రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, అక్టోబర్ 2015, శుక్రవారం

కథని షేర్ చేసుకోలేక..








రచన - దర్శకత్వం : మల్లికార్జున్

తారాగణం : నంమూరి కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్, సాయాజీ షిండే, విక్రం జిత్ విర్క్, ముఖేష్ రిషి, బ్రహ్మానందం, రావురమేష్, అలీ, ఆశీష్ విద్యార్థి, షఫీ, పోసాని  తదితరులు.
సంగీతం : ఎస్ ఎస్ థమన్, కెమెరా : సర్వేష్ మురారీ, మాటలు : డైమండ్ రత్నబాబు
బ్యానర్ : విజయలక్ష్మి పిక్చర్స్ ,  నిర్మాత : కొమర వెంకటేష్
విడుదల 30 అక్టోబర్, 2015 


          నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మూడు సినిమాలకి దర్శకత్వం వహించిన మల్లికార్జున్ హేట్రిక్ సాధించారు. ‘పటాస్’ తో ఓమెట్టు పైకి చేరుకున్న కళ్యాణ్ రామ్ కూడా ‘షేర్’ తో ఇక తిరుగు లేకుండా పేపర్ టైగర్ అయిపోయారు. చాలా లైట్ తీసుకుని ఈ  సినిమాని లాగించేశారు. అంత సీరియస్ నెస్ కూడా లేని దర్శకుడితో కలిసి, పూర్తిగా రెండు గంటలు కూడా లేని ఈ సినిమాతో సరదాగా ఓ షార్ట్ ట్రిప్ వేసేశారు. తీసింది యాక్షన్ కామెడీనా, పూర్తి  యాక్షనా ప్రేక్షకులే తేల్చుకోవాలన్నట్టు హనీమూన్ ముగించారు. ఒక పేరున్న హీరోతో ఈ రోజుల్లో కూడా సినిమా ఇలాగే  తీస్తారా అని ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల అమాయకత్వమే అవుతుంది. ఏ  సినిమాకైనా శ్రీను వైట్ల- కోన వెంకట్ ల స్కీము మాత్రమే ఆదర్శంగా కన్పిస్తున్నప్పుడు, అకుంఠిత దీక్షతో  ఆ అడుగుజాడల్లోనే తెలుగు సినిమాల్నితప్పనిసరిగా  నడిపించాలిగా? లేకపోతే జీవితాలేమౌతాయో తెలీదు!  ‘బ్రూస్ లీ’ చేదు జ్ఞాపకాల్లోంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న  ప్రేక్షకులకి,  మళ్ళీ ‘షేర్’ వచ్చేసి  అదే శైలిలో  గాండ్రించడం ప్రాణాంతకంగానే వుంటుంది. తెలుగు సినిమా ప్రేక్షకులకి ఇలాటి సినిమాలనుంచి మోక్షం లేదని,  ఇలాటి ‘షేర్’ ల బారిన పడి పదేపదే షికారు అవుతూనే
వుండాలని, గట్టిగా గాండ్రించి మరీ డిక్లేర్ చేస్తోంది ఈ ‘షేర్’!

కథేమిటి
      ఓ బిల్డర్ ( రావు రమేష్) కొడుకు గౌతమ్ ( కళ్యాణ్ రామ్).  ఇతను సివిల్ ఇంజనీరింగ్ చేసి తండ్రి వ్యాపారంలోనే ఉంటున్నాడు. పప్పీ ( విక్రం జిత్ విర్క్) అనేవాడు ఒక ఛోటా మాఫియా. పెద్ద మాఫియా దాదా ( ముఖేష్ రిషి) కలకత్తాలో ఉంటూ అక్కడ గడగడ లాడిస్తూ ఉంటాడు. చిన్నమాఫియా పప్పీ కి ఎలాగైనా పెళ్లిచేసుకోవాలన్న కోరిక  వుంటుంది. ఈ కోరికతో ఒకమ్మాయిని పెళ్లి చేసుకోబోతూంటే గౌతమ్ వచ్చేసి, ఆ పెళ్లి కూతుర్ని ఎత్తుకెళ్ళి ఆమె ప్రేమించిన వాడితో రిజిస్టర్డ్ మ్యారేజి  జరిపించేస్తాడు (‘శివమ్’ లో హీరో రామ్ లాగా). దీంతో పప్పీ గౌతమ్ మీద పగబట్టి- నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా ఇలాగే ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటానని శపథం చేస్తాడు. 


    నందిని ఒక ఫోటోగ్రాఫర్. ఈమె పోలీస్ కమిషనర్ (సాయాజీ షిండే) కూతురు. ఒకరోజు గాలికి ఎగిరిపోతున్న జాతీయ జెండా కిందపడకుండా గౌతమ్ సాహసోపేతంగా  పట్టుకుంటూంటే ఫోటో తీస్తుంది. ఆ ఫోటోకి మొదటి బహుమతి వస్తుంది. కానీ ఫోటోలో చేతులు మాత్రమే పడతాయి. మనిషి కన్పించడు. దీంతో ఇతనెవరా అని వెతుకుతూంటుంది. ఈ చేతులున్న వాడే తన లవర్ అని డిక్లేర్ కూడా చేసేస్తుంది. ఆ చేతులున్న వాడిగా ఇంకో గౌతమ్ ( బ్రహ్మానందం) దొరుకుతాడు. షాక్ అవుతుంది. కొంత కన్ఫ్యూజన్ తర్వాత అసలు గౌతమ్ దొరికేసరికి లవ్ ట్రాక్ మొద
లెట్టేస్తుంది. ఇటు గౌతమ్ మీద నిఘా ఉంచిన పప్పీ గ్యాంగ్, గౌతమ్ ని  ప్రేమిస్తున్న నందినిని ఎత్తుకు పోతారు. 

    చిన్న మాఫియా పప్పీ వెళ్లి నందిని తండ్రిని పెళ్లి చేయమంటాడు. తనని ఎవరు డిజిపిని చేస్తారో వాడి చేతిలోనే కూతుర్ని పెడతానంటాడు కమీషనర్. ఇందుకు పప్పీ మాటిస్తాడు. ఇది తెలుసుకున్న గౌతమ్ కూడా కమీషనర్ దగ్గరికెళ్ళి ప్రపోజల్ పెడతాడు. తను దాదా గ్యాంగ్  ని ఎంకౌటర్లు చేసి సఫా చేస్తానంటాడు. ఆ ఎన్కౌంటర్ లు కమీషనర్  తన ఖాతాలో వేసుకుని డిజిపి పోస్టు సంపాదించుకుంటే మరింత గౌరవప్రదంగా ఉంటుందని ఆశపెడతాడు. అలాగైతే నీకే ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు కమీషనర్. 

    ఇదీ విషయం. ఇక్కడ్నించీ గౌతమ్ దాదా గ్యాంగ్ ని ఎలా  ఎన్కౌంటర్లు చేసి, తన ప్రేమకి విలన్ల అడ్డు తొలగించుకున్నాడనేది సెకండాఫ్ లో తేలే మిగతా కథ. 


కథెలా వుంది
       చాలా పాత కథ. అమ్మమ్మలు చూస్తే, ‘అయ్యో రామా, సినిమాలింకా మా కాలంలో లాగే ఉన్నాయా? మా కాలంలో మేం చూసిన సినిమా కథలు చెప్తే మనవళ్ళు భయంకరంగా ఏడుస్తున్నారే!’ అనక మానరు. అయితే ఈ అమ్మమ్మ కాలం నాటి కథలోనూ ఒక కొత్త పాయింటు, లేదా బలమైన ట్విస్టు వుంది. అయినా దీన్ని కామెడీ చేసి కసి తీర్చుకున్నారు. మంచి పాయింట్లు, మంచి ట్విస్టులు బతక్కూడదు. సింగిల్ విండో స్కీము పళ్ళ చక్రం కింద అవి చూర్ణం ఐపోవాల్సిందే. కమీషనర్ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి కమీషనర్  కోసం ఎన్కౌంటర్లు చేయడమనే  హీరో ప్రపోజల్ తో ఇది కొత్త పాయింటే. నిశ్చయంగా, నిర్ద్వంద్వంగా, ఎవరడ్డొచ్చినా, త్రోసిరాజని ఒక థ్రిల్లర్ కి ఇవ్వాల్సిన ట్రీట్ మెంట్ ని డిమాండ్ చేస్తోందీ సరికొత్తగా వున్న పాయింటు. అయినా ఇంకో దిక్కులేనట్టు,  తేలికైన పని-  అదే శ్రీను వైట్ల- కోన వెంకట్ ల సింగిల్ విండో స్కీము అనే సీసాలో పోసి కూర్చోవడంతో, మొదటి ఆటకే అటకెక్కే పరిస్థితి వచ్చింది. వరసగా ‘శివమ్’, ‘బ్రూస్ లీ’, ‘షేర్’ -అనే  పెద్ద హీరోల సినిమాలు మూడూ, ఇదే  ‘బి’ గ్రేడ్ స్కీముతో సరిపెట్టెయ్యొచ్చన్న బలపడిపోయిన ఆలోచనాధారకి ఆటస్థలాలుగా మారాయి. స్టార్లు గా చెలామణీ అయ్యే హీరోలకి కృష్ణా నగర్ ఇరుకుగదిలో స్ట్రగుల్ చేస్తున్న ఏ కొత్త కుర్రాడో విధిలేక వెయ్యిరూపాయలకే  రాసిచ్చిన వచ్చీరాని కథల్లాంటివే గత్యంతరమవడం చాలా హాస్యాస్పదం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పరిస్థితి తయారయ్యిందని కూడా గ్రహించక పోవడం ఇంకా శోచనీయం.

ఎవరెలా చేశారు 
       కళ్యాణ్ రామ్ చాలా అయిష్టంగా నటించినట్టు తెలిసిపోతూనే వుంటుంది. ఏమాత్రం ఆసక్తికరంగా నటించి ఈ పూర్ కథా కథనాల సినిమాని కాస్తయినా నిలబెట్టడానికి ప్రయత్నిద్దామని ఆయనకీ అన్పించినట్టులేదు. ఇది ’పటాస్’  కంటే ముందు ప్రారంభమైన ప్రొడక్షన్ అని కావచ్చు- ఇంకేం చేసీ ‘పటాస్’ టైపులో పేల్చలేమనీ కావచ్చు- దీపావళికి ముందు మటాష్ చేశారు. లెంపలేసుకుని ఇక జన్మలో కళ్యాణ్  రామ్  ఇలాటి సినిమాల దరిదాపులకి రాకపోతే అదే వెయ్యి సూపర్ హిట్లు ఇచ్చిన పుణ్యం చేసుకున్నట్టు.

    హీరోయిన్ సోనాల్ చౌహాన్ గ్లామర్ పోషణ కోసం వీలయినంత పాటుబడింది. ‘బ్రూస్ లీ’ లో హీరోయిన్ లాగే కథకి కీలక పాత్ర అయికూడా ఆ సంగతి గుర్తించకుండా కాంప్రమైజ్ అయిపోయి, ఇలాటి సినిమాల్లో నటిస్తూ పోతే సాధించేదేమీ వుండదు.

    రావు రమేష్, సాయాజీ షిండేలవి చాలా కురచ పాత్రలు. ఇక విలన్లూ కమెడియన్లూ బ్రహ్మానందం సహా వృధానే. ఓ రెండు సీన్ల కోసం పోసాని ఎందుకో అర్ధంగాదు. విలన్ పక్కన టాబ్లెట్ చూసుకుంటూ వుండే మరో సీనియర్ నటుడు ఆశీష్ విద్యార్ధికి ఈ సినిమాలో ఏం పనో అర్ధంగాదు. బ్రహ్మానందం విషయానికి వస్తే ఆయన విసుగుదల, అలసట మొహంలోనే కన్పించి పోతోంది. సింగిల్ విండో స్కీముతో బాటే ఆయన కామెడీ కూడా ఆయనకే బోరు కొట్టేస్తున్నట్టు వుంది. ఆయన అభిమానుల్ని పట్టించుకోవడం శుభ్రంగా మానేశారు. క్రియేటివిటీ తెలీని దర్శకుల చేతుల్లో దీనంగా కీలుబొమ్మయి  పోయారు. తండు మూడు సీన్లలో కన్పాయించే పృథ్వీ, అలీ, షఫీ ..ఇలా చాలా మండే వున్నారు- దివంగత ఎమ్మెస్ నారాయణ సహా. ఇంట మంది హేమా హేమీలని పెట్టుకుని ఈ సినిమాని దర్శకుడు ఏం ఉద్ధరించాడో అర్ధంగాడు. 

    థమన్ సంగీతం మరోసారి గుర్తుండని సంగీతం. ఆయన పాటల్లో కిక్, కాస్తంత సౌందర్యం అనేవి ఎప్పుడో దూరమై పోయాయి. ఏదో చప్పుడు చేసి వెళ్లి పోవడమనే ఏకసూత్ర కార్యక్రమం పెట్టుకున్నాయి. సర్వేష్ మురారీ కెమెరా పనితనం ఈ తరహా కథా కథనాలూ, నటనలూ, దర్శకత్వాలతో  కూడిన ‘బి’ గ్రేడ్ వ్యవహారంలో ప్రభావం చూపకుండా గల్లంతై పోయింది.

స్క్రీన్ ప్లే సంగతులు
courtesy : cartoonstock.com 

    లాటి సినిమాల్లో  స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవడాని కేముంటాయి? ఏమీ వుండవు. కాకపోతే ఒక పాయింటు- ఒక ట్విస్టు అని ఇందాక చెప్పుకున్నాం కాబట్టి దాని గురించి చెప్పుకుని ముగిస్తే సరిపోతుంది.

    ఛోటా విలన్, బడా విలన్, పెళ్లి, కామెడీ, విలన్ ముఠాతో ‘గబ్బర్ సింగ్’ టైపులో మళ్ళీ పాటల కచేరీ, నానా కంగాళీ, సెకండాఫ్ లో సింగిల్ విండో స్కీము ప్రకారం  హీరో వెళ్లి విలన్ ఇంట్లో మకాం, వాళ్ళని బకారాల్ని చేయడం..వగైరావగైరా శుభ్రంగా ఊడ్చి అవతలపారేస్తే- ఇదొక  సంచలన కథయ్యేది - ఆ బలమైన- కొత్తగా అన్పిస్తున్న పాయింటుతో గనుక నడిపిస్తే. 

    అన్ని నదులూ వెళ్లి సముద్రంలో కలిసినట్టు, అన్ని పాయింట్లూ వెళ్లి సెకండాఫ్ లో సింగిల్ విండో స్కీము లో పడాల్సిందే. సింగిల్ విండోని కనిపెట్టక ముందు సినిమాలు సెకండాఫ్ సిండ్రోం అనే రుగ్మత బారిన పడేవి. అంటే ఫస్టాఫ్ వరకూ నడిపిన కథని- సెకండాఫ్ లో ఎలా కొనసాగించాలో తెలియని తనంతో వేరే కథ మొదలెట్టడ మన్నమాట. సింగిల్ విండోలు వచ్చాక, హీరోకి ఏ సమస్య ఎదురయినా సెకండాఫ్ లోవెళ్లి విలన్ ఇంట్లో పడి బకరా కామెడీ, కన్ఫ్యూజ్ కామెడీ, ఇంకేదో నకరాల కామెడీ అంటూ సినిమాలకి ఉంటున్న ఆ కాస్తా సృజనాత్మక కళని కూడా పూర్తిగా  హతమార్చారు.

    ఇంటర్వెల్ దగ్గరి కొచ్చేటప్పటికి ఒక సీరియస్ పాయింటు ఎస్టాబ్లిష్ అయి ఆలోచింప జేస్తుంది ( ‘బ్రూస్ లీ’ ) . సెకండాఫ్ ప్రారంభమయ్యే సరికి ప్రేక్షకులకి ప్రామీజ్ చేసిన ఆ సీరియస్ నెస్ ని తుంగలో తొక్కేసి, అర్ధంపర్ధంలేని కామెడీ బాట పట్టిస్తారు. ప్రస్తుత సినిమాలోనూ జరిగిందిదే. హాలీవుడ్ లో యాక్షన్ కోసం కథల్ని బలి చేస్తూంటే, టాలీవుడ్ లో కామెడీల కోసం స్టోరీ పాయింట్లని నరికేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్లు అంటే  ఫలానా స్టార్- డైరెక్టర్- బ్యానర్- మ్యూజిక్ డైరెక్టర్ ఇవే అనుకుంటే పొరపాటే. కాంబినేషన్లు కథలకీ అన్వయమవుతున్నాయి. కర్నూలు బ్యాక్ డ్రాప్, రౌడీ కుటుంబాల గొడవలు, ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండాఫ్ బ్రహ్మానందం ఎంట్రీ, బకరా కామెడీ, కన్ఫ్యూజ్ కామెడీ, ఇంకేవైనా నకరాలతో  కామెడీ, క్లయిమాక్స్ - ఇలా ఈ కాంబినేషన్లతోనే కథలు తయారవుతున్నాయి.

    ఇంటర్వెల్  దగ్గర హీరో ఛోటా విలన్ కి పోటీగా- కమీషనర్ కి ఈ విలన్ గాళ్ళ ఎన్  కౌంటర్లని ఆఫర్ చేశాడు. బదులుగా తను డిజిపి పోస్టు చేపట్టి, కూతుర్ని తనకివ్వాలని ఒప్పందం చేసుకున్నాడు.

    అసలు సినిమా ప్రారంభంలో ఈ పోలీస్ కమీషనర్ ఈ ఛోటా విలన్ పప్పీనీ, బడా విలన్ కలకత్తాలో ఉంటున్న దాదానీ ఎలా తుదముట్టించాలా అని ఆలోచిస్తూంటాడు. అలాటివాడు పప్పీ వచ్చి నీకూతుర్ని నాకిస్తే, నీకు డిజిపి పోస్టు ఇప్పిస్తాననే సరికే లొంగి పోతాడు. బచ్చాగాడైన పప్పీ పాత్రకి ఎలాగో ఇంకా రాజకీయ సంబంధాలు అవీ కూడా బలంగా చూపించుకుంటూ వస్తేనే, ఈ మాట అన్పించాలి నిజానికి. అయినప్పటికీ కూడా డిజిపి సెలక్షన్ అనేది ఎక్కడో ఢిల్లీలో కమిటీ చేతిలో వుంటుంది. ఆ కమిటీనీ కొనేస్తాడా పప్పీ? కాబట్టి ఈ లాజిక్ ని కూడా మూస కథకోసం ఉపేక్షించి చూస్తే, అంతలోనే హీరో పెట్టిన ప్రపోజల్ తో పప్పీ పోటీలోకి లేకుండా పోవడంతో లాజిక్ సమస్య కూడా తొలగిపోయింది కాబట్టి- అప్పుడు  హీరో విలన్లని చంపుతూంటే, వాటిని తను చేస్తున్న ఎన్ కౌంటర్లుగా కమీషనర్ చిత్రించుకుని డిజిపి పోస్టుకి తిరుగు లేని కంటెండర్ గా తిష్ఠ వేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపే ముగ్గురు అభ్యర్దుల లిస్టులో తప్పకుండా తన పేరు వుండడమేగాక, ప్రయారిటీ కూడా తనకే దక్కొచ్చు.

    ప్రేమించిన హీరోయిన్ని పెళ్లి చేసుకోవడం కోసం, అదే అదే సమయంలో తనకి అడ్డుగా వున్న విలన్లని తొలగించు కోవడం కోసం, హీరో హత్యలు చేయడమన్నది క్రేజీ క్యారక్టరైజేషనే అవుతుంది. దర్శకుడు ఏదో ఫీలై, ఈ హత్యల్ని జస్టిఫై చేసేందుకు, ఇంకేదో కుటుంబ ఫ్లాష్ బ్యాకూ, అందులో విలన్ల చేతిలో తమ్ముడి హత్యా పెట్టి కథని  హత్య చేసుకునే అవసరమే లేదు. ఈ రోజుల్లో హీరోలే యాంటీ హీరోలైపోయి నప్పుడు సెంటి మెంట్లని ఎవరు ప్రశ్నిస్తున్నారు? ప్రేమ కోసం హీరో ఇలాటి పనికి తెగబడ్డమే ఒక సంచలనం. ఒక రివల్యూషన్. హీరో పాత్రని ఇలా తిరగేసి చూపించకపోతే అది క్యారక్టరైజేషన్ ఎలా అవుతుంది? (What is character  but the determination of incident? And  what is incident  but the illumination of character?’ - Henry James) అని కదా?

    కానీ ఎంత యాంటీ హీరోనీ ప్రేక్షకులు ఒప్పుకున్నా, తన కోసం హత్యలు చేస్తున్నాడంటే హీరోయిన్ ఒప్పుకోదు. ఆమెతో ప్రేమా పెళ్ళీ అసాద్యమై పోవచ్చు. అప్పుడెలా?

    ఈ హత్యల్ని ఎలా జస్టిఫై చేసి హీరోయిన్ని ఒప్పించాలి?

    అండర్ కవర్ ఏజెంట్. ఎస్, అండర్ కవర్ ఏజెంటుగా, డ్యూటీలో భాగంగానే ఈ హత్యలు చేశాడు. హీరో కూడా ఒక పోలీసాఫీసరే. చివరికా కమీషనర్ కంగు తినాల్సిందే. ఎన్ కౌంటర్ల రివార్డులన్నీ హీరో కొట్టేసి,  ప్రమోషన్ కూడా కొట్టేసుకుని, ఆ కమీషనర్ సీట్లోనే వచ్చి  కూర్చుంటే-  దురాశాపరుడైన కమిషనర్ బుద్ధి తెచ్చుకుని, హీరోయిన్నిచ్చి పెళ్లి చేసేసి పోలీస్  ట్రాన్స్ పోర్ట్  ఆర్గనైజేషన్ లో అనామక పోస్టులోకి వెళ్ళిపోవాల్సిందే. 

    మరికొన్ని పోలీసు పాత్రలతో ఇదొక ఎన్నదగ్గ పోలీస్ డ్రామా అవచ్చు. మూసలోనూ ఒక పనికొచ్చే ముక్క అవచ్చు.


-సికిందర్