రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, నవంబర్ 2017, గురువారం

538 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు






ఎండ్ విభాగమనేది బిగినింగ్ విభాగంతో దాదాపు సమాన నిడివితో, సమాన సీన్లతో వుంటుంది. అయితే వుండాలని ఖచ్చితంగా నియమం అయితే లేదు. కథని బట్టి తేలుతుంది. ఒకే ఒక్క సీనుతో బిగినింగ్ ముగిసే సినిమాలుండవు. కొత్తగా ఎవరైనా చేయగలిగితే అదొక అద్భుతమే అవుతుంది. కోయెన్ బ్రదర్స్ ఒకే ఒక్క సీనుతో ఎండ్ ని ముగించారు ‘బ్లడ్ సింపుల్’ లో. దీని నిడివి సుమారు పది నిమిషాలు. వెనుక 35 వ సీనులో ప్లాట్ పాయింట్  టూ రావడాన్ని గమనించాం. అంటే ఎదుర్కొంటున్న సమస్యకి పరిష్కారం దొరకడమన్న మన్న మాట. కథ మొదలెడుతూ ప్రధాన పాత్రగా వున్న విస్సర్ తనే కథ ముగించాలి. ఈ కథ ముగించడానికి రే తోడ్పడ్డాడు. అతను బార్ కెళ్ళి తమ మీద (రే – ఎబ్బీ) విస్సర్ సృష్టించిన నకిలీ ఫోటో చూసేశాడు. ఇప్పుడు రే ని చంపి ఆ ఫోటో చేజిక్కించుకోవడం మినహా పరిష్కారమార్గం లేదు విస్సర్ కి.

       అలా అతనిప్పుడు ఈ 35 వ సీన్లో వచ్చి దాడి చేస్తాడు. వూహించని విధంగా ఒకే ఒక్క గుండు దెబ్బకి నేలకూలుతాడు రే. ఇద్దరి మధ్య సంఘర్షణేమీ వుండదు. పరస్పరం ఎదుట పడరు, చూసుకోరు. ఈ కథ మొత్తానికీ కారకుడైన తన శత్రువెవరో కూడా తెలీకుండా చనిపోతాడు రే. అలాగే ఆ శత్రువెవరో కూడా చూడకుండానే చంపేస్తుంది ఎబ్బీ. ఇదీ డైనమిక్స్ (ఈ వ్యాసం కింద ఇచ్చిన లింకుని క్లిక్ చేసి క్లిప్పింగ్ చూడండి).

      మొత్తం స్క్రీన్ ప్లేలో మార్టీ, ఆతర్వాత రే చనిపోబోతున్నారనీ, ఆ చావు ఫలానా ఈ విధంగా వుంటుందనీ ఏర్పాటు చేసిన  నిగూఢార్ధాల ద్వారా మనకి తెలిసిపోతుంది. సేఫ్ దగ్గర మార్టీ వంగినప్పుడు టిల్ట్ అప్ షాట్ లో సీలింగ్ కన్పించే విధంతో అతను నరకయాతన ననుభవించి మరణిస్తాడనీ, అలాగే సేఫ్ దగ్గర రే కూర్చున్నప్పుడు టిల్ట్ అప్ షాట్ లో సీలింగ్ కన్పించే తీరుతో ఇతను ఆకస్మికంగా చనిపోతాడనీ తెలుసుకుంటాం. అదే జరిగిందిక్కడ. ఒక్క గుండు దెబ్బకి చంపింది ఎవరో ఏమిటో కూడా తెలీకుండా చనిపోతాడు రే.

        ఈ ముగింపు కథకి న్యాయం చేసిందా? తప్పకుండా చేసింది. నియో నోయర్ డార్క్ మూవీస్  కథలు నీతిని స్థాపించే ఉద్దేశంతోనే వుంటాయి. ఈ కథలో మార్టీ, విస్సర్, రే, ఎబ్బీ అందరూ నీతి తప్పిన వాళ్ళే. ఈ అవినీతి కథాసుధ ఎబ్బీ నీతి తప్పడంతో ప్రారంభమ
య్యింది. ఆమె నీతి  తప్పడానికి మార్టీతో ఆమె వైవాహిక జీవితంలోని అసంతృప్తే కారణం. ఈ కారణంతో ఆమె పట్ల సానుభూతి కల్గేలానే వుంది పాత్రచిత్రణ. ఆమెకి తగిన శాస్తి జరగాలన్పించదు. పైగా ఆమె దారి తప్పినా కూడా భర్త మార్టీయే పూర్తిగా ద్వేషించలేక పోతున్నాడు. లవ్ – హేట్ రిలేషన్ షిప్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. 

      కానీ మార్టీ దగ్గర ఉద్యోగిగా రే అతడి భార్యతో సంబంధం పెట్టుకోడం విశ్వాసఘాతు
కమే అవుతుంది. ఇతడికి శాస్తి జరగాల్సిందే. జరిగింది కూడా. నీతి తప్పిన ఎబ్బీ,  రే లని చంపెయ్యాలనుకోవడం మార్టీ కూడా పాల్పడిన అవినీతి. ఇందుకు మూల్యం చెల్లించు కున్నాడు. ఇక ఎబ్బీ, రే లని చంపి రమ్మంటే నీతితప్పి విస్సర్ మార్టీ మీదికి తుపాకీ ప్రయోగించాడు. అందుకు అనుభవించాడు చివరికి. ఇలా కథకి న్యాయం జరిగి, నీతిని స్థాపించడమనే  కథా ప్రయోజనం నెరవేరింది.

        మరి ఎబ్బీ? ఈ చావులన్నీ చూశాక తనెంత తప్పు చేసిందో తెలిసే వుండాలి. తను అబల. మగవాడి నీడ లేకపోతే బతకలేనితనం. ఈ పిరికితనంతో ఇద్దరు మగాళ్ళ నీడన బతకాలనుకుంది. ఇది చట్టం ఒప్పుకోదు. భర్త నుంచి విడాకులు తీసుకునే ధైర్యం కూడా ఆమెకి లేదు. విడాకులు తీసుకుని ఆమె రే తో వెళ్ళడాన్నే చట్టం ఒప్పుకుంటుంది. కనుక సమస్య వస్తే అబల లాగా ఆలోచించ వద్దనే ఈ పాత్ర ద్వారా తెలుస్తుంది. బేలతనంతో అవ్వాకావాలి, బువ్వాకావాలీ అనుకున్నప్పుడే అక్రమ మార్గం పట్టి పోతారు. అల్లకల్లోలం సృష్టిస్తారు.

     నియో నోయర్ కథలు విధి ఆడే ఆటని – లేదా కర్మ ఫలాల్ని చూపించుకొస్తూ  చివర్లో చట్టం చేతిలో పెట్టేస్తాయి. విస్సర్, మార్టీ, రేల విషయం విధి చూసుకుంది. ఎబ్బీ సంగతి ఇక చట్టం చూసుకుంటుంది. ఈ ముగింపులో ఇంట్లో రెండు శవాలు పడున్నాయి. భర్త కూడా లేడు. వీటన్నిటికీ ఏం సంజాయిషీ ఇచ్చుకుంటుంది చట్టానికి? మొత్తం వ్యవహారం ఆమె ద్వారా చట్టం తెలుసుకుంటుంది. బోనెక్కించి ఏం చేయాలలో ఆలోచిస్తుంది. ఇది ముగింపు అనంతరం మన వూహకొదిలేసిన జరగబోయే అసలు ముగింపు.


       నియో నోయర్ కథలు విధి ఆడే ఆటని – లేదా కర్మ ఫలాల్ని చూపించుకొస్తూ  చివర్లో చట్టం చేతిలో పెట్టేస్తాయి. విస్సర్, మార్టీ, రేల విషయం విధి చూసుకుంది. ఎబ్బీ సంగతి ఇక చట్టం చూసుకుంటుంది. ఈ ముగింపులో ఇంట్లో రెండు శవాలు పడున్నాయి. భర్త కూడా లేడు. వీటన్నిటికీ ఏం సంజాయిషీ ఇచ్చుకుంటుంది చట్టానికి? మొత్తం వ్యవహారం ఆమె ద్వారా చట్టం తెలుసుకుంటుంది. బోనెక్కించి ఏం చేయాలలో ఆలోచిస్తుంది. ఇది ముగింపు అనంతరం మన వూహకొదిలేసిన జరగబోయే అసలు ముగింపు.

        ‘బ్లడ్ సింపుల్’ స్క్రీన్ ప్లే సంగతులు చాలా సుదీర్ఘంగా సాగాయి. తెలుగు సినిమాలంటే ప్రేమలు, ప్రేతాలు తప్ప ఇంకో లోకం తెలీకుండా పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో వున్న ఇంకో లోకాన్ని – జానర్ ని చూపించడానికే ఈ వ్యాసాలు. కొందరు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. మంచిదే. ఉంటే ఈ పని మీదే వుండాలి. ఆ జానర్ ఒకటి, ఈ జానర్ ఒకటి రకరకాల పడవల మీద ప్రయాణించాలనుకుంటే మాత్రం ఎన్నటికీ నియో నోయర్ తీసి పేరు గడించలేరు.

        ‘బ్లడ్ సింపుల్’ 1980 లలో ఒక తరం నాటి సృష్టి. ఇది అడల్ట్ పాత్రల కథ. 2005 లో టీనేజీ పాత్రలతో తీసిన నియోనోయర్ ‘బ్రిక్’ కూడా వుంది. ఇది కూడా ‘బ్లడ్ సింపుల్’ అంత ప్రసిద్ధమైనది. నేటికాలపు ఈ టీనేజి కథని కూడా 1930 లనాటి డషెల్ హెమెట్ హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలలు అందించిన విషయ వ్యక్తీకరణతోనే తీశారు. వచ్చే వారం దీని స్క్రీన్ ప్లే సంగతులు మొదలెడదాం.


-సికిందర్