రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, November 27, 2025

1404 : స్పెషల్ ఆర్టికల్

 

    ఎల్ ఓ ఏ లో ప్రతిజ్ఞ బూనడాన్ని, లేదా ధృవీకరించడాన్ని అఫర్మేషన్ అంటారు. మన విషయానికొస్తే దర్శకత్వమనే  లక్ష్యాన్ని సాధించడానికి ఆ లక్ష్యాన్ని పదే పదే వల్లించడం ద్వారా మెదడుని వున్న స్థితినుంచి కొత్త స్థితికి రీవైరింగ్ చేయడమన్న మాట. చిన్నప్పుడు పాఠాలు బట్టీ పట్టి దాన్ని జ్ఞాపకంగా సబ్ కాన్షస్ మైండ్ లో నిల్వ చేయడం లాంటి దన్న మాట. ఈ అఫర్మేషన్స్ మెదడులోనే కాదు, మెదడుతో కనెక్ట్ అయి వుండే శరీర కణాలన్నిటా చేరిపోతాయి. కాబట్టి అఫర్మేషన్స్ జాగ్రత్తపడి పాజిటివ్ గా వుండేట్టు చూసుకోవాలి. ఒకరి మీద కోపంతో ‘వాడ్ని దెబ్బ కొట్టి నేను డైరెక్టర్ నవుతా!’  అని ఆవేశం చూపిస్తే, అది నెగెటివ్ ఫీలింగ్. అప్పుడా కోపంతో కూడిన ఆ నెగెటివ్ ఫీలింగ్ వెళ్ళి వెళ్ళి లివర్ ని ఎటాక్ చేస్తుంది. ఎలాటి నెగెటివ్ ఫీలింగ్స్ కి ఆ ఎటాక్స్ శరీరమంతటా జరుగుతూంటాయి. ఎవరి మీదయితే నెగెటివ్ ఫీలింగ్ తో వుంటామో, ఆ వ్యక్తికేం కాదు, లక్షణంగా వుంటాడు- మనమే మన శరీరాన్ని దెబ్బతీసుకుని రోగాల బారిన పడతాం. ఏ నెగెటివ్ ఫీలింగ్ ఏ అవయవాన్ని దెబ్బతీసి, ఏ అనారోగ్యాన్ని తెచ్చి పెడుతుందో వెల్ నెస్ కోచ్ లూయీస్ హే తన ప్రసిద్ధ పుస్తకం ‘యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్’  లో పెద్ద లిస్టే ఇచ్చింది.

రి -’నీ వూరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా!’ అని కోపం బద్దలు చేసుకుని మీసం తిప్పి, తొడగొట్టడాన్ని హీరోయిజంగా సినిమాలో చూపించడం తప్పు కాదా అంటే- అదే కదా ఐరనీ, అలాకాకుండా ‘నిన్ను క్షమించాను పో!’ అంటే  సినిమాలు ఆడతాయా? కనుక సినిమాలో తన్నాలి, జీవితంలో క్షమించాలి - ఈ లౌక్యంతో తప్పించుకు తిరగాలి.

కనుక అఫర్మేషన్స్ పాజిటివ్ గా వుండేట్టు చూసుకోవాలి. కొత్తగా పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చినప్పుడు అప్పటివరకూ మెదడులో వైరింగ్ అయి వున్న పాత నమ్మకాల బలహీన న్యూరల్ పాత్ వేస్ ని చెరిపేసి, కొత్త పాత్ వేస్ తో రీవైరింగ్ చేస్తాయి. మెదడులో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ (ఆర్ఏఎస్) అని రాడార్ వుంటుంది. ఇది రోజంతా పంచేంద్రియాల ద్వారా మెదడుకి భారీగా చేరే 74 గిగా బైట్ల సమాచారాన్ని (ఇది 16 సినిమాలు చూడడంతో సమానం) ఫిల్టర్ చేసి- ఏ సమాచారం ఫీలింగ్ తో వుందో దాన్ని మాత్రమే సబ్ కాన్షస్ మైండ్ కి పంపిస్తుంది. ఫీలింగ్ లేకపోతే గుండె అడ్డుకుంటుంది. సబ్ కాన్షస్ మైండ్ ఆ ఫీలింగ్ తో వున్న సమాచారాన్ని ఇమేజెస్ రూపంలో జ్ఞాపకాలుగా మార్చుకుని నిల్వ చేసుకుంటుంది. ఎప్పుడు ఏ పనికి ఏ ఇమేజి అవరసరముందో దాన్ని ఆర్ ఏ ఎస్ కి పంపిస్తుంది. అప్పుడా ఆర్ ఏ ఎస్ ఆ ఇమేజిని  విశ్వంలోకి ప్రసారం చేసి, దాంతో మన కోరికల్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తుంది.ఈ మెకానిజం తెలుసుకోకపోతే ఏదో చెప్తార్లే అని మొత్తం ఎల్ ఓ ఏ నే బేఖాతరు చేసే అవకాశముంది. 


ఈ కింద ఇచ్చిన అఫర్మేషన్ ని ప్రతీ రోజూ ఉదయం లేవగానే చదవాలి. లేదా అయిదారు నిముషాలు వచ్చే ఈ పాఠాన్ని మొబైల్ లో రికార్డు చేసుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినొచ్చు. ముందుగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే, అనుకున్న లక్ష్యం పూర్తయన ఫీలింగుతో అపర్మేషన్ చేయాలి. అంటే ఆల్రెడీ దర్శకుడైనట్టు ఫీలవ్వాలి. దర్శకుడవుతాను, దర్శకుడవడం నా లక్ష్యం, లేదా దర్శకుడవ్వాలనుకుంటున్నాను- అనే  భవిష్యత్ కాలానికి చెందే ప్రార్ధన చేయకూడదు. విశ్వానికి భవిష్యత్ కాలం లేదు, భూత కాలం లేదు, వుండే దొక్కటే- స్తంభించిన వర్తమాన కాలం. కాబట్టి ఈ వర్తమానంలో -ఇప్పుడు దర్శకుడి హోదా ఫీలయ్యి ప్రార్ధన పంపాలి.

అఫర్మేషన్ : 

“విశ్వానికి ధన్యవాదాలు. నా వృత్తి జీవితంలో జరిగే దేనికైనా నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను. దర్శకత్వ అవకాశాలు సంపాదించడం, కోల్పోవడం రెండింటికీ నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను. లక్ష్యాన్నిసాధించడానికి, సాధనలో  విఫలమవడానికీ  నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను. ఎందుకంటే నా వృత్తి జీవితంలో ఏం జరుగుతోందో అది పూర్తిగా నా సృష్టి. నా ఆకర్షణ. నా వృత్తితో నేను చెడు సంబంధం కలిగి వున్నందుకు క్షమాపణలు. అవకాశాలు  సంపాదించడం కష్టమని భావించినందుకూ క్షమాపణలు. 


“అవకాశాలు సంపాదించేటప్పుడు నా గురించి నన్ను తక్కువ చేసుకుని ఆలోచించినందుకూ క్షమాపణలు. దర్శకత్వ ప్రయత్నాలు చేస్తున్న ఇతరుల గురించి చెడుగా ఆలోచించినందుకూ క్షమాపణలు. నేను కోరుకున్న దర్శకత్వ అవకాశాలు నా జీవితంలోకి వచ్చినందుకూ  ధన్యవాదాలు. దర్శకత్వం నన్ను వరించినందుకూ  ధన్యవాదాలు. దర్శకత్వం నన్ను ధనవంతుడిగా మార్చినందుకూ ధన్యవాదాలు. నా చుట్టూ వున్న దర్శకులని ధనవంతులుగా చేసినందుకూ  ధన్యవాదాలు. వారు కూడా దానికి పూర్తి అర్హులు. ఎందుకంటే విశ్వం దృష్టిలో మనమందరం ఒకటి కాబట్టి.


“నా శరీరంలోని ప్రతి కణం దైవిక కాంతితో ప్రకాశిస్తోంది. ప్రతి శ్వాస నా శరీరానికి సమతుల్యతని, శాంతిని తెస్తోంది. నేను ప్రతిరోజూ ఆరోగ్యంగా మారుతున్నాను. నేను శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా బలంగా మారుతున్నాను. నేను నా ప్రతి హృదయ స్పందనని అనుభవిస్తున్నాను. నన్ను నేను కొత్త ప్రాణశక్తితో నింపుతున్నాను. నేను లోతైన శాంతితో నిండిన వ్యక్తిని. ప్రతి ప్రశ్నకు, ప్రతి అవసరానికీ  సమాధానం నాలోనే వుంది. నా దగ్గర వున్న ప్రతిదానికీ నేను చాలా కృతజ్ఞుడ్ని. 

జీవితంలోని అనంతమైన అవకాశాలతో నన్ను అనుసంధానిస్తున్నాను. నేను శక్తివంతమైన అయస్కాంతాన్ని. నా సానుకూల వైబ్‌లు ఎల్లప్పుడూ దర్శకత్వ అవకాశాల్ని ఆకర్షిస్తున్నాయి. 


“ఎస్, ఊహించని అనేక వైపుల నుంచీ దర్శకత్వ అవకాశాలు  నాకు వస్తున్నాయి. ఈ అవకాశాల్ని హృదయపూర్వకంగా గౌరవిస్తున్నాను. నాకు లభించిన అవకాశాల్ని నా జ్ఞానంతో, విచక్షణతో సద్వినియోగం చేసుకుంటున్నాను. నేను ప్రతిరోజూ కొత్త అవకాశాల్ని ఆకర్షిస్స్తున్నాను. నేను నా పనిని ప్రేమిస్తున్నందున అవకాశాలు నావైపు వస్తున్నాయి. 


“నేను నాకు లభిస్తున్న దర్శకత్వ అవకాశాలకి పూర్తి విలువని జోడించి  తిరిగి ఇస్తున్నాను. నేను ఎంత ఎక్కువ విలువ జోడిస్తూంటే, అన్ని ఎక్కువ అవకాశాలు నాకు లభిస్తున్నాయి. సరైన మార్గంలో అవకాశాలు సంపాదించడానికి నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి. నా కలలన్నింటినీ నెరవేర్చుకోవడానికి నాకు పూర్తి సామర్థ్యం వుంది.  అందువల్ల నా లక్ష్యం వైపు వేగంగా కదులుతున్నాను. నేను కృతజ్ఞతతో, ​​కృతజ్ఞతా భావంతో అవకాశాల్ని స్వీకరిస్తున్నాను. 


“అవకాశం ఒక సానుకూల శక్తి, ఇది నా జీవితంలోకి సులభంగా స్వచ్ఛమైన తరహాలో వస్తోంది. అవతల ప్రతి ఒక్కరి వ్యక్తి విజయాన్నీ నేను ఆనందిస్స్తున్నాను. అందరికీ విజయం, సంపద, ఆరోగ్యం, శ్రేయస్సు, ఆనందమూ పుష్కలంగా ఇమ్మని విశ్వాన్ని ప్రార్థిస్స్తున్నాను. 


“నేను ఇతరులతో  సులభంగా డబ్బు పంచుకోగలుగుతున్నాను. డబ్బు సంపాదించడం ఇప్పుడు నాకు చాలా సులభం అయ్యేలా నన్ను ఇంత పెద్దవాడిని చేసినందుకు ధన్యవాదాలు. ప్రియమైన దర్శకత్వమా, ఈ రోజు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రకటిస్తున్నాను. నాకు ఇప్పుడు నీతో ప్రేమ సంబంధమే వుంది. నువ్వు చిన్న రూపాల్లో, మధ్యస్థ రూపాల్లో, పెద్ద రూపాల్లో - ఏ రూపంలో నా దగ్గరికి వచ్చినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను చిన్నస్థాయి సినిమాని, పెద్ద స్థాయి సినిమానీ  రెండిటినీ ప్రేమిస్తున్నాను. అవకాశం ఈ దిశ నుంచి, ఆ దిశ నుంచి, ఏ దిశ నుంచి వచ్చినా స్వీకరిస్తున్నాను. 


“ప్రియమైన దర్శకత్వమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. విలువైనదిగా భావిస్తున్నాను. ఇతరులని దర్శకులుగా  చేసినందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను వారి పట్ల ఎంత సంతోషంగా వుంటానో!  కొన్నిసార్లు నా నుంఛి దూరంగా వెళ్ళినందుకు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు నా ద్వారా ఇతరులని దర్శకులుగా చేస్తూండ వచ్చు. నా ద్వారా ఇతరులని దర్శకులుగా చేసినా, ఇతరుల ద్వారా నన్ను దర్శకుడ్ని చేసినా రెండూ నాకిష్టమే. నా గతంలో నన్ను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగాగానీ నన్ను  బాధపెట్టిన, నా అవకాశాల్ని దెబ్బతీసిన వారందరినీ క్షమిస్స్తున్నాను. ఎందుకంటే వారిని నేను ఆకర్షించాను, నాకు జరిగిందంతా నా సృష్టే. దీనికి నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను. 


“నా జీవితంలో వారిని ఆకర్షించినందుకు, నా జీవితంలో ఆ ఫ్రీక్వెన్సీని సృష్టించడానికి నేను చేయవలసినదంతా చేసినందుకూ క్షమాపణలు. అవకాశాల  గురించి నాకు ఒక పాఠం నేర్పించినందుకు వారందరికీ ధన్యవాదాలు. నాకు ఆ పాఠం అవసరమని నాకు తెలుసు. నా గతంలో నన్ను మోసం చేసిన, లేదా అవకాశాలు  సంపాదించడంలో నాకు మద్దతు ఇవ్వని వారందరినీ ఈ రోజు నేను క్షమిస్తున్నాను.


“అదే విధంగా నాకు తెలిసి, లేక తెలియక నేనెవర్నయినా మోసం చేసి వుంటే, బాధించి వుంటే, నష్టపరచి వుంటే, వాళ్ళ అవకాశాల్ని దెబ్బ తీసి వుంటే,  ఆ దివ్యాత్ములందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను. వారికి నా క్షమాపణలు, క్షమాపణలు, హృదయపూర్వక క్షమాపణలు. 


“నిర్మాతలు నాకు అవకాశాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వారు నాకిచ్చిన అవకాశానికి ఎంత డబ్బు పెట్టుబడి పెడతారో నేను వారికి 10 రెట్లు తిరిగి ఇస్తున్నానని నమ్ముతున్నారు కాబట్టి. వారు నాకు ఇచ్చే డబ్బుకి నేను కచ్చితంగా విలువని జోడిస్తున్నాను. ప్రతిరోజూ ఇందుకే నేను నా జీవితంలో అవకాశాల్ని ఆకర్షిస్తున్నాను. నేను ప్రతిరోజు  దర్శకుడ్ని అని నమ్ముతున్నాను.  “అందుకే ప్రతిరోజూ అవకాశాల్నిఆకర్షిస్తున్నాను. నేను దర్శకుడిగా మారడం నాకు చాలా సౌకర్యవంతంగా వుంది. నేను కలుగన్న పెద్ద భవంతిలో నివసించడం చాలా సౌకర్యంగా వుంది. నేను నా అందమైన కలల కార్లనీ నడపడం చాలా సౌకర్యంగా వుంది. నేను నా కుటుంబ, బంధు మిత్రుల సౌఖ్యం కోసం డబ్బు ఖర్చుచేయడం చాలా తృప్తిగా వుంది. నేను డబ్బు ఖర్చు చేసే ప్రతిసారీ నేను డబ్బు సంపాదించడానికి దర్శకత్వ అవకాశాలు మరింత పెరుగుతూ వస్తున్నాయి.


“నా చేతినుంచి ఎల్లప్పుడూ డబ్బు ప్రేమతో వెళ్తోంది. వెళ్ళిన చోటల్లా అది ప్రేమతో కొన్ని రెట్లు పెరుగుతోంది. అందుకే నేను ఎల్లప్పుడూ ప్రేమతో డబ్బు ఇస్తున్నాను. కిరాణా షాపులో సరుకులు కొన్నా, బంకులో పెట్రోలు కొట్టించుకున్నా, మరెక్కడ డబ్బు ఖర్చు చేసినా, ఎల్లప్పుడూ ప్రేమతో, దాతృత్వ భావంతో ఇస్తున్నాను. అది కొన్ని రెట్లు పెరిగి నాకు తిరిగి వస్తున్నందుకు విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 


“ప్రియమైన విశ్వమా, నేను ప్రతిరోజు ఈ ప్రార్ధన చేసినప్పుడల్లా రోజంతా నిశ్చింతగా గడుపుతున్నాను. నాకు మరో సంతోషకరమైన రోజుని ఇచ్చిన నీకు కృతజ్ఞతలు. నా ఈ రోజు విశ్వం కోసమే, విశ్వానికే నా రోజులన్నీ అంకితం. విశ్వం నాకేమిచ్చినా, ఇవ్వకపోయినా విశ్వం పట్ల నేను సదా కృతజ్ఞతతోనే వుంటాను!” 


ఎవరికైనా కెరీర్ ఒకడుగు ముందుకూ. నాల్గు అడుగులు వెనక్కీ వెళ్తూంటే ఈ అఫర్మేషన్ చేయొచ్చు- ‘నాలో వున్నజ్ఞానం నన్ను అనంతం వైపు నడిపిస్తోంది’


-సికిందర్