రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

508 : రివ్యూ!

ర్శత్వం: కృష్ణ మారిముత్తు
తారాగణం: నాగచైతన్య, లావణ్యా త్రిపాఠీ, శ్రీకాంత్, రావు మేష్, రేవతి, మురళీశర్మ, ప్రియర్శి, వివర్మ దితరులు
కథ –స్క్రీన్ ప్లే : డేవిడ్ ఆర్. నాథన్, మాటలు : అబ్బూరి రవి, సంగీతం
: వివేక్ సాగర్. ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మిరెడ్డి
బ్యానర్ : వారాహి చిత్రం, నిర్మాత: నీకొర్రపాటి
విడుదల : సెప్టెంబర్ 8, 2017

***

        ‘జోష్’ తో మొదలు పెడితే,  ‘దాదా,  ‘బెజవాడ’, ‘ఆటోనగర్ సూర్య’ ,  ‘దోచేయ్', 'దడ',  ‘సాహసం శ్వాసగా సాగిపో’....అంటూ నాగచైతన్య యాక్షన్ సినిమాలతో చేస్తున్న విశ్వప్రయత్నాలు ఇప్పుడు ‘యుద్ధం శరణం’ దగ్గరికొచ్చాయి. ఇక్కడితో స్వామి శరణం అనుకుని ఆపేస్తే మంచిదేమో  ఆలోచించుకోవాల్సిన బాధ్యత అతనిపైనే వుంది. తమిళం నుంచి దర్శకుడు, రచయితా వచ్చిందే స్వామిశరణం  అన్పించడానికి అయివుండొచ్చు. దర్శకుడు క్లాస్ మేట్  అయినంత మాత్రాన యుద్ధం శరణం శివోహం అన్పిస్తాడని అన్పించడం లేదు. 

          మొన్నే విడుదలైన కృష్ణ వంశీ ‘నక్షత్రం’ వుండగా, ఇప్పుడు అలాంటిదే  ‘యుద్ధం శరణం ‘ ఏమవసరం. కృష్ణవంశీ తన లాంటిదే తీస్తున్నారని నాగ చైతన్యకి ఎలా తెలుస్తుం దనొచ్చు. దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోని వాళ్ళంతా ఒకరికి తెలీకుండా ఒకరు పోటీలు పడి ఒకలాగే వుండే సినిమాలు ఇలాగే తీసేసి తర్వాత తెల్లబోతారు. దేశంలో టెర్రర్ దాడులు  జరగడం ఆగిపోయాయని కృష్ణ వంశీ తెలుసుకోకుండా మరో చాట్ భండార్ పేలుళ్లతో చుక్కలు చూపించినట్టే, నాగచైతన్య కూడా అదేబాటలో లేని  మహా యుద్ధం చేశారు. ఈ యుద్ధం చేసి  పర రాష్ట్రాల్లో శరణు జొచ్చేలా చేశారు ప్రేక్షకుల్ని. నాగచైతన్య మరో యాక్షన్ మూవీతో వస్తే తెలుగు రాష్ట్రాలు విడిచి వెళ్ళిపోతారు ప్రేక్షకులు. 

          ఇంతకీ ఏమిటీ ‘యుద్ధం శరణం’?  మళ్ళీ హైదరాబాద్ నగరంలో పాత పేలుళ్ళ కథనే ఎలా తీశారు? ఏ కొత్తదనం చూపించారు?  కొత్త తమిళ దర్శకుడు దర్శకత్వంలో చూపిన ప్రతిభ ఏమిటి? నాగచైతన్య నటనలో మార్పేమిటి? లావణ్యా
త్రిపాఠీ ఎందుకుంది? ఇవన్నీ తెలుసుకుందాం....

కథ 
       అర్జున్ (నాగ చైతన్య) ఉద్యోగం చేయకుండా స్వయంకృషితో ఒక గాలిలో ఎగిరే డ్రోన్ ని తయారు చేస్తూంటాడు. డాక్టర్ లయిన అతడి తల్లిదండ్రులు (రావురమేష్ – రేవతి) పేదలకి వైద్యం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు. అర్జున్ కి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా వుంటారు. ఇలా వుండగా, అర్జున్ పేరెంట్స్ దగ్గర అంజలి (లావణ్యా త్రిపాఠీ ) వచ్చి ట్రైనింగ్ లో చేరుతుంది. ఆమెని ప్రేమిస్తాడు అర్జున్. ఈ విషయం పేరెంట్స్ కి చెప్పాలనుకుంటాడు.

          ఒక మఫియా నాయక్ (శ్రీకాంత్) వుంటాడు. ఒక మంత్రి ( వినోద్ కుమార్ ) వుంటాడు. ఇతను బాగా స్కాములు చేసి ఇరుక్కునే పరిస్థితి వస్తుంది. దృష్టి మళ్ళించడానికి నాయక్ తో కలిసి నగరంలో బాంబు దాడులు జరిపిస్తాడు. ఆ రాత్రే సినిమా కెళ్ళిన అర్జున్ పేరెంట్స్  శవాలై దొరుకుతారు. చూస్తే బాంబు దాడుల్లో చనిపోయినట్టు వుండరు. అసలేం  జరిగింది? వీళ్ళు ఎలా చనిపోయారు? ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేవి మిగతా కథకి దారి తీసే ప్రశ్నలు. 

ఎలావుంది కథ?
     కథలా లేదు. చెన్నై పారిస్ సెంటర్ పరోటాలా కూడా లేదు. అన్నిటికీ మించి నిర్మాత కొర్రపాటి కానుకలా లేదు. ఈ సంవత్సర
మంతా ఇలాటి రివెంజి కథలే. దీనికి అదే బాంబు దాడులు తోడయ్యింది. ఇవ్వాల్టి వార్త రేపుండని రోజుల్లో ఇంకా ఐదేళ్ళ నాటి నగర బాంబు దాడుల కథలతో ఇంకేం చెప్పాలనుకుంటున్నారో తెలీదు. దీనికి పరిష్కారం కూడా చంపడమే. చంపడం ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కాదు. అందుకే ఇంకిన్ని ఇలాటి కథలు పుట్టుకొస్తు
న్నాయి. ఇంకెవరైనా ఈ బాంబు దాడుల కథతో తీస్తే, ఒక శాశ్వత పరిష్కారమార్గం చూపిస్తే - ఈ కథలతో సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడం ఇంకాగిపోతుంది. సమస్య శాశ్వత పరిష్కారం రేంజికి చేరింతర్వాత,  ఇంకొకరు ఇంకో పరిష్కారం చెప్పే అవకాశం వుండదు. కథల మీద పురాణాల ప్రభావం చాలా వుంటుంది. కానీ పురాణాలని తప్పుగా అర్ధంజేసుకుని ఒక సామాజిక సమస్యకి చంపడమే పరిష్కారమనుకుంటే మాత్రం, ఇక చెల్లుబాటయ్యే పరిస్థితిలేదు.

ఎవరెలా చేశారు
       నాగచైతన్య చాలా కష్ట పడ్డాడు. సెకండాఫ్ లో ఒఠ్ఠి యాక్షన్ సీన్సులో వూపిరి తీసుకోకుండా పోరాటాలు చేసేందుకు  ఫస్టాఫ్ లో పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు. ఆంధ్రా  వెళ్ళే బస్సులో కోదాడలో రెండో డ్రైవర్ నిద్ర లేచి డ్యూటీ ఎక్కినట్టు, నాగచైతన్య  సెకండాఫ్ కి ఫ్రెషప్ అయ్యాడు. అసలు ఫస్టాఫ్ లో కన్పించింది తనేనా అని డౌటు. అంత పేలవంగా ఎలా వుంటాడు హుషారైన నాగచైతన్య?  పాత్రలో దమ్ములేకపోతే ఇంతే. పాత్రకి బాక్సాఫీసు అప్పీల్ వుందా? ఎంత సేపూ పేరెంట్స్ కథే అయిపోతే, ఇక యూత్ అప్పీల్ - బాక్సాఫీసు అప్పీల్ ఏమైపోతాయి. ఈ రోజుల్లో ముసలి వాళ్ళయిన పేరెంట్స్ కథ ఎవరిక్కావాలి? ‘చుక్కల్లో చంద్రుడు’, ‘కొంచెం ఇష్టం- కొంచెం కష్టం’ లతో అనుభవమయ్యిందిగా?  హీరోయిన్ తో హీరో గ్లామరస్ గా వుండే కథ కావాలి. బాంబు దాడుల్లో హీరోయిన్ మిస్సయితే ఆ హీరోయిన్ కోసం పడే తపనలోనే  అన్ని అప్పీల్స్ వుంటాయి బాబూ!  సెకండాఫ్ లో హీరోయిన్ ని పూర్తిగా పక్కన పడేసి, ఇంకా చనిపోయిన పేరెంట్స్ ఫ్లాష్ బ్యాకులే వేసుకుంటూ కూర్చుంటే థియేటర్లో ఎవరు కూర్చుంటారు. పైగా అక్కా చెల్లెళ్ళని కాపాడే గొడవే అయిపోతే, అది కమర్షియల్ పాత్రెలా అయింది?  ఫ్యాన్స్ ని కూడా ఏం మెప్పించింది? ఎన్ని పిడివాదాలు చేసినా కమర్షియల్ సినిమా కథంటే హీరో హీరోయిన్ల కథే! 

          నాగచైతన్యకి కథ మీద అవగాహన లేకపోయినా, కనీసం పాత్ర కమర్షియల్ గా లేదని అర్ధంజేసుకుని తిప్పికొట్టినా ఇంత నిరాశ ఎదురయ్యేది కాదు. ఇక హీరోయిన్  లావణ్యా
త్రిపాఠీ పాత్రకే దిక్కులేదు, కొన్ని షాట్స్ లో ఆమె నోరు తెరచి ఏదో అనే లోపే  బ్యాడ్ ఎడిటింగ్ చేసి నోర్మూయించారు. తమిళ కమర్షియల్(? ) దర్శకుడికి హీరో హీరోయిన్లు అస్సలు పట్టలేదు- ఎంత సేపూ పేరెంట్స్ పాత్రల్లో రావు రమేష్, రేవతిల తెచ్చిపెట్టుకున్న ఆనంద డోలికలతోనే వుయ్యాలూ
గడం సరిపోయింది. పక్క వాద్యాలుగా పనీపాటా లేనిఅక్కా చెల్లెళ్ళు. 

            మాఫియాగా శ్రీకాంత్ ప్రత్యేకతేం లేదు, శాడిస్టు గెటప్ తో ప్రత్యేకతలేం వుంటాయి. ఇది ఆయనకి తెలియంది కాదు. కాకపోతే విలన్ గా వేసి చాలా కాలమవడంతో ఇదే కొత్తగా అన్పించి వుంటుంది. ఈ మధ్య  ఎన్ఐఏ పాత్రలు కొత్త ఫ్యాషన్ అయిపోయాయి. వాళ్ళ అధికార పరిధులేమిటో  వాళ్ళకే తెలీక సందట్లో సడేమియాలాగా సినిమా అంతా తిరిగే పాత్ర లు. ఈసారి  సీబీఐ జేడీ లక్ష్మినారాయణ,  మురళీ శర్మ రూపంలో ఎన్ఐఏ జేడీ శాస్త్రిగా మారిపోయారు. ఈ శాస్త్రి గారి దర్యాప్తేమిటో, మతలబు ఏంటో మనకసలేం అర్ధంగాదు. ఈయన పక్క అసిస్టెంటుగా ఆశ్చర్యపోతూ వుండే రవివర్మ! 

          పాటలు, ఛాయాగ్రహణం, ఇతర సాంకేతిక విలువల గురించి చెప్పుకోవడాని కేం లేదు. సెకండాఫ్ దాదాపు అంతా మసక చీకట్లోనే యాక్షన్ దృశ్యాలుంటాయి రిలీఫ్ లేకుండా. 

          దర్శకత్వం పూర్ గా, చాదస్తంగా వుంది. పేలవమైన ఫ్యామిలీ డ్రామా దృశ్యాలు పాత  సినిమల్లోలాగా వుంటాయి. రచయిత  అబ్బూరి రవి లేని కథకి లేపనాలు పూసి బలవంతంగా, అయిష్టంగా మాటలు రాసినట్టు తెలిసిపోతూంటుంది. ఇక ‘జంటిల్ మేన్’  అనే  సినిమాకి కథ  అందించిన డేవిడ్ ఆర్. నాథన్ రాసిన కథ, దానికి తయారు చేసిన స్క్రీన్ ప్లే అనే పదార్ధం తెలుగువాడి పాలిట తీరని శోకంలా వున్నాయి. 

చివరికేమిటి 
      చాలా చైల్డిష్. కనీస ప్రమాణాలతో చూసినా ఏ కోశానా సినిమా అనిపించని అమెచ్యూరిష్  వ్యవహారం. దర్శకుడు నేర్చుకోవా
ల్సింది చాలా వుంది. ఇంటర్వెల్ పడ్డాకైనా కథేమిటో తెలియాలన్న ఓనమాలు తెలీని స్థితిలో వున్నాడు. పేరెంట్స్ ని విలన్ ఎందుకు చంపాడో చెప్పకుండా, ఇంటర్వెల్లో హీరోనీ, అక్కా చెల్లెళ్ళని కూడా ఎందుకు చంపాలని దాడి చేస్తున్నాడో చెప్పకుండా, హీరోకీ ఏ విషయమూ  తెలీక, క్లయిమాక్స్ అంత భారీ స్థాయిలో జరుగుతున్న యాక్షన్ ఎపిసోడ్ మధ్యలో - ఇంటర్వెల్ వేసేసే చమత్కార మేమిటో అర్ధంగాదు.

          బాంబు దాడులు జరిగి, హీరో పేరెంట్స్ ని వెతుక్కోవడంతో కథ మొదలవుతుంది. అతడికి పేరెంట్స్ గుర్తుకు రాగానే ఫ్లాష్ బ్యాక్ లో కెళ్ళి పోతాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో బోలెడు ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఉత్తుత్తిగా నవ్వుకోవడాలూ అయ్యాక, హీరోయిన్  పరిచయం. ఇక ఆమెతో  లవ్ ట్రాక్, పాటలు.  సడెన్ గా ఫ్లాష్  బ్యాక్ లోంచి మళ్ళీ ప్రెజెంట్ కి...మళ్ళీ పేరెంట్స్ ని వెతుక్కోవడం. మళ్ళీ రాఖీ సీనుతో  ఇంకో ఫ్లాష్ బ్యాక్. లవ్...లవ్ కోసం ప్రయత్నాలు...మనకి అర్ధంగాని దేమిటంటే- పేరెంట్స్ ని వెతుక్కునే వాడికి ప్రేమలు ఎలా గుర్తు వచ్చి ఎంజాయ్ చేస్తాడనేది. ఇలా పొంతన లేకుండా వుంటుంది ఫ్లాష్ బ్యాకుల వ్యవహారం. అంటే ఈ కథ  పేరెంట్స్ కథగా  కాకుండా, హీరోయిన్ గురించిన కథ అయివుండాలన్న మాట- అప్పుడు ప్రెజెంట్ టైం కథ, డ్రీం టైం కథా అతికినట్టు వుంటాయి.

          ఇక సెకండాఫ్ లో అంత పెద్ద బాంబు దాడుల సంఘటన పక్కకెళ్ళి పోవడం కూడా జరుగుతుంది. ఇంతా చేసి ఆ పేరెంట్స్ చనిపోయింది బాంబు దాడుల్లో కాదు, వేరే కారణంతో వేరే విధంగా విలన్ చంపాడు. అదేమిటంటే ఒక హత్యని వాళ్ళు కళ్ళారా చూడ్డం. చాలా సిల్లీ. ఇది హీరో అన్వేషించే  మర్డర్ మిస్టరీగా మారుతుంది. ఈ క్రైం స్టోరీ మేనేజి మెంట్ కూడా చైల్డిష్ గా వుంటుంది. ఇలా బాంబు దాడుల కథని కూడా విరిచేసి, అందులోంచి ఇంకో కథని లాగడంతో  అంతా కలగాపులగమైపోయింది. 

          ఇదంతా ఇంత ఖర్చు చేసి సినిమాగా తీయడానికంటే ముందు,  పేపర్ మీదే తెలిసిపోయే జాతకం. నిర్మాత సాయి కొర్రపాటి దీన్ని అర్ధం జేసుకోలేదు.


సికిందర్ 
cinemabazaar.in