రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, జూన్ 2016, ఆదివారం

రివ్యూ :


రచన- దర్శకత్వం : శశి
తారాగణం : విజయ్ ఆంటోనీ, శాట్నా టైటస్, దీపా రామానుజం, ముత్తురామన్, భగవతీ పెరుమాళ్ తదితరులు.
సంగీతం : విజయ్ ఆంటోనీ, ఛాయాగ్రహణం : ప్రసన్న కుమార్
బ్యానర్ : విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోనీ
విడుదల : మే 13,  2016
***
     తమిళ ‘పిచ్చకారాన్’ తెలుగులోకి ‘బిచ్చగాడు’ గా డబ్ అయి గత ఆరు వారాలుగా

విజయవంతంగా భిక్షాటన చేస్తూ వసూళ్లు సాధించుకుంటోంది. దీనిముందు చాలా తెలుగు సినిమాలు వెలవెలబోయాయి, బోతున్నాయి, అవబోతున్నాయి. గత సంవత్సరం మార్చిలో ‘డాక్టర్ సలీం’ అనే తమిళ డబ్బింగ్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ తో ఇంకోసారి హీరోగా వచ్చాడు. హీరోగా 6 సినిమాలు,  గాయకుడిగా 23 సినిమాలు, సంగీత దర్శకుడిగా 31 సినిమాల అనుభవమున్న ఆంటోనీ, ‘బిచ్చగాడు’ డబ్బింగ్ తో తెలుగు బయ్యర్లకి కోటాను కోట్ల లాభాలు తెచ్చిపెట్టాడు.  

          ఇంతగా ఆకర్షిస్తున్న ‘బిచ్చగాడు’ ప్రత్యేకత ఏమిటంటే, ఇది పక్కా కమర్షియల్ సినిమానే, కానీ రొటీన్ కమర్షియల్ కాదు- సమాంతర సినిమాల్ని తలపించే వాస్తవికతా ధోరణులు కలగలిసిన కమర్షియల్. భిక్షాటన వృత్తి లాంటి  కమర్షియలేతర కథావస్తువుని తీసుకుని దానికి కమర్షియల్ హంగుల్ని అద్దడం. 2007 లో మధుర్  భండార్కర్ ఇలాటిదే సబ్జెక్టుతో హిందీలో ‘ట్రాఫిక్ సిగ్నల్’ అనే విజయవంతమైన క్రాసోవర్ సినిమా తీసిన విషయం గుర్తుండే వుంటుంది. ఐతే ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోని  ‘బిచ్చగాడు’ గా చూపిస్తూ ఇప్పుడు తమిళ దర్శకుడు శశి చూపిన ధైర్యానికి  ప్రేక్షకులనుంచి ఇంతగా ఆమోదం లభిస్తోందంటే, ప్రేక్షకులెప్పుడూ  మార్పుని ఆహ్వానిస్తారనే అర్ధం.

కథ 


       పారిశ్రామిక వేత్త భువనేశ్వరి (దీపా రామానుజం) ఏకైక కుమారుడు అరుణ్ (విజయ్ ఆంటోనీ) విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని వస్తాడు. ఇక తల్లి బాధ్యతలు అతడికి అప్పజెప్పి రిటైర్ అవుతుంది. అరుణ్ కో  పెద్దనాన్న (ముత్తురామన్) ఉంటాడు. తనకి తక్కువ ఆస్తి ఉందన్న ఏడ్పు ఇతడికి విపరీతంగా వుంటుంది. ఎప్పుడెప్పుడు అరుణ్  వాళ్ళ కంపెనీలు కొట్టేద్దామా అని చూస్తూంటాడు. ఒకరోజు ఆ  టెక్స్ టైల్ మిల్లులో భువనేశ్వరి తీవ్ర ప్రమాదానికి లోనై  కోమాలోకి వెళ్ళిపోతుంది. ఎలాటి వైద్యమూ ఆమె మీద పని చెయ్యదు. ఇలాటి పరిస్థితుల్లో  ఒక స్వామీజీ ఎదురై  ఒక దీక్ష చెయ్యాలని అరుణ్ కి చెప్తాడు. దాని ప్రకారం 48 రోజులు అన్నీ వదులుకుని అతను బిచ్చగాడిలా అడుక్కు తినాలి. తానెవరో ఎక్కడా బయట పడకూడదు. ఇలా చేస్తే తన తల్లి కోలుకుంటుందా అంటే, అది నమ్మకంగా చెప్పలేమంటాడు స్వామీజీ. అదృష్టాన్ని నమ్ముకుని చేయాల్సిందే నంటాడు.  


        తల్లిని బతికించుకోవడం కోసం అరుణ్  సర్వం త్యజించి బిచ్చగాడుగా మారతాడు. అడుక్కుంటూ అవమానాల పాలవుతాడు, తన్నులు తింటాడు. అన్నీ భరిస్తాడు. గుడి మెట్ల దగ్గర నల్గురు బిచ్చగాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళతో కూర్చుంటాడు. వాళ్ళు అడుక్కోవడంలో ట్రైనింగ్ ఇస్తారు. తమ ‘కొంప’ లో ఆశ్రయమిస్తారు. రోజులు గడుస్తూంటాయి.  అరుణ్ కి మహి (శాట్నా టైటస్) అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె పిజ్జా హౌస్ నడుపుతూంటుంది.  అతను బిచ్చగాడని తెలీక ప్రేమలో పడుతుంది. ఒకరాత్రి అరుణ్ ఒక మతిస్థిమితంలేని బిచ్చగత్తెని కొందరు రేప్ చేయబోతూంటే కాపాడి మెంటల్ ఆస్పత్రిలో చేరుస్తాడు. ఆ మెంటల్ ఆస్పత్రిలో రోగులమీద  రహస్యంగా ప్రయోగాలు  జరుగుతూంటాయి. ఆమె తప్పించుకుని అరుణ్ కీ విషయం చెప్తుంది. దీంతో ఆ గ్యాంగ్ అరుణ్ ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగుతుంది. వాళ్ళతో కుమ్మక్కయిన పోలీసులూ వెంటపడతారు. ఈ నేపధ్యంలో అరుణ్ తన 48 రోజుల దీక్ష ఎలా పూర్తిచేశాడు, ఇంకా అతడికి ఎదురైన అవరోధాలేమిటి, ఆఖరి క్షణాల్లో ముంచుకొచ్చిన ఉపద్రవాలేమిటీ  అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ
      తమిళ సినిమా కథకులు  కాల్పనిక కమర్షియల్ ఫార్ములా కుడ్యాల్ని కొంచెం వదులు చేసి, అందులో కాస్త పచ్చిగా వుండే  జీవితాన్ని నూరిపోయడానికి వెనుకాడరు. ఈ ప్రయత్నంలో ఆ పచ్చి జీవితం డాక్యుమెంటరీలా తయారైనా  సరే, రూల్స్ ని బ్రేక్ చేయడానికీ సందేహించరు. అయితే ఈ డాక్యుమెంటరీ పార్టు యాక్షన్ తో నిండిపోయినప్పుడు దీనికి ప్రేక్షకులకి నచ్చే షుగర్ కోటింగ్ పడిపోయినట్టే. అందుకే తెలుగులో కూడా ప్రేక్షకులు ఈ బిచ్చగాళ్ళ  దయనీయ లోకాన్ని చూడగల్గుతున్నారు. మళ్ళీ ఈ యాక్షన్ షుగర్ కోటింగ్ లో కామెడీలు, డాన్సులు, గ్లామర్  లాంటి కమర్షియల్ ఫార్ములా హంగులు పెట్టాలన్న ఆదుర్దాకి లోనుకాలేదు. ఇదంతా ఒకెత్తయితే- స్థూలంగా ఇది కమర్షియల్ సినిమానే అనుకుంటే- మదర్ సెంటిమెంటుతో ఇదేదో రొటీన్ కథకాదు. మదర్ కోమాలోకి వెళ్ళిపోతే ఆమెని బతికించుకోవడం కోసం, ఒక కోటీశ్వరుడైన కొడుకు బిచ్చమెత్తుకునే దీక్ష బూనే పాయింటే అనూహ్యమైనది. ఇదే మదర్ సెంటిమెంటుని కొత్తదారి పట్టించింది.  అనూహ్యమైన క పాయింట్లు ఎవరి బుర్రలోంచీ పుట్టుకురావు- సొంత బుర్రల్లో  ఎంతసేపూ చూసిన  హిట్టయిన సినిమాల పాయింట్లే పుడతాయి. బయటి ప్రపంచంలోకి బుర్రని తాటించినప్పుడు ఇలాటి కొత్త పాయింట్లు పరిచయమవుతాయి. ఈ సినిమా చివర్లో ఇది యదార్ధంగా జరిగిన సంఘటన అని వెల్లడించాడు దర్శకుడు.  ఆ యదార్థ సంఘటనకి ఇంకా పరిష్కారం దొరకనే లేదట. కానీ ఈ సంఘటనలో, హీరో చేసే ప్రయత్నంలో,  స్పిరిచ్యువల్ టచ్ కూడా వుంది. దీంతో  ప్రేక్షకుల ఆత్మిక దాహం కూడా తీరుతోంది. 

ఎవరెలా చేశారు

      హీరో విజయ్ ఆంటోనీ నటన అనే తన మూడో వ్యాపకంతో కూడా నిలదొ క్కుకోవడానికి తను ఎంచుకుంటున్న పాత్రలే కారణం. పాత్ర బలంగా, విలక్షణంగా,  కాస్త హ్యూమన్ టచ్ తో ఉండేలా చూసుకుంటూ పాత్రోచితంగా నటిస్తే ఏ  హీరో అయినా నిలదొక్కుకోగలడు. విషాద నేపధ్యమున్న ఈ పాత్రలోకి విజయ్ ఆంటోనీ ప్రవేశించిన తర్వాత, ఆద్యంతం ఆ నేపధ్య దృష్టితో  సీరియస్ మూడ్ తోనే నటించాడు తప్ప- పక్కకి జరిగి ఎలాటి కాలక్షేప విన్యాసాలకీ పాల్పపడలేదు. పావు గంటకో యాక్షన్ సీను చొప్పున ఫైట్లు చేసుకుపోతూంటే అదే కమర్షియల్ విలువ! పాత్రోచిత విన్యాసం! సినిమా ప్రారంభమైన పావు గంటకే తల్లిని బతికించు కోవడం కోసం బయల్దేరిన పాత్రగా  ప్రేక్షకులకి  అర్ధమైన తర్వాత, వాళ్ళు కూడా ఇంకెలాటి డాన్సులూ పాటలూ కామెడీ ఆశించలేరు. తల్లికోసం ఎన్ని బాధలైనా పడేందుకు సిద్ధపడే నటనతో  చాలా చోట్ల గుండెలు బరువెక్కిస్తాడు. అతను సహజ నటుడు. ప్రేక్షకులని అయస్కాంతంలా తనవైపు లాక్కోగల మాసాకర్షణ వున్న హీరో. 


        కొత్త హీరోయిన్ శాట్నా టైటస్ కూడా అతిసాధారణ అమ్మాయిలా వుండడం ఈ కథకి బాగా తోడ్పడింది. పైగా తను కూడా సహజంగా నటించెయ్య గలదనడానికి - విజయ్ కోటీశ్వరుడని తెలిశాక,  తన ముఖంలో కనబర్చే  రియాక్షన్ తాలూకు సైలెంట్ క్లోజప్ షాట్ ఒక్కటి చాలు.

        ఇక మిగతా పాత్రల్లో బిచ్చ గాళ్ళుగా నటించిన వాళ్ళు  కామెడీ లేని కొరత తీర్చడానికి ఎప్పుడూ రెడీ. దీంతో బాటు ముగ్గురు గ్యాంగ్ పదేపదే బిచ్చగాడి చేతిలో తన్నులు తిని పరువు పోగొట్టుకునే కామెడీకి అక్కడక్కడా తగుల్తూంటారు. తల్లిగా నటించిన దీపా రామానుజం మొదటి పది నిమిషాల తర్వాత కోమాలోనే కంటిన్యూ అయి చివర్లో చలనంలో కొస్తుంది. 

        పాటలు, కెమెరా వర్క్  తగినంత క్వాలిటీతో వున్నాయి. 1999లో వెంకటేష్ తో ‘శీను’  అనే తెలుగు తీసిన 7 సినిమాల దర్శకుడుగా శశికి,  సినిమా మాధ్యమం మీద మంచి పట్టువున్నట్టు గమనించవచ్చు.  


    ఇది రెగ్యులర్ స్క్రీన్ ప్లే కాదు. అయినా కమర్షియల్ స్క్రీన్ ప్లే. ఇందులో పాత్ర- ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య- ఆ సమస్యతో సంఘర్షణ- చివరికి పరిష్కారమనే రెగ్యులర్ నడకే  వుంటుంది గానీ, ఇక్కడ సమస్య విలన్ వల్ల ఏర్పడదు, పరిష్కారం కోసం విలన్ తో సంఘర్షించడు హీరో. మరి  విలన్ లేకుండా కథెలా అవుతుంది, ‘రాజాధి రాజా’ లోలాగా అదొక గాథ అవుతుందేమో అనొచ్చు. ఇక్కడ విలన్ మానవ రూపంలో లేడని మాత్రమే చెప్పడం. విధి రూపంలో వుంటుంది.  ఆ విధి తల్లికి సంక్రమించిన కోమా.

        అందుకే ఇది పాత్ర చేసే ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎదుర్కొనే కష్టాలు. కష్టాల్ని దాటుకుని  చేరుకునే గోల్. ఆ గోల్ 48 రోజుల బిచ్చమెత్తుకునే దీక్ష పూర్తి చేయడం. ఇందులో దీక్ష పూర్తి చేయకుండా అడ్డుకునే  విలన్లెవరూ లేరు. అతను  దీక్ష చేస్తున్నాడని ఎవరికీ తెలీదు. అలాగే తల్లిని కోమాలోనే చంపెయ్యాలని చూసే విలన్ ఎవడూ లేడు.  కాబట్టి అదృశ్యంగా వుండే విధిని ఓడించేందుకు హీరో చేసే ప్రయాణమే ఇది. మంచి కర్మలు చేస్తే విధి ఓడిపోతుందని చెప్పడమే. ఈ ప్రయాణంలో రకరకాల సందర్భాల్లో రకరకాల పాత్రలు స్టోరీ పాయింటుతో సంబంధం లేకుండా సమస్యల్లో ఇరికిస్తూంటాయి- హింసిస్తూంటాయి- ఓపికని పరీక్షిస్తూంటాయి. బిచ్చమడిగితే దొంగోడనుకుని కొట్టడం, బిచ్చ గత్తెని మెంటల్ ఆస్పత్రిలో చేర్పిస్తే అనుమానించి వెంటాడ్డం, తన దగ్గర డబ్బుందనుకుని దాడి చేసిన దొంగల్ని కొడితే, వాళ్ళు  పగబట్టి ఎల్ల వేళలా గొడవకి దిగడం లాంటివన్నీ విధి పెడుతున్న పరీక్షలే. 

        అంటే డాక్యుమెంటరీల్లో వాడే స్టార్ట్ అండ్ స్టాప్ నడక పద్ధతి అన్నమాట. ఒక సమస్య ఎత్తుకోవడం, దానికి పరిష్కారం చూపి మరింకో సమస్య ఎత్తుకోవడం...ఇలాగన్న మాట. ఈ పద్ధతిలో  ప్రధాన సమస్య చుట్టూ విషయం తిరగదు. అన్నీ విడివిడి సమస్యలే వుంటాయి. కానీ కమర్షియల్ సినిమాలకి ఒక ప్రధాన సమస్య వుండి  తీరాలి. అలా ఒక ప్రధాన సమస్య లేకుండా ఒక్కో విడి విడి సమస్యగా స్టార్ట్ అండ్ స్టాప్ డాక్యుమెంటరీ పద్ధతిలో చూపినందు వల్లే ‘సైజ్ జీరో’, ‘ఆటోనగర్ సూర్య’, ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’ లాంటి కమర్షియల్స్ ఫ్లాపయ్యాయి.  ఒక్కో సమస్యని చెప్పి ముగిస్తూ ఉండడమంటే చిన్న చిన్న కథలు చెప్పడమే. కానీ కథానికలతో సినిమా వర్కౌట్ కాదు. ఒకే పెద్ద కథ వుండాలి. ‘బిచ్చగాడు’ విషయానికొస్తే ఇక్కడ విడి విడి సమస్యలు- కష్టాలూ ఎదురై అవి ముగిసిపోతున్నా- నేపధ్యంలో ప్రధాన సమస్యంటూ ఒకటుంది. అది విధి- కోమా- తల్లి ని బతికించుకునే  ఒకే పెద్ద కథ, ఒక గోల్. కాబట్టి వర్కౌట్ అయ్యింది. 

        సాధారణంగా పది పదిహేను నిమిషాల్లో బిగినింగ్ ముగించి మిడిల్ కొచ్చే స్క్రీన్ ప్లేలు ఆ తర్వాత రెండు గంటలపాటు మిడిల్ ని లాగలేక చతికిల బడుతూంటాయి. ఎందుకని? అంతసేపూ ఏర్పాటు చేసిన  సమస్య చుట్టూ సంఘర్షణ మొనాటనీ బారిన పడ్డం వల్ల. దీన్ని ‘చక్కిలిగింత’ జయించలేక ఇంటర్వెల్ లోనే చేతులెత్తేస్తే, ‘దొంగాట’ గజిబిజి చేసుకుంటే, ‘క్షణం’ భేషుగ్గా జయించేసింది. కారణం, ఇందులో  బిగినింగ్ పదినిమిషాలే చూపినా ఆ పది నిమిషాల బిగినింగ్ లోనే  అంతర్లీనంగా సెటప్ చేసిన ఒక ప్రధాన  అంశముంది ఆఫ్ స్క్రీన్ లో. దాన్ని  పే-ఆఫ్ చేయక తప్పదు. ఆ ప్రధానాంశం హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్. దీన్ని మిడిల్ విభాగంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల ద్వారా పే- ఆఫ్ చేస్తూ పోయారు. దీంతో ఈ మిడిల్లో హీరో పాపని వెతికే సమస్యతో రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగే మిడిల్ మొనాటనీ బారిన పడలేదు. 

        ‘బిచ్చగాడు’ లో మొదటి పది నిమిషాల్లో బిగినింగ్ ముగుస్తూ హీరో బిచ్చగాడుగా మారతాడు. అక్కడ్నించీ  దాదాపు రెండు గంటల సుదీర్ఘ షో సమయాన్ని  ఈ మిడిల్ విభాగం ఆక్రమిస్తుంది. అయితే ఎంత సేపని దీన్ని హీరో కష్టాలతో భర్తీ చేస్తారు. అది మొనాటనీ బారిన పడుతుంది. అందుకే బిగినింగ్ లో  సెటప్ చేసిన అంశాల్ని పే- ఆఫ్ చేసే సీన్లు కూడా మిడిల్ లో కలుపుకుంటూ పోయారు. దీని వల్ల హీరో కష్టాల కథకి మొనాటనీ జాడ్యం పట్టుకోలేదు. బిగినింగ్ లో సెటప్ చేసిన అంశాలు : 1. గ్రూపాఫ్ కంపెనీల  అధిపతిగా తల్లి భువనేశ్వరి గొప్పతనం, 2. కొన్ని కారణాల వల్ల  కంపెనీలని విక్రయించాలని హీరో నిర్ణయించడం, 3. కంపెనీలని  కొట్టేయాలని హీరో పెదనాన్న కుట్రలు పన్నడం మొదలైనవి.

        వీటిని మిడిల్ లో పే-ఆఫ్ చేసుకుంటూ పోయారు. ఇలా చేయవచ్చా అంటే, తప్పకుండా చేయవచ్చు. ఎందుకంటే ‘దొంగాట’ లో లాగా ఇవి మిడిల్ లో పుట్టుకొచ్చిన  అంశాలు కావు. బిగినింగ్ లోనే పుట్టి ముగింపు (పే-ఆఫ్)  కోసం ఎదురు చూస్తున్న సెటప్స్. ‘దొంగాట’ బిగినింగ్ లో పుట్టాల్సిన బిజినెస్ బిగినింగ్ లో పుట్టకుండా మిడిల్లో పుట్టుకొచ్చినందుకే బిగినింగ్- మిడిల్ గజిబిజి అయిపోయాయి. అలాగే ఇటీవలి ‘ఒక్క  అమ్మాయి తప్ప’ లో కూడా బిగినింగ్, మిడిల్  బిజినెస్ లు రెండూ కలగలిసిపోయి గందరగోళ మైపోయింది.  ఈ రెండు సినిమాలూ,  బిచ్చగాడూ పక్కపక్కన పెట్టుకుని చూస్తే  ఈ తేడా తెలుస్తుంది. సినిమాలెందుకు ఫ్లాపవుతాయంటే, ఇలాటి విషయాల్లో సూత్రాలు పాటించ నందుకే.  కానీ  సూత్రాలంటే చాలా మంది దర్శకులకి ఇప్పటికీ – ఇంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో కూడా  - అజ్ఞానంతో కూడుకున్న ఎలర్జీ.

        ‘ బిచ్చగాడు’ బిగినింగ్లో సెటప్ చేసిన మూడు పాయింట్లనీ మిడిల్లో పే- ఆఫ్ చేసుకుంటూ పోతే ఒక సమస్య పరిష్కారమైపోయింది. కోమాలో వున్న తల్లి భువనేశ్వరి గొప్పతనాన్ని చవిచూసిన కార్మికులు,  ఆవిడ కోలుకోవాలని ఊరేగిపుగా రావడం, నిరాహార దీక్షలు చేయడం, బిచ్చమెత్తుకుంటూ వాళ్ళని చూసి, వాళ్లతో మాట్లాడిన అరుణ్ ఇక కంపెనీలని విక్రయించి వీళ్ళకి అన్యాయం చేయకూడదని మనసు మార్చుకోవడం, దీంతో పెదనాన్న కుట్రలు ఆగిపోవడం...ఒక చైన్ రియాక్షన్ లా జరిగిపోతాయి. ఇందుకే కథని కూర్చ కూడదంటారు. కథని అల్లాలి. ఆ అల్లిక ఇంత అందంగా  కనపడాలి. 

        ఇక హీరోయిన్ పాత్ర ప్రవేశం ఇక్కడ బిగినింగ్ లోనే ఇరికిస్తూ జరగాలని లేదు. మిడిల్లో జరుగుతుంది. ఈమె పాత్రకి మూడు కుదుపు లిచ్చారు : బిచ్చగాడని తెలీక ప్రేమించడం, బిచ్చగాడని తెలిశాక సందిగ్ధంలో పడ్డం, ఫలానా కోటీశ్వరుడని తెలిశాక అవాక్కవడం. ఈ మూడు కుదుపుల మధ్యా వాటి తాలూకు కథనం –ప్రేమాయణం కూడా మొనాటనీ బారిన పడకుండా తప్పించుకున్నాయి.


        సుదీర్ఘమైన మిడిల్ విభాగంలో బిగినింగ్ సెటప్స్ ని పే- ఆఫ్ చేసుకుంటూ పోవడం వల్ల,  కథలో  హీరో పాత్ర ప్రయాణానికి ప్రాణం పోసినట్టయ్యింది.


-సికిందర్