రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, August 31, 2019

866 : సందేహాలు - సమాధానాలు


Q :  కథ రాస్తున్నామనే భ్రమలో గాథల్ని రాయకుండా, పూర్తి స్పృహతో గాథల్ని రాయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతారా? గాథ సినిమాకు పనికిరాదని మీరు చాలాసార్లు చెప్పారు. కానీ గాథల్లో మెజారిటీ ప్లాప్స్ వున్నా, ఫారెస్ట్ గంప్, ప్రేమమ్ లాంటి విజయవంతమైనవి కూడా వున్నాయి కదా. ఒక వేళ మహానటి’ సినిమా బయోపిక్ కాకపోయి వుంటే, అది కూడా గాథ కిందకు వస్తుందా? తెలియజేయగలరు.
ఎపి, AD
A :  ‘మహానటి’ లో చూపించిన సావిత్రి గారి జీవితమంతా గాథే. ఈ గాథకి ‘సిటిజన్ కేన్’  లోని రోజ్ బడ్ ప్లాట్ డివైస్ టైపులో ‘శంకరయ్య ఎవరు?’ అనే జర్నలిస్టుల (సమంత, విజయ్ దేవరకొండ) ఇన్వెస్టిగేషన్ ‘కథ’ తో కవరింగ్ ఇవ్వడంతో, ‘మహానటి’ కి గాథగా ఎదుర్కొనే బాక్సాఫీసు ప్రమాదం తప్పింది. కథంటే స్ట్రక్చర్ కాబట్టి జర్నలిస్టుల ఇన్వెస్టిగేషన్ పార్టుని గమనిస్తే, త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో వుంటుంది. అందులో బిగినింగ్, మిడిల్, ఎండ్ వుంటాయి, ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ వుంటాయి. గోల్ వుంటుంది. సంఘర్షణ వుంటుంది. చివరికి ఫలప్రాప్తీ వుంటుంది. ఇవే సావిత్రి గారి పార్టుకి వుండవు. సావిత్రి గారి పార్టుని గాథగానే చెప్పాలి తప్ప కథగా కుదరదు. అందుకని ఈ గాథని జర్నలిస్టుల కథతో కవరింగ్ ఇచ్చి కాపాడారు. ఇంకోటి గమనిస్తే గాథంతా ఫ్లాష్ బ్యాక్సే, కథ వచ్చేసి వర్తమానం. సమస్య ఎక్కడొస్తోందంటే ఏది స్ట్రక్చర్, ఏది కాదు పట్టుకోవడం దగ్గరే వస్తోంది. జర్నలిస్టుల కథలో ప్లాట్ పాయింట్స్ పట్టుకోండి చూద్దాం. 

          గాథ ఎలా రాయాలో చెప్పలేం. గాథకి స్ట్రక్చర్, శాస్త్రం, నియమాలు లేవు. కథకే వున్నాయి. కాబట్టి గాథలే రాయాలనుకుంటే ఎలా అన్పిస్తే అలా రాసుకోవడమే. బొమ్మ ఆడేదా పోయేదా దైవాధీనం. ఎందుకొచ్చిన బాధ. ఈ కమర్షియల్ సినిమాల కాలంలో ఉదాత్త గాథలకి అభిరుచిగల ప్రేక్షకులేరీ?

          కానీ జరుగుతున్నదేమిటంటే రాస్తున్నది కథలనుకుని గాథలే రాసుకుని తీయడం. స్టార్ సినిమాల్ని కూడా కమర్షియల్ ముసుగేసిన గాథలుగా తీసి ఫ్లాప్ చేసుకోవడం. చాలా కాలం అసలు స్ట్రక్చర్ ని ఎందుకు వ్యతిరేకిస్తారో, ఎందుకు దాన్ని శత్రువులా చూస్తారో అర్ధమయ్యేది కాదు. తర్వాత్తర్వాత అర్ధమవుతూ వచ్చింది. రాసుకునేది కథలనుకుంటూ గాథలు కాబట్టి స్ట్రక్చరంటే అసహ్యమని. నూటికి నూరు పాళ్ళూ వాళ్ళు కరెక్ట్. గాథలకి స్ట్రక్చర్ వుండదుగా. ‘ఇది కథ కాదు గాథ, తర్వాత మీకు తీరని వ్యధ’ అన్నా కూడా కథకీ గాథకీ తేడా కూడా తెలీదు కాబట్టి, ఇంకా పట్టులకి పోయి గాథే  రాసుకోవడం!

      మెజారిటీగా వున్న ఈ వర్గం స్ట్రక్చర్ ని వ్యతిరేకించడం పూర్తి న్యాయం, హక్కు. మనం గౌరవించాల్సిందే. వీళ్ళ తప్పుకాదు. 2000 – 2005 మధ్య వెల్లువెత్తిన మిడిల్ మటాష్ రోమాంటిక్ కామెడీల ట్రెండ్ లో వీళ్ళకెవరో వేసిన జ్ఞాన గుళిక తప్పు. ఆ గుళికే తరం తర్వాత తరానికి  సరఫరా అవుతోంది.

          ఈ వర్గాన్ని పక్కనపెట్టి మాట్లాడుకుంటే, స్ట్రక్చర్ వుండని గాథలకి వివిధ టెక్నిక్స్ తో సపోర్టు నివ్వొచ్చు. ఇది చాలా లోతైన అవగాహనని డిమాండ్ చేసే క్రియేటివ్ ఇంజనీరింగ్. ‘మహానటి’ లో జర్నలిస్టుల కథతో సపోర్టు నిచ్చినట్టు. అన్నిటికీ ఒకే టెక్నిక్ వుండదు. ఆ టెక్నిక్ ఏమిటనేది ఏ గాథకా గాథ చూసి నిర్ణయించాల్సి వుంటుంది. ఇక ‘ఫారెస్ట్ గంప్’ గాథ అని ఎవరన్నారు?  అది కథే. ఆ కథ ఫ్లాష్ బ్యాక్స్ రూపంలో వచ్చి పోతూంటుంది. ఫ్లాష్ బ్యాక్స్ తో ఈ కథ చెబుతున్న హీరోతో వర్తమానంలో గాథ వుంటుంది. ‘మహానటి’ కి రివర్స్ అన్నమాట. ‘మహానటి’ లో ఫ్లాష్ బ్యాక్స్ తో వున్నగాథకి వర్తమానంలో కథతో సపోర్టునిచ్చారు, అదే ‘ఫారెస్ట్ గంప్’ లో కథని ఫ్లాష్ బ్యాక్స్ తో సపోర్టుగా పెట్టి, వర్తమానంలో గాథ చెప్పారు. ఇవి చూస్తూంటే కథని సపోర్టుగా పెట్టక పోతే గాథ నిలబడదేమో నన్పించక మానదు.

          ఫారెస్ట్ గంప్’ ప్లాట్ పాయింట్ వన్ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్స్ లో, ‘నీకు ప్రేమంటే తెలీదు, నన్నిక కలవకు’ అని హీరోయిన్ వెళ్ళిపోవడం. సిడ్ ఫీల్డ్ లెక్కల్లో పించ్ పాయింట్ వన్ వచ్చేసి, హీరోయిన్ కి రాసిన ఉత్తరాలన్నీ ఆమె అడ్రసులో లేకపోవడంతో తిరిగి రావడం. మిడ్ పాయింట్ వచ్చేసి, హీరోయిన్ తనని టార్చర్ పెట్టే బాయ్ ఫ్రెండ్ తోనే తిరగడం, ‘నేనెప్పటికీ నీ దాన్నే ఫారెస్ట్’  అని హీరోతో అనడం.

          ఇక పించ్ పాయింట్ టూ- చనిపోయిన ఫ్రెండ్ కిచ్చిన మాట ప్రకారం హీరో ఫిషింగ్ బోటు కొనుక్కోవడం, ప్లాట్ పాయింట్ టూ - ఫిషింగ్ తో డబ్బు సంపాదిస్తూ వుండగా మదర్ చనిపోవడం. మదర్ లేక, హీరోయిన్ లేక పిచ్చి పట్టిన వాడిలా తిరగడం.

          ఇక క్లయిమాక్స్ చూస్తే, ఆఖరికి హీరోయిన్ తనే పిలుస్తుంది హీరోని రమ్మని. వెళ్తే వాళ్ళకి పుట్టిన కొడుకుతో మరణశయ్యపై వుంటుంది. పెళ్లి చేసుకోమంటుంది. చేసుకుంటాడు. కన్ను మూస్తుంది...వాళ్ళ మధ్య కథకి కాన్ఫ్లిక్ట్ ఇలా ముగుస్తుంది. అంటే ఫ్లాష్ బ్యాక్స్ లో వున్న కథ, వర్తమానంలో నడుస్తున్న గాథ లోకి ప్రవహించి ముగిసిందన్నమాట. ఇలా కథా గాథా రెండూ 
ఐక్యమైపోయాయి.

      గాథల్లో హీరోకి గోల్ వుండదు. వాడొక సినిమా వ్యాపారానికి పనికి రాని శుద్ధ వేస్టు పాసివ్ క్యారక్టర్. వాడికి మంచైనా చెడైనా విధివశాత్తే జరుగుతాయి. ప్రయత్నపూర్వకంగా జరగవు. కర్మ చేయడు. అదృష్టాన్ని విధికి వదిలేస్తాడు. నిన్న ‘సంచిక’ వెబ్ సైట్ కోసం ‘ఆదిశంకరాచార్య’ సంస్కృత మూవీ చూస్తూంటే, అందులో శంకరాచార్య, ‘కర్మ చేయడం వ్యర్థం, జ్ఞానాన్ని పొందాక’ అంటాడు. మన కర్మ చేయని పాసివ్ క్యారక్టరేమో జ్ఞానాన్ని కూడా పొందడు. లేజీ ఫెలో. అందుకని వాడికోసం, అంటే వాడు పట్టించుకోని వాడి గాథ కోసం, మనమే ఒక డ్రమెటిక్ క్వశ్చన్ ని ఏర్పాటు చేయాలంటారు నిపుణులు. ఆ డ్రమెటిక్ క్వశ్చన్ ప్రేక్షకులకి తెలిసేలా చేస్తే, దాని కోసమైనా స్ట్రక్చర్ లేని, గోల్ వుండని గాథని చూస్తారు ప్రేక్షకులు. అంటే ‘ఫారెస్ట్ గంప్’ లో చూస్తే, ఆ హీరో హీరోయిన్ని పొందుతాడా లేదా అన్నదే డ్రమెటిక్ క్వశ్చన్ అవుతుంది. 

          పూర్వం ‘పెదరాయుడు’ అతి పెద్ద హిట్టయిన గాథ. తమిళ రీమేక్. ఆ గాథకి ‘సోల్’ ఆయువు పట్టు, టెక్నిక్, క్రియేటివ్ ఇంజనీరింగ్ వగైరా. ఈ ‘సోల్’ చెదరకుండా దర్శకుడు రవిరాజా పినిశెట్టి జాగ్రత్తగా తెలుగు ప్రేక్షకులకి అందించి పరవశింపజేశారు. ఇప్పుడు ‘సోల్’ నెవరు పట్టించుకుంటారు. గిట్టుబాటు ధరకి హోల్ సేల్ గా బయ్యర్లకి అంటగట్టడమే.

          ‘ప్రేమం’ గాథగా హిట్టయిందంటే దానికో క్రియేటివ్ ఇంజనీరింగ్ వుంటుంది. ఆ క్రియేటివ్ ఇంజనీరింగ్ యూత్ అప్పీల్ తో కావచ్చు, తెలుగులోలేని, మలయాళంలో వున్న నేటివిటీతో కావొచ్చు. మలయాళంలో నేటివిటీ ఎంతబలంగా  వుందంటే, సినిమాలో చూపించిన వూళ్ళో హీరోహీరోయిన్లు ప్రేమలో పడ్డ చోటు టూరిస్టు కేంద్రమైపోయింది. బస్సులు కట్టుకుని స్టూడెంట్స్ వెళ్లి చూసొచ్చేంత లాండ్ మార్క్ అయింది. ఇది తెలుగులో సాధ్యమైందా ఎప్పుడైనా?

          అందుకని వర్ధమాన రచయితలకీ, దర్శకులకీ రాబర్ట్ మెక్ కీ ఒకటే మాట చెప్తాడు- మామూలు కమర్షియల్ సినిమాలతో చేయి తిప్పుకోనంత వరకూ కళాత్మక సినిమాల జోలికి పోవద్దని. గాథలు కళాత్మకతనే డిమాండ్ చేస్తాయి. పుట్టు కళాత్మకత వుంటే ప్రయత్నించ వచ్చు. పెట్టు కళాత్మకతకి టైం తీసుకుని ట్రైనింగు పొందాలి. తొందరపడి నిర్మాతల్ని పట్టి పల్లార్చకూడదు.
  
 Q :  ‘పెళ్ళి సందడి’ ప్లాట్ పాయింట్స్, రివ్యూ చెప్తారా?
ఎన్, కన్నయ్య, రైటర్

A :  
       అన్ని సినిమాల ప్లాట్ పాయింట్స్ గుర్తుండవు. మీరా సినిమా కథ చెప్తే ప్లాట్ పాయింట్స్ ఎక్కడున్నాయో చెప్పొచ్చు. వికీపీడియాలో కథ వుంటే చెప్పొచ్చు. ‘పెళ్లి సందడి’ ని అప్పట్లో విజయవాడలో, వరంగల్లో రెండు సార్లు చూశాం. అప్పట్లో స్ట్రక్చర్ తెలీని అమాయకులం. 2000 లో వృత్తికి అవసరమేర్పడి సిడ్ ఫీల్డ్ ని చదువుతున్నాకే తెలిసింది. మీరు ప్లాట్ పాయింట్స్ అంటూ టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ‘పెళ్లి సందడి’ చూసిన మీకు ప్లాట్ పాయింట్స్ ఎక్కడున్నాయో తెలిసి పోయే వుండాలి. అయితే అత్యధికులు ప్లాట్ పాయింట్స్ చెప్పలేని పరిస్థితిలో వుంటున్నారు. తాజాగా చూసిన  ‘సాహో’ ప్లాట్ పాయింట్స్ చెప్పమంటే చెప్పలేరు. ప్లాట్ పాయింట్స్ ని ఎలా గుర్తించాలో అస్సలు తెలుసుకోవడం లేదు. వాళ్ళు రాసుకుంటున్న కథల్లోనే  ప్లాట్ పాయింట్స్ కాదు కదా, కాన్ఫ్లిక్ట్ ఏమిటో చెప్పమంటే కూడా చెప్పలేకపోతున్నారు. ఇంకెందుకు తెలుసుకోవడం. స్క్రీన్ ప్లే వ్యాసాలు చదవడం. ‘పెళ్ళి సందడి’ ప్లాట్ పాయింట్స్ తెలుసుకున్నంత మాత్రాన ఏం ఉపయోగం. అసలంటూ కథ ఎలా డెవలప్ అయి, ఏ ఘట్టంలో, ఏఏ అంశాలతో ప్లాట్ పాయింట్స్ ఏర్పడతాయో సాంకేతికాల్ని అర్ధంజేసుకోగల్గాలిగా. కాబట్టి ఇవన్నీ పక్కనబెట్టి, అలవాటుగా ఎలా రాసుకుంటున్నారో అలాగే రాసుకుని తీసుకుంటే సరిపోతుంది, నాలెడ్జి అంటూ సమయం వృధా చేసుకోకుండా.


సికిందర్