రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, March 31, 2019

805 : స్క్రీన్ ప్లే సంగతులు



     
     చాలా కాలం తర్వాత తెలుగు రోమాంటిక్ కామెడీకి / డ్రామాకి  స్క్రీన్ ప్లే సంగతులు రాయబోతే అదే పరిస్థితి. అదే సినిమా. అవే సంగతులు. అదే వదలని అనారోగ్యం. ఏ మాత్రం మార్పు లేదు, రాదు కూడా. ప్రేమ సినిమా అనగానే ఇంకా ఇరవై ఏళ్ళనాటి ‘నువ్వే కావాలి’ మార్కు ప్రేమ తీసేయడం. దీనికి మానసిక కారణాలున్నాయి. ఇప్పటి నయా మేకర్లు వాళ్ళ టేనేజిలో ఏవైతే చూస్తూ పెరిగారో ఆ టీనేజీ ప్రేమ సినిమాలు తప్ప వేరే వూహించలేని క్రియేటివ్ బానిసత్వానికి లోనయ్యారు. ఖర్మకాలి తమ కింది తరానికి చెందిన మేకర్ల లాగా అన్ని జానర్ల సినిమాలు చూస్తూ పెరగలేదు. అప్పట్లో భక్తి నుంచి చరిత్ర దాకా, కుటుంబం నుంచి సామాజికం దాకా, హాస్యం నుంచీ హార్రర్ దాకా, లవ్ నుంచీ ట్రాజడీ దాకా, క్రైం నుంచీ కౌబాయ్ దాకా అన్ని రకాల  సినిమాలూ తీసేవాళ్ళు. అవి చూస్తూ పెరిగిన అప్పటి మేకర్లు అటువంటి వైవిధ్యాన్ని ప్రదర్శించే వాళ్ళు. కొత్తతరం వచ్చేసరికి ఈ వైవిధ్యమంతా ఎగిరిపోయి సినిమా అంటే కేవలం టీనేజి ప్రేమ సినిమాలొక్కటే అన్నట్టు తయారయ్యింది. ఇవే చూస్తూ పెరిగి ఇవే తీయాలి కాబోలని నయా మేకర్లు వారం వారం  ఇప్పటికీ అవే రోమాంటిక్ కామెడీలు, డ్రామాలూ తీసి మీద పడేస్తున్నారు.


          తీస్తే అపార్ధాలతో ప్రేమికులు విడిపోవడం, లేదంటే ప్రేమని వెల్లడించలేక పోవడం, ఇంకా లేదంటే  ముక్కోణ ప్రేమ! ఈ మూడు మూస ఫార్ములాలే ప్రేమ సినిమాలు ఈ ఇంటర్నెట్ రోజుల్లో కూడా. ప్రేక్షకులు ఉత్త దద్దమ్మలనుకుంటున్నారు. ఇవే తీసే నిర్మాతలు కూడా ఇలాగే తయారయ్యారు. వారంవారం రెండు చేతులూ వాటంగా కాల్చుకుని హాహాకారాలు చేస్తూ వెళ్ళిపోవడం. ఇవే తీసే నయా మేకర్లు - ఇలాగే చేతులు కాల్చుకునే నిర్మాతలు... ఇదే ఇప్పటికి కూడా హిట్ కాంబినేషన్. వీళ్ళూ వీళ్ళూ ఏం చేసుకుంటే మనకెందుకని ప్రేక్షకులు కూడా వీళ్ళ సినిమాలకి డుమ్మాకొట్టి ఇంట్లో కూర్చుంటున్నారు. ప్రేమ సినిమాలు థియేటర్లలో, ప్రేక్షకులు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో. 

          ఈ నయా మేకర్లు వాళ్ళ టీనేజీ దగ్గరే ఆగిపోయి అవే ప్రేమ సినిమాలు అలాగే తీస్తూంటే, వీళ్ళతో పాటే పెరిగిన టీనేజీ ప్రేక్షకులు, ఆ తర్వాత టీనేజీ ప్రేక్షకులు, ఇంకా తర్వాత టీనేజీ ప్రేక్షకులూ వాళ్ళవాళ్ళ సాధనాలు మార్చుకుంటూ కాలంలో చాలా చాలా ముందుకెళ్ళి పోయారు. సినిమా స్క్రీన్ల నుంచి టీవీ స్క్రీన్ లకి, టీవీ స్క్రీన్ ల నుంచి కంప్యూటర్ స్క్రీన్లకి, కంప్యూటర్ స్క్రీన్ ల నుంచి స్మార్ట్ ఫోన్ల స్క్రీన్ ల కొచ్చి -  ఎడా పెడా ఎలా మారుతున్న ప్రపంచాన్ని అలా మారుతున్నట్టే హాట్ హాట్ గా చూసి పారేస్తున్నారు. గ్లోబల్  ప్రేక్షకులై పోతున్నారు. నయా మేకర్లు మాత్రం నడుం వంగిపోయిన ముసలమ్మల్లా ముక్కిపోయిన భావాలతో గల్లీ సినిమాలు తీస్తూ అలాగే నవ్వుల పాలవుతున్నారు. గ్లోబల్ ప్రేక్షకుడు - గల్లీ దర్శకుడు. వీళ్ళిద్దరికీ ఎలా పొసగుతుంది? 

          ఇలా ‘సూర్యకాంతం’ అనే ముక్కోణ ప్రేమకి ఇప్పటి మార్కెట్ యాస్పెక్ట్ లేదు, క్రియేటివ్ యాస్పెక్ట్ అసలే లేదు. ప్రేమ సినిమాలతో నేటి మార్కెట్ యాస్పెక్ట్ ఏమిటి? వీణ సినిమాలైన ఏడ్పుల ప్రేమ డ్రామాలు కాదు, యూత్ అప్పీల్ తో గిటార్ సినిమాలైన రియలిస్టిక్ రోమాంటిక్స్. నేటి యూత్ సినిమా గిటార్ వాయించాలి, వీణ వాయిస్తూ కూర్చోవడం కాదు. నేటి యువ ప్రేక్షకులు అంటున్న వాళ్ళల్లో చిన్నా చితకా ప్రేమ సినిమాలకి గర్ల్స్ లేరు, కొందరు బాయ్సే వుంటారు. బాయ్స్ ని దృష్టిలో పెట్టుకునే తీయాలి. నేటి యూత్ అప్పీల్ తో వుండే టేస్టులు రెండే రెండు -  ఎకనామిక్స్, రోమాంటిక్స్. ఈ రెండూ కూడా బాయ్స్ ని దృష్టిలో పెట్టుకునే. ‘హుషారు’ అనే కొత్త వాళ్లతో యూత్ సినిమా, బాయ్స్ ని దృష్టిలో పెట్టుకునే ఎకనమిక్స్ చుట్టూ తీశారు. పెద్ద స్లీపర్ హిట్టయ్యింది. నయా మేకరనే వాడు బకరా అవకూడదంటే ముందు కామర్స్ తెలిసిన వాడై వుండాలి. అప్పుడే సగం సక్సెస్ అయినట్టు. మిగతా సగం క్రియేటివ్ యాస్పెక్ట్. దీని గురించిన స్క్రీన్ ప్లే సంగతులు రేపు చూద్దాం...