రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, సెప్టెంబర్ 2020, శనివారం

974 : రివ్యూ


రచన - దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ
తారాగణం : నాని
, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ తదితరులు
సంగీతం : తమన్
, అమిత్ త్రివేదీ, ఛాయాగ్రహణం : పీజీ విందా
నిర్మాత : దిల్ రాజు
విడుదల : అమెజాన్ ప్రైమ్

***
        నేచురల్ స్టార్ నాని  వి అనే కొత్త ప్రయత్నంతో ఈసారి ఏదో వైవిధ్యాన్నిసృష్టించ బోతున్నట్టు హైప్ వచ్చింది. ఆరు నెలలుగా వేడి వేడి కొత్త తెలుగు సినిమాల కోసం కళ్ళు కాయలు చేసుకుని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి కరువు దీరా ఆ లోటు తీర్చేస్తుందని - ప్రముఖ నిర్మాణ సంస్థ- ప్రముఖ దర్శకుడుల సంయుక్త సారధ్యం ఆశలు కల్పించింది. క్రమంగా ఇది సీరియల్ కిల్లర్ కథ అన్న విషయం కూడా వెల్లడైంది. స్వయంగా దర్శకుడు తానెందరో సీరియల్ కిల్లర్స్ జీవితాల్ని పరిశీలించానని చెప్పి సినిమా మీద నమ్మకం కూడా కల్గించాడు. నేచురల్ స్టార్ నాని అన్నేచురల్ పాత్రల్లో కూడా అభిమానుల కరతాళ ధ్వనులు అందుకుంటాడనేది తెలిసిందే. కానీ తేలికపాటి ప్రేమ కథల, కామెడీ కథల జానర్స్ తో ఓ గుర్తింపు పొందిన దర్శకుడు అన్నేచురల్ గా భారీ యాక్షన్ సినిమాలెందుకు ప్రయత్నిస్తున్నాడా అని గతంలో బందిపోటు వైఫల్యంతో ప్రేక్షకులకి అన్పించే వుంటుంది. బందిపోటు ని ఎటూ కాని జానర్ సినిమాగా దర్శకుడు అందించాడు. దర్శకుడి అనవసర ఇడెంటిటీ క్రైసిస్ ఈ పరిస్థితి తెచ్చి పెట్టినట్టు అర్ధమైంది. బందిపోటు లో క్రైమ్ నవలా రచయిత ఎడ్గార్ వాలెస్ శైలి కథ ఎలా కలుషితమైందో, తిరిగి ఇప్పుడు వి అనేసరికి, ఎడ్గార్ వాలెస్ తో మరో ప్రయత్నమేమో అన్పించేట్టు సినిమా ప్రచార రూపురేఖలు చేశాయి. పైగా నివేదా థామస్ క్రైమ్ రచయిత్రి పాత్ర పోషిస్తోందన్న ప్రచారం ఇంకింత ఆసక్తిని పెంచింది. సుధీర్ బాబు సీరియల్ కిల్లర్ ని పట్టుకునే పోలీసు పాత్రగా కూడా ప్రచారంలో కొచ్చాడు. ఇంత ప్రచార నేపథ్యంతో వి ఇంతకీ ఏమిటి? వైవిధ్యమేనా లేక అదో వింతేనా ఈ కింద తెలుసుకుందాం...

కథ
     హైదారాబాద్ లో ఆదిత్య (సుధీర్ బాబు) గ్యాలంటరీ మెడల్ పొందిన డిసిపి. ఇతడి పోలీసు బాధ్యతలు, సాహస కృత్యాలు గొప్పగా వుంటాయి. ఈ గొప్పకి బ్రేకు లేస్తూ వి అనే సీరియల్ కిల్లర్ (నాని) ఓ పోలీసుని హతమారుస్తాడు. తర్వాత ఇంకో పోలీసుని హతమారుస్తాడు. దమ్ముంటే నన్ను పట్టుకో, పట్టుకోలేకపోతే ఓడిపోయానని చెప్పి రాజీనామా చెయ్ అని సవాలు విసురుతాడు. ఈ సవాలుని స్వీకరించిన ఆదిత్య వేట మొదలెడతాడు. ఈ క్రమంలో తనని క్రైమ్ రచయిత్రి నంటూ పరిచయం చేసుకున్న అపూర్వ (నివేదా థామస్) ని  కూడా అనుమానిస్తాడు. ఇంతకీ వి ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? ఆదిత్య అతణ్ణి పట్టుకోగలిగాడా లేదా?... ఇదీ మిగతా కథ. 

నటనలు - సాంకేతికాలు 
   నాని నటించిన, విజయవంతగా మార్కెటింగ్ చేసిన, వి అనే టైటిల్ తో పాత్రకి ఇడెంటిటీ క్రైసిస్ లేకపోయినట్లయితే ఎలా నటించి కేరింతలు కొట్టించాలో అతడికి ఒక స్పష్టత వుండేది. నిజంగా ఇది సీరియల్ కిల్లర్ పాత్రేనా, లేక రివెంజి తీర్చుకునే మామూలు పాత్రనా అన్న సందిగ్ధంలో ప్రేక్షకుల్ని కూడా పడెయ్యడంతో ఎటూ కాని పాత్ర పోషణ అయ్యింది. ప్రచారం చేసిన సీరియల్ కిల్లర్ పాత్ర లక్షణాలు ఫస్టాఫ్ లో ఏమీ లేక. సెకండాఫ్ లో  సీరియల్ కిల్లర్ కాదు రివెంజి తీర్చుకుంటున్న రొటీన్ పాత్రంటూ వెల్లడైపోయాక, ఇక నాని బాగా సమస్యల్లో పడ్డాడు. బొత్తిగా విషయం లేని క్లయిమాక్సయితే అతణ్ణి బాగా దెబ్బతీసింది. 

        సుధీర్ బాబు రొటీన్ ఫార్ములా యాక్షన్ సినిమా పోలీసు పాత్రగా దర్యాప్తు కూడా అదే మూస పద్ధతిలో చేసి
, మూస నటనతో సరిపెట్టుకున్నాడు. నివేదా థామస్ క్రైమ్ రచయిత్రినంటూ బిల్డప్ ఇచ్చుకుని, ఆ రాసే క్రైమేదో రాసి కథలో పాలుపంచుకోకుండా, ఫక్తు నామమాత్రపు పాత్రగా, సుధీర్ బాబుతో రోమాంటిక్ గ్లామర్ బొమ్మ తనానికి పరిమితమైపోయింది. కశ్మీరీ పాత్ర సాహెబాగా అదితీ రావ్ హైదరీ, నాని పాత్రకి ప్రియురాలిగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఇంకో జీవం లేని ఫార్ములా పాత్రతో సరిపెట్టుకుంది. ఈ ఇద్దరు పేరున్న నటీమణులు నటించడానికి తగిన యూత్ ఓరియెంటెడ్ కొత్త పాత్రలు లభించకుండా వెలవెల బోయారు. 

        పాత్రలు -పాత్రధారులు - నటనలు ఇలా జీవంలేని జానర్ క్రైసిస్ కథతో డిస్మిస్ అయ్యాక
, ఇక మిగిలింది సాంకేతిక ప్రమాణాలు. కెమెరా మాన్, ఇద్దరు సంగీత దర్శకులు, ఎడిటరు, యాక్షన్ డైరెక్టరు మొదలైన సాంకేతికులందరూ ఎప్పటి కప్పుడు అప్డేట్ చేసుకుంటున్న తమ టెక్నిక్స్ తో సినిమాలకి నాణ్యతా ప్రమాణాలు చేకూర్చి పెడుతూంటారు. ఒక్క రైటింగ్, డైరెక్టింగ్ శాఖలే ఆ సాంకేతికుల ప్రతిభకి న్యాయం చేకూర్చే మానసిక స్థితిలో లేక, తెలుగు సినిమాలు బాక్సాఫీసు ముందు బొక్క బోర్లా పడిపోతున్నాయి. ఓటీటీలో బాక్సాఫీసు పరీక్ష తప్పించుకోవచ్చనేది వేరే విషయం. 

కథా కథనాలు 
     సీరియల్ కిల్లర్ జానర్ ని ఫ్యాక్షన్ సినిమా టెంప్లెట్ లో పెట్టి తయారు చేసిన- ఇప్పుడు మార్కెట్ యాస్పెక్ట్ లేని పాత రివెంజీ కథ ఇది. కథకి మార్కెట్ యాస్పెక్ట్ తో స్పష్టత వుంటే, కథనానికి ఆ మార్కెట్ యాస్పెక్ట్ కి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ దానికదే కుదురుతుంది. లేకపోతే గందర గోళమవుతుంది. ఇంత భారీ బడ్జెట్ కథకి ఇదే ప్రధాన సమస్యగా మారింది. ఎడ్గార్ వాలెస్ నిక మర్చిపోదాం. ఎడ్గార్ వాలెస్ నవలలతో మూకీల నుంచీ టాకీల దాకా యాభైకి పైగా సినిమాలొచ్చాయి. నిజంగా ఈ శైలిలో ఎడ్గార్ వాలెస్ అభిమాని అయిన దర్శకుడు బందిపోటు లో కలుషితమైన మేకింగ్ ని తిరిగి శుద్ధి చేసి పట్టాలెక్కించుకుని వుంటే, పక్కా సైకో కిల్లర్ కథే తగిన భావోద్వేగాలతో దిగ్విజయంగా తెరకెక్కెది. సైకో కిల్లర్ గా నాని ఎదుర్కొంటున్న సమస్య తాలూకు మనః స్థితిని ప్రేక్షకుల్లోకి తీసికెళ్లి వుంటే, ఆ ప్రేమోన్మత్త భావోద్వేగాలు బలంగా ముద్రవేసేవి. కానీ పైపైన రాసేసి పైపైన తీసెసే టెంప్లెట్స్ కిది సాధ్యం కాదు. నెక్స్ట్ లెవెల్ కెళ్ళి ఆలోచించాలనే అన్పించదు. 

        ఫస్టాఫ్ లో నాని రెండు హత్యలు చేసి సవాలు విసరడంతో ఎందుకు సీరియల్ కిల్లర్ గా మారాడన్న డ్రమేటిక్ క్వశ్చెన్ ఎస్టాబ్లిష్ అయింది. ఈ డ్రమెటేక్ క్వశ్చెన్ ఆధారంగా కథనం చేసుకు పోకుండా
, సెకండాఫ్ లో రివెంజి కథగా మార్చి, డ్రమెటేక్ క్వశ్చెన్ ని భంగపర్చారు.  దీంతో  స్క్రీన్ ప్లే నిట్ట నిలువునా ఫ్రాక్చర్ అవడమే గాక, సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో సినిమా పడింది. ఇక కథని దుమ్ము దులిపి నిలబెట్టడం ఎవరి వల్లా కాలేదు.          

        పైగా సెకండాఫ్ లో ఫ్యాక్షన్  సినిమాల్లో లాగా ఎవరో సుధీర్ బాబుకి అదితితో నాని కాశ్మీర్ ప్రేమ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం. దీంతో ఈ రివెంజి కథేమిటో కూడా తెలిసిపోయాక, ఫ్యాక్షన్ టెంప్లెట్లో క్లయిమాక్స్. 

        అసలు తనకి సవాలు విసురుతూ హత్యలెందుకు మొదలయ్యాయో తెలుసుకోవడానికి క్లూస్ తో సోకాల్డ్ ఇన్వెస్టిగేషన్ కాదు చేయాల్సింది. ఇది కాలంచెల్లిన టెంప్లెట్. ఇన్వెస్టిగేషన్ కతీతమైన బిగ్ పిక్చర్ ని చూడాల్సింది. తనకి సవాలు విసురుతూ హత్యలు జరగడం మామూలు పరిస్థితుల్లో మొదలుకాలేదు. తను మెడల్ సాధించిన ప్రత్యేక పరిస్థితుల్లో ప్రారంభమయ్యాయి. అంటే ఎవరైనా అసూయ పెంచుకున్న అధికారులు తోటి పోలీసుల్ని చంపుతున్నారా అన్న అనుమానం అతడి లాజికల్ మైండ్ కి రావాలి. ఈ మైండ్ బ్లోయింగ్ పాయింటుతో అధికారుల్లో అలజడి సృష్టిస్తే అప్పుడది బిగ్ పిక్చర్ చూడ్డమవుతుంది - స్టార్ సినిమాకి కావాల్సింది బిగ్ పిక్చర్ ని చూపించే హై కాన్సెప్ట్ కథే కావాలి తప్ప
, ఏదో బడ్జెట్లో సర్దుకునే సగటు చిన్న సినిమా కథ కాదు. 

        నాని ప్రేయసిని కోల్పోయాడు. దాంతో పిచ్చెక్కిన పాత్రగా అతడి విజృంభణకి షెడ్ కల్పిస్తే
, ఆ ఉన్మాద ప్రేమ యూత్ అప్పీల్ తో కదిలించే విధంగా వెండితెర మీద సార్ధకమయ్యేది. దీనికి తెలుగు కాదు, తెలుగంటే ఇప్పుడు నవ్వులాటగా వుంటుంది- ఇంగ్లీషు క్రైమ్ నవలా రచయిత్రిగా నివేదా థామస్ నానికే రహస్య తోడ్పాటు నందించే యాక్టివ్ పాత్రగా వుండివుంటే - ఈ మొత్తం సినిమా మూస టెంప్లెట్ యాక్షన్ కాకుండా, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మర్యాదలతో వుండేది.

సికిందర్  
(విజ్ఞప్తి :  రివ్యూల కోసం తొందరపెడుతూ ఫోన్లు చేయకుండా వుంటే బావుంటుందేమో ఆలోచించండి. తక్షణ రివ్యూలు ప్రాథమికంగా ఎలాగూ నెట్ లో చూసేస్తారు. సవివరంగా రాయాలంటే సమయం పడుతుంది. సవివరమైన రివ్యూ కోసం కాస్తాగితే ప్రమాదమేమీ జరగక పోవచ్చు. ఉదయం పదకొండు గంటలకి ఈ రివ్యూ పూర్తి చేస్తూంటే పుణ్యాత్ముడు కరెంటు పీకేశాడు ఏం చేద్దాం. ఈ వారమంతా కరెంటు పీకుతూ ఎంజాయ్ చేస్తున్నాడు)