రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, October 4, 2026

1444 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : జేసన్ సంజయ్
తారాగణం : సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్ రాజ్, మఘలక్ష్మీ సుదర్శనన్, శివ్ పండిట్, శీలా రాజ్‌కుమార్ తదితరులు
సంగీతం : ఎస్ థమన్, ఛాయాగ్రహణం :  కృష్ణన్ వసంత్, కూర్పు : కేఎల్ ప్రవీణ్, కళ : బెంజమిన్ మిలన్
బ్యానర్ : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : ఏ సుభాస్కరన్
విడుదల : అక్టోబర్ 2, 2026
***
తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేశాడు. తొలి ప్రయత్నంగా ట్రెజర్ హంట్ –హీస్ట్ జానర్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ని తెరకెక్కించాడు. హీరో సందీప్ కిషన్ కి మూడున్నర గంటలు ఈ కథ చెప్పి ఇంప్రెస్ చేసి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు. ఫరియా అబ్దుల్లాని  హీరోయిన్ గా తీసుకుని,  ప్రసిద్ధ లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ సుభాస్కరన్ నిర్మాతగా సినిమా పూర్తీ చేసి ఈ రోజు గాంధీ జయంతి నాడు తమిళ- తెలుగు భాషల్లో విడుదల చేశాడు. మరి దళపతి వారసుడిగా సినిమా తీసి సక్సెస్ అయ్యాడా? తన బలాలు, బలహీనతలు ఏమిటి? ఇవి తెలుసుకుందాం...

కథేమిటి? 
గురు అలియాస్ సిగ్మా (సందీప్ కిషన్) ఒక ఆర్జేగా పనిచేస్తూనే ట్రెజర్ హంటర్‌గా నిధుల వేట సాగిస్తూంటాడు. టాడు. అతడి తల్లి దాచిపెట్టిన నిధి కోసం  కూడా వేటాడుతూంటాడు. మరోవైపు  ఆర్జే (రేడియో జాకీ) గా పనిచేసే సామ్ (ఫరియా అబ్దుల్లా) అనే అమ్మాయితో రోమాన్స్ సాగిస్తూంటాడు. ఇలావుండగా, అక్రమ వ్యాపారాలు, ఏనుగు దంతాల స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్ మొదలైన నేర కలాపాలతో భారీ సామ్రాజ్యాన్ని నడిపే మాఫియా లీడర్ వీర శంకర్ రెడ్డి (సంపత్ రాజ్) తో, 500 కోట్ల ఒక డీల్ విషయంలో సిగ్మా పోరాడాల్సి వస్తుంది.  ఈ  500 కోట్ల డీల్ ఏంటి?  విదేశీ బ్యాంకు లాకర్ లో దాచిన ఈ డబ్బుని దోచుకునే  పథకాన్ని ఎలా అమలు చేశాడు? తన తల్లి కోరిక ఏమిటి? తల్లి జ్ఞాపకార్ధం తను చేసిన మేలేమిటి? ...ఈ  ప్రశ్నలకి సమాధానమే మిగతా ఈ సినిమా కథ.

 

ఎవరెలా చేశారు?
పదహారేళ్ళుగా సినిమాలు నటిస్తున్న సందీప్ కిషన్ ఈ కథ మూడున్నర గంటలు విని థ్రిల్ అయినట్టు చెప్పడం చూస్తే, గాంధీ జయంతికి గాంధీగారు పకపకా నవ్వేసి వుంటారు. 24 ఏళ్ళ యువదర్శకుడు జేసన్ సంజయ్ ఏనాటిదో తను పుట్టనప్పటి పాత తరహా సినిమాలో సందీప్ కిషన్ ని ఎలా చూపించ కూడదో అంత చాదస్తంగా చూపించి సందీప్ కి సరిజోడీ అనిపించుకున్నాడు.  సందీప్ కామెడీ, రోమాన్స్, యాక్షన్ అన్నిటా హాస్యాస్పదంగా కనిపిస్తూ పాత్రకి చేయాల్సిన డ్యామేజీ అంతా చేసేశాడు. సినిమానే నీరసంగా వుంటే తనెలా ఉత్సాహంగా వుంటాడు. మదర్ సెంటిమెంటు, లవర్ తో రోమాన్స్, ఆర్ధిక కష్టాలు – వీటితోనే ఫస్టాఫ్ బారుగా సాగుతుంది. ఇంతలో ఇంటర్వెల్లో మాత్రం కథ యాక్షన్లో కొచ్చి, తనుకాస్త ఇరగదీసి మాస్ హీరో అనిపించుకునే అదృష్టానికి నోచుకుంటాడు.

ఇక సెకండాఫ్ ఎత్తుకున్న భారీ కథ గురించి గానీ, పాత్ర గురించి గానీ చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ వుండదు. పాత సినిమాల పద్ధతిలోనే ఫైట్లు కూడా వుంటాయి. 500 కోట్ల రూపాయల దోపిడీ పథకానికి కావాల్సిన తాళాల గుత్తి కథ బాక్సాఫీసుని కూడా తెరవకుండా చేస్తుందని తెలుసుకోకపోడం అసలు సమస్య. పైగా అంత బిల్డప్ ఇచ్చిన విలన్, హీరో వీక్ గా వుంటే మనకెందుకులే అని చేతులు ముడుచుకుని కూర్చున్నట్టు అన్పించడం, దాంతో క్లయిమాక్స్ పిల్లలాటతో సమానంగా సాగడం సిగ్మాకి ఒక స్టిగ్మా (మచ్చ). సందీప్ కిషన్

ఇక హీరోయిన్ ఫరియా అబ్డులాకి వున్నదే కాసేపు కనిపించే పాత్ర. అందులో ఎం చేసిందో ఆమెకే తెలీదు. ఆ కాసేపు చలాకీగా కనిపించి, కొంత కామెడీ చేసి తన రెమ్యూనరేషన్ ప్యాకేజీ తను తీసుకుని వెళ్ళి పోయింది. వెళ్ళిపోవడమే మంచిదైంది- రోమాన్స్ మీద (తన మీద) దృష్టి పెట్టని సందీప్ కిషన్ కి హీరోయినెందుకసలు? 

ఇక విలన్లు సంపత్ రాజ్, శివ్ పండిట్లు తాము చేసిన విలనీ ఏంటో వాళ్ళకే తెలియాలి. పాతకాలం సినిమా కాబట్టి ఆ కాలంలో కొత్తగా వచ్చిన తాము ఏం చేయగలిగారో అదే చేసేసి ప్యాకేజీతో వెళ్ళిపోయారు. అసలీ సినిమాలో ఏ పాత్రకీ ఇంకో పాత్రతో సంబంధమే వుండదు. కొట్టొచ్చినట్టు కన్పించే సంబంధం ఒకటే- ఈ  యువదర్శకుడు సూపర్ స్టార్ దళపతి విజయ్ కి తనయుడనే!

సాంకేతికాల సంగతి?
తమన్ సంగీతం, నేపథ్య సంగీతం కొన్ని చేజ్, హీస్ట్ సన్నివేశాల్ని వేగంగా పరిగెత్తించే పనిని విజయవంతగా చేసినా, సడెన్ గా వచ్చే ఒక ఐటెం సాంగ్ యువదర్శకుడి పాత టేస్టుకి కూడా న్యాయం చేయాలి కాబట్టి ఆ మేరకు తమన్ కష్టపడ్డాడు. కృష్ణన్ వసంత్ కెమెరా పనితనం రిచ్ అండ్ స్టైలిష్ లుక్ ఇవ్వడం,  ప్రవీణ్ ఎడిటింగ్ హీస్ట్ సన్నివేశాల్లో మాత్రం పదునుగా వుండడం సాంకేతికులు వెనుకబడి లేరని రుజువు చేస్తాయి. వెనుకబడింది యువదర్శకుడే.

చివరికేమిటి?
24 ఏళ్ళ యువ దర్శకుడి మొదటి ప్రయత్నాన్ని మరీ ఇంతగా విమర్శించకూడదు. కానీ జేసన్ సంజయ్ అమెరికా వెళ్ళి దర్శకత్వం కోర్సు చేసి వచ్చాడు. అమెరికాలో ఇలా తమిళ/తెలుగు పాత మూస టెంప్లెట్ సినిమాలు తీయడం నేర్పుతున్నారా? ఇదీ మనకొచ్చే సందేహం. అమెరికా వెళ్ళినా ఇదే టాలెంటుతో తిరిగి వచ్చాడంటే, ఇక రేపు ఇంకెన్ని ఇలాటి సినిమాలు తీస్తాడోనని భయం పుట్టడం సహజం. సినిమా అని చెప్పడానికి వీల్లేని కథా కథనాల్ని, పాత్రల్ని, దర్శకత్వాన్నీ తన ఈడు యువప్రేక్షకుల మీద రుద్దడమంటే –తనేం చేస్తున్నాడో తనకే తెలీని పసితనమన్న మాట.  గాంధీ జయంతికి గాంధీగారు ఈ ఏమీ తెలీని పసివాణ్ణి క్షమించి, తెలియక సినిమాకెళ్ళే ప్రేక్షకుల్ని రక్షించు గాక!

-సికిందర్