స్క్రీన్ ప్లే సూత్రాల్ని ఎవరికి వాళ్ళు ఆకాశంలోకి
చూస్తూ సృష్టించలేదు. వచ్చిన సినిమాలనే చూస్తూ వాటి కథానిర్మాణాల్లోంచి
సిద్ధాంతాలు చేశారు. పదార్ధం లేకుండా శాస్త్రం లేదు. నాట్యం పుట్టక ముందు నాట్య
శాస్త్రం లేదు, సినిమాలు పుట్టక ముందు స్క్రీన్ ప్లే శాస్త్రమూ లేదు. కొన్ని వందల స్క్రిప్టులు చదివిన
అనుభవంతోనే సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే మీద పుస్తకాలు రాయగలిగాడు. ఇరవై ఏళ్ళూ
సినిమాల్నీ పురాణాల్నీ పరిశీలన చేసిన మీదటే జేమ్స్ బానెట్ అలాటి సంచలన పుస్తకం రాయగలిగాడు. కాబట్టి
స్క్రీన్ ప్లే సూత్రాలు సొంత కవిత్వాలనీ, అలాటి
ఒకడి సొంత కవిత్వం మనకక్కర్లేదనీ విజ్ఞత గలవాళ్ళు అనుకోరు!
కావాల్సింది
సూత్రాల్ని తెలుగు సినిమాలకి అడాప్ట్ చేసుకునే మెళకువే. ఎలా అడాప్ట్
చేసుకోవాలన్న దానిపైనే ఈ తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాలు ఆధారపడ్డాయి. విభిన్న అభిరుచులు గలవాళ్ళకి విభిన్న
స్క్రీన్ ప్లేలు రాస్తున్నప్పుడు జరిగే
మేధోమథనంలోంచి ఈ అన్వయింపు సులభంగా జరిగిపోతూ వచ్చింది. మరొకటేమిటంటే, ఆయా కాలాల్లో స్క్రీన్ ప్లే పుస్తకాల్లో ఇచ్చిన సమాచారమే సమాచారం కాదు. వాటి మీద
ఆధారపడితే క్రియేటివిటీ అక్కడికక్కడే
ఘనీభవించి పోతుంది. సినిమా రచన అనేది నిత్య చలనశీలమైనది. కొత్త కొత్త సమాచారాన్ని
ప్రతినిత్యం తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతూంటుంది. ఈ సమాచారాన్ని గానీ, టిప్స్ ని
గానీ హాలీవుడ్ నుంచి వెలువడే అనేక స్క్రీన్ ప్లే వెబ్ సైట్స్ అందిస్తూంటాయి. వీటి
మీద కూడా ఓ కన్నేసి వుంచాల్సి ఉంటుంది.
ఉదాహరణకి,
స్క్రీన్ ప్లే లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకి ఒక గోల్ ఏర్పడాలని అన్ని
స్క్రీన్ ప్లే పుస్తకాల్లోనూ చెప్తారు. తెలిసిందే
కదా, ‘శివ’ లో కూడా నాగార్జున జేడీని సైకిలు చైను తో కొట్టడంతో మాఫియాని అంతమొందించే గోల్ పెట్టుకున్నాడని
అర్ధమవుతోంది కరెక్టే, ఏ సినిమాలోనైనా ఇలా
ఏదో ఒక గోల్ ఏర్పడుతుంది నిజమేనని సింపుల్
గా అన్పించవచ్చు. ఐతే ఏ స్క్రీన్ ప్లే
పుస్తకాల్లోనైనా ఈ భౌతిక స్థితే చెప్పి
వదిలేస్తారు. కానీ చాలా పూర్వం, ఒక స్క్రీన్ ప్లే వెబ్ సైట్ లో ఒక గెస్ట్ రైటర్ ఈ
గోల్ కి కళ్ళెదుట వున్న భౌతిక స్థితితే కాకుండా, కంటికి కన్పించని మానసిక స్థితి కూడా
ఉంటుందనీ, అప్పుడే అది సజీవ పాత్రగా కన్పిస్తుందనీ ఒక ఆర్టికల్ రాసుకొచ్చాడు.
ఇదెక్కడ్నించీ తెలుసుకున్నాడు? సినిమాల్లోంచే. ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే కంటికి కన్పించే గోల్ తో పాటూ, కంటికి కన్పించని
మానసిక స్థితిలో కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషనూ అనే నాల్గు ఎలిమెంట్స్
ఉంటాయనీ తేల్చాడు. పరిశీలిస్తే ఇవి ‘శివ’ లో
లేవా? వున్నాయి. దీన్ని కూడా స్ట్రక్చర్ లో భాగంగా చేసి గోల్ ఎలిమెంట్స్ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఇలా
గోల్ కో అంతర్నిర్మాణం ఉంటుందనీ, ఆ
అంతర్నిర్మాణంలో వుండే నాల్గు ఎలిమెంట్స్ ని కూడా ప్లే చేస్తూ కథ నడిపితే బలంగా
వస్తుందనీ తెలుసుకున్నాక, ఒక కొత్త స్పృహతో స్క్రీన్ ప్లేలు రాసుకుంటారు కదా?
ఇలాగే సినిమాలకి కథలు మాత్రమే పనికొస్తాయనీ, గాథలు పనికి రావనీ ఒక గొప్ప సత్యాన్ని ఇంకో వెబ్ సైట్లో ఇంకో నిపుణుడు రాసుకొచ్చాడు. ఇది కూడా నిజమే కదా, గాథలుగా తీసిన ‘బ్రహ్మోత్సవం’, ‘పైసా’ లాంటి తెలుగు సినిమాలు ఎలావున్నాయో చూశాం. అంటే కథకీ, గాథకీ తేడా తెలుసుకుని జగ్రత్తపడ్డం కూడా అవసరమే నన్న మాట. ఇలాగే టైం అండ్ టెన్షన్ థియరీ గురించి, ప్లాట్ పాయింట్ వన్ లోనే కథకి ముగింపూ ఉంటుందన్న అవగాహన గురించీ, ఇలా మరెన్నో స్క్రిప్టింగ్ టూల్స్ ని పుస్తకాలు గాక ఇతర ప్రాప్తి స్థానాల్లో గమనించాక, వీటిని ‘శివ’ కి అన్వయించి చూసుకుని ఇలా తెలుగు స్ట్రక్చర్ లో భాగం చేశామన్నమాట. కథకి క్లయిమాక్స్ తెలిపోయిందంటే ఆ లోపం ప్లాట్ పాయింట్ వన్ లోనే ఉంటుందని ఏ పుస్తకాల్లో చెప్తారు? దివంగత దర్శకుడు బిల్లీ వైల్డర్ అనుభవంలోంచి వచ్చిందీ సంగతి.
ఇక
ఇప్పటి తెలుగు సినిమాల దృష్ట్యా జోసఫ్ క్యాంప్ బెల్ గ్రంథంలోని గొప్ప విషయాల్ని
తీసుకోలేం. దర్శకుడు దేవ కట్టా 2005 లో మొదటి సినిమా ‘వెన్నెల’ తీశాక, యూఎస్ నుంచీ
ఈ వ్యాసకర్తకి ఫోన్ చేసి కథ అడిగినప్పుడు, అయిన పరిచయంలో, జోసెఫ్ క్యాంప్ బెల్ ని చదువు కున్నానన్నారు. తర్వాత
‘ప్రస్థానం’ తీసినప్పుడు ఆ ఛాయలు కొంతమేర కన్పించాయి గానీ, ఆ తర్వాత తీసిన
‘ఆటోనగర్ సూర్య’, ‘డైనమైట్’ లలో ఆచరణ సాధ్యం కాలేదు. గొప్ప క్లాసిక్స్ తీయాలంటే
క్యాంప్ బెల్ ని అనుసరించవచ్చు, ‘బాహుబలి’ తీయాలంటే కూడా అనుసరించవచ్చు. అప్పట్లో
‘స్టార్ వార్స్’ క్యాంప్ బెల్ ని అనుసరించి తీసిందే.
అలాగే జేమ్స్ బానెట్ నుంచి కూడా మొత్తం తీసుకోలేం. ప్రేక్షకులకి కథతో ఏర్పడాల్సిన బలమైన సైకలాజికల్ కనెక్షన్ కి బానెట్ చెప్పుకొచ్చిన కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే అనే టూల్ ని మాత్రమే తెలుగు స్క్రీన్ ప్లేలకి చాలునని దాన్ని మాత్రం తీసుకుని స్ట్రక్చర్ లో భాగంగా చేశాం. ఇలా తెలుగు స్క్రీన్ ప్లేల పటిష్టతకి ఏవేవి అవసరపడతాయో పరిశీలించి, వాటిని స్ట్రక్చర్ లో చేర్చుకున్నాం.
కథా చర్చల్లో తెలిసివస్తున్న ఇంకో ప్రధానాంశం ఏమిటంటే, ఐడియా దగ్గరే వైఫల్యం చెందడం. రెండు వాక్యాల్లో తమ కథల లైన్ ఏమిటో చెప్పలేకపోవడం, కథంతా చెప్పుకు రావడం. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. విత్తనం దగ్గరే తత్తర పాటుతో వుంటే ఇక కథా వ్యవసాయం ఇంకేం చేయగలరు. ఎవరైనా మా విత్తనం ఇదీ అని చెప్పినా ఆ విత్తనం పుచ్చి పోయి ఉంటోంది. ఇది తీవ్ర ఆందోళనకి లోను జేసింది. తెలుగుకి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాలు రాయాలంటే ఇక్కడ్నించే ప్రారంభించాలన్న అవగాహనా కుదిరింది. ఔత్సాహికులు రాసుకొస్తున్న కథల్లో కన్ఫ్యూజన్ అంతా తొట్టతొలుత కథకి బీజం పడే ఐడియా దగ్గరే ఉంటోందని అర్ధమైంది. అంటే స్ట్రక్చర్ సంగతులు అయిడియా దగ్గర్నుంచే మొదలెట్టాలన్నమాట. స్క్రీన్ ప్లే పుస్తకాల్లో బేసిక్ స్ట్రక్చర్ మాత్రమే వుంటుంది. బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాల్లో వాటి తాలూకు బిజినెస్ గురించి వుంటుంది. వాటిలో ప్రధాన పాత్ర ప్రయాణం గురించి వుంటుంది. లైన్ ఆర్డర్ ఎలా వేసుకోవాలో వుండదు. అలాగే అసలు కథకి ఐడియాని ఎలా నిర్మించుకోవాలో వుండదు.
హాలీవుడ్
లో లిటరరీ ఏజెంట్లు మార్కెట్ దృక్కోణంలో ఐడియా ఎలా ఉండాలో చెప్తూంటారు. ఈ లిటరరీ ఏజెంట్లే స్క్రీన్ రైటర్ల స్క్రిప్టుల్ని
స్టూడియో ఎగ్జిక్యూటివ్ లకి చేరవేసి బేరసారాలు చేసే పనిలో వుంటారు. వీళ్ళు ఈ
ట్రెండ్ కి, ఇప్పటి సీజన్ కి ఫలానా ఈ ఈ అయిడియాలు వర్కౌట్ అవుతాయని చెబుతూంటారు.
మనదగ్గర ఇది మాత్రమే చాలదని అర్ధమయ్యింది. ఐడియాకి మార్కెట్ దృక్కోణమే గాకుండా,
ఐడియాకి క్రియేటివ్ దృక్కోణం కూడా తప్పని సరి చేయాలన్న ఆలోచనపుట్టింది. మొట్టమొదట సినిమా
తీయడానికి పుట్టే ఐడియాలోనే మొత్తం
స్క్రీన్ ప్లేకి సంబంధించిన డీఎన్ఏ అంతా లేకపోతే, ఆపైన ఆ స్క్రీన్ ప్లే నిలబడదనీ,
దాంతో సినిమా కూడా నిలబడదనీ పరమసత్యం
బోధపడింది. ఆ డీఎన్ఏ ‘ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ + లాగ్ లైన్’ అయి వుండాలని
నిర్ణయించి- కథలు పట్టుకొచ్చే వాళ్ళతో కూర్చుని మూడు నాల్గు రోజులు ముందు ఈ దృష్టితోనే ఐడియాల మీద కసరత్తు చేయడం, చేయించడం మొదలైంది.
అలా క్రియేటివ్ దృక్కోణాన్ని కూడా కలుపుకుని ‘ఐడియాలో కథ వుందా?’ అన్న మూడవ అధ్యాయం
పుట్టింది. ఇక్కడ్నించే మిగిలిన అధ్యాయాలకి బాట పడింది.
హాలీవుడ్ లో సినాప్సిస్ రైటింగ్ కే ప్రత్యేక శిక్షణాలయాలు ఎందుకున్నాయో నాల్గవ అధ్యాయంలో చెప్పుకున్నాం. దీని ప్రాముఖ్యాన్ని గుర్తించినందునే, ‘ఐడియా’ తర్వాత ‘సినాప్సిస్ రైటింగ్’ అధ్యాయాన్ని సృష్టించాం. వీటి తర్వాతే స్క్రీన్ ప్లే కి బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాల చర్చలో కెళ్ళాం. ఈ విభాగాల వేర్వేరు బిజినెస్సుల్ని, లైన్ ఆర్డర్ సహితంగా చెప్పుకుంటూ వచ్చాం. దీనికి ఉదాహరణగా ‘శివ’ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇందులో ఒకే కథ వుంటుంది, కథకి అడ్డుపడే వేరే ఉపకథలూ, కామెడీ ట్రాకులూ వగైరా వుండవు. సీను తర్వాత సీనుగా ఒకే కథ సూటిగా సాగుతూంటే, స్ట్రక్చర్ ని ఫాలో అవడం చాలా సులభంగా వుంటుంది. పైగా సిడ్ ఫీల్డ్ బుక్కు, ‘శివ’ ఒక్కటే.
ఈ
వ్యాసకర్త సరళమైన, బలమైన సమకాలీన తెలుగు కమర్షియల్ సినిమా కథలకి సిడ్ ఫీల్డ్ నే
నమ్ముకోవాలని పక్కగా ఏనాడో డిసైడ్ అయ్యాడు. సిడ్ ఫీల్డ్ నమూనా ప్రకారం ప్లాట్
పాయింట్స్ -1, 2 లు, పించ్ పాయింట్స్ -1, 2 లు, ఒక మిడ్ పాయింట్ – ఈ 5 మాత్రమే గుర్తుపెట్టుకుంటే
చాలు- ఏ కథయినా సులభంగా వచ్చేస్తుంది. పండితులకి మాత్రమే అర్ధమయ్యే సంక్లిష్ట
శాస్త్రంగా ఉంటున్న స్క్రీన్ ప్లే కోర్సుని యువతరం కోసం నేలకు దించి, సరళతరం చేసి,
సుబోధకం చేశాడు ఫీల్డ్. ఇంకా తర్వాత చాలామంది
త్రీ యాక్ట్స్ కాదు, ఫోర్ యాక్ట్స్ అనీ, ఎయిట్ యాక్ట్స్ అనీ నానా సంక్లిష్టం
చేసి పుస్తకాలు రాస్తున్నారు. ఇవన్నీ ఔత్సాహికులు ఈ వ్యాసకర్త దృష్టికి
తెచ్చి ప్రశ్నిస్తున్నారు. ఎందుకీ సందేహాలు. తెలుగు సినిమాలు ఎప్పుడైనా
త్రీయాక్స్ట్ కి మించి ఉన్నాయా? పోనీ ఇతర భాషల సినిమాలూ, హాలీవుడ్ సినిమాలైనా అలా ఉన్నాయా? ఉన్న త్రీ
యాక్ట్స్ నే విభజించి 4, 8, 16, 32 ...ఎన్నైనా చేయవచ్చు. ఒక టీని మహా అయితే 1/3 చేసుకుని తాగవచ్చు, 1/4, 1/8, 1/16, 1/32
చేసుకుని ఎలా తాగుతారు. ఏం చేస్తున్నారంటే -జోసెఫ్ క్యాంప్ బెల్, జేమ్స్ బానెట్ లలో
కన్పించే హీరోస్ జర్నీ తాలూకు పదీ
పన్నెండు మజిలీల్నే యాక్స్ట్ కింద పెంచి చూపిస్తున్నారు. లేదా ఏ కథలోనైనా వుండే
ఎనిమిది సీక్వెన్సుల్ని ఎనిమిది యాక్ట్స్ గా చూపిస్తున్నారు. ఇవన్నీ బాగా పాపులర్
అయిపోయిన సిడ్ ఫీల్డ్ అంటే ఈర్ష్యతో చేస్తున్న పనులు. ఒక పాత స్కూలు పండితుడు తన
స్క్రీన్ ప్లే పుస్తకంలో సిడ్ ఫీల్డ్ ని
పరోక్షంగా తిట్టాడు కూడా. ఈ పీఠాల కోసం జరిగే పోరాటాల్లో లేగ దూడల్లా మనం నలిగిపోనవసరంలేదు.
సింపుల్ గా ‘శివ’ కి సరిపోయిన సిడ్ ఫీల్డ్ నమూనానే తీసుకుని, దీనికి స్థానిక అవసరాలకి అనుగుణంగా, పైన చెప్పుకున్నలాంటి ఆయా ఎలిమెంట్స్ ఎన్నింటినో కలుపుకుని, మన నమూనా
తయారు చేసుకున్నాం.
ఇలా
డీ ఫాల్టుగా వున్న శాస్త్రాన్ని తెలుగుకి కస్టమైజ్ చేస్తూ పోతూంటే ‘తెలుగు సినిమా
స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ అనే సబ్జెక్టు
చేతికొచ్చింది. ఇదంతా సుదీర్ఘ కాలంగా ఎంతోమంది అసోషియేట్ డైరెక్టర్లతో, కొందరు కో-
డైరెక్టర్లతో, డైరెక్టర్లతో చేస్తూ వచ్చిన
స్క్రీన్ ప్లేల వల్ల ప్రాక్టికల్ అనుభవంతోనే సాధ్యమైంది. మరొకటేమిటంటే, శాస్త్రాన్ని శాస్త్రంగా చూడక, దాన్ని ఓన్
చేసుకుని, మన ఐడియాలజీగా, ఫిలాసఫీగా వొంటబట్టించుకుంటే తప్ప ఇది రాయడానికి ధైర్యం
చాల్లేదు.
ఇక ఎన్నారై రాజేంద్ర ఆక్షేపించినట్టు ఈ వ్యాసాల్ని అకడెమిక్ భాషలో రాయలేదు. సినిమా జర్నలిజం పండిత భాషలో వుండదు. ముళ్ళపూడి వెంటకరమణ గారు పండిత భాషలో సినిమా వ్యాసాలు రాయలేదు. సిడ్ ఫీల్డ్, జేమ్స్ బానెట్ లు కూడా పండిత భాషలో రాయలేదు. ఈ వ్యాసాల్ని పదో తరగతి చదివిన సినిమా అసిస్టెంట్ కుర్రాడికి కూడా సులభంగా అర్ధమయ్యే వాడుక భాషలోనే రాశాం.
చివరిగా, ఈ వ్యాసాల్ని తమ సాహిత్య మాసపత్రిక ‘పాలపిట్ట’ లో ప్రచురిస్తూ వచ్చిన ఎడిటర్ గుడిపాటి వెంకటేశ్వర్లు, వర్కింగ్ ఎడిటర్ కె.పి. అశోక్ కుమార్ గార్లకు ధన్యవాదాలు. ‘సినిమా బజార్ డాట్ కాం’ లో ఈ వ్యాసాల్ని ప్రచురణకి తీసుకున్న పి. సతీష్ గారికీ ధన్యవాదాలు. ఈ వ్యాసాల్ని హిందీలోకి అనువదించి, యూనివర్శిటీ తరపున పుస్తకంగా వేస్తామని తెలిపిన రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ అసోషియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. లక్ష్మీ అయ్యర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
-సికిందర్