రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, మే 2019, బుధవారం

829 : టిప్స్


        61. ఇంకా పాత సినిమాలే వున్నదున్నట్టూ అనుసరణీయమనే అభిప్రాయం ఇంకా వుంది. పాత  సినిమాల్లోని భావోద్వేగాలు (ఎమోషన్స్ ) నిస్సందేహంగా కాలదోషం పట్టనివే. భావోద్వేగాలు ఎప్పుడైనా ఒకలాగే వుంటాయి. వుండనివేమిటంటే ఆయా కాలాల అభిరుచులే (టేస్ట్స్). అభిరుచులు మారిపోతూంటాయి. ముందు ట్రెండ్ లో వున్న ప్రేక్షకాభిరుచుల్ని ఎష్టాబ్లిష్ చేసుకుంటే - వాటిని ఆధారంగా జేసుకుని  ఏ ఎమోషన్స్ నైనా ప్రదర్శించుకోవచ్చు. అదే పాత సినిమాల్లోని ఎమోషన్స్ ని ఆనాటి అభిరుచులతో సహా అలాగే ఎత్తేసి పెట్టుకుంటే, మొత్తం సినిమా కాలం చెల్లిన రూపంతో, ఆ మధ్య వచ్చిన  ‘రభస’లాగే వుంటుంది. ఇటీవలి ఒక  హిట్ ’రన్ రాజా రన్’ లో, ముందు ట్రెండ్ లో వున్న అభిరుచుల్ని హైలైట్ చేస్తూ, విలన్లూ -పోలీసుల పాత మూస తరహా భావోద్వేగాలతోనే నింపేసి అలరించారు.     
          62. కథా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయో కథానాయకుడనే వాడికి తెలియకపోతే అతనొక  కథానాయకుడే కాదు. 
          63. యాక్టివ్ పాత్రతో కమర్షియల్ సినిమాల్ని సహజత్వంతో  తీయడం నూటికి ఒక్కరికి మాత్రమే సాధ్యమవుతోంది. టాలీవుడ్ లో హీరో పాత్రలతో కమర్షియల్ అనుకుని పొరబడి తీస్తున్న వన్నీ ఆర్ట్ సినిమాల్లాంటివే.
          64. మాస్ సినిమా హీరో పాత్ర, ప్రేమ సినిమా హీరో పాత్ర, సస్పెన్స్ థ్రిల్లర్ హీరో పాత్ర... ఇలా పాత్రలన్నీ ఒకలాగే వుంటాయా? ఒక ఇడ్లీనే దోశ వేసేసి, పూరీ వేసేసి, చపాతి చేసేసి అమ్ముతారా? పేరుకే జానర్లు వేర్వేరు, వాటి పాత్రలు అదే ఇడ్లీతో వేర్వేరు టిఫిన్లు. ప్రేక్షకులు ఎంత వెర్రి వాళ్ళయితే ఈ టిఫిన్లు తిని త్రేన్చి ది బెస్ట్ అంటున్నారు. ఏ జానర్ కైనా హీరో పాత్ర ఒకే మోడల్ - మూస ఫార్ములా మాస్ హీరో.
         
65. స్క్రీన్ ప్లే లో హీరోకి ఏర్పాటు చేసే గోల్ ఒకే మాట, ఒకే బాణం అన్న తీరులో వుండాల్సిన అవసరం లేదన్నట్టు పాత్రచిత్రణ లుంటున్నాయి.  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఒక గోల్ ని ఏర్పాటు చేసినట్టు అన్పించాక, దానికి కట్టుబడి వుండక,  ఇంటర్వెల్లో ఇంకో గోల్ ని ముందుకు తేవడం వల్ల కథనానికి స్థిరత్వం లేకపోవడమే కాదు, అది ఎపిసోడ్ల మాదిరిగా సాగడమే కాదు, అసలు హీరో ఏం కోరుకుంటున్నాడో అర్ధంగాని పరిస్థితి తలెత్తే ప్రమాదముంది. ‘కంచెప్రత్యక్ష  కథలో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, మొదట బందీలైన తన దళాన్ని విడిపించుకోవడమే  గోల్ గా  ప్రకటించుకున్న హీరో, తీరా ఇంటర్వెల్ దగ్గర, పసి పిల్లని కాపాడే గోల్ గా మార్చుకుంటాడు. ‘షేర్లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర, హీరోయిన్ని పెళ్ళాడతానని సవాలు చేసే  ఛోటా విలన్ కి, అదేదో తనే  పెళ్ళాడి చూపించకుండా, ఇంటర్వెల్ దగ్గర ఆ ఛోటా విలన్ కమీషనర్ తో ఇంకో ఎత్తుగడ వేస్తే, దానికి విరుగుడుగా కమీషనర్ తో హీరో ఇంకో గోల్ కి సిద్ధమౌతాడు. కథంటే హీరో కోరికే. అతనేం కోరుకుంటున్నాడో స్పష్టత నివ్వకపోతే కథేమిటో ప్రేక్షకులకి అర్ధంగాదు.       
          66. ప్లాట్ పాయింట్ -2 రహస్యం నిజానికి ప్లాట్ పాయింట్ -1 లోనే దాగి వుంటుంది. అందుకే ప్రాబ్లం సెటప్ బలంగా లేకపోతే  కథ ముగింపు కూడా బలహీనంగా వుంటుందనేది. సెటప్ చేసిన ప్రాబ్లం కి పరిష్కారం కనుగొనే ఘట్టమే ప్లాట్ పాయింట్- 2.  ఇక్కడ్నించీ ప్రారంభమయ్యేదే క్లయిమాక్స్,  అంటే ఎండ్ విభాగం. ప్రీ క్లయిమాక్స్ అనే పదాన్ని తెలుగులోనే విరివిగా వాడేస్తూంటారు. దీన్ని వివరించమంటే ఎవరూ వివరించలేరు. డిక్షనరీలో ఈ పదానికి అర్ధం పర్యావరణానికి సంబంధించి వుంటుంది. నెట్ లో సెర్చ్ చేసినా - మహేష్ బాబు ప్రీ క్లయిమాక్స్ సీన్ అనో,  బాలకృష్ణ ప్రీ క్లయిమాక్స్ ఫైట్ అనో  కేవలం తెలుగు సినిమాలకి సంబంధించే రిజల్ట్స్ వస్తాయి. తెలుగులో ఈ పదాన్ని ఎవరు ఎప్పుడు ఎలా పుట్టించారో ఎవరైనా రీసెర్చి చేయాలి.  సినిమాల్లో వుండేది ఒక్క క్లయిమాక్స్ మాత్రమే - అది ప్లాట్ పాయింట్- 2 దగ్గర్నుంచీ ప్రారంభమవుతుంది. ఒకవేళ ప్రీ క్లయిమాక్స్ నే నిర్వచించాల్సి వస్తే,  అది ప్లాట్ పాయింట్ -2 కి ముందు వచ్చే పించ్ -2 అని చెప్పుకోవాల్సి వుంటుంది.  కానీ పించ్ -2  ని దృష్టిలో పెట్టుకుని  ప్రీ క్లయిమాక్స్ అని అంటున్నారా అంటే,  పించ్-2  ని అందరూ గుర్తించడమే కష్టం - ఎంతో స్క్రీన్ ప్లే పరిజ్ఞానం వుంటే తప్ప. కాబట్టి స్పష్టత లేని పదజాలాలు పెట్టుకుని ప్లాట్ పాయింట్- 2 ని  ఆలోచించకూడదు. అది క్లయిమాక్స్ ని దెబ్బ తీయవచ్చు.    
         67. ఫ్లాష్ బ్యాక్ అనేది కథ మీద ఫోకస్ ని దెబ్బతీస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లేని స్ట్రెయిట్ నేరేషన్ సినిమాల్లో సెకండాఫ్ లో ఎక్కడో చోట కథ డల్ అవుతున్న మాట నిజమే. దీనికి పరిష్కారం ఫ్లాష్ బ్యాక్ కాదు. దాదాపు పాత్రకో ఫ్లాష్ బ్యాక్ చొప్పున వున్న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో సెకండాఫ్ అరగంట గడిచాక, రౌడీలని మంచివాళ్ళుగా హీరో ప్రవేశ పెట్టినప్పుడు, అమాంతం కథ డౌన్ అయిపోయి, విషయం  కోసం వెతుక్కుంటున్నట్టు తయారవుతుంది. సెకండాఫ్ లో ఒక అనూహ్య సంఘటనో, లేదా కథని మలుపు తిప్పే ఓ కొత్త పాత్ర ఎంటర్ కాకపోవడమో ఇలా జరగడానికి కారణమని తను గమనించినట్టు దర్శకుడు దేవ కట్టా ఒకసారి చెప్పారు.  
         
68. ముగింపు తెలియకుండా కథ ప్రారంభించ కూడదు. అలాగే అనుకున్న కథలో మొదటి మూల స్థంభం, రెండవ మూల స్థంభం, విశ్రాంతి ఘట్టం నిర్ణయించుకోకుండా రాయడం మొదలు పెట్టకూడదు. రాయడానికి ముగింపూ- మూల స్తంభాలు రెండూ-  విశ్రాంతి ఘట్టమూ-  ఈ నాలుగూ గైడ్ పోస్టులుగా వుంటాయి. ఒక మజిలీ నుంచి ఇంకో మజిలీకి కథనానికి గమ్యాలు తెలుస్తూంటాయి.
         
69. క్యారెక్టర్ గోల్ అంటే కథ మొత్తానికీ  కలిపి ఒకే గోల్ మాత్రమే వుండడం కాదు- సీను సీనుకీ అవసరమైన చోటల్లా గోల్స్ వుంటేనే కథ బోరు కొట్టకుండా వుంటుంది. స్టోరీ గోల్ ని సాధించే మార్గంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. ఆటంకాలు ఆయా సీన్లలో వుంటాయి. వాటిని అధిగమించడం కూడా ఒక గోల్ అవుతుంది. అధిగమించకపోతే సీను బోరు కొడుతుంది. అలాటి సీన్లు ఎన్ని వుంటే కథ అంత బోరు కొడుతుంది..
         
70. ఒక జీవిత చరిత్ర ఏ రస ప్రధానమో ఆ రస ప్రధానంగా సినిమా చేయకపోతే ఒక అటెన్ బరో  గాంధీ వుండదు, ఒక కృష్ణ  అల్లూరి సీతారామరాజు వుండదు. ఆ జీవిత చరిత్రకి అన్యాయం చేస్తూ  రుద్రమదేవిఅనే కమర్షియల్  కథమాత్రమే వస్తుంది- ‘గాథరాదు. వీరవనిత చరిత్ర వుండదు, తోచిన శృంగార దేవత చిత్రణ లుంటాయి. దీన్ని ఒక్కడు కి మించిన కమర్షియల్ అని కూడా దర్శకుడు అనడం చరిత్రపట్ల నిబద్ధతని పట్టిస్తుంది.
         
71. అన్ని సినిమాలు అందరి కోసమూ తీయలేరు. అన్ని సినిమాల్ని అందరూ చూడరు. భారీ బడ్జెట్లతో ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్లు అంటూ తీసున్న సినిమాలనే ఫ్యామిలీలన్నీ కదిలి వచ్చి చూడ్డం లేదు. ఒకే సారి వెయ్యి థియేటర్లలో విడుదల చేసుకుంటే గానీ వాటికి మనుగడ లేదు. యూత్ సినిమాల పేర తీసే ప్రేమ సినిమాలని ఫ్యామిలీలు కాదుకదా, మాస్ కూడా పూర్తిగా చూడ్డం లేదు. అలాగని యూత్ కూడా అందరూ చూడ్డం  లేదు. హారర్ సినిమాలకైతే ఏ  ప్రేక్షకులుంటారో ఎవరికీ తెలీదు. అయినా ఈ సినిమాల్ని పట్టుకుని ఇది ఫ్యామిలీలకి ఎక్కదు, బి, సి సెంటర్లలో ఆడదు అంటూ ప్రొఫైలింగ్ చేయడం లేదెవరూ. వీటన్నిటినీ క్రాస్ చేసే ఒక విభిన్న కథా చిత్రం వస్తే మాత్రం- చాలా వెంటనే ప్రొఫైలింగ్  చేసేస్తారు. మిగతా ప్రపంచమంతా బ్రహ్మరధం పట్టనీ గాక, స్థానికంగా మాత్రం సంకుచిత మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారు. ఇది బి, సి సెంటర్లలో ఆడదు, ఫ్యామిలీలు రారు, ఇందులో అది లేదు, ఇది లేదు అంటూ తీర్పు లిచ్చేస్తూంటారు. విషయమేమిటంటే, ఈ తీర్పులిచ్చే వాళ్లకి అసలు క్వాలిటీ సినిమా అంటే ఏమిటో అలవాటు తప్పిపోయింది. సగటు ప్రేక్షకుల్లాగా మెదళ్ళని ఇళ్ళ దగ్గర వదిలేసి థియేటర్లలో అమాంబాపతు సినిమాలని ఎంజాయ్ చేస్తూ ఇవే తెలుగు సినిమాలని డిసైడ్ అయిపోయారు. వీళ్ళకి భిన్నంగా నెట్ ప్రపంచం, షోషల్ మీడియా లోకం ఇలాటి సినిమాలు ఒక్కదానికీ భిన్నాభిప్రాయం లేకుండా బ్రహ్మరధం పడుతూంటాయి.  కాబట్టి ఈ  తీర్పులకి వెరవకుండా- అనుకున్న పంథా లో సాగిపోవడమే అసలైన స్క్రీన్ రైటర్ల కర్తవ్యం. మార్పు తెచ్చే వాళ్లెప్పుడూ వొంటరి వాళ్ళు అనేది పాత మాట. 
         
72. స్ట్రక్చర్ అంటే బోరు కొడుతున్నప్పుడు స్ట్రక్చర్ ని ఎగేసే పాత్రల్ని సృష్టించి స్ట్రక్చర్ రహిత స్క్రీన్ ప్లేని రాయవచ్చు. అయితే ఆ పాత్రని పోషించే నటుడికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వుండాలి- ‘భలే భలే మగాడివోయ్లో నాని లాగా. ఆ క్రేజీ నటుడు పది నిమిషాల కోసారి కథలో బ్యాంగ్ కూడా ఇస్తూపోవాలి. ఇక స్ట్రక్చర్ ప్రసక్తే వుండదు. స్ట్రక్చర్ అంటే మూడంకాల ( త్రీ యాక్ట్స్) స్ట్రక్చరే  కాబట్టి, దీన్ని రెండంకాలకి కుదించి కూడా రాసుకోవచ్చు. ‘ సైకోలో ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్  చేసిన పని ఇదే. హీరోయిన్ కథగా నడుస్తున్నది కాస్తా, చరిత్రలో నిల్చిపోయిన బాత్రూం మర్డర్ సీనులో ఆ హీరోయిన్ ని విలన్ చంపెయ్యడంతో విలన్ కథగా మారిపోతుంది. అంటే ఒకే సినిమాలో ఇద్దరి పాయింటాఫ్ వ్యూల్లో ఇద్దరి కథ. ఇక్కడ కూడా ఆ ఇద్దరూ పాపులర్ నటులే కాబట్టి వర్కౌట్ అయ్యింది. నయనతార ని ఆ హీరోయిన్ స్థానంలో, నాగార్జునని ఆ విలన్ స్థానంలో సినిమాని ఊహిస్తే ఎలా వుంటుందో ఆలోచించడి..నాగార్జున నయనతారని చంపాడూ- నాగార్జున నయనతారని చంపాడూ అని  ఒకటే పబ్లిసిటీ అయిపోతుంది! ఇలాగే వుంటాయి సినిమా ట్రేడ్ గిమ్మిక్కులు. కేవలం కథలతోనే కుస్తీ పట్టక్కర్లేదు.
         
73. మాకు ఉపదేశించే అర్హతలేదు. వినోదం మాత్రమే ఇయ్యగలంఅనటం సినిమా చిత్రాలు తీసేవారికే చెల్లింది! వరసగా దివాలా చిత్రాలు తియ్యటం కూడా వారికే చెల్లింది. అలాంటి దృక్పథం గల కళాకారుడు షండుడు. తనకి తెలిసిన జీవితాన్నయినా వాస్తవంగానూ, జీవిత సత్యం నిరూపితమయేటట్టూ చిత్రించ లేనివాడు కళాకారుడని చెప్పుకునేందుకు అర్హుడు కాడు. ఆ పని చేసినప్పటికీ అతడి కళాసృష్టి  సమాజాన్ని ఉద్ధరించకపోవచ్చు. దాని లోపాలను విమర్శనం చేస్తుంది. ప్రత్యేక కళాఖండాలు చేయలేని పని కళలు సమష్టిగా చెయ్యవచ్చు.
కొడవటిగంటి కుటుంబరావు
(సికిందర్)