రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

28, ఫిబ్రవరి 2016, ఆదివారంరచన – దర్శకత్వం : చునియా

తారాగణం : కార్తీక్ రాజు, నిత్యా శెట్టి, జహీదా, అలీ, విశ్వ, రాశి, కృష్ణుడు, నరేష్, అనితా
చౌదరి తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయా గ్రహణం : కన్నా కూనపరెడ్డి
బ్యానర్ : అయాన్ క్రియేషన్స్,   నిర్మాత : ఆయాన్ క్రియేషన్స్ 
విడుదల : 26 ఫిబ్రవరి, 2016
***
రో దర్శకురాలు చునియా అలియాస్ సాహెబా తెలుగుకి పరిచయమవుతోంది. కె.  రాఘవేంద్రరావు శిష్యురాలిగా, నాగార్జున సంస్థ సీరియల్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవంతో, సినిమా దర్శకత్వ అవకాశాన్ని సంపాదించుకుంది. మేకింగ్ లో ఉన్నప్పడు ఆమె ప్రతిభా పాటవాల గురించి పాజిటివ్ విషయాలు చాలా వినవచ్చాయి. మరి ‘పడేసావే’  అన్న టైటిల్ తో ప్రేమ సినిమాని అందిస్తూ, ప్రేక్షకుల మధ్య కొచ్చినప్పుడు ఆ పాజిటివ్ విషయాలు ఎలావున్నాయో చూద్దాం.

కథ
       కార్తీక్ (కార్తీక్ రాజు), నిహారిక (నిత్యా శెట్టి) లు చిన్ననాటి స్నేహితులు.  పెద్దయ్యాక కార్తీక్ నిహారికని ఫ్రెండ్ లాగానే చూస్తాడు. ఆమె ప్రేమిస్తున్నాడనుకుంటుంది. ఒకరోజు తన ఫ్రెండ్ స్వాతి ( జహీదా) ని కార్తీక్ కి పరిచయం చేస్తుంది. ఆమెని చూసి వెంటనే ప్రేమలో పడతాడు కార్తీక్. అప్పటికే ఆమెకి ఎంగేజ్ మెంట్ జరిగి వుంటుంది. అయినా ఆమె కార్తీక్ మీద  ప్రేమని పెంచుకుంటుంది. ఇది తెలుసుకున్న నిహారిక హర్ట్ అవుతుంది. నిహారిక కూడా కార్తీక్ ని ప్రేమిస్తోందని స్వాతికి తెలుస్తుంది. ఇప్పుడు ఈ ముగ్గురి మధ్యా  సమస్య ఎలా పరిష్కారమయిందనేది  మిగతా కథ.

ఎలా వుంది కథ
       ఈ ముక్కోణ ప్రేమ కథ ట్రెండ్ లో లేకపోవడం మొదటి డ్రా బ్యాక్. ఆతర్వాత దీన్ని చెప్పిన విధానం రెండో మైనస్. ఓ పదేళ్ళ క్రితం ఈ కథ ప్రేక్షకులకి నచ్చేదేమో. ఇప్పుడు కాలాతీతమై పోయింది. ఇప్పుడున్న మార్కెట్లో ఇలాటి కాలం చెల్లిన కథకి స్థానం లేదు. ప్రేమ కథలు చాలా ముందుకెళ్ళి పోయాయి. 

ఎవరెలా చేశారు
       
హీరోగా నటించిన కార్తీక్ రాజుకి ఇది రెండో సినిమా. ‘టిప్పు’ అనే మొదటి సినిమాతోనే ప్రేక్షకుల ఆదరణా గుర్తింపూ పొందలేకపోయాడు. ఇదే ఇప్పుడు రిపీటయ్యింది. ముందుగా ఈ పోటీ రంగంలో తను నటనని సాన బెట్టుకోవాల్సి వుంటుంది. తనని మించిన కొత్త హీరోలు వస్తున్నారు. నటన ఎలా వున్నా ఈ సినిమా దాని బలహీనతల  వల్ల తనకే విధంగానూ ఉపయోగపడే అవకాశం లేదు. హీరోయిన్ లిద్దరూ  ఈ సినిమాకి ఏమాత్రం ప్లస్ కాలేకపోయారు. కారణం,  కథా కథనాలకి తోడు వాళ్ళ పాత్రల తీరుతెన్నులే. ఇప్పటి అమ్మాయిలూ ఈ పాత్రల్లాగా వుండరని వాళ్ళకీ తెలిసివుంటుంది. పాత ఫార్ములా  హీరో పాత్రలాగే ఈ నాటి యూత్ కి ప్రతినిధులు అన్పించుకునే ఛాయలు ఎక్కడా ఈ హీరోయిన్లు ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది.
         ఇక ఒకనాటి హీరోయిన్ రాశి ఇందులో తల్లి పాత్ర పోషించింది. అలీ, వెన్నెల కిషోర్ లు కామెడీ కోసం వున్నారు గానీ అదీ విఫలమయ్యింది. కన్నా కూనపరెడ్డి ఛాయాగ్రహణం, అనూప్ రూబెన్స్ పాటలు ఫర్వాలేదనిపించుకున్నా, ఇవొక్కటే సినిమాని నిలబెట్టలేవు. 

చివరికేమిటి?
       
తెలుగులో దర్శకురాళ్ళు రావడం చాలా అరుదు. అలాటిది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వీలయినంత జెండర్ ప్రధానమైన ప్రత్యేకతని ముందు చాటుకోవడం తెలియాలి. అందరు మగాళ్ళ లాగే తనూ సినిమా తీస్తే జెండర్ ప్రత్యేకత కాదుకదా ఏ  ప్రత్యేకతా వుండదు. సబ్జెక్టుని ఒక స్త్రీగా తాను  చూసే కోణం ఎలావుంటుందో ప్రేక్షకులకి పరిచయం చేసినప్పుడే తేడా తెలుస్తుంది. మేల్ డైరెక్టర్లు సినిమా అంటే, పాత్రలూ అంటే రొటీన్ గా వాళ్ళ దృక్కోణం లోంచి ఇలా చూపిస్తున్నారు, నేను వీళ్ళని ఫాలో అవకుండా ఒక ఫిమేల్ డైరెక్టర్ గా భిన్నత్వంతో నా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు దర్శకురాలు నాల్గు కాలాలు గుర్తుండే సినిమాలు తీయగల్గుతుంది. మరీ దీపా మెహతానో, మీరా నాయరో కానవసరం లేదుగానీ, దర్శకురాలిగా తన కమర్షియల్ విజన్ ని తను రూపొందించుకుంటే చాలు. లేకపోతే తనకీ శ్రమ వృధా, నిర్మాతలకీ పెట్టుబడి వృధా.

        ఇవ్వాళ్ళ మార్కెట్ కి కావాల్సింది ఇలాటి ప్రేమలు కాదు- ప్రేమల పేరుతో  యూత్ పాల్పడే క్రేజీ చేష్టలు. కథ కంటే కథన కుతూహలమున్న వర్కౌట్లు. బాలీవుడ్ లో ఇది చేస్తున్నారు, టాలీవుడ్ లో పదేపదే పాత  ప్రేమలు పట్టుకుని మార్కెట్ లో అపహాస్యం పాలవుతున్నారు.

-సికిందర్