రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, March 25, 2019

803 : ఆధునిక స్క్రీన్ ప్లే సంగతులు





బిగినింగ్ కథనం : బేబీ వృత్తి
       ట్లాంటా సిటీలో ఓ బ్యాంకు ముందు సరికొత్త రెడ్ హోండా సివిక్ కారొచ్చి ఆగుతుంది. కారులో వున్న యంగ్ డ్రైవర్ బేబీ, ఐ పాడ్ తీసి రాక్ ట్రాక్ ఆన్ చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు. కారులోంచి బడ్డీ, గ్రిఫ్, డార్లింగ్ లు దిగి గన్స్ తీసుకుని బ్యాంకు వైపు దూసుకెళ్తారు. కారులో వున్న బేబీ హై వాల్యూం పెట్టి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూంటాడు. 

         
కొద్ది క్షణాల్లో దోచుకున్న డబ్బుతో పరుగెత్తుకొచ్చి కారెక్కేస్తారు ముగ్గురూ. ఇయర్ ఫోన్స్ లో మ్యూజిక్ బ్లాస్ట్ అవుతూంటే, కారుని ముందుకు దూకించి దూసుకుపోతాడు బేబీ. క్షణాల్లో పోలీసు కారు వచ్చి వెంటాడుతుంది...

          పూర్వం కార్ జాకర్ అయిన బేబీ, డాక్ కి బాకీ పడ్డాడు. ఆ బాకీ తీర్చడానికి దోపిడీలకి గెటవే డ్రైవర్ గా పని చేస్తున్నాడు. డ్రైవింగ్ లో ఎక్స్ పర్ట్ అయిన ఇతను పోలీసులకి దొరక్కుండా సురక్షితంగా గ్యాంగ్ ని డాక్ దగ్గరికి చేరేస్తూంటాడు దోపిడీ సొమ్ము సహా. 

          ఇప్పుడు కూడా ఇయర్ ఫోన్స్ లో మ్యూజిక్ బ్లాస్ట్ అవుతూంటే పోలీసు కారుని తప్పించుకుంటూ నగరమంతా రాష్ డ్రైవింగ్ చేస్తాడు. తర్వాత ఒక కాఫీ షాపులో నాల్గు కప్పులు కాఫీలు తీసుకుని, గార్మెంట్ గోడౌన్ లోకెళ్తాడు. అక్కడ డాక్, బడ్డీ, గ్రిఫ్, డార్లింగ్ లు ఎదురు చూస్తూంటారు. వాళ్ళకి కాఫీలు అందిస్తాడు. 

          ఏంటి వీడెప్పుడూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వుంటాడు - అని బేబీని చూసి చిరాకుపడి డాక్ ని అడుగుతాడు గ్రిఫ్. వాడికి ఒక యాక్సిడెంట్ వల్ల చిన్నప్పుడు చెవులకి టినిటస్ వచ్చింది, ఉండుండి చెవుల్లో ఏమీ విన్పించదు. ఆ భయంకర నిశబ్దాన్ని వాడలా మ్యూజిక్ తో భర్తీ చేస్తూంటాడు - అని డాక్ వివరిస్తాడు. అయినా గ్రిఫ్ బేబీని ఇయర్ ఫోన్స్ లాగి, స్పెక్ట్స్ కూడా లాగి రెచ్చగొడతాడు. బేబీ రెచ్చిపోకుండా కూల్ గా కూర్చుని వుంటాడు. గ్యాంగ్ ముగ్గురూ వెళ్ళిపోతారు. ఈసారి డాక్ కాల్ చేస్తే రెస్పాండ్ అవకు - అని బేబీతో అని వెళ్ళిపోతాడు బడ్డీ. వాడి మాటలు పట్టించుకోవద్దంటాడు డాక్. బ్యాంకు దోపిడీ జాబ్ కి బేబీ కివ్వాల్సిన పేమెంట్ ఇచ్చేస్తాడు డాక్.

బేబీ జీవితం
        బేబీ ఓ ఫ్లాట్ లో ఎనభై ఏళ్ల పెంచిన  తండ్రి జోసెఫ్ తో వుంటాడు. ఇతను ఆఫ్రికన్ అమెరికన్. చెవిటి మూగ. పైగా పక్షవాతంతో వీల్ చైర్లో వుంటాడు. బేబీ ఫ్లోర్ మీద ప్లేటు లాగి, లోపల నోట్ల కట్ట పడేసి మూసేస్తాడు. ఆ ‘సీక్రెట్ లాకర్’ లో చాలానోట్ల కట్టలుంటాయి. వీడేదో ఇల్లీగల్ పని చేస్తున్నాడని జోసెఫ్ కి అనుమానం. ఇద్దరూ సైన్ లాంగ్వేజీలోనే మాట్లాడుకుంటారు.      

          ఫ్లాట్ లో బేబీ గది ఒక మ్యూజియంలా వుంటుంది రకరకాల మ్యూజిక్స్ తో, ప్లేయర్స్ తో. ఎల్పీ ప్లేయర్, వినైల్ ప్లేయర్, కేసెట్ డెక్ లు, సీడీ ప్లేయర్లు, వాక్ మాన్లు, డిక్టా ఫోన్లు, ఐ పాడ్ లు, ఇంకా ఇతర రికార్డర్లు; వీడియో, ఆడియో టేపులు, సీడీలు, ఎల్పీ రికార్డులు వంటి  ఫిజికల్ మీడియా... ఇవన్నీ ఏ కాలంలో ఎలా వస్తే అలా కొన్నట్టు వుంటాయి. చాలా ఏళ్లుగా  ఇతను మ్యూజిక్ తో జీవిస్తున్నట్టు తెలుస్తుంది. కంప్యూటర్ మాత్రం వుండదు.

      డాక్ తో జరిగే మీటింగ్స్ ని రహస్యంగా రికార్డు చేసి తెచ్చుకుని, ఆ సంభాషణలకి మ్యూజిక్ ని కలిపి రీమిక్స్ చేస్తూంటాడు. అరల్లో ఎన్నో టేపులు పేర్చి వుంటాయి. వాటిలో ప్రధానంగా కన్పించేది  ‘మామ్’ అని రాసివున్న టేప్.
          ఇప్పుడు డాక్, గ్రిఫ్ లు తన గురించి మాట్లాడుకున్న మాటల్ని రీమిక్స్ చేసి వింటాడు. నిద్రవస్తూంటే మొబైల్ లో ట్రాక్ ఆన్ చేస్తాడు. రకరకాల కాలర్ ట్యూన్స్ కలిపి తయారు చేసుకున్న ట్రాక్ అది. అలా చైర్లో కూర్చునే నిద్రలోకి జారుకుంటాడు. జారుకోగానే - ఫ్లాష్ బ్యాక్. 

          ఫ్లాష్ బ్యాక్ లో –
          ఇదే ఫ్లాట్ లో, ఇదే గదిలో, ఇదే టేబుల్ ముందు, ఇదే చైర్లో, ఏడేళ్ళ బేబీ భయం భయంగా కూర్చుని చూస్తూంటాడు. మొహం మీద గాయాలుంటాయి. తలెత్తి ఒకతన్ని చూస్తాడు. అతను శాండ్ విచ్ అందిస్తూ - నువ్వు ఓకేనా? - అంటాడు. 

          కారు పోతూంటుంది. వెనుక సీట్లో కూర్చున్న బేబీ తీవ్ర భయాందోళనలతో చూస్తూంటాడు. ఇయర్ ఫోన్స్ గట్టిగా పెట్టుకుని వుంటాడు. ఒకావిడ ఏడ్చేస్తూ డ్రైవింగ్ చేస్తూంటుంది. పక్క సీట్లో వున్నతను ఆమె మీద అరుస్తూంటాడు. వెళ్లి వెళ్లి కారు ముందున్న ఇంకో వాహనాన్ని బలంగా గుద్దేస్తుంది. పెద్ద శబ్దంతో ఫ్లాష్ బ్యాక్ ఎండ్. 

          ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తాడు బేబీ. కలలోకి వచ్చిన ఆ దృశ్యంతో వర్రీ అవుతాడు. చైర్లోంచి లేచిపోతాడు. టేబుల్ మీదున్న పాత ఐపాడ్ కేసి చూస్తాడు. అది 2001 నాటిది,  పగిలిపోయి వుంటుంది...

గర్ల్ ఫ్రెండ్ పరిచయం, కొత్త జాబ్ :
       మార్నింగ్ బేబీ ‘బో డైనర్’ కెళ్తాడు. అక్కడ వెయిటర్ గా పనిచేస్తున్న డెబొరా పరిచయంవుతుంది. ఆమె ‘బేబీ ...’ అంటూ సన్నగా పాటపాడుకుంటూ పనిచేయడం గమనిస్తాడు. ఆర్డర్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆమె ఆకర్షణలో పడతాడు. తను డ్రైవర్ నని పరిచయం చేసుకుంటాడు. తనకి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని వుందని అంటుంది. ఎప్పుడు వీలవుతుందో తెలియదంటుంది. ఆమె పాడుతున్న పాటేమిటో తెలుసుకుంటాడు. 

          పాత సీడీ షాపు కెళ్ళి ఆ ‘బేబీ’ పాట కొనుక్కుని ప్లాట్ కెళ్ళి,  ఆ పాట పెట్టుకుని డాన్స్ చేయడం మొదలెడతాడు. వీడికి పిల్ల దొరికినట్టుందని జోసెఫ్ అనుకుంటాడు.       డాక్ కాల్ చేసి ఒక ఇంపార్టెంట్ మీటింగ్
కి వెళ్ళి  ఇంప్రెస్ చేయాలనీ, కొత్త డ్రెస్ వేసుకుని రమ్మనీ అంటాడు. కొత్త డ్రెస్ లో బెంజి కారు డ్రైవ్ చేస్తూ డాక్ ని రిచ్ రెస్టారెంట్ కి తీసికెళ్తాడు. ఎక్కువ టైం పట్టదు, లోపల ఫైరింగ్ జరిగితే గ్లోవ్ కంపార్ట్ మెంట్ ఓపెన్ చెయ్ - అని చెప్పి రెస్టారెంట్ లోకి వెళ్ళిపోతాడు డాక్. కారులో గ్లోవ్ కంపార్ట్ మెంట్ ఓపెన్ చేసి చూస్తాడు బేబీ. పిస్టల్ వుంటుంది. అద్దాల్లోంచి రెస్టారెంట్ లోపలికి  చూపు సారిస్తాడు. ముగ్గురు రిచ్ వ్యక్తులతో కూర్చుని వుంటాడు డాక్. పిస్టల్ గురించి మాట్లాడాడంటే వాళ్ళు క్రిమినల్స్ అయివుంటారని అనుకుంటాడు బేబీ. ఇయర్ ఫోన్స్ లో మ్యూజిక్ బ్లాస్టవుతూంటే,  లిప్ మూమెంట్స్ ని బట్టి వాళ్ళేం  మాట్లాడుకుంటున్నారో వూహిస్తాడు  బేబీ. మూతి వంకర్లు తిప్పుతూ వాళ్ళని మిమిక్రీ చేస్తాడు. 

       కొత్త జాబ్ ఓకే అయిందని వచ్చి చెప్తాడు డాక్. ఇంకో గోడౌన్ లోకి తీసికెళ్ళి కొత్త గ్యాంగ్ ని పరిచయం చేస్తాడు. ఎడ్డీ, జేడీ, బ్యాట్స్.  జేడీ బేబీ కేసి చూసి - ఈ మాటలు రాని మూగోడితో పని చేయాలా మేమూ - అంటాడు. ఏంటి నువ్వు మూగోడివేనా? -  అని బ్యాట్స్ అడుగుతాడు. నో - అంటాడు బేబీ ముక్తసరిగా. 

          ఈ కిడ్ నాకు నచ్చాడు, మ్యూజికల్ కిడ్ -  అంటాడు జేడీ. వీడిన్ని ఫోన్ కాల్స్ వింటూంటే పని మీద ఏం కాన్సన్ట్రేట్ చేస్తాడని బ్యాట్స్ అడుగుతాడు. వాడి చెవులకి వస్తున్నవి ఫోన్ కాల్స్ కాదని డాక్ అంటాడు. డ్రైవర్ అన్నాకా కళ్ళతో పాటు చెవులు కూడా పని మీద వుండాలి కదా -  అంటాడు బ్యాట్స్. వీడు మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యడంటే చెయ్యడంతే -  అని ఫైనల్ గా అనేస్తాడు డాక్. 

          దోపిడీ జాబ్ ప్లాన్ చెప్పడం ప్రారంభిస్తాడు డాక్. బ్లాక్ బోర్డు మీద రూట్స్, టైమింగ్స్ వేసి చూపిస్తూ చాలా సేపు వివరిస్తాడు. ఇదేం పట్టించుకోకుండా మ్యూజిక్ వింటున్న బేబీ మీద మండి పడతాడు బ్యాట్స్. వీడేం వినకుండా కూర్చుంటే వీడితో మేమెందుకు వెళ్ళాలంటాడు. అప్పుడు బేబీ డాక్ వివరించిన ప్లాన్ ని పొల్లు పోకుండా మొత్తం చెప్పేస్తాడు. దటీజ్ మై బేబీ - అంటాడు డాక్.

జాబ్ ఆపరేషన్ :
       బేబీకిది చివరి జాబ్. దీంతో డాక్ కి పడిన బాకీ తీరిపోతుంది. దీంతో మంచి జాబ్ లో చేరి, డెబొరాతో కారేసుకుని, లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని అనుకుంటాడు. కొత్త కార్లో గ్యాంగ్ ని తీసుకుని స్పాట్ కొస్తాడు. అక్కడ ఏటీఎం నగదు డెలివరీ కొచ్చిన వ్యాను వుంటుంది. గ్యాంగ్ ముగ్గురూ డాక్ ఇచ్చిన మాస్కులు ధరిస్తారు. హెలోవీన్ మాస్కులు కొనుక్కోమని డాక్ అంటే, ఆస్టిన్ పవర్స్ కమెడియన్ మాస్కులు తెచ్చాడు జేడీ. అవి వేసుకుని ఆయుధాలతో వ్యాను మీద దాడి చేస్తారు. గార్డ్ చచ్చి పోతాడు. డబ్బు సంచులు  పట్టుకుని వచ్చేసి కారెక్కేస్తారు గ్యాంగ్. 

          మ్యూజిక్ వింటున్న బేబీ కారుని ముందుకి దూకిస్తాడు. కొంత దూరంలో నేవీ ఉద్యోగి కారుని గుద్దేస్తాడు.  నేవీ ఉద్యోగి ఫైరింగ్ చేస్తూ వెంటబడతాడు. చాలా ఛేజింగ్ జరిగి బేబీ ఆ కారునొదిలేసి, ఇంకో కారులో వున్నావిణ్ణి  బిడ్డతో సహా దింపేసి ఆ కారుని అపహరిస్తాడు. గ్యాంగుని డాక్ దగ్గరికి చేరేస్తాడు.

          గోడౌన్లో డాక్ గ్యాంగ్ ని మీటవుతాడు. బేబీ నాల్గు కాఫీలు తీసుకొస్తాడు. ఇక్కడ ముగ్గురే వుంటారు. జేడీ వుండడు. జేడీ ఎక్కడ? – అని డాక్ అడుగుతాడు. ఎక్కడా? -  అన్నట్టు బేబీనే చూస్తారు ఎడ్డీ, బ్యాట్స్. డాక్ వాళ్ళిద్దరికీ డబ్బు పంచేస్తాడు. 

          అండర్ గ్రౌండ్ పార్కింగ్ లోకెళ్లాక బేబీ పేమెంట్ ఇచ్చేస్తాడు డాక్.  అతడి కారు డిక్కీకి రక్తం కనబడుతుంది. ఇక నువ్వు ఫ్రీ అయిపోయావ్ పో బేబీ...ఐతే ఓ చిన్న పని - అని ఆగుతాడు డాక్. బేబీ డిక్కీ తెరుస్తాడు. జేడీ శవం వుంటుంది.

ప్లాట్ పాయింట్ వన్ :
         జంక్ యార్డ్ లో ఆ కారుని అప్పగిస్తాడు బేబీ. జేడీ శవం సహా అది హైడ్రాలిక్ మెషీన్ లో క్రష్ అవుతూంటే - కళ్ళు మూసుకుంటాడు బేబీ.
          ఫ్లాష్ బ్యాక్ –
          అదే కారు జంక్ యార్డ్ లో క్రష్ అవుతూంటుంది, చిన్నప్పుడు యాక్సిడెంట్ పాలైన తమ కారు...రివర్స్ లో వెనక్కి పోతే - అతనామె మీద అరుస్తూంతాడు. ఆమె ఏడ్చేస్తూ డ్రైవింగ్ చేస్తూంటుంది. రివర్స్ లో వెనక్కి వెళ్తే - ఫ్లాట్ లో ఏడేళ్ళ బేబీ కూర్చుని వుంటాడు. బెడ్రూంలోంచి అరుపులు విన్పిస్తూంటాయి. బేబీ తన ముందున్న గిఫ్ట్ ని ఓపెన్ చేస్తాడు. ఐ పాడ్ వుంటుంది. బెడ్రూం వైపు చూస్తాడు. ఇద్దరి అరుపులు తీవ్రతర మవుతాయి. బేబీ వంగిపోయి ఆ అరుపులు వినపడకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఐ పాడ్ వింటూంటాడు. ఆమె గబగబా వచ్చేసి అతడి మీదికి వంగి చూస్తుంది. ఆమె మేకప్ అంతా చెదిరిపోయి వుంటుంది. బేబీ ఇయర్ ఫోన్స్ లాగి, ‘హేయ్ బేబీ...’ అంటుందామె. కళ్ళు  మూసుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ ఎండ్.
          బేబీ తల్లి సింగర్, తండ్రి తాగుబోతు.
***
      ఇదీ బిగినింగ్ కథనం. 38 సీన్లతో 35 నిమిషాల నిడివితో వుండే ఈ బిగినింగ్ విభాగం కథనం, రొటీన్ గా వుండే సమస్యకి దారితీసే పరిస్థితుల కథనంతో లేకపోవడాన్ని గమనించాలి. దీనికి విరుద్ధంగా సమస్యని తీర్చేసి, గోల్ ని పూర్తి చేసేసే కథనంతో వుంటుంది. ప్లాట్ పాయింట్ వన్ అంటే సాధారణంగా అనుకునేది సమస్యని ఏర్పాటు చేసి, క్యారెక్టర్ కి ఒక గోల్ ని ఇవ్వడమని. ఇది రివర్స్ అయిందిక్కడ. అంటే సమస్యని తీర్చేసి, గోల్ ని పూర్తి చేసేసే ప్లాట్ పాయింట్ వన్ గా,  పాజిటివ్ నోట్ తో దర్శనమిచ్చింది. పై కథనంలో ఇది స్పష్టంగా గమనించవచ్చు. ఇదే దీని ప్రత్యేకత. ఇందుకే ఇది విజువల్ స్క్రిప్టు. ఏదైతే డిఫరెంట్ గా వుంటుందో అది విజువల్ స్క్రిప్టు. 

          ప్లాట్ పాయింట్స్ మధ్య బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాల్లో అవే సాంప్రదాయ బిజినెస్ తో కూడిన కథనాలు చేస్తూంటే కమర్షియల్ సినిమాలు ఒకే పోతలో పోసినట్టు యాంత్రికంగా, మూసగా వుంటున్నాయి. ప్రత్యాన్మాయంగా, ప్లాట్ పాయింట్స్ మధ్య  సాగే బిజినెస్ తో క్రియేటివిటీలకి పాల్పడితే, ఆయా విభాగాల కథనాలకి కొత్తదనం రావడమే గాక, ప్లాట్ పాయింట్స్ కూడా మొనాటనీని వదిలించుకుని, తేరుకుని నిటారుగా కూర్చుని చూసేలా చేస్తాయి. సినిమా చూసే పద్ధతినే మార్చే స్తాయి. దిసీజ్ విజువల్ రైటింగ్, విజువల్ స్క్రిప్టు. 

          స్ట్రక్చర్ లేకుండా సినిమాలు తీయడమెంతో,  స్ట్రక్చర్ తో ప్రయోగాలు చేయడమూ అంతే. ఫ్లాపుల్ని ప్రసాదించడం. ఐతే స్ట్రక్చర్ తో క్రియేటివిటీకి పాల్పడవచ్చు. ఉత్త క్రియేటివిటీయే చాలనుకుని స్ట్రక్చర్ వద్దనుకున్నా, స్ట్రక్చర్ తో ప్రయోగాలూ చేసినా  మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు, పాసివ్ హీరో పాత్రలు, సెకండాఫ్ సిండ్రోములు, మధ్యకి ఫ్రాక్చరైన స్క్రీన్ ప్లేలూ వగైరా జన్మ పోసుకుంటాయి; కథ గాకుండా గాథలు పుడతాయి. జరగాల్సిన  నష్టాలన్నీ జరిగిపోతాయి. స్ట్రక్చర్ రహిత క్రియేటివిటీ అంటే తెలియక చేసుకునే ఆత్మవంచనే. 

          ఉత్త క్రియేటివిటీలతోనే సినిమా కథలు తయారయ్యే మాటే నిజమైతే స్ట్రక్చర్ గురించి ఇన్ని స్క్రీన్ ప్లే పుస్తకాలు వుండవు, స్క్రీన్ ప్లే వ్యాసాలుండవు, స్క్రీన్ ప్లే వెబ్ సైట్స్ వుండవు, ఫిలిం ఇనిస్టిట్యూట్స్ లో స్క్రీన్ ప్లే కోర్సులూ వుండవు. ఉండనివి ఉత్త క్రియేటివిటీతో కథ ఎలా తయారవుతుందో చెప్పేశాస్త్రాలే. క్రియేటివిటీ స్ట్రక్చర్ ని ఆధారంగా చేసుకుని స్ట్రక్చర్ లోంచి పుడుతుంది. స్ట్రక్చర్ లేని క్రియేటివిటీ అమ్మలేని అనాధ.        


            స్ట్రక్చర్ లో ప్లాట్ పాయింట్స్ తో క్రియేటివిటీకి పాల్పడుతున్నప్పుడు ప్లాట్ పాయింట్ వన్ ని ఎంత దూరంగా ఏర్పాటు చేస్తే అంత కథా ప్రారంభం ఆలస్యమవుతుంది. అంటే బిగినింగ్ అంత జీడిపాకంలా సాగుతుంది. అరగంటలో ప్లాట్ పయింట్ వన్ అంటే, సకాలంలో కథా ప్రారంభం. ఇంటర్వెల్లో ప్లాట్ పాయింట్ వన్ అంటే, అంతవరకూ కథా ప్రారంభం వాయిదాపడి  బిగినింగ్ అనవసరంగా సాగుతూ పోవడం. సెకెండాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ అంటే, కథా ప్రారంభం నిరవధికంగా వాయిదాపడి - బిగినింగ్ జీడిపాకంలా సాగిసాగి విసిగించి -  చివరికి మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవడం. 

          కాబట్టి  ప్లాట్ పాయింట్ వన్ ని గరిష్టంగా ఇంటర్వెల్ వరకూ జరపవచ్చు. ఆ లోపే అరగంటలో అయితే శ్రేష్ఠం. కానీ ప్లాట్ పాయింట్ టూతో ఇలా కాదు - దీన్ని ఇంటర్వెల్ తర్వాత ఎక్కడైనా ప్రారంభించుకోవచ్చు, ఎంత దగ్గరగానైనా దూరంగానైనా జరుపుకోవచ్చు. ‘ఈక్వలైజర్ -2’  లో ఇంటర్వెల్ తర్వాత పది నిమిషాలకే ప్లాట్ పాయింట్ టూ వచ్చేస్తుంది. అక్కడ్నించీ సుదీర్ఘంగా 40 నిమిషాల పాటూ క్లయిమాక్సే. ఇది సినిమా సెకండాఫ్ వీక్షణానుభవాన్నే మార్చేసింది. రొటీన్ గా సెకండాఫ్ ఎలా వుంటుంది? ఓ గంటో, ఇంకా పైనో మిడిల్ నడిచి, అప్పుడు ప్లాట్ పాయింట్ టూ వచ్చి, పావుగంట క్లయిమాక్స్ ప్రారంభమవుతుంది. ‘ఈక్వలైజర్ -2’ లో దీన్ని రివర్స్ చేశారు. మిడిల్ పది నిమిషాలే చూపించి, క్లయిమాక్స్ 40 నిమిషాలు చూపించేశారు ఇన్నోవేటివ్ గా! 

          స్క్రీన్ ప్లేలో మిడిల్ అంటే కథ. ఇది స్క్రీన్ ప్లేలో యాభై శాతం, అంటే కనీసం గంట సేపు వుండాలని శాస్త్రం చెప్పారు అనుభవజ్ఞులు. వాళ్ళనుభవించిన తీరుబడి కాలం వేరు. మనం వుంటున్న తీరిక లేని కాలం వేరు. ఇది విజువల్ ప్రపంచం, కలియుగం యాక్షన్ లో వున్న ప్రపంచం. కథ గురించని గంట సేపూ కూర్చోబెట్టకుండా, పది నిమిషాల్లో చప్పున కథ (మిడిల్) ముగించేసి - క్లయిమాక్స్ యాక్షన్ కెళ్ళిపోవడం ‘ఈక్వలైజర్ -2’ లో చేసిన సక్సెస్ ఫుల్ క్రేజీ థాట్! 

          ఇదే క్రేజీ థాట్ అనుకుంటే గతవారం  ‘కేసరి’ లో ఇంటర్వెల్ కే కథ ముగించేసి, సెకండాఫ్ స్టార్ట్ టు ఫినిష్ గంటన్నర పాటూ క్లయిమాక్స్ చూపించేశారు! అంటే ఫస్టాఫ్ ఇంటర్వెల్ లోపే బిగినింగ్, మిడిల్ అంతా  ముగించేసి, ఇంటర్వెల్ లోనే ప్లాట్ పాయింట్ టూ పెట్టేశారన్న మాట!

          స్ట్రక్చర్ తో ఇలా డిఫరెంట్ క్రియేటివిటీలు చేస్తే సినిమాలన్నీ ఒకేలా ఎందుకుంటాయి? ఒక్కోటీ ఒక్కో కొత్త అనుభవాన్నిస్తాయి. స్క్రీన్ ప్లేల్లో వుండే రెండు ప్లాట్ పాయింట్స్ తో కొత్తగా ఏం చేస్తారో అదే  నిజమైన క్రియేటివిటీకి మచ్చు తునక. సినిమా కథ ఆలోచించడమంటే ప్లాట్ పాయింట్స్ ఆలోచించడమే. స్క్రీన్ ప్లే అనే చదరంగంలో ప్లాట్ పాయింట్స్ అనే పావులతో ఆడుకునే ఆటే ఈ కాలపు సినిమా.

          ఇలా పై రెండు సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్ కీ,  ప్లాట్ పాయింట్ టూకీ మధ్య మిడిల్ బిజినెస్ ని తగ్గించేసే క్రియేటివ్ ప్రయోగాలూ చేసినట్టూ, ప్లాట్ పాయింట్ వన్ వరకూ కూడా బిగినింగ్ బిజినెస్ తో క్రియేటివిటీ చూపిస్తే? ఆదుగో, దొంగరాముడు, ది మేయర్, బ్రిక్, ఇట్సె వండర్ఫుల్ లైఫ్ వంటివి  కొన్ని చూశాం ఎలా భిన్నంగా మారిపోతాయో. ఇప్పుడు బేబీ డ్రైవర్ వచ్చి చేరింది. బేబీ డ్రైవర్ బిగినింగ్ బిజినెస్ కీ, ఇట్సె వండర్ఫుల్ లైఫ్ బిగినింగ్ బిజినెస్ కీ పరస్పర వ్యతిరేక దగ్గరి పోలికలుంటాయి. ఇట్సె వండర్ఫుల్ లైఫ్ లో అతను విదేశాలకి వెళ్లి బిల్డర్ నవ్వాలన్న కలలతో ఆ మేరకు కృషి చేస్తూంటాడు. తీరా విదేశానికి ప్రయాణం కడుతున్న ప్లాట్ పాయింట్ వన్ దగ్గర తండ్రి మరణంతో కల చెదిరి, గోల్ కుప్పకూలి ఇష్టంలేని తండ్రి బిజినెస్ ని చేపట్టే అగత్య మేర్పడుతుంది. ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ రివర్స్ అయింది. బేబీ డ్రైవర్ లో ఇతను డాక్ తో రుణ విముక్తుడై, వేరే మంచి పని చూసుకుని గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్న కోరికతో వుంటాడు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర అలాగే రుణవిముక్తుడైపోతాడు. ఈ ప్లాట్ పాయింట్ వన్ సక్సెస్ తో వుంది. ఇదీ తేడా.

***
      ప్లాట్ పాయింట్ వన్ దగ్గర గోల్ ఏర్పడడం సాంప్రదాయ కథనం. అంటే క్యారెక్టర్ కి ప్లాట్ పాయింట్ వన్ వరకూ గోల్ ఏమిటో తెలిసి వుండదు. అక్కడ పుట్టే సమస్య వల్లే తెలుస్తుంది. ఇలా ఈ గోల్ ని ఇకముందెప్పుడో సాధిస్తాడు. కాబట్టి ఈ గోల్ ని పోస్ట్ పెయిడ్ గోల్ అనుకుందాం. అన్ని సినిమాల్లో ఈ పోస్ట్ పెయిడ్ గోలే కదా వుంటుంది. మరి ప్రీ పెయిడ్ గోల్ కూడా వుంటే?  బేబీ డ్రైవర్ లో వుంది. ఇందులో సాంప్రదాయేతర కథనంతో ప్లాట్ పాయింట్ వన్ కల్లా గోల్ పూర్తయిపోయింది. అంటే ఈ  గోల్ గురించి ముందునుంచే తెలిసి వుంది బేబీకి. డాక్ తో రుణ విముక్తుడవాలన్న గోల్ ముందు నుంచి తెలిసే వుంది బేబీకి. అది ప్లాట్ పాయింట్ వన్ కల్లా నెరవేర్చుకున్నాడు. కాబట్టి ఈ గోల్  ప్రీ పెయిడ్ గోల్ అయింది. ప్రీ పెయిడ్ గోల్ లో గోల్ ముందే తెలిసి వుంటుందన్నమాట.

          మరి ఇలా గోల్ పూర్తయ్యాక ఇక కథే ముంటుంది? అందుకని కథ పుట్టేందుకు అయిపోయిన ఈ ప్రీ పెయిడ్  గోల్ రీచార్జికి ఒక లీడ్ ని పెట్టుకున్నారు. ప్లాట్ పాయింట్ వన్ కల్లా గోల్ రీచ్ అవడంతో ప్రీ పెయిడ్ కనెక్షన్ ఛార్జింగ్ అయిపోయినట్టే. మళ్ళీ రీచార్జి చేసుకుంటేనే కథ.  
       
          సినిమాల్లో ఇంటర్వెల్లో కథ ఒక దగ్గరికి వచ్చి ఆగుతుంది. దాని కంటిన్యుటీ కోసం, సెకండాఫ్ కొనసాగేందు కోసం ఒక లీడ్ ఏదో ఇస్తారు. ఈ లీడ్ లేకపోతే  ఇంటర్వెల్లో కథ తెగిపోయినట్టు వుంటుంది. ఇలాగే  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కూడా ప్రీ పెయిడ్ గోల్ పూర్తయిపోతే, కథ అయిపోయిందన్న భావమేర్పడకుండా, ప్రీ పెయిడ్ గోల్ లో ఇన్ బిల్ట్ గా – అంతర్లీనంగా లీడ్ ఇచ్చారు బేబీ డ్రైవర్ లో. 

          బేబీ రెండు పెట్టుకున్నాడు : రుణ విముక్తుడవడం, అయ్యాకా ఇంకో మంచి పని చూసుకుని గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళడం. వీటిలో ముందు రుణ విముక్తుడవడమే గోల్. ఇది పూర్తయితేనే రెండోది సాధ్యమవుతుంది. కాబట్టి మొదటి దాన్నే ఆపరేషనల్ గోల్ గా  పెట్టుకుని దాంతో కొనసాగాడు. రెండోది బఫర్ గోల్ గా పెట్టుకున్నాడు. ఆపరేషనల్ గోల్ పూర్తయితే అప్పుడు బఫర్ గోల్ బయటికి తీస్తాడు. దాన్ని ఆపరేషనల్ గోల్ గా  మార్చుకుని తిరిగి కొత్త ప్రయాణం కొనసాగిస్తాడు. 

           ఇదీ ప్లాట్ పాయింట్ వన్ లో కథని అందుకోవడానికి చేసిన ఇంజనీరింగ్. లీడ్ గా బేబీ క్యారెక్టర్ కి బఫర్ గోల్ నిచ్చారు. ఆ బఫర్ గోల్ నిప్పుడు పైకి తీసి రీచార్జి చేసుకుంటాడు బేబీ. ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథేమిటంటే, మంచి పనిచూసుకుని, పిల్లనేసుకుని షికారు వెళ్ళడం. ఇప్పుడేం జరుగుతుందో ఇక మిడిల్లో చూడాలి. ఆల్రెడీ ఒక అభిప్రాయమందింది ఒక దర్శకుడి నుంచి - బేబీ డ్రైవర్ మిడిల్ కథనం మనం ఎదురు చూసే రెగ్యులర్ రొటీన్ గా లేకుండా ఫ్రెష్ గా వుందని.  

***
        బిగినింగ్ కథనాన్ని ఐదుగా విభజిస్తే ఇలా వుంటుంది :  బేబీ వృత్తి, జీవితం, గర్ల్ ఫ్రెండ్ పరిచయం - కొత్త జాబ్, జాబ్ ఆపరేషన్, ప్లాట్ పాయింట్ వన్. ఈ బిగినింగ్ కథనాన్ని నిలబెట్టడానికి ప్రారంభంలో ఒక దోపిడీ యాక్షన్, ముగింపులో ఇంకో దోపిడీ యాక్షన్ అనే రెండు పిల్లర్స్ తో మధ్య కథనానికి దడి కట్టారు. రెండు దోపిడీ యాక్షన్స్ లో మొదటి గ్యాంగే రెండోసారి కూడా లేకుండా కొత్త గ్యాంగ్ తో ఫ్రెషప్ చేశారు. ఈ డైనమిక్స్ తో కూడిన ఫ్రేమింగ్ బిగినింగ్ కెంతో వన్నె తెచ్చింది.

          బిగినింగ్ బిజినెస్ లో  1. కథ ఏ కోవకి చెందిదో నేపథ్యంలో తెలిసిపోతూనే వుంది, 2. బేబీ, అతడి పెంచిన తండ్రి, గర్ల్ ఫ్రెండ్, బాస్ పాత్రలు పరిచయమయ్యాయి, 3. ఇక సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన ఇక్కడ చేయలేదు. ఎందుకు చేయలేదంటే, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్యనేర్పాటు చేసి, గోల్ నిచ్చే కథనం కాదిది. గోల్ ని పూర్తి చేసే కథనం. బాస్ బాకీ తీర్చి వెళ్ళిపోవడమే గోల్.  4. గోల్ పూర్తయ్యాక ఏం చేద్దామని? ఇది బేబీకి తెలీదు. ఎప్పటిదాకా తెలీదు? గర్ల్ ఫ్రెండ్ పరిచయమయ్యేదాకా తెలీదు. ఆమె పరిచయమయ్యాకే, వేరే మంచి పని చూసుకోవాలనుకున్నాడు. లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుందని ఆమె అన్నాకే ఆమెతో లాంగ్ డ్రైవ్ వెళ్ళే ఆలోచన చేశాడు. కాబట్టి గోల్ పూర్తయ్యాక చేసే పనులివే. 

          ఈ కథనం వుండాల్సిన వరస క్రమంలో ఎలా వుందో చూద్దాం. దోపిడీతో వృత్తి చూపించేశారు. ఆ తర్వాత వ్యక్తిగత జీవితం చూపించారు. ఇందులో పెంచిన తండ్రి వున్నాడు. ఇంత ముసలి  తండ్రిని చూపిస్తున్నారంటే ఎక్కడో ఇతడికి ప్రమాదముంటుందన్న సంకేతముంది. బేబీకున్న మ్యూజికల్ లోకాన్ని చూపించారు. అతడి ఇయర్ ఫోన్స్ అలవాటుకి కారణమేమిటో ముందే బాస్ చేత చెప్పించారు. అది చిన్నప్పటి ప్రమాద ఫలితం. ఇక బేబీ లోతట్టు జీవితాన్ని చూపించారు. ఆ లోతట్టు జీవితంలో ఫ్లాష్ బ్యాక్ వేసి తల్లిదండ్రులతో అతడి ట్రాజడీ చూపించారు. ఈ ఫ్లాష్ బ్యాక్ కేవలం రెండు మూడు షాట్స్ తో కూడిన ఫ్లాష్ కట్. ఈ ఫ్లాష్ కట్ లో తల్లితో ప్రేమాప్యాయతలు చూపించలేదు. చూపిస్తే శిల్పం చెడుతుంది. శిల్పమేమిటి? షాకింగ్ ట్రాజడీ. ఇదే చూపించాలి. కాకుండా, అమ్మా బుచ్చీ బావున్నావా నా చిట్టి తండ్రీ...అని తెలుగు చాదస్తాలతో మదర్ సెంటిమంటలు పెడితే మొత్తం తగులబడి పోతుంది. ఈ మంటలు గర్ల్ ఫ్రెండ్ సీన్లకి కూడా వ్యాపిస్తాయి. మదర్ తో వున్నదే లవర్ తో కూడా వుంటే కథనం శిల్పం చెడినట్టే. మదర్ తో ప్రేమని చూపించి, లవర్ తో కూడా ప్రేమని  చూపిస్తే ఇంకెక్కడి శిల్పం, ఇంకెక్కడి డైనమిక్స్. కాబట్టి మదర్ దగ్గర దొరకనిది లవర్ దగ్గర పొందుతున్నట్టు వుంటేనే శిల్పం, డైనమిక్స్. ఈ ముందు చూపుతోనే మదర్ తో ఫ్లాష్ కట్ ఆమె పరిస్థితుల్లోంచి టెర్రిఫయింగ్ గా వేశారు. 

          మదర్ తో ఇలా చిన్నప్పటి ట్రాజడీ చూపించాక, ఇక ఫ్రెష్ గా గర్ల్ ఫ్రెండ్ పరిచయం. రెస్టారెంట్ లో ఈమె సన్నగా బేబీ అని పాట పాడుకుంటూ పోతూంటే చూశాడు. వెంటనే కనెక్ట్అయిపోయాడు. ఎందుకు కనెక్ట్ అయిపోయాడు?  బేబీ అంటూ తన పేరే స్వీట్ గా వినిపించినందుకా? కాదు, ఇంత లేకి తెలుగు ప్రేమ కాదు. మరి ఆమె సంగీతప్రియురాలనా? ఇంత చవక తెలుగు ప్రేమ కూడా కాదు. తన మదర్ సింగర్, ఈమే సింగర్. మదర్ గుణాలు అమ్మాయిలో కన్పిస్తే అమ్మాయికి పడిపోతాడు మగపురుగనే వాడు. బేబీగాడు ఇలా పడిపోయాడు. ఇక ఈ ప్రేమ వదిలేది కాదు. తెలుగు రోమాంటిక్ కామెడీ దర్శకుడుకి అర్ధమై చావని ప్రేమ!

          తను డ్రైవర్ అని చెప్పగానే తనకి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుందని అనేస్తుంది. ఇక వూరుకుంటాడా? డాక్ బాకీ తీర్చేశాక ఏం చేయాలో డిసైడ్ అయిపోయాడు. ఈమె పరిచయం పుణ్యమాని ఇక మంచి పనేదో చూసుకోవాలని కూడా డిసైడ్ అయిపోయాడు. వీళ్లిద్దరి మధ్య ఇంకొక్క సీను మాత్రమే వుంటుంది. ఆ సీనులో కూడా ప్రేమని వ్యక్తం చేసినట్టు చూపించరు.  ఇది ప్రేమ కథని ప్రారంభించే స్క్రీన్ ప్లే ఏరియా కాదు. బేబీ ఆపరేషనల్  గోల్ ని మాత్రమే పూర్తి చేసే ఏరియా. ఇందుకే ఇందులోకి ఇద్దరి ప్రేమని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేయలేదు. ప్రేమ తాలూకు కథనమంతా మిడిల్ ఏరియాలోనే. కాబట్టి అక్కడి అవసరానికి అట్టి పెట్టుకున్నాడు దర్శకుడు. 

          ఇలా గర్ల్ ఫ్రెండ్ పరిచయ క్రమాన్ని ముగించి తిరిగి కొత్త దోపిడీ జాబ్ చూపించారు. దీంతో బేబీకి డాక్ బాకీ తీరిపోయింది. ఇక ప్లాట్ పాయింట్ వన్ సీను. ఈ సీన్లో జేడీ శవమున్న కారుని క్రష్ చేయిస్తూంటే,  బేబీకి ఇంకో చిన్నప్పటి ఫ్లాష్ కట్. ముందు చూపించిన ఫ్లాష్ కట్ లో మదర్ ని చూపించలేదు. ఇప్పుడు చూపించి ఈ ఫ్లాష్ కట్ కి డైనమిక్స్ ఇచ్చారు. ఇక్కడ మాత్రమే ఆమె వచ్చి ‘హేయ్బే బీ...’ అన్నప్పుడు మాత్రమే లిప్త కాలంపాటు ఆమెని చూపించి ఎఫెక్టివ్ గా కట్ చేసేశారు. ‘చిన్నా...లేదమ్మా... మీ నాన్న... మంచోడమ్మా ...ఏడ్వకు నా బుజ్జి కదూ...’ అంటూ రొయ్యల మార్కెట్ తెర్చి కూర్చోలేదు. తండ్రి ఫేస్ ఎక్కడా చూపించలేదు. కొన్నిటిని ప్రేక్షకుల్ని టీజ్ చేయడానికి చూపించకుండా వదిలెయ్యాలి. ఇది కూడా విజువల్ మీడియా కళ. 

          ఇక యాక్సిడెంట్ ఎలా జరిగిందో షాట్ వేసి ముగించారు. అతను చెవులకి ఇయర్ ఫోన్స్ తో ఎందుకుంటాడో ఇందులో స్పష్టం చేసేశారు. ఇలా ఒక దాని తర్వాత ఒకటిగా ఒక ఫ్లోలో ఐదు భాగాలనీ చూపిస్తూ కథనం చేశారు.  ఇలా ప్లాట్ పాయింట్ వన్ కొచ్చేటప్పటికల్లా డాక్ తో రుణ విముక్తుడయాడు. అమ్మాయి పరిచయమైంది. తనని వెంటాడుతున్న చిన్నప్పటి ట్రాజడీని, ఇప్పటి నేర జీవితాన్నీ క్రషింగ్ యార్డులో ఇక శాశ్వతంగా క్రష్ చేసేసి, అమ్మాయితో కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు బేబీ...

          ఇప్పుడు ఈ మిడిల్ కథనం కొత్తదనమేమిటో ఇక చూడాలి...

సికిందర్