రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, ఏప్రిల్ 2016, శుక్రవారం

రచన- దర్శకత్వం : పవన్ సాదినేని
తారాగణం : నారా రోహిత్ , నందిత, ధన్యా బాలకృష్ణ, పోసాని, మురళీశర్మ, అజయ్, రవిబాబు, జీవా తదితరులు
సంగీతం : శ్రవణ్,  ఛా యాగ్రహణం : వసంత్
బ్యానర్ : విజన్ ఫిలిం మేకర్స్,  నిర్మాత : డా. విబి రాజేంద్రప్రసాద్
విడుదల : ఏప్రెల్ 1,  2016
***
          కప్పుడు నారా రోహిత్ అంటే భిన్నమైన కథలకి అవకాశమిస్తాడని పేరుండేది. బాణం, రౌడీ ఫెలో, అసుర లాంటి ప్రయోగాత్మక  సినిమాలతో తనదంటూ ఒక రూటు ఏర్పాటు చేసుకున్నాడని ఆనందిస్తున్నంతలోనే,  తిరోగమించి రొటీన్ మసాలాల, పాత మూస ఫార్ములాల బాటపట్టాడు! న్యూ జనరేషన్ నుంచి, ఎవరికీ పట్టని  ఓల్డ్ జనరేషన్ సినిమాలకి యూ టర్న్ తీసుకున్నాడు. సెల్ ఫోన్స్ కూడా ఇవ్వాళ 4 జి కి అప్డేట్ అవుతూంటే,  తను  ఎక్కడో 2 జి సినిమాల దగ్గరే ఉండిపోవాలని ఉబలాటపడుతున్నాడు!


       రెండు వారాల క్రితమే ‘తుంటరి’ తో సహనాన్ని పరీక్షించాక, తిరిగి ఇప్పుడు ‘సావిత్రి’ అంటూ పరమ చాదస్తంతో ‘సి’ సెంటర్లో కూడా ఆడని విషయంతో పరీక్ష పెట్టాడు ప్రేక్షకుల్ని. తన ఫిజిక్ పట్ల శ్రద్ధ ఎలా చూపడంలేదో, అలా సినిమాల ఎంపిక లోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నట్టు తోస్తోంది  చూస్తూంటే. ప్రస్తుతం ‘సావిత్రి’ తో నైతే ఈ అలసత్వం పరాకాష్టకి  చేరింది!  ఇలా ఇంత భయపెట్టేస్తే, అసలే తగ్గిన తన ప్రేక్షకులు, ఇంకో తన సినిమాకి అసలు తొంగి చూస్తారా అని సందేహం!  

          గతంలో ‘ప్రేమ- ఇష్క్- కాదల్’  అనే ప్రేమ సినిమా తీసిన దర్శకుడు పవన్ సాదినేని ఇప్పుడు అతి చాదస్తపు, పాతవాసనల  సినిమాని, పాత దర్శకుడెవరో  తీసినట్టు తీసి అవతల పడేశాడు.

కథ
        సావిత్రి ( నందిత) ఓ పెళ్లి పందిట్లో పుట్టిన కారణంగా తను కూడా  త్వరగా పెళ్లి చేసుకుని అలాటి పెళ్లి సందడి  చూసుకోవాలన్న ఆరాటంతో వుంటుంది. పెళ్లి తప్ప ఇంకో ఆలోచనే వుండదు ఆమెకా  పల్లెటూళ్ళో. ఆమె తండ్రి (మురళీ శర్మ)  పెద్ద కూతురి ( ధన్యా బాలకృష్ణ ) పెళ్లి చేశాక,  ఇక సావిత్రికి కూడా సంబంధం చూస్తాడు. ఇదిలా వుండగా నానమ్మ తో కలిసి సావిత్రి షిర్డీ బయల్దేరుతుంది. ఈ రైలు ప్రయాణంలో ఆమెకు రిషి  ( రోహిత్) పరిచయమవుతాడు. ఇతను  ఎం బీ బీ ఎస్ చదివి(!)  ఆవారా తిరుగుళ్ళు తిరుగుతూ తల్లి చేత చివాట్లు తింటూంటాడు (ఇంతే కదా తెలుగు సినిమాల్లో, సైంటిస్టు కూడా ఆవారానే!).   ఇప్పుడు సావిత్రిని చూడగానే ప్రేమలో పడి  వెంటపడతాడు. ఒక ప్రేమ జంట పారిపోయి వచ్చి ఇదే రైలెక్కుతుంది. వీళ్ళ కోసం ఒక ముఠా వెంటపడుతుంది.  ఆ ముఠా బారి నుంచి ఆ జంటని కాపాడి, సావిత్రికి తన ప్రేమని వ్యక్తం చేస్తాడు రిషి. ఆమె తిప్పి కొడుతుంది. తమతో వున్న జంట కేమైందో కళ్ళారా చూసిన సావిత్రి, పెద్దలు కుదిర్చిన సంబధమే చేసుకుంటానంటుంది. రిషి నేరుగా వెళ్లి ఆమె తండ్రితో మాట్లాడతాడు.  అప్పటికే ఆమె తండ్రి సంబంధం చూసిన కుర్రాడు ఆ సంబంధం రద్దు చేసుకుంటాడు. ఇప్పుడు రిషిని కోప్పడి పంపించేస్తాడు సావిత్రి తండ్రి. సావిత్రిని ఎలాగైనా చేసుకుంటానని రిషి పంతం పడతాడు. ఇదీ కథ. 

ఎలావుంది కథ?
          ‘1980 – ఒక పాత పెళ్లి కథ’ అంటూ తీస్తే ఎలా వుంటుందో అలావుంది కథ.   ఇంత పురాతనమైన కథని ఈ రోజుల్లో ప్రేక్షకుల చేత ఒప్పించగలనని దర్శకుడు భావించడం చాలా తెగింపు. ఇంకా మూడు పదుల దర్శకుడే యూత్ సినిమాని ఈ తీరున పెళ్ళిళ్ళ చాదస్తంతో తీస్తే, ఇంకెవరు తెలుగు సినిమాని కాపాడతారన్నట్టుంది. దేశంలో ఎక్కడైనా ఇవ్వాళ యూత్ వీలైనంత ఎక్కువ కాలం సింగిల్ గా గడిపేద్దాం అనుకుంటున్నారు. ఈ సింగిల్ లైఫ్ లో పెళ్ళిళ్ళ గోల కాదు కదా, సీరియస్  ప్రేమలకి కూడా దూరంగా వుంటున్నారు. కేవలం కెరీర్ మైండెడ్ గా కొనసాగుతూ ఫ్లర్టింగ్ తో టైం పాస్ చేసేద్దామనుకుంటున్నారు. బాలీవుడ్ చేసిన  సర్వే రిపోర్టే ఇదంతా వెల్లడిస్తోంది- ఈ నేపధ్యంలో యూత్ సినిమాల్ని బాలీవుడ్ ఏనాడో పునర్నిర్వచించుకుని,  ఆ పోకడలతో తీస్తూ తిరిగి యూత్ ని తన వైపుకు తిప్పుకుంటోంది.

          తెలుగులో ఇలాటిది చేస్తే పాపం అనుకుంటున్నారు మూఢ నమ్మకాల జీవులు. అందుకు బాక్సాఫీసు దగ్గర అనుభవిస్తూనే వున్నారు.  తాము చూసిన అవే నాల్గు పాత తెలుగు సినిమా కథల్ని రీసైక్లింగ్ చేస్తూ, ఇదిగో ఇలాటి ‘సావిత్రి’ లాంటివి తీసి వీటికి  లేని మార్కెట్ పైన ఘరానాగా రుద్ది చేతులు దులుపుకుంటున్నారు. 

ఎవరెలా చేశారు
         
వర్నీ ఒక్క నిమిషం పాటు భరించడమే కష్టం. ఉన్న పదీ పదిహేను మందిలో ఇంటర్వెల్ కే సగం మంది ప్రేక్షకులు పరార్. రోహిత్ కాదుకదా, నందిత కాదుకదా, కమెడియన్లు కాదుకదా, ఇంకే సూపర్ స్టార్లు నటించినా వాళ్ళని కూడా భరించలేం ఈ సినిమాలో. కెమెరా, సంగీతంల సంగతి చెప్పనక్కర్లేదు. కథలాగే అన్నీ చప్పగా వున్నాయి. దర్శకుడి టేకింగ్, స్క్రీన్ ప్లే, మేకింగ్ ప్రతీదీ నాసిరకంగా వున్నాయి. 

చివరికేమిటి?
          ఏమీ లేదు, దర్శకుడు తన మూడు పదుల వయసులో ముప్పై పదుల సినిమా తీశాడు. ముదుసలులు కూడా చూసి తమ పాతజ్ఞాపకల్లో విహరిస్తారా అంటే, వాళ్ళు కూడా అప్పుడెపుడో ఓ రాజుని ఓ రుషి శపించినట్టు- యువదర్శకుణ్ణీ, రోహిత్ నీ ‘వృద్ధులైపోండి!’ అని దీవించేట్టున్నారు. 

          పోతే, గంట సేపు ట్రైన్ లోనే సాగే  సీన్లని తీయడానికి ఎన్ని తిప్పలో. కాస్సేపు ట్రైను ముందుకు పోతున్నట్టు, ఇంకాస్సేపు వెనక్కి పోతున్నట్టు చెట్లూ చేమలూ కదుల్తూ కన్పిస్తాయి. పోనిద్దాం- గత డిసెంబర్ లోనే గోపీచంద్ నటించిన ‘సౌఖ్యం’ లోనే ఈ తిప్పలు పడగా లేంది ఇదెంత!!


-సికిందర్
http://www.cinemabazaar.in/

PS :  సినిమాల్ని సమాజం ఫాలో అవదు,
సినిమాలే సమాజాన్ని ఫాలో అవుతాయి.