మిడిల్
కథనం : అభిషేక్ (రాహుల్
విజయ్)
పెళ్లి చేద్దామనుకుంటారు
తల్లిదండ్రులు. పూజ (పెర్లెన్
భేసానియా) తో పెళ్లి చూపులు ఏర్పాటవుతాయి. పరస్పరం నచ్చుతారు. త్వరలో నిశ్చితార్ధం పెట్టుకుందామనుకుంటారు. అభిషేక్, పూజలు కలుసుకోవడం మొదలెడతారు.
కాల్స్ మాట్లాడుకుంటారు. సినిమాలకెళ్తారు. లంచ్ కెళతారు. ఇక నిశ్చితార్థానికి తేదీ
అనుకుంటారు. అప్పుడు అభిషేక్ పూజతో మాట్లాడాలంటాడు. అప్పుడామెకి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు
తన పూర్వ ప్రేమ సూర్యకాంతం (నిహారిక) గురించి.
ఫ్లాష్ బ్యాక్ లో బిగినింగ్ కథనం : సూర్యకాంతంని చూసి వెంటపడతాడు అభిషేక్. ఆమె కేర్ చేయదు. మాటమీద నిలబడదు. తప్పించుకునే రకం. ఎప్పుడెలా వుంటుందో తెలీదు. ఎప్పుడు మాయమైపోయి ఎప్పుడొస్తుందో తెలీదు. విచిత్రంగా అన్పిస్తున్న ఆమెకి అలాగే లవ్ చెప్తాడు. సమాధానం తర్వాత చెప్తానని మాయమై పోతుంది. అభిషేక్ ఆమె ఇంటికెళ్ళి తల్లి (సుహాసిని) ని కలుస్తాడు. కూతురి గురించి చెప్పుకొస్తుందామె. దాని చిన్నప్పుడు తనూ భర్తా బాగా కొట్లాడుకుని దానికి మనశ్శాంతి లేకుండా చేశారు. విడాకులు తీసుకుని ఇంకా గాయపర్చారు. ఇల్లంటే నాల్గు గోడలు కాదు, ఒక కుటుంబం. ఆ కుటుంబాన్ని ఇవ్వలేకపోయారు. దీంతో బయటే ఎక్కువ గడుపుతోంది. ఎప్పుడు తోస్తే అప్పుడు టూర్స్ కెళ్ళిపోతుంది. పెళ్ళంటే, భార్యాభర్తల సంబంధమంటే నమ్మకం పోయింది...ఇలా చెప్పుకుని బాధపడుతుంది సూర్యకాంతం తల్లి.
అయితే
తనకి ఎవరి గురించీ చెప్పని ఆమె అభిషేక్ గురించి చెప్పేదనీ, అందుకని ఆమెతో క్లోజ్
గా వుంటున్న అతణ్ణి ఒక ప్రామీస్ చేయమనీ అంటుంది. తను ఎన్నాళ్లుంటుందో తెలీదు ...అది
తిరిగిరావడానికి ఒక మనిషీ, వుండడానికి ఒక ఇల్లూ వుండేలా చూస్తావా అని. సరేనంటాడు.
సూర్యకాంతం తిరిగి వస్తుంది. ఇప్పుడంటాడు - నాకు తెలిసి ప్రేమా పెళ్ళీ వీటితో నీకేం ప్రాబ్లం లేదు, ఫ్రీడం లేకపోతేనే నీకు ప్రాబ్లం. ఆ ఫ్రీడం నీకిస్తాను, నాకు నచ్చినట్టు నువ్వుండనవసరం లేదని ఆమెతో అంటాడు. అప్పుడు కూడా ఆమె ఏమీ చెప్పదు. ఇంతలో గుండెపోటుతో తల్లి చనిపోతుంది. ఇక సూర్యకాంతంని తన ఇంటికే తీసుకుపోతాడు. ఆ కుటుంబ సభ్యుల మధ్య బాధని మర్చిపోయి మామూలు స్థితికి వస్తుంది. ఆనందంగా గడుపుతుంది. అప్పుడంటాడు – ‘పర్సనల్ లాస్ జరిగినప్పుడు ఏంచెప్పాలో అర్ధంగాదు. బాగా ఆలోచించాను, అప్పుడర్ధమైంది. చెప్పడం కాదు, చెయ్యాలీ అని. నేను నీకు ప్రామీస్ చేస్తున్నా. నీ బాధని పోగొట్టలేనేమో గానీ, నువ్వు పర్మిషనిస్తే ఆ బాధతో ఫైట్ చేసే సంతోషాన్నిస్తాను లైఫ్ లాంగ్’ అని.
ఆమె హగ్ చేసుకుని, తనని ఇంటిదగ్గర డ్రాప్ చేయమంటుంది, అమ్మ గుర్తుకొస్తోందని అంటుంది. ఆమెని ఇంటిదగ్గర డ్రాప్ చేశాక మాయమైపోతుంది (ప్లాట్ పాయింట్ వన్).
మిడిల్ కథనం కంటిన్యూ : వస్తుందని ఎదురు చూస్తాడు. ఏడాది అవుతున్నా రాదు. దీంతో పూజతో సంబంధానికి ఒప్పుకున్నాడు. ఇదంతా విన్న పూజ అంటుంది – ‘నీ పాస్ట్ గురించి నేనేం చేయలేను. కానీ నీ ప్రెజెంట్, ఫ్యూచర్ మొత్తం తనదే’నని.
ఇక ఎంగేజి మెంట్ ఏర్పాట్లు చేసుకుంటూ వుండగా రాత్రి పూట అభిషేక్ కి భయానక అనుభవాలవుతాయి. ఇంట్లో దెయ్యం వున్నట్టు అన్పిస్తుంది. చూస్తే సూర్యకాంతం... సూర్యకాంతం వచ్చేసింది....అభిషేక్ షాక్ తింటాడు. అతడి నోట్లో పాప్ కార్న్ కుక్కి, “రీఫిల్ చేసుకురా, సెకండాఫ్ ఇంకా ఇంటరెస్టింగ్ గా వుంటుంది” అంటుంది (ఇంటర్వెల్).
మిడిల్ -2 కథనం : సూర్యకాంతం వచ్చేసిందని అభిషేక్ తల్లిదండ్రులకి కూడా తెలిసిపోయి గోల పెడతారు. ఇప్పుడు పూజని కాదని దీన్ని చేసుకుంటావా అంటారు. కాదంటాడు. సూర్య కాంతం గురించి పూజకి తెలుసాని ఫ్రెండ్ అడుగుతాడు. తెలుసంటాడు. పూజ గురించి సూర్యకాంతంకి తెలుసాని తండ్రి అడుగుతాడు. తెలియదంటాడు. ఎంగేజి మెంట్ గురించి సూర్యకాంతంకి తెలుసా అంటే తెలీదంటాడు. ఇలా తెలుసు, తెలియదుల మధ్య ఇప్పుడేం చేయాలో కూడా తెలియదంటాడు. ఫ్రెండ్, తండ్రీ నెత్తిన తెల్లగుడ్డ లేసుకుంటారు.
ఇక
పూజని కలిసినప్పుడు సూర్యకాంతం నుంచి ఫోన్ రావడం, సూర్యకాంతంని కలిసినప్పుడు పూజనుంచి కాల్ రావడం...ఇటూ అటూ అబద్ధాలు చెప్పి తప్పించుకోవడం...ఇద్దరితో దాగుడుమూతలాడడం...
చివరికి పూజకి తెలిసిపోయి మందలిస్తుంది, దాచిపెట్టకుండా తనతో సిన్సియర్ గా వుండమంటుంది.
సూర్యకాంతాన్ని కలపమంటుంది. అప్పుడు చెప్పేస్తాడు సూర్యకాంతంకి తన ఎంగేజ్ మెంట్
గురించి. తనకి తెలుసంటుంది. తెలిసే బ్రేక్ చేయడానికి వచ్చానంటుంది. లోలోపల బాధ
పడుతుంది. తర్వాత పూజా సూర్యకాంతం కలుసుకుంటారు. ఎంగేజి మెంట్ రింగ్ సూర్యకాంతం చేతే
సెలెక్ట్ చేయించమంటుంది పూజ.
ఆ రింగ్ ఎంగేజిమేంట్ లో పెట్టుకుని నానా హంగామా చేస్తుంది సూర్యకాంతం. బయట మందు కొట్టి ఆటో డ్రైవర్లతో ఐటెం సాంగేసుకుంటుంది. అభిషేక్ ఆమెకి నచ్చజెప్పుకోవడం ప్రారంభిస్తాడు. ఆమె వాళ్ళిద్దర్నీ టూర్ పంపుతుంది. అక్కడికెళ్ళి వాళ్ళిద్దరి మధ్య తనూ వూడి పడుతుంది. సరదాగా గడుపుతారు. ట్రూత్ గేమ్ ఆడుకుంటారు. ఆ గేమ్ లో పూజ అడిగిన ప్రశ్నకి నిజం చెప్పేస్తుంది సూర్యకాంతం - తను తిరిగి వచ్చి రెండు సార్లు ప్రపోజ్ చేశాననీ, ఇక్కడి కొచ్చిందే వాళ్ళిద్దరి సంబంధాన్ని బ్రేక్ చేయడానికనీ చెప్పేస్తుంది. దీంతో హర్టయిన పూజ అభిషేక్ తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతుంది (ప్లాట్ పాయింట్ టూ).
ఎండ్ కథనం : ఏమీ అర్ధంగాక తండ్రికి ఫోన్ చేస్తాడు అభిషేక్. నువ్వే అలోచించి నిర్ణయం తీసుకోమంటాడు తండ్రి. అభిషేక్ సూర్యకాంతంకి సరెండర్ అయిపోతాడు. మీ ఇంట్లో నేను మాట్లాడి కన్విన్స్ చేస్తానని వెళ్తుంది. అటూ ఇటూ పేరెంట్స్ ఎదుట తన గురించి చెప్పుకుని, ఈ పెళ్ళికి అడ్డు రానని చెప్తుంది. పూజకో లెటర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇంటికొచ్చి ఆ లెటర్ చూసుకున్న అభిషేక్ సూర్యకాంతం ని వెతికి పట్టుకుంటాడు. నువ్వు మా ఇంట్లోనే మాతోనే వుండాలని, మా పెళ్లి చూడాలనీ తీసుకుపోతాడు...(అయిపోయింది)
***
ఈ
స్క్రీన్ ప్లే లో కథ పేరుతో వున్న కథ బిగినింగ్, మిడిల్, ఎండ్ లుగా విభజన జరిగి
చక్కగా ఇమిడి వుంది. మొదలెట్టిన కథ ఒకటైతే, నడిపిన కథ స్ట్రక్చర్ చెడి, పాత్రలూ
చెడి ఇంకొకటిగా వుంది. ఇది ఫ్లాష్ బ్యాక్ తో మిడిల్ - బిగినింగ్ - మిడిల్ - ఎండ్
లుగా నాన్ లీనియర్ కథనంగా వుంది. కథ వచ్చేసి షార్ట్ ఫిలిమ్స్ కి, లేదా వెబ్
సిరీస్ కి సరిపోయే కంటెంట్ తో వుంది మూడే మూడు పాత్రలతో. మూడు పాత్రల సినిమాయేతర
కంటెంట్ ని సినిమాగా వెండితెర మీద మౌంట్ చేయడం అత్యాశే. ఎంతో బలమైన కంటెంట్ వుంటే
గానీ, అదీ బిగ్ స్టార్స్ తో బాజీ రావ్ మస్తానీ, గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి
మూడు పాత్రల కథలు హిట్ కాలేదు. నిహారిక లాంటి చిన్న హీరోయిన్, విజయ్, పెర్లేన్
లాటి కొత్త హీరోహీరోయిన్లతో ఇంత లైటర్ వీన్ కథ నిలబలేక తేలిపోయింది.
ఉన్న ఈ లైటర్ వీన్ కథకూడా ఏమాత్రం ఆసక్తి కల్గించని, ట్రెండ్ ముగిసిన- అరిగిపోయిన ముక్కోణ ప్రేమ కథ. పైగా ఇది రెండు గంటల సినిమా నిడివికి చాలని కథ. ఈ కథని ఒకచోట కాకపోతే ఇంకో చోట మూడు చోట్ల ముగించెయ్యొచ్చు. ముగుస్తున్న చోటల్లా పొడిగిస్తూ పోయారు. షార్ట్స్ కి, వెబ్స్ కి సరిపోయే కథని చూయింగ్ గమ్ లాచేసి సాగదీస్తూ పోయారు.
పైగా ఈ కథ ఇప్పటి రియలిస్టిక్ ట్రెండ్ కి భిన్నంగా మూస ఫార్ములా డ్రామాల కాలంలో వుంది. ఈ కారణంగా యూత్ అప్పీల్ ని కోల్పోయింది. కానీ కాన్సెప్ట్ వచ్చేసి పెళ్ళంటే భయపడే, కమిట్ మెంట్ ఫోబియా లేదా గామోఫోబియా గల హీరోయిన్ సమస్యగా ఇవాళ్టి పోకడనే ఎత్తుకున్నారు. ఈ పోకడని, యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లంని, ఇప్పటి తాజా కథగా ఎలా డీల్ చేయాలో తెలియనట్టు – ఈ పాయింటు తీసేసి, అదే అరిగిపోయిన రొటీన్ ముక్కోణ ప్రేమ చట్రంలో బిగించి వదిలేశారు. దీంతో ప్రాబ్లం ఒకటి, నడిపిన కథ ఒకటిగా తయారయ్యింది.
దీన్ని స్క్రీన్ ప్లే రాయకముందే ఐడియా దశలోనే ఇన్ని లోపాలున్నాయి. ఐడియా దశలోనే ఇంకో పెద్ద లోపమేమిటంటే, ఇదే పాత్ర కథో నిర్ణయించుకోలేక పోవడం. సూర్యకాంతమా, అభిషేకా ఎవరి కథ ఇది? ఇది తెలుసుకోకపోవడం వల్ల ఐడియా దశలోనే ఈ కథ ఫెయిల్ అయింది. రెండూ పాసివ్ పాత్రలై, ఎవర్ని ప్రధాన పాత్రగా తీసుకుని కథని ఫాలో కావాలో తెలియని గందరగోళ పరిస్థితేర్పడింది. పైగా ఇప్పటి మార్కెట్ కి యూత్ అప్పీల్ వుండే రోమాంటిక్స్ తో రోమాంటిక్ కామెడీ కాకుండా, యూత్ అప్పీల్ వుండని సీరియస్ రోమాంటిక్ డ్రామాగా చేశారు. ఇలా ఐడియా దశలోనే ఆపెయ్యాల్సిన కథ ఇది.
***
తెలుగు
సినిమా కథల్ని పైపైన రాసేసి, పైపైన తీసేసే ఒక మూఢ నమ్మకం రోమాంటిక్ కామెడీలు
ప్రారంభమైన కాలంనుంచీ కొనసాగుతోంది. లైటర్ వీన్ ప్రేమకథలు ఇవే. ఎక్కడాకూదా కథ
లోతుల్లోకి, పాత్రల లోతుపాతుల్లోకి వెళ్లి ఆలోచించకుండా, పైపైన ఏదో కథ అల్లేయడమే
సినిమా అనే తేలికభావం చెలామణి కావడంతో కథల గురించి ఏమీ తెలియని అపరిపక్వతతో
సినిమాలు తీసేవాళ్ళు వచ్చేస్తున్నారు. ఇలా సూర్యకాంతం కథ కూడా రాయడంలో అపరిక్వతా,
లేక కావాలని అపరిపక్వ పాత్రల్ని తీర్చిదిద్దారా అన్నట్టు కథా కథనాల్లో సాంతం
ఇమ్మెచ్యూరిటీ నాట్య మాడుతూ వుంటుంది. అడుగడుగునా
పాత్రల ఆలోచనలు, మాటలు, నిర్ణయాలు చాలా సిల్లీగా, బుద్ధిలేని తనంగా వుంటాయి.
మిడిల్ కథనంతో ప్రారంభం అభిషేక్ - పూజల పెళ్లి చూపులు ఓకే అవడం, ఇక షికార్లు తిరగడం అలా వుంచి ఈ పాత్రల పరిచయాలు కూడా వుండవు. వీళ్ళ చదువులు, కెరీర్స్ ఏవీ మనకి తెలీవు. పాత్రలకి ఒక ఉద్యోగం సద్యోగం అన్నట్టు వుండదు. ఈ కథకి ఇద్దరు లవర్స్ వుండాలి, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏమిటనేది అనవసరం - పైపైన రాసేసి తీసేసే ఇలాటి లైటర్ వీన్ ప్రేమ సినిమాకి అన్నట్టు వుంటుంది. కాబట్టి ఇవి నేటి యువ ప్రేక్షకులు ఐడెంటిఫై చేసుకోగల రియలిస్టిక్ పాత్రలు కావు. మూలాలు లేని పాత మూస ఫార్ములా డ్రామా పాత్రలు.
పెళ్లి చూపులు ఏర్పాటయ్యే నాటికీ అభిషేక్ పూర్వ రంగం ఏమిటి, తర్వాత అతనే చెప్పుకునే ఫ్లాష్ బ్యాక్ ప్రకారం? సూర్య కాంతం అనే అమ్మాయిని ప్రేమించి లవ్యూ చెప్తే, ఆమె ఏ సంగతీ చెప్పకుండా ఏడాది కాలంగా కన్పించకుండా పోయింది. ఈ పూర్వరంగంలో ఇప్పుడామెని మర్చిపోయి, పూజతో పెళ్లి చూపులకి సిద్ధపడ్డాడు. ఆమెతో షికార్లు తిరిగాడు. ఇక ఎంగేజిమేంట్ అనుకునే సరికి పూజతో మాట్లాడాలని చెప్పి అర్జెంటుగా ఆమెకి తన గతం చెప్పుకున్నాడు.
ఎందుకు చెప్పుకున్నాడు? సూర్యకాంతంతో ఫిజికల్ రిలేషన్ షిప్ తో వున్నాడా? లేనప్పుడు ఎందుకు చెప్పుకున్నాడు? సూర్యకాంతం తనని రిజెక్ట్ చేసి పోయినట్టే వున్నప్పుడు, తను చేసిన తప్పుకూడా లేనప్పుడు, పనిమాలా పూజకి ఎందుకు చెప్పుకున్నాడు? ఎందుకు చెప్పుకోవాలంటే ప్రేక్షకులకి ఫ్లాష్ బ్యాక్ కథ తెలియాలి కాబట్టి. ప్రేక్షకులకి బ్యాలెన్స్ వుండిపోయిన కథ తెలియడానికి పాత్ర ఇలా దిగజారాలన్న మాట. ఫ్లాష్ బ్యాక్ కి లీడ్ ఇలా వుందన్న మాట.
***
ఇక ఫ్లాష్ బ్యాక్ గా
వచ్చే బిగినింగ్ కథనంలో సూర్యకాంతం పాత్ర కూడా పనీపాటా లేనట్టు వుంటుంది. అభిషేక్
తో ఈమె వింత ప్రవర్తనకి కారణం పెళ్ళంటే భయమనే కమిట్మెంట్ ఫోబియా లేక గామో ఫోబియా. ఆ మధ్య ‘ఇండియా టుడే’ యువతరంలో ఒక
జాడ్యంలా విస్తరిస్తున్న ఈ ఫోబియా గురించి రాసుకొచ్చింది. ఈ ఫోబియాకి వేర్వేరు కారణాలుంటాయి.
సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఈ ఫోబియాతో వుంటారు.
అమ్మాయిలతో తిరుగుతారు గానీ పెళ్లనేసరికి పరారవుతారు. అమ్మాయిలూ వయసు మీద
పడుతున్నా కెరీరే ముఖ్యమనుకుని పెళ్లిని వాయిదా వేస్తూంటారు. ఇలా రకరకాల
కారణాలుంటాయి. ఇవి కాక, కొన్ని అనుభవాల
వల్ల పెళ్ళికి నో అంటారు. చిన్నప్పడు మానసికంగా దెబ్బతింటే కూడా ఈ పరిస్టితి రావచ్చు.
ఇలా రకరకాల కారణాలతో గామో ఫోబియాని
చిత్రిస్తూ, బాలీవుడ్ నుంచి కుప్ప తెప్పలుగా సినిమాలు వస్తున్నాయని రాసింది ‘ఇండియా
టుడే’.
ఇటీవలే అనురాగ్ కాశ్యప్ తీసిన హిట్ ‘మన్మర్జియా’ కూడా వచ్చింది. ఇవన్నీ రియలిస్టిక్ లవ్ ఎంటర్ టైనర్లు. హాలీవుడ్ నుంచైతే ఇక చెప్పర్లేదు. ఇవి చూసి, ‘సూర్యకాంతం’ ని చూస్తే - శవ్వ శవ్వ – నవ్వొస్తోంది! బెటర్ టు వాచ్ ‘వివాహబంధం’ లో సూర్యకాంతమ్మని.
రియలిస్టిక్ గా తీయాల్సిన మోడరన్ ప్రాబ్లంని, ముసలి చాదస్తాలు పెట్టుకుని అరిగిపోయిన మూస ఫార్ములాగా తీసినట్టుంది. సరే, ఇలా ఠికానా లేని సూర్యకాంతంకి ప్రేమిస్తున్నట్టు చెప్తాడు అభిషేక్. ఆమె మాయమైపోతుంది. అప్పుడామె తల్లిని కలిస్తే అసలు విషయం చెప్తుంది. దాని చిన్నప్పుడు తమ భార్యాభర్తల తగాదాలూ, విడాకులూ, ఇదంతా చూసి గాయపడి అదిలా తయారయ్యిందని...పెళ్ళంటే నమ్మకం పోగొట్టుకుందనీ. ఇంటి పట్టున వుండక టూర్లు వెళ్లిపోతుందనీ.
ఇక్కడ ఈ తల్లిగారిని చూస్తే ఏమిటంటే, ఒక్కగానొక్క కూతుర్ని బాగుపర్చే చర్యలేమీ తీసుకోలేదు. గాలికి వదిలేసి బాధపడుతూ కూర్చుంది మంచి డబ్బూ, ఎడ్యుకేషనూ వున్న మదరమ్మ గారు. లాజిక్ అవసరం లేని మూస ఫార్ములా కథ కదా.
ఇదంతా చెప్పి ఒక కీ డైలాగు చెప్తుంది మదర్ - ఎవరి గురించీ చెప్పని కూతురు అభిషేక్ గురించి చెప్పేదని. అంటే ఏమిటర్ధం? అభిషేక్ అంటే సాఫ్ట్ కార్నర్ వున్నట్టే కదా? కానీ దీన్ని గుర్తించి ఆ మేరకు ఏ మాత్రం ప్రవర్తించడు. ఇక మదర్ ప్రామీస్ చేయమంటుంది. తను ఎన్నాళ్లుంటుందో తెలీదనీ, అది తిరిగిరావడానికి ఒక మనిషీ, వుండడానికి ఒక ఇల్లూ వుండేలా చూడమనీ అంటుంది. అంటే కూతురిలాగే ఫోబియాతో తిరుగుళ్ళు తిరిగి వస్తూ వుండి పోవాలన్న మాట జీవితాంతం. అలా తిరిగి వస్తూంటే ఇంట్లో ఒక మనిషి వుండాలన్న మాట వెల్కం చెప్పడానికి. మదరమ్మకి కూతురి భవిష్యత్తు గురించి ఇటువంటి బెస్ట్ ప్లాన్స్ వున్నాయి. కూతురు సైకియాట్రిక్ కేస్ అని ఇక గుర్తించే ప్రసక్తే లేదు, ట్రీట్మెంట్ ఆలోచనే లేదు. గోడకి మహానటి సూర్యకాంతం ఫోటోలన్నీ పెట్టుకుని వుంటుంది. ఆమె తన ఆమ్మట. ఆ అమ్మ సూర్యకాంతమ్మ దిగివస్తే నాల్గు దులుపుళ్ళు దులిపి తరిమి తరిమి కొడుతుంది. అప్పుడు రోడ్డున పడి తిరిగేది ఆ కూతురు కాదు, ఈ మదర్.
ఇలాటి మదర్ పిచ్చి పిచ్చి మాటలకి అలాగేనని మాటిస్తాడు. ఈ మాట ప్రకారమైనా నడుచుకోడు తర్వాత. ఇలా సెటప్స్ వుంటాయి గానీ వీటి కొనసాగింపుల కోసం చూస్తే పే ఆఫ్స్ వుండవు. ఎక్కడిదక్కడే వదిలేస్తూ కథనం నడుస్తూంటుంది.
ఇప్పుడు ఇక్కడ ఇలా సూర్యకాంతం పాత్ర ఫోబియాతో వెల్లడయ్యాక, దీనికి డెప్త్ గురించిన ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదంటే, లాజిక్ గీజిక్ పక్కన బెట్టి పైపైన రాసేసి తీసేయాలి కాబట్టి. లేకపోతే అభిషేక్ కంటే ముందు, అభిషేక్ తో పాటూ, సూర్యకాంతంకి ఇంకా చాలా మంది తగిలివుండాలి లవ్ కోసం వెంటపడి. సూర్యకాంతం లాంటి ఎక్సెంట్రిక్ పాత్రని ఇలా కదా విస్తరించి చూపాలి? ఈ విస్తరణ లేకే మూడు పాత్రల వెబ్ సిరీస్ కి పనికొచ్చే కథ కురచదై పోయింది సిల్వర్ స్క్రీన్ కి.
ఇక సూర్యకాంతం టూర్ నుంచి వచ్చాక ఫూలిష్ గా ప్రపోజ్ చేస్తాడు అభిషేక్. గొప్ప సైకాలజీ తెలిసిన వాడిలా మాట్లాడతాడు, ‘నాకు తెలిసి ప్రేమా పెళ్ళీ వీటితో నీకేం ప్రాబ్లం లేదు, ఫ్రీడం లేకపోతేనే నీకు ప్రాబ్లం. ఆ ఫ్రీడం నీకిస్తాను, నాకు నచ్చినట్టు నువ్వుండనవసరం లేదు’ అంటాడు!
ఏమిటిది? ఇతడికేదో తెలిసిందట ఆమె మనసు. ఇంతకి ముందు ప్రపోజ్ చేశాడంటే ఆమె ఫోబియా గురించి తెలీదు. ఇప్పుడు ఫోబియా గురించి మదర్ చెప్పాక కూడా ఆ ఫోబియాతో ముడిపడిన పెళ్లిని ప్రపోజ్ చేయడమేమిటి? పైగా ‘నాకు తెలిసి ప్రేమా పెళ్ళీ వీటితో నీకేం ప్రాబ్లం లేదు, ఫ్రీడం లేకపోతేనే నీకు ప్రాబ్లం’ అంటాడు. చిన్నప్పుడు మానసికంగా దెబ్బతిని ప్రేమలూ పెళ్ళిళ్ళూ అనే వాటి మీదే నమ్మకం పోగొట్టుకుందని మదర్ చెప్పాక కూడా ఇంకేదో తెలిసిందని ఇలా మాట్లాడతాడు. ఆమె ప్రాబ్లం ఫ్రీడం గురించా? ఫ్రీడం ఇస్తే తీరిపోతుందా? అంటే ఆమెని పెళ్లి చేసుకుంటాడు, ఆమె ఎలాగైనా టూర్లు తిరిగి వచ్చే ఫ్రీడం వుంటుందన్నమాట. ఆమె సమస్య ఫోబియా అనేది కథకి అడ్డమని తీసి అవతల పారేశాడన్న మాట.
చిన్నప్పటి మానసిక గాయాలతో పెళ్లి ఫోబియాతో వున్నామెని ముందా ఫోబియాలోంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకుండా, పెళ్లి కక్కుర్తి ఏమిటి? పెళ్ళంటూ ఇంకా బెదరగొట్టడమేమిటి? ఆ ఫోబియాలోంచి బయటికి తీసుకొచ్చే పద్ధతులున్నాయి. కామెడీగా చేస్తాడో ఇంకెలా చేస్తాడో వాడిష్టం. ఆమెకి నయమయ్యాక ఆమె నోటి నుంచే రావాలి పెళ్ళనే మాట!
మధ్యలో మదర్ చనిపోవడమొకటి. ఇక ఒంటరిదైన సూర్యకాంతాన్ని తన ఇంటికే తీ సుకుపోయి, ఆ బాధలోంచి బయటికొచ్చేలా చేస్తాడు. ఒక మాంటేజ్ సాంగ్ ఆమె నవ్వుతూ తుళ్ళుతూ వున్న దృశ్యాలతో వుంటుంది. ఇదయ్యాక మళ్ళీ గోల మొదలెడతాడు. ఈసారి ఇంకా ఫూలిష్ గా, ‘పర్సనల్ లాస్ జరిగినప్పుడు ఏంచెప్పాలో అర్ధంగాదు. బాగా ఆలోచించాను, అప్పుడర్ధమైంది. చెప్పడం కాదు, చెయ్యాలీ అని. నేను నీకు ప్రామీస్ చేస్తున్నా. నీ బాధని పోగొట్టలేనేమో గానీ, నువ్వు పర్మిషనిస్తే ఆ బాధతో ఫైట్ చేసే సంతోషాన్నిస్తాను లైఫ్ లాంగ్” అనేసి!
మళ్ళీ
ఇదేమిటి? ఆమె పర్సనల్ లాస్ లోంచి బయటికే వచ్చేసింది,
వాకౌట్ చేసే సింది, ఆనందంగా వుందిప్పుడు. మళ్ళీ పర్సనల్ లాస్ అంటూ పుండుని గెలుకుతాడేమిటి?
కోతి పుండు బ్రహ్మ రాక్షసి చేయాలనా? పర్సనల్ లాస్ జరిగినప్పుడు ఏంచెప్పాలో అర్ధంగాదా?
బాగా ఆలోచిస్తే అప్పుడర్ధమైందా? చెప్పడం
కాదు, చెయ్యాలీ అని అర్థమైందా? చేశాడుగా ఆమెని - అంత మాంటేజ్ సాంగ్ వేసి హ్యాపీగా. ఇంకేంటి? మళ్ళీ
ప్రామీస్ చేస్తున్నాడా? ఆమె బాధని పోగొట్టలేడేమో
గానీ, ఆమె పర్మిషనిస్తే ఆ బాధతో ఫైట్ చేసే సంతోషాన్నిస్తాడా లైఫ్ లాంగ్? ఇదన్న మాట.
చివరి కొచ్చేసి లైఫ్ లాంగ్ అంటున్నాడంటే పెళ్లి కక్కుర్తే. పెళ్లి కక్కుర్తితోనే ఇలా
అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నాడు.
అప్పుడామె ఫోబియాటో వుంటే తెలీక లవ్ చెప్పాడు, ఇప్పుడు ఫోబియాటో బాటు ఆమె మదర్ కూడా చనిపోయి వుంటే పెళ్ళంటున్నాడు. ఎంతసేపూ తన కక్కుర్తే. ఈ దెబ్బకి ఆమె పారిపోయింది. మళ్ళీ కన్పించకుండా చెక్కేసింది. అయ్యో మదర్ కి ప్రామీస్ చేసి ఇలా చేశానే, ఎక్కడుందో వెతకాలని ప్రయత్నించడు. మొగుడు వస్తాడని ఎదురు చూస్తూ కూర్చునే పెళ్ళాంలా కూర్చుంటాడు. తను అంత ఫూలిష్ గా మాట్లాడినందుకు వుందో సూసైడ్ చేసుకుందో కూడా పట్టదు. ఇది చాలా హాస్యాస్పదమైన ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం.
(మిగతా రేపు)
―సికిందర్