రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, మే 2016, గురువారం

షార్ట్ రివ్యూ!

రచన-  దర్శకత్వం : అనిల్‌ రావిపూడి


తారాగణం : సాయి ధరమ్‌ తేజ్‌, రాశీ ఖన్నా, మాస్టర్ మిహైల్‌ గాంధీ, రవికిషన్‌, రాజేంద్రప్రసాద్‌, సాయికుమార్‌, మాస్టర్‌, వెన్నెల కిషోర్‌, రాజేష్‌, పృధ్వీ, ప్రభాస్‌ శ్రీను, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస రెడ్డి,
సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
సమర్పణ: దిల్‌ రాజు, నిర్మాత: శిరీష్‌
విడుదల : మే 5, 2016
***
        నిర్మాత దిల్ రాజు నుంచి కమర్షియల్ సినిమా అంటే అవే రీసైక్లింగ్ కథలు తప్ప కొత్తదనం ఆశించడానికి వీలుండడం లేదు.  ఆయన ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కూడా రీపీటయ్యే సీన్లతో అక్కడక్కడే తిరుగుతూంటాయి. ఇలా ఇంకెంత కాలం జరుగుతుందో తెలీదుగానీ, ప్రస్తుతం మెగా వారసుళ్లో ఒకడైన సాయి ధరమ్ తేజ్ తో తీసిన ‘సుప్రీమ్’  ఇంకో అడుగు ముందుకేసి, వచ్చిన హిందీ సినిమానే తిరగేసి తీసినట్టు భజరంగీ భయ్యాలా తయారయ్యింది. ఎందుకని ఒరిజినాలిటీని తను ప్రోత్సహించడో తనకే తెలియాలి. ఎంత కాలమిలా చూసిందే చూపించుకుంటూ పోగలడు తను? 


       ‘పటాస్’ అనే హిట్ తీసిన దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కొత్తదనం జోలికిపోని రీసైక్లింగ్ మాస్టరే. తన రీసైక్లింగ్స్  కూడా చాలా రఫ్ గా, నాటుగా వుంటాయి. ఈ సారి ఈ రీసైక్లింగ్ కి హిందీ ‘భజరంగీ భాయిజాన్’ దొరికినట్టుంది- ఇంకేముంది  తన రొడ్డ కొట్టుడుకి  అంతే లేకుండా పోయింది.

        సాయి ధరమ్ తేజ్ కూడా రొడ్ద కొట్టుడు సినిమాలే తనకి పనికొచ్చే మాస్ కమర్షియల్స్ అనుకుంటే పొరబడినట్టే. కలర్ఫుల్ కమర్షియల్ ఎంటర్ టెయినర్స్ వేరు, రొడ్ద కొట్టుడు నాటు సినిమాలు వేరు. మాస్ ‘భజరంగీ భాయిజాన్’, క్లాస్  ‘భజరంగీ భాయిజాన్’ అని వేర్వేరుగా  వుండవు. మైండ్ ని అప్లయ్ చేస్తూ కలర్ఫుల్ కమర్షియల్ ఎంటర్ టెయినర్ గా ఒకటే  ‘భాజరంగీ భాయిజాన్’ వుంటుంది.
        ఇప్పుడు రీసైక్లింగ్ చేసిన ‘భజరంగీ భాయిజాన్’ ఇదిగో ఇలా వుంది..

కథ 
     బాలు ( సాయి ధరం తేజ్) క్యాబ్ నడుపుకుంటూ, తాగుబోతు తండ్రి ( రాజేంద్ర ప్రసాద్) ని పోషించుకుంటూ ఉంటాడు. ప్రేక్షకుల ‘ఆనందంకోసం’  హీరో తాగని లోటుని తండ్రిని తాగుబోతుగా చేసి తీర్చాలి అన్నట్టుగా వుంది. బాలుకి క్యాబ్ నడుపుకోవడం, కండబలం ప్రదర్శించడం  తప్ప ఇంకెందులోనూ ప్రవేశం వుండదు. శ్రీదేవి (రాశీ ఖన్నా) అని కొత్తగా ఎస్సై ఉద్యోగంలో జాయినవుతుంది. ఈమెకి ఇంటి నిండా బంధువులుంటారు. ఎస్సై టెస్టులో అన్నిట్లోనూ ఫెయిలైన ఈమెని ఈ బంధువులందరూ డబ్బుపోసి లంచాలిచ్చి ఉద్యోగం వేయించారు. ఇప్పుడీమె లంచాలు పుచ్చుకుని ఆ డబ్బు ఇచ్చెయ్యాలని ఇబ్బంది పెడుతూంటారు. ఈమెతో బాలు  ప్రేమలో పడతాడు. ఇలా వుండగా,  రాజన్ (మాస్టర్ మిహైల్ గాంధీ) అనే ఒక ఎనిమిదేళ్ళ పిల్లాడు పేవ్ మెంట్ మీద బతుకుతూంటే బాలు చేరదీసి ఇంటికి తెస్తాడు. రాజన్ చాలా చలాకీ పిల్లాడు. వయసుకి మించిన మాటలు మాట్లాడతాడు. ఒకరోజు పీకో (రవి కిషన్) అనే వాడు గ్యాంగు తో వచ్చేసి రాజన్ ని కిడ్నాప్ చేసి తీసికెళ్లి పోతాడు. 

        రాజన్ కథేమిటంటే, వీళ్ళకి అనంతపురంలో కొన్ని వేల ఎకరాలతో ఒక ట్రస్టు వుంది. ఈ ట్రస్టు ని నారాయణరావు (సాయి కుమార్ ) నడుపుతూంటాడు. ఒక కార్పొరేట్ బ్రోకర్ విక్రం సర్కార్ (కబీర్ సింగ్) అనే అతను ఈ భూముల మీద కన్నేసి నకిలీ పత్రాలతో కొట్టేయాలని చూస్తాడు. కేసు విచారించిన కోర్టు, నారాయణరావుకి ముప్పై రోజులు గడువు ఇస్తుంది. ఈ లోగా ఈ ట్రస్టు వారసులెవరో ఒరిజినల్ పత్రాలతో వచ్చినట్టయితే, ట్రస్టు భూములు నారాయణరావుకే  వదిలిపెడతామని అంటుంది. దీంతో  వారసుడి వేటలో నారాయణ రావు లండన్ వెళ్తే అక్కడ విక్రం సర్కార్ వాళ్ళని చంపేస్తాడు. ఒరిజినల్ పత్రా లతో వాళ్ళ కొడుకు రాజన్ నారాయణరావుకి దొరుకుతాడు. రాజన్ ని ఇండియా తీ సుకువస్తూంటే ఢిల్లీలో తప్పిపోతాడు. అలా తప్పిపోయిన రాజనే హైదరాబాద్ లో బాలు దగ్గర ఉంటున్నాడు. ఇప్పుడు బాలు దగ్గర్నుంచి సర్కార్ అనుచరుడు పీకో ఎత్తుకుపోయాడు. ఇప్పుడా రాజన్ ని పట్టుకుని, గడువులోగా అనంతపురం  చేర్చే బాధ్యత బాలు మీద పడుతుంది. ఇదీ కథ.

ఎలావుంది కథ 
     ‘భజరంగీ భాయిజాన్’ లో  తప్పిపోయిన బాలిక అయితే, ఇక్కడ బాలుడు. ‘భజరంగీ భాయిజాన్’ లో ఆ బాలికని పాకిస్తాన్ చేర్చే  బాధ్యత  హీరో తీసుకుంటే, ఇక్కడ బాలుణ్ణి అనంతపురం చేర్చే బాధ్యత హీరో తీసుకుంటాడు. ‘భజరంగీ భాయిజాన్’ లో  బాలికతో సల్మాన్ ఖాన్ కి బలమైన ఎమోషనల్ కనెక్ట్ వుంటే, ఇక్కడ బాలుడితో
సాయి ధరమ్ తేజ్ కి ఎలాటి మానసిక బంధమూ వుండదు. ‘భజరంగీ భాయిజాన్’ లో బాలిక బాధ్యతని ఓ పట్టాన తీసుకోడు సల్మాన్. అతడికి అంత ఎమోషనల్ కనెక్ట్ ఎప్పుడేర్పడుతుందంటే, అప్పగించిన బ్రోకర్ ఆమెని వేశ్యా గృహంలో అమ్మేస్తూంటే! అప్పుడు తిక్కరేగిపోయి ఆ బాలికని భుజానేసుకుని తనే పాకిస్తాన్ బయల్దేరతాడు సల్మాన్!

        సాయి ధరమ్ తేజ్ కి బాలుడితో ఈ గోల్ సాధించడానికి ఇలాటి ఎమోషన్ ఏమీ లేదు. కథకి ఈ కేంద్రీయ శక్తి అయిన ఎమోషన్ రొడ్డ కొట్టుడు కథనంతో లోపించడంతో మొత్తం కథే  అర్ధరహితంగా మారిపోయింది. వెంట పడుతున్న గ్యాంగ్స్ ని హీరో ఎదుర్కొంటూ వెళ్ళడమనే ఉత్త లైఫ్ లెస్ యాక్షన్ గా మారిపోయింది.

ఎవరెలా చేశారు
       డాన్సులూ ఫైట్లూ ఎవరైనా చేస్తారు- ఇదంతా హార్డ్ వేర్. కానీ నటన అనే సాఫ్ట్ వేర్ మాటేమిటి? సాయి ధరమ్  తేజ్ కి ఈ సినిమా కథానాయకుడిగా ప్రేక్షకుల హృదయాలని తడిమే ఒక్క సున్నిత భావప్రకటనైనా  దక్కిందా అంటే లేదనే చెప్పుకోవాలి. కామెడీ చేయడం, హీరోయిజంతో  డైలాగులు విసరడం...ఇదే నటన అనుకుంటే సాయి ధరమ్  తేజ్ పునరాలోచించుకోవాలి. మాస్ జనం కోసమే నటించాలన్నా, వాళ్ళు తమ వాడ నుకోవాలంటే కూడా వాళ్ళ హృదయాల్ని సున్నితంగా తడమగల్గాలిగా? ఏదీ ఆ సాఫ్ట్ వేర్? ఎంతసేపూ హార్డ్ వేరేనా! సాఫ్ట్ వేర్ ఉంటేనే కదా హార్డ్ వేర్ రాణిస్తుంది. 

        హీరోయిన్ రాశీఖన్నాది జాలిపడాల్సిన పాత్ర పాపం. చేతకాని ఎస్సైగా కామెడీగా బావుందే అనుకుంటున్నంతలో, సెటప్ చేసిన ఆమె సమస్య (ఇంట్లో డబ్బు వొత్తిడి) పే ఆఫ్ కాక, రాజన్ రాకతో మొత్తానికే అడ్రసులేని కరివేపాకు పాత్ర అయిపోయింది. రాజన్ అన్వేషణలో హీరో ఒరిస్సా పోతూ ఈమెని కూడా తీసుకుపోతాడు ఎస్సైగా సాయపడుతుందని. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక మాట సాయం  తప్ప ఈమె  ఇక సెకండాఫ్ లో  చేసేదేమీ ఉండదు. హీరోకి విలన్ కారు నంబర్ తెలిసినప్పుడు  ఒరిస్సా ఆర్టీఏ శాఖ వెబ్సైట్లో ఆ నంబర్ కొడితే అడ్రసు దొరికిపోతుంది. క్యాబ్ డ్రైవర్ గా ఇది తనకి తెలిసే వుండాలి. అలాంటప్పుడు హీరోయిన్ ని ఇందుకోసం కారు డిక్కీలో వేసుకుని (!) ఒరిస్సా దాకా వెళ్ళాల్సిన పనేలేదు.

        చైల్డ్ ఆర్టిస్టు మిహైల్ గాంధీ టాలెంట్ ని కూడా దర్శకుడు సరీగ్గా విని యోగించుకోలేదు. పాత్ర తీరు తెన్నుల్ని మార్చేస్తే తప్ప టాలెంట్ ని సరీగ్గా వినియోగించుకునే అవకాశమే లేదు. మెయిన్ విలన్ కబీర్ సింగ్ అయితే చివరి సీను వరకూ హీరోకి కన్పించకుండా సోలోగా అరుపులు అరుస్తూంటాడు ఎక్కడో వుండి. రెండో సారికూడా బాలుణ్ణి పట్టుకోవడంలో అనుచరులు విఫలమైనప్పుడు, తను దిగాల్సింది యా క్షన్లోకి! ఇలా దర్శకుడు ఈ పాత్రని కూడా కుదేలు చేయడంతో ఛోటా  విలన్ తో అవే యాక్షన్ సీన్లు పదేపదే రిపీట్ అవుతూ సెకండాఫ్ ని తినేశాయి. 

        ప్రధానపాత్ర ధారుల  సంగతే ఇలా వుంటే,  ఇక మిగత పాత్రధారులు ఎవరెలా నటించారో చెప్పుకోవాల్సిన విషయమే కాదు. 

        ప్రొడక్షన్ విలువలు ఏమంత రిచ్ గా లేవు. ఛాయాగ్రహణానికైతే లైటింగే  కొరవడింది. డీటీఎస్ ని ఎఫెక్టివ్ గా చేద్దామంటే ఎఫెక్ట్స్, బిజిఎం కూడా తోడ్పడాలని ఆలోచించలేదు. మొదటి పాట నుంచి మొదలెడితే అన్నిపాటలూ సన్నివేశ బలం లేకుండానే వచ్చిపోతూంటాయి. 

        రచన, దర్శకత్వం, మేకింగ్ ..ఇలా అన్ని విభాగాల్లో రొడ్డ కొట్టుడు మాత్రమే ఎజెండాగా పెట్టుకుని, సినిమా పేరుతో  వీర వాయింపుడు వాయించే ఇలాటి నమూనా ఈ మధ్యకాలంలో రాలేదు
చివరి కేమిటి?
      అర్ధంపర్ధం లేని కామెడీ, అర్ధం పర్ధం లేని సెంటి మెంట్లు, అర్ధం పర్ధం లేని ప్రేమలూ, ఎక్కడా కనెక్ట్ కాని కథా కథనాలూ,  ఇవే సినిమా అని దబాయిస్తే చెప్పడానికేమీ వుండదు. కనీసం ఆ పిల్లవాడి కథకైనా ఏం చేస్తే హత్తుకుంటుందో ఆలోచించలేదు.  ఎక్కడో  సెకండాఫ్ లో పిల్లవాడి కథ విప్పేటప్పటికి వాడిమీద ఇంటరెస్ట్ అప్పటికే చల్లారిపోయి వుంటుంది ప్రేక్షకులకి. సినిమా ఓపెనింగ్ ట్రస్టు భూముల గొడవతో ఒక అర్ధంలేని ఉపోద్ఘాతంగా చేసేకన్నా. అక్కడే ఆ పిల్లవాడి దురదృష్టాన్ని యాక్షన్ సీన్ తో ఎష్టాబ్లిష్ చేసి వుంటే అది ఆద్యంతమూ మంచి హోల్డ్ గా వుండేది. కానీ రొడ్డ కొట్టుడు ముందు ఆలోచన, సునిశితత్వం, వివేకం ఇవేవీ పనిచెయ్యవు. మొన్నే దిల్ రాజు విడుదల చేసిన ‘పోలీస్’ లో  ఆరేళ్ళ కూతురి పాత్రని  ఎంత దివ్యంగా చూపెట్టారో, దానికి రెండు రెట్లు ఎక్కువ దివ్యంగా ‘సుప్రీమ్’  లో  అల్టిమేట్ గా పిల్లవాడిని చూపించారు!

-సికిందర్
http://www.cinemabazaar.in         


రివ్యూ!
రచన, దర్శకత్వం : బాలాజీ మోహన్

తారాగణం : ధనుష్, కాజల్ అగర్వాల్, విజయ్ ఏసుదాస్, రోబో శంకర్ తదితరులు
సంగీతం : అనిరుధ్  రవిచందర్ , ఛాయాగ్రహణం : ఓం ప్రకాష్
నిర్మాత : వాసిరెడ్డి పద్మాకర రావు

విడుదల : 29 ఏప్రెల్ 2016
***
      తమిళ హీరో ధనుష్ గతంలో ‘పుదుపెట్టై’ (తెలుగు డబ్బింగ్ ‘ధూల్ పేట’) అనే మురికివాడల మాఫియా సినిమాలో వయొలెంట్ యాక్షన్ హీరోగా కన్పించాడు. శరీరం అంతగా లేకపోయినా మనసులో కసితో హీరో అయ్యాడతను. నటనలో ప్రావీణ్య మొక్కటే తనకి పెట్టుబడిగా భావించుకుని తమిళ, తెలుగు, హిందీల్లో పాపులర్ అయ్యాడు. అయితే తనకి సూటయ్యే ప్రయోగాత్మక  సినిమాల్లో నటిస్తూ వస్తున్న తను, ఓసారి మాస్ హీరోగానూ నటించేస్తే పనై పోతుందన్నట్టు  ‘మారి’  అనే తమిళంతో  గత సంవత్సరం నటించాడు. ఇదిప్పుడు తెలుగులో ‘మాస్’ గా విడుదలయ్యింది. అయితే ధనుష్ నటిస్తే మాస్ సినిమా కూడా ప్రయోగాత్మక సినిమాగా మారి పోతుందా అన్నట్టు తయారయ్యిందీ ప్రయత్నం.  

         అలాగే ప్రేమ సినిమాల దర్శకుడు బాలాజీ మోహన్ మాస్ సినిమా తీయాలనుకుని చాలా తపన పడ్డాడు. కానీ మూలంలో ప్రేమ సినిమాల సెన్సిటివిటీ అడ్డుపడుతోంటే ఏం చేయగలడు. మాస్ సినిమాని చాలా విశృంఖలంగా తీయ్యొచ్చు. దీనికి వ్యతిరేకంగా ఆర్ట్ సినిమా నడకలా వుంటేనే వస్తుంది చిక్కు!

        ‘మాస్’ లో  గ్లామరస్ గా కాజల్ అగర్వాల్ కూడా వుంది.  ఏప్రెల్ 29 న ‘మాస్’ తో బాటే నారారోహిత్ నటించిన ‘రాజా చెయ్యివేస్తే’ కూడా విడుదలయ్యింది. ఐతే ‘రాజా చెయ్యి వేస్తే’ హీరోయిన్ హీరోతో పాల్పడే చర్య తప్పు కదా అన్న సందేహం మనకి పీడిస్తూండగా, అదెలా వుంటే ఒప్పవుతుందో ‘మాస్’ హీరోయిన్ పాత్ర సందేహం తీరుస్తుంది.
        ఇంతకీ ‘మాస్’ లో ఏముంది?
పోలీసు –దాదా సిగపట్లు?
     నగరంలో ఓ ఏరియాకి దాదాలా వుంటాడు మారి (ధనుష్). ఒక సంఘటన వల్ల ఇతను దాదాగా మారాడు. ఒకప్పుడు తను మంచి వాడుగా పావురాలు పెంచుకుంటూ, కోడిపందాల్లాగా పావురాల పందాలు నిర్వహించుకుంటూ వుంటే, ఓ రౌడీ ఓ పావురాన్ని చంపాడు. కోపం పట్టలేక మారి వాణ్ణి పొడిస్తే వాడు చచ్చాడు. దీనికి సాక్షులెవరూ లేకపోవడంవల్ల మారి మీద కేసు పెట్టలేక పోయారు పోలీసులు. కానీ మారీయే ఈ హత్య చేశాడని లోకంతో బాటు పోలీసులూ నమ్ముతున్నారు. దీంతో ఆ చచ్చిన రౌడీ ఏరియాలోనే దాదాగా మకాం పెట్టి, ప్రజల్నీ పోలీసుల్నీ దడదడ లాడించడం మొదలెట్టాడు మారి. ఇద్దరు అనుచరుల (రోబో శంకర్, కల్లూరి వినోద్) తో కలిసి దౌర్జన్యంగా మామూళ్ళు వసూలు చే సుకుని బతకడం నేర్చాడు. ఇతడికి ఓ పెద్ద ఎర్రచందనం స్మగ్లర్ -కం - డాన్ సపోర్టు కూడా వుంటుంది. అయితే ఈ డాన్ శిష్యుడే అయిన మరొక గల్లీ రౌడీ బర్డ్ రవి (మైమ్ గోపీ) అనే వాడితో మారికి సమస్యలుంటాయి.

        ఈ నేపధ్యంలో కొత్త పోలీస్ ఇన్స్పెక్టర్ గా అర్జున్ కుమార్ (విజయ్ ఏసుదాస్) వస్తాడు. ఇతడికి కానిస్టేబుల్ మారి చరిత్రంతా నూరిపోసి  వాడి  జోలికి పోవద్దని హెచ్చరిస్తాడు. ఇదేం పట్టించుకోకుండా మారి మీదికెళ్లి అవమానపడతాడు అర్జున్. దీంతో క్షక పెంచుకుంటాడు. ఇలా వుంటే శ్రీదేవి (కాజల్ అగర్వాల్) అనే మధ్యతరగతి అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి ఆ ఏరియాలో  డిజైనర్ దుస్తుల షాపుపెడుతుంది. ఈమె కూడా  మామూళ్ళు  ఇచ్చేట్టు కాదు, ఏకంగా తన బిజినెస్ లో వాటా ఇచ్చేట్టు బెదిరించి లొంగ దీసుకుంటాడు మారి. పైగా చీటికీ మాటికీ అనుచరులతో వచ్చి  కస్టమర్లని వేధి స్తూంటాడు. అతడంటే భయం కొద్దీ ఆమె ఏమీ అనలేక పోతుంది. మరోవైపు అనుచరులు రెచ్చగొట్టడంతో  ఆమెని ప్రేమించడం కూడా మొదలెడతాడు మారి.

        అవతల మారి మీద పాత హత్య కేసు తిరగదోడిన ఇన్స్ పెక్టర్ అర్జున్, మారిని అరెస్ట్ చేసేందుకు వచ్చేస్తాడు. అప్పుడు మారికి తెలుస్తుంది, తన ప్రేమని అంగీకరించినట్టు నటిస్తూ హత్య కేసు వివరాలు లాగి శ్రీదేవియే  అర్జున్ కి ఇచ్చేసిందని. మారి అరెస్టయి జైలు కెళ్లి పోతాడు. ఇతడి బాస్ స్మగ్లర్- కం – డాన్ ని కూడా అరెస్టు చేసి జైలుకి పంపేస్తాడు అర్జున్. కొన్నాళ్ళకి మారి బెయిలు మీద విడుదలై వచ్చి చూస్తే-  గల్లీ రౌడీ బర్డ్ రవి, ఇన్స్ పెక్టర్ అర్జున్ ఇద్దరూ కుమ్మక్కై, ఆ ఏరియాని కబ్జా చేసి మామూళ్ళు దండుకుంటూ తామే దాదాలై పోయివుంటారు. మరో వైపు ఎర్రచందనం స్మగ్లింగ్ ని కూడా అర్జున్ కబ్జా చేస్తాడు.
        ఇప్పుడేం చేశాడు మారి అన్నది మిగతా కథ.   

ఎలా వుంది కథ 
       ఓ ఏరియా మీద ఆధిపత్యపోరు పాత కథే. అయితే పోలీసే  ఏరియాని కబ్జా చేయాలనుకోవడం కొత్త రూపం. ఈ కొత్త రూపంతో కథ కొత్త పుంతలు తొక్కాల్సింది. ఈ కొత్త రూపాన్నే కాదు, అసలు ఏరియా మీద అధిపత్య పోరాటమనే పాయింటు కూడా హైలైట్ కాకుండా నిమ్మకునీరెత్తినట్టు వుండిపోయే కథ ఇది. ఏరియా మీద ఆధిపత్య పోరు అంటేనే అందులో యాదృచ్చికంగా యాక్షన్ చేరిపోతుంది. అలాటిది ప్రత్యర్ధిగా  పోలీసు వుంటే ఇంకెంత యాక్షన్ వుండాలి. యాక్షన్ లేకుండా మాస్ కథ ఆర్టు సినిమా కథవుతుంది. ఆర్ట్ సినిమాల్లో యాక్షన్ లేకపోయినా అవి ఆలోచనాత్మకంగా వుంటాయి. అదీ ఇదీ ఏదీ లేకుండా ఓ కథ అనుకున్నారు, అది తీశారంతే.

ఎవరెలా చేశారు 
     నుష్ ఓ ప్రత్యేకమైన గెటప్ తో కన్పిస్తాడు. గడ్డం మీసాలు  సైడ్ లాక్స్, స్పెక్ట్స్ వగైరాలు  పాత్రకి తగ్గట్టు అతడికో కొత్త రూపాన్ని
చ్చాయి.  లావెక్కిన నారా రోహిత్ గోల్కొండ దాదాగా  కన్పిస్తే కామెడీగా వుంటుందేమో గానీ, బక్కపలచన ధనుష్ పెద్ద మాఫియా అన్నా  యమ సీరియస్ వ్యవహారమే. ఈ సీరియస్ వ్యవహారానికి ఈ పాత్ర తాలూకు గతజీవితం  దన్నుగా నిల్చింది. కానీ వర్తమానం చూస్తే అంత దమ్మున్న విషయంలేక వెలవెల బోయింది. గతమెంత ఘనకీర్తో వర్తమానమంత గణగణ మోగక, మూగ బోవాల్సి వచ్చింది తను. పాత్రకి తగ్గ విషయం, టైటిల్ కి తగ్గ మాస్ కథా వుంటే బాగా విజృంభించడానికి వీలుండేది. ఫస్టాఫ్ లో గోల్ లేదు, సెకండాఫ్ లోనూ సరైన గోల్ లేకా తన వంతు యాక్షన్ చేసుకోవడానికి వీల్లేక పోయింది.      

         హీరోయిన్ గా కాజల్ అగర్వాల్  బస్తీ మాస్ వాతావరణంలో గుబురు గడ్డాల రోత మొహాల మధ్య కాస్త చూడ ముచ్చటైన ఫేస్ గా ఆహ్లాదపరుస్తుంది. షేడ్  వున్న పాత్ర. ఇంటర్వెల్లో ఆ షేడ్ చూపించి ఇచ్చే  ట్విస్టుతో బాగా ఎలివేట్ అయింది పాత్ర, నటనా. సెకండాఫ్ మళ్ళీ షరామామూలే. హీరో మంచి తనం చూసి పశ్చాత్తాప పడే పాత్ర.

        ఈ కథకి ఇన్స్ పెక్టర్ పాత్రలో సాఫ్ట్ గా కన్పించే విజయ్ ఏసుదాస్ అస్సలు సూట్ కాడు. ఈ కబ్జా కోరు దగుల్బాజీ ఇన్స్ పెక్టర్ - కం - విలన్ పాత్రలో ఏ ఆశీష్ విద్యార్థి  లాంటి ఆర్టిస్టో వుండాలి. 

        విజువల్ గా సినిమా బావుంది గానీ మ్యూజికల్ గా బ్యాడ్ గా వుంది. దర్శకుడు బాలాజీ మోహన్ యాక్షన్ సినిమా డైనమిక్స్ ని  తెలుసుకోవాలి. ఎలాటి కథకి అలాటి డైనమిక్స్  వుంటాయి. డైనమిక్స్ లేకుండా సినిమా తీయడమంటే ఎకనమిక్స్ ని చంపుకోవడమే. కమర్షియల్ సినిమా అంటే సంభాషణలు కాదు, సంఘటనలు.

స్క్రీన్ ప్లే సంగతులు 
      ఈ కథని ఇలా సెట్ చేశారు : (బిగినింగ్) :  హీరో ఏరియా దాదాగా ఉంటాడు, ఇన్స్ పెక్టర్ వచ్చి వార్నింగ్ ఇస్తాడు, హీరోయిన్ వచ్చి హీరో చేత బాధలు పడుతుంది, హీరో నుంచి సమాచారం లాగి ఇన్స్ పెక్టర్ కిస్తుంది, ఆ సమాచారంతో పాత హత్యకేసులో హీరోని అరెస్ట్ చేస్తాడు ఇన్స్ పెక్టర్ (ప్లాట్ పాయింట్ -1, ఇంటర్వెల్).

        సెకండాఫ్ (మిడిల్) :  గల్లీ రౌడీతో కలిసి ఏరియాని కబ్జా చేసి మామూళ్ళు వసూలు చేయిస్తూ, మరో పక్క ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూంటాడు ఇన్స్ పెక్టర్, జైలు నుంచి హీరో వచ్చి పరిస్థితి చూస్తాడు, ప్రశాంతంగా జీవిస్తూంటాడు, మామూళ్ళ కోసం వచ్చిన వాళ్ళని ఎదుర్కొంటాడు, ఇన్స్ పెక్టర్ కొడతాడు (ప్లాట్ పాయింట్ - 2)  

        (ఎండ్) : ఇన్స్ పెక్టర్ ని స్మగ్లింగ్ బిజినెస్ లో పట్టిస్తాడు హీరో, ఇన్స్ పెక్టర్ హీరో పావురాల్ని చంపించేస్తాడు, ఇన్స్ పెక్టర్ అంతు చూడ్డానికి హీరో బయల్దేరతాడు.

        ప్లాట్ పాయింట్ వన్ వరకూ హీరో పాసివ్ గా ఉండొచ్చు. కానీ ప్లాట్ పాయింట్ వన్ ని  టచ్ చేశాక, గోల్ ఏర్పడ్డాక,  ఏం చేసీ పాసివ్ గా వుండలేడు, వుండకూడదు. ఇక్కడ ఇంటర్వెల్ వరకూ హీరో పాసివ్ గా వున్నాడు. ఇంటర్వెల్లో హీరోయిన్ ఇన్స్ పెక్టర్ తో కలిసి ట్విస్ట్ ఇవ్వడంతో సమస్యలో పడ్డాడు హీరో. ఇది ప్లాట్ పాయింట్ వన్. 

        ఇక్కడి వరకూ ఫస్టాఫ్ లో గోల్ ఇన్స్ పెక్టర్ కి, అంటే విలన్ కే వుంది. పాత  హత్య కేసులో హీరోని మూయించేసి ఏరియాని కబ్జా చేయాలన్న గోల్ అది. దీనికి  దాదాగా హీరో తనని వేధిస్తున్నాడన్న కక్షతో, ఇన్స్ పెక్టర్ తో సహకరించింది హీరోయిన్. అప్పటి కింకా ఈమె హీరోని ప్రేమించలేదు. కాబట్టి హీరోకి (ప్రేక్షకులకి కూడా) తెలీకుండా కథ నడిపి హీరో పీడా వదిలించాలనుకుంది, ఇది నైతికమే. 

        ‘రాజా చెయ్యి వేస్తే’ లో  తనని ప్రేమిస్తున్న హీరోయిన్ కి తను రాస్తున్న ప్రేమకథ చెప్తాడు హీరో. ఆ కథ నచ్చిందని, అయితే ఆ  కథలో విలన్ ని చంపినట్టుగా ఒకడ్ని చంపాలని హీరోకి కొరియర్ లో లెటర్, ఫోటో అందుతాయి. బ్లాక్ మెయిల్ కి లోనవుతాడు. ఎటాక్స్ జరుగుతాయి. హీరోయిన్ మీద కూడా ఎటాక్ జరిగేసరికి అప్పుడు చెప్తుంది- ఆ లెటర్, ఫోటో తనే పంపాననీ, విలన్ ని చంపేందుకనీ. తను ప్రేమిస్తున్న హీరోకి  (ప్రేక్షకులకి కూడా) తెలియకుండా బ్లాక్ మెయిల్, ఎటాక్స్ సహా ఇంత కథ నడిపిన తను, ఇది బయటపడి వుండకపోతే,  హీరో హత్యచేసేసి, తను సైలెంట్ గా వుండిపోయే వ్యవహారమే కదా? 

        ‘మాస్’ లో  హీరోయిన్ ఇంటర్వెల్లోనే బయటపడి  నైతిక బలంతో వుంటే,  ‘రాజా చెయ్యి వేస్తే’ లో సెకండాఫ్ లో ఎప్పుడో బయటపడే హీరోయిన్ దొంగలా వుంటుంది. హీరోని ప్రేమించకపోతే ఏమైనా చేసుకోవచ్చు. హీరోతో బాటు సస్పెన్స్ కోసం ప్రేక్షకుల్నీ చీట్ చెయ్యొచ్చు. కానీ హీరోని ప్రేమిస్తున్నాక,  హీరోనీ ప్రేక్షకుల్నీ చీట్ చేస్తే అదెలాటి పాత్ర?

        సరే, ‘మాస్’ లో ఇంటర్వెల్ దగ్గర ప్లాట్ పాయింట్ వన్ లో హీరో సమస్యలో పడ్డాడు. అంటే ఒక గోల్ ఏర్పడినట్టు. హత్య కేసులో ఇన్స్ పెకర్ అరెస్ట్ చేసిన ఫలితంగా ఏర్పడాల్సిన ఆ గోల్ ఏమిటి? హత్య కేసులోంచి బయట పడడమా? బయటపడి ఇన్స్ పెక్టర్ మీద కక్ష  తీర్చుకోవడమా? లేక తిరిగి ఆ ఏరియాని హస్తగతం చేసుకోవడమా? ఏది? 

        ఈ కథ మొదలయ్యిందీ, ఇన్స్ పెక్టర్ సీక్రెట్ గా పెట్టుకున్న గోల్ తో ఇంటర్వెల్లో కథ ప్లాట్ పాయింట్ వన్ కి చేరిందీ  ఆ ఏరియా మీద ఆధిపత్యం కోసమే. ఆ ఏరియాకి దాదాగా అన్నిటినీ ఎదుర్కొని ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నాడు హీరో. అలాటి ఏరియా చేజారిపోతే ఎలావుంటుంది అతడి పరిస్థితి? ఒక షాపు ఓనర్ని షాపు లోంచి గుంజి పారేసి మరొకరు స్వాధీనం చేసుకుంటేనే ఆ షాపు యజమాని తట్టుకోలేడు. దాని తాలూకు ఎమోషన్ తో రగిలిపోతాడు. ఇక తన షాపుని తను దక్కించుకోవడమే ధ్యేయంగా ఉద్యుక్తుడవుతాడు. మరి మారి అనే కొమ్ములు తిరిగిన దాదాని ఇన్స్ పెక్టర్ వచ్చేసి, ప్లాన్డ్ గా ఏరియా లోంచి గుంజి పారేస్తే మారి కేమీ అన్పించదా? ఎమోషన్ తో రగిలిపోడా? 

        కానీ ఇన్స్పెక్టర్ నేమీ అనలేక, తనని పట్టించిన హీరోయిన్ ని ఏదో అనేసి జీపెక్కేస్తాడు. ఇంతే. ఇలాటి ఇంటర్వెల్ తో పాత్ర, కథ ఏదీ ఎస్టాబ్లిష్ కాకుండా పోయాయి. అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కూడా హీరో చేతికి ఏ గోల్ కూడా ఇవ్వలేదు. యాక్చువల్ గా ఇక్కడే కథ ముగిసిపోయింది. కొత్త ఇన్స్ పెక్టర్ వచ్చినప్పుడు,  మారి గురించి తెలుసుకున్నప్పుడు, పాత హత్య కేసు తిరగదోడుతున్నప్పుడు, హీరోయిన్ తోడ్పడితే హీరోని అరెస్ట్ చేసినప్పుడే కేసు క్లియర్ అయిపోయింది.  కథ ముగిసింది. హీరో గత జీవితంలో చేశాడని అభియోగమున్న  ఈ  నేరం తప్ప, ప్రస్తుత జీవితంలో ఏ  నేరమూ చేసినట్టు చూపించలేదు కాబట్టి-  కథేమీ బ్యాలెన్సు లేదు. ఇంటర్వెల్ కే అయిపోయింది.

        స్క్రీన్ ప్లే ప్రాణమంతా మొదటి మూలస్థంభం   పాయింట్ వన్ లోనే వుంటుంది. దీన్ని పోస్ట్ మార్టం చేస్తే కథ బాగోగులు తెలిసిపోతాయి. ప్లాట్ పాయింట్ వన్ హీరోకి గోల్ ఏర్పడి, ఆ గోల్ కోసం పోరాడే ఏకైక ఎజెండాని సృష్టించేది అయినప్పుడు ఆ గోల్ లో ఏమేం ఎలిమెంట్స్ వుంటే హీరో యాక్టివేట్ అవగలడు? కథ ముందు కెళ్ళగలదు? 1) కోరిక, 2) పణం, 3) పరిణామాల హెచ్చరిక, 4) ఎమోషన్.

        మారికి ఏ కోరికా కలగలేదు. ఓటమిని అంగీకరించినట్టే అరెస్టయి వెళ్ళిపోయాడు. ఇక పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్ ఎలా ఏర్పడతాయి? ఈ ఘట్టంలో తను తన ఏరియాని కోల్పోతున్న స్పృహ  కూడా లేకపోయాక గోల్ ఎలా ఏర్పడుతుంది?

        తన ఏరియాకే ఎసరు పెట్టారన్న రోషంతో, ఇన్స్ పెక్టర్ తో సహా హీరోయిన్ నీ టార్గెట్ చేసి- ‘టెర్మినేటర్’ లో ఆర్నాల్డ్  ష్వార్జ్ నెగ్గర్  పలికే  ఫేమస్ డైలాగులా  -
“I will be back” అనేసి వెళ్ళిపోయినా చాలా అర్ధాలు దాంతో ఎస్టాబ్లిష్ అయిపోయేవి!
                                                ***

        ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటులో ఒక లొసుగు కూడా వుంది. ముందేం జరిగిందంటే, బాగా తాగివున్న హీరో నుంచి అతడి గతాన్ని రాబట్టింది హీరోయిన్. ఆ రికార్డింగే  ఇన్స్ పెక్టర్  హీరోకి  విన్పించి అరెస్ట్ చేస్తాడు. ఆ రికార్డింగ్ లో  హీరో వెల్లడించే  విషయం నిజానికి కేసుకి పనికిరాదు. ఎనిమిదేళ్ళ క్రితం తన పావురాన్ని చంపాడని ఏరియా రౌడీని పొడిచిన మాట నిజమే కానీ, వాడు చావలేదనీ, తర్వాత మరెవడో  పొడిఛి చంపేశాడనీ వెల్లడిస్తాడు హీరో. ఇది తను ప్రేమించిన అమ్మాయికే చెప్పాడు కాబట్టి నిజమే కావచ్చు. ఈ రికార్డింగే సాక్ష్యమనుకుంటే దీంతో హీరో నిర్దోషియే అవుతాడు.
                                                ***
       సెకండాఫ్ ఓపెనింగ్ లో ఇన్స్ పెక్టర్ ఏరియాని కబ్జా చేసుకుని దండుకుంటూంటే విడుదలై వచ్చిన హీరో,  ఏం పట్టకుండా ప్రశాంతంగా జీవించాలనుకుంటాడు. నువ్వున్నప్పుడు ఇంత పీడించలేదని జనం అంటున్నా ఇన్స్ పెక్టర్ సంగతి తేల్చుకోడు. పైపెచ్చు వేరే ఆటో సంపాదించుకుని నడుపుతూంటాడు. కథలో వుండాలని ఇప్పటికీ అనుకోడు, కథలోంచి తప్పుకోవాలనే ఎంతసేపూ చూస్తూంటాడు. మామూళ్ళని అడ్డుకున్నాడని ఇన్స్ పెక్టర్ వచ్చి ఇష్టమొచ్చినట్టు కొట్టినా కిక్కురుమనడు. యూనిఫాం లో వున్నాడు కాబట్టి వూరుకున్నానని, ఏం చెయ్యాలో నిదానంగా ఆలోచిస్తాననీ అంటాడు. ఇది తప్పుడు మాట. యూనిఫాం అంటే అంత గౌరవముంటే, ఎప్పుడో ఏ అధికారో తన్ని లోపలేసేవాడే. ఇంకా ఎదురేముంది? ఇంతకాలం దేనికి భయపడుతున్నట్టు అధికారులు?

        అసలు తను ఏలుకుంటున్న ఏరియాకే ఎసరొచ్చిందని ఏ కాస్త పౌరుషమున్నా జైలునుంచి రావడం రావడం మామూళ్ళ కోసం జనం మీద పడి అలజడి సృష్టించేవాడు. ఇన్స్ పెక్టర్ కి సవాలు విసిరేవాడు. ఏరియా మీద ప్రారంభం నుంచీ కథ చివరి వరకూ ఇన్స్ పెక్టర్ కి వున్న కమిట్ మెంట్,  హీరోకి లేదు. అదృశ్యంగా ఇన్స్ పెక్టర్ కీ, హీరోయిన్ కీ వుండిన గోల్స్ ని చూసినా వాళ్ళ ముందు హీరో జీరోయే. ఇలాటి పాసివ్ పాత్రతో మాస్ యాక్షన్ ఎలా కుదుర్తుంది? అందుకే చప్పగా తేలింది. మాస్ అంటే యాక్షన్ తో బాటు ఎంటర్ టెయిన్ మెంట్ తో మస్తీ కూడా. మస్తీకి కూడా సుస్తీ చేస్తే ఇంకేం మాస్ అన్నట్టు?

        నషీరుద్దీన్ షా నటించిన ‘జల్వా’ గురించి రెండు మాటలు చెప్పుకోవాలిక్కడ. ఆర్ట్ సినిమాల్లో నటిస్తూ గొప్ప పేరు సంపాదించుకున్న షా ఉన్నట్టుండి ‘జల్వా’ అనే బాలీవుడ్ కమర్షియల్ లో మాస్ హీరోగా నటించాడు. గోవాలో డ్రగ్ స్మగ్లర్లతో జరిగే చాలా ఫన్నీకథ ఇది. టైటిల్ కి తగ్గట్టు చాలా మస్తీ. దీన్ని రెగ్యులర్ బాలీవుడ్ మసాలాలాగా తీయలేదు దర్శకుడు పంకజ్ పరాశర్. ఇది అలసిపోయిన కమర్షియల్ కాడెద్దు కాదు, ఫ్రెష్ లుక్ తో కోడెగిత్త. చాలా  ఫ్రెష్ నెస్ తో ఆఫ్ బీట్ యాక్షన్ థ్రిల్లర్ గా తీశాడు. ‘మాస్’ లో  ధనుష్ మామూళ్ళు  వసూలు చేసుకోవచ్చుగాక, ‘జల్వా’  లో నసీర్ బిచ్చమెత్తుకుంటాడు. బిచ్చగాడిలా గోవాలో ఎంటరై అల్లకల్లోలం సృష్టిస్తాడు, చాలా కలర్ఫుల్ మాస్ పాత్ర. అడుగడునా హుషారెక్కిస్తూ, తనదైన డైలాగ్ డెలివరీతో, గమ్మత్తయిన యాక్షన్ విన్యాసాలతో స్మగ్లర్లతో తలపడే పాత్రతో  బాలీవుడ్  చరిత్రలో ఇదొక భిన్న ప్రయోగంగా నిలిచిపోయింది. తెలుగులో దీన్ని  చిరంజీవితో ‘త్రినేత్రుడు’ గా తీశారు.
        ధనుష్ నుంచి ఒక ‘జల్వా’ లాగా రావాల్సిన ‘మాస్’ ఓ  వృధా ప్రయాసగా మిగిలిపోయింది.


-సికిందర్ 
http://www.cinemabazaar.in