రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, July 29, 2016

షార్ట్ రివ్యూ!








రచన- దర్శకత్వం : వంశీకృష్ణ ఆకెళ్ళ


తారాగణం: సునీల్, మన్నారా చోప్రా, కబీర్ సింగ్, సత్యప్రకాష్ ,
పృథ్వీ, సప్తగిరి, పోసాని, నాగినీడు,
మాటలు : భవానీ ప్రసాద్, సంగీతం : దినేష్, కెమెరా : రాం ప్రసాద్ సి
బ్యానర్ : ఆర్పీఏ క్రియేషన్స్
విడుదల 29 జులై, 2016
***

      తెలుగులో హీరోగా తన కంటూ ఒక స్థానం కోసం సునీల్ ఇంకా దండయాత్రలు చేసే పరిస్థితుల్లోనే ఉండాల్సిరావడం నిజంగా ట్రాజడీయే. కమెడియన్ గా మొదటి సినిమాతోనే ఎస్టాబ్లిష్ అయిపోగల్గిన తను తీరా హీరోగా మారాలనుకునే సరికి- ఈ విభాగంలో  కమర్షియల్ సినిమాల స్థితిగతులు పరిశీలించుకున్నట్టు లేదు. స్టార్లు నటిస్తున్న కమర్షియల్ సినిమాలకే ఠికానా లేదు, వాటి కథాకమామీషులు అలా ఉంటున్నాయి- అలాటిది హీరోగా, ఇంకా యాక్షన్ హీరోగానూ  మారిపోయి కొత్తగా సునీల్ కూడా వస్తే, ఇటువైపు విభాగంలో పరిస్థితులేమీ మారిపోవు. అవే పరిస్థితుల మధ్య, అవే అరిగిపోయిన, ఇతర హీరోలు నటించేసిన, అవే  పాత మూస వ్యవహారాల్లోనే చిక్కుకుని గిలగిల్లాడాల్సి వుంటుంది. అదే ఇప్పుడూ జరిగింది ‘జక్కన్న’ తో. ‘బ్యాక్ టు ఎంటర్ టైన్’ అనే ట్యాగ్ లైన్ తో వస్తూ, ఎంటర్ టైన్మెంట్ కి తన దృష్టిలో అర్ధం ఇదా అన్నట్టు  ముక్కున వేలేసుకునేట్టు చేయడం మరీ  ట్రాజడీ. 

      దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ  నాల్గు తెలుగు సినిమాల కట్ అండ్ పేస్ట్ దర్శకుడుగానే తప్ప సొంత టాలెంట్ గల వ్యక్తిగా ఏ కోశానా కన్పించక పోవడం ఈ సినిమాలో ప్రత్యేకత. కనీస స్క్రీన్ ప్లే, కథాకనాలు, పాత్ర చిత్రణల నాలెడ్జి కొరవడినట్టు మొదటి సీను దగ్గర్నుంచే తెలిసిపోతుంది. పైపెచ్చు శ్రీను వైట్ల వాడి వాడీ కెరీర్ మీదికి తెచ్చుకున్న ‘విలన్ ఇంట్లో హీరో చేరి వాణ్ణి బకరా చేయు కన్ఫ్యూజ్  కామెడీ  అనబడు సింగిల్ విండో స్కీమ్’  నే ఈ దర్శకుడూ  అరువు దెచ్చుకుని సునీల్ కి అంటగట్టడం సాహసాల్లో కెల్లా సాహసం! 

        సినిమాలు చూడ్డంలో ప్రేక్షకులకి  ఎబిసిడిలు తెలీనట్టు ఈ కథా ప్రారంభం ఎలా వుంటుందంటే...

నీతి కథ!

        నగనగా ఒక వూళ్ళో ఒక మేష్టారు పిల్లలకి నీతి కథ చెప్తాడు. చిన్నప్పటి హీరో ఈ నీతి  కథ వినని అచ్చు అలా మారిపోతాడు. నీతికథ సారాంశమేమిటంటే,  నీకెవరైనా సాయం చేస్తే దానికి నువ్వు రెట్టింపు సాయం చెయ్ అనేది. పెద్దవాడైపోయిన హీరో గణేష్ అలియాస్ జక్కన్న (సునీల్) బ్యాగు భుజానికి తగిలించుకుని వైజాగ్ వచ్చేస్తాడు. కాగితం మీద ఒకడి బొమ్మ పట్టుకుని వాడి కోసం వెతుకుతూ, మరోవైపు సహస్ర (మన్నారా చోప్రా) అనే అమ్మాయి వెంట ప్రేమకోసం  పడుతూ వుంటాడు.జక్కన్న వెతుకుతున్న బైరాగి (కబీర్ సింగ్) అనే వాడు వైజాగ్ ని గడగడ లాడిస్తూన్న గూండా. అయితే అతనెలా ఉంటాడో ఎవరికీ తెలీదు. ఇది హీరో తెలుసుకుని అతడికి  సాయం చేసేందుకు వెంటపడతాడు. ఎందుకంటే ఈ బైరాగి జక్కన్న చిన్నప్పుడు ప్రాణాలు కాపాడి గొప్ప సాయం చేశాడు. కనుక  ఇప్పుడు తిరిగి వాడికి సాయం చేసేందుకు జక్కన్న వచ్చేశాడన్న మాట!

        ఏం సాయం చేశాడు, ఎలా చేశాడు, దాన్ని సాయం అంటారా వెటకారం అంటారా, సాయం చేయించుకున్న గూండా బకరాలా మారిపోయి ఎలా చేయించుకున్నాడూ, చేయించుకున్నప్పుడు ఏమయ్యాడూ మొదలైనవి వెండి తెరమీద చూసి తరించాల్సిందే!

ఎలా వుంది కథ

       
పైన చెప్పుకున్నట్టు సింగిల్ విండో స్కీము కథ. ఈ స్కీము సృష్టి కర్తలైన కోన వెంకట్ ట్- గోపీ మోహన్ ద్వయమే అల్లరై దానికి మూత పెట్టేసుకోగా, ఇంకేం చేద్దామని జక్కన్న వచ్చాడో అర్ధంగాదు. ఇంకా ఎంటర్ టైన్మెంట్ అంటే ఇదే అనుకుంటూ ‘బ్యాక్ టు ఎంటర్ టైన్మెంట్’ అంటూ రావడం చాలా హ్యూమరస్ గా వుంది. సునీల్ పాత్ర పేరుగా పెట్టుకున్న గణేష్ కి నిక్ నేమ్ జక్కన్న ఎలా సూట్ కాదో, అలా సాయం చేసే గుణానికీ సాగదీసిన ఈ అరిగిపోయిన పాత  మూస కథకీ సంబంధమే లేదు! 

ఎవరెలా చేశారు 

       రెండు చోట్ల కమెడియన్ సప్తగిరి రియల్ ఫన్ చేశాడు, ఈ మాత్రం కూడా సునీల్ కామెడీ చేయలేదు. అన్ని పాత్రలకీ కామెడీ పేర దొర్లించిన తెలుగింగ్లీషు ప్రాస డైలాగులతో శబ్దకాలుష్య మే తప్ప నవ్వనే మాటకి చోటే లేదు. సునీల్ పోషించిన పాత్ర నిజానికి మానసిక రోగి పాత్ర. ఏదో కాకతాళీయంగా సాయపడ్డ ప్రతీవాడికీ పనిగట్టుకుని తిరిగి సాయపడాలనుకోవడం, సాయం చేసే పేరుతో వేధించడం కామెడీ అన్పించుకోదు, మానసిక రుగ్మత అన్పించుకుంటుంది. ఇలాటి పాత్రతో ఎంజాయ్ మెంటు తక్కువ ఎలర్జీ ఎక్కువగా తయారయ్యింది. ఇంతగా అర్ధంపర్ధం లేని పాత్ర ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ లేదు. 

        హీరోయిన్ చాలా మైనస్ ఈ సినిమాకి. హీరోయిన్ విషయంలో కూడా సునీల్ టేస్టు కనబర్చుకో లేదు.  ఇంకా చీటికీమాటికీ వచ్చి పడి చిరాకు పుట్టించే  బోలెడు మంది కమెడియన్లు వున్నారు. అలవాటుగా రొటీన్ గా, పృథ్వీ తో అదే బాలకృష్ణ డైలాగుల పేరడీ కూడా వుంది. కామెడీ పేరుతో  ఇంత హంగామాకీ  కింది క్లాసు ప్రేక్షకులు కూడా నవ్వకుండా, సైలెంటుగా ఏదో తప్పని తద్దినం అన్నట్టు చూశారంటే అది దర్శకుడి గొప్పతనమే.  

        పాటలూ రోటీన్ గానే వుంటే, కెమెరా మాన్ గా సీనియర్ రామ్ ప్రసాద్ చాలా నీరసంగా చిత్రీకరణ జరిపారు. ఆయనకీ ఈ సినిమాలో కిక్కు లభించలేదేమో, చుట్టి అవతల పడేశారు. 

చివరికేమిటి?

       
ముంది, సునీల్ కి మరింకో దండయాత్రే.  ఏకైక కామెడీ హీరో అల్లరి నరేష్ పరిస్థితి అలా వుంటే, ఏకైక కండల హీరోగా మారాలనుకున్న కమెడియన్ సునీల్ పరిస్థితి ఇలా వుంది. స్టార్ల జోన్లో సినిమాల పరిస్థితి ఎలా వుంటోందో, ఇందులోకి ఎంటరైన సునీల్ పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ వుండదు. ఎంతకాలమైనా  ఈ త్రిశంకు  స్వర్గం తప్పదు.


-సికిందర్
cinemabazaar.in