రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, August 18, 2021

tonight!


         సార్పట్టా కోచ్ పశుపతికి, ఇడియప్పని ఎట్టి పరిస్థితిలో ఓడించాలన్న గోల్ ఏర్పడడంతో బిగినింగ్ విభాగం బిజినెస్ ముగుస్తుంది. ఈ సన్నివేశాన్ని గమనించిన ఆర్య ముఖభావాల్ని బట్టి అతనీ సమస్యని పట్టించుకున్నాడని అర్ధమై, ఇక ఏం చేస్తాడన్న సస్పెన్స్ పుడుతుంది. ఇప్పుడు ప్రారంభమయ్యే మిడిల్ -1 విభాగంలో, కొంత స్క్రీన్ టైమ్ గడిచాక, ఇడియప్ప గ్రూప్ చేతిలో రంగయ్య అవమానపడే  ఘట్టం వస్తుంది. మిడిల్ -1 అంటే సమస్యతో సంఘర్షణా ప్రకరణ కాబట్టి, ఈ అవమానపడ్డ ఘట్టం ఆర్య పాత్ర యాక్టివేట్ అవడానికి ట్రిగ్గర్ పాయింటులా పనిచేస్తుంది.  ఇలా సార్పట్టా ప్రతిష్ట నిలబెట్టడానికి తాను రంగంలోకి దిగే నిర్ణయంతో అలజడి రేపుతాడు ఆర్య ఇంటా బయటా.  ఈ రెండు వైపుల నుంచీ కొంత ప్రతిఘటన ఎదుర్కొన్న తర్వాత శిక్షణ పొందడం ప్రారంభిస్తాడు. శిక్షణ పొందాక మొదటి ఈవెంట్ లో డాన్సింగ్ రోజ్ ని ఓడిస్తాడు. రెండో ఈవెంట్ లో వేట పులి తో తలపడినప్పుడు ఇంటర్వెల్ వస్తుంది. ఇలా మిడిల్ -1 విభాగం ప్రధాన కథ ముగుస్తుంది.

        క్కడ్నించే మొదలవుతుంది కథనంతో సమస్య. ఇంతవరకూ ప్రధాన పాత్రగా, కథానాయకుడుగా, ఆలస్యంగానైనా ఆర్య తన కథ తాను నడుపుకుంటూ వస్తున్న వాడల్లా, యాక్టివ్ పాత్రగా వుంటున్న వాడల్లా, కథకుడు తన చేతి నుంచి కథ లాక్కోవడంతో, ఇక కథకుడే కథ నడుపుకోవడంతో, యాక్టివ్ పాత్ర ఆర్య కుదేలైపోయి పాసివ్ పాత్రగా మారిపోతాడు...ఈ ఇంటర్వెల్ తర్వాత మిడిల్ -2 నుంచీ.

        ఇలా పాత్ర తెగిపోవడమే కాదు, కథ కూడా తెగిపోయి సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడుతుంది సినిమా ఇక్కడ్నించీ. ఇంటర్వెల్ ఈవెంట్ లో వేటపులి ఇక ఓడిపోతాడనగా, ఇడియప్ప గ్రూపు దాడి చేసి అలజడి సృష్టిస్తారు. బాక్సింగ్ జరక్కుండా చూస్తారు. ఆర్యని కొట్టి పడేసి బట్టలు చించేసి పోతారు. విజయం చేజారి ఆర్య కుప్పకూలుతాడు. యాక్షన్ రియాక్షన్ల మిడిల్ -1 సంఘర్షణలో ప్రత్యర్ధుల చేతిలో హీరో అనేవాడు ఓటమి చెందడమనే పాత్రోచిత చాపం (క్యారక్టర్ ఆర్క్) ఇలా భావోద్వేగాల్ని బాగా రెచ్చగొడుతున్న క్రియేషనే అనిపిస్తుంది మొదట ఇంటర్వెల్ మలుపు చూస్తే.

       అయితే ఇదే పాయింటు  పట్టుకుని ఇంటర్వెల్ తర్వాత ఇమ్మీడియేట్ గా మిడిల్ -2 కథనముండాల్సింది పోయి, ఇంటర్వెల్లో ఆర్యకి జరిగిన ఇంత అవమానాన్నే మర్చిపోయి, కథని హైజాక్ చేసిన కథకుడు తీరుబడిగా జైలు కథలు, తాగుబోతు కథలూ చూపిస్తూ ఆర్యకి రెండో శత్రువుగా మారిపోయాడు. ఇంటర్వెల్లో ఇడియప్ప మేళం బాక్సింగ్ ని భగ్నం చేసిన దానికంటే, ఇప్పుడు కథకుడు చేస్తున్న కథా వధ చాలా వ్యధ.

        రంగయ్యని అవమానించినందుకే బాక్సింగ్ కి దిగిన ఆర్య, తన బట్టలు చించి నగ్నంగా చేసిన అవమానాన్ని ఎలా మర్చిపోతాడో తెలీదు. రెండోది, తాము పాల్గొంటున్న ఈవెంట్ మీద దాడి చేసిన ఇడియప్ప గ్రూపు ఆ దాడితో తమ మరణ శాసనం తాము రాసుకున్నట్టే అవుతుంది. ఈ తప్పుకి బాక్సింగ్ క్రీడనుంచి ఇక బహిష్కృతులై పోవాలి. ఇక ఇడియప్ప పరంపర గిరంపర లేకుండా,  విజయం సార్పట్టాకే కట్టబెట్టేయాలి ఇంటర్వెల్లో. దీన్ని ఇడియప్ప దళం ఒప్పుకోకపోతే సెకండాఫ్ కథ వుంటుంది, లేకపోతే ఇక్కడితో కథ ముగిసిపోయినట్టే.

        కనుక ఎంతో బలంగా అనిపిస్తున్న ఇంటర్వెల్ సీను నిజానికి ఇంత బేలగా వుంది. సరే, దీని తర్వాత ఆర్య అన్నీ మర్చిపోయి సంసారం చేసుకుంటూ వుంటాడు. ఇక ఎమర్జెన్సీ ప్రకటించాక కోచ్ రంగయ్య జైలుకి పోతాడు. ఒక హోటల్లో భోజనం చేస్తున్న ఆర్యని ఇడియప్ప బాస్ గెలుక్కోవడంతో పోరాటం జరిగి పొడిచేస్తాడు ఆర్య. ఆ హత్యా యత్నం కేసు మీద ఇతను కూడా జైలుకి పోతాడు. జైలు నించి వచ్చాక దొంగసారా వ్యాపారంలోకి దిగుతాడు. తాగుడికి బానిసవుతాడు. ఇంట్లో భార్యతో గొడవ. ఇలా మొదలెట్టిన ప్రధాన కథని, పాత్రల లక్ష్యాల్నీ వదిలేసి కథని ఓ బారెడు మద్యపానం సన్నివేశాల మీదికి మళ్ళించాడు కథకుడు ఏవో సందేశాలివ్వాలని.

        తమిళనాడులో 1937 నుంచి 71 వరకూ చాలా సుదీర్ఘ కాలం మద్యనిషేధం అమల్లో వుంది. కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాక 1971 లో ఎత్తేశాడు. ఎత్తేశాక ’75-‘76 ఎమర్జెన్సీ కాలంలో మూకుమ్మడి కల్తీ సారా మరణాలు సంభవించడంతో మళ్ళీ మద్యనిషేధం విధించాడు. 1981 లో ఎమ్జీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎత్తేశారు. ఈ క్రోనాలజీలో హీరో ఆర్య కరుణానిధి కాలంలో దొంగసారా వ్యాపారంలోకి దిగుతాడు. ఇలా కథతో సంబంధం లేని ఎమర్జెన్సీని చూపించినట్టే, దొంగసారా వ్యాపారాన్నీ చూపిస్తూ మిడిల్ -2 అంతా కాలక్షేపం చేశాడు.

        రంగయ్య జైలు నుంచి విడుదలై వచ్చాకాగానీ తిరిగి కథని అందుకోడు కథకుడు. నాల్గేళ్ళ తర్వాత విడుదలవుతాడు రంగయ్య. రికార్డుల ప్రకారం ఎమర్జెన్సీ వున్నదే 22 నెలలు. 1975 లో ఎమర్జెన్సీ విధించాక, ’76 లో కరుణానిధి ప్రభుత్వం రద్దయ్యింది. 77 లో ఎమర్జెన్సీని ఎత్తేశాక రాజకీయ ఖైదీలందరూ విడుదలైపోయి ఎన్నికలు జరిగాయి. అంటే ’76 లో రంగయ్య జైలు కెళ్తే ’77 లో విడుదలైపోవాలి. నాల్గేళ్ళ తర్వాత విడుదలయ్యాడంటే కథకుడు ఆలో... చించేసిన కథ కోసం వేచి వుండి, లేదా కాల్షీటు కోసం పొంచి వుండి విడుదలయ్యాడన్న మాట. చరిత్రతో క్రోనాలజీ కూడా ఇలా వుంది.    

        ఇప్పుడు ఎండ్ విభాగం కథలోకొస్తే, ఎప్పుడో నాల్గేళ్ళ క్రిందటి పగలూ ప్రతీకారాలు గుర్తొచ్చి తిరిగి సార్పట్టా- ఇడియప్పల బాక్సింగులు. ఇప్పుడు పాసివ్ పాత్రగా వున్న ఆర్య పగ రగిలించుకుని దిగాలంటే తాగుడు వల్ల తగిన షేపులో లేడు. బాక్సింగ్ మర్చిపోయాడు. మళ్ళీ ట్రైనింగ్. అంటే మిడిల్ -1 లో చూపించిన కథనమే రిపీట్ అవుతుంది. బాక్సింగ్ లో మళ్ళీ శిక్షణ, వేట పులితో బాక్సింగ్, వాణ్ణి ఓడించడం వగైరా రిపిటీషన్ తో బలహీన క్లయిమాక్స్.  

     ఇలా సినిమా మొత్తం మీద చూస్తే కనిపించేది గాథే తప్ప కథ కాదు. గాథల్లోనే లక్ష్యంలేని, కథకుడు నడిపించే పాసివ్ హీరో పాత్ర వుంటుంది. కథనం కూడా పాత్ర- లక్ష్యం- సంఘర్షణ - విజయం అనే స్ట్రక్చర్ లేకుండా వుంటుంది. అయితే గాథల్ని కూడా అర్ధవంతమైన కథనంతో తీయవచ్చు. ఒక వేళ  గాథ చేయాలనుకుని ఆ సంబంధమైన రూల్స్ పాటిస్తే.

        ఒక వంద అత్యుత్తమ నవలల్లో 1927 లో వర్జీనియా వుల్ఫ్ రాసిన టు ది లైట్ హౌస్ అన్న నవల వుంది. నవలా రచనా నియమాల్ని బేఖాతరు చేసిన డేరింగ్ రచనగా ఇది పేరుబడింది. ఇందులో దాదాపు కథ అనేదే వుండదు. ఉండీ లేనట్టు సంభాషణాలుంటాయి. ఉన్న కాస్త కథ కూడా ఒక పాత్ర దృక్కోణంలో వుండదు. అయినా ఇది మానవ సంబంధాల గురించి లయబద్ధంగా సాగిపోయే – తదేక ధ్యానం లోకి తీసికెళ్ళ గల ఉత్కంఠ భరిత కథనంగా వుంటుంది. ఇది గాథ. ఇలాటివి పరిశీలిస్తే గాథ ఎలా తీయాలో తెలుస్తుంది.


సికిందర్