రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, May 5, 2016

షార్ట్ రివ్యూ!

రచన-  దర్శకత్వం : అనిల్‌ రావిపూడి


తారాగణం : సాయి ధరమ్‌ తేజ్‌, రాశీ ఖన్నా, మాస్టర్ మిహైల్‌ గాంధీ, రవికిషన్‌, రాజేంద్రప్రసాద్‌, సాయికుమార్‌, మాస్టర్‌, వెన్నెల కిషోర్‌, రాజేష్‌, పృధ్వీ, ప్రభాస్‌ శ్రీను, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస రెడ్డి,
సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
సమర్పణ: దిల్‌ రాజు, నిర్మాత: శిరీష్‌
విడుదల : మే 5, 2016
***
        నిర్మాత దిల్ రాజు నుంచి కమర్షియల్ సినిమా అంటే అవే రీసైక్లింగ్ కథలు తప్ప కొత్తదనం ఆశించడానికి వీలుండడం లేదు.  ఆయన ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కూడా రీపీటయ్యే సీన్లతో అక్కడక్కడే తిరుగుతూంటాయి. ఇలా ఇంకెంత కాలం జరుగుతుందో తెలీదుగానీ, ప్రస్తుతం మెగా వారసుళ్లో ఒకడైన సాయి ధరమ్ తేజ్ తో తీసిన ‘సుప్రీమ్’  ఇంకో అడుగు ముందుకేసి, వచ్చిన హిందీ సినిమానే తిరగేసి తీసినట్టు భజరంగీ భయ్యాలా తయారయ్యింది. ఎందుకని ఒరిజినాలిటీని తను ప్రోత్సహించడో తనకే తెలియాలి. ఎంత కాలమిలా చూసిందే చూపించుకుంటూ పోగలడు తను? 


       ‘పటాస్’ అనే హిట్ తీసిన దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కొత్తదనం జోలికిపోని రీసైక్లింగ్ మాస్టరే. తన రీసైక్లింగ్స్  కూడా చాలా రఫ్ గా, నాటుగా వుంటాయి. ఈ సారి ఈ రీసైక్లింగ్ కి హిందీ ‘భజరంగీ భాయిజాన్’ దొరికినట్టుంది- ఇంకేముంది  తన రొడ్డ కొట్టుడుకి  అంతే లేకుండా పోయింది.

        సాయి ధరమ్ తేజ్ కూడా రొడ్ద కొట్టుడు సినిమాలే తనకి పనికొచ్చే మాస్ కమర్షియల్స్ అనుకుంటే పొరబడినట్టే. కలర్ఫుల్ కమర్షియల్ ఎంటర్ టెయినర్స్ వేరు, రొడ్ద కొట్టుడు నాటు సినిమాలు వేరు. మాస్ ‘భజరంగీ భాయిజాన్’, క్లాస్  ‘భజరంగీ భాయిజాన్’ అని వేర్వేరుగా  వుండవు. మైండ్ ని అప్లయ్ చేస్తూ కలర్ఫుల్ కమర్షియల్ ఎంటర్ టెయినర్ గా ఒకటే  ‘భాజరంగీ భాయిజాన్’ వుంటుంది.
        ఇప్పుడు రీసైక్లింగ్ చేసిన ‘భజరంగీ భాయిజాన్’ ఇదిగో ఇలా వుంది..

కథ 
     బాలు ( సాయి ధరం తేజ్) క్యాబ్ నడుపుకుంటూ, తాగుబోతు తండ్రి ( రాజేంద్ర ప్రసాద్) ని పోషించుకుంటూ ఉంటాడు. ప్రేక్షకుల ‘ఆనందంకోసం’  హీరో తాగని లోటుని తండ్రిని తాగుబోతుగా చేసి తీర్చాలి అన్నట్టుగా వుంది. బాలుకి క్యాబ్ నడుపుకోవడం, కండబలం ప్రదర్శించడం  తప్ప ఇంకెందులోనూ ప్రవేశం వుండదు. శ్రీదేవి (రాశీ ఖన్నా) అని కొత్తగా ఎస్సై ఉద్యోగంలో జాయినవుతుంది. ఈమెకి ఇంటి నిండా బంధువులుంటారు. ఎస్సై టెస్టులో అన్నిట్లోనూ ఫెయిలైన ఈమెని ఈ బంధువులందరూ డబ్బుపోసి లంచాలిచ్చి ఉద్యోగం వేయించారు. ఇప్పుడీమె లంచాలు పుచ్చుకుని ఆ డబ్బు ఇచ్చెయ్యాలని ఇబ్బంది పెడుతూంటారు. ఈమెతో బాలు  ప్రేమలో పడతాడు. ఇలా వుండగా,  రాజన్ (మాస్టర్ మిహైల్ గాంధీ) అనే ఒక ఎనిమిదేళ్ళ పిల్లాడు పేవ్ మెంట్ మీద బతుకుతూంటే బాలు చేరదీసి ఇంటికి తెస్తాడు. రాజన్ చాలా చలాకీ పిల్లాడు. వయసుకి మించిన మాటలు మాట్లాడతాడు. ఒకరోజు పీకో (రవి కిషన్) అనే వాడు గ్యాంగు తో వచ్చేసి రాజన్ ని కిడ్నాప్ చేసి తీసికెళ్లి పోతాడు. 

        రాజన్ కథేమిటంటే, వీళ్ళకి అనంతపురంలో కొన్ని వేల ఎకరాలతో ఒక ట్రస్టు వుంది. ఈ ట్రస్టు ని నారాయణరావు (సాయి కుమార్ ) నడుపుతూంటాడు. ఒక కార్పొరేట్ బ్రోకర్ విక్రం సర్కార్ (కబీర్ సింగ్) అనే అతను ఈ భూముల మీద కన్నేసి నకిలీ పత్రాలతో కొట్టేయాలని చూస్తాడు. కేసు విచారించిన కోర్టు, నారాయణరావుకి ముప్పై రోజులు గడువు ఇస్తుంది. ఈ లోగా ఈ ట్రస్టు వారసులెవరో ఒరిజినల్ పత్రాలతో వచ్చినట్టయితే, ట్రస్టు భూములు నారాయణరావుకే  వదిలిపెడతామని అంటుంది. దీంతో  వారసుడి వేటలో నారాయణ రావు లండన్ వెళ్తే అక్కడ విక్రం సర్కార్ వాళ్ళని చంపేస్తాడు. ఒరిజినల్ పత్రా లతో వాళ్ళ కొడుకు రాజన్ నారాయణరావుకి దొరుకుతాడు. రాజన్ ని ఇండియా తీ సుకువస్తూంటే ఢిల్లీలో తప్పిపోతాడు. అలా తప్పిపోయిన రాజనే హైదరాబాద్ లో బాలు దగ్గర ఉంటున్నాడు. ఇప్పుడు బాలు దగ్గర్నుంచి సర్కార్ అనుచరుడు పీకో ఎత్తుకుపోయాడు. ఇప్పుడా రాజన్ ని పట్టుకుని, గడువులోగా అనంతపురం  చేర్చే బాధ్యత బాలు మీద పడుతుంది. ఇదీ కథ.

ఎలావుంది కథ 
     ‘భజరంగీ భాయిజాన్’ లో  తప్పిపోయిన బాలిక అయితే, ఇక్కడ బాలుడు. ‘భజరంగీ భాయిజాన్’ లో ఆ బాలికని పాకిస్తాన్ చేర్చే  బాధ్యత  హీరో తీసుకుంటే, ఇక్కడ బాలుణ్ణి అనంతపురం చేర్చే బాధ్యత హీరో తీసుకుంటాడు. ‘భజరంగీ భాయిజాన్’ లో  బాలికతో సల్మాన్ ఖాన్ కి బలమైన ఎమోషనల్ కనెక్ట్ వుంటే, ఇక్కడ బాలుడితో
సాయి ధరమ్ తేజ్ కి ఎలాటి మానసిక బంధమూ వుండదు. ‘భజరంగీ భాయిజాన్’ లో బాలిక బాధ్యతని ఓ పట్టాన తీసుకోడు సల్మాన్. అతడికి అంత ఎమోషనల్ కనెక్ట్ ఎప్పుడేర్పడుతుందంటే, అప్పగించిన బ్రోకర్ ఆమెని వేశ్యా గృహంలో అమ్మేస్తూంటే! అప్పుడు తిక్కరేగిపోయి ఆ బాలికని భుజానేసుకుని తనే పాకిస్తాన్ బయల్దేరతాడు సల్మాన్!

        సాయి ధరమ్ తేజ్ కి బాలుడితో ఈ గోల్ సాధించడానికి ఇలాటి ఎమోషన్ ఏమీ లేదు. కథకి ఈ కేంద్రీయ శక్తి అయిన ఎమోషన్ రొడ్డ కొట్టుడు కథనంతో లోపించడంతో మొత్తం కథే  అర్ధరహితంగా మారిపోయింది. వెంట పడుతున్న గ్యాంగ్స్ ని హీరో ఎదుర్కొంటూ వెళ్ళడమనే ఉత్త లైఫ్ లెస్ యాక్షన్ గా మారిపోయింది.

ఎవరెలా చేశారు
       డాన్సులూ ఫైట్లూ ఎవరైనా చేస్తారు- ఇదంతా హార్డ్ వేర్. కానీ నటన అనే సాఫ్ట్ వేర్ మాటేమిటి? సాయి ధరమ్  తేజ్ కి ఈ సినిమా కథానాయకుడిగా ప్రేక్షకుల హృదయాలని తడిమే ఒక్క సున్నిత భావప్రకటనైనా  దక్కిందా అంటే లేదనే చెప్పుకోవాలి. కామెడీ చేయడం, హీరోయిజంతో  డైలాగులు విసరడం...ఇదే నటన అనుకుంటే సాయి ధరమ్  తేజ్ పునరాలోచించుకోవాలి. మాస్ జనం కోసమే నటించాలన్నా, వాళ్ళు తమ వాడ నుకోవాలంటే కూడా వాళ్ళ హృదయాల్ని సున్నితంగా తడమగల్గాలిగా? ఏదీ ఆ సాఫ్ట్ వేర్? ఎంతసేపూ హార్డ్ వేరేనా! సాఫ్ట్ వేర్ ఉంటేనే కదా హార్డ్ వేర్ రాణిస్తుంది. 

        హీరోయిన్ రాశీఖన్నాది జాలిపడాల్సిన పాత్ర పాపం. చేతకాని ఎస్సైగా కామెడీగా బావుందే అనుకుంటున్నంతలో, సెటప్ చేసిన ఆమె సమస్య (ఇంట్లో డబ్బు వొత్తిడి) పే ఆఫ్ కాక, రాజన్ రాకతో మొత్తానికే అడ్రసులేని కరివేపాకు పాత్ర అయిపోయింది. రాజన్ అన్వేషణలో హీరో ఒరిస్సా పోతూ ఈమెని కూడా తీసుకుపోతాడు ఎస్సైగా సాయపడుతుందని. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక మాట సాయం  తప్ప ఈమె  ఇక సెకండాఫ్ లో  చేసేదేమీ ఉండదు. హీరోకి విలన్ కారు నంబర్ తెలిసినప్పుడు  ఒరిస్సా ఆర్టీఏ శాఖ వెబ్సైట్లో ఆ నంబర్ కొడితే అడ్రసు దొరికిపోతుంది. క్యాబ్ డ్రైవర్ గా ఇది తనకి తెలిసే వుండాలి. అలాంటప్పుడు హీరోయిన్ ని ఇందుకోసం కారు డిక్కీలో వేసుకుని (!) ఒరిస్సా దాకా వెళ్ళాల్సిన పనేలేదు.

        చైల్డ్ ఆర్టిస్టు మిహైల్ గాంధీ టాలెంట్ ని కూడా దర్శకుడు సరీగ్గా విని యోగించుకోలేదు. పాత్ర తీరు తెన్నుల్ని మార్చేస్తే తప్ప టాలెంట్ ని సరీగ్గా వినియోగించుకునే అవకాశమే లేదు. మెయిన్ విలన్ కబీర్ సింగ్ అయితే చివరి సీను వరకూ హీరోకి కన్పించకుండా సోలోగా అరుపులు అరుస్తూంటాడు ఎక్కడో వుండి. రెండో సారికూడా బాలుణ్ణి పట్టుకోవడంలో అనుచరులు విఫలమైనప్పుడు, తను దిగాల్సింది యా క్షన్లోకి! ఇలా దర్శకుడు ఈ పాత్రని కూడా కుదేలు చేయడంతో ఛోటా  విలన్ తో అవే యాక్షన్ సీన్లు పదేపదే రిపీట్ అవుతూ సెకండాఫ్ ని తినేశాయి. 

        ప్రధానపాత్ర ధారుల  సంగతే ఇలా వుంటే,  ఇక మిగత పాత్రధారులు ఎవరెలా నటించారో చెప్పుకోవాల్సిన విషయమే కాదు. 

        ప్రొడక్షన్ విలువలు ఏమంత రిచ్ గా లేవు. ఛాయాగ్రహణానికైతే లైటింగే  కొరవడింది. డీటీఎస్ ని ఎఫెక్టివ్ గా చేద్దామంటే ఎఫెక్ట్స్, బిజిఎం కూడా తోడ్పడాలని ఆలోచించలేదు. మొదటి పాట నుంచి మొదలెడితే అన్నిపాటలూ సన్నివేశ బలం లేకుండానే వచ్చిపోతూంటాయి. 

        రచన, దర్శకత్వం, మేకింగ్ ..ఇలా అన్ని విభాగాల్లో రొడ్డ కొట్టుడు మాత్రమే ఎజెండాగా పెట్టుకుని, సినిమా పేరుతో  వీర వాయింపుడు వాయించే ఇలాటి నమూనా ఈ మధ్యకాలంలో రాలేదు
చివరి కేమిటి?
      అర్ధంపర్ధం లేని కామెడీ, అర్ధం పర్ధం లేని సెంటి మెంట్లు, అర్ధం పర్ధం లేని ప్రేమలూ, ఎక్కడా కనెక్ట్ కాని కథా కథనాలూ,  ఇవే సినిమా అని దబాయిస్తే చెప్పడానికేమీ వుండదు. కనీసం ఆ పిల్లవాడి కథకైనా ఏం చేస్తే హత్తుకుంటుందో ఆలోచించలేదు.  ఎక్కడో  సెకండాఫ్ లో పిల్లవాడి కథ విప్పేటప్పటికి వాడిమీద ఇంటరెస్ట్ అప్పటికే చల్లారిపోయి వుంటుంది ప్రేక్షకులకి. సినిమా ఓపెనింగ్ ట్రస్టు భూముల గొడవతో ఒక అర్ధంలేని ఉపోద్ఘాతంగా చేసేకన్నా. అక్కడే ఆ పిల్లవాడి దురదృష్టాన్ని యాక్షన్ సీన్ తో ఎష్టాబ్లిష్ చేసి వుంటే అది ఆద్యంతమూ మంచి హోల్డ్ గా వుండేది. కానీ రొడ్డ కొట్టుడు ముందు ఆలోచన, సునిశితత్వం, వివేకం ఇవేవీ పనిచెయ్యవు. మొన్నే దిల్ రాజు విడుదల చేసిన ‘పోలీస్’ లో  ఆరేళ్ళ కూతురి పాత్రని  ఎంత దివ్యంగా చూపెట్టారో, దానికి రెండు రెట్లు ఎక్కువ దివ్యంగా ‘సుప్రీమ్’  లో  అల్టిమేట్ గా పిల్లవాడిని చూపించారు!

-సికిందర్
http://www.cinemabazaar.in