మిడిల్ -1
కథనం :
ఇటీవలి తన గతాన్నీ, ఇంకా జీవితపు
లోతట్టు గతాన్నీ జంక్ యార్డులో భూస్థాపితం చేసేసి
ఇక కొత్త జీవితాన్ని వూహించుకుంటూ డెబొరా పనిచేస్తున్న ‘బో డైనర్’ కొస్తాడు బేబీ. డెబొరాని
ప్రేమలో పడెయ్యాలని ఎలాటి వెర్రి వేషాలూ వేయడు. నీటుగా బిహేవ్ చేస్తాడు. తన మదర్
లాగా డెబొరా సింగర్. పైగా తన మదర్ ఈ రెస్టారెంట్ లోనే పని చేసింది. తను ఇక్కడికే
రావడానికి కారణమిదే. మొదటిసారి డెబొరా అతడి పేరడుగుతుంది. అతను కూడా మొదటిసారి ఆమె
పేరు అడిగి తెలుసుకుంటాడు. తను బేబీ, ఈమె డెబ్బీ. అన్నట్టు బేబీ మీద ఎన్ని పాటలొచ్చాయి,
డెబొరా మీద ఎన్ని పాటలు వచ్చాయీ తెలుసుకుందామనుకుంటారు. మ్యూజిక్ షాప్ కెళ్ళి డెబొరా మీద పాట వెతికి ఆమెకి విన్పిస్తాడు.
అదే
పాట ఫ్లాట్ కెళ్ళి పెట్టుకుని డాన్స్ చేస్తాడు. తండ్రి జోసెఫ్ టీవీలో న్యూస్ చూస్తూంటాడు.
గాయపడిన ఆ నేవీ ఉద్యోగి మాట్లాడుతూంటాడు. తన నేరానికి సంబంధించిన ఈ వార్త చూసి
బేబీ చానెల్ మార్చేస్తాడు. నోట్ల కట్ట తీసి ‘సీక్రెట్ లాకర్’ లో పడేస్తాడు. ఇది
చూసిన జోసెఫ్ బేబీకి ఒక బ్రోషర్ చూపిస్తాడు. ఆ గుడ్ ఫెల్లాస్ పిజ్జా బ్రోషర్ చూసి -
నీకు పిజ్జా తినాలన్పిస్తోందా? - అని సైన్
లాంగ్వేజిలో అడుగుతాడు బేబీ. నాకు పిజ్జా తినాలనిపించడం కాదురా, నువ్వెళ్ళి పిజ్జా
డెలివరీ బాయ్ గా చేరు - అని సైన్ లాంగ్వేజిలో మందలిస్తాడు జోసెఫ్. వెళ్లి గుడ్ ఫెల్లాస్
లో పిజ్జా డెలివరీ డ్రైవర్ గా చేరతాడు బేబీ.
సమస్య ప్రారంభం :
ఆ రాత్రి ఒక రిచ్ రెస్టారెంట్ కి డెబ్బీని తీసికెళ్ళి
ఆమెతో కలిసి డ్రింక్ చేస్తాడు బేబీ. కబుర్లు చెప్పుకుంటూ వుండగా, అదే రెస్టారెంట్
లో వున్న డాక్ తనని గమనిస్తూ వుండడాన్ని చూస్తాడు. లేచి గబగబా వెళ్లి కలుస్తాడు.
మనం చేయాల్సిన దోపిడీ జాబ్స్ ఇంకా చాలా
వున్నాయి, నువ్వు పన్లోకి రావాలి - అంటాడు డాక్. ఇక రాలేనంటాడు బేబీ. నీ గర్ల్
ఫ్రెండ్ క్షేమంగా వుండాలని లేదా ఏమిటి నీకు - అని బెదిరిస్తాడు డాక్. ఈ
బెదిరింపుకి ఏమీ చేయలేక సరేనంటాడు బేబీ. అప్పుడామెని ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు
కిస్ పెడుతుంది.
మర్నాడు
బేబీని పోస్టాఫీసుకి తీసికెళ్తాడు డాక్. అక్కడ రెక్కీ నిర్వహించాలంటాడు. ఎన్ని కెమెరాలున్నాయి,
ఎక్కడెక్కడున్నాయి, ఎన్ని కౌంటర్స్ ఓపెన్ వున్నాయి, ఎందరు టెల్లర్స్ వున్నారు, ఎందరు గార్డ్స్ వున్నారు చూసి
రమ్మంటాడు. అనుమానాస్పదంగా కన్పించకుండా ఎనిమిదేళ్ళ తన మేనల్లుడిని వెంట తీసుకుపొమ్మంటాడు.
వాడితో వెళ్లి రెక్కీ నిర్వహించి వచ్చి
సమాచారమిస్తాడు బేబీ.
ఇక
గోడౌన్ కి తీసికెళ్ళి పాత గ్యాంగ్ నే
చూపిస్తాడు డాక్. బడ్డీ, బ్యాట్స్, డార్లింగ్. బడ్డీ, డార్లింగ్ లు పెళ్లి
చేసుకున్నారు. డాక్ పోస్టాఫీస్ జాబ్ వివరిస్తాడు. ప్రభుత్వ వెల్ఫేర్ స్కీములో
భాగంగా ఆ నెల పంపే మనియార్డర్ల సొమ్ము దోపిడీ జాబ్. 250 మనీయార్డర్ల కవర్లు, ఒక్కో
కవర్లో 700 డాలర్లు, మొత్తం విలువ 175,000 డాలర్లు. రేపు మధ్యాహ్నం దోచుకుని
రావాలి. అన్ని జాగ్రత్తలూ చెప్తాడు.
ప్లాన్ ఉల్టా పల్టా :
ఆ రాత్రి డెబ్బీకి కాల్ చేసి లాంగ్ డ్రైవ్ ని ప్రపోజ్ చేస్తాడు బేబీ. ఆమె సరేనంటుంది. అదే నైట్ బుచర్ అనే గన్ డీలర్ దగ్గర ఆయుధాలు కలెక్ట్ చేసుకోమంటాడు డాక్. బేబీ గ్యాంగ్ ముగ్గుర్నీ తీసుకుని బయల్దేరతాడు. మధ్యలో బ్యాట్స్ దిగి ఫుడ్ కొనుక్కు రావడానికి వెళ్తాడు. అప్పుడు అతడి మీద బడ్డీకి కంప్లెయింట్ చేస్తుంది డార్లింగ్. వీడు తనని అదోలా చూస్తున్నాడని. లేపెయ్యమంటావా అంటాడు బడ్డీ. బ్యాట్స్ దొంగిలించిన ఫుడ్డుతో వస్తాడు.
బేబీ
వాళ్ళని బుచర్ గోడౌన్ కి తీసికెళ్తాడు. స్పెక్ట్స్ పెట్టుకుని, ఇయర్ ఫోన్స్ తో వున్న
బేబీని చూసి - ఎవడు వీడు? - అంటాడు బుచర్ అనుచరుడు. మా బేబీ బాయ్ - అంటాడు బ్యాట్స్.
చెవులకి ఈ తీగెలేంటి? పోలీసోడా? - అడుగుతాడు బుచర్ అనుచరుడు. ట్యూన్సు....వాడి
ట్యూన్సు - అంటాడు బ్యాట్స్. నువ్వు పోలీసువి
కాదంటావా? - బేబీనే అడుగుతాడు అనుచరుడు. నేను
పోలీసుని కాదనే అంటాను - అంటాడు బేబీ. బిజినెస్ లోకి దిగి చద్దామా? - అంటాడు బడ్డీ విసుగ్గా.
టార్పాలిన్
లాగి అవతల పడేసి రకరకాల ఆయుధాలు, బాంబులూ చూపిస్తూ - జంటిల్మెన్ అండ్ లేడీస్...వేడి
వేడిగా ఫ్రెష్ గా వచ్చాయి...ఏవి కావాలంటే అవి ఏరుకోండి...పేమెంట్ ఎలా చేస్తారు? – అనడుగుతాడు
బుచర్.
ఆ
ఆయుధాల పెట్టెల మీద ఎపిడి అని అక్షరాలుండడం చూసి - బుల్లెట్స్ తో పేమెంట్
చేయొచ్చా? - అంటాడు బ్యాట్స్. ఎలా? – అంటాడు బ్యాట్స్. ఇలా! - అని గన్ తీసి మొహం మీద పేలుస్తాడు బ్యాట్స్. కింద
పడి చచ్చిపోతాడు బుచర్.
వెంటనే
బుచర్ అనుచరులు రియాక్ట్ అయి ఫైర్ చేస్తారు. పెట్టెల్లోని ఆయుధాలందు
కుని బేబీ సహా బడ్డీ, బ్యాట్స్, డార్లింగ్ లు ఎదురు కాల్పులు జరుపుతారు. అసలు
నువ్వెందుకు వాణ్ణి షూట్ చేశావని బ్యాట్స్ మీద అరుస్తాడు బడ్డీ. వీళ్ళు పోలీసులని తెలియట్లేదా
ఎపిడి అక్షరాలూ?- అంటాడు బ్యాట్స్. అట్లాంటా పోలీస్ డిపార్ట్ మెంట్. బుచర్
అనుచరులందర్నీ చంపేసి పారిపోతారు...
***
ఈ మిడిల్ -1 కథనం 20 సీన్లతో వుంది. 25 నిమిషాల నిడివి. బుచర్
ని కలవమని డాక్ చెప్పడం ఇంటర్వెల్ కి దారితీసే పించ్ -1 సీను. మిడిల్ -1, మిడిల్ –
2 లు రూలు ప్రకారం స్క్రీన్ ప్లేలో సమస్యతో సంఘర్షించే ఏరియా. కథానాయకుడు,
ప్రతినాయకుడుల మధ్య యాక్షన్ రియాక్షన్ల కథనపు సెగ్మెంట్. ఇదీ అలవాటుగా మనం చూసేది.
దీన్ని మార్చేశారు.
బిగినింగ్
లో ప్లాట్ పాయింట్ వరకూ కథానాయకుడైన బేబీది, ప్రతినాయకుడైన డాక్ తో బాకీ తీర్చే ప్రీ పెయిడ్
గోల్ అని చెప్పుకున్నాం. ఈ ప్రీ పెయిడ్ గోల్ పూర్తయ్యాక అతడికింకే సమస్యా లేదు. రీచార్జి చేసుకుని బిగినింగ్ లో లీడిచ్చిన
గర్ల్ ఫ్రెండ్ తో రోమాన్స్ సాగించుకోవడమే, ఆమెతో లాంగ్ డ్రైవ్ వెళ్ళడమే వున్నాయి
ఒక ఫ్రీ బర్డ్ గా. అందుకని ఓ పది నిముషాలు డెబ్బీతో పరిచయం ప్రేమగా మారే సీన్లు
వస్తాయి. తను వృత్తిని మార్చుకుని పిజ్జా డెలివరీ డ్రైవర్ గా చేరే సీన్లూ వస్తాయి.
ఇలా హాయిగా గడిచిపోవడమేనా మిడిల్ బిజినెస్ అంటే? ఎక్కడో ఒక చోట సమస్య మొదలవ్వాలి. ఏదోవొక
గోల్ హీరోకి ఏర్పడాలి. లేకపోతే కథ పుట్టదు, సాగదు.
మిడిల్
ఏరియాలో మందు పాతరలా తెలియని సమస్య దాగి వుండొచ్చు. మిడిల్ అంటేనే సబ్ కాన్షస్
మైండ్. సబ్ కాన్షస్ మైండ్ అంటేనే నిగూఢ రహస్యాల సముద్రం. ఎక్కడే వాస్తవాలు, జీవిత
సత్యాలు, ఎదుర్కోవాల్సిన నైతిక విలువలుంటాయో తెలీదు. దిగి ఈత కొడితేనే తెలుస్తాయి.
మామూలుగా, రొటీన్ గా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకి పోస్ట్ పెయిడ్ గోల్
ఏర్పడినప్పుడు, ఆ గోల్ ని సాధించేందుకు తెలిసి మిడిల్ అనే మహాసముద్రంలోకి దూకి సంఘర్షిస్తాడు.
తెలియక దూకితే? రొటీన్ ని బద్దలు కొడితే?
ఇదే
ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ తో క్రియేటివిటీ. ఇందుకే మిడిల్ ఇంత డిఫరెంట్, ఇంత ఫ్రెష్.
బాకీ తీర్చే గోల్ పూర్తయిన బేబీ ఫ్రీ బర్డ్ లా ముందుకెళ్ళి పోతున్నాడు. ఇప్పుడే
సమస్యలూ లేవు. డెబ్బీతో లైఫ్ ని ఎంజాయ్ చేయడమే. దీనికో ప్లానింగ్ లేదు, గోల్ వుంటేనే
ప్లానింగ్. ఏదీ ప్లాన్ చేయవద్దంటాడు ఓషో రజనీష్ కూడా.
ప్లాన్
చేస్తే ఫ్రస్ట్రేషన్ కి లోనవుతావంటాడు. ప్లాన్ చేస్తే ఏవో ఆశలు పెట్టుకుంటావ్, ఆ
ఆశలు తీరడం కోసం పనిచేస్తావ్. ఆశలే ఫ్రస్ట్రేషన్ కి మూలం, ప్లానింగే ఆశలకి మూలం. కాబట్టి ఈ విష వలయంలో పడవద్దంటాడు.
పని చేసుకుంటూ పో, ప్లానింగ్ ప్రకృతి చూసుకుంటుంది. నీ పనికి నీకేది ఎలా ఇవ్వాలో
ప్రకృతికి బాగా తెలుసు. ప్రకృతి నీకిచ్చేది పరిపూర్ణంగా చాలా బ్యూటిఫుల్ గా అన్పిస్తుంది.
ఎందుకంటే నువ్వుముందు ఎలాటి ఆశలూ పెట్టుకోలేదు. ఇలాకాక నువ్వు ప్రకృతికి అడ్డుపడి
అపసోపాలూపడి నువ్వనుకున్నది సాధించినా, ఆశించినట్టు లేక నీకే అసంతృప్తిగా వుంటుంది. కాబట్టి ప్లాన్
చేయవద్దంటాడు. ప్లానింగ్ ని ప్రకృతికి వదిలేయమంటాడు...
బేబీ
కూడా ఏ ప్లానూ గోలూ లేకుండా జామ్మంటూ వెళ్ళిపోతున్నాడు. కుదిరితే డెబ్బీతో
గుప్పెడు ప్రేమ, కుదరకపోతే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇంకో ప్రేమ. బేబీగాడికి
కైసాభీ చల్తాహై. అయితే ఒకటుంది. పనితో ప్లానింగ్ పెట్టుకోవద్దన్నారని అడ్డమైన
పనులూ చేస్తే కాదు. చేస్తున్న పని దోషం లేనిదై కూడా వుండాలి. అప్పుడే ప్రకృతి
సహకరిస్తుంది. బేబీ డ్రైవర్ డాక్ బాకీ తీర్చినంత మాత్రానా ఇప్పుడు చేస్తున్న పని
దోషం లేనిదై పోయిందా? చట్టం సంగతి? చట్టానికి పడ్డ బాకీ సంగతి? డాక్ తో కలిసి నేరాలు చేసి, ఇప్పుడా వృత్తి
మానేసి మంచిగా బతుకుతానంటే ఎలా? ముందు చేసిన నేరాలకి శిక్ష అనుభవించి, చట్టంబాకీ
తీర్చుకుంటేనే కదా ఆశిస్తున్న మంచి జీవితానికి అర్ధంపర్ధం. కాబట్టి బేబీ తలపెట్టిన
పనికి ప్రకృతి చట్టం రూపంలో ఎంటరై తన ప్లానింగ్ తను చేసుకుపోతోంది - బేబీకి లాంగ్ డ్రైవ్ కాదు, ముందు బాగా లాంగ్
జైలు జీవితం, ఆ తర్వాతే జవరాలి ఆధరాల తేనియల పానీయాలు - ఎరోటిక్ డ్రింక్!
ప్రేమలో
కూడా దోషంతో వున్నాడు. తన నేర జీవితాన్ని ఆమెనుంచి దాచాడు. ఇది కూడా తేలాలి. ఈ
నేపధ్యంలోనే మిడిల్ ప్రయాణంలో మందు పాతరలు ఏర్పాటవు తున్నాయి. అవి మళ్ళీ డాక్
రూపంలో పైకి తేలాయి. బేబీ కి గర్ల్ ఫ్రెండ్ వుండడం చూసి, లేని ఆలోచనలు డాక్ లో మొలకెత్తాయి. ఇప్పుడు
వీణ్ణి బ్లాక్ మెయిల్ చేసి వాడుకోవచ్చు. అలా డెబ్బీకి హాని చేస్తానని బెదిరించి
బేబీని లొంగదీసుకున్నాడు.
మామూలుగా
బేబీ మారాలనుకుంటే డాక్ బాకీ తీర్చేశాక, పోలీసులకి లొంగి పోవచ్చు. అలా లొంగిపోతే డాక్
ని కూడా బయట పెట్టక తప్పదు. అప్పుడు డాక్ ఖచ్చితంగా చంపేస్తాడు. కానీ చేసిన నేరాలకి
బేబీతో బాటు డాక్ కి కూడా శిక్ష పడాల్సిందే. బేబీ ఇదంతా ఆలోచించలేదు. డెబ్బీతో లైఫ్
కోసమే ప్రయాణం కట్టాడు. కానీ పరిస్థితులు ఆటోమేటిగ్గా ఆ వైపుకే దారితీయిస్తాయి...ఇది
ప్రకృతి న్యాయం. బేబీని మళ్ళీ ఇరికించి బేబీతో బాటు డాక్ ని కూడా శిక్షించే పని పూర్తి
చేయడం. వీలయితే బేబీ చేతే డాక్ ని శిక్షించడం. ఆ తర్వాత బేబీని చట్ట పరిధిలోకి తేవడం.
దీనికి డెబ్బీని ఎరగా వేయడం. బ్యాక్ గ్రౌండ్ లో ఈ ప్లానింగ్ అంతా చేసుకుపోతోంది ప్రకృతి.
ఒకసారి నేర ప్రపంచంలోకి ఎంటరయ్యాక శిక్షతోనే అందులోంచి విముక్తి. ఇది బేబీకి తెలియడం
లేదు. జీవితం అర్ధంగావడం లేదనీ, తమకే ఇలా ఎందుకు జరుగుతోందనీ వాపోయే మనుషులుంటారు.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో ఎన్టీఆర్ పాత్ర కూడా ఇలాగే వాపోతుంది (ఇది ఎన్టీఆర్ పాత్రకి
చేసిన అన్యాయపు కల్పన. అన్ని పౌరాణిక పాత్రలేసి, అంత జీవితానుభవాన్ని గడించిన ఎన్టీఆర్
తన జీవితం తనకి అర్ధంగావడం లేదని వాపోవడమా? ఈ కల్పన ఎన్టీఆర్ కే అవమానం).
జీవితం
అర్ధంగాక పోవడమేమిటి, తమకే ఇలా ఎందుకు జరుగుతోందనీ వాపోవడ మేమిటి - బుద్ధిని వాడి ఒకసారి
వెనక చేసిన చేష్టలు గుర్తు చేసుకుంటే అన్నీ అర్ధమవుతాయి. ఎనకటి చేష్టలని బట్టే ఎకసక్కెంగా తయారైన జీవితం. ఎవ్వరూ కారకులు కాదు. తాము పత్తిత్తులు
అనుకుంటేనే అర్ధంగాదు జీవితం. బేబీగాడి ఇప్పటి పరిస్థితి ఇదే.
మరిప్పుడు
బేబీ డ్రైవర్ గోల్ ఏమిటి? పోస్ట్ పెయిడ్ గోల్? ఏదైతే ఎరగా మారిందో దాన్ని కాపాడుకోవడమే
గోల్. డెబ్బీని ఇందులోంచి కాపాడుకోవడమే గోల్. బేబీ ప్రయాణిస్తున్న మిడిల్ లో హిడెన్
గోల్.
***
స్ట్రక్చర్ తో ఈ క్రియేటివిటీలో అర్ధం జేసుకోవాల్సిందేమిటంటే,
ప్లాట్ పాయింట్ వన్ లో ప్రీపెయిడ్ గోల్ పూర్తయినా, ఆ తర్వాత మిడిల్ లో ఎక్కడో దాగి పోస్ట్ పెయిడ్ గోల్
వుంటుందనీ. ప్రీ పెయిడ్ గోల్ తాత్కాలికమే. పోస్ట్ పెయిడ్ గోల్ స్క్రీన్ ప్లేలకి శాశ్వత
టూల్. ఇది లేకపోతే స్క్రీన్ ప్లే లేదు. కాకపోతే ఈ క్రియేటివిటీలో ప్లాట్ పాయింట్ వన్
నుంచి దూరం జరిగి దాక్కుని వుంది. అది ఝలక్ ఇస్తూ ఎప్పుడో బయటపడుతుంది. డెబ్బీ తో రోమాన్స్
లో వున్న బేబీకి డాక్ ఇచ్చిన ఝలక్కే ఇప్పుడామెని కాపాడుకోవాలన్న గోల్. ఇందుకోసం ముందు
డాక్ కి లొంగిపోయాడు. ఇక చట్టంతో, ప్రేమతో దోషాల్ని కడిగేసుకునే వైపుకు పాత్ర ప్రయాణం.
పోస్టాఫీసు
జాబ్ అప్పగించాడు డాక్. దీనికి ఆయుధాల కోసం బుచర్ దగ్గరి కెళ్ళినప్పుడు అంతా తలకిందులైంది.
బుచర్ అండ్ గ్యాంగ్ పోలీసులేనని కనిపెట్టిన బడ్డీ కాల్చి పారేశాడు. దీంతో ఆత్మరక్షణకోసం
బేబీ కూడా కాల్పులు మొదలెట్టాడు. పోలీసులందర్నీ చంపేశాడు. ఇప్పుడు డైరెక్టుగా చట్టంతోనే
(పోలీసులతోనే) ఘోరంగా ఇరుక్కున్నాడు బేబీ డ్రైవర్!
―సికిందర్