రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, ఆగస్టు 2022, మంగళవారం

1200 : స్పెషల్ ఆర్టికల్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీ ఐ) ఇటీవల రీసెర్చి నివేదిక వెల్లడించింది. 2023 నాటి కల్లా దేశంలో మల్టీప్లెక్సులు మూతబడతాయని! దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సులు విస్తరించించి వ్యాపారాలు చేసుకుంటున్న కార్పొరేట్ కంపెనీల గుండెల్లో రాయి పడే వార్త ఇది. ఇప్పటికే కోవిడ్ సమయం నుంచి ప్రారంభమయిన నష్టాల నుంచి కోలుకోవడం లేదు. కోవిడ్ సమసిపోయినా ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదు. స్టార్ సినిమాలకి నెమ్మదిగా రావడం ప్రారంభించినా చిన్న, మధ్య తరహా సినిమాలకి పూర్తిగా మొహం చాటేశారు. హిందీలో స్టార్ సినిమాలనైతే ప్రేక్షకులు అసలు పట్టించుకోవడం లేదు. ఇక పానిండియా సినిమాలంటూ సౌత్ నుంచి వస్తున్న కొన్ని సినిమాలనే కరుణిస్తున్నారు. అది కూడా బావుంటేనే. రాధేశ్యామ్’, లైగర్ వంటి బాగాలేని పానిండియాల్ని ఇంటికి పంపించేశారు- అంటే ఓటీటీకి.

        ది చాలనట్టు ప్రతీ హిందీ సినిమాకీ ఏదో వంక పెట్టుకుని సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ నడిపిస్తున్నాయి కొన్ని శక్తులు. దీని దెబ్బకి లాల్ సింగ్ చద్దా కూడా చిత్తయిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ 9 న విడుదలవుతున్న బ్రహ్మాస్త్ర ని కూడా బాయ్ కాట్ చేస్తూ బయల్దేరింది ట్రోల్ ఆర్మీ. వీళ్ళు ఎక్కడిదాకా పోయారంటే, ఎప్పుడో 47 ఏళ్ళనాటి షోలే ని కూడా బాయ్ కాట్ చేస్తూ నిన్నటి నుంచి ట్రోలింగ్ మొదలెట్టారు!

ఇలా సినిమాలకి కోవిడ్, ట్రోలింగ్ సమస్యలతో బాటు, రెట్టింపయిన టికెట్ల ధరలు ప్రేక్షకుల్ని వెనక్కి పంపేస్తున్నాయి.

ఇంతేకాదు, దేశవ్యాప్తంగా 22 అతి పెద్ద మాల్స్ ని మూసేయడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. కోవిడ్ సమయం నుంచి జనం షాపింగ్ కి మాల్స్ కి వెళ్ళడం లేదు. మాల్స్ లో వుండే వివిధ వ్యాపారాలు తీవ్ర నష్టాల్లో వున్నాయి. ఈ పరిస్థితి హైదరాబాద్ లోనూ వుంది. మాల్స్ లోనే మల్టీప్లెక్సులు వుంటాయి. మల్టీప్లెక్సులకి జనం రావడం లేదు. తప్పీజారి వస్తే క్షవరం తప్పడంలేదు. మొన్న తెలుగు 'లైగర్' చూసిన ఉత్తమ ప్రేక్షకుడు 800 వదిలించారని లబోదిబో మన్నాడు. టికెట్టు 400 + తినుబండారాలు 400 !

మల్టీప్లెక్సుల నిర్వహణా వ్యయం పెరిగిపోవడం వల్ల తినుబండరాల ధరలు రెట్టింపు చేయక తప్పలేదని పీవీఆర్ మల్టీప్లెక్స్ గ్రూప్ ఛైర్మన్ సెలవిచ్చాడు. కాబట్టి తినుబండరాలు కూడా సమస్యల లిస్టులో చేరాయన్నమాట.

ఇదంతా కాదు, అసలు సమస్య వేరే వుంది. ఇందుకే గుండెల్లో రాళ్ళు పడుతున్నాయి మల్టీప్లెక్స్ కంపెనీలకి. ఎస్బీఐ రిపోర్టు ఏమంటోందంటే, ఒకప్పుడు మల్టీప్లెక్సులు వచ్చేసి వీసీఆర్/వీసీపీ/వీసీడీల పరిశ్రమ ఎలా మూతబడిందో, అలా ఇప్పుడు ఓటీటీ వచ్చేసి మల్టీప్లెక్సుల రంగాన్ని మూత పెట్టేస్తుందని. అదీ 2023 కల్లా! ఓవర్-ది-టాప్ లేదా ఓటీటీ  మార్కెట్ 2023 నాటికి రూ. 11,944 కోట్లకి  చేరుకుంటుందని ఎస్బీఐ అంచనా వేసింది. ఇది 2018 లో రూ. 2,590 కోట్లు మాత్రమే వుంది.

1980లలో విజృంభించిన వీసీఆర్/వీసీపీ/వీసీడీల పరిశ్రమ 2000 కల్లా కాలగర్భంలో కలిసిపోయింది. 2000 ప్రారంభం నుంచి మెట్రో నగరాల్లో/పట్టణ ప్రాంతాల్లో మల్టీప్లెక్సులు విపరీతంగా పెరిగాయిఓటీటీ రంగం ఇప్పటికే వినోద పరిశ్రమ నుంచి 7-9 శాతం రెవెన్యూని లాగేసుకుంది. ఇది వృద్ధి చెందుతూ పోతోంది. ఓటీటీ రంగంలో అన్ని  భాషల్లో 40 ఓటీటీ కంపెనీలు కంటెంట్ ని అందిస్తూ వుండడంతో ప్రేక్షకులు ఇటు మొగ్గు  చూపుతున్నారు.

ప్రస్తుతం ఓటీటీ కంపెనీలకి 45 కోట్ల మంది చందా దారులున్నారు. ఈ బలమైన వృద్ధికి సరసమైన హై-స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపు కావడండిజిటల్ చెల్లింపులని స్వీకరించడం వల్ల, ఇది 2023 చివరి కల్లా 50 కోట్లకి పెరిగే అవకాశముంది. మన దేశంలో గ్లోబల్ కంపెనీల చందాదారుల సంఖ్య చూస్తే డిస్నీ హాట్ స్టార్ 14 కోట్లు, అమెజాన్ ప్రైమ్ వీడియో 6 కోట్లు, నెట్ ఫ్లిక్స్ 4 కోట్లు, జీ 5 3.7 కోట్లు, సోనీలివ్ 2.5 కోట్లు వుంది. ఈ కంపెనీలు అమెరికాలో కంటే 70-90 శాతం చౌకగా  ప్లాన్స్ ని అందిస్తున్నాయి.

50 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు నెలకి 5 గంటల కంటే ఎక్కువ సమయం ఓటీటీ ని ఉపయోగిస్తున్నందున, ఓటీటీ పెరుగుదల థియేటర్ల ఆదాయాలని తినేస్తోంది. ఇంకా చెప్పాలంటేసినిమాల కంటే స్ట్రీమింగ్ సిరీస్‌లు రూపొందించుకోవడం లాభదాయకమని ప్రధాన స్టూడియోలు గ్రహిస్తున్నాయి. దీనికి తమ సొంత  స్ట్రీమింగ్ ప్లాట్‌ ఫామ్స్ ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నాయి.  స్మార్ట్ టీవీలు, క్రోమ్‌కాస్ట్ వంటి టెక్నాలజీలు థియేటర్ల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. కాలం ముందుకు వెళుతున్నప్పుడు విద్యఆరోగ్యంఫిట్నెస్ రంగాల్లో ఓటీటీ వేదికలు విస్తరణనీ, భవిష్యత్తునీ మరింత సుస్థిరం చేసుకుంటాయని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టు ప్రేక్షకులు కూడా ఓటీటీని వినోద మాధ్యమంగా మాత్రమే చూడడం లేదు. ఇన్ఫోటైన్మెంట్ (సమాచారం + వినోదం) మాధ్యమంగానూ చూస్తున్నారు.

దెబ్బకి దెబ్బ!

ఇదంతా అలా వుంచితే, రెండు పెద్ద మల్టీప్లెక్స్ గ్రూపులు పీవీఆర్, ఇనాక్స్ లు సినిమా వ్యాపారాన్ని పునర్నిర్వచించడానికి విలీనమవుతున్నాయి. ఓటీటీని బీట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇది చిన్న స్క్రీన్‌కి వ్యతిరేకంగా పెద్ద స్క్రీన్ బలమైన పోరాటమని అభివర్ణించుకుంటున్నాయి. ఓటీటీ కంపెనీలు నిజంగా పెద్దవనీ, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద చెక్కు బుక్కులు వున్నాయనీ, కోట్లకి కోట్లు గుమ్మరించి సినిమాలు కొంటున్నారనీ, దీన్ని తట్టుకునేందుకు మల్టీప్లెక్స్ రంగాన్ని మరింత ఆధునీకరించి- ప్రేక్షకులు సినిమా చూసే అనుభవాన్ని ద్విగుణీకృతం చేయాలని వ్యూహాలు పన్నుతున్నాయి.

తమ రెండు గ్రూపులు కలిసి రావడం ద్వారాతమ  మార్కెట్‌ కి ఇంటి వెలుపల వినోదానికి  అత్యంత ముఖ్యమైన రూపమైన ఎగ్జిబిషన్ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా, తాము  మరింత బలపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇది నిర్మాతలు తమ సినిమాల  విడుదలల్ని ప్లాన్ చేసే విధానంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని నమ్ముతున్నాయి. తమది బ్లాక్ బస్టర్ విలీనమని బల్లగుద్ది చెప్తున్నాయి.

ఈ రెండు గ్రూపులు ఏకమైతే దేశంలో దాదాపు 60 శాతం మల్టీప్లెక్స్ స్క్రీన్లు వీటి చేతిలో వుంటాయి. దేశంలో దాదాపు 3000 మల్టీప్లెక్స్ స్క్రీన్‌లు వున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనాలు సూచిస్తున్నాయి. పీవీఆర్ ప్రస్తుతం 73 నగరాల్లో 181 ప్రాపర్టీలలో 871 స్క్రీన్స్ ని నిర్వహిస్తోంది. ఐనాక్స్ 72 నగరాల్లోని 160 ప్రాపర్టీలలో 675 స్క్రీన్స్ ని  నిర్వహిస్తోందివిలీనం తర్వాత ఈ సంయుక్త సంస్థ 109 నగరాల్లోని 341 ప్రాపర్టీలలో 1,546 స్క్రీన్స్ ని  నిర్వహిస్తున్న దేశంలోనే అతి పెద్ద మూవీ ఎగ్జిబిషన్ కంపెనీగా అవతరిస్తుంది.

ఇంతే కాదు, విస్తరణ ప్రణాళికలు కూడా వున్నాయి. పీవీఆర్ - ఐనాక్స్ విలీన సంస్థ రెండవ, మూడవ శ్రేణి నగరాల్లో విస్తరణపై బలమైన దృష్టితో, సంవత్సరానికి 200 స్క్రీన్స్ ని  జోడించడాన్ని పరిశీలిస్తోంది. ప్రకటిత లక్ష్యం రాబోయే ఏడు సంవత్సరాలు కొనసాగుతుంది. దీనికి కనీసం రూ. ₹4000 కోట్ల పెట్టుబడి అవసరం. ఇలా ఓటీటీతో బిగ్ ఫైట్ కి కండలు పొంగిస్తోంది గ్రూపు. ఒకవైపు 2023 కల్లా మల్టీప్లెక్సులు ఖల్లాస్ అని రిపోర్టు, మరో వైపు బిగ్ ఫైట్ కి కసరత్తు. చూడాలి ఎమౌతుందో. ఈ ఫైట్ లో ప్రేక్షకులు ఎటువైపు వుండాలని తేల్చుకుంటారో జవాబు దొరకని ప్రశ్న!

***