రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, నవంబర్ 2020, ఆదివారం

1000 : హాలీవుడ్ రివ్యూ

 


దర్శకత్వం : మైక్ రాల్ 
తారాగణం :  వెనెస్సా హజెన్స్, సామ్ పలాడియో, నిక్ సగర్, మియా లాయిడ్
రచన : రాబర్ట్ బర్గర్, మెజాన్ మెట్జర్; సంగీతం : అలన్ లజర్, ఛాయాగ్రహణం : ఎఫ్ ఏ ఫెర్నాండెజ్
నిర్మాణం : బ్రాడ్ క్రెవాయ్ టెలివిజన్ 
నిర్మాతలు : స్టీవెన్ మెక్ గ్లోథెన్, వెనెస్సా హజెస్ 
విడుదల : నెట్ ఫ్లిక్స్ (19.11.20)

***

    వెనెస్సా హజెన్స్ ఇంకో పాత్ర జోడించుకుని త్రిపాత్రాభినయంతో విచ్చేసింది...క్రిస్మస్ కి ప్లస్ టూ వినోదం. వినోదంలో ప్రణయం, ప్రణయంలో ప్రమాదం. కాల్పనిక రాజవంశంలో హాస్యాభ్యుదయం, పట్టాభిషేకంలో అపహరణల పర్వం. పండగ మూడ్ సినిమాకి పక్కా నిర్వచనం. పండగ సినిమాల పేరుతో వాటీజ్ ఫ్యామిలీ సినిమా? నరికి వేతల రక్తపాతమా, కన్నీళ్ళ ధారా పాతమా? సెంటిమెంట్ల శరా ఘాతమా? వెనెస్సా వినోదం, వినోదంలో హాస్య విలనీ, రాజవంశ మర్యాదల మన్నన ఒక కొత్త డ్రీమ్ వరల్డ్. డ్రీమ్ వరల్డ్ లో డ్రీమీ డియరెస్ట్ పాత్రలు. ది ప్రిన్సెస్ స్విచ్ కి  ది ప్రిన్సెస్ స్విఛ్డ్ ఎగైన్ సీక్వెల్. క్రిస్మస్ సంరంభంలో మరో సీక్రెట్ గేమ్, గేమ్ మీద గేమ్. గేట్లు తెరచుకున్న హ్యూమర్.

    సారి మాంటేనరో డచెస్ మార్గరెట్ డెలాకోర్ట్ (వెనెస్సా హజెన్స్ -2) కి ఉన్నట్టుండి క్రిస్మస్ కి మాంటేనరో రాకుమారిగా పట్టాభిషికత్వం వరిస్తే, బెల్గ్రేవియా రాకుమారి స్టేసీ (వెనెస్సా హజెన్స్ -1) తో నేను నువ్వుగా, నువ్వు నేనుగా మారి, ప్రేమ సంగతులు చూసుకుందామని అనుకుంటే, ఎక్కడ్నుంచో లేడీ ఫియోనా (వెనెస్సా హజెన్స్ -3) నంటూ కిలాడీ దూరి, రాజవంశ ఖజానా ఖాళీ చేద్దామనుకునే ఎత్తుకి పైఎత్తు చివరికి చిత్తు కథ. నేటి బాక్సాఫీసు స్లోగన్  రోమాంటిక్స్ ప్లస్ ఎకనమిక్స్ మార్కెట్ యాస్పెక్ట్ కి రోమాంచిత న్యాయం.

      వెనెస్సా నవ్వు ముఖం మరోసారి కట్టి పడేస్తుంది. ఆమె నవ్వు ముఖం లేకపోతే ఈ సీక్వెల్ కూడా లేదు. బెల్గ్రేవియా రాకుమారి స్టేసీ, మార్గరెట్ పట్టాభిషేకానికి మాంటేనరో బయల్దేరుతూ, మధ్యలో షికాగోలో కెవిన్ (నిక్ సగర్) పరిస్థితేమిటో చూడాలనుకుంటుంది. కెవిన్ తో మార్గరెట్ కి బ్రేకప్ అయి షికాగోలో అతను అదే బేకరీ నడుపుకుంటూ వుంటాడు. పదేళ్ళ కూతురు ఒలీవియా వుంటుంది. భర్త ప్రిన్స్ ఎడ్వర్డ్ (సామ్ పలాడియో) తో కలిసి స్టేసీ వచ్చి, కెవిన్ ని మార్గరెట్ పట్టాభిషేకానికి కి రావాలని ఒప్పిస్తుంది.  

    వాళ్ళతో కూతుర్ని తీసుకుని మాంటేనరో ప్యాలెస్ కొస్తాడు గడ్డం పెంచుకుని వున్న కెవిన్. పండక్కి ప్యాలెస్ అలంకరణకి తోడ్పడతాడు. రాజ్య బాధ్యతలు మీద పడడంతో అతణ్ణి నిర్లక్ష్యం చేశానని బాధ పడుతుంది మార్గరెట్. మరో వైపు స్టేసీకి కూడా ఇదే సమస్య. రాకుమారిగా పరిపాలనా బాధ్యతల వల్ల భర్త ప్రిన్స్ ఎడ్వర్డ్ ని నిర్లక్ష్యం చేస్తున్నానని బాధ. ఇక ఆ సాయంకాలం విందు వినోదాల కార్యక్రమంలో వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది కిలాడీ లేడీ ఫియోనా.

    మార్గరెట్, స్టేసీల పోలికలతో వున్న లేడీ ఫియోనా తను మార్గరెట్ కజిన్ నని చెప్పుకుంటుంది. ఈమె ఘన చరిత్రేమిటంటే, వారసత్వంగా సంక్రమించిన సంపదని అవజేసి, కిలాడీలైన ఇద్దరు సేవకులు రెగ్గీ, మిండీలని వెంటేసుకు తిరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ ట్రిపుల్  ధమాకా లాంటి అవకాశాన్ని చూస్తుంది. ఒకటి మార్గరెట్ లా తను సెటిల్ అవచ్చు, రెండు పట్టాభిషేకం జరుపుకోవచ్చు, మూడు ఖజానా దోచుకోవచ్చు. రెగ్గీ, మిండీలతో ఆమె ఈ విందు కార్యక్రమానికి వచ్చిందే అతిధుల జేబులు సవరించడానికి.

    ఈ విషయం తెలీక స్టేసీ, మార్గరెట్ లు వేరే ప్లానుతో వుంటారు. మార్గరెట్ సమస్యేమిటంటే, ప్యాలెస్ ముఖ్య నిర్వాహకుడు టోనీ తనని ప్రేమిస్తున్నాడు. పట్టాభిషేకంలోగా ఇప్పుడు తను కెవిన్ తో ప్రేమని చక్కదిద్దుకోవాలంటే, టోనీని వదిలించుకోవాలి. అందుకని తను స్టేసీలా స్టేసీ స్థానంలో కెళ్తే, స్టేసీ మార్గరెట్ లా తన స్థానంలో కొస్తే బావుంటుంది. సరేనంటుంది స్టేసీ. ఇలా స్థానాలు మార్చుకున్న విషయం తెలీక, మార్గరెట్ అనుకుని స్టేసీని కిడ్నాప్ చేసి పడేస్తుంది లేడీ ఫియోనా...

ఎలావుంది కథ

      2018 లో క్రిస్మస్ కి విడుదలైన ది ప్రిన్సెస్ స్విచ్ మొదటి భాగానికి మార్క్ ట్వైన్ నవల ది ప్రిన్స్ అండ్ ది పాపర్ ఆధారం. ఈ నవల ఆధారంగా ప్రపంచ భాషల్లో చాలా సినిమాలొచ్చాయి, తెలుగు సహా. మొదటి భాగంలో షికాగోలో ఫ్రెండ్ కెవిన్ (నిక్ సగర్) తో కలిసి బేకరీ నడుపుతున్న స్టేసీ (వెనెస్సా హజెన్స్-1), బేకరీ క్రిస్మస్ పోటీలకి కెవిన్ తో బెల్గ్రేవియా వెళ్తుంది. అక్కడ తనలాగే వున్న మాంటేనరో డచెస్ మార్గరెట్ (వెనెస్సా హజెన్స్-2) ని చూస్తుంది. తమకి పూర్వపు బంధుత్వ ముందని తెలుసుకుంటుంది. మార్గరెట్ కి బెల్గ్రేవియా ప్రిన్స్ ఎడ్వర్డ్ (సామ్ పలాడియో) తో వివాహం నిశ్చయమై వుంటుంది. రెండు రోజుల్లో వివాహం. మార్గరెట్ తనకి సామాన్యురాలిలా జీవితం చూడాలనుందనీ, ఈ రెండు రోజులు స్థానాలు మార్చుకుందామనీ స్టేసీతో అంటుంది. స్టేసీ ఒప్పుకుంటుంది. ఇద్దరూ స్థానాలు మార్చుకుంటారు. సామాన్య జీవితంలో కెళ్లిన  మార్గరెట్ కెవిన్ తో ప్రేమలో పడుతుంది. ఇటు స్టేసీ ఎడ్వర్డ్ తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం అందరికీ స్పష్టం చేసి, మార్గరెట్ కెవిన్ తో ప్రేమలో వుంటుంది, స్టేసీ ఎడ్వర్డ్ ని పెళ్లి చేసుకుని బల్గ్రేవియా రాకుమారి అవుతుంది.

    ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్ కథ. రెండూ ప్యాలెస్ రోమాంటిక్ హ్యూమర్లే. సీక్వెల్లో మూడో వెనెస్సా తొడయ్యింది. దీంతో క్రైమ్ ఎలిమెంట్ కలిసింది. మొదటి భాగం కంటే సీక్వెల్లో వేగముంది, హాస్యం ఎక్కువుంది. రాజవంశ బంధుమిత్ర పరివారం, వైభవం, రాచ మర్యాదలు వగైరా ఒకటే. అదే మనోహరమైన క్రిస్మస్ పండగ వాతావరణం చివరంటా. 

      ఈ రెండు భాగాల్లోనూ కాన్ఫ్లిక్ట్ ప్రధానం కాదు. దాన్ని పట్టుకుని మలుపులు తిప్పడం ముఖ్యం కాదు. క్రిస్మస్ సినిమా ఇంతే. మొదటి భాగంలో స్థానాలు మార్చుకున్న ఇద్దరూ బయట సృష్టించే కాన్ఫ్లిక్ట్ ఏమీ వుండదు. మార్గరెట్ గా వుంటున్న స్టేసీ దొరికిపోతుందేమో నన్న రెండు మూడు దృశ్యాలు పైపైన వుంటాయి. సీఐడీ బట్లర్ కూడా ఫోటోలు తీయబోతూ పైనుంచి కింద పడినడుం విరగ్గొట్టుకుని చాలించుటాడు. ప్రత్యర్థి పాత్రలతో ఔటర్ కాన్ఫ్లిక్ట్ సృష్టిస్తే, స్థానాలు మార్చుకుని వాళ్ళిద్దరూ జీవితాల్లో సృష్టించుకున్న ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ హైలైట్ అవదు. ఈ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ తో వాళ్ళిద్దరూ ఏం కనుగొన్నారన్నదే ప్రధానంగా చెప్పదల్చుకున్న కథ. మార్గరెట్ సామాన్య జీవితంలోని ఆనందాన్ని కనుగొంది, స్టేసీ ప్రేమని కనుకొంది. దీనికి ఏడ్పులూ, తెచ్చిపెట్టున్న సెంటిమెంట్లూ, ఫ్యామిలీ చాదస్తాలూ వంటి రోత టెంప్లెట్లు అవసరం లేదు. హాస్యంతో కూడా వాస్తవాలు తెలుస్తాయి.  

    ఈ సీక్వెల్లో మధ్యలో వెనెస్సా హజెన్స్-3 వచ్చి, కిడ్నాప్ తో ఔటర్ కాన్ఫిక్ట్ ని సృష్టిస్తుంది. ఇది కూడా లైటర్ వీన్ గానే వుంటుంది. ఈ ఔటర్ కాన్ఫ్లిక్ట్ తో, ఈసారి స్థానాలు మార్చున్న మార్గరెట్, స్టేసీ ల ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ప్రభావిత మవుతుంది. మార్గరెట్ నిర్లక్ష్యం చేసిన కెవిన్ తో పెళ్లి ప్రాముఖ్యాన్ని గుర్తిస్తుంది, స్టేసీ పెళ్లి చేసుకున్నఎడ్వర్డ్ ని నిర్లక్ష్యం చేయకూడదని తెలుసుకుంటుంది. సరిపోతుందా ఫ్యామిలీ సినిమాకి? ఇంకేమైనా నరికి వేతలూ కాల్చివేతల నాన్ వెజ్ కావాలా పండక్కి? క్రిస్మస్ సినిమాలో ఆ వర్ణ శోభిత కేకులూ పేస్ట్రీలూ చూస్తూంటే కూడా బ్లడ్డే కావాలా? చేతిలో పట్టుకుని వంకీలు తిరిగిన ఇంకో వింత ఆయుధమే కావాలా?

***

      సంభాషణలు మృదు మధురంగా వుంటాయి. దృశ్యాల కదలిక సడి లేకుండా వుంటుంది. సంగీతం సరస గీతాలతో వుంటుంది. ఛాయాగ్రహణం పీచు మిఠాయిలా వుంటుంది. కాస్ట్యూమ్స్ సింపుల్ గా వుంటాయి. ఏ విషయంలోనూ క్రిస్మస్ సినిమా స్వరాన్ని తప్పనీయలేదు. బయటికొస్తే మంచు కురుస్తూ వుంటుంది...మంచులో తడిసిన మంచి సినిమా. 

సికిందర్