రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, మే 2020, శుక్రవారం

932 : స్క్రీన్ ప్లే సంగతులు


    పోలీస్ క్రైం థ్రిల్లర్స్ లో హీరోయే పోలీస్ డిటెక్టివ్ గా వుండి తీరాలని రూలుందా ? పోలీస్ డిటెక్టివ్ గా విలన్ ఆర్టిస్టు వేసి, హీరో హంతకుడిగా వేసి, హీరోని విలన్ పట్టుకునే రివర్స్ యాక్షనుంటే ఫ్లాపవుతుందా?...ఇలా రోల్ రివర్సల్ చేసినప్పుడే ఈ జానర్ కథలు టెంప్లెట్ నుంచి బయటపడతాయని అభిప్రాయపడ్డాడు హాలీవుడ్ రచయిత. ఇదేదో బావుందనే అన్పిస్తుంది. అన్నిసద్గుణాలున్నపాత్రలో నేచురల్ స్టార్ నాని, హత్య చేసి తప్పించుకుంటూ వుంటే- అన్ని దుర్గుణాలు ప్రదర్శిస్తూ విలన్ పాత్రధారి జగపతిబాబు - పోలీస్ డిటెక్టివ్ గా నానిని పట్టుకునే క్రైం థ్రిల్లర్ గా వస్తే, ప్రేక్షకులు హాహాకారాలే చేస్తారు. ప్రేక్షకుల్నివీలైనంత సఫర్ చేయమనే చెప్పి పోయాడు ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్. ఎంత హత్య చేస్తే మాత్రం అంత మంచి వాడైన నానిని హంతకుడిగా పట్టుకోవాలా అని మోరల్ డైలమాలో పడిపోతారు. సెంటిమెంటుకీ చట్టానికీ మధ్య తేల్చుకోలేక నలిగిపోతారు ప్రేక్షకులు...ఛాలెంజిగా వుంటుంది మేకర్ కి. మోరల్ ప్రెమీస్ వున్న పోలీస్ ఇన్వెస్టిగేషన్ కథ కలకాలం గుర్తుంటుంది... కాకపోతే ఎండ్ సస్పెన్సుగా వుండకూడదు. వుంటే హంతకుడెవరో పోలీస్ డిటెక్టివ్ తెలుసుకోవడానికే కథ ముగింపు కొస్తుంది. మూసిపెట్టిన ఎండ్ సస్పెన్స్ కథలో ప్రత్యర్ధుల మధ్య కాన్ఫ్లిక్ట్ వుండదు. దాంతో డ్రమెటిక్ క్వశ్చన్ వుండదు. పాసివ్ పాత్రలా ఒక్కడే దిక్కుతోచక తిరుగుతూంటాడు పోలీస్ డిటెక్టివ్... 

       ‘హిట్’ఇన్వెస్టిగేటర్ విక్రం ప్రాబ్లం ఇదే. దీనిగురించి చివరి వ్యాసంలో చూద్దాం. క్రిందటి వ్యాసంలో బిగినింగ్ విభాగపు కథలో విక్రంకి గర్ల్ ఫ్రెండ్ నేహాతో చెడడం, స్టూడెంట్ ప్రీతి అదృశ్యమవడమనే మిడిల్ విభాగానికి చేరేసే రెండు సెటప్స్  చూశాం. ప్రీతి అదృశ్యం ప్లాట్ పాయింట్ వన్ మలుపుగా వచ్చింది. ఇక్కడ్నించీ ఇప్పుడు మిడిల్ లో ప్రారంభమయ్యే కథేమిటో చూద్దాం. ముందుగా ఇంటర్వెల్ వరకూ మిడిల్ వన్ కథ చూద్దాం...

మిడిల్ వన్ కథ:  
      
1. ఎస్సై ఇబ్రహీం రోడ్డు మీదే వున్న ప్రీతి కారుని బయటి నుంచి చెక్ చేస్తాడు. టోల్ బూత్ కెళ్ళి నిన్న సాయంత్రం 5.30 -6.30 మధ్య సీసీ టీవీ ఫుటేజీ అడుగుతాడు. ఒక షాపు కెళ్ళి బ్లూ కారు గురించి ఆరా తీస్తాడు. టోల్ బూత్ నుంచి అందిన సీసీ టీవీ ఫుటేజీ చెక్ చేస్తాడు 6.29కి టోల్ గేట్లో ఒక్ కార్గో ట్రక్ కన్పిస్తుంది. బ్లూ కారు కన్పించదు. ఇతర టోల్ బూత్స్ ఫుటేజీలు తెప్పించుకుని చూసినా బ్లూ కారు కన్పించదు. అది ఎగ్జిట్ అవకుండా, రోడ్డు మీద కంటిన్యూ అవకుండా ఏమైనట్టని ఆలోచనలో పడతాడు. 

      
2. పోలీస్ స్టేషన్ కొచ్చిన ‘హిట్’ చీఫ్ విశ్వనాథ్, ఇబ్రహీంని సస్పెండ్ చేస్తాడు. ప్రీతి పేరెంట్స్ మోహన్, లక్ష్మిల ముందే అతణ్ణి తిట్టి, అతడిమీద అనుమానంతో సస్పెండ్ చేసి, కేసులో నిందితుడిగా నిర్ణయిస్తాడు. 

      
3. మనశ్శాంతి కోసం లీవ్ పెట్టి ఎక్కడో గడుపుతున్నవిక్రంకి, రెండు నెలల  తర్వాత నేహా కన్పించడం లేదని ఫోరెన్సిక్స్ షిండే కాల్ చేస్తాడు. విక్రం షాకవుతాడు. నేహాతో గడిపిన ప్రేమ దృశ్యాలు మెదుల్తాయి. 

      
4. విక్రం వచ్చేసి చీఫ్ ని కలుస్తాడు. నేహా మిస్సింగ్ కేసు తనకిమ్మంటాడు. అభిలాష్ కిచ్చానంటాడు చీఫ్. అభిలాష్ వచ్చి, నేహా మిస్సింగ్ కేసులో విక్రం మీద అనుమానాలున్నాయనీ, ఈ కేసులో ఇన్వాల్వ్ కావద్దనీ హెచ్చరిస్తాడు. మీకు నచ్చినా నచ్చక పోయినా ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పేసి వెళ్లి పోతాడు విక్రం. 

      
5. రెండు రోజుల క్రితమే నేహా తనతో మాట్లాడిందని రోహిత్ తో అంటాడు విక్రం. రాత్రి పూట రహస్యంగా నేహా ఫ్లాట్ చెక్ చేస్తాడు విక్రం. నేహా చున్నీని అందుకుంటే, ప్రేమ దృశ్యాలు గుర్తుకొస్తాయి. ఫ్లాట్ లో ఏదో ఘాటు వాసనేస్తున్నట్టు గమనిస్తాడు. ఫ్లాట్ లో ఎవరో బలవంతంగా ప్రవేశించినట్టు లేదనీ, కారు కూడా మామూలుగా పార్క్ చేసి వుందనీ అంటాడు. లివింగ్ రూంలో స్ట్రాంగ్ అత్తరు వాసనేస్తోందనీ, దీన్నిబట్టి ఎవరో వచ్చి వుండాలనీ అంటాడు. అత్తరు వాసన పోలీసుల వల్ల వచ్చి వుండొచ్చు కదాని రోహిత్ అంటాడు. టెలికాం డిపార్ట్ మెంటుకెళ్ళి నేహా కాల్ లిస్టు మొత్తం తీసుకురమ్మంటాడు విక్రం. 

      
6. షిండేని కలిసి నేహా డీల్ చేస్తున్న కేసుల డిటెయిల్స్ కావాలంటాడు విక్రం. ఆ ఫైల్స్ లో ప్రీతి మిస్సింగ్ కేసు ఫైల్ వుంటుంది. అది చూసి నేహా మిస్సింగ్ కి ప్రీతితో సంబంధమున్నట్టు అనుమానిస్తాడు. ప్రీతి కేసు చూస్తున్న శ్రీనివాస్ ని కలిస్తే, ప్రీతి కేసులో ఏదో ఇంపార్టెంట్ లీడ్ దొరికినట్టు నేహా తనకి చెప్పిందని అంటాడు. ప్రీతి కారున్న చోట దూదీ, విరిగిన సిరంజీ దొరికినట్టు చెప్తాడు. ఆ దూది అత్తరు వాసనేస్తుంది విక్రంకి. సిరంజి మీద ప్రీతి బ్లడ్ గానీ, డీఎన్ఏ గానీ లేదంటాడు శ్రీనివాస్. 

       7. విక్రం చీఫ్ ని కలిసి ప్రీతి కేసు తన కిమ్మంటాడు. ప్రీతి ఫాదర్ తన ఫ్రెండేనని, ఈ కేసు విక్రం చూస్తానంటే అంతకంటే ఏం కావాలని శ్రీనివాస్ నుంచి తప్పించి, కేసుని విక్రం కిచ్చేస్తాడు చీఫ్. 

      
8. ప్రీతిని కిడ్నాప్ చేసిన వాడే కచ్చితంగా నేహా ఫ్లాట్ కేళ్లాడని, అతనెవరని రోహిత్ తో అంటాడు విక్రం. ఓకే, ఎక్కడ స్టార్ట్ చేద్దామని రోహిత్ అడుగుతాడు. ప్రీతి కేసు ఫైల్స్, ఓఆర్ఆర్ ఎంట్రీ ఎగ్జిట్ ఫుటేజీ, అలాగే ఫోరెన్సిక్స్ కి పంపిన కేస్ మెటీరియల్ మొత్తం తన టేబుల్ కి రావాలంటాడు విక్రం. స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దామంటాడు. నేహా ప్రీతి కేసు గురించి ఏమైనా మాట్లాడిందేమో షిండేని కనుక్కోమంటాడు. అలాగే నేహా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి కోర్టు పర్మిషన్ తీసుకున్నారేమో తెలుసుకోమంటాడు.

      
9. విక్రం ఎస్సై ఇబ్రహీం ని అతడి ఇంటికి తీసుకెళతాడు. దారిలో స్కూటర్ రిపేరు కిచ్చానని మెకానిక్ ఫాహద్డ్ దగ్గరాగి స్కూటర్ తీసుకుంటాడు ఇబ్రహీం. ఇంటికెళ్ళాక నిన్ను అనుమానించడం లేదనీ, ఇంకేమైనా మర్చిపోయావేమో గుర్తు తెచ్చుకుని చెప్పమంటాడు విక్రం. ఇదే జరిగిందని చెప్తాడు ఇబ్రహీం. ఒకసారి ఇల్లు చూడొచ్చా అని గదిలోకి వెళ్లి అక్కడున్న అత్తరు బాటిల్ తీసి వాసన చూస్తాడు విక్రం. రోహిత్ వస్తాడు. ఈ అత్తరు కాదన్నట్టు తలాడిస్తాడు విక్రం. బయల్దేరుతూ ఇబ్రహీం కి సిగరెట్ ఆఫర్ చేస్తూ, మళ్ళీ అవసరమైతే హెల్ప్ చేయాలని షేకాండిస్తాడు విక్రం. అక్కడ్నించి తిరిగి వెళ్తూ, ఇబ్రహీం చూశానంటున్న బ్లూ కారు ఇంకెవరూ  చూడలేదని, శ్రీనివాస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా బ్లూ కారు జాడలేదనీ అంటాడు. అరచేతికున్న సెల్లో ఫేన్ టేప్ తీసిస్తూ, దీని మీద ఇబ్రహీం వేలిముద్రలు కలెక్ట్ చేసుకోమంటాడు. ఇబ్రహీం తాగి పడేసిన సిగరెట్ పీక మీదే ఇబ్రహీం డీఎన్ఏ తీసుకోమంటాడు.


         10. కాలేజీకి వెళ్లి అజయ్, సంధ్య అనే స్టూడెంట్స్ ని దర్యాప్తు చేస్తాడు. అజయ్ మీద అనుమానాలు రావు. కిడ్నాపైన ముందు రోజు తనూ ప్రీతీ పబ్ కెళ్లామని అంటుంది సంధ్య. అక్కడేం జరగలేదని అంటుంది.  చంద్రమౌళి అనే టీచర్ మీద అనుమానం వ్యక్తం చేస్తుంది. చంద్రమౌళిని కలిసి అతడి పాత్రేమీ లేదని నిర్ధారించుకుంటాడు విక్రం. 

       11. పబ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలని రోహిత్ తో అంటాడు విక్రం. ప్రీతి కేసు గురించి షిండేకి నేహా ఏమైనా చెప్పిందేమో కనుక్కున్నావా అని అడుగుటాడు. ఆమె ఏం చెప్పలేదని అంటాడు రోహిత్. ఇంతలో అభిలాష్ వచ్చి, ప్రీతి మీద నీకెందుకు ఆసక్తి అని నిలదీస్తాడు.   
   
      
12. విక్రం ప్రీతి పేరెంట్స్ ని కలుస్తాడు. ప్రీతి ఒక అనాధ అనీ; మోహన్, లక్ష్మీ లు ఆమె పెంపుడు తల్లిదండ్రులనీ తెలుసుకుంటాడు. సరస్వతి అనే ఆవిడ నడిపే అనాధాశ్రయం నుంచీ మోహన్ తమ్ముడు శివ, మరదలు ప్రియ  ప్రీతిని చిన్నప్పుడు దత్తత తీసుకుని యూఎస్ వెళ్ళారనీ, అక్కడ వాళ్ళిద్దరూ ప్రమాదంలో చనిపోవడంతో, ప్రీతిని తెచ్చుకుని మోహన్ లక్ష్మీలు పెంచుకున్నారనీ తెలుసుకుంటాడు. ఆ అనాధాశ్రయాన్ని  ప్రీతి మేనేజ్ చేస్తోందని కూడా తెలుసుకుంటాడు. అనాధాశ్రయం నిర్వాహకురాలు సరస్వతి, ప్రీతి ఇచ్చే నిధులు దుర్వినియోగం కావడం లేదని చెప్తుంది.

       13. ఇరుగుపొరుగుతో ప్రీతి ఎలా వుంటుందని పేరెంట్స్ ని అడుగుతాడు విక్రం. షీలాతో క్లోజ్ గా వుంటుందని చెప్తాడు ప్రీతి తండ్రి మోహన్. మోహన్ లక్ష్మిల లాలాజలం, వేలిముద్రల శాంపిల్స్ తీసుకుంటారు. యూఎస్ లో తన తమ్ముడి ఆస్తి ప్రీతికి బదిలీ ట్రాన్స్ అయిందని చెప్తాడు మోహన్. అనుమానితుల లిస్టులో ప్రీతి పేరెంట్స్ ని కూడా చేరుస్తాడు రోహిత్. 

      
14. పొరుగున వుండే షీలాని కలిస్తే,  ప్రీతి ఒక్కతే తనతో మాట్లాడుతుందనీ, తను డైవర్సీ కావడంతో ఎవరూ తనతో మాట్లాడరనీ అంటుంది షీలా. ప్రీతి మిస్సయిన సమయంలో తను తన కూతుర్ని కలవడానికి వెళ్లినట్టు చెప్తుంది. 

      
15. విక్రం, రోహిత్ లు పబ్ కెళ్తారు. అక్కడ బార్ అటెండర్ ని ప్రశ్నించబోతే అతను భయపడి పారిపోతాడు. వెంటాడి పట్టుకుంటే అతడి దగ్గర డ్రగ్స్ బయటపడతాయి. అతణ్ణి పోలీసులకి అప్పజెప్తాడు విక్రం. ప్రీతి పేరెంట్స్ ని కలిసి పూజకి ఏర్పాట్లు చేయమంటాడు. ప్రీతి క్షేమం కోసం ఏర్పాటు చేసే పూజకి ఎవరెవరు వస్తారో, ఎవరెవరు రారో కనిపెట్టేందుకు.

      
16. పూజకి అందరూ వస్తారు. ఎవరి మీదా అనుమానం రాదు. ఇంతలో పొరుగున వుండే షీలా పరుగెత్తుకొచ్చి, తలుపు దగ్గర లెటర్ దొరికిందని చెప్తుంది. ఆ లెటర్లో - డేడ్ బాడీ వికారాబాద్ రాజూ గెస్ట్ హౌస్ ముందు వుందని రాసి వుంటుంది. విక్రం షాకవుతాడు. నేహా మెదుల్తుంది. డిస్టర్బ్ అవుతాడు. ప్రీతి కోసం పూజ దగ్గర హోమంలో మంట చూసి తలతిరిగి పడిపోతాడు (విశ్రాంతి).

మిడిల్ వన్ వివరణ :


        ఏ సినిమా కథయినా స్క్రీన్ ప్లే మిడిల్ విభాగంలోనే ప్రారంభమవుతుంది. బిగినింగ్ విభాగంలో చూసేదంతా కధకి ఉపోద్ఘాతం మాత్రమే, కథ కాదు. ఇలా మిడిల్లో ప్రారంభమయ్యే కథలో ఏం జరుగుతుందంటే, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడ్డ సమస్య కారకుడైన ప్రత్యర్ధితో  ప్రధాన పాత్ర సంఘర్షించడం జరుగుతుంది. ప్రత్యర్ధితో సంఘర్షించి సమస్యని పరిష్కరించుకునే ‘గోల్’ తో ప్రధాన పాత్ర వుంటుంది. ఈ గోల్ లో నాల్గు విటమిన్లు వుంటాయి. కోరిక, పణం, పరిణామాల హేచ్చరిక, ఎమోషన్. ఇదంతా ప్రధానపాత్ర వ్యక్తిగత అనుభవం. అతను గోల్ తీసుకోవడానికి అతను లోనైన వ్యక్తిగత అనుభవమే అంతర్గతంగా కారణమవుతుంది. కానీ ప్రధాన పాత్ర పోలీస్ డిటెక్టివ్ లాంటి, లేదా గూఢచారి లాంటి  ప్రొఫెషనల్ పాత్రయితే, గోల్ తీసుకోవడానికి వ్యక్తిగత కారణాలుండవు. వృత్తిగత కారణాలే వుంటాయి. అతడి గోల్ బహిర్గతంగా డ్యూటీ రూపంలో పై అధికారి నుంచి వచ్చి మీద పడుతుంది. ఇంత మాత్రాన పైన చెప్పుకున్న గోల్ ఎలిమెంట్స్- విటమిన్లు మాయమై పోవు. అప్పుడా పోలీస్ డిటెక్టివ్ కోరిక కేసుని పరిష్కరించి తీరాలని వుంటుంది. పోలీస్ డిటెక్టివ్ కి  గోల్ కోసం దేన్నైనా పణంగా పెట్టాలని వుంటుంది. పోలీస్ డిటెక్టివ్ కి పరిణామాలేం పొంచివున్నా ఎదుర్కోవాలని వుంటుంది. పోలీస్ డిటెక్టివ్ ఈ కథా ప్రయాణంలో హత్యకి గురైన వ్యక్తి గురించి ఎక్కడో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. ఈ విటమిన్లు అన్నీ కలిసి పనిచేస్తేనే ఒక సజీవమైన పోలీస్ డిటెక్టివ్ పాత్ర, ఒక బలమైన డెప్త్ వున్న క్రైం థ్రిల్లర్ తయారవుతాయి.  

      ఇవి ‘హిట్’ లాంటి ఎండ్ సస్పెన్స్ కథలో సాధ్యపడవు. ఎందుకంటే సమస్య వుంటుంది గానీ, సమస్యకి కారణమైన ప్రత్యర్ధి పాత్ర కన్పించదు చివరిదాకా. ప్రత్యర్ధిని వెతుక్కోవడమే సరిపోతుంది పోలీస్ డిటెక్టివ్ కి. ఆ ప్రత్యర్ధి అయిన హంతకుడెవరో వెతుక్కోవడమే కథై పోతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే హీరోకి విలన్ లేని కథ. నాకో విలన్ కావాలీ అని కథలో హీరో దీనంగా తిరుగాడే వ్యధ. ఇలా సినిమా చూపించలేమని హాలీవుడ్ ఏనాడో గుర్తించింది. టాలీవుడ్ ఇంకా ఇందులోనే మునిగి తేలుతోంది. చాలా మంచి విషయం. 

       విక్రంతో స్క్రీన్ ప్లేకి సమస్య ఇదే. ఈ మిడిల్ వన్ లో సమస్యతో సంఘర్షిస్తూ వుంటాడే తప్ప నేరస్థుడి జాడ తెలుసుకోలేడు. అతడి స్కిల్స్ కి చిటికెలో తెలుసుకునే అవకాశం కళ్ళ ముందున్నా దాన్ని గుర్తించడు. కనీసం ఇంటర్వెల్లో అయినా నేరస్థుణ్ణి కథకుడు ప్రేక్షకులకి రివీల్ చేయాలనుకోడు. 

       ప్రీతి ఒక్కటే కాదు నేహాతో రెండు మిస్సింగులు. ఇంటర్వెల్లో లెటర్ ప్రకారం శవం ఎవరిదీ- ప్రీతిదా, నేహాదా?ఎవరిది? ఓ పక్క ఈ ప్రశ్న రేకెత్తిస్తూనే, మరోపక్క హోమంలో మంటకి రియాక్షన్ గా  విక్రం కి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి పడిపోవడం. అంటే ఇంటర్వెల్ వేసింది కథకి ముఖ్యమైన  శవం ఎవరిదన్న ప్రశ్న మీద కాదా? కథకి ముఖ్యం కాని విక్రం ఫ్లాష్ బ్యాక్ మీదా? దేంతో థ్రిల్లవాలి ప్రేక్షకులు? ఇలా ఇది ఇంపాక్ట్ కోల్పోయిన ఫ్రాక్చరైన ఇంటర్వెల్ కూడా అయింది. అసలు డెడ్ బాడీ ఎవరిదన్న ప్రశ్నకూడా ఉత్తుత్తిదే. అది ఉత్తుత్తి లెటరేనని తర్వాత సెకండాఫ్ లో వెల్లడిస్తాడు కథకుడు. ఇలా ఈ ఇంటర్వెల్ తో ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడం కూడానన్న మాట, ఫాల్స్ ఇంటర్వెల్ వేసి. ‘మత్తువదలరా’ లో కూడా ఇలాటిదే చూశాం. 


మిడిల్ వన్ మరింత వివరణ:
        ఇది పోలీస్ ప్రోసీజురల్ సినిమా అని జానర్ కరెక్టుగానే చెప్పాడు దర్శకుడు. అదే సమయంలో ఇది అందరికీ అర్ధంగాదని సెల్ఫ్ గోల్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశాడు. ‘16 డి’ తమిళ దర్శకుడు కూడా ఇలాగే అనేశాడు- అర్ధం కావాలంటే రెండోసారి చూడాలని. తమకే అర్ధంగాని కన్ఫ్యూజన్ తో తీస్తే వందసార్లు చూసినా ప్రేక్షకులకి అర్ధంగావు. పైకి బావుందని చెప్పడం తప్ప. నేర న్యాయ వ్యవస్థ గురించి ఎలా పడితే అలా చూపించేస్తే నమ్మేసే ప్రమాదముంది పైగా. దర్శకుడు ఇది ‘ఇన్ఫార్మేటివ్ థ్రిల్లర్’ అని కొత్త మాట వాడేడు. ఇలాటి జానర్ లేదు. క్రైం థ్రిల్లర్ అంటే సినిమా సాంతం విషయం తేల్చకుండా, లెక్కలేనన్ని క్లూలూ సాక్ష్యాలిస్తూ, ఇన్ఫర్మేషన్ని ప్రేక్షకుల మీద డంప్ చేయడం కాదు. ఇన్ఫర్మేషన్ తో కథ వుండదు, కథ మొదలు కాదు, థ్రిల్ వుండదు, పైగా మేకర్ కే బోలెడు కన్ఫ్యూజన్. ఈ ఇన్నేసి కన్ఫ్యూజింగ్ క్లూల కథాకమామిషేమిటో ఇక చూద్దాం...

       విషయం 1. ఎస్సై ఇబ్రహీం రోడ్డు మీదే వున్న ప్రీతి కారుని బయటి నుంచి చెక్ చేస్తాడు. టోల్ బూత్ కెళ్ళి నిన్న సాయంత్రం 5.30 -6.30 మధ్య సీసీ టీవీ ఫుటేజీ అడుగుతాడు. ఒక షాపు కెళ్ళి బ్లూ కారు గురించి ఆరా తీస్తాడు. టోల్ బూత్ నుంచి అందిన సీసీ టీవీ ఫుటేజీ చెక్ చేస్తాడు 6.29కి టోల్ గేట్లో ఒక్ కార్గో ట్రక్ కన్పిస్తుంది. బ్లూ కారు కన్పించదు. ఇతర టోల్ బూత్స్ ఫుటేజీలు తెప్పించుకుని చూసినా బ్లూ కారు కన్పించదు. అది ఎగ్జిట్ అవకుండా, రోడ్డు మీద కంటిన్యూ అవకుండా ఏమైనట్టని ఆలోచనలో పడతాడు. 

       వివరణ: ఎస్సై ఇబ్రహీం ప్రీతి కారుని బయటి నుంచే చెక్ చేసి వదిలెయ్యడం పోలీసుతనం కాదు. లోపల ప్రీతి బ్యాగుంది. ఆ బ్యాగుని పోలీస్ డాగ్ కి చూపిస్తే ప్రీతి పక్కనే ఆగిన బ్లూ కారెక్కిందని తేలిపోయేది. ఆ బ్లూ కారులో ప్రీతి తొంగి మాట్లాడడం క్రితం సాయంత్రం చూశాడు కూడా. ఇప్పుడైనా ఆ బ్లూ కారాగిన చోట చెక్ చేయడు. చెక్ చేస్తే దూదీ సూదీ దొరికేవి. ఇవి తర్వాత ఈ కేసు టేకప్ చేసిన శ్రీనివాస్ కి దొరికాయి. ఇబ్రహీం ఆ దూదికి అత్తరు వాసన చూసి వుంటే, వెంటనే తనకి తెలిసిన మెకానిక్ ఫాహద్ ని పట్టుకునే వాడు. వాడు అత్తరు వాడతాడు. కథకుడు వీణ్ణి కిడ్నాపర్ గా ఎండ్ లో రివీల్ చేసినప్పుడు ఇదే వివరిస్తాడు. దూది చూపించి ఇబ్రహీం నాల్గు పీకితే, ప్రీతిని కిడ్నాప్ చేశానని వాడు అప్పుడే చెప్పేసే వాడు. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇంకా పొడిగించి సినిమా తీయడానికేముంది? ఇలా కథ అల్లితే ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే పూర్తయ్యే షార్ట్ మూవీ తయారవుతుందని గుర్తించాలి. 

       కేవలం కథకుడి వల్ల ఇబ్రహీం తెలివి హీనంగా ప్రవర్తించాడు. కథకుడు పాత్రల మధ్య దూరి కథ నడపడం నేర్పితే ఇంతే. కథకుడు పాత్రల్ని మాత్రమే కనగలడు, వాటి తలరాతని కాదు. కథకుడికి కథ గురించి తెలిసేది గోరంత, పాత్రలకి తేలిసేది కొండంత. పాత్రల్ని ఫాలో అవుతూంటే కథకుడికి ఓహో ఇంత కథుందాని అప్పుడు తెలుస్తుంది. కథల విషయంలో కథకుడు పాత్రల నుంచి నిత్యం నేర్చుకునే విద్యార్థి. మాస్టర్ స్టోరీ టెల్లర్ అని ఎవడూ లేడు. అనవసర పోజులు. వున్నదల్లా రైటర్ కి తమ కథ చెబుతూ రాయించుకున్న మాస్టర్ క్యారక్టర్సే. ఎప్పుడైతే రైటర్ క్యారక్టర్స్ కథ తను కనిపెట్టి రాయాలని ఉబలాట పడతాడో, అప్పుడా క్యారక్టర్స్ పాసివ్ గా మారి, లేదా తెలివి తక్కువగా తయారై ఆ ఉబలాటాన్ని తీర్చేస్తాయి. 

     టోల్ బూత్ ఫుటేజీలో 6.29 కి కార్గో ట్రక్ ని చూపించడం మంచి ఎత్తుగడ. ప్రేక్షకులు పట్టుకోలేని ఎత్తుగడ. ఎండ్ విభాగంలో కథకుడు రివీల్ చేసినప్పుడు, ఈ కార్గో ట్రక్ లోనే బ్లూ కారుంటుంది. ట్రక్ నడిపే వాడు మెకానిక్ ఫాహదే. ప్రీతిని బ్లూ కారులో కిడ్నాప్ చేశాక, ఆమె సహా కారుని ట్రక్ ఎక్కించి తరలించాడన్న మాట.     అందుకే ఇంకే బూత్ దగ్గరా ఆ కారు కన్పించ లేదు. ఇదీ ఆ కారు మిస్టరీ. 

       విషయం 2. పోలీస్ స్టేషన్ కొచ్చిన ‘హిట్’ చీఫ్ విశ్వనాథ్, ఇబ్రహీంని సస్పెండ్ చేస్తాడు. ప్రీతి పేరెంట్స్ మోహన్, లక్ష్మిల ముందే అతణ్ణి తిట్టి, అతడిమీద అనుమానంతో సస్పెండ్ చేసి, కేసులో నిందితుడిగా నిర్ణయిస్తాడు. 

       వివరణ : ఎస్సై ఇబ్రహీంని సస్పెండ్ చేయాల్సి వుంటే సైబరాబాద్ పోలీస్ కమీషనర్ చూసుకుంటాడు. ‘హిట్’ చీఫ్ కేం పని? అతనెందుకు పోలీస్ స్టేషన్ కొచ్చాడు? పోలీస్ ప్రొసీజురల్ అంటే ఇది కాదేమో? ప్రీతి కేసు ‘హిట్’ కివ్వాలావద్దా సైబరాబాద్ కమీషనరే నిర్ణయిస్తాడు. అయినా హత్య కేసుల గురించి ప్రత్యేకంగా ఏర్పాటయిన ‘హిట్’ కి, జూరిస్డిక్షన్ తప్పి మిస్సింగ్ కేసుల ఉత్సాహమేమిటి? ఓవరాక్షనేమిటి? 

       ఇబ్రహీంని చీఫ్ సస్పెండ్ చేసిన విధానం కూడా సరిగ్గా లేదు. అసలు ప్రీతి మిస్సింగ్ గురించి కంప్లెయింట్ ఇవ్వడానికి ఆమె తండ్రి వచ్చినప్పుడు కూడా, అతడి చేత కావాలని కొట్లాట పెట్టినట్టుంది ఇబ్రహీం ని సస్పెండ్ చేసే ఈ సీనుకోసం. ఇబ్రహీం ఏమీ చెప్పుకోనీయకుండా, ప్రీతి పేరెంట్స్ ముందు చీఫ్ ఇలా అంటాడు, ‘నిన్న వాళ్లతో ఏదో వాగావట? తప్పు చేసి రుబాబ్ చూపిస్తావారా? ఇంకా ఒక్క మాట మాట్లాడకు. అయినా పని చేయడమంటే నీకు బద్ధకమారా? నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. లాస్ట్ గా ఆ అమ్మాయితో మాట్లాడింది నువ్వేనటగా? ఇన్వెస్టిగేషన్ కి పిలిస్తే నాటకాలడకుండా రావాలి. కోపరేట్ చేయలేదనుకో, ఇమ్మీడియేట్ గా పాతేస్తా!’

       సిల్లీ! ఐపీఎస్ అయిన చీఫ్ పరువే పోయింది. ఇది ఈ జానర్ కి సెట్టయ్యే  లాంగ్వేజీ కాదు. వేరే మసాలా సినిమా డైలాగులు. అసలు బ్లూ కారులో ప్రీతి తొంగి మాట్లాడినట్టు చూశానని ఇబ్రహీం ప్రీతి తండ్రికి అప్పుడే చెప్పాడు. చివరగా మాట్లాడింది తనే ఎలా అవుతాడు. అసలు ఒక హిట్ చీఫ్ కి ఎస్సైని సస్పెండ్ చేసే అధికారమెక్కడిది? సస్పెండ్ చేశాక, తన ఫ్రెండ్ అయిన ప్రీతి ఫాదర్ తో అంటాడు, ఈ కేసు సమర్ధుడైన స్టాఫ్ కిస్తానని. మిస్సింగ్ కేసు పోలీస్ స్టేషన్ నుంచి ఎలా హైజాక్ చేసుకు పోతాడు? పోతే పోయాడు, తన ఫ్రెండ్ కోసం ఇంత ఫీలైన ఈ కేసు - ఈ కథలో హీరో అయిన విక్రం కివ్వకుండా - వేరే ఎవరో శ్రీనివాస్ కివ్వడమేమిటి? కథలో ఆడియెన్స్ ఆశించే డైనమిక్స్ కి విలువ ఇవ్వాలిగా? బిగినింగ్ విభాగంలో విక్రం ఆరునెలలు లీవ్ పెట్టినప్పుడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని రాశావ్ కాబట్టి వెళ్ళమంటాడు చీఫ్. దీని ప్రకారమైనా ఇప్పుడు పిలవాలిగా? సెటప్ చూపించి పేఆఫ్ మర్చిపోతే ఎలా? 

      అసలు బిగినింగ్ విభాగంలో ఈ లీవ్ అంశం చూస్తూంటే, అనవసరంగా కథకుడు జరగబోయేది చెప్పేస్తున్నట్టుంది. ఎప్పుడు పిలిస్తే అప్పుడొస్తానని అంటే సస్పెన్స్ ఏముంటుంది? ఇది చెప్పకుండా లీవ్ పెట్టేసి కథలోంచి వెళ్ళిపోతే, మళ్ళీ కథలోకి ఎలా వస్తాడన్న సస్పెన్సు వుంటుంది.  

      
విషయం 3. మనశ్శాంతి కోసం లీవ్ పెట్టి ఎక్కడో గడుపుతున్నవిక్రంకి, రెండు నెలల  తర్వాత నేహా కన్పించడం లేదని ఫోరెన్సిక్స్ షిండే కాల్ చేస్తాడు. విక్రం షాకవుతాడు. నేహాతో గడిపిన ప్రేమ దృశ్యాలు మెదుల్తాయి. 

       వివరణ : ఏదో ఫ్లాష్ బ్యాక్ వల్ల మతిచెడి, గర్ల్ ఫ్రెండ్ నేహా అల్టిమేటంతో లీవ్ పెట్టి, నార్మల్ అయ్యేందుకు ఎక్కడో గడుపుతున్న విక్రం, ఈ రెండు నెలల్లో ఏ మేరకు బాగు పడ్డాడో ప్రోగ్రెస్ చూపించేలేదు. అలాంటప్పుడు ఈ పీరియెడ్ చూపించడ మెందుకు? సెటప్స్ తప్ప ప్రేక్షకులాశించే పేఆఫ్స్ లేకపోతే ఎలా? నడుస్తున్న కథలో ఏమీ జరక్కపోతే కథెలా? 

       సరే, షిండే కాల్ చేసి నేహా కన్పించడం లేదనే సరికి, విక్రం డిస్టర్బ్ అయిపోయి - వెంటనే నేహాతో గడిపిన ప్రేమ దృశ్యాలు వేసుకోవడ మేమిటి? ఇది సరైన మెంటల్ రిఫ్లెక్షనేనా? (మానసిక ప్రతిఫలనం). మనమీద అలిగి వెళ్ళిపోయిన ఒక మనిషి ప్రమాదంలో పడ్డాడని తెలిస్తే, వెంటనే ఆ మనిషి అలిగి వెళ్ళిపోయిన సన్నివేశమే మెదుల్తుంది. చివరిసారి ఎప్పుడు చూశామో అదే మెదుల్తుంది. దీని తర్వాతే మిగతా పాత జ్ఞాపకాల్లోకి వెళ్తాం. 

       నేహా కన్పించడం లేదని కాల్ వచ్చేసరికి, నేహాని చివరిసారి చూసిందే గుర్తుకు రావాలి. ఆమె అప్పుడు అల్టిమేటం ఇస్తూ మాటాడిందే మెదలాలి. ఈ షాక్ సబ్సైడ్ అయ్యాక, నెమ్మది నెమ్మదిగా ఆమెతో పాత ప్రేమ జ్ఞాపకాల్లోకి వెళ్ళాలి. ఇది డ్రామా. ఇదికాక పోతే ప్రేక్షకులు ఫీలవని తాటాకు చప్పుళ్ళు. అసలు నేహా అల్టిమేటం అన్నది బిగింబింగ్ లో చేసిన సెటప్. దీనికి పేఆఫ్ ఇప్పుడామె కన్పించకపోవడం. దీనికి రిఫ్లెక్షన్ ఈ సెటప్ కీ, పేఆఫ్ కీ మధ్యనే వుండాలి. ఎప్పటివో పాత ప్రేమ దృశ్యాలు కాదు. సెటప్స్ అండ్ పేఆఫ్స్ లో కనెక్షన్స్, డైనమిక్స్ వుంటేనే ఉత్తేజకరంగా వుంటుంది కథనం. 

       విషయం 4. విక్రం వచ్చేసి చీఫ్ ని కలుస్తాడు. నేహా మిస్సింగ్ కేసు తనకిమ్మంటాడు. అభిలాష్ కిచ్చానంటాడు చీఫ్. అభిలాష్ వచ్చి, నేహా మిస్సింగ్ కేసులో విక్రం మీద అనుమానాలున్నాయనీ, ఈ కేసులో ఇన్వాల్వ్ కావద్దనీ బెదిరిస్తాడు. మీకు నచ్చినా నచ్చక పోయినా ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పేసి వెళ్లి పోతాడు విక్రం. 

       వివరణ : తన గర్ల్ ఫ్రెండ్ మిస్సింగ్ కేసు తనకిమ్మని అడుక్కునేంత దైన్యం హీరో పాత్రకి మరొకటుండదు. ఏంతో స్కిల్స్ తో పరిచయం చేసిన హీరోపాత్రకి కాకుండా ప్రీతి కేసు శ్రీనివాస్ కిపోయింది, ఇప్పడు నేహా కేసూ అభిలాష్ కి పోయింది. ఇంతకీ హీరో పాత్ర ఎవరు? హూ ఈజ్ దిస్ గై ఇన్ దిస్ ఎంటైర్ ‘ప్రిస్టీజియస్’ స్టోరీ వరల్డ్ ? 

       ఇలాకాక, ప్రీతి కేసు విక్రమే ఇన్వెస్టిగేట్ చేస్తూంటే, ఇప్పుడు నేహా కూడా మిస్సైతే, విక్రం పాత్రకి ఎంత బిగ్ బ్యాంగ్ వుండేది? రెండు మిస్సింగ్ కేసులు ఒకే పాయింటుగా వుండి, విక్రంకి బ్యాంగ్ ఇవ్వాల్సిందిపోయి - పాయింటుని చీల్చి పంపకాలు చేస్తే, రేషన్ కోసం ఇలాగే  అడుక్కోవాలి వలసకూలీ విక్రం. కథలో డ్రామా వుండాలంటే డైనమిక్స్ వుండాలి. డైనమిక్స్ మరచిన కథనం మృతపాయమైనది. 

       నేహా కేసులో ఇన్వాల్వ్ ఆయితే బావుండదని చీఫ్ ముందే అభిలాష్ విక్రం ని బెదిరించడం. చీఫ్ కి నచ్చినా నచ్చక పోయినా ఇన్వెస్టిగేట్ చేస్తానని విక్రం కూడా చెప్పేసి వెళ్ళిపోవడం. చీఫ్ అంటే ఎవరికీ లెక్కే లేదు. కనీసం వచ్చినప్పుడు సెల్యూట్ చెయ్యరు అడిషనల్ డిజిపి అయిన చీఫ్ కి. ‘హిట్’ సంస్థ కథా మర్యాద లేని సత్రంలా తయారయ్యింది. దీని సీక్వెల్ తీస్తే ఇంకెలా వుంటుందో!

      నేహా కేసులో విక్రం మీద అనుమానాలున్నాయని కూడా అంటాడు అభిలాష్. ‘నా గర్ల్ ఫ్రెండ్ కేసులో నన్నే అనుమనిస్తావ్ బే?’ అని లాగి ఒక్కటి పీకాల్సింది పీకడు విక్రం. ‘చూపించురా, ఆధారాలు చూపించు’ అని కూడా అనడు. దీంతో విక్రంని మనం కూడా అనుమానించే పరిస్థితి. మరి అనుమానాలతో ఇబ్రహీంని సస్పెండ్ చేసొచ్చిన చీఫ్, ఇప్పుడు విక్రం ని సస్పెండ్ చెయ్యడు. ఉత్తుత్తి కారణాలతోనే ఈ అనుమానాలు. కథకుడు పైపైన రాసేసి పైపైన తీసేసే పధ్ధతి నవలంబిస్తున్నట్టు కన్పిస్తోంది.  

       నేహా మామూలు వ్యక్తి కాదు. ఫోరెన్సిక్స్ ల్యాబ్ సైంటిస్టు. ఆమె మిస్సింగ్ తీవ్రమైనదిగా పరిగణించాల్సిన కేసు. పాత్రల్లో, ఈ సీన్స్ లో టెన్షన్ పుట్టించాల్సిన కథనం. కథకుడు నిర్లక్ష్యం చేసిన ప్రధానాంశం ఏమిటంటే బలాబలాల సమీకరణ చేయకపోవడం. మంచికీ చెడుకీ మధ్య స్పష్టమైన గీత గీయకపోవడం. మేం హిట్ సభ్యులమంతా ఒకవైపు, మీ నేరగాళ్ళంతా ఒకవైపూ అనే విధాన నిర్ణయం చేయకపోవడం. హిట్ సభ్యుల మధ్యే అనుమానాలు, కొట్లాటలు పెడితే ఇది మంచికీ చెడుకీ పోరాటమని ఎలా హైలైట్ అవుతుంది. చీఫ్ కింద చీఫ్ ఇన్వెస్టిగేటర్ గా విక్రం, మిగిలిన వాళ్ళంతా విక్రం కింద టీంగా ఏర్పడి- కలిసి కదం తొక్కితే ఎలా వుంటుంది... ఇక ఈ టీం సభ్యుడే, అతడి భార్యే హంతకులని చివరికి చూపిస్తే, కథకుడ్నిఎలా అర్ధం జేసుకోవాలి. సీక్వెల్లో ఇవి సరిదిద్దుకుని కథా మర్యాదతో సినిమా రైటింగ్ చేస్తాడని ఆశిద్దాం.     
 
       విషయం 5. రెండు రోజుల క్రితమే నేహా తనతో మాట్లాడిందని రోహిత్ తో అంటాడు విక్రం. రాత్రి పూట రహస్యంగా నేహా ఫ్లాట్ చెక్ చేస్తాడు విక్రం. నేహా చున్నీని అందుకుంటే, ప్రేమ దృశ్యాలు గుర్తుకొస్తాయి. ఫ్లాట్ లో ఏదో ఘాటు వాసనేస్తున్నట్టు గమనిస్తాడు. ఫ్లాట్ లో ఎవరో బలవంతంగా ప్రవేశించినట్టు లేదనీ, కారు కూడా మామూలుగా పార్క్ చేసి వుందనీ అంటాడు. లివింగ్ రూంలో స్ట్రాంగ్ అత్తరు వాసనేస్తోందనీ, దీన్నిబట్టి ఎవరో వచ్చి వుండాలనీ అంటాడు. అత్తరు వాసన పోలీసుల వల్ల వచ్చి వుండొచ్చు కదాని రోహిత్ అంటాడు. టెలికాం డిపార్ట్ మెంటుకెళ్ళి నేహా కాల్ లిస్టు మొత్తం తీసుకురమ్మంటాడు విక్రం. 

       వివరణ : ఇక్కడ కొత్త విషయం బయటపడింది...సెలవు పెట్టి ఎక్కడో గడుపుతున్న విక్రంతో, నేహా కాంటాక్టులోనే వున్నట్టు ఇప్పుడు వెల్లడిస్తున్నాడు కథకుడు. అలాంటప్పుడు షిండే నుంచి ఆమె కన్పించడం లేదని కాల్ రాగానే, ఆమె చివరి ఫోన్ కాల్ మెదలాలి విక్రంకి. ఇలా ఈ వెనకటి సీన్లో మార్చుకోవాల్సి వుంటుంది. నేహా ఫోన్లు చేసి మాట్లాడుతూనే వుందంటే, ఆమె కోపం తగ్గిందని కూడా అర్ధం. ఆమె చెప్పినట్టు వినీ లీవ్ పెట్టి రెస్టు తీసుకుంటున్నాడు కాబట్టి. ఇదే సమయంలో ఆమె అతడి ‘హిట్’ డిపార్ట్ మెంట్ లో డెవలప్ మెంట్స్ చెప్పకుండా వుండదు. ‘హిట్’ చేపట్టిన ప్రీతి మిస్సింగ్ కేసులో తను వర్క్ చేస్తున్నట్టు. కథకుడు చిట్ట చివర్లో రివీల్ చేసే దాన్నిబట్టి ఆమె చేస్తున్న వర్క్ ఏమిటి? ప్రీతి కిడ్నాపైన చోట దొరికిన సిరంజి ముక్క మీద వేలిముద్రలు తీసే పని. ఇలా సిరంజి సూది మీద వేలిముద్రలు పాక్షికంగా నైనా సరే సేకరించడం సాధ్యపడదు. కానీ కథకుడు కథకోసం ఫోరెన్సిక్స్ ని విరిచి పెట్టుకున్నాడు కాబట్టి, ఆమె వరకూ ఇది అసాధారణ కేసు. ఇంత అసాధా రణ కేసు గురించి విక్రం కి చెప్పకుండా వుంటుందా? ఆమె ఇవేమీ చెప్పినట్టు లేదు. అసలు ఫోన్ కాల్స్ లో ఏం మాట్లాడేదో కూడా కథకుడు చెప్పలేదు. తనకే తెలిసి వుండదు. కథ చెప్పే టెక్నిక్ లో, మాయమవబోయే మనిషి కీలక సమాచారమేదో  అస్పష్టంగానైనా చెప్పడమనే రొటీన్ కంపల్సరీగా వుంటుంది. చచ్చే వాడు చెవిలో ఏదో చెప్పి చచ్చాడని చూపించినట్టు. ఈ ఇంపార్టెంట్ బీట్ ని స్పృశించకుండా నేహాని పేలవంగా మాయం చేశాడు కథకుడు.  

        ఇక విక్రం నేహా ఫ్లాట్లో చెక్ చేస్తున్నపుడు ఆమె చున్నీ అందుకుని మొహానికి అద్దుకోగానే మరోసారి ఆమెతో ప్రేమ దృశ్యాల సేవనం. బెడ్ మీదికి చూసినప్పుడు, బెడ్ మీద ఆమె మరొకడితో వున్నట్టు మొదట కన్పించి, తేరిపార చూస్తే తనే కన్పించడం టోటల్ మెస్. అంటే ఆమె క్యారక్టర్ మీద మనసులో అనుమాన బీజం వుందన్నమాట. చాలా బ్యాడ్ థింకింగ్. రెండు నెలల సెలవులో మానసికంగా బాగు పడింది లేదు. ఆమె తనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పటికీ ఇలా ఆలోచిస్తున్నాడు. తనతో పడుకున్న నేహా ఇంకెవరితోనైనా పడుకోవచ్చన్నలేకి ఆలోచనలు. ఇలా చేసి విక్రం ఎలాటి చిక్కులో పడ్డాడంటే, ఇకామెకి తన తప్పుడు ఆలోచనలు చెప్పేసి లెంపలేసుకుంటే గానీ, ఆమెతో రిలేషన్ షిప్ లో వుండే అర్హత లేదు.

       ఫ్లాట్లో అత్తరు వాసన రావడం గురించి...కథకుడు మెకానిక్ ఫాహెద్ కి కనెక్ట్ చేస్తూ చివర్లో రివీల్ చేసే ఈ అత్తరు మిస్టరీని బట్టి, ఇది కథకి ప్రధాన క్లూ. ఈ క్లూకి ప్రీతి కిడ్నాపైన చోట దొరికిన అత్తరు వాసన దూది, ఫిజికల్ ఎవిడెన్స్ అయింది. దీనిమీద సరైన దృష్టే పెట్టడు అన్ని స్కిల్స్ వున్న విక్రం. 

       ఇక టెలికాం డిపార్ట్ మెంటుకెళ్ళి నేహా కాల్ లిస్టు మొత్తం తీసుకురమ్మని రోహిత్ కి చెప్పడం. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎలా పడితే అలా కాల్ లిస్టులు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం 2016 లో కట్టడి చేసింది. సంబంధిత పోలీసు శాఖ ఉన్నతాధికారి గోప్యంగా వుంచుకునే పాస్ వర్డ్ గల, ఆయన పర్సనల్  ఈ మెయిల్ ఎక్కౌంట్ నుంచి రిక్వెస్ట్ అందితేనే ఆయనకి కాల్ లిస్టు ఈ మెయిల్ ద్వారా పంపుతారు నెట్వర్క్ ప్రొవైడర్లు. ఇలా ఇక్కడ 
 విక్రం చీఫ్ కి చెప్పి తెప్పించాలి కాల్ లిస్టు. కానీ చీఫ్ ని ధిక్కరించి అనధికారికంగా చేపట్టాడు ఈ కేసుని. మరొకటేమిటంటే, నేహా కాల్ లిస్టు కావాలన్నవిక్రం, ఆ తర్వాత ఈ విషయమే మర్చిపోతాడు. ఇక నేహా కాల్ లిస్టు వూసే వుండదు ఇంత ఇంపార్టెంట్ కేసులో. ‘హిట్’ పని తీరేమిటో ఎవడికీ అర్ధంగాదు. అడ్డగోలు డ్యూటీలు, అడ్డగోలు దర్యాప్తులు. 

       ఈ సీను దగ్గర్నుంచి గమనించాల్సిందేమిటంటే, ఈ కథలో చివర్లో రివీలయ్యే హంతకుడు రోహిత్, విక్రం వెంటే వుండడం. కానీ రహస్యంగానైనా దర్యాప్తుని దారి మళ్ళించే ప్రయత్నాలు చేయకపోవడం. వీక్ క్యారక్టరైజేషన్. 

       విషయం 6. షిండేని కలిసి నేహా డీల్ చేస్తున్న కేసుల డిటెయిల్స్ కావాలంటాడు విక్రం. ఆ ఫైల్స్ లో ప్రీతి మిస్సింగ్ కేసు ఫైల్ వుంటుంది. అది చూసి నేహా మిస్సింగ్ కి ప్రీతితో సంబంధమున్నట్టు అనుమానిస్తాడు. ప్రీతి కేసు చూస్తున్న శ్రీనివాస్ ని కలిస్తే, ప్రీతి కేసులో ఏదో ఇంపార్టెంట్ లీడ్ దొరికినట్టు నేహా తనకి చెప్పిందని అంటాడు. ప్రీతి కారున్న చోట దూదీ, విరిగిన సిరంజీ దొరికినట్టు చెప్తాడు. ఆ దూది అత్తరు వాసనేస్తుంది విక్రంకి. సిరంజి మీద ప్రీతి బ్లడ్ గానీ, డీఎన్ఏ గానీ లేదంటాడు శ్రీనివాస్. 

       వివరణ : ‘హిట్’ నుంచి ప్రీతి కేసుని అధికారికంగా శ్రీనివాస్ చూస్తూంటే, విక్రంకి ఆ ఫైల్స్ ఎలా అందిస్తాడు షిండే? ఏమిటిది? కథేనా, లేక ఉరికొయ్యనా? అడుగడుగునా ఉరి తీస్తున్నాడు కథకుడు. ఆ ఫైల్స్ లో ప్రీతి మిస్సింగుకీ, నేహా మిస్సింగుకీ ఏదో లింకు కన్పిస్తుంది విక్రమాచార్యుడికి. అంతే, ప్రీతి కేసు చూస్తున్న శ్రీనివాస్ ని కలుస్తాడు. అప్పుడు ప్రీతి కేసులో ఏదో ఇంపార్టెంట్ లీడ్ దొరికినట్టు నేహా తనకి చెప్పినట్టు అంటాడు శ్రీనివాస్. ఏమిటా లీడ్ అన్న ప్రశ్న రాదు విక్రంకి. శ్రీనివాస్ అందించిన దూది నందుకుని దానికి అత్తరు వాసన చూస్తాడు. కానీ ఎలర్ట్ అవడు. ఈ దూది శ్రీనివాస్ దగ్గరెందుకుంది? సూదితో బాటు దూదీ నేహా పరిశోధనకి వెళ్ళిపోవాలిగా? కథకుడు విక్రం కి చూపించడానికి శ్రీనివాస్ దగ్గర అట్టి పెట్టినట్టుంది. 

       సూది మీద ప్రీతి బ్లడ్ గానీ, డీఎన్ఏ గానీ లేదంటాడు శ్రీనివాస్. ఎందుకు లేవు. వుండాలిగా? వుండకపోతే కిడ్నాపర్ ఈ ఇంజెక్షన్ ప్రీతికే ఇచ్చాడని ఎలా వాదిస్తారు కోర్టులో? ఏ ఇంజెక్షన్ ఇచ్చాడో సూది లోపల శోదించక పోతే, అది స్పృహ తప్పించే ఇంజెక్షన్ అని ఎలా రుజువు చేస్తారు కోర్టులో? బలవంతంగా ఇంజెక్షన్ ఇస్తున్నపుడు సూది విరిగి పడితే, మిగతా సిరంజిని ఎక్కడ విసిరేశాడు కిడ్నాపర్? అటు తుప్పల్లో వెతికారా? కిడ్నాపర్ వేలిముద్రల కోసం విసిరేసిన సిరంజీని వెతక్కుండా, దాన్ని విరిగిన సూది మీద వేలిముద్రలు తీసే అశాస్త్రీయ ప్రయత్నమేమిటి? 

       చివర్లో మనకి కథకుడు రివీల్ చేసే నేహా చెప్పిన ఇంపార్టెంట్ లీడ్ ఏమిటంటే, ఆ విరిగిన సూది మీద ఫాహెద్ వేలిముద్రలు మ్యాచ్ అవడం. ఈ రిపోర్టు బయటికి వస్తే, ఫాహెద్ చేత ప్రీతిని కిడ్నాప్ చేయించిన రోహిత్, అతడి భార్య స్వప్నాలు దొరికిపోతామని, అదే ఫాహెద్ చేత నేహాని కూడా కిడ్నాప్ చేయించారన్న మాట. అందుకే ఆమె గదిలో అత్తరు వాసన. 

       దూది, సూదీ, ఇంపార్టెంట్ లీడ్ అంటూ శ్రీనివాస్ చెప్పినప్పుడు వెంటనే విక్రం ఏం చేయాలి? నేహా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని ఆమె కంప్యూటర్ లోంచి షిండేకి చెప్పి తీయించాలి! ఇప్పుడు కూడా ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇక్కడ ఐపోయే కథని ఇంకా గంటన్నర పొడిగించడమా? అంటే కథకుడు ప్లే చేస్తున్న క్లూస్ టైమింగ్స్  అండ్ ప్లేస్ మెంట్స్ ఎలా వున్నాయంటే, సెల్ఫ్ గోల్ చేసేలా వున్నాయి గజిబిజి కథనంతో. 

       ఇదంతా శ్రీనివాస్ నుంచి వింటున్న రోహిత్ కూడా ఏం చేయాలి? నేహా కంప్యూటర్ ని హ్యాక్ చేసి, ఫాహెద్ దొరికిపోకుండా ఎవిడెన్స్ ని తునాతునకలు చేసి తుప్పల్లో పారెయ్యాలి! కంప్యూటర్నే ఎత్తుకెళ్ళి బ్లాస్ట్ చెయ్యాలి! హిట్ టీం ని ఇంత  లో- నాలెడ్జితో చూపిస్తే ఎలా?   

       విషయం 7. విక్రం చీఫ్ ని కలిసి ప్రీతి కేసు తన కిమ్మంటాడు. ప్రీతి ఫాదర్ తన ఫ్రెండేనని, ఈ కేసు విక్రం చూస్తానంటే అంతకంటే ఏం కావాలని శ్రీనివాస్ నుంచి తప్పించి, కేసుని విక్రం కిచ్చేస్తాడు చీఫ్. 

       వివరణ : మళ్ళీ రేషన్ కోసం వచ్చాడు వలస కూలీ విక్రం. మన చీఫ్ చాలా హేపీ. ఆ పిల్ల తండ్రి తన ఫ్రెండేగా. కేసు విక్రం చూస్తానంటే ఇంతకన్నా పరమానందం ఏముంటుంది చీఫ్ కాని చీఫ్ కి? కేసుని శ్రీనివాస్ నుంచి పీకి విక్రం కిచ్చి పారేశాడు, పాపం శ్రీనివాస్. ఇక ముందు నేహా కేసుని కూడా అభిలాష్ నుంచి పీకి విక్రం కిచ్చేసే  పవిత్ర కార్యముంది చీఫ్ కి. ఏదైనా పీకి మనకూ ఇస్తాడేమో చూడాలని ఆరాటంగా వుంది. డామ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్.    

(మిడిల్ వన్ మిగతా భాగం సరదాగా రేపు!)

సికిందర్