డియర్ రీడర్స్, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ స్క్రీన్ ప్లే సంగతులు కోసం మీ నుంచి రోజూ మెసేజులు, కాల్స్ వస్తున్నాయి. ఈ ఆలస్యం అనివార్యంగా ఉద్దేశపూర్వకంగా జరిగిందే … కారణం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’’ పరిస్థితే. నిన్న డిసెంబర్ 5 తేదీ అనూహ్యంగా ‘అఖండ 2’ విడుదల వాయిదా పడడంతో, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ రన్నింగ్ కి బ్రీతింగ్ స్పేస్ పెరిగినట్టయ్యింది. అయితే ఈ బ్రీతింగ్ స్పేస్ లో ఆక్సిజన్ పీల్చగల్గే స్థితిలో వుందా? బాక్సాఫీసు అగ్రిగేటర్ సాచ్నిక్ ప్రకారం విడుదల తేదీ నుంచీ అన్ని భాషల్లో వసూళ్ళు పడిపోతూ వచ్చి నిన్న తొమ్మిదవ రోజుకి 12% ఆక్యుపెన్సీ తో కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిర్మాతలు, హీరో ప్రెస్ మీట్ పెట్టి పుష్ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. ఇప్పుడు ఈ బ్రీతింగ్ స్పేస్ లో ఏం చేసి ఆక్సిజన్ అందించగలరు. చేసిందంతా డీఎన్ఏ లాగా డిజిటల్ ఫార్మాట్ లో సినిమాలో ఫిక్స్ అయిపోయింది. దాన్ని మార్చలేరు. మార్పు చేర్పులన్నీ ముందుగా స్క్రిప్టు దశలోనే జరగిపోవాలి. కనుక స్క్రిప్టు దశలో ఏం చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అన్నవి తెలుసుకోవాలి. అక్కడే తెలుస్తుంది ఈ పరిస్థితికి కారణం. అంతేగానీ నవంబర్ లో విడుదల చేయడం మంచిది కాదు, అందులోనూ జనాల దగ్గర డబ్బులుండని చివరి రోజుల్లో విడుదల చేశాం- వంటి బాహ్య పరిస్థితుల్ని చెప్పుకుంటే లోపల్నుంచి మార్పు ఎప్పటికీ రాదు. ఓవర్ గా పోకుండా మంచి ఫిల్ గుడ్ మూవీ తీసినా ఆడకపోతే ఇంత కష్టపడి చేయడమెందుకు- స్టాండర్డ్ టెంప్లెట్లో మాస్ సినిమాలే తీసుకోవచ్చని నిర్మాత చెప్పడం కూడా సరి కాదు. తీసింది పక్కా క్లాస్ జానర్ ఫీల్ గుడ్ మూవీ కాదు, మాస్ జానర్ లోనే ఫీల్ గుడ్ జానర్ ని కలిపి తీశారు. తీసినప్పుడు విధానం తెలుసుకోక తప్పులో కాలేస్తూ పోయారు.
‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫీల్ గుడ్ కి మాస్ మసాలా జానర్ కలిపిన మిశ్రమంతో అసలు జరిగిందేమిటి? ఎలాజరిగింది? ఎందుకు జరిగింది? దీనికి తరుణోపాయమే మిటి?...ఇవి తెలియజేయడానికి సినిమా వసూళ్ళ పరిస్థితి చూసి గత ఆరు రోజులూ ఆపాల్సి వచ్చింది ఈ స్క్రీన్ ప్లే సంగతుల్ని…ఇప్పుడు ఈ కింద డీప్ ఎనాలిసిస్ లో తప్పొప్పుల్ని తెలుసుకుందాం…
A. కథేమిటి?
1. 2002 లో ఆంధ్రాకింగ్ సూపర్ స్టార్ సూర్య కుమార్ కథ : సూపర్ స్టార్ సూర్య కుమార్ (ఉపేంద్ర) 100 వ సినిమా పూర్తి చేయడానికి నిర్మాత దగ్గర ఫైనాన్స్ లేక తనే 3 కోట్ల రూపాయల కోసం విఫలయత్నాలు చేసి, చివరికి ఇల్లమ్మేయడానికి సిద్ధపడతాడు. ఇంతలో అతడి ఎక్కౌంట్ లో 3 కోట్ల రూపాయలు పడతాయి. ఎక్కడిదీ డబ్బు? ఎవరు వేశారు ఎక్కౌంట్ లో? మేనేజర్ (రాజీవ్ కనకాల) ఆరా తీస్తే వేసినతని ఊరూ పేరూ తెలుస్తాయి. ఈ సాగర్ ఎవరని అడిగితే, సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ అంజి (శ్రీనివాస రెడ్డి) చెక్ చేసి, ఈ సాగర్ అనే అతను సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్తాడు. రాజమండ్రి దగ్గర గోడపల్లి లంకలో వుంటాడని చెప్పి, ఇతను తనకి తెలుసనీ అతడి చెప్పడం మొదలెడతాడు.
2. ఫ్లాష్ బ్యాక్ - 1 : సాగర్ గురించి అంజి చెప్పే కథ : చిన్నప్పట్నుంచీ సాగర్ సూర్య ఫ్యాన్. చిన్నప్పుడు తండ్రి సింహాద్రి (రావు రమేష్) తో థియేటర్ కొస్తాడు. ఆ రోజు సూర్య కొత్త సినిమా విడుదల. టికెట్లు దొరకవు. టికెట్లు పంచుతున్నఅంజి సింహాద్రికి టికెట్లు నిరాకరిస్తాడు. ఈ టికెట్లు కటౌట్లు పెట్టిన, టపాసులు పేల్చిన ఫ్యాన్స్ కేనని చెప్పేస్తే, వెంటనే చిన్న పిల్లాడయిన సాగర్ ఎవరూ ఊహించని విధంగా కటౌట్ మీదికెక్కేసి ‘ఆంధ్రాకింగ్’ బ్యానర్ కట్టేస్తాడు. ప్రేక్షకుల హర్షాధ్వానాల మధ్య అంజి సింహాద్రికి టికెట్లు ఇచ్చేస్తాడు. తండ్రితో కలిసి సాగర్ సూర్య కొత్త సినిమా చూసి ఎంజాయ్ చేస్తాడు.
3. సూర్య కథ -2 : ఈ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న సూర్య - ‘నా అభిమాని నాకే డబ్బులు పంపించాడా?’ అని అతడ్ని కలవాలంటాడు. ‘సాయపడింది అతను, రుణ పడింది నేను. నేను వెళ్ళి తీరాలి’ అని బయల్దేరతాడు ఎవరు చెప్పినా ఆగకుండా.
కారులో ఆ వూరు చేరుకుంటూ మధ్యలో ఓ హోటల్ దగ్గరాగుతాడు. తూఫాను వల్ల వర్షం కురుస్తూ వుంటుంది. ఆ హోటల్లో టీవీ న్యూస్ వస్తూంటుంది. కొందరు జర్నలిస్టులు ఆందోళన చేస్తూంటారు. జర్నలిస్టు ఈశ్వర్ (రాహుల్ రామకృష్ణ) మీద సూర్య ఫ్యాన్స్ దాడి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇందుకు ఆంధ్రా కింగ్ సూర్యే వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూంటారు. సూర్య అక్కడికి చేరుకుని క్షమాపణలు చెప్తాడు. ఈశ్వర్ సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అని కూడా తెలుస్తుంది. మరి నువ్వు నామీద అలా ఎందుకు రాశావని సూర్య అడిగితే, సాగర్ కి తెలియాలనే రాశానంటాడు.
4. ఫ్లాష్ బ్యాక్ -2 : సాగర్ గురించి ఈశ్వర్ చెప్పే కథ : థియేటర్ ముందు సూర్య మరో కొత్త సినిమా రిలీజ్ రోజు. ప్రాంగణం ప్రేక్షకులతో ఫ్యాన్స్ తో కోలాహలంగా వుంటుంది. ఇప్పుడు యువకుడుగా ఎదిగిన సాగర్ హంగామా చేస్తూంటాడు. వెంట ఫ్రెండ్ ఈశ్వర్ వుంటాడు. ఆ థియేటర్ ఓనర్ పురుషోత్తం (మురళీ శర్మ) కొడుకు రంగా (యజుర్వేద్) తన ఫ్రెండ్స్ తో సాగర్ కి వ్యతిరేకంగా వుంటాడు. సాగర్ తో బాటు వీళ్ళందరూ ఒకే కాలేజీలో స్టూడెంట్స్. ఇప్పుడు రంగా ఫ్రెండ్ ఒకడు సూర్య కటౌట్ ని పడేసే ప్రయత్నం చేస్తాడు. వెంటనే సాగర్ పెద్ద సాహసం చేసి ఆ కటౌట్ పడిపోకుండా చూస్తాడు. ఇంతలో సినిమా బాక్సు రాలేదని ఎవరో చెప్పేసరికి థియేటర్ లోకి పరిగెడతాడు. అక్కడ సూర్య కొత్త సినిమా రిలీజ్ కి అక్కసుతో వుంటాడు రంగా. అతడితో మాటామాటా పెరిగి, ఈ సినిమా ఫ్లాపయితే కాలేజిలో మీరేం చెప్పినా చేస్తాననీ, అలాగే సూపర్ హిట్టయితే తను ఏం చెప్పినా చెయ్యాలనీ పందెం కాస్తాడు సాగర్. ఇంతలో ఒకడు వచ్చి బాక్సు రాకపోవడంతో షో క్యాన్సిల్ అయిందని చెప్పేసరికి, సాగర్ కోపంతో థియేటర్ అద్దం పగలడతాడు. ఆ పగిలిన అద్దం లోంచి లోపలున్న పురుషోత్తం కూతురు మహాలక్ష్మి (భాగ్యశ్రీ బోర్సే) కనిపించేసరికి ఆమె అందానికి స్టన్ అవుతాడు. ఆమె పక్కకు జరిగేసరికి మళ్ళీ అటు అద్దం పగలగొడతాడు. ఆ పగిలిన అద్దం లోంచి ఆమె చూసేసరికి ప్రేమలో పడిపోతాడు.
థియేటర్ అద్దాలు పగులగొట్టినందుకు లాకప్ లో వుంటాడు సాగర్, ఈశ్వర్ తో బాటు. అక్కడ లవ్ మూడ్ లో వుంటే కవిత్వం చెప్పి ఎత్తి పొడుస్తాడు ఈశ్వర్. సాగర్ తండ్రి వచ్చి విడిపించుకు పోతాడు. వాళ్ళ వూరు గోడపల్లి కరెంటు లేని లంక. పడవలో నది దాటి చేరుకోవాలి. ఇంటి దగ్గర సాగర్ తల్లి తులసి వుంటుంది.ఇదయ్యాక, కాలేజీలో రంగాతో కలబడతాడు సాగర్- సూర్య సినిమా కలెక్షన్స్ తక్కువ చెప్పి ప్రచారం చేస్తున్నందుకు. ఈ గొడవతో ప్రిన్సిపాల్ సాగర్, ఈశ్వర్ లిద్దరికీ కమ్యూనిటీ సర్వీస్ శిక్ష వేస్తాడు. ఇద్దరూ క్యాంటీన్ లో బల్లలు తుడవడం, సప్లయర్ పనులు చేయడం చేస్తూంటారు. అప్పుడు క్యాంటీన్ కొచ్చిన మహాలక్ష్మితో సాగర్ లవ్ ట్రాక్ మొదలవుతుంది. కొత్త సినిమా రిలీజ్ కి సాగర్ కి టికెట్లు దొరక్కపోతే మహాలక్ష్మి ఇప్పిస్తుంది. అప్పుడు అడుగుతుంది సూర్య అంటే ఎందుకింత పిచ్చి అని. సాగర్ చెప్పడం మొదలెడతాడు.
5. ఫ్లాష్ బ్యాక్ - 3: సాగర్ చెప్పే తన చిన్నప్పటి కథ : తండ్రి స్కూల్లో చేర్పించడానికి తీసుకుపోతాడు. హెడ్ మాస్టర్ సాగర్ కి పరీక్ష పెడతాడు. నత్తి వల్ల సమాధానం పలకలేక పోతాడు సాగర్. హెడ్ మాస్టర్ ఫెయిల్ చేసి పంపేస్తాడు. ఇంటికి తీసుకొచ్చి చితకబాదుతాడు తండ్రి సింహాద్రి. ఏడ్చేస్తున్న సాగర్ కి టేప్ రికార్డర్ లో సూర్య మోటివేట్ చేస్తూ పాడే గేయం వినిపిస్తుంది. దాంతో ఎక్కడలేని శక్తి వచ్చేసి నత్తి పోతుంది. దీంతో అప్పట్నుంచీ సూర్యకి ఫ్యాన్ అయిపోతాడు సాగర్.
6. ఫ్లాష్ బ్యాక్ -4 : సాగర్ గురించి ఈశ్వర్ చెప్పే కథ కంటిన్యూ : సాగర్ మహాలక్ష్మి ఇంటికెళ్ళి ఆమె తండ్రిని సర్ప్రైజ్ చేస్తాడు. మహాలక్ష్మి కంగారు పడుతుంది. అక్కడే వున్న రంగా అడ్డుకుంటాడు. సాగర్ తమ లంకలో తిరునాళ్ళు జరుగుతున్నాయని, తప్పకుండా రావాలనీ ఆహ్వానించి వెళ్ళి పోతాడు.
తిరునాళ్ళకి మహాలక్ష్మి వస్తుంది. అప్పుడే ఇటు సమీపంలో సూర్య సినిమా షూటింగ్ జరుగుతోందని సాగర్ వెళ్ళబోతున్న వాడల్లా, మహాలక్ష్మిని చూసి డైలమాలో పడతాడు. ముందు షూటింగ్ కి వెళ్ళి రమ్మని పంపించేస్తుంది.
లొకేషన్ లో లోపలెక్కడో షూటింగ్ జరుగుతూంటే మేనేజర్ (రఘుబాబు) ఇలా వచ్చిన సాగర్ ఎవరో తెలుసుకుంటాడు. ఇంతలో సూర్యకి చక్కర కేళీలంటే ఇష్టమని తెలుసుకుని పరిగెడతాడు సాగర్. అరటి తోటలో గెల కోసుకుని వస్తూంటే రంగా, అతడి గ్రూపు ఎటాక్ చేస్తారు. వాళ్ళని చిత్తు చేసి వెళ్ళి, అరటి గెల మేనేజర్ కి అందించి మెప్పు పొందుతాడు సాగర్.
తిరిగి తిరునాళ్ళ కొచ్చిన సాగర్, మహాలక్ష్మితో క్లోజ్ గా గడుపుతాడు. ఆ రాత్రి వాళ్ళ మహాలక్ష్మి థియేటర్ నేమ్ బోర్డు పక్కన ‘ఐ లవ్ యూ’ అని నియాన్ లైట్ల డిస్ ప్లే పెట్టి ఎంజాయ్ చేస్తాడు. థియేటర్ లో బాక్సు సెక్షన్లో మహాలక్ష్మితో ప్రైవేటుగా కూర్చుని సినిమా చూస్తాడు. థియేటర్ లో వెతుక్కుంటూ వచ్చిన ఆమె తండ్రి పురుషోత్తంకి సాగర్, మహాలక్ష్మిల వ్యవహారం తెలిసిపోయి గొడవకి దిగుతాడు. ఆమె అన్న సాగర్ ని పట్టుకుని కొడతాడు. ఆవారా ఫ్యాన్ బ్యాచ్ కి ఏం అర్హత వుందని ప్రేమిస్తాడని సాగర్ ని ఘోరంగా తిడుతూ అవమానిస్తాడు పురుషోత్తం. సాగర్ ఛాలెంజీ విసురుతాడు- తమ లంకలో బ్రహ్మాండంగా 70 ఎంఎం డిటిఎస్ థియేటర్ మహాలక్ష్మి పేరుతోనే కట్టి, సూర్య నూరవ సినిమా రిలీజ్ చేసి, మహాలక్ష్మిని చేసుకుని చూపిస్తానని ఛాలెంజీ చేస్తాడు. సాగర్ కి పిచ్చిపట్టిందని విభేదించిన ఈశ్వర్ తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతాడు.
7. సెకండాఫ్ : సూర్య కథ -2 : రాత్రి తూఫాను వర్షంలో సూర్యతో చేరుకుని మహాలక్ష్మి థియేటర్ ని చూపిస్తాడు ఈశ్వర్. సూర్య సినిమాలు రిలీజ్ అయినప్పుడు సాగర్ ఎలా హంగామా చేస్తాడో చెప్పుకొస్తూంటే,అతడి కళ్ళు వినైల్ బోర్డు మీద పడతాయి. ఆ బోర్డు మీద మహాలక్ష్మి పెళ్ళి ప్రకటన వుంటుంది.దీంతో కంగారుపడి సూర్యని మహాలక్ష్మి ఇంటికి తీసికెళ్తాడు ఈశ్వర్. ఆ పెళ్ళిలో ఇలా ఎందుకు చేశావని మహాలక్ష్మిని ప్రశ్నిస్తాడు సూర్య. సాగర్ మోసం చేశాడని చెప్పుకొస్తుంది మహాలక్ష్మి.
8. ఫ్లాష్ బ్యాక్ -5 : సాగర్ గురించి మహాలక్ష్మి చెప్పే కథ : మహాలక్ష్మి థియేటర్ బుకింగ్ క్లర్క్ (సత్య) సాగర్ థియేటర్ కట్టడానికి 3 కోట్లు అవుతుందని లెక్క వేసి చెప్తాడు. సాగర్ బ్యాంకు లోన్ కోసం వెళ్తే అక్కడ పని జరగదు. మహాలక్ష్మి తన నగలు తెచ్చి ఇవ్వబోతే తీసుకోడు. ఇక డబ్బు ఎక్కడా పుట్టక, లంకలోనే ఓపెన్ ఏర్ టూరింగ్ టాకీస్ కడతాడు. కరెంటు కోసం జనరేటర్ ఏర్పాటు చేస్తాడు. థియేటర్ కట్టడానికి డబ్బులు కూడబెట్టడా నికి టూరింగ్ టాకీస్ ప్రారంభించి సక్సెస్ ఫుల్ గా నడుపుతూంటే, రంగా వచ్చేసి ఎటాక్ చేసి తగులబెట్టేస్తాడు.
దీంతో వూరుకోక సాగర్ ఇసుక వ్యాపారం మొదలెడతాడు. అతడికి వూరంతా తోడ్పడతారు. ఆ ఇసుక మీద సంపాదించిన డబ్బుతో అనుకున్న థియేటర్ కట్టి, కరెంటు రప్పించి, థియేటర్ ప్రారంభోత్సవం కోసం కొత్త సినిమా తెద్దామని వెళ్తే, రంగా ప్రోద్బలంతో డిస్ట్రిబ్యూటర్ ఇవ్వడు. ఇక సూర్య మేనేజర్ సాయం తీసుకుందామని నగరాని కెళ్ళి కలుస్తాడు. అక్కడ సూర్యకి 3 కోట్లు పుట్టక నూరవ సినిమా ఆగిపోయిందని తెలుసుకుని డిస్టర్బ్ అవుతాడు. తిరిగి వచ్చేసి 3 కోట్ల డబ్బు కోసం థియేటర్ ని పురుషోత్తంకే అమ్మకానికి పెడతాడు. బదులుగా మహాలక్ష్మిని వదులుకుంటా నంటాడు. పురుషోత్తం సంతోషించి సాగర్ కి ఆ డబ్బు ఇచ్చి పంపేసి, మహాలక్ష్మికి తను అనుకున్న సంబంధం చేయడానికి పూనుకుంటాడు.
9. సూర్య కథ -3 : జరిగిందంతా విన్న సూర్య, తనకోసం సాగర్ చేసిన త్యాగంతో కదిలిపోతాడు. సాగర్ ని వదులుకోవద్దని చెప్పి మహాలక్ష్మి పెళ్ళి మాన్పిస్తాడు. సాగర్ ని కలవడానికి పెరిగిన తూఫాను వర్షంలో బయల్దేరతాడు. తూఫాను బీభత్సానికి గోడపల్లి వాసులు సాగర్ కట్టిన థియేటర్లో తలదాచుకుంటారు. సూర్య అలా రావడంతో షాకైన సాగర్ - సూర్యల మధ్య మొదటిసారి కలుసుకున్న ఈ సీనులో తనంటే సాగర్ అభిమానం, త్యాగం, ఆత్మవిశ్వాసం చూసి, సాగర్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుందని తెలుసుకుని, ఆశీర్వదించి నిష్క్రమిస్తాడు. ఇంటికి వెళ్ళి, ఇల్లమ్మేసి జీరో నుంచి స్టార్ట్ అవుదామని మేనేజర్ కి చెప్తాడు.
B. దర్శకుడి పాయింటాఫ్ వ్యూతో పిక్చరైజేషన్ :
50 కోట్లతో నిర్మించినట్టు చెబుతున్న ఈ సినిమా కథ, సాగర్ మహాలక్ష్మిని పెళ్ళి చేసుకోవడాన్ని సవాలుగా తీసుకుని అందుకు థియేటర్ నిర్మించి, దాన్ని తన అభిమాన స్టార్ సూర్య ఆగిపోయిన సినిమా పూర్తి చేయడానికి అమ్మేసి, మహాలక్ష్మితో ప్రేమని త్యాగం చేసుకోవడంగా, హృద్యమైన ముగింపుతో వుంది.
కథకి పదేళ్ళ క్రితం తను ప్లాన్ చేసిన విధంగా, సాగర్ పాత్ర జీవితంగా, అనుకున్న ఫీల్ గుడ్ మూడ్ తో, అనుకున్న బయోపిక్ గా, తన పాయింటాఫ్ వ్యూ పెట్టుకుని, అందుకనుగుణంగా జాగ్రత్తగా పిక్చరైజ్ చేశాడు దర్శకుడు మహేష్ బాబు. సాగర్ కథని ముగింపు తప్ప, ఫ్లాష్ బ్యాక్స్ తో చెప్పుకొచ్చి, భావోద్వేగాలతో బలమైన క్లయిమాక్స్ కి చేర్చాడు. కమర్షియల్ మాస్ సినిమాని ఫీల్ గుడ్ మూవీగా కూడా అందించవచ్చన్న ఒక ఇన్నోవేషన్ కి ప్రయత్నించి -సఫలమో విఫలమో -ఒక ఎగ్జాంపుల్ గా నిలిచాడు.
దర్శకుడు ఫిక్సయిన తన పాయింటాఫ్ వ్యూలో - కథలో సాగర్, సినిమా స్టార్ సూర్య అంటే పడిచచ్చే, అతడి కోసం ఏమైనా చేసే వీరాభిమానిగా కనిపిస్తాడు. అతను సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ కూడా. ఈ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఈశ్వర్ వుంటాడు. వీళ్ళిద్దరూ తప్ప అసోసియేషన్ లో ఇంకెవరూ సభ్యులు కన్పించక పోవడం ఒక వెలితిగా వుంటుంది. అదే అటు రంగాని చూస్తే, సాగర్ కి వ్యతిరేకంగా పెద్ద గ్రూపు నేసుకుని వుంటాడు. అయితే థియేటర్ ఓనర్ కొడుకైన ఈ రంగా, టాప్ స్టార్ ఆంధ్రాకింగ్ సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ తో శత్రుత్వం కథకి రిలేటెడ్ గా అన్పించదు. అసలు ఫ్యాన్స్ అసోసియేషన్ జోలికెవరైనా వెళ్తారా, పోటీ స్టార్ అభిమానులైతే తప్ప? అలాటిది థియేటర్ ఓనర్ కొడుకే ఇలా శత్రుత్వం పెంచుకుంటే, థియేటర్లో తమ స్టార్ సినిమాలు విడుదల చేయకుండా అడ్డుకునే పవర్ వాళ్ళకుంటుంది. కనుక ఈ సాగర్ తో రంగా పెట్టుకునే గొడవలు కథకి అతకకుండా వుంటూ, సినిమా మేజర్ పార్టుకి కథాపరంగా చూసేందుకు ఇబ్బంది కలిగిస్తూ వుంటాయి. దీన్ని దర్శకుడు గమనించాడో లేదో. దీంతో పాటు తర్వాత తన చెల్లెల్ని ప్రేమిస్తున్నాడని రంగా సాగర్ మీద మరింత కక్ష పెంచుకోవడం కూడా కన్విన్స్ చేయదు. అసలు థియేటర్ ఓనరైన పురుషోత్తమైనా, దర్శకుడు చెప్పకపోతే, తనే కొడుక్కి చెప్పి ఈ గొడవలు మాన్పించి వుండాల్సింది.
B (1) సాగర్ సైకో ఎనాలిసిస్ :
సాధారణంగా సినిమా స్టార్స్ ఫ్యాన్స్ కథల్లో ఎవరైనా ఆశించే టెంప్లెట్ ఏమిటంటే, పోటీ స్టార్ ఫ్యాన్స్ తో కొట్లాటలు వుండాలని. ఇదే ఇక్కడ అదృశ్యమవడంతో, సూర్య ఫ్యాన్ అయిన సాగర్ - ఎవరికీ ఫ్యాన్ కాని రంగాల మధ్య ఘర్షణలు కథకి అడ్డంకిగా మారాయి. దీనికి దర్శకుడు చెప్పేదేమిటంటే, ఫ్యాన్స్ ని అగ్రెసివ్ గా కాకుండా పాజిటివ్ గా చూపించాలనుకున్నామని. కానీ థియేటర్ కి ఫిలిం బాక్సు రాలేదని సాగర్ అగ్రెసివ్ గానే- ప్రెసిడెంట్ హోదాని కూడా మర్చిపోయి థియేటర్ అద్దాలు పగులగొట్టేసి లాకప్ లో పడతాడు. ఒక్కసారి లాకప్ లో పడి, ఎఫ్ ఐ ఆర్ గనుక నమోదైతే, ఇక జీవితంలో విద్యా ఉద్యోగ అవకాశాలు హుళక్కి అయిపోతాయని అతను తెలుసుకుని వుంటే బావుండేది. ఇక్కడ హీరోయిన్ ని చూసి సాగర్ ప్రేమలో పడేందుకు, థియేటర్ కి ఫిలిం బాక్సు రాని పరిస్థితిని కల్పించి, ఆ కారణంగా చూపి అద్దం పగుల గొట్టించి, తద్వారా పగిలిన అద్దంలోంచి ఆమెని సాగర్ కి చూపించాలనే పరస్పర విరుద్ధ కాన్సెప్ట్స్ ని కలిపి సీను చేయడం వల్ల, ప్రేమ సంగతేమో గానీ, అతడి క్రిమినల్ యాక్టివిటీ హైలైట్ అయి అతడి ప్రెసిడెంటుగిరీని దిగజార్చింది.
ఫ్యాన్స్ ని అగ్రెసివ్ గా చూపాలని లేకపోతే, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా, ప్రెసిడెంట్ సాగర్ తో విడిపోయిన ఈశ్వర్ నే, ఫ్యాన్స్ కొట్టి చెయ్యి ఎందుకు విరగ్గొట్టారు అతనేదో పత్రికలో తమ స్టార్ కి వ్యతిరేకంగా ఏదో రాశాడని?
కాబట్టి ఈ కథ ఫ్యాన్స్ కీ ఫ్యాన్స్ కీ మధ్య గొడవలతో సహజంగా, రిలేటెడ్ గా వుండాలి- కథ కావల థియేటర్ ఓనర్ కొడుకుతో కాకుండా. సినిమా స్టార్స్ కుండే ఫ్యాన్స్ ని నిజంగానే పాజిటివ్ గా చూపించాలని వుంటే- రెండు ఫ్యాన్స్ గ్రూపుల మధ్య గొడవల్లేని ఫ్రెండ్ షిప్ తో కూడిన సత్సంబంధాలు చూపించి, నేటి సోషల్ మీడియాలో పరస్పరం దెబ్బతీసుకునే ఫ్యాన్స్ గ్రూపులకి ఆదర్శంగా చేయొచ్చు. దీన్ని ఎవరైనా హర్షిస్తారు.
పోతే, తను అభిమానించే సూపర్ స్టార్ సూర్య ప్రతిష్ట కోసం ఏమైనా చేసే సాగర్ కి, ఆ స్టార్ పట్ల గల అభిమానానికి డెప్త్ కూడా వుంటే బావుండేది. ఆ డెప్త్ సూర్య పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తూనో, మరేవో మానవీయ చర్యలు చేపడుతూనో వుంటే కనిపిస్తుంది. ఇవి మిస్సయ్యాయి. అంటే సాగర్ తన అభిమాన స్టార్ కి ఆపాదించే విధంగా కథలో ఎలాటి ఎంపతీనీ క్రియేట్ చేయలేదు. ఎంపతీ అనేది ప్రేక్షకుల్ని పాత్రతో, కథతో కనెక్ట్ చేసే బలమైన భావోద్వేగం. ఫ్యాన్స్ కి దేవుడు లాంటి సూపర్ స్టార్ ప్రపంచంలో ఎక్కడైనా ఎల్లలులేని ఆరాధనీయుడే. Praise your lord అనే భక్తి భావంతో తేలిపోయే ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటూ వుంటాడు. ఇలా ప్రేక్షకుల దృష్టిలో సూపర్ స్టార్ అయిన సూర్య, సాగర్ ద్వారా దైవ సమానుడుగా ఎమోషనల్ గా ఎలివేట్ కావాల్సింది కాలేదు. మరొకటేమిటంటే, సాగర్ ఇంట్లో కనీసం ఒక్క సూర్య పోస్టర్ కూడా లేకపోవడం.
ఇక సూర్య కుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఒక్కసారైనా సూర్యని సాగర్ కలవక పోవడం ఒకటుంది. ఈ కథ జరుగుతున్న 2002 లో వివిధ ఫ్యాన్స్ అసోసియేషన్స్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి తమ స్టార్ ని కలుసుకుని ఫీడ్ బ్యాక్స్ ఇవ్వడం, నటించే సినిమాల విషయంలో సలహా సూచనలివ్వడం చేసేవాళ్ళు. ఇప్పుడూ చేస్తూంటారు. కానీ సాగర్ లంకలో తిరునాళ్ళు జరుగుతున్నప్పుడు, సమీపంలో సూర్య సినిమా షూటింగ్ జరుగుతూంటే , అక్కడి కెళ్ళిన సాగర్ సూర్యని కలవకుండా బయట బయటే స్టాఫ్ కి సూర్య ఇష్టపడే అరటి గెల ఒకటి అందించేసి రావడం చూస్తే- ఈ రకమైన సాగర్ ధోరణి అతను సూర్యని కలవడానికి సిగ్గు పడుతున్నాడేమో అనే అర్ధాన్నిస్తోందని దర్శకుడు గమనించి వుంటే బావుండేది. వాళ్ళిద్దర్నీ ముగింపులోనే కలపాలన్న ఆలోచన పెట్టుకోవడం వల్ల ఇలాటి లోపాలేర్పడ్డాయి.సరే, ముగింపులోనే కలపవచ్చు- ఐతే దానికి తగిన అర్ధాన్నీ జోడించాలి. అంటే పూర్వమెప్పుడో కొత్త ఫ్యాన్ గా అత్యుత్సాహంతో మొదటిసారిగా సూర్యని కలవడానికెళ్తే, ఏదో మూడ్ లో వున్న సూర్య - ఎహె పోరా!- అని గేటు వేయించేస్తే, దెబ్బతిన్న సాగర్ అప్పట్నుంచీ సూర్యని కలవట్లేదని జస్టిఫై చేయొచ్చు. అయినా అభిమానం చంపుకోలేదని చూపిస్తూ సాగర్ మీద ప్రేక్షకుల ప్రేమని మరింత పెంచొచ్చు. ఇలా ఈ నేపథ్యంలో ముగింపులో ఇద్దరూ కలుసుకునేట్టు చేస్తే , అప్పుడు గతంలో తను గెంటేసిన సాగర్ తో సూర్య భావోద్వేగాలు ఎలా వుంటాయి! ఆల్ డ్రామా ఈజ్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ లేకపోతే డ్రామా లేదు. గతంలో సూర్య సాగర్ ని గెంటేసి వుంటే కాన్ఫ్లిక్ట్.
ఇంకా సాగర్ కి మహాలక్ష్మి చేత టికెట్లు ఇప్పించి ప్రేమని బలీయం చేయడానికి సాగర్ పాత్రని దెబ్బతీసే విధంగా సీను లేకుండా చూడాల్సింది దర్శకుడు. సాగర్ సినిమా టికెట్లు ఇమ్మని అడిగితే బుకింగ్ క్లర్క్ లేవు పొమ్మని కసురుకుంటాడు. సాగర్ నిస్సహాయంగా వుండిపోతే, మహాలక్ష్మి వచ్చి టికెట్లు ఇప్పించి ఆదుకుంటుంది. థియేటర్లో ఒక ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కిలా జరగదేమో. కథలో తను సృష్టించిన హీరో పాత్రకి కథకుడే విలువ ఇవ్వకపోతే, ప్రతిష్ట పెంచకపోతే, ప్రేక్షకుల దృష్టిలో పడిపోయిన ఆ క్యారెక్టర్ ని ఇంకెందుకు కేర్ చేస్తారు ప్రేక్షకులు? ఒకటి జస్టిఫై చేయడానికి ఇంకోటి కిల్ చేయడం సరైన పధ్ధతి కాదేమో.
ఇలాటిదే ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకో విషయాన్నీ కిల్ చేసిన సీన్లు దర్శకుడు గమనించినట్టు లేదు- అవి సాగర్ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాకులో వున్నాయి. చిన్నప్పుడు స్కూల్లో అడిగిన ప్రశ్నకి సాగర్ సమాధానం చెప్పలేక పోయాడని హెడ్ మాస్టర్ అడ్మిషన్ నిరాకరించ వచ్చా? దాంతో తండ్రి ఇంటికి తీసికెళ్ళి ఆ కొడుకుని చితకబాదొచ్చా? కొడుకు సమాధానం చెప్పలేకపోవడానికి అతడి క్రానిక్ స్టేజి కెళ్ళిన నత్తియే కారణమని తండ్రికీ, హెడ్ మాస్టర్ కీ తెలియదా? నత్తికి కారణం మెదడుకీ స్వరపేటికకీ మధ్య నరాల సమస్య. వంశపారంపర్యంగా జన్యు సమస్య కూడా కావొచ్చు. దీనికి స్పీచ్ థెరఫీ అవసరం. ఆ స్పీచ్ థెరఫీకి కొన్ని నెలలు పడుతుందని డాక్టరు చెప్పి వుంటే- ఈ సమస్య నుంచి ఎలాగైనా త్వరగా బైట పడాలని సాగర్ స్ట్రగుల్ చేస్తూంటే, అప్పుడు అనుకోకుండా సూపర్ స్టార్ సూర్య టేపులో పాడిన మోటివేషనల్ గేయం విని - ఉవ్వెత్తున లేచిన భావోద్వేగంతో ఆ లోపాన్ని జయించేశాడని పిక్చరైజ్ చేసి వుంటే ఎంత బావుండేది? పిల్లల సమస్యని అర్ధం జేసుకోకుండా రాక్షసంగా దండించడమే పెద్దరికం అన్నట్టు చూపిస్తే ఎలా? లాఠీ తీసుకుని తండ్రి అలా కొడుతున్న సీను తీవ్రతని సెన్సార్ వాళ్ళు పట్టించుకోవాల్సింది.
తర్వాత, సూర్య తన వూళ్ళో జరుగుతున్న తిరునాళ్ళకి ఆహ్వానించేందుకు మహాలక్ష్మి ఇంటికెళ్ళే సీనుతో వచ్చిన సమస్య! ఏంటా సమస్య? చెబితే కోటి రూపాయలు బహుమానం! సరే, చెప్పేద్దాం…ఇటు తిరునాళ్ళు, అటు సూర్య సినిమా షూటింగు ఏకకాలంలో జరుగుతున్నప్పుడు, సాగర్ తిరునాళ్ళకి ఆహ్వానించడమేమిటి? సూర్య ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా సాగర్ కి షూటింగ్ గురించి ముందే సమాచారముంటుంది. అప్పుడతను షూటింగ్ కి ఆహ్వానించాలి గానీ, తిరుణాళ్ళేమిటి? మహాలక్ష్మి తండ్రి పురుషోత్తం థియేటర్ ఓనరే కాబట్టి షూటింగ్ కి రాకుండా వుండడు. ఇలా ఈ సీను కథకీ, పాత్రలకీ రిలేటెడ్ గా వుంటుంది. తిరునాళ్ళేమిటి? కథలో ఇమడని ఈ తిరునాళ్ళ దృశ్యాల షూటింగ్ ఖర్చు, దాని పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చూ దండగ అయినట్ట్టే కదా?
పోతే, లవ్ ట్రాకు లవర్స్ మధ్య మాత్రమే సున్నితంగా నీటుగా వుంది. ఇదే సున్నితత్వం సాగర్ కి మహాలక్ష్మి తండ్రి పురుషోత్తంతో కూడా వుండాలి. ఎందుకంటే, చిన్నప్పట్నుంచీ తన రోల్ మోడల్ గా సూర్యని అభిమానిస్తున్న సాగర్ కి, సూర్యలో వున్న హూందాతనం, వ్యవహారశైలి, దయాగుణం, గ్రేస్ మొదలైన పాజిటివ్ వ్యక్తిత్వ విశిష్టతలకి ప్రభావితమై అవి సాగర్ లో కనిపిస్తూ వుండాలి. విరుద్ధంగా సాగర్ లో పర్సనాలిటీ దిజార్డర్స్ కనిపిస్తున్నాయి. తను కాలేజీ స్టూడెంట్ మాత్రమే కాదు, సూర్య ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కూడా. కానీ ప్రేమ విషయంలో కూడా అతడి బిహేవియర్ కాలేజీ స్టూడెంట్ అన్నట్టే వుంటుంది. అసలతను కాలేజీ స్టూడెంట్ బిహేవియర్ నుంచి సూర్య గుణగణాల్ని జీర్ణించుకున్న ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బిహేవియర్ కి మారాలి. మారి వుంటే కథ కూడా సరైన గాడిలో పడేది. ఒక ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ప్రేమ వ్యవహారాన్ని ఎలా హేండిల్ చేస్తాడో ఓ కొత్తతరహా, ఇది వరకు రాని కొత్త సీన్లతో కథ వచ్చేది.
కానీ తన పాయింటాఫ్ లో దర్శకుడు సాగర్ క్యారక్టర్ కున్న డబుల్ షేడ్స్ ని గుర్తించకుండా, కాలేజీ స్టూడెంట్ షేడ్ కే ఫిక్స్ అయిపోయి కథ లాగించేయడం వల్ల రొటీన్ ఆవారా లవర్ సీన్లే చూడాల్సి వచ్చింది మనకి. ఈ రొటీన్ వల్లే థియేటర్ మీద మహాలక్ష్మి బోర్డు పక్కన ‘ఐ లవ్ యూ’ నియాన్ లైట్ల డిస్ ప్లే పెట్టి పురుషోత్తంని రెచ్చగొట్టాడు. పురుషోత్తం కూడా సాగర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అన్న స్పృహే లేకుండా ప్రవర్తించడం కూడా పాత్ర చిత్రణ లోపమే. అసలు ఈ కథలో ఎవ్వరూ కూడా సాగర్ ఒక పెద్ద సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అని తెలుసుకుని ఆ రకమైన విలువ, గుర్తింపూ ఇవ్వకపోవడం ఈ కథ ఎలివేట్ అవకపోవడానికి ప్రధాన కారణం.కథకి కథానాయకుడే ప్రధానాకర్షణగా లేకపోతే, కథని ఇంకేం కాపాడుతుంది?
ఇంటర్వెల్ సీను లో మహాలక్ష్మితో థియేటర్ లో దొరికిపోయాక పురుషోత్తం కొట్టి గాయపరచి చెప్పే మాటలకి, సాగర్ ఎదురుతిరిగి చేసిన ఛాలెంజిని పరిశీలించాలి. ప్రేమ కథల్లో థియేటర్ కట్టి చూపిస్తా, వంద కోట్లు సంపాదించి చూపిస్తా లాంటి ఎమోషనల్ కంటెంట్ లేని మూస ఫార్ములా ఛాలెంజిల కిప్పుడు కాలం చెల్లిందనాలి. ఇవి ఎలా సాధిస్తాడో ఓ టెంప్లెట్ లో చూసి చూసి వున్నారు ప్రేక్షకులు. ఇవి నిజ జీవితంలో జరిగేవి కావు.
ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో సినిమాటిక్ పరిష్కారాలు సంతృప్తి పర్చలేవు. జీవితంలో ఎదురవుతున్న అనుభవాలు వేరు. ఇప్పటి జీవితాల్లో రెండే సమస్యలు వేధిస్తున్నాయి. అయితే రిలేషన్ షిప్ సమస్యలు, కాకపొతే ఆర్ధిక సమస్యలు. కనుక సినిమా థీమ్స్ రోమాంటిక్స్ లేదా ఎకనామిక్స్ అవుతున్నాయి. ధరలు పెరిగిపోతూ. జీతాలు పెరక్క, అసలు ఉపాధులకే గ్యారంటీ లేక స్ట్రగుల్ చేస్తున్న ప్రజలకి -ఎప్పుడు ఉన్నత స్థితికి ఎదుగుతామా అన్నఆందోళనతో జీవితం గడిచిపోతోంది. ఆ ఉన్నత స్థితికి చేరుకునే, జీవితంలో పనికొచ్చే ప్రాక్టికల్ మార్గాలు చూపాలి తప్ప- మూడు నెలల్లో థియేటర్, వందరోజుల్లో వంద కోట్లు లాంటి మోసపూరిత చిట్కాలు కాదు.
ఫస్టు ఎవరైనా ఒక గోల్ సాధించాలంటే దాని ఎండ్ పిక్చర్ చూడాలి. ఎలా సాధిస్తామన్నది కాదు. సాధిస్తే జీవితం ఎలా వుంటుందో ఆ ఎండ్ పిక్చర్ చూడాలి. డైలాగులు కొట్టి సాగర్ చేసేలాంటి ఛాలెంజీల కిప్పుడు బాక్సాఫీసులో ఏ విలువా లేదు. డైలాగ్ ఛాలెంజిలు కాలం చెల్లి పోయాయి. పురుషోత్తం అలా అవమానిస్తున్నప్పుడు ఛాలెంజి చేయకుండా సాగర్ ఆ ఛాలెంజికి తగ్గ ఎండ్ పిక్చర్ ని ఊహించుకోవాలి.
బ్రహ్మాండమైన 70 ఎం ఎం థియేటర్ కట్టేశాడు, 100 వ సూర్య సినిమాతో ప్రారంభోత్సవం చేశాడు, ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ సూర్య వచ్చేశాడు, మేళతాళాలు మోగుతున్నాయి…సాగర్ ని భుజాలకెత్తుకుని డాన్స్ చేశాడు, జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు, ఇది చూసి చప్పట్లు కొడుతున్నారు, టికెట్లు దొరక్క కొట్టుకుంటున్నారు….అప్పుడే మహాలక్ష్మిని పెళ్ళి చేసుకుని వచ్చేసి ఇదంతా చూసి ఎంజాయ్ చేస్తున్నాడు సాగర్. జీవితం సూపర్ రిచ్ గా మారింది. పెద్ద బంగాళా, కార్లు, నౌకర్లు, సంతృప్తిగా పేరెంట్స్. ఆనంద బాష్పలతో పురుషోత్తం వచ్చి కౌగిలించు కోవడాలు…సాగర్ కట్టలకి కట్టలు నోట్లు లెక్కబెట్టడం…ఇష్టం వచ్చినట్టు ఎండ్ పిక్చర్ ని ఊహించుకోవచ్చు!
ఎందుకిలా? ఎందుకంటే డైలాగుల కంటే దృశ్య భాషకి ప్రేక్షకుల సబ్ కాన్షస్ మైండ్ బాగా కనెక్ట్ అవుతుంది. ఏదైనా సాధించాలంటే ముందు దృశ్య భాషలో ఎండ్ పిక్చర్ ని ఊహించుకుతూ వుంటే, మన సబ్ కాన్షస్ మైండ్ ఇంప్రెస్ అయి అదెలా సాధించాలో అదే చూసుకుంటుంది. ఛాలెంజి చేసుకునే కథలకి తోడ్పడే సైంటిఫిక్ మెథడ్ ఇది.
(ఆర్టికల్ నిడివి పెరగడం వలన రెండు భాగాలుగా చేశాం. దర్శకుడి పాయింటాఫ్ వ్యూ, స్ట్రక్చర్, జానర్ బెండర్ లతో కూడిన రెడీగా వున్న రెండో భాగాన్ని రేపు చూడండి)
-సికిందర్
%20(1).jpg)
.jpg)


.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)