రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, February 23, 2025

1367 : స్క్రీన్ ప్లే సంగతులు!

 



రచన - దర్శకత్వం : మగిళ్ తిరుమేని
తారాగణం :  అజిత్, త్రిష, అర్జున్, రెజీనా కాసాండ్రా, ఆరవ్ తదితరులు
సంగీతం :  అనిరుధ్ రవిచంద్రన్, ఛాయాగ్రహణం : ఓం ప్రకాష్,
బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : సుభాస్కరన్ అల్లీరాజా
విడుదల : ఫిబ్రవరి 6, 2025
***

        త పదేళ్ళుగా అజిత్ కుమార్ ఒకే మూసలో ఫార్ములా యాక్షన్ సినిమాలు తప్ప వేరే కొత్తదనం జోలికిపోవడం లేదు. సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి, ధనుష్ లాంటి ఇతర తమిళ స్టార్లు విభిన్న ప్రయోగాలు చేస్తూంటే, తను మాత్రం అవే కృత్రిమ యాక్షన్ ఫార్ములాలతో అక్కడే వుండిపోయాడు. ఈ లిస్టులో  విదాముయర్చి ని కొత్తగా చేర్చాడు. ఆరు సినిమాలు తీసిన మగిళ్ తిరుమేని దీనికి దర్శకుడు. ఇతడికంటే ముందు దర్శకుడు విఘ్నేష్ శివన్ ని ఫైనల్ చేసిన అజిత్, ఎంత టైమిచ్చినా అతను సరైన స్క్రిప్టు సిద్ధం చేయడం లేదని మురుగ దాస్, అట్లీ లాంటి ఎందరో దర్శకుల్ని పరిశీలించాడు. చివరికి  మగిళ్ తిరుమేనికి అవకాశమిచ్చాడు. ఇంతా చేసి రొటీన్ యాక్షన్ సినిమాలతో తనకున్న మోజుని ఈ సినిమాతో అట్టడుగు స్థాయికి చేర్చాడు. ఒకే మూసలో ఫార్ములా యాక్షన్ సినిమాలు నటిస్తున్న తనకి, ఇంతకంటే లో- ర్యాంకు లేదని గ్రహిస్తే ఇక వీటికో నమస్కారం పెట్టి కొత్తదనం వైపు ఏమైనా చూస్తాడేమో నని ఫ్యాన్స్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి పట్టుదల ఇంత అట్టడుగు స్థాయికి ఎలా చేరిందని, ఎందుకు చేరిందని ఎవరికైనా సందేహాలు వస్తాయి. వీటికి సమాధానం కోసం ప్రయత్నిద్దాం...

కథేమిటి
    అర్జున్ (అజిత్)  జార్జియాలోని టిబిలిసిలో అమెరికన్ కంపెనీలో పని చేస్తూంటాడు. ఇక్కడే  కాయల్ (త్రిష- కాయల్ అంటే అందమైన కళ్ళు గలది అట) తో  ప్రేమలో పడతాడు. ఇంతలో అతడికి అజర్ బైజాన్ లోని బాకు అనే నగరానికి ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఓ మూడేళ్ళ తర్వాత ఆమెని పెళ్ళి చేసుకుంటాడు. తర్వాత ఆమెకి అబార్షన్ అయి పిల్లలు పుట్టని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అతడికి దూరం కావడం ప్రారంభిస్తుంది. తొమ్మిది సంవత్సరాల తర్వాత తనకి ప్రకాష్ అనే అజ్ఞాత వ్యక్తితో ప్రేమ వ్యవహారం వుందని  చెబుతుంది. ఆమె నిజాయితీకి మెచ్చుకుని సమస్య  పరిష్కరించుకుందామని అతనంటే,  విడాకులు  కావాలని అంటుంది. అప్పటిదాకా టిబిలిసిలోని తన పేరెంట్స్ దగ్గర వుంటానని అంటుంది.

కారులో ఆమెని తీసుకుని టిబిలిసి బయల్దేరతాడు. దారిలో ఒక కారులో తాగుబోతులు రాష్ డ్రైవ్ చేసి - వాళ్ళే గొడవకి దిగుతారు. అర్జున్ మౌనంగా వాళ్ళ మాటల్ని భరించి తనే సారీ చెప్తాడు. ఆ తాగుబోతుల లీడర్ కిషోర్ (ఆరవ్) అర్జున్  పెట్రోలు కోసం బంకులో ఆగినప్పుడు అక్కడికొచ్చేస్తాడు. కాయల్ షాపింగ్ చేసుకోవడానికి  వెళ్తుంది. కిషోర్ అర్జున్ ని రెచ్చగొట్టడం మొదలెడతాడు. అటు షాపులో కాయల్ కి దీపిక (రెజీనా కాసాండ్రా), రక్షిత్ (అర్జున్) లు పరిచయమవుతారు. వాళ్ళు ఒక పార్సిల్ ని డెలివరీ ఇవ్వడానికి ట్రక్కులో వెళ్తున్నట్టు చెప్తారు. తర్వాత కాయల్ ని తీసుకుని బయల్దేరిన అర్జున్ కారు హైవేమీద పోతూ విధ్యుత్ లోపంతో ఆగిపోతుంది. రిపేరు చేయడానికి విఫల యత్నం చేస్తాడు. మెకానిక్ కి ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ వుండవు.
       
ఇంతలో ట్రక్కు వస్తూ కనిపిస్తుంది. దాన్ని ఆపి డ్రైవ్ చేస్తున్న రక్షిత్ కి ప్రాబ్లం చెప్తాడు. రక్షిత్ వల్ల కూడా రిపేరు కాదు. ఇలాకాదని
, కొంత దూరంలో కాఫీ షాప్ వుందని, అక్కడ్నించి లాండ్ లైన్లో మెకానిక్ కి కాల్ చేయవచ్చని దీపిక చెప్తుంది. కాయల్ వాళ్ళతో బయల్దేరుతుంది. చాలా సేపటిదాకా కాయల్  మెకానిక్ తో తిరిగి రాదు. ఇంతలో కారు స్టార్ట్ అవుతుంది. అర్జున్ కారులో కాఫీ షాప్ కి బయల్దేరతాడు. అక్కడికి లేడీస్ ఎవరూ రాలేదని కాఫీ షాప్ ఓనర్ చెప్తాడు. మరి కాయల్ ఎటు వెళ్ళినట్టు?
       
అర్జున్ కి ఆందోళన పెరుగుతుంది. కాయల్ కిడ్నాప్ అయినట్టు అర్ధమైపోతుంది. ఎందుకు కిడ్నాప్ చేశారు
? అసలు దీపికా రక్షిత్ లెవరు? కాయల్ ని ఎక్కడికి తీసికెళ్ళారు? ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలో అర్ధంగాదు అర్జున్ కి...

ఎలావుంది కథ
     1997 లో విడుదలైన కర్ట్ రస్సెల్ నటించిన ది బ్రేక్ డౌన్ ని కాపీచేసి ఈ కథ తీస్తూంటే పారమౌంట్ పిక్చర్స్ కి తెలిసిపోయి నోటీసు పంపారు. 11 కోట్లకి సెటిల్ చేసుకుని కాపీ మచ్చ తుడిపేసుకుని అధికారిక రీమేకుగా చట్టబద్ధత పొందారు. ఈ పని ముందే చేసి వుండాల్సింది. అయితే ముందు కాపీ చేయాల్సి వచ్చినా ఎప్పుడో 28 ఏళ్ళనాటి కాలం  చెల్లిన, అరిగిపోయిన హాలీవుడ్ కథనే ఎందుకు సెలెక్టు చేసుకున్నాడో దర్శకుడు తెలీదు. ఈ కాలం చెల్లిన, అరిగిపోయిన  కథ అజిత్ లాంటి పెద్ద స్టార్ కి కురచనై పోయిన కథ కూడా. మూడోది- ఇది ఒక రోజులో అంటే 24 గంటల్లో ముగిసిపోయే రోడ్ ట్రిప్ థ్రిల్లర్ కథ. చిన్న హీరోతో తీయాల్సిన ఒక రోజు జరిగే కథతో పెద్ద స్టార్ ని పెట్టి తీయడం ఏం మార్కెట్ యాస్పెక్టో తెలీదు. ఇవన్నీ కలిసి పట్టుదల ని పట్టులేని ప్రయత్నంగా తయారు చేశాయి. బడ్జెట్లో సగం కూడా వసూలు చేయలేకపోయిన ఇలా తీసిన ఈ సినిమా ఇతర స్టార్లకి హెచ్చరికలా వుంటుంది.  ఇతర స్టార్లని హెచ్చరించడం కోసమే ఈ సినిమా తీసినట్టుంది- 11 కోట్లు దీని కథకి సమర్పించుకుని!

స్క్రీన్ ప్లే సంగతులు

    ఒరిజినల్ కథలో కర్ట్ రస్సెల్- కేథ్లీన్ క్విన్లాన్ లు బోస్టన్ నుంచి బయల్దేరి శాండీగో కారులో పోతూంటారు. వాళ్ళు భార్యాభర్తలు. వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఇంకేమీ చెప్పరు. ఇద్దరూ అన్యోన్యంగా వుంటారు. అలా పోతున్నాక దారిలో కారు పాడయి, తర్వాత మెకానిక్ కోసం ట్రక్కులో వెళ్ళి మాయమైపోతుంది కేథ్లీన్.
        
పట్టుదల లో ముందు కథ కొంత జోడించాడు దర్శకుడు. భార్యా భర్తలుగా అర్జున్- కాయల్ ల సంబంధాలు క్షీణించి వుంటాయి. దీని ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళ పరిచయం ప్రేమా పెళ్ళీ వగైరా వస్తాయి. పెళ్ళి తర్వాత అబార్షన్, వేరొకరితో తనకి ఎఫైర్ వుందని ఆమె చెప్పడం, విడాకులు కోరడం, విడాకులయ్యేదాకా పేరెంట్స్ దగ్గర వుంటాననడం, అర్జున్ ఆమెని తీసుకుని బయల్దేరడమూ ఈ జోడించిన కథలో వుంటాయి.
       
ఇలా ఇండియనైజ్ చేయడం అవసరమే. అయితే ఈ ఇండియనైజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ తో
, కాయల్ తో ఇంటర్వెల్లో ఇచ్చిన మలుపుని అర్జున్ కి వ్యతిరేకంగా ఆమెని  నిలబెట్టి కథకి కొత్తదనాన్ని నింపొచ్చు.  ఇలా చేయలేదు.

2. ఏమిటి ఇంటర్వెల్ మలుపు?

    ఫస్టాఫ్ లో కాయల్ మీద ముందే పన్నిన కుట్ర ప్రకారం రక్షిత్, దీపికా, మైకేల్ ముఠా ఆమెని కిడ్నాప్ చేసి అర్జున్ దగ్గర డబ్బులాగడం గురించే ఈ కథ. 45వ నిమిషంలో కాయల్ మాయమవడంతో ప్లాట్ పాయింట్ 1 వచ్చి మిడిల్ 1 లో పడుతుంది కథ. కాన్ఫ్లిక్ట్ తో కూడిన ఈ సెగ్మెంట్ లో - మిడిల్ 1 కథ ఇంటర్వెల్ వరకూ కాయల్ ని అర్జున్  వెతుక్కోవడం గురించే వుంటుంది. ఇంటర్వెల్ లో కిడ్నాప్ గ్యాంగ్ దొరికిపోతారు- కాయల్ దొరకదు. ఈ ఇంటర్వెల్లో ఒరిజినల్లో లాగే బలమైన మలుపు వస్తుంది. దీన్ని దీపిక  రివీల్ చేస్తుంది- కాయల్ ని తాము కిడ్నాప్  చేయలేదని, ఇదంతా తమని కిరాయికి మాట్లాడుకుని కాయల్ ఆడుతున్న డ్రామేననీ-చెప్పి షాకిస్తుంది దీపిక!
        
అయితే ఈ మలుపుని ఇలాగే మనుగడలో వుంచి సెకెండాఫ్ నడపాల్సింది. ఇలా చేయలేదు. ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ ప్రారంభించాక తాను చెప్పింది జోక్ అని కొట్టి పారేస్తుంది దీపిక. దీంతో ఇంటర్వెల్లో ఇది కాయల్  డ్రామా అంటూ  బ్రహ్మాండంగా చూపించిన సెటప్ ని - జోకుగా  చెప్పి పేఆఫ్ చేయడం -1997 నాటి కాలంలో ఒరిజినల్ కి చెల్లిందేమో గానీ ఇప్పుడు కాదు.
       
ఇలా చేశాక ఇక మిడిల్ 2 లో కథేముంటుంది- అదే కాయల్ ని వెతుక్కోవడం
, అర్జున్ ఎనిమిది కోట్లు డబ్బు తెచ్చినా  రక్షిత్ గ్యాంగ్ కాయల్ ని  అప్పగించకపోవడం, అర్జున్ ఒక్కొక్కరి అంతూ చూస్తూ పోయి చివరికి కాయల్ ని కనుక్కోవడం ఇదే కథ!
       
ఇలా డెప్త్ లేకుండా ఫ్లాట్ గా సాగే ఫక్తు కిడ్నాప్ తతంగంతో ఈ సెకెండాఫ్ ఫస్టాఫ్ కంటే బలహీనంగా తయారయ్యింది. పైగా రక్షిత్- దీపికలు మానసిక రోగులని వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ వేసి కథకి ఇంకింత నష్టం చేశారు. విలన్ పాత్రలకి ఇలాటి శాడ్ గా వుండే ఫ్లాష్ బ్యాకులేస్తే ఎవరికి సానుభూతి కలుగుతుంది
? సెకండాఫ్ ని నిలబట్టే ఒక్క కీలకాంశం, కొత్త మలుపూ ఏదీ లేదు.
       
1997 లో సెల్ ఫోన్లు లేవు. కాబట్టి ఫోన్ చేసుకోవడానికి లాండ్ లైనే గతి. ఇప్పుడు  సెల్ ఫోన్లు వున్నాయి -కానీ సిగ్నల్స్ లేవన్నారు. అందుకని లాండ్ లైను కోసం వెళ్ళింది కాయల్ బాగానే వుంది- కానీ సెల్ ఫోన్ చేతిలో వున్న అర్జున్ రక్షిత్
, దీపికలని, వాళ్ళ ట్రక్కునీ, దాని నెంబర్ ప్లేటునీ వీడియోతీసి కాయల్ నిచ్చి పంపి వుంటే ఇంత రభస జరిగేది కాదుగా?ఇంకోటేమిటంటే ఫస్టాఫ్ లో అర్జున్ ని పూర్తిగా పాసివ్ గా వుంచారు. ముఠా చేతిలో దెబ్బలు తింటాడే తప్ప ఎదురు తిరగడు. దీంతో అజిత్ లాంటి యాక్షన్ స్టార్ తో యాక్షన్ సీన్లే లేవు ఫస్టాఫ్ లో.

ఇంటర్వెల్ లో ఇది అర్జున్ మీద కాయల్ పన్నిన కుట్ర అన్నప్పుడు, ఆమె కుట్రగానే సెకండాఫ్ నడిపి వుంటే అర్జున్ ఎమోషన్స్, స్ట్రగుల్ ఎంత బలంగా వుండేవి? విడాకుల ప్రపోజల్ పెట్టిన కాయల్ ఇలా డబ్బు లాగుతోందా, ఎవరితోనో ఎఫైర్ వుందని అంది- ఆ ఎఫైర్ రక్షిత్, కిషోర్ వీళ్ళలో ఎవరితో....ఇలాటి అనుమానాలతో, సంఘర్షణతో, ఆమెని పట్టుకుని గట్టి బుద్ధి చెప్పాలన్న పట్టుదలతో అర్జున్ నడుచుకుని వుంటే- పతాక సన్నివేశాల్లో చివరికి ఆమె అమాయకురాలనీ, ఇదంతా ఆమెని వాడుకుని గ్యాంగ్ పాల్పడ్డ కుట్ర అనీ అప్పుడు తెలుసుకుంటే - ఎంతో కొంత బెటరయ్యేది ఈ రీమేక్!

1987 లో విడుదలైన ఫ్రెంచి మూవీ
ది వానిషింగ్ ఇలాటిదే హీరోయిన్ ప్రయాణం మధ్యలో అదృశ్యమయ్యే కథ. అయితే ప్లాట్ పాయింట్ వన్ లో అదృశ్యమయ్యాక అదే రోజు జరిగి ముగిసే కథగా ఇది వుండదు. అదృశ్యమయ్యాక మూడేళ్ళు  గడిచిపోతాయి. హీరో ఇంకో గర్ల్ ఫ్రెండ్ తో వుంటాడు. అప్పుడు ఒక సైకో పిక్చర్ లోకి రావడంతో హీరోయిన్ మిస్సయిన మిస్టరీ తెలుసుకుంటూ సాగుతాడు హీరో...

పట్టుదల ని కూడా ఏకబిగిన 24 గంటలు సాగే కథగా - రియల్ టైమ్ ప్లాట్ గా గాకుండా, టైమ్ లాప్స్ తో రెగ్యులర్ సినిమాగా కథ కాలాన్ని పెంచి వుంటే- అజిత్ లాంటి పెద్ద స్టార్ కి సూటయ్యేది. 
—సికిందర్