రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, August 3, 2026

1437 : కొత్త పాత్ర పరిచయం!


 

     మెజాన్ థ్రిల్లర్ సిరీస్ ‘రీచర్’ కొత్త సీజన్ ఆగష్టు 12 నుంచి స్ట్రీమింగ్ అవబోతోంది. ఇది నాల్గవ సీజన్. దీన్ని లీ చైల్డ్ 13వ నవల ' గాన్ టుమారో' ఆధారంగా నిర్మించారు. ఇందులో సబ్‌వేలో జరిగిన ఒక సంఘటన తర్వాత జాక్ రీచర్ ఒక పెద్ద కుట్రలోకి ఎలా కూరుకుపోయాడన్న కథ వుంటుంది. జాక్ రీచర్ నియమాల్ని తానే రాసుకునే డిటెక్టివ్ పాత్ర. 2000 నుంచి మన అభిమాన థ్రిల్లర్ నవలా రచయితగా  లీ చైల్డ్ వుంటూ వస్తున్నాడు. అతడి నవలలు చదవడమంటే  ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సినిమాని  మనసులో చూడడం లాంటిది. అతను సృష్టించిన డిటెక్టివ్ జాక్ రీచర్ యాక్షన్ క్యారక్టర్ చాలా పాపులర్. టామ్ క్రూజ్ తో రెండు హాలీవుడ్  సినిమాలుగా  కూడా వచ్చాయి. విజువల్ గా రాస్తాడు. ఒక రకంగా నవలలకి స్టోరీ మేకింగ్ చేస్తాడు. యాక్షన్ని స్లో చేసి డ్రామా పెంచుతాడు.1998 లో రాసిన రెండో నవల డై ట్రయింగ్లో యాక్షన్ని విజువలైజ్ చేస్తూ స్లో యాక్షన్- హై డ్రామా ఎలా క్రియేట్ చేశాడో చూస్తే...

      రీచర్ గురి చూసి గన్ పేల్చాడు. మరుక్షణం గన్ బ్యారెల్లోంచి వేడి వేడి పొగని బయటికి ఎగజిమ్మింది. బుల్లెట్లోని గన్ పౌడర్ సెకనులో మిలియన్ వంతు కంటే తక్కువ కాలంలో విస్ఫోటించడంతో, ఆ మండిపోతున్న పొగ బుడగలా పెద్దగా విప్పారింది.

బుడగలా విప్పారిన పొగని తిరిగి బ్యారెల్ గుంజేసుకుని, బ్యారెల్లోపల గ్రూవ్స్ రాపిడికి గిర్రున తిరుగుతున్న బుల్లెట్ వెనుకా, చుట్టూ పొగ కమ్మేసేలా చేసి, ఆ రాపిడికి బుల్లెట్ ఎగదన్ని బయటి వాతావరణంలోకి దూసుకు పోయేలా చేసింది బ్యారెల్.

బయటికి వెళ్ళిన పొగ బుడగ వాతావరణాన్నిచర్రున వేడెక్కించేసింది...బుల్లెట్ కి ముందు దూసుకుపోతున్న వేడివేడి పొగ, గాలిలోని ఆక్సిజన్ ని వేడెక్కించేసి మంట రేగే స్థాయికి తీసికెళ్ళింది. ఆ మంటలో మెరుపు. ఆ బుల్లెట్ పొగలోంచి బయటికి దూసుకొచ్చేసింది. మండుతున్న గాల్లోంచి గంటకి 1900 మైళ్ళ వేగంతో.

సెకనులో వెయ్యో వంతు కాలం తర్వాత, బుల్లెట్ ఇంకో మూడు గజాల దూరంలో వుంది. ఇంకో సెకనులో వెయ్యో వంతు కాలంలో, ఆరడుగుల దూరంలో వుంది. ఇక రొద చేసుకుంటూ టార్గెట్ ని తాకబోతోంది బుల్లెట్... 

ఇదీ లీచైల్డ్ యాక్షన్ విజువలైజేషన్. అతను విషయం చెప్పడం లేదు, చూపిస్తున్నాడు. ఇలా సినిమాల్లో చూపించాలంటే సీజీకి సమర్పించుకోవాలిగా లక్షలకి లక్షలు అన్పించొచ్చు. స్టార్ సినిమాలకి సీజీకి సీజీన్నర పెట్టుకోగలరు. ఇతర సినిమాలకి దీన్లోని అర్ధాన్ని చూడాలి. కవి హృదయాన్ని చూడాలి. ఏం తేల్చి చెప్తున్నాడు లీ చైడ్? స్లో యాక్షన్ - హై డ్రామా గా లేదూ పై సీను? ఇంతకీ ఆ బుల్లెట్ ఎవరికైనా తగిలిందా లేదా చెప్పడానికి ఇంత సస్పెన్స్ లో ముంచెత్తడమన్న మాట.

2. అతడొక సంచార యోధుడు!
    ‘డై ట్రైయింగ్’ లీ చైల్డ్‌ని ప్రపంచస్థాయి థ్రిల్లర్ రచయితగా నిలబెట్టిన నవలల్లో ఒకటి. జాక్ రీచర్ పాత్రలో వున్న నింపాదైన ఆత్మవిశ్వాసం, అతడి ఒంటరి యోధుడి స్వభావం, ప్రమాదాన్ని ఎదుర్కొనే ధైర్యం, ఈ నవలని మరచిపోలేని అనుభవంగా మారుస్తాయి. ఒక మంచి మనిషి చిన్న సహాయం చేస్తే, అతడిని దేశాన్ని కుదిపే కుట్రలో భాగంగా ఇరికించి నప్పుడు ఏం చేశాడన్నది ఈ కథ. జాక్ రీచర్ కథలు సామాన్యుల గుండెల్ని తడుముతాయి, ఏడ్పిస్తాయి, అన్యాయం మీద ఎగబడేలా చేస్తాయి.

సినిమాలు, నవలలు, వెబ్ సిరీస్‌ల ప్రపంచంలో ఎన్నో డిటెక్టివ్ పాత్రలు వచ్చాయి. కొందరు తెలివితో కేసులు ఛేదిస్తారు, కొందరు టెక్నాలజీతో, మరికొందరు హాస్యంతో. కానీ జాక్ రీచర్ మాత్రం వీళ్ళందరికీ  భిన్నమైన వ్యక్తి. ఇతను కేవలం డిటెక్టివ్ కాదు,ఒక సంచార యోధుడు. న్యాయం కోసం తిరిగే ఒంటరి మనిషి, ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో వెనుకాడని పరిశోధకుడు.

ఈ క్యారక్టర్ 1997లో బ్రిటిష్ రచయిత లీ చైల్డ్ రాసిన  కిల్లింగ్ ఫ్లోర్నవలతో ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా వచ్చిన నవలలు (మొత్తం 31) రీచర్‌ని  ఆధునిక సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిటెక్టివ్ పాత్రల్లో ఒకటిగా నిలబెట్టాయి. రీచర్ మాజీ యూఎస్  మిలిటరీ పోలీస్ మేజర్. సైన్యాన్ని విడిచిపెట్టాక  ఎలాంటి స్థిర నివాసం లేకుండా, అమెరికా అంతటా ప్రయాణిస్తూ జీవిస్తాడు. అతడి  దగ్గర ఎక్కువ సామాను వుండదుకొన్ని బట్టలు, ఒక టూత్ బ్రష్, అంతే. ఈ సాదాసీదా జీవన విధానం అతడి పాత్రకి ప్రత్యేక ఆకర్షణని తీసుకొచ్చింది.

అతడికి సాంప్రదాయ డిటెక్టివ్‌లా ఆఫీసు వుండదు, అసిస్టెంట్లూ వుండరు.కంప్యూటర్ల మీద ఆధారపడడు. అతడి  ప్రధాన ఆయుధాలు అసాధారణ పరిశీలనా శక్తి చిన్న చిన్న వివరాల్ని  గమనించి పెద్ద నిజాల్ని బైటికి తీస్తాడు. తార్కిక ఆలోచన సంఘటనల మధ్య సంబంధాలని వేగంగా గుర్తిస్తాడు. మానవ స్వభావంపై అవగాహన అబద్ధం చెప్పేవాళ్ళని  సులభంగా గుర్తిస్తాడు. శారీరక సామర్థ్యం అవసరమైతే ప్రత్యర్థుల్ని ఒంటరిగా  ఎదుర్కొనే బలమూ అతడికుంది. ఈ నాలుగు లక్షణాల కలయిక రీచర్‌ని  సాధారణ డిటెక్టివ్ కంటే ప్రమాదకర పరిశోధకుడిగా నిలబెడుతుంది.

న్యాయం కోసం పోరాడే ఒంటరి మనిషి అతను. అతడి కథల్లో ముఖ్యమైన అంశం న్యాయం. చట్టమంటే అతడికి చాలా గౌరవం. చట్టాన్ని కాపాడడంలో వ్యవస్థ విఫలమైతే బాధితుల కోసం స్వయంగా రంగంలోకి దిగి ఆ బాధితుల్నీ, చట్టాన్నీ కాపాడేస్తాడు. అవినీతిపరులైన అధికారులు, నేరస్థ ముఠాలు, అధికార దుర్వినియోగం చేసే వ్యక్తులుఎవరినీ వదిలిపెట్టడు. ఈ కారణంగానే రీచర్ పాత్రకి ‘ఎవరీడే యాక్షన్ హీరో’ గా పేరొచ్చింది. అతను హీరో కాదు, అన్యాయం కనిపిస్తే స్పందించే సాధారణ మనిషి.

అతడి బుద్ధిబలం, కండ బలం
 అరుదైన కలయిక. చాలా కథల్లో తెలివైన పాత్రలు బలహీనంగా, బలమైన పాత్రలు తెలివి తక్కువగా వుంటాయి. రీచర్ మాత్రం ఈ రెండు పరిమితుల్ని చెరిపేస్తాడు. ఒక సమస్యని  ముందుగా విశ్లేషిస్తాడు, పోరాటాన్ని చివరి మార్గంగా మాత్రమే చూస్తాడు. పోరాటం తప్పనిసరైతే, అతడి మిలిటరీ శిక్షణ అతడ్ని అత్యంత ప్రమాదకర ప్రత్యర్థిగా శత్రువుల ఎదుట నిలబెడుతుంది.

3. పాత్రకి అలన్ రిట్చ్ సన్ కొత్త జీవం!

    ప్రస్తుత వెబ్ సిరీస్ లో ఈ పాత్రకి అలన్ రిట్చ్ సన్ కొత్త జీవం పోస్తున్నాడు. ముఖ్యంగా అలన్ శరీరాకృతి, నవల్లోని రీచర్‌కి దగ్గరగా వుంటుంది. రీచర్ చుట్టూ అల్లే కథల్లో ఒక చిన్న పట్టణం లేదా తెలియని  ప్రదేశానికి రీచర్ చేరడం, అక్కడ ఒక అనుమానాస్పద సంఘటనని గమనించడం, స్థానికులు దాచిపెడుతున్న నిజాన్ని గుర్తించడం, పెద్ద కుట్ర లేదా నేర వ్యవస్థ బయటపడడం, చివర్లో రీచర్ న్యాయం జరిగేలా చేయడం, ఆ తర్వాత మళ్ళీ తన ప్రయాణం కొనసాగించడం- ఇదే ఫార్ములా వుంటుంది నవలలన్నిట్లో.

ఇది రిపీట వుతున్నప్పటికీ, ప్రతి కథలో కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త ప్రమాదం వుండడం వల్ల ఆసక్తి తగ్గదు. ఆర్కే నారాయణ్  నవలల్లో కన్పించే మాల్గుడి అనే ఒక కల్పిత, పూర్తిగా పట్టణ ప్రాంతం ఎలాగో అలాగన్నమాట.

ఎందుకు ఈ పాత్ర ఇంత పాపులరైంది?  ఎందుకంటే, అతడి సాదా సీదా జీవితం, వ్యవస్థపై అనుమానం, అధికార వర్గాల్ని గుడ్డిగా నమ్మకపోవడం, బాధితుల పక్షాన నిలబడడం, బలహీనుల కోసం పోరాడే ధోరణి...ఇవీ అతడ్ని పాఠకులుకి/ ప్రేక్షకులకి దగ్గర చేస్తున్నాయి. అయితే అతను తరచూ ఒక్కడే పెద్ద నేరవ్యవస్థల్ని ఓడించడం వాస్తవికంగా అనిపించదు.
ఇందుకే ఈ సూపర్ హీరోయిజాన్ని తానే ఒప్పుకోక, ఒకనాటి సామాన్యమైన పాత యాక్షన్ హీరోల కథలు మళ్ళీ రావాలని ఒక పాడ్ కాస్ట్ లో అన్నాడు. దీన్ని నిన్నటి బ్లాగ్ ఆర్టికల్లో పేర్కొన్నాం. అలాగే కొన్ని కథల్లో లీ చైల్డ్ స్త్రీ పాత్రలకి తక్కువ ప్రాధాన్యమిచ్చాడన్న విమర్శ కూడా వుంది.

జాక్ రీచర్  కేవలం ఒక డిటెక్టివ్ పాత్ర కాదు. అతను  స్వేచ్ఛ కోసం, న్యాయం కోసం, వ్యవస్థకి ఎదురు నిలిచే మనిషికి ప్రతీక. అతడి కథలు మనకు ఒక ఆసక్తికర ప్రశ్నని  వేస్తాయి: ‘చట్టం వున్నప్పటికీ న్యాయం జరక్క పోతే, ఎవరు ముందుకు రావాలి?’ అని. ఒక కథలో స్పష్టంగా సమాధానమిస్తాడు రీచర్- ‘ఎవరైనా రావాలి, అవసరమైతే నేనే వస్తాను’ అని. ఇందుకే జాక్ రీచర్ ఆధునిక థ్రిల్లర్ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన డిటెక్టివ్ పాత్రగా గుర్తింపు పొందుతున్నాడు.

లీ చైల్డ్ 'ది న్యూయార్క్ టైమ్స్' ఇంటర్వ్యూలో, ‘ఈ డిటెక్టివ్ ఒక తాగుబోతుగా పరిచయమవుతాడు. తర్వాతి నవలలో విడాకులు తీసుకున్న తాగుబోతుగా వస్తాడు. ఆ తర్వాతి నవల్లో కూతురి ద్వేషాన్ని ఎదుర్కొనే తాగుబోతుగా వుంటాడు. ఆ తర్వాత, చీకట్లో పొరపాటున ఒక పిల్లాడిని కాల్చి చంపిన తాగుబోతుగా బయటపడతాడు. ఇక దాంతో తన మిగిలిన జీవితాన్ని అడవిలోని ఒక క్యాబిన్‌లో గడపడానికి వెళ్ళవలసి వస్తుంది’ అని పాత్ర గత చరిత్రని వివరించాడు.

4. ఇదంతా ఇప్పుడెందుకంటే...


    తెలుగు సినిమాల్లో ఇంకా డిటెక్టివ్ అనగానే లాంగ్ కోటు హేటూ తొడిగించి, చేతికి భూతద్దం పట్టించి, పడక్కుర్చీ మేధావి షెర్లాక్ హోమ్స్ గానే చూపించుకుంటూ పోతున్నారు. ఈ తరహా ప్రైవేట్ డిటెక్టివ్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఫోరెన్సిక్ సాక్ష్యాధాలతో ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ యాక్షన్ డిటెక్టివ్ వచ్చేశాడు. దీన్నీ వెనక్కి నెట్టేస్తూ మళ్ళీ ప్రైవేట్ డిటెక్టివ్ వచ్చేశాడు జాక్ రీచర్ రూపంలో.అయితే ఇతను మాజీ సైనికాధికారి అయి వుంటాడు. వ్యక్తిగత జీవితంలో విఫలమై, దాన్ని మరువడానికి పరోపకారం కోసం వ్యవస్థతో పోరాడే యోధుడిగా బాధ్యత తీసుకుంటాడు. రీచర్‌లోని అంతర్గత సంఘర్షణ కేసుని పరిష్కరించడానికి అతను తాగుడు వ్యసనాన్ని అధిగమిస్తాడా? అనేది కాదు. అసలు అంతర్గత సంఘర్షణ ఏమిటంటే- రీచర్ చెడిన జీవితంతో తన మానాన  తను ఒంటరిగా వుండాలనుకుంటాడు, కానీ ఈ ప్రపంచం అతడ్ని ఒంటరిగా వుండనివ్వని చెడ్డవాళ్ళతో నిండి వుంది...

-సికిందర్