రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, జనవరి 2023, గురువారం

1281 : రివ్యూ!


రచన -దర్శకత్వం : గోపీచంద్ మలినేని
తారాగణం: బాలకృష్ణ, శృతీ హాసన్, వరలక్ష్మీ శరత్‌కుమార్, హనీ రోజ్, మురళీ శర్మ, నవీన్ చంద్ర, దునియా విజయ్, సప్తగిరి తదితరులు 
మాటలు : సాయి మాధవ్ బుర్రా, సంగీతం :  థమన్, ఛాయాగ్రహణం : రిషీ పంజాబీ, కళ : ఏఎస్ ప్రకాష్, పోరాటాలు :  రామ్-లక్ష్మణ్, వెంకట్
బ్యానర్‌ : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై.రవిశంకర్
విడుదల : జనవరి 12, 2023
***
        2021 లో అఖండ ఘన విజయం తర్వాత తిరిగి ద్విపాత్రాభినయం చేస్తూ బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి సంక్రాంతి రెండో సినిమాగా ఈ రోజు విడుదలైంది. సంక్రాంతి హీరోగా పేరున్న బాలకృష్ణ మరో మూడు సంక్రాంతి సినిమాలతో పోటీ పడుతున్నారు. రెండు డబ్బింగ్ సినిమాలు (అజిత్ తెగింపు’, విజయ్ వారసుడు) లతో బాటు, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య’. ఇది రేపు విడుదలవుతోంది. ఈ రెండూ ఒకే బ్యానర్ మైత్రీ మూవీస్ నిర్మించినవే. ఐదేళ్ళ తర్వాత తిరిగి సంక్రాంతికి చిరంజీవితో పోటీ పడుతున్న బాలకృష్ణ రేసులో విజేత అవడం గురించి కుతూహలమేర్పడింది. కనుక ఈ రోజు బాలకృష్ణ సినిమా చూసి, రేపు చిరంజీవి సినిమా కూడా చూశాక తీర్పు ప్రకటిస్తారు ప్రేక్షకులు. ప్రస్తుతానికి బాలకృష్ణ సినిమా ఎలా వుందీ, మరో అఖండ గా అన్పించుకుందా లేదా ఓ లుక్కేసి తెలుసుకుందాం...

కథ

రాయలసీమలోని పులిచర్లలో వీరసింహా రెడ్డి (బాలకృష్ణ) ప్రజలకు దేవుడు. పగవాళ్ళ నుంచి ప్రజల్ని కాపాడుతూంటాడు. అతడి చెల్లెలు భానుమతి (వరలక్ష్మీ శరత్ కుమార్) భర్త ముసలి మడుగు ప్రతాప రెడ్డి (దునియా విజయ్) ని అన్నని చంపమని ఉసిగొల్పుతూ వుంటుంది. అతను చంపే ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ వుంటాడు. అటు ఇస్తాంబుల్ లో రాయలసీమ రెస్టారెంట్ నడిపే మీనాక్షి (హనీ రోజ్) కి జయసింహా రెడ్డి (బాలకృష్ణ-2) కొడుకు. ఇతను కొన్ని సంఘటనల క్రమంలో ఈషా (శృతీ హాసన్) తో ప్రేమలో పడతాడు. వీళ్ళ పెళ్ళికి ఈషా తండ్రి (మురళీ శర్మ) అంగీకరించి జయసింహా రెడ్డి తల్లిదండ్రులతో మాట్లాడతానంటాడు. దీంతో మీనాక్షి జయసింహారెడ్డి కి తండ్రి గురించి చెప్పుకొస్తుంది. ఆతర్వాత వీరసింహారెడ్డి ఇక్కడే కొడుకు పెళ్ళి జరిపిద్దామని ఇస్తాంబుల్ వస్తాడు. ఇప్పుడు వీరసింహా రెడ్డి ఇస్తాంబుల్ లో ఒంటరిగా దొరుకుతాడని పథకం వేసి, భానుమతి భర్త ప్రతాప రెడ్డితో వస్తుంది. ఇద్దరూ కలిసి ఒంటరిగా దొరికిన వీరసింహా రెడ్డిని పొడిచి చంపేస్తారు.

అన్న మీద చెల్లెలు అంత పగబట్టడానికి కారణమేమిటి
? అసలు వీరసింహా రెడ్డి కుటుంబ కథ ఏమిటి? అతడ్ని ప్రేమించిన మరదలు మీనాక్షి పెళ్ళి లేకుండా కొడుకుని కని ఇస్తాంబుల్ లో ఎందుకు వుంటోంది? ఇప్పుడు తండ్రిని చంపిన మేనత్త భానుమతిని, మేన మామ ప్రతాప రెడ్డినీ జయసింహా రెడ్డి ఏం చేశాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

     బాలకృష్ణ చాలాసార్లు నటించినలాంటి కథే. రాయలసీమ ఫ్యాక్షన్ తో బాటు కుటుంబ కక్షల కథ. అఖండ కథ బాలకృష్ణ సీనియర్ పాత్ర స్పిరిచ్యువల్ కోణంతో నెక్స్ట్ లెవెల్లో అద్భుతాలు చేసింది. అలాటి అపూర్వపాత్ర ఈసారి బాలకృష్ణ సెలెక్టు చేసుకోలేదు. రేంజి తగ్గించుకుని రెండు రొటీన్ పాత్రల కథ చేశారు. ఫ్యాక్షన్ కథలు అవే పగలతో వుంటాయని సరిపెట్టుకున్నా, కుటుంబ కథతో సినిమా విజయం ఎంతవరకుంటుందనేది ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి వుంటుంది.  కుటుంబ కథే ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ కుటుంబ కథలో చెల్లెలి పాత్ర పగతో ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి వుంటుంది.

ఫస్టాఫ్ కథలో చెల్లెలు ఎందుకు పగబట్టిందనేది రివీల్ కాదు. ఆమె సవతి చెల్లెలు అని కూడా ఫస్టాఫ్ లో రివీల్ కాదు. సొంత చెల్లెలే అనుకుంటాం. దీంతో సొంత చెల్లెలు అన్నని పొడిచి చంపే ఇంటర్వెల్ సీను మాత్రం ఏ విధంగా చూసినా జస్టిఫై కాదు. బాక్సాఫీసు సెంటిమెంట్స్ కి వ్యతిరేకంగా వుంటుందిది. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో సవతి చెల్లెలని తెలుస్తుంది. సవతి చెల్లెలైనా అన్న మీద పగతో వుండొచ్చు
, చంపడమేమిటి? చివరికి తన కథ అలా ముగించుకోవడమేమిటి? దీన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకునేదాన్ని బట్టి వుంటుంది.

అన్న పాత్ర కూడా అలాగే వుంది. చెల్లెలితో నిశ్చితార్ధం జరిగిన వాణ్ణి తప్పు చేశాడని చెల్లెలి ముందే తన్ని అవమానిస్తే అతను ఉరేసుకున్నాడు. అంతగా అయితే అతణ్ణి గ్రామం నుంచి బహిష్కరించ వచ్చు. అతను ఉరేసుకోవడంతో అన్నని చంపెయ్యాలని కక్షగట్టి అన్న ప్రత్యర్ధిని పెళ్ళి చేసుకుంది. తన పెద్దరికం కాదు, ఇక్కడ చూడాల్సింది చెల్లెలి నిర్ణయాన్ని. అతను ఆమె కాబోయే భర్త. తప్పు చేసిన అతడితో ఏం నిర్ణయం తీసుకుంటావో తీసుకో అని ఆమెకే వదిలేయడం న్యాయం, పెద్దరికం. అన్నాచెల్లెళ్ళ కథ కన్విన్సింగ్ గా లేకపోవడంతో  సెకండాఫ్ మరీ దెబ్బతింది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఒకసారి
పెదరాయుడు చూసి వుంటే ఉచితానుచితాలు తెలిసేవి. ఫ్యాక్షన్ కథలు రాక్షసంగా వుండొచ్చు, కుటుంబ కథలు కాదు. మాఫియా సినిమాల్లో మాఫియాలు కుటుంబాల్ని ప్రేమిస్తారు>

పోతే కథలో భావోద్వేగాల్లేవు. ఫస్టాఫ్ లో వీరసింహా రెడ్డిని ఎందుకు చంపాలను
కుంటున్నారో చెప్పక పోవడంతో, కథ తెలియక పోవడంతో  వీర సింహారెడ్డి చేసే పోరాటాల్లో భావోద్వేగాలుండవు. సెకండాఫ్ లో చెల్లెలి కథ తెలిశాక దాంతో కూడా భావోద్వేగాలు పుట్టించలేక పోయారు. ఆమె ఎంత పగతో రగిలిపోయినా ఆ భావోద్వేగాలు కనెక్ట్ కావు. ఇక కొడుకు పాత్రతో భావోద్వేగాల సమస్యే లేదు. ఎందుకంటే తండ్రి చనిపోయిన నేపథ్యంలో సమస్యని ఎలా పరిష్కరించాలో గోల్ అతడికి లేదు. లేకపోతే మేనత్త తన కథ అలా ముగించుకోదు. మొత్తంగా ఏ ఎమోషనూ పలకని పొడిపొడి సినిమాలాగా సాగిపోతుంది.

నటనలు - సాంకేతికాలు

      బాలకృష్ణ సీనియర్ పాత్ర చాలాసార్లు చేసి వున్నదే. కాకపోతే కొత్త ఎనర్జీ నింపుకుని చేయడంతో సన్నివేశాలు పేలాయి. కొన్ని డైలాగులు కూడా పేల్చారు- సవాలు చేయకు, శ వాలు విసురుతా; మగతనం గురించి నువ్వు చెప్పకు, మొలతాళ్ళు నవ్వుతాయ్; ప్రజలు ఎంచుకున్న వెధవలు వాళ్ళు, గౌరవించాలి- వంటి డైలాగులు. కొన్ని రాజకీయ డైలాగులు కూడా ఎడాపెడా విసిరారు. యాక్షన్ సీన్స్ విజృంభించి చేశారుగానీ, అవేమీ ఆయన ఎలివేషన్స్ ని పెంచలేదు అఖండ లో లాగా. రామ్ లక్ష్మణ్, విజయ్ సమకూర్చిన పోరాటాలు రొటీన్ గానే వున్నాయి. అన్నీ ఒకలాగే అనిపిస్తాయి కూడా. అయితే ఎన్ని ఫైట్లు చేసినా కథలోంచి ఎమోషన్స్ పుట్టక పోవడంతో బాలకృష్ణ పడ్డ శ్రమ గిట్టుబాటు కాలేదు. సాంగ్స్ లో మాత్రం ఫుల్ మాస్ మసాలా దట్టించారు. ఫైట్స్ లో కంటే సాంగ్స్ లో చేసిన విన్యాసాలు ఫ్యాన్స్ ని శివాలెత్తిస్తాయి. ఎంతైనా బాలయ్య మాస్ హీరో. టైటిల్ కింద ట్యాగ్ లైన్ -గాడ్ ఆఫ్ మాసెస్ - కి నిలువెత్తు నిదర్శనం.  

జ్యూనియర్ పాత్రలో బాలకృష్ణ ఇస్తాంబుల్ దృశ్యాలు ఎంటర్ టైన్ చేస్తాయి సిల్లీ పాత్ర వేసిన శృతీ హాసన్ తో. శృతీ హాసన్ ఫస్టాఫ్ లో కొన్ని సీన్ల వరకే. సెకండాఫ్ లో దాదాపు గంటపాటు ఫ్లాష్ బ్యాకే వుండడంతో
, దాంతర్వాత క్లయిమాక్స్ సాంగ్ లో కన్పిస్తుంది- సిల్లీ డైలాగు కొట్టి.

మలయాళ నటి హనీరోజ్ బాలకృష్ణ తల్లి పాత్రలో
,ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ మరదలి పాత్రలో ఆకర్షిస్తుంది. సున్నితంగా నటిస్తుంది. కన్నడ విలన్ దునియా విజయ్ భీకర రూపంతో బాలకృష్ణకి తగ్గ బిల్డప్ ఇస్తాడు. అయితే చివరికి జోకర్ లా మారిపోతుందీ విలన్ పాత్ర. 

చెల్లెలి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక హైలైట్. ఆమె క్రూడ్ విలనిజాన్ని నిలబెట్టడానికి చేసిన కృషి
, నటన గుర్తుండి పోతాయి. అయితే ఆ చెల్లెలి పాత్ర భావోద్వేగాలకే జస్టిఫికేషన్ లేదు.

తమన్ పాటలు ఇదివరకే హిట్టయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా బలంగా ఇచ్చాడు. మ్యూజికల్ గా సినిమాకి లోతు లేకుండా చూసుకున్నాడు. అలాగే రిషీ పంజాబీ కెమెరా వర్క్ చెప్పుకోదగ్గది. ఫ్యాక్షన్ సీన్స్ కూడా లోకీ- డార్క్ సీన్లు తీయకుండా కలర్ఫుల్ గా తీశాడు. ప్రొడక్షన్ విలువలు రిచ్ గా వున్నాయి. చాలావరకూ సాయి మాధవ్  బుర్రా డైలాగులు బావున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వేగం వుంది. సెకండాఫ్ గంట పాటు ఫ్లాష్ బ్యాక్ మాత్రం 1980 ల నాటి సినిమాలని గుర్తుకు తెస్తుంది.
—సికిందర్