రీచర్ గురి చూసి గన్
పేల్చాడు. మరుక్షణం గన్ బ్యారెల్లోంచి వేడి వేడి పొగని బయటికి ఎగజిమ్మింది.
బుల్లెట్లోని గన్ పౌడర్ సెకనులో మిలియన్ వంతు కంటే తక్కువ కాలంలో విస్ఫోటించడంతో, ఆ మండిపోతున్న పొగ బుడగలా
పెద్దగా విప్పారింది.
బుడగలా విప్పారిన పొగని
తిరిగి బ్యారెల్ గుంజేసుకుని, బ్యారెల్లోపల గ్రూవ్స్ రాపిడికి గిర్రున
తిరుగుతున్న బుల్లెట్ వెనుకా, చుట్టూ పొగ కమ్మేసేలా చేసి, ఆ రాపిడికి బుల్లెట్
ఎగదన్ని బయటి వాతావరణంలోకి దూసుకు పోయేలా చేసింది బ్యారెల్.
బయటికి వెళ్ళిన పొగ బుడగ
వాతావరణాన్నిచర్రున వేడెక్కించేసింది...బుల్లెట్ కి ముందు దూసుకుపోతున్న వేడివేడి
పొగ, గాలిలోని ఆక్సిజన్ ని
వేడెక్కించేసి మంట రేగే స్థాయికి తీసికెళ్ళింది. ఆ మంటలో మెరుపు. ఆ బుల్లెట్
పొగలోంచి బయటికి దూసుకొచ్చేసింది. మండుతున్న గాల్లోంచి గంటకి 1900 మైళ్ళ వేగంతో.
సెకనులో వెయ్యో వంతు కాలం
తర్వాత,
బుల్లెట్ ఇంకో
మూడు గజాల దూరంలో వుంది. ఇంకో సెకనులో వెయ్యో వంతు కాలంలో, ఆరడుగుల దూరంలో వుంది. ఇక
రొద చేసుకుంటూ టార్గెట్ ని తాకబోతోంది బుల్లెట్...
ఇదీ లీచైల్డ్ యాక్షన్ విజువలైజేషన్. అతను విషయం
చెప్పడం లేదు,
చూపిస్తున్నాడు.
ఇలా సినిమాల్లో చూపించాలంటే సీజీకి సమర్పించుకోవాలిగా లక్షలకి లక్షలు
అన్పించొచ్చు. స్టార్ సినిమాలకి సీజీకి సీజీన్నర పెట్టుకోగలరు. ఇతర సినిమాలకి
దీన్లోని అర్ధాన్ని చూడాలి. కవి హృదయాన్ని చూడాలి. ఏం తేల్చి చెప్తున్నాడు లీ చైడ్? స్లో యాక్షన్ - హై డ్రామా
గా లేదూ పై సీను?
ఇంతకీ ఆ బుల్లెట్
ఎవరికైనా తగిలిందా లేదా చెప్పడానికి ఇంత సస్పెన్స్ లో ముంచెత్తడమన్న మాట.
సినిమాలు, నవలలు, వెబ్ సిరీస్‌ల
ప్రపంచంలో ఎన్నో డిటెక్టివ్ పాత్రలు వచ్చాయి. కొందరు తెలివితో కేసులు ఛేదిస్తారు, కొందరు టెక్నాలజీతో, మరికొందరు హాస్యంతో. కానీ
జాక్ రీచర్ మాత్రం వీళ్ళందరికీ భిన్నమైన
వ్యక్తి. ఇతను కేవలం డిటెక్టివ్ కాదు,ఒక సంచార యోధుడు. న్యాయం కోసం తిరిగే ఒంటరి
మనిషి, ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో
వెనుకాడని పరిశోధకుడు.
ఈ క్యారక్టర్ 1997లో బ్రిటిష్ రచయిత లీ చైల్డ్ రాసిన ‘కిల్లింగ్ ఫ్లోర్’ నవలతో ప్రారంభమైంది. ఆ
తర్వాత వరుసగా వచ్చిన నవలలు (మొత్తం 31) రీచర్‌ని ఆధునిక సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిటెక్టివ్
పాత్రల్లో ఒకటిగా నిలబెట్టాయి. రీచర్ మాజీ యూఎస్ మిలిటరీ పోలీస్ మేజర్. సైన్యాన్ని విడిచిపెట్టాక
ఎలాంటి స్థిర నివాసం లేకుండా, అమెరికా అంతటా
ప్రయాణిస్తూ జీవిస్తాడు. అతడి దగ్గర
ఎక్కువ సామాను వుండదు—కొన్ని బట్టలు, ఒక టూత్ బ్రష్, అంతే. ఈ సాదాసీదా జీవన
విధానం అతడి పాత్రకి ప్రత్యేక ఆకర్షణని తీసుకొచ్చింది.
అతడికి సాంప్రదాయ డిటెక్టివ్‌లా ఆఫీసు వుండదు, అసిస్టెంట్లూ వుండరు.కంప్యూటర్ల
మీద ఆధారపడడు. అతడి ప్రధాన ఆయుధాలు అసాధారణ
పరిశీలనా శక్తి –
చిన్న చిన్న వివరాల్ని
గమనించి పెద్ద నిజాల్ని బైటికి తీస్తాడు. తార్కిక
ఆలోచన – సంఘటనల మధ్య సంబంధాలని వేగంగా
గుర్తిస్తాడు. మానవ స్వభావంపై అవగాహన – అబద్ధం చెప్పేవాళ్ళని సులభంగా గుర్తిస్తాడు. శారీరక సామర్థ్యం – అవసరమైతే ప్రత్యర్థుల్ని
ఒంటరిగా ఎదుర్కొనే బలమూ అతడికుంది. ఈ
నాలుగు లక్షణాల కలయిక రీచర్‌ని సాధారణ
డిటెక్టివ్ కంటే ప్రమాదకర పరిశోధకుడిగా నిలబెడుతుంది.
అతడి బుద్ధిబలం, కండ బలం అరుదైన కలయిక. చాలా కథల్లో తెలివైన పాత్రలు బలహీనంగా, బలమైన పాత్రలు తెలివి తక్కువగా వుంటాయి. రీచర్ మాత్రం ఈ రెండు పరిమితుల్ని చెరిపేస్తాడు. ఒక సమస్యని ముందుగా విశ్లేషిస్తాడు, పోరాటాన్ని చివరి మార్గంగా మాత్రమే చూస్తాడు. పోరాటం తప్పనిసరైతే, అతడి మిలిటరీ శిక్షణ అతడ్ని అత్యంత ప్రమాదకర ప్రత్యర్థిగా శత్రువుల ఎదుట నిలబెడుతుంది.
ఇది రిపీట వుతున్నప్పటికీ, ప్రతి కథలో కొత్త
ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త ప్రమాదం వుండడం వల్ల
ఆసక్తి తగ్గదు. ఆర్కే నారాయణ్ నవలల్లో కన్పించే
మాల్గుడి అనే ఒక కల్పిత, పూర్తిగా పట్టణ
ప్రాంతం ఎలాగో అలాగన్నమాట.
జాక్ రీచర్ కేవలం ఒక డిటెక్టివ్ పాత్ర కాదు. అతను స్వేచ్ఛ కోసం, న్యాయం కోసం, వ్యవస్థకి ఎదురు నిలిచే మనిషికి ప్రతీక.
అతడి కథలు మనకు ఒక ఆసక్తికర ప్రశ్నని వేస్తాయి: ‘చట్టం వున్నప్పటికీ న్యాయం జరక్క పోతే, ఎవరు ముందుకు రావాలి?’ అని. ఒక కథలో స్పష్టంగా
సమాధానమిస్తాడు రీచర్- ‘ఎవరైనా రావాలి, అవసరమైతే నేనే వస్తాను’ అని. ఇందుకే జాక్
రీచర్ ఆధునిక థ్రిల్లర్ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన డిటెక్టివ్ పాత్రగా గుర్తింపు
పొందుతున్నాడు.
లీ చైల్డ్ 'ది న్యూయార్క్ టైమ్స్' ఇంటర్వ్యూలో, ‘ఈ డిటెక్టివ్ ఒక తాగుబోతుగా పరిచయమవుతాడు.
తర్వాతి నవలలో విడాకులు తీసుకున్న తాగుబోతుగా వస్తాడు. ఆ తర్వాతి నవల్లో కూతురి
ద్వేషాన్ని ఎదుర్కొనే తాగుబోతుగా వుంటాడు. ఆ తర్వాత, చీకట్లో పొరపాటున
ఒక పిల్లాడిని కాల్చి చంపిన తాగుబోతుగా బయటపడతాడు. ఇక దాంతో తన మిగిలిన జీవితాన్ని
అడవిలోని ఒక క్యాబిన్‌లో గడపడానికి వెళ్ళవలసి వస్తుంది’ అని పాత్ర గత చరిత్రని
వివరించాడు.
-సికిందర్

.jpg)

