‘చరిత్ర సినిమా దర్శకులకి, రచయితలకీ నిరంతరం
కొత్త ప్రపంచాల తలుపులు తెరుస్తూనే వుంటుంది’ అంటాడు స్టీవెన్ స్పీల్ బెర్గ్. ఇప్పుడు మన దేశంలో జెన్
జీ (కాక్రోచ్) ఉద్యమం ఈ పనే చేసింది. సినిమా త్రీ యాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్
కో కొత్త ప్రపంచపు తలుపులు తెరిచింది. ఈ పని 2017 లో ‘ది మేయర్’ అనే కొరియన్ మూవీ
చేసి పెట్టింది. అయితే అది చరిత్రతో కాదు, చరిత్ర ఆధారంగా తీసిందీ కాదు, ఫక్తు
కాల్పనికం. కానీ జెన్ జీ ఉద్యమం చరిత్రయితే, ఇది కూడా ఆ పనే చేసి పెట్టింది.
దీంట్లో ఇమిడి పోయిన సంఘటనలు స్క్రీన్ ప్లేలకి కొత్త ప్రపంచాన్ని-కొత్త
క్రియేటివిటీనీ విప్పి చూపిస్తోంది!
అంటే బిగినింగ్ లో హీరో హీరోయిన్లు సహా ముఖ్య పాత్రల్ని పరిచయం చేస్తూ, అదే జానర్ కథో ఆ ఫీల్ ని నేపధ్యంలో ప్రతిఫలింపజేస్తూ, హీరో సమస్యలో ఇరుక్కునే పరిస్థితుల కల్పన చేసుకొస్తూ, చివరికి ఓ అరగంట సమయానికి హీరోని ఎదుటి పాత్రతో సమస్యలో ఇరికించి – ఆ ప్లాట్ పాయింట్ వన్ సీనుతో బిగినింగ్ విభాగాన్ని ముగిస్తూ, హీరోకి గోల్ ఏర్పాటు చేసేలాంటి ఒకే తరహా క్రియేటివిటీ కదా సినిమా తర్వాత సినిమాగా చేసుకుంటూ వస్తున్నది!
ఇలా కాకుండా, కాస్త కొత్తదనం కోసం ప్రయత్నిస్తే, ఉదాహరణకి ‘శివ’ బిగినింగ్ విభాగాన్నికొత్త క్రియేటివిటీతో మార్చేస్తే, ముందుగా నాగార్జున సైకిలు చైనుతో జేడీని కొట్టే దృశ్యంతో సినిమా ప్రారంభించి, ఎందుకు కొడుతున్నాడో తెలియని సస్పన్స్ సృష్టిస్తూ, ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించి –సినిమాలో ఇదే బిగినింగ్ విభాగంలో వున్న సీన్లన్నీ అదే వరసలో అదే అరగంటలో చూపించుకుంటూ వచ్చి, సినిమా ప్రారంభ దృశ్యమైన నాగార్జున జేడీని కొట్టే దృశ్యంతో కలపడం లాంటి దన్నమాట. అప్పుడీ ప్రారంభ దృశ్యమే ప్లాట్ పాయింట్ వన్ అయి థ్రిల్ చేస్తుంది. అంటే ప్లాట్ పాయింట్ వన్ తో సినిమా ప్రారంభించి, ఫ్లాష్ బ్యాక్ లో బిగినింగ్ విభాగాన్నంతా చూపించుకుంటూ వచ్చి, ప్రారంభంలో సస్పెన్స్ క్రియేట్ చేసిన ప్లాట్ పాయింట్ వన్ సీనుతో ఒక వర్తులాకారంలో కలపడమన్న మాట!
2005 లో రియాన్ జాన్సన్ తీసిన మొట్టమొదటి హాలీవుడ్ టీనేజీ నోయర్ ‘బ్రిక్’ తో ఇదే చేశాడు. 2018 లో ‘అదుగో’ తో రవిబాబు చేసిందిదే. ఈ క్రమంలో 2017 లో కొరియన్ మూవీ ‘ది మేయర్’ తో దర్శకుడు పార్క్ ఇంజే బిగినింగ్ విభాగంతో ఇంకో కొత్త క్రియేటివిటీని ప్రదర్శించాడు. ఇది నేటి కాక్రోచ్ జెన్ జీ ఉద్యమ క్రమాన్ని పోలి వుంటుంది.
‘ది మేయర్’ విజయవంతమైన్ కొరియన్ రాజకీయ జానర్ సినిమా. ఎన్నికల ప్రచార కథ. మేయర్ పదవికి గెలుపు కోసం పరస్పర పాపాల చిట్టా విప్పుకుని, చేయరాని పనులు చేయడం. దక్షిణ కొరియా అధ్యక్ష తరహా పాలనా వ్యవస్థ. రాజధాని సియోల్ నగర మేయర్ గా వరసగా నాల్గోసారి ఎన్నికైతే, దేశాధ్యక్ష పదవి వచ్చి కాళ్ళమీద పడుతుంది. ఇందుకే కథలో ఇప్పుడున్న మేయర్ ఖతర్నాక్ పనులు చేస్తాడు. మేయర్ పాత్రలో ప్రముఖ కొరియన్ నటుడు చోయీ మిన్సిక్ నటించాడు. ఇంకో ముఖ్యపాత్ర ఎన్నికల ప్రచార స్పెషలిస్టుగా షిమ్ క్యుంగ్ నటించింది. బడ్జెట్ 9 మిలియన్ డాలర్లు, వసూళ్ళు 93 మిలియన్ డాలర్లు.
ఇంకా అవతల మేయర్ పదవికి పోటీ చేయడానికి ప్రకటనకి సిద్ధమైన ప్రతిపక్ష అభ్యర్ది యాంగ్ వుంటుంది. ఈమె కావాలని ఆ కాగితాలు ఎగరేసుకుని, ఆ వంకతో వాటి కోసం వంగినట్టు నటించి, వక్ష సంపదని ఎక్స్ పోజ్ చేసుకుంటుంది. ఓట్లు పొందడానికి ఇదొక్కటే మార్గమనుకుంటుంది. ఆ సంపద వైరల్ అవుతుంది. కానీ ఈ ప్రతిపక్ష మేయర్ అభ్యర్ధికి వ్యతిరేకంగా వ్యూహాలు పన్నుతున్నసీన్లు వుండవు. మేయర్ పదవికి కి ప్రత్యర్ధులు అతడి పార్టీలోనే వున్నట్టు షిమ్ పాత్రద్వారా తెలుస్తుంది. అయినా ఇది కూడా సమస్యకి అంటే ప్లాట్ పాయింట్ వన్ కి దారితీయదు. ఇలా రెండు మూడు ట్రాకుల్లో పరస్పరం సంబంధం లేని సంఘటనలు నడుస్తూ, చివరికి మేయర్ వచ్చేసి అబద్ధాలతో ఎన్నికల ప్రసంగం చేయడంతో, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటై పోతుంది! ఇది కల్పన మాత్రమే, ఇక చరిత్ర చూద్దాం...
మన దేశంలో మే 3 న నీట్ పరీక్ష నిర్వహించారు. మే 7 న ప్రశ్నా పత్రం లీకయిందని వెల్లడించారు. మే 12 న ఆ జరిగిన పరీక్షని రద్దు చేశారు. ఇలా నీట్ కి సంబంధించి ఈ సంఘటనలు ఒక పక్క జరుగుతూంటే, మే 15 న దీంతో సంబంధం లేని ఒక కేసు విచారణ సందర్భంగా, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నిరుద్యోగ యువత నుద్దేశించి బొద్దింకలుగా, పరాన్న జీవులుగా ఘాటైన విమర్శ చేశారు. మే 16 న దీనికి రియాక్షన్ గా ఎక్కడో బోస్టన్ యూనివర్సిటీ విద్యార్థి అభిజిత్ దీప్కే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అని వ్యంగ్యాత్మక పార్టీ ప్రకటన సోషల్ మీడియాలో చేశాడు. దీనికి ఇంస్టాలో వారం రోజుల్లో రెండు కోట్ల మంది జెన్ జీ యువత స్పందించి ఫాలోవర్స్ గా మారిపోయారు.
ఇదంతా కేవలం చీఫ్ జస్టిస్ కి తమ నిరసన తెలియజేయడానికే జరిగింది. కానీ దీప్కే దీన్ని సీరియస్ గా తీసుకున్నాడు. పార్టీకి అయిదు సూత్రాల మేనిఫెస్టో ప్రకటించాడు. అందులో నీట్ ప్రస్తావన ఎక్కడా లేదు. నీట్ పేపర్ లీకవడం, పరీక్ష రద్దవడం, మళ్ళీ పరీక్ష జూన్ 21 న జరుగుతుందని ప్రకటించడం – ఈ సంఘటనలతో ఏ సంబంధమూ లేకుండా వుండి పోయింది ఆన్ లైన్ లో మనుగడ సాగిస్తున్న పార్టీ.
పైపెచ్చు తమ పార్టీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలపై ప్రచారం చేస్తుందంటూ, చీపుర్లు పట్టి స్వచ్ఛ భారత్ పనులు మొదలెట్టారు. ముగ్గురు అధికార ప్రతినిధులు నియమితులయ్యారు. ఒక పక్క నీట్ రద్దుతో విద్యార్థుల ఆత్మహత్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నా ఇటు వైపు తొంగి చూడలేదు కాక్రోచ్ పార్టీ. ఈ పార్టీ ఏర్పాటే ఒక కుట్ర అంటూ విమర్శల నెదుర్కొంటూ గడిపింది.
చివరికి మే 22 న దీప్కే, నీట్ పరీక్షల వ్యవహారం తీవ్రమవడంతో స్పందించి, విద్యా మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ గొంతు కలిపి ఆందోళన ప్రారంభించాడు. తను జూన్ 6 న న్యూఢిల్లీ వచ్చి జంతర్ మంతర్ లో ప్రత్యక్ష నిరసనకి నాయకత్వం వహిస్తాననీ ప్రకటించాడు. అన్నట్టు జూన్ 6 న వచ్చి నిరసన చేపట్టడంతో ఉద్యమం ప్రారంభమయింది.
ఇంతవరకూ దీన్ని ఒక కథగా చూస్తే ఇది స్క్రీన్ ప్లే లో బిగినింగ్
విభాగం కింది కొస్తుంది. ఈ బిగినింగ్ విభాగంలో రెండు విడి విడి కథనాలు రన్
అవుతున్నాయి. ఒకటి నీట్ కథనం, రెండోది కాక్రోచ్ పార్టీ కథనం. ముందుగా నీట్ పేపర్ లీకవడం
దగ్గర నీట్ కథనం మొదలైతే, తర్వాత చీఫ్
జస్టిస్ వ్యాఖ్యలతో కాక్రోచ్ పార్టీ పుట్టి దాని కథనం మొదలైంది. అంటే ఈ మొత్తం
కథకి బిగినింగ్ విభాగం ప్రారంభంలోనే నీట్ పరీక్ష రద్దుతో సమస్య ఏర్పాటయి పోయింది.
నిత్యం కథల్లో చూసే బిగినింగ్ విభాగం ముగింపులో కాకుండా, ప్రారంభం లోనే ప్లాట్
పాయింట్ వన్ ఏర్పాటై పోయింది.
ఇప్పుడు ఈ
సమస్య ప్రకృతి అనుకుంటే, ప్రకృతిని సాంఖ్య శాస్త్రం ఇలా వివరిస్తుంది : ‘ప్ర’
-అంటే విశ్వంలో ఆల్రెడీ పదార్థం వుంది. దానికి ‘కృతి’ చేసే చేతులు కావాలి. అంటే మనం జీవితంలో ఏం సాధించాలన్నా అది
ప్రకృతిలో కొదవ లేకుండా ఆల్రెడీ వుంది-జస్ట్ దానికి కృతి చేసి అందుకునే చేతులే
కావాలి. ఆ చేతుల కోసం ఎదురు చూస్తూ వుంటుంది పదార్ధం. కృతి చేసి తన వైభవం
ప్రపంచానికి చాటాలని ఎదురుతెన్నులు కాస్తూ వుంటుంది. అబ్సర్వర్ ఎఫెక్ట్ ప్రయోగంతో
క్వాంటం థియరీ కూడా ఇదే నిరూపించింది.
కనుక నీట్ పేపర్ లీక్ సమస్య దాన్ని
సాధించే చేతుల కోసం ఎదురు చూస్తూ వుంది. అప్పుడు తర్వాత చీఫ్ జస్టిస్ ఎంట్రీ ఇచ్చి
కాక్రోచ్ పార్టీ పుట్టుకకి బీజం వేశారు.
కానీ పుట్టిన కాక్రోచ్ పార్టీ క్వాంటం థియరీ తెలీక ఏమేమో చేస్తూ వుండి పోయింది.
నీట్ వ్యవహారం బాగా వేడెక్కితేగానీ గానీ చురుక్కుమనలేదు. దాంతో రంగంలోకి దిగి జంతర్
మంతర్ మొదలెట్టింది. అలా నీట్ సమస్య అనే పదార్ధంతో కృతి చేయడం మొదలెట్టింది...
కథా ప్రారంభంలో నీట్ సమస్య పుట్టినా
దానికి కృతి చేసే చేతుల్లేక ప్లాట్ పాయింట్ ఏర్పాటు కాలేదు. జంతర్ మంతర్ ఆందోళన
ప్రారంభమయ్యాకే, కృతి చేసే చేతులతో (కాక్రోచ్ పార్టీతో) ప్లాట్ పాయింట్ ఏర్పాటై
సంఘర్షణ మొదలైంది. స్క్రీన్ ప్లేలో మిడిల్ విభాగం మొదలై కథ ప్రారంభమైంది.
-సికిందర్
