రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, జులై 2017, శుక్రవారం

481 : రివ్యూ!



రచన దర్శకత్వం : శ్రీరాం ఆదిత్య 
తారాగణం : నారా రోహిత్,  సుధీర్, సందీప్ కిషన్, ఆది, చాందినీ చౌదరి, అనన్యా సోనీ, జెహ్నీ హనీ, సుమన్, తనికెళ్ళ, హేమ, సత్యం రాజేష్ తదితరులు.
సంగీతం : మణి శర్మ, ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
బ్యానర్ : భవ్య క్రియేషన్స్ వి ఆనంద్
విడుదల జూలీ 14, 2017
***
        ర్శకుడు శ్రీ రాం ఆదిత్య  2015 లో ‘భలేమంచి రోజు’ అనే ‘పరారీ’ జానర్ తో పరిచ
మయ్యాడు. తిరిగి ఇప్పుడూ అదే జానర్ లో ‘శమంతక మణి’ తో వచ్చాడు. ఈసారి మీడియం మల్టీ స్టారర్ తీస్తూ  నారా రోహిత్, సుధీర్, సందీప్ కిషన్, ఆది మొదలైన నల్గురు హీరోలని కలిపితెరకెక్కించాడు.  మల్టీ స్టారర్ అంటే పాపులర్ హీరోలకే  తప్ప  పాపులర్ హీరోయిన్లకి స్థానం లేదన్నట్టు,   తెలియని కొత్త హీరోయిన్లని పెట్టి వాళ్ళని కూడా నామమాత్రం చేశాడు. పర్సనల్ గానూ  ‘పరారీ’ జానర్ తనకెంత ఇష్టమో నిజ జీవితంలో కూడా చేసి చూపించిన  అనుభవంతో, ‘శమంతక మణి’ అనే రెండోది ఎలా తీర్చిదిద్దాడో ఇక చూద్దాం...
కథ 
      శమంతకమణి అనే ఒక పురాతన రోల్స్ రాయ్స్ కారుని వేలంలో ఐదు కోట్లకి కొంటాడు ఒక బిగ్ షాట్ (సుమన్). కొడుకు కృష్ణ (సుధీర్) కి ఆ కారుతో చనిపోయిన మదర్ సెంటి మెంటు వుంటుంది. తామిద్దరూ ఒకే రోజు పుట్టారు. అందుకని ఆ బర్త్ డేకి పార్టీ ఇవ్వడానికి ఆ కారేసుకుని స్టార్ హోటల్ కెళ్తాడు. అక్కడా కారుని పోగొట్టుకుంటాడు. ఇన్స్ పెక్టర్ రంజిత్ (నారారోహిత్) కేసు టేకప్ చేస్తాడు. ఆ రోజు ఆ ‘ప్రోవాటెల్’ స్టార్ హోటల్ కి వచ్చిన వాళ్ళల్లో ముగ్గుర్ని  అనుమానిస్తాడు. ఉమా మహేశ్వరరావు (రాజేంద్రప్రసాద్) ఒక మెకానిక్. తను ప్రేమిస్తున్న కూరగాయాలమ్మే భానుమతి (ఇంద్రజ) ని తీసుకుని ఎంజాయ్ చేయడానికి స్టార్ హోటల్ కి వస్తాడు. శివ (సందీప్ కిషన్) తను లేపుకుని పారిపోయిన పెళ్లి కూతురు తీరా అడ్డం తిరిగి పారిపోవడంతో, ఎటూ తోచక స్టార్ హోటల్ కి వస్తాడు. కార్తీక్ (ఆది) రిచ్ గర్ల్ ఫ్రెండ్ కోసం రిచ్ గా ఎదగాలనే కోరికతో డాబుగా అదే స్టార్ హోటల్ కొస్తాడు. ఈ ముగ్గుర్నీ అనుమానించి  పోలీస్ స్టేషన్ లో తోమడం మొదలెడతాడు ఇన్స్ పెక్టర్ రంజిత్.

          ఒకరి స్టేట్ మెంట్ ఇంకొకరి స్టేట్ మెంట్ తో కేసుని ముందుకి తీసికెళ్తూ రహస్యాలు విప్పుతూంటాయి. ఇంతకీ అసలేం జరిగింది, కారుని ఎవరు దొంగిలించారు, ఆతర్వాత ఆ కారుతో బయట పడ్డ రహస్యలేమిటి,  దరిమిలా ఈ ముగ్గురూ ఎలా రిచ్ అయిపోయారు, ఈ కేసుతో రిచ్ అయిపోయిన ఇన్స్ పెక్టర్ రంజిత్ సహా బిగ్ షాట్ ఎలా పూర్ అయిపోయరూ అనేది  మిగతా కథ.

ఎలావుంది కథ
      మొదటే చెప్పుకున్నట్టు ‘భలేమంచి రోజు’ లాగే ఇదీ ‘పరారీ’ జానర్ కథ. ‘భలేమంచి రోజు’ లో పారిపోయిన పెళ్లి కూతురి వేటలో, మల్టీపుల్ కిడ్నాపులతో సంకీర్ణ మయ్యే కథ. పైగా  ఒక రోజులో జరిగే టైం లాక్ తో వుండే కథ. టైం లాక్ కథలకి ముఖ్యమైన స్పీడు ఇందులో  లోపించింది.  ప్రస్తుత కథకి వస్తే, ఇది కారు ‘పరారైన’  కథ. దీని ఉద్దేశం కూడా వినోద పర్చడమే. ఈ లెక్కన ఇది కూడా ‘భలేమంచి రోజు’ లాగే కామిక్ ఎంటర్ టైనర్ థ్రిల్లర్. వారం వారం నరమాంస భక్షణ చేస్తున్న ప్రేమలు, భూతాల కంటే వెయ్యి రెట్లు బెటర్, ఓ పూట నవ్వుకుని రావడానికి. మదర్ సెంటిమెంట్ విజువల్స్ బావున్నాయి. 

ఎవరెలా చేశారు 
     ఆధునిక మల్టీ స్టారర్ కి కొత్త భాష్యం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్- 8’ ని గనుక దర్శకుడు  చూసి వుంటే ఇలాటి పాత్రల్ని ఇంకా క్రేజీగా తయారు చేసే ఐడియాలు వచ్చి వుండేవేమో. థ్రిల్లర్ రొటీనే అయినప్పుడు పాత్రలు  చాలా క్రేజీగా వుండి రొటీన్ ని మరిపించాల్సి వుంటుంది. కొంత వరకూ ఫన్నీ డైలాగులతో కవర్ చేసినా, ఎఫ్ఎఫ్ -8 మల్టీ స్టారర్ యాక్షన్  హీరోల డైలాగులు మాటకి మాట ‘హీ –మాన్’ గా పేల్తూ ఆ స్టార్స్ స్టేటస్ కి తగ్గట్టుగా వుంటాయి. స్టార్లూ జూనియర్లూ ఒకేలా మాట్లాడితే మజా ఏముంటుంది.  ‘అమీ తుమీ’ రొటీన్ రోమాంటిక్ కామెడీయే  అయినా, ఆ రొటీన్ ని మరిపిస్తూ  ఎక్స్ టెండెడ్ హ్యూమర్ తో డైలాగులు ఎలా పేల్చిందీ గుర్తున్నదే. నారా రోహిత్, సుధీర్, ఆది,  సందీప్ కిషన్ లు కలిసి పాత్రలకి ఈ మూస డైలాగుల చెర వదిలించి వుంటే బావుండేది. నటించడం పాత్రలకి సరిపోయింది. రాజేంద్ర ప్రసాద్ కూడా ఓకే. అయితే దర్శకుడు లెంప కాయలతో కామెడీ పుట్టించాలని చేసే ప్రయత్నం విఫలమైంది. 

        ఇది నల్గురు హీరోల యాక్షన్ మూవీ కాదు. అందుకని ఫైట్లు, పేల్చి వేతలూ లేవు. విలన్ అనేవాడు లేని కామిక్ థ్రిల్లర్ ఇది. కాబట్టి నల్గురికీ ఆవేశాలు తెచ్చుకుని సినిమాని సీరియస్ గా మార్చేసే, రక్తాలు పారించే  అగత్యం పట్టలేదు. ఒకొక్కరికి ఇచ్చిన ముగింపు కూడా ఫన్నీగా వుంది. 

          ఇక హీరోయిన్లు ఎవరో ఎందుకున్నారో,  ఎందుకు లేరో మనకి తెలీదు. నిడివి తక్కువున్నా తనికెళ్ళ, హేమలవి మరో రెండు ఫన్నీ పాత్రలు. యమ సీరియస్ తండ్రి పాత్ర సుమన్. అతడికి యమ పేచీ రెండో భార్య పాత్ర సురేఖా వాణి.  

          తక్కువ లొకేషన్స్ లో, పాటల్లేకుండా, తగినంత ప్రొడక్షన్ విలువలతో, మణి ‘శ్రమ’ నేపధ్య సంగీతంతో,  జానర్ మర్యాదని కాపాడుతూ మరీ అంత భయపడేలా తీయలేదు దర్శకుడు శ్రీరాం ఆదిత్య.

చివరి కేమిటి 
    ఈ మూవీ పూర్తిగా ఫ్లాష్ బ్యాకుల మయం. అయితే ఈ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులు విసిగించేలా లేవు. కథకి కుదిరిన సందర్భం అలాంటింది. రోషోమన్ ఎఫెక్ట్ తో తీసి వుంటే ఈ పరారీ జానర్ కి ప్రేక్షకులు పరారయ్యే వాళ్ళు. పరారీ (అన్వేషణ) జానర్ గా వుండాల్సిన ‘మరకతమణి’ అలాలేక కుదేసిన డైలాగ్ కామెడీగా వుండి బలి తీసుకుంది. ‘శమంతకమణి’ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులకి కామెడీని వాడడంతో కూడా అవి బోరుకొట్టేలా తయారు కాలేదు. కారు మిస్సయిన వార్త ఎస్టాబ్లిష్ చేసి, ఆ తర్వాత ఆ రాత్రి హోటల్ కి వెళ్ళిన సుధీర్, సందీప్, ఆది, రాజేంద్రప్రసాద్ ల పాత్రల్ని, వాళ్ళ జీవితాల్ని, ప్రేమల్నీ, ప్రేమల్లో సమస్యలతో చివరి ముగ్గురూ హోటల్ కి ఎలా వచ్చిందీ చూపించుకొచ్చారు. ఇది ఫస్టాఫ్ సమయమంతా తీసుకోవడంతో, తిరిగి అదే కారు మిస్సయిన వార్త దగ్గరికే వచ్చి ఆగడంతో,  ఫస్టాఫ్ లో ఏమీ జరగట్టు, ఫ్లాట్ గా వున్నట్టూ అన్పిస్తుంది. ఇన్ని పాత్రలుండడం వల్ల  బిగినింగ్ ని సెటప్ చేయడానికి  ఇంత సమయమూ పట్టింది. కొన్ని సార్లు కథనానికి స్ట్రక్చర్ అడ్డు వస్తుంది. స్ట్రక్చర్ కోసం కథనాన్ని కుదించలేని పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు స్ట్రక్చర్ ని త్యాగం చేస్తూ- ఫస్టాఫ్ లో ఏమీ జరగడం లేదన్న ఫీల్ ని ఏమారుస్తూ  క్యారక్టరైజేషన్స్  తో మాయ చేస్తూ పోవాల్సిందే. నాని నటించిన ‘భలేభలే మగాడివోయ్’ అనే హిట్ లో ఇంతే జరిగింది. అది స్ట్రక్చర్ ని ఎగేసిన క్యారక్టరైజేషన్. 

          అలా ‘శమంతకమణి’ లో హీరోలకి ఎఫ్ ఎఫ్ -8 ఫార్ములా వర్తింప జేసివుంటే ఫస్టాఫ్ పెప్ పెరిగేది. ఇక సెకండాఫ్ లో హోటల్లో ఆ రాత్రి ఒక్కొక్కరూ ఏం చేశారన్న ఫ్లాష్ బ్యాకులు వుంటాయి. వీటికి కామెడీయే ప్రధానమై కథని నిలబెడతాయి. ముగింపు కొస్తున్న కొద్దీ కేవలం పోయిన కారుని పట్టుకోవడమే కదా  ఈ కథ అన్న వెలితికి దారి తీస్తుంది. కానీ ఈ ముగిపులోనే కథ అమాంతం పెరిగి పెద్దదైపోతుంది. వూహించని సస్పెన్స్ తో వున్న ఈ ముగింపూ  ఫన్నీగానే వుంటుంది.

          ‘భలేమంచి రోజు’ తర్వాత ఇంకాస్త ఇంప్రూవ్ అయ్యాడు దర్శకుడు. ఐతే ప్రతీసారీ ‘పరారీ’ నే నమ్ముకోకుండా, ఈ కామిక్ థ్రిల్లర్స్ లోనే వేరే కథల్ని ట్రై చేస్తే బావుంటుంది.


-సికిందర్
`http://www.cinemabazaar.in