంఘటన ఇన్స్ పెక్టర్ దీపక్ కి రిపోర్టయి దర్యాప్తు మొదలెడతాడు. అపార్ట్ మెంట్ లో రక్తం వుంటుంది గానీ శృతి కన్పించదు. శృతి ఫ్రెండ్ వైష్ణవి (అంజనా జయప్రకాష్) తను ఉదయమే వూర్నుంచి వచ్చానంటుంది. బయట కాల్చుకుని ఆత్మ హత్య చేసుకున్నట్టు వున్న శవం క్రిష్ దని తేల్తుంది. 

          ఇలా ఇన్స్ పెక్టర్ దీపక్ కి ఇప్పుడు ఒక యాక్సిడెంట్, సూసైడ్ కేసులతోబాటు, శృతి అదృశ్యం అనే మూడు సంఘటనలూ అంతుచిక్కని  మిస్టరీగా మారతాయి. ఈ మూడింటికీ వున్న పరస్పరసంబంధం తేల్చడానికి దర్యాప్తు తీవ్రతరం చేస్తాడు. ఇందుకు కొత్తగా చేరిన కానిస్టేబుల్ గౌతమ్ (ప్రకాష్ విజయరాఘవన్) తోడ్పాటుగా వుంటాడు. ముగ్గురు స్టూడెంట్స్ పాత్ర, డిక్కీలో మాయమైన శవం, క్రిష్ ఆత్మహత్య, ఎవడో సైకో కిల్లర్ వున్నాడన్న అనుమానం, ఆఖరికి వైష్ణవి ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా మారి,  చిక్కుముళ్ళు పెరుగుతూ పోతూంటాయి.

          ఈ మిస్టరీని దీపక్ ఎక్కడిదాకా ఛేదించ గల్గాడు? ఎందువల్ల అతడి కాలు విరిగింది? అతడి  అర్ధాంతర రిటైర్ మెంట్ తర్వాత  కేసు ఏమైంది?...ఇవన్నీ దీపక్ చెప్పుకొచ్చే ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తాయి. 

 
ఎలావుంది కథ 
      ప్రధానంగా ఏమిటంటే, ఇప్పుడు సమాజంలో ఇంకో ప్రపంచముంది. అది బాగా డబ్బున్న వాళ్ళ చీకటి ప్రపంచం. గ్లోబలైజేషన్ ఫలాలు విరివిగా  వచ్చి పడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వందల, వేలకోట్లు సునాయాసంగా గడిస్తూ ఆ సంపదని ప్రదర్శించుకుంటున్న నయా సంపన్నుల జీవన శైలి నేరమయమవుతోంది. నైట్ లైఫ్ అని ఏర్పాటు చేసుకుని పాల్పడే  కార్యకలాపాలు తెలియకుండానే క్రైంకి దారి తీస్తున్నాయి. ఇలా కేసుల్లో  ఇరుక్కుని పడే పాట్లు ఇప్పుడు ఈ జానర్ లో సినిమాలకి కొత్త కథలవుతున్నాయి. గతసంవత్సరం ముంబాయిలో షీనా బోరా మర్డర్ కేసు ఇలాటి హై  ప్రొఫైల్ కేసే. షైతాన్, కహానీ- 2, పింక్ ఇలాటి హై ప్రొఫైల్ కేసులతో కథలే.  తెలియని ఇంకో ప్రపంచాన్ని తెరచి చూపిస్తూ ఇవి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.  కాలంతో సంబంధం లేకుండా రొటీన్ గా మధ్యతరగతి అప్పారావో, ఇంకో బస్తీ శీనో క్రిమినల్స్  అవడం కొత్తదనం లేని, నేత్రానందం కల్గించని  పాత మూస ఫార్ములా లేజీ కథలు. నియో రిచ్ క్రిమినాలిటీ నేత్రానందం కల్గించే ఇంటలిజెంట్  కథలు, పోలీస్ ప్రొసీజురల్ కథలు. క్రైం ఇన్వెస్టిగేషన్ ఆధారిత అపరాధ పరిశోధక కథలు. ఇలాటిది ‘తని ఒరువన్’ వచ్చింది. కానీ అది రియలిస్టిక్ కాదు- ఇన్వెస్టిగేషన్ లో లాజిక్ ని ఎగేసి స్టార్ ని ఎలివేట్ చేసే ఫార్ములా మూస. 

          ప్రస్తుత కథ ఉన్న స్టార్ ని కాదు కదా, అతడి ఇన్స్ పెక్టర్ పాత్రని సైతం బిల్డప్పులతో కృతకంగా మార్చని సహజ కథ. నిజజీవితంలో పోలీసులు, నిందితులు, ఇతర్లు ఎలా వుంటారో అలాగే చూపించే వాస్తవిక కథ.

         దీన్ని నియో నోయర్ క్రైం మిస్టరీ జానర్ లోకి కూర్చారు. నియో  నోయర్ జానర్ ఈమధ్యకాలంలో పరిచయమైంది గానీ, దీని పూర్వ రూపం ఫిలిం నోయర్ గా వుండేది. 1940-50 లలో ఒక ఊపు వూపిన బ్లాక్ అండ్ వైట్ ఫిలిం నోయర్  సినిమాలు క్రైం జానర్ ని కొత్తమలుపు తిప్పాయి. యూరప్ లోని ఫ్రాన్స్ లో ప్రారంభమైన ఈ ఉద్యమం జర్మన్ విజువల్ టెక్నిక్ ని కలుపుకుంది. ఆ  విజువల్ స్టయిల్ వచ్చేసి జర్మన్  ఎక్స్ ప్రెషనిస్ట్ సినిమాటోగ్రఫీ నుంచి వచ్చింది. తెలుపు నలుపు నీడలతో నేరమయ వాతావరణాన్ని, నేరగాళ్ళనీ  ఒకలాంటి ఏవగింపుతో  చూపించే వాళ్ళు. దీన్ని హాలీవుడ్ అందిపుచ్చుకుని దున్నుకుంది. 1960-70 లలో మారిన కాలమాన పరిస్థితుల ననుసరించి నియో నోయర్ గా నవీకరణ చెందింది ఈ జానర్. ఈ కథలు  నేరాన్ని పరిశోధించే ఒక పోలీసు అధికారి కేంద్రంగా వుంటాయి. మంచి పౌరుడే, కానీ బాగా డబ్బుండడం వల్ల వెధవ పన్లు చేసి నేరంలో ఇరుక్కుంటాడు- ఇలాటి పాత్ర ఒకటి, ఇంకా నీతిలేని ఆడా మగా పాత్రలు కొన్ని, చట్టాన్ని కిందామీదా చేసే వాళ్ళు కొందరు, అనుమానితులు మరికొందరు...ఇలా చుట్టూ వుండే సామాన్య ప్రపంచానికి భిన్నంగా  కరుడుగట్టిన, ఏవగింపు కల్గించే  నీతీ రీతీ లేని పాత్రలతో నిండి వుంటాయి. 

         1944 లో బిల్లీ వైల్డర్ దర్శకత్వం వహించిన ఫిలిం నోయర్ క్లాసిక్ ‘డబుల్ ఇండెమ్నిటీ’ ఆధారంగా మహేష్ భట్ రాసిన ‘జిస్మ్’ (బిపాషా బసు, జాన్ అబ్రహాం) నియో నోయర్ కి ఉదాహరణ. ఇంకా హిందీలో మక్బూల్, కమీనే, జానీ గద్దర్, మనోరమ సిక్స్ ఫీట్ అండర్,  మలయాళంలో అరణ్య కాండం, కన్నడలో అపరిచిత...లాంటివి వచ్చాయి. 

          మనుషులు బతికే హడావిడిలో జీవించడం మానేస్తారు, జీవించాల్సి వచ్చేటప్పటికి చెడిపోతారు. ‘భజగోవిందం’ లో ఆది శంకరాచార్య చెప్పినట్టు – దుఃఖ నివృత్తికోసం సంపాదిస్తారు, సుఖప్రాప్తి కోసం సంపదని అనుభవిస్తారు. కానీ సుఖ సంతోషాలనేవి తమలోనే వుంటాయని మర్చిపోతారు- నువ్వు స్పిరిచ్యువల్ జర్నీ కోసం ఈ భూమ్మీదికి రాలేదు, ఆ ఆత్మే మానవ అనుభవం కోసం నీ శరీరంలో చేరింది- దానికి మంచి అనుభవాన్నిచ్చి మోక్షమార్గం పట్టించు- ఇలా డెప్త్ లో ఈ స్పిరిచ్యువల్ మేసేజే  వుంటోంది ఇలాటి కథల్లో. 

          ప్రస్తుత కథ ఈ చట్రంలో ఈ జానర్ లోనే వుంది. దర్శకుడు ఉద్దేశపూర్వకంగా ఈ జానర్ ని దృష్టిలో పెట్టుకునే చిత్రీకరణ జరిపి, సౌండ్ డిజైనింగ్ కూడా చేశాడని తెలిసిపోతూంటుంది. హై ప్రొఫైల్ ఎంబీఏ స్టూడెంట్ల జీవనశైలి, దాంతో అరిష్టాలు; హైప్రొఫైల్ బాయ్ ఫ్రెండ్- గర్ల్ ప్రెండ్ ల మల్టిపుల్ రిలేషన్ షిప్స్,  వాటి  పర్యవసానాలు...కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలు, తప్పించుకునేందుకు ఎత్తుగడలు...వీటన్నిటినీ జానర్ మర్యాద చెడకుండా చిత్రించారు.

ఎవరెలా చేశారు 
       దీపక్ పాత్రలో రెహమాన్ కూల్ గా నటిస్తాడు. ఎప్పుడూ గట్టిగా కూడా మాట్లాడడు. ఒక ఇన్స్ పెక్టర్ గా దురుసుగా కూడా ప్రవర్తించడు. ఇంగ్లీషు ఎక్కువ మాట్లాడతాడు. కాస్త మతిమరుపు కూడా వుంటుంది. ఇందుకే తోడుగా కానిస్టేబుల్ ని పెట్టుకుంటాడు. ఈ మతిమరుపు అనే లక్షణం కథని ఏ మలుపూ తిప్పకుండా  వృధా అయింది. దర్యాప్తు సందర్భంగా ఎక్కడో ఏదో చూసి మర్చిపోయి వుంటే- అదే కీలకం అయివుంటే- ఈ క్రైం డ్రామా ఇంకా రక్తి కట్టేది. ఇలాంటిది లేకపోగా, ఎప్పుడో  ఐదేళ్ళ తర్వాత ఈ కేసుగురించి అంత పూస గుచ్చినట్టు ఎలా చెప్తాడా అన్న సందేహం  కల్గిస్తుంది ఈ మతిమరుపు లక్షణం. పాత్ర చిత్రణ దెబ్బతింది. 

          రెండో ముఖ్యపాత్రలో కానిస్టేబుల్ గా నటించిన  ప్రకాష్ విజయరాఘవన్ ది షార్ప్ బ్రెయిన్. దీన్ని దర్యాప్తుని ముందుకు తీసుకుపోవడానికి వాడుతూంటాడు. చివర్లో కథని ముగిస్తూ ట్విస్టు ఇచి,  అప్పుడు రిటైరైన ఇన్స్ పెక్టర్ నే కంగు తినిపిస్తాడు. స్టూడెంట్లుగా నటించిన ముగ్గురూ కూడా సహజ పాత్రల్లా వుంటారు. వాళ్ళ పదజాలం కూడా వాళ్ళ జీవితాలకి తగ్గట్టే వుంటుంది. సినిమా డైలాగులు అన్ని జానర్లకీ  ఒకే రొడ్డ కొట్టుడుగా, రసవిహీనంగా, కృత్రిమంగా వుంటున్నాయనేది తెలిసిందే. ఏ సినిమాలో చూసినా ఫ్రెండ్స్ – బావా, మామా అని పిల్చుకునే రోత ఒకటి కంటిన్యూ అవుతోంది. ఇక్కడ ఫ్రెండ్స్ క్యారక్టర్స్ తో ఈ ఊచకోత మనకి వుండదు. ఫ్రెష్ గా, ఆసక్తికరంగా వుంటుంది. ఈ కథ ఉన్నతవర్గాల చీకటి లోకాల్ని వాస్తవిక దృష్టితో ఆవిష్కరిస్తోందనుకుంటే- ఆ వాస్తవికతని ఆ లైఫ్ స్టయిల్ తోనే ఓపెన్ చేసి థ్రిల్ చేయాలి- అంతేగానీ ఇక్కడా రొటీన్ మూస ఫార్ములా రాతలు రాసుకుంటే నియో రిచ్ క్యారక్టర్స్ గురించి ఏం చెప్తున్నట్టు? తెలియనిది ఏం వెల్లడిస్తున్నట్టు? 

          ఇతర పాత్రల్లో నటించిన వాళ్ళందరూ ఓకే. టెక్నికల్ కెమెరా వర్క్ సరే, ఇదొక  విజువల్ డిజైన్ తో వుంది- పాత్ర కదుల్తోంటే కెమెరా కూడా కదలడం. అలాగే సౌండ్ ఎఫెక్ట్స్, బిజిఎం షాక్ వేల్యూతో వున్నాయి. ఇక ఎడిటింగ్ అయితే అత్యంత షార్ప్ గా వుంది. ఎక్కడా గిమ్మిక్కులు చేయలేదు. దృశ్య కాలుష్యాన్ని సృష్టించ లేదు. 

         22 ఏళ్ల ఇంజనీర్ కం షార్ట్ ఫిలిం దర్శకుడు కార్తీక్ నరేన్ తొలి సినిమాతోనే  ఇంత  పరిణతి చూపించడం ఒక వండర్. ఆర్టిస్టుల చేత నటనని తీసుకోవడంలోగానీ, మాట్లాడించడంలో గానీ చాలా మెచ్యూరిటీని కనబర్చాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ని రియలిస్టిక్ గా చూపిస్తూ, ఏ ఘట్టాన్ని ఎలా చిత్రీకరించాలో అనుభవజ్ఞుడుగా నిర్ణయించుకుంటూ ప్రొఫెషనల్ లా ఒక క్వాలిటీ మూవీని ఇచ్చాడు. తనని నమ్మి నిర్మాతలు ఎవరూ ముందుకు రాక పోయినా తనే తిప్పలుపడి నిర్మాతగా మారాడు.

  చివరికేమిటి 
        దర్శకుడు ఇంటలిజెంట్ గా వుండాలని కోరుకుంటారు ప్రేక్షకులు, లేజీ రైటింగ్ తో నేలబారుగా, సగటు జీవిలా వుండాలనుకోరు. లేకపోతే రోమాంటిక్ కామెడీలకీ, హార్రర్ కామెడీలకీ ఈ గతే పట్టించరు ప్రేక్షకులు.  దర్శకుడు కార్తీక్ ఇంటలిజెంట్ గా రాత పని పూర్తిచేశాడు. 28 రోజుల్లో తీత పని ముగించేశాడు. అపరాధపరిశోధక కథని పాటలు, కామెడీ, ఫైట్లు అనే ఆకర్షణలకి లోనవ కుండా పోలీస్ ప్రొసీజురల్ కథా లక్షణానికి కట్టుబడి, వీలైనంత ప్రొఫెషనలిజం కనబర్చాడు. ఇన్వెస్టిగేషనే ప్రధానంగా నడిచే ఈ కథాక్రమంలో అంచెలంచెలుగా లభిస్తున్న సాక్ష్యాధారాల్ని జానర్ రీత్యా ప్రేక్షకుల మీద ప్లే చేస్తూ-  అసలేం జరిగింది? అన్న ప్రశ్న చుట్టూ పజిల్ నీ, మెదడుకి మేతనీ ప్రేక్షకులకి పంచుతూ,  ప్రేక్షకులు యాక్టివ్ గా, బిజీగా  సినిమా చూసేట్టు చేయాలనీ విశ్వప్రయత్నం చేశాడు. ఇందులో సందేహం లేదు. (అరటితొక్క, ఇడ్లీ మూస సినిమాలు చూసి చూసి వున్నవే  కాబట్టి,  వాటిని పాసివ్ గా, బోరుకొట్టించుకుంటూ లేజీగా, బద్ధకంగా,  సీట్లలో పడుకుని వుండిపోయి ప్రేక్షకులు చూసే దౌర్భాగ్య దృశ్యాలు మనకి కన్పిస్తూంటాయి). అడుగడుగునా దృష్టి మరల్చలేని సస్పెన్సు ని  పోషిస్తూ,  చివరిదాకా ఒకే టెంపోతో తీసికెళ్లే ప్రయత్నం చేశాడు ఈ గంటా ఐదునిమిషాల సేపూ. 

          అయితే పోలీస్ ఇన్వెస్టిగేషనే  కథ అయినప్పుడు అందులో లొసుగులు కన్పించకూడదు. ప్రేక్షకులు పసిగట్టేసే ఆ లొసుగులతో విచారణాధికారి సిల్లీగా కన్పిస్తాడు. ఒకవేళ అతను  కేసుని తిమ్మినిబొమ్మిని చేయడానికే  లొసుగుల్ని పట్టించుకోవడం లేదనే అర్ధంలో వుంటే అదివేరు. అయినా వాటన్నిటికీ చివర సమాధానం చెప్పాల్సిందే. లేకపోతే సమగ్ర కథవదు. 

          ఎవ్విరీ డిటెయిల్ కౌంట్స్ అన్నప్పుడు ప్రేక్షకులకి కళ్ళ ముందు కన్పించే ఏ డిటెయిల్ నీ వదలకూడదు- అధికారి రికార్డు చేయాల్సిందే. రికార్డు చెయ్యక, చివర్లో ఎక్స్ ప్లనేషన్ ఇవ్వకా  వదిలేస్తే, అది  కథ చేయలేక దర్శకుడు తప్పించుకున్నట్టే అవుతుంది. ఇంత చిన్నవయసులో ఇంత సినిమా తీసినందుకు తప్పకుండా దర్శకుడు అభినందనీయుడే. కొన్ని తప్పులు చూపి అతణ్ణి డీగ్రేడ్ చేయలేం. ఈ జానర్ లో అతను మాస్టర్. చిన్న చిన్న లాజిక్కులు పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు- ఈ జానర్ లో కథాకథనాలు తప్పనిసరిగా లాజికల్ గా పటిష్టంగా వుండాలన్న నియమం వున్నప్పటికీ. కానీ ఆ లొసుగులు భూతాల్లా కన్పిస్తూ మొత్తం కథనే క్యాన్సిల్ చేస్తున్నవైతే, తప్పకుండా వాటి గురించి చెప్పుకోవాలి.

          1. షాట్స్, 2. ఎటాక్, 3. సెటప్. వీటి లోపాలు స్పష్టంగా ప్రేక్షకులకి తెలిసిపోతూంటాయి. షాట్స్ - అపార్ట్ మెంట్ లో సైకో కిల్లర్   రివాల్వర్ పేల్చినప్పుడు ఆ షాట్స్ థియేటర్ దద్దరిల్లేలా మాంచి సౌండ్ ఎఫెక్ట్ తో ప్రేక్షకుల్ని అదరగొడతాయి. మరి అవే  షాట్స్ అపార్ట్ మెంట్లో ఎవరికీ విన్పించవా? పక్క ఫ్లాట్లో వాళ్ళకీ? తెల్లారి ఇన్స్ పెక్టర్ వచ్చి చూసినప్పుడు ఈ షాట్స్ గురించి ఎవర్నీ అడగడా? మతిమర్పుపు కాబట్టి మర్చిపోయాడా? అలా అన్పించదు. 

          ఎటాక్ – స్టూడెంట్స్ యాక్సిడెంట్ చేసి, చచ్చిన వాణ్ణి డిక్కీలో వేసుకు పారిపోతూ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ కి దొరికినప్పుడు, అతడి మీద ఎటాక్ చేసి పారిపోతారు. ట్రాఫిక్ పోలీసుని కొడితే పెద్ద కేసవదనీ, ఈ కారు ఆంధ్రా రిజిస్ట్రేషన్ అనీ, వాళ్ళు కనుక్కుని వచ్చేటప్పటికి మూడ్రోజులు పడుతుందనీ, ఈ లోగా శవాన్ని వదిలించుకోవచ్చనీ వూపిరి పీల్చుకుంటారు.

          ట్రాఫిక్ పోలీసుని కొట్టినా పెద్ద కేసవదని డైలాగు వుండడం అభ్యంతరకరమే. ఇది నిజమే కాబోలనుకుని సినిమా  చూసిన వాళ్ళు  అడ్డగోలు డ్రైవింగ్  చేసి ట్రాఫిక్ పోలీసుల్ని కొడుతూపోతే? ఇంకా ఈ సీనులో కొట్టిన తీరు అటెంప్ట్ టు మర్డర్ కిందికొస్తుంది. రెండోది, కారుని  కనుక్కోవడానికి మూడ్రోజులు పట్టదు. నంబర్  కూడా నోట్  చేసుకున్న  ఆ ఇన్స్ పెక్టర్ వెంటనే నైట్ పెట్రోలింగ్స్ ని ఎలర్ట్ చేస్తే, ఏ రూట్లోనో  అప్పుడే దొరికిపోతారు. 

          ఈ ఎటాక్ కూడా ఈ కథకి కీలక ఘట్టమే. కానీ ప్రోమోస్ లో, సినాప్సిస్ లో –ఒక సూసైడ్, ఒక యాక్సిడెంట్ ఇంకో కిడ్నాప్ – ఈ మూడు వేర్వేరు సంఘటనల పజిల్ అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ మీద ఎటాక్ ని వదిలేశారు. ఇది కూడా కలుపుకుంటే నాల్గు సంఘటనలవుతాయి. నిజానికిది నాల్గు సంఘటనల క్రైం స్టోరీ. అప్పుడు గాయపడ్డ ఆ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ తప్పకుండా తన మీద ఎటాక్ ని కంప్లెయింట్ చేస్తాడు- అప్పుడు ఇన్స్ పెక్టర్ దీపక్ ముందు మొత్తం నాల్గు సంఘటన లుంటాయి. ఈ ఎటాక్ ని దర్శకుడు కథకోసం కావాలని ఉపేక్షించినట్టు కనపడుతోంది. ఈ ఎటాక్ ని పరిగణనలోకి తీసుకుంటే తెల్లారే స్టూడెంట్లు దొరికిపోయి కథ ఇంకెటో  పోతుంది. 

        సెటప్- ఈ సంఘటనలు రాత్రిపూట  భారీ వర్షంలో జరుగుతాయి. యాక్సిడెంట్ సంఘటనని తెల్లవారుజాము రెండున్నరకి చూశానని అంటాడు పేపర్ బాయ్ కూడా. అంటే  అప్పుడు కూడా భారీ వర్షం కురుస్తూనే వుంది. ఉదయం ఇన్స్ పెక్టర్ దీపక్  దర్యాప్తు కొచ్చినప్పుడు మాత్రం మచ్చుకి కూడా చుక్క వర్షం పడ్డట్టు లొకేషన్ వుండదు. ఇక్కడ్నించీ పదే పదే చూపించే ఈ లొకేషన్ తో బాటు,  పక్కనే అపార్ట్ మెంట్ వున్న లొకేషన్ కొద్ది గంటల క్రితంవరకూ భారీ వర్షం కురిసిన ఆనవాళ్ళే లేకుండా వుంటాయి. 

          ఒకసారి ఏదో పొరపాటున లొకేషన్స్ కంటిన్యుటీ మర్చిపోయారే అనుకుందాం- రాం గోపాల్ వర్మ ‘వంగవీటి’ లో వర్షం పడ్డ మరుసటి షాట్ కరువుకాటకంతో తల్లడిల్లుతున్న పొడినేలగా వున్నట్టు. కానీ పదే పదే  వర్షం జాడలేని ఆ లొకేషన్లే  చూపిస్తూ కంటిన్యుటీ ఎలా మర్చిపోతారు- ఇది ప్రేక్షకుల పుండు మీద పదే పదే కారం జల్లడమే  అవుతుంది.

          ఈ ప్రధాన లోపాలు మొత్తం కథనే క్యాన్సిల్ చేస్తున్నాయి. కథే వుండేందుకు అవకాశం లేదు. లేని కథని చూపించినట్టయ్యింది. ఎప్పుడైతే రివాల్వర్ షాట్స్ పేల్తాయో అప్పుడే అపార్ట్ మెంట్ లో కలకలం లేస్తుంది. జనం లేచి వచ్చారంటే, బయట సంఘటనలేవీ  జరగవు.  యాక్సిడెంట్ జరగదు, బాయ్ ఫ్రెండ్ క్రిష్ సూసైడ్  సీన్ కూడా క్రియేట్ అవదు. కథే వుండదు. 

          రివాల్వర్ షాట్స్ ఎవరికీ విన్పించకుండా చేసి, అనుకున్న కథ అనుకున్నట్టు వుండే ట్టు చేయాలంటే, ఆ రివాల్వర్ కి సైకో కిల్లర్ సైలెన్సర్ అమర్చుకు రావాలి. అప్పుడు గుట్టు చప్పుడు కాకుండా పనిపూర్తి చేయగల్గుతాడు. కానీ సైలెన్స ర్ రివాల్వర్ ఉపయోగిస్తే ఆడియెన్స్  పక్కలో బాంబులు పడ్డట్టు ట్రెమండస్  సౌండ్స్ ఎఫెక్ట్స్ వుండవు కాబట్టి, దర్శకుడు కథ కంటే కూడా ఈ సౌండ్  ఎఫెక్టే ఇంపార్టెంట్ అనుకున్నట్టుంది.

         యాక్సిడెంట్ ఎపిసోడ్ లో ఆ ఎటాక్ సీన్ అవసరమే లేదు. అది కథకి ఉపయోగపడక పోగా అడ్డుపడుతోంది. ఇక వర్షం కురిపించి  ఒకేసారి దగ్గరదగ్గర ఇన్ని నేరాలు జరుగుతున్నట్టు చూపడమెందుకు? వర్షంతో ఏం పని? ఇందాక సౌండ్ ఎఫెక్ట్స్ గురించి కథని వదిలేసినట్టు, వర్షం మీద కూడా అలాటి ప్రేమని పెంచుకున్నట్టుంది విజువల్స్ బ్రహ్మాండంగా వుంటాయని. తెల్లారి ఆ వర్ష ఛాయలే  లేకుండా చేశారు.  బట్ ఎవ్విరీ డిటెయిల్ కౌంట్స్ అన్నాక, ఘటనా స్థలాల్లో  రాత్రి పడ్డ వర్షం కూడా లెక్కకొస్తుంది. సైకో కిల్లర్ వర్షంలో వచ్చి నేరం చేసినప్పుడు ఆ బురద కీలక సాక్ష్యమవుతుంది. ఫ్లాట్ లో సైకో కిల్లర్ నేరం చేసింది వర్షం పడుతున్నప్పుడు సుమారు అర్ధరాత్రి సమయం. అది శృతి బర్త్ డే సందర్భం. బాయ్ ఫ్రెండ్ రాజీవ్ వచ్చి రింగ్ కూడా తొడిగాడు. అప్పుడే వూర్నించి శృతి ఫ్రెండ్ వైష్ణవి కూడా వచ్చి వుంది. కిల్లర్ ఎటాక్ చేశాడు. అప్పుడు ఇంకేం జరిగిందో సస్పెన్స్ కోసం ఇక్కడాపుతున్నాం. కానీ బాయ్ ఫ్రెండ్ రాజీవ్, వైష్ణవీ, సైకో కిల్లర్ ముగ్గురూ వర్షంలోనే  వచ్చి వుంటే, ఫ్లాట్ లో ఘటనా స్థలం మామూలుగా వుండదు.

          పైగా  ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ ని కూడా చూపించారు. వాళ్ళూ వర్షాన్ని పట్టించుకోరు. కానీ ఫ్లాట్ గోడ మీద రక్తపు మరకలు బయట కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న క్రిష్ వి అని తేలుస్తారు. ఆత్మహత్య చేసుకున్న రివాల్వర్ మీద అతడి వేలిముద్రలున్నాయంటారు. వర్షంలో వేలిముద్రలు పడతాయా? 

          ఇక శృతి కిడ్నాప్ అయిందని భావించిన ఇన్స్ పెక్టర్ ఆమెని వెతికే ప్రయత్నమే చెయ్యడు.
          ఇదే సమయంలో అపార్ట్ మెంట్ పక్కనే ఇంకో బుల్లి సంఘటన జరుగుతుంది. ఆ వర్షంలో అంత రాత్రి వేరే స్టూడెంట్స్  షార్ట్ ఫిలిం తీస్తూంటారు. ఉదయం మళ్ళీ వచ్చి తీస్తూ ఇన్స్ పెక్టర్ కి దొరికిపోతారు. ఆ కెమెరాలో ముఖ్యమైన విషయం వాళ్లకి తెలీకుండా రికార్డయివుంటుంది, అదివేరే విషయం. కానీ రాత్రి అన్ని ఘోరాలు జరిగిన స్పాట్ కి మళ్ళీ తెల్లారి వచ్చి షార్ట్ ఫిలిం తీస్తారా వాళ్ళూ?

          ఇక అపార్ట్ మెంట్ లో సీసీ కెమెరాలే వుండవు, సెక్యూరిటీ అతను  కూడా రాత్రి డుమ్మా కొట్టానంటాడు. ఇన్స్ పెక్టర్ తేలిగ్గా తీసుకుంటాడు. ఇలా దర్శకుడే ఈ సాక్షులకీ, అనుమానితులకీ, కుట్ర దారులకీ సహకరిస్తూ అసలు సూత్రధారిగా వున్నాడనే పెడర్ధం వచ్చేలా సీన్లు రాశాడు. 

          సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎవ్విరీ డిటెయిల్ కౌంట్స్ అంటూ ఎన్నో డిటెయిల్స్ ఇస్తూ పోయాడు. కొంతసమయానికి ఇక  కథని ఫాలో కాలేనంత  సంక్లిష్టం చేశాడు ఎన్నో  డిటెయిల్స్ తో.  ఫస్టాఫ్ అంతా ఆ క్లూ ఈ క్లూ అంటూ, ఆ సాక్ష్యం ఈ సాక్ష్యం అంటూ ఎంతో ఇన్ఫర్మేషన్ పడేస్తూ పోయాడు. ఇంటర్వెల్ కీ  ఏదీ కొలిక్కి రాదు. మళ్ళీ సెకండాఫ్ లో ఇదే ధోరణి. రిటైర్డ్ ఇన్స్ పెక్టర్ ఈ ఫ్లాష్ బ్యాక్ ముగించే టప్పటికి  ఇన్ని డిటెయిల్స్ తో  కేసు ఎటూ తేలకుండానే వుంటుంది. ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక ఈ పెండింగ్ కేసు ఇప్పుడు ఒక ట్విస్టుతో కొలిక్కి వస్తుంది. కానీ దీనికి ముందంతా ఏదీ తేల్చని ఇన్ఫర్మేషన్ హంగామానే. ఎందుకిలా జరిగిందంటే,  దీన్ని ఎండ్ సస్పెన్స్ కథ చేయడం వల్ల. 

          మరి ఈ ముగింపులోనైనా  సందేహాలన్నీ తీర్చాడా అంటే చాలా సందేహాలు తీర్చకుండానే వదిలేశాడు. ఒక ఆంగ్ల పత్రికకి రివ్యూ రాసిన క్రిటిక్ ఇలాటి  సందేహాల గురించి అడిగితే, ఇంకోసారి సినిమా చూస్తే  అర్ధమవుతుందని చెప్పాడు దర్శకుడు. 

          ఇన్వెస్టిగేషన్ లో పోలీసులకి ఎన్నో డిటెయిల్స్ లభించవచ్చు. అవన్నీ కీలకమే అయివుండవు. వాటితో ఎప్పటికప్పుడు అనుమానితుల్ని, సాక్షుల్నీ  ఫిల్టర్ చేసి వదిలించుకుంటూ,  ఒకటో రెండో అంశాలమీద దృష్టిని  కేంద్రీకరించి, కేసుని ఛేదిస్తారు. ఎక్కడైనా ఇంతే జరుగుతుంది. దర్శకుడు కార్తీక్ ఇలా చేసి వుంటే, ఇంత ఇన్ఫర్మేషన్ తో తలబొప్పి కట్టించి వుండే వాడు కాదు. 

         అయితే ముగింపులో సందేహాలు మిగిలే వున్నా- రిటైర్డ్ ఇన్స్ పెక్టర్, ఐపీఎస్ అవాలనుకున్న క్యాండిడేట్-  ఈ ఇద్దరి నిజస్వరూపాలు బయటపడే క్యారక్టర్స్ ట్విస్ట్ మాత్రం భలే వుంది.

-సికిందర్