రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, September 17, 2022

1211 : రివ్యూ!


 

రచన -దర్శకత్వం : ఇంద్రగంటి మోహన కృష్ణ
తారాగణం : సుధీర్ బాబు, కృతీ శెట్టి, అవసరాల శ్రీనివాస్, శ్రీకాంత్ అయ్యంగర్, కళ్యాణీ నటరాజన్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్ , ఛాయాగ్రహణం : పీజీ విందా
బ్యానర్స్ : బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాత: మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి 
విడుదల :   సెప్టెంబర్ 16, 2022
***

        సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో సమ్మోహనం తర్వాత ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా సినిమా ప్రపంచానికి సంబంధించిన కథే. ఇందులో లేటెస్ట్ టాలీవుడ్ క్వీన్ కృతీ శెట్టి హీరోయిన్. ఈ రోమాంటిక్ డ్రామా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ వైరల్ అయ్యాయి. మరి సినిమా వైరల్ అయ్యిందా? తెలుసుకుందాం...

కథ
నవీన్ (సుధీర్ బాబు) టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్. మొదటి మగాడు, కసక్, గుడ్ బాయ్- బ్యాడ్ బాయ్ వంటి ఆరు సూపర్ హిట్స్ ఇచ్చి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూంటాడు. ఏడో సినిమా ప్లాన్ చేస్తాడు. నిర్మాత ఏ కథ ఏ హీరో హీరోయిన్లతో తీసినా అభ్యంతరం లేదని పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాడు. కొత్త హీరోయిన్ గురించి ఆలోచనలో నవీన్ కి చెత్త కుప్పలో ఒక సినిమా రీలు దొరుకుతుంది. ఆ రీలు వేసి చూసి షాక్ అవుతాడు. అందులో ఎవరో అద్భుతంగా వున్నకొత్త హీరోయిన్ నటించింది. ఈమె ఎవరో తెలుసుకోవడానికి కో డైరెక్టర్ బోస్ (వెన్నెల కిషోర్), రైటర్ రమణ (రాహుల్ రామకృష్ణ) లతో కలిసి వేట మొదలెడతాడు

ఆమె కంటి డాక్టర్ అలేఖ్య (కృతీశెట్టి) అని తెలుస్తుంది. కానీ అలేఖ్యకి సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా ద్వేషం. ఆమె తల్లిదండ్రులు (శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణీ నటరాజన్) కూడా ద్వేషిస్తారు. అయినా ఎలాగైనా అలేఖ్యని హీరోయిన్ గా నటించేందుకు ఒప్పించే ప్రయత్నంలో, సినిమాలంటే ఆమెకెందుకు ద్వేషమో తెలుసుకుని షాక్ అవుతాడు.

ఏమిటామె చెప్పిన విషయం? దీంతో డిస్టర్బ్ అయిన నవీన్ తిరిగి ఎలా తన ప్రయత్నాలు కొనసాగించాడు? ఈ క్రమంలో ఇంకేమేం జరిగాయి? అలేఖ్య, ఆమె తల్లిదండ్రుల ద్వేషాన్ని ఎలా ప్రేమగా మార్చి దర్శకుడిగా తను ఇంకో మెట్టు పైకెదిగే సినిమా తీశాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
కేవలం రోమాంటిక్ డ్రామా కాదు, ఇంకా చాలా. ఒక దర్శకుడు స్త్రీ స్వశక్తీ కరణ గురించి, విముక్తి గురించీ ఎన్నో సినిమాలు తీయొచ్చు. నిజ జీవితంలో అలాటి స్త్రీ ఒక్కరినైనా  ఉద్ధరించి సినిమాలు తీసే వాడుంటాడా? వాడు కదా గొప్ప దర్శకుడు? కూతుర్ని సంరక్షణ పేరుతో ఆంక్షలు పెట్టే తల్లిదండ్రులు, కూతురు గర్వకారణంగా వుండాలని ఎందుకు కోరుకోరు? ఆ స్వేచ్ఛ ఎందుకివ్వరు? తోబుట్టువులకి అర్ధమేమిటి? ఒకరి కలని ఇంకొకరు నిజం చేయడం కాదా? కట్టుబాట్లని ధిక్కరించడంలో శాంతి వుంటే ఆ శాంతిని ఎందుకు పొందకూడదు? ఇలా ఈనాటికీ ఈ అభ్యుదయ భావాల గురించి మాట్లాడడం, సంఘర్షించడం మానవ జాతికి నగుబాటు కాదా?

పై ప్రశ్నల సమాహారమే ఈ కథ. రోమాంటిక్ డ్రామాకి పూర్తిగా మార్చేసిన దృక్కోణం, భాష్యం. ఇందులో రోమాన్స్ కంటే జీవితం గురించి ఎక్కువ. అవే పస లేని, ఆదరణ కోల్పోయిన రొటీన్ రోమాంటిక్ కామెడీలు, రోమాంటిక్ డ్రామాల పేరుతో వస్తున్న ప్రేమ సినిమాల మధ్య కాస్త ఆలోచన, అభిరుచీ గల ప్రేక్షకుల కోసం రచయిత, దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ నుంచి మెచ్యూర్డ్ ప్రయత్నం.

తెర మీద దర్శకుడి పాత్ర ఎంత ఉన్నతంగా కన్పిస్తుందో, తెరవెనుక ఇంద్రగంటి కూడా అంత గౌరవం పెంచుకుని కన్పిస్తారు. ఇంద్రగంటి సినిమాలన్నీట్లో ఇది టాప్. ఎంత టాప్ అంటే, దీనికి ప్రేక్షకులు తక్కువ. తెలుగులో క్వాలిటీ సినిమాలకి ఇంకా ఎదగాలి కదా ప్రేక్షకులు. సీరియస్ సినిమా, కాస్త బాధపెట్టే సినిమా వస్తే టీవీ సీరియల్ అని కొట్టి పారేసే వర్గం బయల్దేరింది. టీవీ సీరియల్ కీ, సినిమాకీ తేడా తెలియకుండానే దర్శకులు సినిమాలు తీస్తారా? టీవీ సీరియల్స్ సినిమాల్లోంచే వచ్చాయి. కానీ బలహీన, సోకాల్డ్ కుటుంబ కథలు సీరియల్స్ గా చూపించి ఈ జానర్ నే దెబ్బతీశాయి. ఇదే సినిమాలకీ ఆపాదించి కొట్టి పారేయడం, అదే ఇలాటి సీరియస్- ఆలోచనాత్మక సినిమాలు వేరే భాషల్లో వస్తే ఆకాశానికేత్తేయడం ఫ్యాషనైపోయింది- ఒక పక్క హెవీ మదర్ సెంటిమెంట్ల ఒకేఒక జీవితం లాంటివి హిట్ చేస్తూ!

నటనలు- సాంకేతికాలు

సుధీర్ బాబు ఏంటో ఈ సినిమాతో తెలుసుకోవచ్చు. జంటిల్ మాన్ దర్శకుడి పాత్రని అతను ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా తెరమీద ప్రొజెక్ట్ చేశాడు. ప్రతీ సీనులో తన పాత్ర ప్రేక్షకులకి  ఆత్మీయంగా అన్పించేలా, ప్రేమించేలా నటించాడు. కుటుంబ సంక్షోభాన్నీ, ఆ కుటుంబంలో కూతురి క్షోభనీ చాలా నీటుగా పరిష్కరించే పాత్రచిత్రణ అతడి నటనకి బలం. ఇది అవార్డు స్థాయి నటన అని చెప్పడం లేదుగానీ, దాదాపూ అలాటిదే.

హీరోయిన్ కృతీ శెట్టిది కూడా అవార్డు స్థాయి నటన అని చెప్పడం లేదుగానీ, దాదాపూ అలాటిదే. సినిమాల్లో హీరోయిన్ పేరుకి పెద్ద హోదాలో వుంటుంది గానీ, వేసేది వెకిలి వేషాలు. లాయరమ్మ మాస్ పాటేసుకుంటుంది. కలెక్టరమ్మ కల్లు తాగి చిందులేస్తుంది. కృతీ శెట్టి డాక్టర్ పాత్ర హోదాకి తగ్గ, హూందాతనంతో కూడిన నటనని చూసి తలవంచుకోవాలి రంగరంగ వైభవం లోని హీరో హీరోయిన్ల టీనేజీ బిహేవియర్ లేకి డాక్టర్ పాత్రల్లాంటివి కూడా.

ఇక వెన్నెల కిషోర్. ఇతను ఎంత నటించినా కామెడీ ఇంకా మిగిలే వుంటుంది. సినిమా తర్వాత సినిమా కొసరి కొసరి వడ్డిస్తూంటాడు. ఒకేఒక జీవితం లో బ్రోకర్ పాత్రలో ఎలా ఒదిగిపోయాడో ఇక్కడ కో డైరెక్టర్ పాత్రలో అలా ఒదిగి కామిక్ రిలీఫ్ కి తోడ్పడ్డాడు. కమెడియన్ రాహుల్ రామకృష్ణ రైటర్ పాత్రలో నవ్వించడానికి రాలేదు- హీరోకి పెద్ద మనిషి తరహా సపోర్టు నిచ్చే జగ్గయ్యలా అన్పిస్తాడు. వీళ్ళిద్దరు కూడా అవార్డు తీసుకోవచ్చని అనడం లేదుగానీ, తీసుకునే కెపాసిటీ వుంది.

సెంటిమెంట్ల పేరుతో రొడ్డ కొట్టుడు నాటు తల్లితండ్రుల పాత్రలకి అలవాటు పడ్డ ప్రేక్షకులకి ఇక్కడ శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణీ నటరాజన్ లు ఓ కుదుపు నిస్తారు. వీళ్ళిద్దరు కూతురు కృతీ పాత్రతో పతాక స్థాయికి తీసికెళ్ళారు సంక్లిష్ట హ్యూమన్ డ్రామాని. పిల్లలు ఏడ్పిస్తే పేరెంట్స్  ఏడ్పు ఎలా వుంటుందనడానికి శ్రీకాంత అయ్యంగార్ నటించిన చివరి భావోద్వేగ సన్నివేశం నిజ జీవితం ఇలాగే వుంటుందనడానికి తార్కాణం. ఇది ఎక్కడో గుచ్చుకుని గిల్టీ ఫీలింగ్ తో లేచి వెళ్ళి పోయే ప్రేక్షకులూ వుంటారు. ఇది దర్శకుడి విజయమే. శ్రీకాంత్, కళ్యాణీ లది కూడా అవార్డు స్థాయి నటన అని చెప్పడం లేదుగానీ, దాదాపూ అలాటిదే.

ఇంకే మైనర్, సహాయ పాత్రలు నటించిన వాళ్ళూ కూడా కథ శిల్పం, మూడ్, ఫీల్ ని చెడగొట్టకుండా అందులో భాగమై కనిపిస్తారు. సాంకేతిక ప్రమాణాల్లో పీజీ విందా కెమెరా వర్క్ బ్యూటీఫుల్ విజువల్స్ ని సృష్టించింది. కాస్ట్యూమ్స్ ఎంపిక, కళా దర్శకత్వం, సెట్స్, లొకేషన్స్ పైస్థాయిలో వున్నాయి. వివేక్ సాగర్ సంగీతం లో అల్లరల్లరి టైటిల్ సాంగ్, ఇంకో ఐటెమ్ సాంగ్ తో బాటు, బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ కి సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రి కవులు. వివేక్ సాగర్ సన్నివేశాలకి కూర్చిన నేపథ్య సంగీతం భారీ ఆర్కెస్ట్రెయిజేషన్ తో హాలీవుడ్ స్టయిల్లో రిచ్ నెస్ ని తీసుకు వచ్చింది. ఇక ఇంద్రగంటి రచన, దర్శకత్వం ఆయన సినిమాల్ని ఎంత సీరియస్ గా తీసుకుంటాడో తెలియజేస్తాయి. ఈ ప్రమాణాల్ని మున్ముందు కూడా ఇలాగే అందిస్తాడని ఆశించాలి.

చివరికేమిటి
ఇంటర్వెల్ దాకా సమయం వృధా చేయకుండా వెంటనే పది నిమిషాల్లో సినిమా రీలు దొరకడంతో కథ ప్రారంభమై పోతుంది. ఆ రీల్లో వున్న హీరోయిన్ కృతీ శెట్టి కోసం అన్వేషణ. కానీ దర్శకుడైన సుధీర్ బాబు రీల్లో వున్న హీరోయినెవరో వెంటనే తెలుసుకోవచ్చు. ఎవరు తీస్తున్నసినిమా  ఆపేశారో లాబ్స్ లో ఆ రీలుని బట్టి ఇట్టే తెలుసుకోవచ్చు. ఈ లాజిక్ ని పక్కన బెట్టారు. ఆమె కోసం సినిమాటిక్ అన్వేషణ, కామెడీలు.

చివరికి కృతి డాక్టర్ అని తెలిశాక, సినిమా వాళ్ళంటే ద్వేషంతో ఆమె ట్రాక్. సుధీర్ రొట్ట మాస్ సినిమాల డైరెక్టర్ అని కూడా ఆమెకి అసహ్యం. దీన్ని పోగొట్టడానికి ఒక సెమినార్ లో రెండు కోట్లు విరాళం ప్రకటిస్తాడు. దీనికి కూడా లొంగదు. అప్పుడు అదే సెమినార్ లో చెత్త సినిమాలు తీసే వాడుకూడా ఏదో మేలు చేసే ఒక డైలాగు రాస్తాడని, దాంతో కనీసం ఒకడైనా చిరస్మరణీయు డవుతాడన్న సన్నివేశం సోదాహరణగా ప్రూవ్ అయి అతను ఉన్నతుడై పోతాడు.

హీరోయిన్ మనసుని మార్చే ఈ సీను క్రియేషన్ చాలా టాప్ క్లాస్. కథ లోతుపాతుల్లోకి వెళ్ళి తవ్వి తీసిన క్రియేటివిటీ. మళ్ళీ సెకండాఫ్ లో ఆమెని నటించడానికి ఒప్పించేందుకు సుధీర్ చెప్పే తన ఫ్లాష్ బ్యాక్ కూడా ఇలాటిదే టాప్ క్లాస్.

ఇంటర్వెల్లో ఆ సినిమా రీలులో తనని చూసుకుని కృతి చెప్పే విషయంతో కథ అనుకోని మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ లో ఆమె ఫ్లాష్ బ్యాక్ తో ద్వేష  కారణం పూర్తిగా అర్ధమవుతుంది.

ఇప్పుడు సుధీర్ కథ మార్చేసి ఆమె పేరెంట్స్ కి తెలియకుండా ఆమె హీరోయిన్ గా షూటింగ్ ప్రారంభిస్తాడు. ఇది చాలా విపరిణామాలకి దారి తీస్తుంది పేరెంట్స్ తో  క్లయి మాక్స్ కొచ్చేసరికి- అన్ని సమస్యలకీ పరిష్కారంగా అదే రీలుతో కలిపి తీసిన సినిమా వేసి, సృష్టించే వూహించని పతాక స్థాయి డ్రామా మాస్టర్ స్ట్రోక్ గా వుంటుంది. సున్నిత పాత్రల బలమైన మానసిక సంఘర్షణల క్వాలిటీ చిత్రణ ఇది. ఐతే పైన చెప్పుకున్నట్టు, ఈ క్లాస్ మూవీకి ప్రేక్షకుల సపోర్టు తక్కువే వుంటుంది.

—సికిందర్
(ఈ సినిమా రెండు సార్లు చూశాం. ఇందులో
నేర్చుకోవాల్సినవి చాలా వున్నాయి.
ఇది పర్సనల్ గా రాసుకున్న రివ్యూ.
ఇది ఎక్కువమందికి నచ్చని సినిమా.
ఎక్కువ మందికి లపాకీ సినిమాలు కావాలి)