రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, జులై 2017, శుక్రవారం

482 : రివ్యూ!

స్క్రీన్ ప్లే-దర్శకత్వం :  వాసు పరిమి 
తారాగణం  : జగపతిబాబు, బేబీ డాలీ, ఆమని, పద్మప్రియ, తాన్యా హోప్,  సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్, రఘుబాబు, కబీర్ సింగ్, పృథ్వీ, ప్రభాకర్ తదితరులు
కథ :  సునీల్ సుధాకర్, మాటలు : ప్రకాష్ , సంగీతం: వసంత్, ఛాయాగ్రహణం : శ్యాం కె.నాయుడు
బ్యానర్ :
వారాహి చిత్రం , నిర్మాత : రజినీ కొర్రపాటి 
విడుద :  జులై 14, 2017
***
        ఈ రివెంజి డ్రామాతో టాలీవుడ్ అమితాబ్ బచ్చన్ గా  రూపాంతరం చెందిన జగపతి బాబు,ఇప్పుడు వార్తల్లో వున్న డ్రగ్ సమస్య మీద మిలిటరీ ప్రతాపం చూపిస్తూ సమయానికి విచ్చేశారు. హీరో నుంచి విలన్లు, ఫాదర్లకి వెళ్లి, ఇక గ్రాండ్ ఫాదర్ గానూ  వేసేస్తే ఓ పనై పోతుందన్నట్టు విజృంభించారు. పనిలో పనిగా  తనకి ఇంకే  హీరోల సపోర్టు అవసరం లేదని, తానొక్కడూ వీరంగం వేసి ఒన్ మాన్ షో చూపించగలనని కూడా ఓ పక్క నిరూపించేశారు. వరసకట్టి (కక్ష కట్టి?) వస్తున్న రివెంజి డ్రామాల వెంట కొత్త దర్శకుడు వాసు పరిమి కూడా పరుగెత్తి, యాక్షన్ మూవీతో పరిచయమవా లనుకున్నాడు. ఇవన్నీ ఎంత వరకు ఫలించాయసలు?

కథ 
          రిటైర్డ్ ఆర్మీ మేజర్  సుభాష్ పటేల్ (జగపతిబాబు) అంధురాలైన మనవరాల్ని వెంటబెట్టుకుని డ్రగ్ మాఫియాని మట్టుబెడుతూంటాడు. ముగ్గుర్ని చంపాక నాల్గో ప్రయత్నం చేస్తూ  పోలీస్ ఆఫీసర్ (తాన్యా హోప్) కి దొరికిపోతాడు. అసలు పటేల్ ఎవరు, ఎందుకిలా పగ తీర్చుకుంటున్నాడు అనేవి మిగతా కథలో తెలిసే విషయాలు. 

ఎలావుంది కథ
      ప్రతీకార జ్వాలలు భగ్గుమం 
టున్నాయి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో. దువ్వాడ జగన్నాథం, కేశవ, వెంకటాపురం, లక్ష్మీ బాంబ్, అంధగాడు...ఆఖరికి మామ్ కూడా ప్రతీకారంతో రగిలి, సోదర పటేల్ సర్ కి పక్కన కొంత చోటిచ్చాయి. ‘పటేల్ సర్’ ప్రతీకారం నానా పటేకర్ ‘ప్రహార్’ లాంటి మిలిటరీ వాడి ప్రతీకారం.  ఐతే సరిహద్దుకావల కనిపించే శత్రువు వుంటాడని, కానీ ఈవల కనిపించని శత్రువులున్నారనేది ‘ప్రహార్’ కథా వస్తువు. వ్యక్తిగతంగా కనిపించే శత్రువులుంటే, కనిపించని శత్రువులు మనవెంటే వుంటారని ‘పటేల్ సర్’  థీమ్. ‘ప్రహార్’ సమాజం కోసం, ‘పటేల్’ ఒక మెట్టు కింద కేవలం సొంత కుటుంబం కోసం. ‘బొబ్బిలిపులి’ సైనికుడు సమాజంకోసం, పటేల్ సర్ సొంతం కోసం. ప్రతీకారం సొంత సమస్య అయినప్పుడు దానికి తేలిపోయే పర్మనెంట్ ఫార్ములాయే దాని బాక్సాఫీసు శత్రువవుతుంది. డ్రగ్ మాఫియాని సమాజ శత్రువుగా కూడా చూసివుంటే ఈ టెంప్లెట్ నుంచి బయటపడి ఆలోచింపజేసేది. ఆలోచించడానికి ఏమీ లేనప్పుడు ప్రతీకార కథలు బాక్సాఫీసుకీవలా, ఆవలా అన్నట్టుంటాయి.

ఎవరెలా చేశారు 

      ఏక్ అజనబీ (2005- ‘మాన్ ఆన్ ఫైర్’ కి ఫ్రీమేక్) ) తో వయసు మళ్ళిన అమితాబ్ లాంటి యాక్షన్ తడాఖాని జగపతి బాబు తెలుగులో రుచి చూపించారు. ఆయన ఒడ్డూ పొడవు, మొహంలో నవరసాలు, గొంతులో గాంభీర్యం అమితాబ్ కి తక్కువేం కావు. వేసి కుమ్మితే ఒకొక్కడూ రక్తం కక్కుకు చావాల్సిందే. ఈ కుమ్ముడులో మిలిటరీ వాడి కసి వుంది. కానీ కుమ్మించుకుంటున్న వాళ్లకి కుమ్ముతున్నది మిలిటరీ వాడని తెలిస్తే ఆ డ్రామా వేరే వుండేది. జగపతి పాత్ర చప్పట్లు కొట్టించుకునేది. ఇలా చేయకపోవడం బ్యాడ్ రైటింగ్. పోలీసులు కూడా  ‘అరవై ఏళ్ల ముసలాడు చంపుతున్నాడు’ అనుకోవడం ఇంకా బ్యాడ్ రైటింగే కాదు, లేజీ రైటింగ్ కూడా.  ‘అరవై ఏళ్ల  మిలిటరీ వాడు చంపుతున్నాడు’ అనడం ఇంటలిజెంట్ రైటింగ్.  కమర్షియల్ రైటింగ్. పాత్రని ఒక హోదాలో పరిచయం చేశాక,  ఆ హోదానే పక్కన పెట్టి చప్పగా పాత్రని నడిపించడం తెలుగు సినిమాల్లోనే వుంటుంది. ఎందుకిలా చేతులారా చేసుకుంటారో అస్సలు అర్ధంగాని బ్రహ్మ రహస్యం. నీ సినిమాని నిలబెట్టే నీ పాత్రని నువ్వు గౌరవించుకోకపోతే,  ప్రేక్షకులు కూడా గౌరవించరని హాలీవుడ్ లో హెచ్చరిస్తూంటారు ఇందుకే. 

          ఇంకో షేడ్ లో జగపతి తండ్రిగా, తాతగా, భర్తగా  రివీలవుతారు. ఈ కుటుంబ పరిధిలో మొదట కాఠిన్యం, తర్వాత  పశ్చాత్తాపంతో సున్నిత భావప్రకటనా, సంఘర్షణా వుంటాయి. మిలిటరీ పాత్రల్ని కుటుంబంలో ఇదే మారని మూసలో చూపిస్తూంటారు సినిమాల్లో. మిలిటరీ ప్రతాపం కుటుంబంలో కూడా చూపిస్తూ, శాంతి లేకుండా చేయడం. అది ఇల్లులా కాకుండా ఎడారిలా వుండడం. ఏమంటే డిసిప్లిన్ అనే పరమ  మూస డైలాగు. హిందీ సినిమాల్లో మాఫియాల్ని బయట ఎంత క్రూరంగా చూపిస్తారో, కుటుంబం పట్ల అంత ప్రేమగా చూపిస్తారు. పాత్రకి ఈ ద్వంద్వాల
వసరమే. 

       కొడుకు మెడిసిన్ చదువుతానంటే,  లేదు మిలిటరీ లోనే చేరాలని జగపతి అంత రౌద్రంతో, క్లోజప్ లో వూగిపోతూ అన్ని అరుపులు అరవడం అవసరమా. ఆయన సరిహద్దులో ఏం పీకాడో ఒక్క సీనూ లేదు. కుటుంబాన్ని పీకుతున్నాడు. ‘ప్రహార్’ లో నానా పటేకర్ సరిహద్దులో పీకాల్సిందంతా పీకి వచ్చి మాఫియాల్ని ఏకుతూంటాడు. ‘బొబ్బిలి పులి’  లో కూడా ఎన్టీఆర్ ఇంతే. ‘ప్రహార్’ లో బేకరీ నడిపే తండ్రి కుటుంబ వ్యాపారంలోకే  రమ్మంటాడు. మిలిటరీ లోనే చేరతానంటాడు కొడుకు. ఈ సమస్య నలుగుతూ వుంటుంది. పటేల్ లోలాగా  ఒక్క సీన్లో  తేల్చెయ్యరు. చివరికి మిలిటరీలోనే  చేరిపోతాడు కొడుకు. పటేల్  లాగా ఆ తండ్రి తెగతెంపులు చేసుకోడే? కొడుకుని బహిష్కరించే అధికారం పటేల్ కెలా వస్తుంది? భార్య తో జాయింట్ వెంచర్ కదా ఫ్యామిలీ అంటే? కుటుంబాన్ని ముక్కలు చేసే వాడు దేశాన్ని కాపాడతాడా? సరిహద్దులో కాపలాకి కుటుంబమే ఆక్సిజన్.  చెప్పుకుంటే  చాలా వుంటుంది, వదిలేద్దాం.

          భార్య భారతి పాత్రలో ఆమని మిలిటరీ భర్తకి సాంప్రదాయ బానిస భార్యగా  మూడు సీన్లలో బాధపడి, కొడుకు మీద బెంగతో చనిపోతుంది పాపం. 

          ఫారిన్ నుంచి తిరిగి వచ్చే కొడుకు పాత్రలో డాక్టర్ వల్లభ్ పటేల్ గా జగపతికి అప్పుడే నెరసిన జుట్టు వుంటుంది. అతను ఇరవైలలో వెళ్ళిపోయాడు, పదేళ్ళ తర్వాత తిరిగి వచ్చాడన్న కథనం ప్రకారం అతను ముప్ఫయ్ లలో కదా వుండాలి. అప్పుడే జుట్టు నెరిసిందా? ఇద్దరు పిల్లలు చూస్తే  పదేళ్లలోపు వాళ్ళు. వీళ్ళలో బేబీ డాలీ చివరికి తాతతో మిగులుతుంది. ఆమె తాతని పటేల్ అనే పిలుస్తుంది. ఇది ఫన్ గా వుంటుంది. ఇక వల్లభ్ భార్య పాత్రలో పద్మప్రియకి పెద్దగా పనేం లేదు. కానీ ఆమె  భర్తా పిల్లలతో కలిసి పదేళ్ళకి మొదటిసారిగా అత్తామామల్ని కలుస్తున్నప్పుడు, కనీసం పాదాలకి నమస్కరించి వుంటే పెద్ద పనే చేసినట్టుండేది. భర్త కూడా ఆ పని చెయ్యడు. పిల్లలకి ఆ తాతా నానమ్మలని పరిచయంచేసి నమస్కారాలు పెట్టించరు. అంతా తూతూ మంత్రంగానే వుంటుంది ఈ మాటలు కూడా లేని అపూర్వ కలయిక. ఇక ఈ కుటుంబానికి జరిగిన హాని ఏమిటో సస్పెన్స్ పోతుందనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పుకోవడం లేదు. 

          విలన్లుగా కబీర్ సింగ్, పృథ్వీ, ప్రభాకర్ లు రొటీన్ గానే కన్పిస్తారు. సినిమా ఓపెనింగ్ సీన్లో తమ డ్రగ్స్ బిజినెస్ కి యువతని వాడుకోవాలని మాట్లాడుకునే మాటలు- వాళ్ళు మాట్లాడుకుంటు
న్నట్టు వుండవు. ప్రేక్షకులకి కథ తెలియాలని,  కావాలని  మాట్లాడుకుంటున్నట్టు 
వుంటారు.వీళ్ళతో ఈ ఓపెనింగ్ సీన్ చాలా పేలవంగా వుంటుంది. రఘుబాబు, పోసానీలు తమ రెగ్యులర్ లౌడ్ కామెడీకి కట్టుబడ్డారు. సుబ్బరాజు మరో సారి క్లయిమాక్స్ ని మలుపు తిప్పే విలనీ ప్రదర్శిస్తాడు ‘దువ్వాడ జగన్నాథం’ లోలాగా. పోలీస్ అధికారిణిగా బికినీలో ఎంట్రీ ఇచ్చే తాన్యా హోప్ ఆ తర్వాత పాత్రకి సరైన పనిలేక అటూ ఇటూ తిరుగుతూంటుంది. పటేల్ మిత్రుడిగా శుభలేఖ సుధాకర్ కన్పిస్తాడు. 

          సాంకేతికంగా ఖర్చు బాగా పెట్టారు. నైనిటాల్,  దుబాయ్, హైదరాబాద్ దృశ్యాలు, కొన్ని యాక్షన్ సీన్లకి వేసిన సెట్లు  బావున్నాయి.  ఓల్డ్ జగపతిని స్టయిలిష్ గా చూపించడంలో శ్యామ్ కె నాయుడు సక్సెస్ అయ్యారు. పాటలు ఈ సినిమాకి పెద్దగా అవసరం లేకపోయినా వసంత్  సంగీతంలో నాల్గు పాటలున్నాయి. విజయ్, సతీష్, సాల్మన్ లు సమ
కూర్చిన యాక్షన్ సీన్స్ పక్కాగా వున్నాయి. గౌతం రాజు ఎడిటింగ్ ఈసారి వాడి తగ్గింది. 

చివరికేమిటి 
       కొత్త దర్శకుడు మరొకరి కథ తీసుకుని, మరొకరితో మాటలు రాయించుకుని, దర్శకత్వం చేపట్టడం చాలా కాలం తర్వాత చూస్తున్నాం. కథ తయారు చేయలేను, కానీ తీయగలనన్న స్పష్టతతో వుంటే, దర్శకత్వం మీదే పూర్తిగా పట్టు తెచ్చుకుని  హాలీవుడ్ దర్శకుల స్థాయిని స్థానికంగా పొందగలరు. ఐతే ఆ కథ తయారు చేసే వాళ్ళకి కథంటే ఏంటో తెలిసివుండాలి. సినిమా కథంటే బుర్రలో తిరిగేదీ, తిప్పుకునేదీ అని కాకుండా,  వెండితెర మీద తిరిగేదని, క్షణం క్షణం కాలాన్నీ దూరాన్నీ, బాక్సాఫీసు ఫీలింగ్సునీ  వెండి తెరమీద కొలుస్తూ వెళ్ళేదనీ  అవగాహన వుండాలి. ఇంతే గాకుండా పాత ఫార్ములాల్ని కొత్తగా కస్టమైజ్ చేసుకోగలగాలి. 

          పటేల్ సర్ కి రచయితలూ, దర్శకుడూ కొత్తవాళ్ళే అయినప్పుడు తప్పులు జరుగుతాయి. ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఎప్పుడూ కేవలం ఒక యూనిక్ సెల్లింగ్ పాయింటుతో స్టార్ ని చిటికెలో మెప్పించడం సరికాదు. ఆ యూనిక్ సెల్లింగ్ పాయింటుకి తగిన బలమైన కథనం కూడా వుండాలి. ఆ కథనం సమంజసంగా వుండాలి. యూనిక్ సెల్లింగ్ పాయింటు మీద  అవధుల్లేని మమకారంతో ఇంకేదీ అవసరం లేదనుకుంటే, రొటీనే చాలనుకుంటే, అది అన్నిసార్లూ కాపాడకపోవచ్చు.

          ఈ కథకి యూనిక్ సెల్లింగ్ పాయింటు ఇంటర్వెల్లో వుంది. బహుశా  దీనికే జగపతి ఫిదా అయిపోయారు. రెండోది,  యాక్షన్ తాత అనే క్యారక్టర్ కి ఫిజా అయిపోయారు. దీంతో దర్శకుడు, రచయితలూ, నిర్మాతా అందరూ కలిసి మిగతా వాటికి  అల్విదా చెప్పేశారు. మనం షుక్రియా చెప్పలేకపోతున్నాం. 

          ఇంటర్వెల్లో వేసిన ఈ యూనిక్ సెల్లింగ్ పాయింటుని ఇక్కడ రివీల్ చేయడం లేదు సస్పెన్స్ దృష్ట్యా. రివెంజి సినిమాల్లో  సస్పెన్స్ ఏముంటుంది,  ఎందుకు చంపుతున్నాడో ఇంటర్వెల్లో నైనా తెలిసిపోయేదే కదా అనుకోవచ్చు. ‘మామ్’  లో కూతుర్ని రేప్ చేసినందుకు శిక్షిస్తుందని   రివ్యూల్లో కారణం రివీల్ చేయడానికి  సస్పెన్స్ అడ్డుపడదు. కానీ పటేల్ సర్ ఇంటర్వెల్లో యూనిక్ సెల్లింగ్ పాయింటు రివెంజికి కారణం వెల్లడి చెయ్యదు. ఇంకో క్యారక్టర్ ని రివీల్ చేస్తుంది. ఇందుకే ఈ స్వీట్ యూనిక్ సెల్లింగ్ పాయింటుని వూరించే మిఠాయి పొట్లంలాగే వుంచెయ్యాలి. ఈ క్యారక్టర్ ని పట్టుకుని సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. 

          ఐతే ఫస్టాఫ్ అంతా  పటేల్ మనవరాల్ని వెంటబెట్టుకుని- (మనవరాలని మనకి రివీల్ చేయడం లేదు, ఎందుకంటే ఆమె పటేల్ అనే పిలుస్తోంది. బహుశా మనవరాలనే విషయం ఫస్టాఫ్ లో  మరుగుపర్చడానికే, తద్వారా పాత్ర గురించి ఆసక్తి రేపడానికే ఫ్లాష్ బ్యాక్ నుంచే ఆమె అలా పటేల్ అనే పిలవాలని నిర్ణయించారేమో. ఫ్లాష్ బ్యాక్ లో ఇది ఫన్ గా అన్పిస్తూ కవర్ చేసింది, ఫస్టాఫ్ లో మనవరాలనే విషయాన్ని మరుగుపర్చడానికి ఉపయోగ పడింది మంచి క్రియేషన్)-  మాఫియాల్ని చంపడమే కార్యక్రమంగా పెట్టుకోవడంతో ఎందుకు చంపుతున్నాడో తెలీక ఎలాటి ఎమోషన్స్ నీ పుట్టించదు ఈ ఫస్టాఫ్. ఎందుకు చంపుతున్నాడో పటేల్ కి మాత్రమే తెలుసు కాబట్టి తనొక్కడే ఎమోషనలవుతూ తనలోకంలో తనపనేదో తాను  చేసుకుంటున్నాడు- చేసుకోనీ మనకెందుకులే అని ప్రేక్షకులు వాళ్ళ మానాన వాళ్ళుంటారు.

          పటేల్ తో కొడుకు ఒక చోట అంటాడు- నా ప్రపంచాన్ని నేను సృష్టించుకోవడానికి వెళ్ళిపోతానని. వద్దని పటేల్ అరుస్తాడు. ఇదే నీ ప్రపంచం,  ఈ ప్రపంచంలోనే వుండాలని అంటాడు తన ప్రపంచంలో.  కానీ ఫస్టాఫ్ లో తన ప్రపంచంలో తాను మాత్రమే వుంటూ, తన ప్రపంచం లోంచి ప్రేక్షకుల్ని దూరంగా తరిమి కొట్టాడు. బాక్సాఫీసుకి ఏకాకి అయిపోయాడు! 

          వ్యక్తిగత పగలు ఎలా వున్నా  ప్రేక్షకులతో పేచీనే. ‘మామ్’ లో కారణం చెప్పి సెకండాఫ్ లో శిక్షిస్తూ పోయినా, పటేల్ లో కారణం చెప్పకుండా ఫస్టాఫ్ లో చంపుకుంటూ పోయినా రెండిటి డైనమిక్స్ ఒకటే- అరిగిపోయిన పళ్ళ చక్రాలు తిప్పడం. పటేల్ లో కారణమే  చెప్పకుండా చంపుకు పోవడం ఇంకా అసలే  చక్రాలు లేని డైనమిక్స్!

          ఇందుకే సోషల్ ఇష్యూ  జోడించాలనేది. పర్సనల్ ట్రాజడీ వుంటే వుండనీ. అది ఇతరులకేం ఉపయోగపడుతుంది. కమర్షియల్ పాత్రకి ఏం పనికొస్తుంది. అందులోంచి ఎదిగి షోషల్ ఇష్యూకి కనెక్ట్ అయినప్పుడే ఆ సొసైటీలో వుండే ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. అసలు పాత్రకి పర్సనల్ ట్రాజడీ వుందనే విషయమే ప్రేక్షకులకి క్లూ ఇవ్వకూడదు. సొసైటీ కోసమే పోరాడుతున్న పాత్రగా ఎస్టాబ్లిష్ చేసెయ్యాలి. పర్సనల్ రివెంజులు రొటీన్ గా ఫార్ములాకి బలవుతున్నాయని, ‘మాగ్నిఫిషెంట్ సెవెన్’ (1960) లో ఫార్ములా చెర విడిపించారు. అందులో కౌబాయ్ హీరో గ్రామాల్లో పాపులర్ అయివుంటాడు. ఓ గ్రామం మీద దుండగులు అస్తమానం దాడులు చేస్తూంటే అతడి సాయం కోరుకుంటారు. అతను ముఠాతో సుదీర్ఘ పోరాటం చేస్తూంటాడు. ఎందుకితను ఓ గ్రామప్రజల కోసం ఇంత పాటుపడుతున్నాడని మనకి ప్రశ్న ఎదురవుతూనే  వుంటుంది. ఐతే ఇదేదో వ్యక్తిగత కక్షలా కాకుండా గ్రామం కోసం ముఠాతో పోరాడుతూ వుండడంతో, ఈ ఆడియెన్స్ కనెక్ట్ ఆ ప్రశ్నని  డామినేట్ చేస్తూంటుంది. చిట్టచివరికి విలన్ ని చంపుతూ- ఆనాడు మా అమ్మనీ చెల్లినీ నువ్వు చంపావు కదరా అని గుర్తుచేసి,  కాల్చి పారేసి కక్ష తీర్చుకుంటాడు.

          గ్రేట్ క్యారక్టర్ గా కన్పిస్తాడు యల్ బ్రెన్నర్. ఎందుకంటే,  అంత బాధని అతను  దాచుకున్నాడని మనకి తెలీదు. వ్యక్తిగత విషాదాన్ని దిగమింగుకుని సొసైటీకి  చేసేవాడే గొప్ప క్యారక్టర్. ఇందుకే సోషల్ ఇష్యూ వుండాలనేది. 

          డ్రగ్స్ తో సమాజం విషతుల్యం అవుతూంటే దాని దృశ్యాలు, బాధితులు, బాముకుంటున్న మాఫియాలూ వీళ్ళని చంపుతున్న పటేల్...చూపిస్తే పటేల్ తో కనెక్ట్ అయ్యే ఎమోషన్ వచ్చేస్తుంది బాక్సాఫీసుకి. ఫ్లాష్ బ్యాక్ లో కుటుంబ కథ చూపించ వచ్చు, చివర్లో ట్రాజడీ తప్ప. ఐతే ఈ కుటుంబ కథ మీద ఫోకస్  ఎక్కువైపోతే, ప్రధాన కథ చెదిరిపోతుంది. ఈ ప్రమాదాన్ని కాచుకోవాలి. ఇక  చిట్ట చివర్లో ప్రధాన విలన్ ని చంపుతున్నప్పుడు- వాడికి, వాడితో బాటూ ప్రేక్షకులకీ తన పర్సనల్ ట్రాజడీకి సంబంధించిన సీన్ ని అప్పుడు షాకింగ్ గా రివీల్ చేస్తూ, ఆ ట్రాజడీ ఎలా జరిగిందో అక్షరాలా ఆవిధంగానే  వీడికీ  ట్రాజిక్ ఎండ్  ఇచ్చినప్పుడు, మరుగున వుంచిన పర్సనల్ రివెంజి అంతా వర్కౌట్ అయిపోతుంది!  ఈ మాగ్నిఫిషెంట్ ఫినిషింగ్ టచ్ తో పాత్ర గుర్తుండి పోతుంది.
***
          ఈ స్క్రీన్ ప్లేలో యూనిక్ సెల్లింగ్ పాయింట్ వల్ల కొత్తగా మారిందేమిటంటే, ఇంటర్వెల్ కే క్లయిమాక్స్ రావడం. ఇది అరుదైన చమత్కారం. ఫస్టాఫ్ లో ముగ్గుర్ని చంపాక మెయిన్ విలన్ ని చంపేటప్పుడే అవాంతరం ఏర్పడి ఇంటర్వెల్ రావడం. ఆ తర్వాతంతా  కుటుంబ ఫ్లాష్ బ్యాక్. దీని తర్వాత ఇంటర్వెల్ దగ్గర ఆపిన క్లయిమాక్స్ ని అందుకోవడం.  అంటే ఫస్టాఫ్ ని మిడిల్ తో  ప్రారంభించి,  ఇంటర్వెల్ దగ్గర ఆ మిడిల్ తాలూకు ప్లాట్ పాయింట్ టూ వరకూ వచ్చి ఆపి, సెకండాఫ్ లో బిగినింగ్ చెప్పడం మొదలెట్టరన్న మాట. బిగినింగ్ అయిపోగానే, ఆపిన ప్లాట్ పాయింట్ టూ నుంచీ ఎండ్ కెళ్లారన్న మాట. సాధారణంగా ఎండ్ తో ప్రారంభించి మళ్ళీ ఎండ్ కొస్తూంటారు. అది రొటీన్.  కథకి యూనిక్ సెల్లింగ్ పాయింటు ఏదైనా కనిపెట్టి, దాన్ని ఇంటర్వెల్లో పెట్టుకున్నప్పుడే మిడిల్ తో ప్రారంభించవచ్చని ఈ స్క్రీన్ ప్లే చెప్తోంది.
         



-సికిందర్
cinemabazaar.in
          

481 : రివ్యూ!



రచన దర్శకత్వం : శ్రీరాం ఆదిత్య 
తారాగణం : నారా రోహిత్,  సుధీర్, సందీప్ కిషన్, ఆది, చాందినీ చౌదరి, అనన్యా సోనీ, జెహ్నీ హనీ, సుమన్, తనికెళ్ళ, హేమ, సత్యం రాజేష్ తదితరులు.
సంగీతం : మణి శర్మ, ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
బ్యానర్ : భవ్య క్రియేషన్స్ వి ఆనంద్
విడుదల జూలీ 14, 2017
***
        ర్శకుడు శ్రీ రాం ఆదిత్య  2015 లో ‘భలేమంచి రోజు’ అనే ‘పరారీ’ జానర్ తో పరిచ
మయ్యాడు. తిరిగి ఇప్పుడూ అదే జానర్ లో ‘శమంతక మణి’ తో వచ్చాడు. ఈసారి మీడియం మల్టీ స్టారర్ తీస్తూ  నారా రోహిత్, సుధీర్, సందీప్ కిషన్, ఆది మొదలైన నల్గురు హీరోలని కలిపితెరకెక్కించాడు.  మల్టీ స్టారర్ అంటే పాపులర్ హీరోలకే  తప్ప  పాపులర్ హీరోయిన్లకి స్థానం లేదన్నట్టు,   తెలియని కొత్త హీరోయిన్లని పెట్టి వాళ్ళని కూడా నామమాత్రం చేశాడు. పర్సనల్ గానూ  ‘పరారీ’ జానర్ తనకెంత ఇష్టమో నిజ జీవితంలో కూడా చేసి చూపించిన  అనుభవంతో, ‘శమంతక మణి’ అనే రెండోది ఎలా తీర్చిదిద్దాడో ఇక చూద్దాం...
కథ 
      శమంతకమణి అనే ఒక పురాతన రోల్స్ రాయ్స్ కారుని వేలంలో ఐదు కోట్లకి కొంటాడు ఒక బిగ్ షాట్ (సుమన్). కొడుకు కృష్ణ (సుధీర్) కి ఆ కారుతో చనిపోయిన మదర్ సెంటి మెంటు వుంటుంది. తామిద్దరూ ఒకే రోజు పుట్టారు. అందుకని ఆ బర్త్ డేకి పార్టీ ఇవ్వడానికి ఆ కారేసుకుని స్టార్ హోటల్ కెళ్తాడు. అక్కడా కారుని పోగొట్టుకుంటాడు. ఇన్స్ పెక్టర్ రంజిత్ (నారారోహిత్) కేసు టేకప్ చేస్తాడు. ఆ రోజు ఆ ‘ప్రోవాటెల్’ స్టార్ హోటల్ కి వచ్చిన వాళ్ళల్లో ముగ్గుర్ని  అనుమానిస్తాడు. ఉమా మహేశ్వరరావు (రాజేంద్రప్రసాద్) ఒక మెకానిక్. తను ప్రేమిస్తున్న కూరగాయాలమ్మే భానుమతి (ఇంద్రజ) ని తీసుకుని ఎంజాయ్ చేయడానికి స్టార్ హోటల్ కి వస్తాడు. శివ (సందీప్ కిషన్) తను లేపుకుని పారిపోయిన పెళ్లి కూతురు తీరా అడ్డం తిరిగి పారిపోవడంతో, ఎటూ తోచక స్టార్ హోటల్ కి వస్తాడు. కార్తీక్ (ఆది) రిచ్ గర్ల్ ఫ్రెండ్ కోసం రిచ్ గా ఎదగాలనే కోరికతో డాబుగా అదే స్టార్ హోటల్ కొస్తాడు. ఈ ముగ్గుర్నీ అనుమానించి  పోలీస్ స్టేషన్ లో తోమడం మొదలెడతాడు ఇన్స్ పెక్టర్ రంజిత్.

          ఒకరి స్టేట్ మెంట్ ఇంకొకరి స్టేట్ మెంట్ తో కేసుని ముందుకి తీసికెళ్తూ రహస్యాలు విప్పుతూంటాయి. ఇంతకీ అసలేం జరిగింది, కారుని ఎవరు దొంగిలించారు, ఆతర్వాత ఆ కారుతో బయట పడ్డ రహస్యలేమిటి,  దరిమిలా ఈ ముగ్గురూ ఎలా రిచ్ అయిపోయారు, ఈ కేసుతో రిచ్ అయిపోయిన ఇన్స్ పెక్టర్ రంజిత్ సహా బిగ్ షాట్ ఎలా పూర్ అయిపోయరూ అనేది  మిగతా కథ.

ఎలావుంది కథ
      మొదటే చెప్పుకున్నట్టు ‘భలేమంచి రోజు’ లాగే ఇదీ ‘పరారీ’ జానర్ కథ. ‘భలేమంచి రోజు’ లో పారిపోయిన పెళ్లి కూతురి వేటలో, మల్టీపుల్ కిడ్నాపులతో సంకీర్ణ మయ్యే కథ. పైగా  ఒక రోజులో జరిగే టైం లాక్ తో వుండే కథ. టైం లాక్ కథలకి ముఖ్యమైన స్పీడు ఇందులో  లోపించింది.  ప్రస్తుత కథకి వస్తే, ఇది కారు ‘పరారైన’  కథ. దీని ఉద్దేశం కూడా వినోద పర్చడమే. ఈ లెక్కన ఇది కూడా ‘భలేమంచి రోజు’ లాగే కామిక్ ఎంటర్ టైనర్ థ్రిల్లర్. వారం వారం నరమాంస భక్షణ చేస్తున్న ప్రేమలు, భూతాల కంటే వెయ్యి రెట్లు బెటర్, ఓ పూట నవ్వుకుని రావడానికి. మదర్ సెంటిమెంట్ విజువల్స్ బావున్నాయి. 

ఎవరెలా చేశారు 
     ఆధునిక మల్టీ స్టారర్ కి కొత్త భాష్యం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్- 8’ ని గనుక దర్శకుడు  చూసి వుంటే ఇలాటి పాత్రల్ని ఇంకా క్రేజీగా తయారు చేసే ఐడియాలు వచ్చి వుండేవేమో. థ్రిల్లర్ రొటీనే అయినప్పుడు పాత్రలు  చాలా క్రేజీగా వుండి రొటీన్ ని మరిపించాల్సి వుంటుంది. కొంత వరకూ ఫన్నీ డైలాగులతో కవర్ చేసినా, ఎఫ్ఎఫ్ -8 మల్టీ స్టారర్ యాక్షన్  హీరోల డైలాగులు మాటకి మాట ‘హీ –మాన్’ గా పేల్తూ ఆ స్టార్స్ స్టేటస్ కి తగ్గట్టుగా వుంటాయి. స్టార్లూ జూనియర్లూ ఒకేలా మాట్లాడితే మజా ఏముంటుంది.  ‘అమీ తుమీ’ రొటీన్ రోమాంటిక్ కామెడీయే  అయినా, ఆ రొటీన్ ని మరిపిస్తూ  ఎక్స్ టెండెడ్ హ్యూమర్ తో డైలాగులు ఎలా పేల్చిందీ గుర్తున్నదే. నారా రోహిత్, సుధీర్, ఆది,  సందీప్ కిషన్ లు కలిసి పాత్రలకి ఈ మూస డైలాగుల చెర వదిలించి వుంటే బావుండేది. నటించడం పాత్రలకి సరిపోయింది. రాజేంద్ర ప్రసాద్ కూడా ఓకే. అయితే దర్శకుడు లెంప కాయలతో కామెడీ పుట్టించాలని చేసే ప్రయత్నం విఫలమైంది. 

        ఇది నల్గురు హీరోల యాక్షన్ మూవీ కాదు. అందుకని ఫైట్లు, పేల్చి వేతలూ లేవు. విలన్ అనేవాడు లేని కామిక్ థ్రిల్లర్ ఇది. కాబట్టి నల్గురికీ ఆవేశాలు తెచ్చుకుని సినిమాని సీరియస్ గా మార్చేసే, రక్తాలు పారించే  అగత్యం పట్టలేదు. ఒకొక్కరికి ఇచ్చిన ముగింపు కూడా ఫన్నీగా వుంది. 

          ఇక హీరోయిన్లు ఎవరో ఎందుకున్నారో,  ఎందుకు లేరో మనకి తెలీదు. నిడివి తక్కువున్నా తనికెళ్ళ, హేమలవి మరో రెండు ఫన్నీ పాత్రలు. యమ సీరియస్ తండ్రి పాత్ర సుమన్. అతడికి యమ పేచీ రెండో భార్య పాత్ర సురేఖా వాణి.  

          తక్కువ లొకేషన్స్ లో, పాటల్లేకుండా, తగినంత ప్రొడక్షన్ విలువలతో, మణి ‘శ్రమ’ నేపధ్య సంగీతంతో,  జానర్ మర్యాదని కాపాడుతూ మరీ అంత భయపడేలా తీయలేదు దర్శకుడు శ్రీరాం ఆదిత్య.

చివరి కేమిటి 
    ఈ మూవీ పూర్తిగా ఫ్లాష్ బ్యాకుల మయం. అయితే ఈ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులు విసిగించేలా లేవు. కథకి కుదిరిన సందర్భం అలాంటింది. రోషోమన్ ఎఫెక్ట్ తో తీసి వుంటే ఈ పరారీ జానర్ కి ప్రేక్షకులు పరారయ్యే వాళ్ళు. పరారీ (అన్వేషణ) జానర్ గా వుండాల్సిన ‘మరకతమణి’ అలాలేక కుదేసిన డైలాగ్ కామెడీగా వుండి బలి తీసుకుంది. ‘శమంతకమణి’ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులకి కామెడీని వాడడంతో కూడా అవి బోరుకొట్టేలా తయారు కాలేదు. కారు మిస్సయిన వార్త ఎస్టాబ్లిష్ చేసి, ఆ తర్వాత ఆ రాత్రి హోటల్ కి వెళ్ళిన సుధీర్, సందీప్, ఆది, రాజేంద్రప్రసాద్ ల పాత్రల్ని, వాళ్ళ జీవితాల్ని, ప్రేమల్నీ, ప్రేమల్లో సమస్యలతో చివరి ముగ్గురూ హోటల్ కి ఎలా వచ్చిందీ చూపించుకొచ్చారు. ఇది ఫస్టాఫ్ సమయమంతా తీసుకోవడంతో, తిరిగి అదే కారు మిస్సయిన వార్త దగ్గరికే వచ్చి ఆగడంతో,  ఫస్టాఫ్ లో ఏమీ జరగట్టు, ఫ్లాట్ గా వున్నట్టూ అన్పిస్తుంది. ఇన్ని పాత్రలుండడం వల్ల  బిగినింగ్ ని సెటప్ చేయడానికి  ఇంత సమయమూ పట్టింది. కొన్ని సార్లు కథనానికి స్ట్రక్చర్ అడ్డు వస్తుంది. స్ట్రక్చర్ కోసం కథనాన్ని కుదించలేని పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు స్ట్రక్చర్ ని త్యాగం చేస్తూ- ఫస్టాఫ్ లో ఏమీ జరగడం లేదన్న ఫీల్ ని ఏమారుస్తూ  క్యారక్టరైజేషన్స్  తో మాయ చేస్తూ పోవాల్సిందే. నాని నటించిన ‘భలేభలే మగాడివోయ్’ అనే హిట్ లో ఇంతే జరిగింది. అది స్ట్రక్చర్ ని ఎగేసిన క్యారక్టరైజేషన్. 

          అలా ‘శమంతకమణి’ లో హీరోలకి ఎఫ్ ఎఫ్ -8 ఫార్ములా వర్తింప జేసివుంటే ఫస్టాఫ్ పెప్ పెరిగేది. ఇక సెకండాఫ్ లో హోటల్లో ఆ రాత్రి ఒక్కొక్కరూ ఏం చేశారన్న ఫ్లాష్ బ్యాకులు వుంటాయి. వీటికి కామెడీయే ప్రధానమై కథని నిలబెడతాయి. ముగింపు కొస్తున్న కొద్దీ కేవలం పోయిన కారుని పట్టుకోవడమే కదా  ఈ కథ అన్న వెలితికి దారి తీస్తుంది. కానీ ఈ ముగిపులోనే కథ అమాంతం పెరిగి పెద్దదైపోతుంది. వూహించని సస్పెన్స్ తో వున్న ఈ ముగింపూ  ఫన్నీగానే వుంటుంది.

          ‘భలేమంచి రోజు’ తర్వాత ఇంకాస్త ఇంప్రూవ్ అయ్యాడు దర్శకుడు. ఐతే ప్రతీసారీ ‘పరారీ’ నే నమ్ముకోకుండా, ఈ కామిక్ థ్రిల్లర్స్ లోనే వేరే కథల్ని ట్రై చేస్తే బావుంటుంది.


-సికిందర్
`http://www.cinemabazaar.in