రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, July 22, 2026

1430 : హాలీవుడ్ రివ్యూ!

‘ది ఒడిస్సీ’ : వినోదం కాదు, విజ్ఞానం!
రచన- దర్శకత్వం : క్రిస్టఫర్ నోలన్
తారాగణం : మాట్ డామన్, టామ్ హాలండ్, ఏన్ హాథ్వే, రాబర్ట్ పాటిన్సన్, లుపిటా న్యోంగో, సమంత మోర్టన్, జెండయా, చార్లిజ్ థెరాన్
సంగీతం : లుడ్విగ్ గోరాన్సన్, ఛాయాగ్రహణం : హోయ్టే వాన్ హోయ్టెమా, కూర్పు : జెన్నిఫర్ లేమ్
బ్యానర్స్ : యూనివర్సల్ పిక్చర్స్, సింకపీ
నిర్మాతలు : ఎమ్మా థామస్, క్రిస్టోఫర్ నోలన్
విడుదల : జూలై  17, 2026
***
      250 మిలియన్ డాలర్ల (అక్షరాలా ఇరవై నాలుగు వందల కోట్ల పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు మాత్రం) సూపర్ జంబో బడ్జెట్ తో, వందలాది జూనియర్ ఆర్టిస్టులు సహా 28 మంది ప్రముఖ తారలతో, అదీ గ్రాఫిక్స్ ని నామమాత్రం చేసి భారీగా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తో, 4 మోతబరుపు ముడి ఫిలిం ఐమాక్స్ 65 ఎంఎం భారీ కెమెరాలతో, కేవలం 91 అంటే 91 రోజుల్లో, ‘ది ఒడిస్సీ’ అనే ఆధునిక మహా కళాఖండపు షూటింగ్ ని పూర్తి చేసి అవతల పడేసిన క్రిస్టఫర్ నోలన్, మనిషి కాదు- మూవీ మేకింగ్ బ్రహ్మ రాక్షసుడనాలి. పని రాక్షసులే సమయాన్ని గుప్పెట పట్టి శాసించగలరు. ఆ తర్వాత 11 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ ముగించి ప్రపంచం మీద పడేశాడు. కనీసం రెండు మూడేళ్ళు తీసుకునే మన పానిండియా మూవీ మేకర్లు (‘రాజాసాబ్’కి దాదాపు నాల్గేళ్ళు), నోలన్ దగ్గర అప్రెంటీసులుగా చేరి సమయం విలువ తెలుసుకుంటే మంచిదేమో ఆలోచిస్తే, బడ్జెట్లు బలి కాకుండా బయటపడతారేమో!

విడుదలకి ముందునుంచే  ‘ది ఒడిస్సీ’ ని  కాస్టింగ్ నుంచీ కాస్ట్యూమ్స్ వరకూ వివాదాల్లో ముంచెత్తారు. హెలెన్ ఆఫ్ ట్రాయ్ పాత్రలో ఆ నటి సరికాదనీ, ఈ గ్రీకు పౌరాణికంలో గ్రీకు నటులే లేరనీ, సంభాషణలు అమెరికన్ యాసలో వున్నాయనీ...ఇలా విడుదలకి ముందే సాకులు మొదలెట్టారు పండితులు, సోషల్ మీడియా జనులూ- ప్రతికూల వాతావరణాన్ని సెట్ చేస్తూ. సినిమాలో వాడిన దుస్తుల మీద, కవచాల మీద కూడా అస్త్రాలు ఎక్కుపెట్టారు.
తీరా సినిమా విడుదలయ్యాక సైలెంట్ అయిపోయారు. లండన్ ప్రీమియర్ లో పేలిన మాటలు కూడా వినిపించడం లేదు. మొత్తానికి అందరి నోళ్ళూ మూయించాడు నోలన్. వెర్నాకులర్, ఇంటర్నేషనల్ పత్రికలూ, సాంస్కృతిక సంగతుల వెబ్సైట్లూ –ఒకటేమిటి, ప్రతీ సమాచార వేదికా నోలన్ ని నోరారా ప్రశంసించకుండా వుండలేదు.

అయితే  తను ఏ ప్రేక్షక వర్గాన్ని టార్గెట్  చేస్తూ ఈ గ్రీకు పురాణం తీస్తున్నట్టు చెప్పాడో, ఆ 17 ఏళ్ళ మాస్ కుర్ర ప్రేక్షకుల దగ్గర్నుంచీ, అంతకంటే పెద్దవాళ్ళ ఆమోదాన్నీ పొందగాలిగాడా అన్నది ప్రశ్న. పొందకపోతే కారణమేమిటో తెలుసుకునే ప్రయత్నం  చేద్దాం. కారణం నోలన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోనే వుంది. అదెలా పనిచేసిందో చూద్దాం...

2. ముందుగా గాథ!

ప్రాచీన ట్రాయ్ (టర్కీ) యుద్ధం ముగిసిన తర్వాత ఒక రాజు తన ఇంటికి చేరుకోవడానికి పదేళ్ళ పాటు సాగించిన సుదీర్ఘ, ప్రమాదకర ప్రయాణమే ఈ సినిమా గాథ. ఇథాకా రాజ్యానికి రాజైన ఒడిస్సీయస్ (మాట్ డామన్) తన తెలివితేటలతో, జిత్తులమారితనంతో,  పదేళ్ళుగా సాగుతున్న ట్రోజన్ యుద్ధాన్ని చివరికి చెక్క గుర్రం వ్యూహంతో గెలిచి స్వదేశానికి బయల్దేరతాడు. యుద్ధం తర్వాత తన సైన్యంతో కలిసి సముద్ర మార్గం ద్వారా ఇథాకాకు తిరుగు ప్రయాణం కట్టిన ఒడిస్సీయస్, ఆ యుద్ధంలో పాల్పడిన క్రూరత్వానికి, వినాశనానికి సముద్ర దేవుడైన పొసైడాన్ పెట్టిన శాపానికి  గురవుతాడు. ఫలితంగా సముద్ర జలాల్లో చిక్కుకుని, 10 రోజుల్లో ముగించాల్సిన ఇంటికి ప్రయాణాన్ని, ఇంకో పదేళ్ళ పాటు మాయాశక్తులతో సుదీర్ఘ పోరాటం చేస్తూ గడిపే అవస్థలో పడిపోతాడు.

ఈ ప్రయాణంలో సైక్లోప్స్ అనే ఒంటికన్ను రాక్షసుడ్ని, పాటలతో ఆకర్షించే  సైరన్లని, మంత్రగత్తె సిర్సీని, ఇంకా భయంకర సముద్ర రాక్షసుల వంటి ఎన్నోజీవుల్నీ ఎదుర్కొంటాడు. జ్ఞాన దేవత అథీనా (జెండయా) అతడికి పరోక్షంగా అండగా నిలుస్తుంది.

మరోవైపు ఇథాకాలో ఒడిస్సీయస్ చనిపోయాడని భావించి, అతడి  భార్య పెనెలోప్ (ఏన్ హాథ్వే ) ని పెళ్ళాడి రాజ్యాన్ని దక్కించుకోవాలని ఆంటినస్ (రాబర్ట్ పాటిన్సన్) వేధిస్తూ వుంటాడు. ఇంకోవైపు తండ్రి బతికే వున్నాడనే నమ్మకంతో కుమారుడు టెలీమాకస్ (టామ్ హాలెండ్) తండ్రి కోసం అన్వేషిస్తూ వుంటాడు.

చివరికి తన సైన్యాన్నీ, సహచరుల్నీ కోల్పోయి ఒంటరిగా, బిచ్చగాడి మారువేషంలో ఇథాకా రాజ్యానికి చేరుకుంటాడు ఓడిస్సియస్. ఇప్పుడు ఇక్కడ పెనెలోప్ భర్తకి చెందిన ప్రత్యేకమైన వింటినారిని ఎక్కుపెట్టి, 12 గొడ్డళ్ళ కళ్ళ గుండా బాణాన్ని కొట్టిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని స్వయంవరం ప్రకటిస్తుంది. స్వయంవరాని కొచ్చిన రాజులెవ్వరూ ఈ పరీక్షలో నెగ్గలేక పోతారు. అప్పుడు మారువేషంలో వున్న ఒడిస్సీయస్ సులువుగా గురి తప్పకుండా విల్లు ఎక్కుపెట్టి బాణం కొట్టేస్తాడు. ఈ విజయంతో కుమారుడితో కలిసి కుయుక్తుల శత్రురాజులందర్నీ సంహరించేసి,  రాజ్యాన్ని కాపాడుకుని భార్యతో పునస్సమాగమవడం క్లుప్తంగా ఈ గాథ.

3. ఎలావుంది గాథ?

మహాకవి హోమర్ రచించిన ప్రాచీన గ్రీకు కావ్యం ది ఒడిస్సీ’ (ఇంగ్లీషులో ఆడిసీ’, గ్రీకులో ఒడ్హసీ’, తెలుగులో చక్కగా  తెలుగైజుడు ఒడిస్సీ’ - ఒడిశాలో ఒడిస్సీఅనే ప్రసిద్ధ నృత్య రూపకం పేరు లాగా. దీనర్ధం ఆత్మశోధన యాత్ర) ఆధారంగా సినిమా తీశాడు క్రిస్టఫర్ నోలన్. ఇది కేవలం ఒక వీరుడి సాహసగాథ కాదు, యుద్ధం తర్వాత ఇంటికి చేరాలనుకునే ఒక మనిషి చేసే శారీరక, మానసిక, నైతిక ప్రయాణపు ఆత్మశోధన గాథ, కథ కాదు. అలాగే చరిత్ర కాదు, కల్పన. గ్రీకు పురాణం.

ఈ గాథలో ప్రధాన సంఘర్షణ రాజైన ఒడిస్సీయస్ (ఈ పేరుకి అర్ధం కోపిష్టి) అహంకారం నుంచే మొదలవుతుంది. ట్రోజన్ యుద్ధంలో గెలిచిన తర్వాత, తనే సర్వాంతర్యామిని అన్నట్టు ఫీలవుతూ  సముద్ర దేవుడైన పొసైడన్ ఆగ్రహానికి – శాపానికి గురవడంతో ఈ గాథ మొదలవుతుంది.

పదేళ్ళ సముద్రపు సంక్షుభిత ప్రయాణంలో అతడికి ఎదురయ్యే అందమైన అప్సరసలు అతడ్ని లోబర్చుకోవాలని చూసినా, అతను వాటన్నింటినీ కాదనుకుని భార్య దగ్గరికే వెళ్ళా లనుకోవడంలోని మానవ విలువల ఔన్నత్య  ప్రదర్శన. నైతిక విలువలున్నప్పటికీ, అతను లోపాలూ అహంకారం నిండిన వాడు కూడా. ఒక క్రూర యుద్ధ యోధుడి నుంచి, ఓపికా వివేకమూ గల గ్రీకు వీరుడిగా, తిరుగు ప్రయాణంలో దశాబ్దకాలం పాటు ఎదుర్కొన్నవివిధ  పరీక్షల్లో శారీరకంగా, మానసికంగా పరివర్తన  చెందడం గురించే, ఆధ్యాత్మిక పరిణితి సాధించడం గురించే ఈ గాథ.

ఈ గాథని  సినిమాగా తీయడమంటే సముద్రాలు, రాక్షసులు, దేవతలు, యుద్ధాలూ చూపించడం మాత్రమే కాదు, ఆ ప్రయాణం వెనుక దాగి వున్న మనిషి ఒంటరితనం, ఆశ, ప్రలోభం, గర్వం, కుటుంబం కోసం తపనా వంటి భావోద్వేగాలని తెరపై జీవింపజేయడం కూడా.

మనదేశపు ప్రేక్షకులకి  ఈ సినిమాలో రామాయణ, మహాభారతం ఛాయలు కన్పించి సంతోషం కలగొచ్చు. రాముడి వనవాసం లాగే ఒడిస్సీయస్ సముద్ర యానం అన్పించ వచ్చు. భార్య కోసం భర్త సముద్రాలు దాటి రావడం, లంకలో సీత ఎదురు చూసినట్టు ఇక్కడ రావణ మేళం లాంటి ఆమె మీద కన్నేసిన రాజుల గుంపుని ఎదుర్కొంటూ భర్త కోసం పెనెలోప్ ఎదురు చూడడం భలే వుందే అన్పించొచ్చు. సీతా స్వయంవరంలో రాముడు శివధనస్సుని  విరిచినట్టు గానే, ఇక్కడ కూడా విల్లు ఎక్కుపెట్టే పరీక్ష ద్వారానే ఒడిస్సీయస్ భార్యని పొందడం చూసి మన సినిమానే అన్పించొచ్చు. చివర్లో తండ్రీకొడుకులు (లవ-కుశ తరహాలో) కలిసి కుట్రపన్నిన శత్రు రాజులపై విరుచుకుపడడం వంటి దృశ్యాలు  చూసి, హోమర్ భలే కాపీ కొట్టాడే  అన్పించొచ్చు. ఎవరికెంత తోస్తే అంత సంతృప్తి!

3/a ఎపిసోడిక్ కథనం!

ఈ ప్రయాణం ఎపిసోడ్ల వారీగా సాగుతుంది. సముద్రం, సైరన్లు, సైక్లాప్స్, సిర్స్,  స్కైల్లా –చారిబ్డిస్ మొదలైనవి. ట్రోజన్ యుద్ధం ఈ గాథకి ఉపోద్ఘాతం వంటిది. చివర్లో ఇల్లు చేరుకోవడం ఉపసంహారం. మధ్యలో ఎపిసోడ్లు ఒక్కో మాయా శక్తితో పొందిన ఒక్కో అనుభవం. సముద్రం మీద సముద్ర దేవుడు పొసైడన్  శాపం, సిరెన్స్ - వీళ్ళు తమ మధుర గానంతో నావికుల్ని ఆకర్షించి, నావలు మునిగిపోయేలా చేసే రాక్షస కన్యలు, సిర్సీ -ఈవిడ మనుషుల్ని జంతువులుగా మార్చేసే మంత్రగత్తె, సైక్లాప్స్- మనుషుల్ని తినే ఒంటి కన్ను రాక్షసుడు, కాలిప్సో - ఈవిడ మార్గ నిర్దేశం చేసే జ్ఞాన దేవత. ఇలా ఒడిస్సీయస్  ఒకదాని తర్వాత ఒకటి ఎపిసోడ్లుగా వీళ్ళందర్నీ ఎదుర్కొంటూ పోతాడు. ఈ ఆత్మశోధన యాత్రలో పాఠాలన్నీ నేర్చుకుని, చివరికి ఒక ఉత్తమ వ్యక్తిగా, ఒక ఉత్తమ రాజుగా ఇంటికి  చేరుకుంటాడు.

ఈ గాథని ఇలాటి ఎపిసోడ్లతో ఆత్మ శోధన యాత్రగా ఎందుకు చూపించాలి? ఈ ఎపిసోడ్లకి అర్ధాలేమిటి? ఇవి తెలుసుకుంటే గానీ ఈ గాథ యాక్షన్ అడ్వెంచర్ గా కాకుండా, ఇలాగెందు కుందో అర్ధం గాదు.

3/b. అంతరాత్మ శుద్దితో అమరత్వ సిద్ది!

ముందుగా సినిమా కథల మీద ఇరవయ్యేళ్ళూ పరిశోధన చేసిన జేమ్స్ బానెట్  దగ్గరికెళ్ళి అసలు గొప్ప  సినిమా కథంటే ఏమిటో తెలుసుకుందాం : సింపుల్ గా చెప్పుకోవాలంటే మనుషులమైన మనలో మేట వేసిన ఇగోని, మెచ్యూర్డ్ ఇగోగా మార్చే ప్రక్రియే గొప్ప సినిమా కథంటే. సమస్త కథలూ మన మానసిక ప్రపంచాలకి ప్రతిరూపాలే. కాన్షస్ సబ్ కాన్షస్ మైండ్ ల సయ్యాట (ఇంటర్ ప్లే) లే. సౌలభ్యం కోసం పదజాలాన్ని వాడుక భాషలోకి మార్చుకుంటే - కాన్షస్ మైండ్ అంటే మన వెలుపలి మనసు, సబ్ కాన్షస్ మైండ్ అంటే లోపలి మనసు. వెలుపలి మనసునే మనసుఅనీ, లోపలి మనసుని అంతరాత్మఅనీ అనుకుంటే, మనం మనసుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు మంచివో కావో అంతరాత్మ చెబుతుంది. ఈ రెండిటి మధ్య మన ఇగో (అహం) నిర్ణేతగా వుంటుంది.  అదెప్పుడూ అంతరాత్మ విజ్ఞతతో చెప్పే మంచి మాట, శాశ్వత పరిష్కారం  లాంటివి వినదు. నిలకడ లేని మనసు చెప్పే ఆకర్షణీయమైన మాటలే, తాత్కాలిక పరిష్కారాలే  ముచ్చటపడి వింటుంది. ఇదెప్పుడూ చుట్టూ అందంగా కన్పించే బాహ్యప్రపంచాన్నే అనుభవిస్తుంది. లోపల గంభీరంగా కన్పించే ప్రపంచమైన  అంతరాత్మలోకి ప్రయాణించడానికి భయపడుతుంది.

 పైపెచ్చు ఆ అంతరాత్మని నొక్కేసే ఎజెండాతోనే ఇగో నిత్యం ప్రవర్తిస్తుంది. ఇగో ఎప్పుడూ మనసుతోనే జతకలిసి వుంటుంది. మనసుతోనే చెట్టపట్టాలేసుకుని బాహ్యప్రపంచంలోనే  షికార్లు కొడుతుంది. ఇగో అంటే మనమే. భౌతికంగా మన గుర్తింపు. భౌతికంగా మనం చేసుకునే అలంకరణ, మేకప్ ల ద్వారా నేను ఫలానా అని తెచ్చుకునే గుర్తింపు. అలాటి మనం’  అంతరాత్మలోకి తొంగి చూడ్డానికి ఇష్ట పడం. ఎందుకంటే అక్కడ ఎన్నో తెలుసుకోవాల్సిన నగ్నసత్యాలు, పాటించాల్సిన శాశ్వత విలువలూ వంటి మనిషి పుట్టినప్పటినుంచీ, జీన్స్ లో నిబిడీకృతం చేసుకుని తిరుగుతున్న చేదు వాస్తవాలతో బాటుదేవుడి నియమావళి భయపెడుతూ వుంటుంది.

మనకు (ఇగోకి) వున్న ఈ లక్షణాలు  పక్కాగా సినిమాల్లో హీరో కుండే లక్షణాలే. అంతరాత్మ తో మనం పడే సంఘర్షణ  సినిమాల్లో  మిడిల్ తో హీరో చేసే సంఘర్షణే. ఇది జాగ్రత్తగా గమనించాలి.  స్క్రీన్ ప్లేలో మిడిల్ కథ అంటే మన అంతరాత్మకి ప్రతి (తెర) రూపమే. అంతరాత్మ సర్వాంతర్యామి. ఈ విశ్వమంతా వ్యాపించి వుంది. అందరిలోనూ వుండేది ఒకే అంతరాత్మ. ఒకే నగ్న సత్యాలు, ఒకే శాశ్వత విలువలు, ఒకే దేవుడి నియమావళి.

కానీ  మనం అంతరాత్మలో  ప్రయాణించి ఈ కఠిన విషయాలు తెలుసుకోవడానికి, చేదుగా వుండే  పచ్చి నిజాల్ని రుచి చూడడానికీ  వెనుకాడుతాం. గొప్ప సినిమాలు మన మెడబట్టి ఈ పనే చేయిస్తాయి. మనల్ని- అంటే మనలాంటి  హీరోని, మెడబట్టి  మిడిల్ కథ లోకి నెట్టి సంఘర్షణలో పడేస్తాయి. ఏ అంతరాత్మకి భయపడి దూరం దూరంగా వుంటున్నామో, ఆ అంతరాత్మ ( మిడిల్ ) లోకి నెట్టి-  అక్కడి నగ్నసత్యాల పట్ల, ఆ శాశ్వత విలువల పట్ల, ఆ దేవుడి నియమావళి పట్లా మన భయాలని పోగొట్టి ఒడ్డున పడెయ్యడమే కదిలే బొమ్మల రూపంలో గొప్ప సినిమాలు చేసే పని- చెయ్యాల్సిన పని.

బరి లోకి దిగి అమీతుమీ తేల్చుకుంటే తప్ప మన భయాలు పోవు. అంతరాత్మలో పొడసూపే భయ కారకాలతో  పోరాడివాటి పట్ల భయాలు తొలగించుకునివిజేతలుగా అవతరించడమే జరిగేది. విజేతలుగా అవతరించడమే స్క్రీన్ ప్లేలో ఎండ్ విభాగం. అంటే అసంపూర్ణ వ్యక్తులుగా, పలాయన వాదం పఠిస్తూ, ప్రియమైన మనసుతో –ఇగోతో కలిసి షికార్లు కొట్టే మనం, అంతరాత్మతో భయాలని పోగొట్టుకుని, పరిపూర్ణ వ్యక్తులుగా ఎదగడమే పరోక్షంగా  గొప్ప సినిమా చూపించే మన జీవితపు సినిమా!

 సింపుల్ గా చెప్పాలంటే మనలోని ఇగో చంపుకున్నా చావదు కాబట్టి దాన్ని మెచ్యూర్డ్ ఇగోగా మార్చుకుని సుఖపడ వచ్చు. ఈ ప్రక్రియనే గొప్ప  సినిమా  కథైనా, ఏ పురాణమైనా, ఏ జానపదమైనా, ఇంకేదయినా చేపట్టేది. మనసూ అంతరాత్మల సయ్యాటలతో మనిషిని  మోక్ష మార్గాన నడిపించడం.  కురుక్షేత్రమంటే,  ‘ది ఆర్ట్ ఆఫ్ మాన్ మేకింగ్’ పుస్తకంలో చిన్మయానంద స్వామి ప్రకారం, మన మనస్సులో అంతరాత్మతో ఎడతెరిపి లేకుండా నిత్యం జరుగుతూ వుండే సంఘర్షణే. మనస్సులో వుండే ఐదు పాజిటివ్ ఫీలింగ్స్, నూరు నెగెటివ్  ఫీలింగ్స్ తో  చేస్తూ వుండే పోరాటం.

 రాముడి అరణ్య వాసంలో అరణ్యం అంతరాత్మకి ప్రతీకే. అర్జునుడి కురుక్షేత్రంలో కురుక్షేత్రం అంతరాత్మకి  సింబాలిజమే., ‘తెలివైన ఇంద్రజాలికుడుఅనే జానపద కథలో ఇంద్ర జాలికుడు అంతరాత్మ రూపమే.

జేమ్స్ బానెట్  కొన్ని గొప్ప  సినిమాలని ఉదహరిస్తాడు- ఈటీ, కాంటాక్ట్, అర్మగెడ్డాన్ సినిమాల్లో అంతరిక్షం అంతరాత్మ అయితేభూమి వెలుపలి మనసు. ఏలియెన్ లో అంతరిక్ష నౌకలోని కంట్రోల్ రూమ్ అంతరాత్మ అయితే, జురాసిక్ పార్క్ లో కాంపౌండు, మిగతా పార్కూ అంతరాత్మ. టైటానిక్ లో టైటానిక్ నౌక వెలుపలి మనసు అయితే, అది మునిగిపోయిన తర్వాత సముద్ర గర్భం అంతరాత్మ, జాస్ లో లంక అనేది వెలుపలి మనసు అయితేదాని చుట్టూ సముద్రం అంతరాత్మ, సముద్రం లోంచి దాడి చేసే సొరచేప నగ్న సత్యాలకి ప్రతీక, ఈ సొరచేపతో తలపడే హీరో మన ఇగోనే! ఈ చిత్రణలు ప్రేక్షకులతో  సైకలాజికల్ గా కనెక్షన్ ని ఏర్పాటు చేసుకుంటాయి.

తెలుగులోకి వస్తే,  ‘ఏలియెన్లో అంతరిక్ష నౌకలోని కంట్రోల్ రూమ్ ఎలాగో, ‘ఒక్కడులో భూమికని దాచిన గది అలా అంతరాత్మకి ప్రతీక అయితే, భూమిక పాత్ర పరిష్కరించాల్సిన  ఆ అంతరాత్మ సంధిస్తున్న పజిల్. మిగతా ఇల్లూ, చార్మినార్ అంతస్తూ అంతా వెలుపలి మనసు. మహేష్ బాబు మన ఇగో. శివలో నాగార్జున పాత్ర మన ఇగో. అతడి కాలేజీ వాతావరణ మంతా వెలుపలి మనసు, అతను తలపడే చీకటి మాఫియా ప్రపంచం అంతరాత్మ, రఘువరన్ విలన్ పాత్ర అంతరాత్మలోంచి పొడసూపుతున్న ఒక చేదు వాస్తవం.

 ఇక ప్రపంచ పురాణాలన్నీకూడా ఇలా  పాఠకులకి / ప్రేక్షకులకి మానసిక  చికిత్స చేసే- సైకో థెరఫీ చేసే పాఠాలే.  వీటిలో పురాణ పురుషుడి ప్రయాణం వివిధ మజిలీలు (ఎపిసోడ్లు) గా  సాగుతూ, ఒక్కో మజిలీ  ఒక్కో మానసిక రుగ్మతని/ బలహీనతని  క్షాళనం చేసే దిశగా సాగి పునీతుడ్ని చేసే అధ్యాయాలే. పురాణాల్లో కనిపించే వివిధ పాత్రలు, వస్తు సంచయాలు భావోద్వేగాలకి ప్రతీకలే.

3/c ‘ఒడిస్సీ’ ప్రతీకలేం చెప్తున్నాయి?

అలాగే ‘ఒడిస్సీ’ లో ఇథాకా అనేది కేవలం ఒక వూరు కాదుఅతడికి ఆత్మశాంతి నిచ్చే స్థానం. ఇంటికి చేరడమంటే పునీతుడై అంతరాత్మని చేరుకోవడం. ఇక్కడ ఇల్లు అంతరాత్మకి ప్రతీక. సినిమాలో సముద్రం కేవలం ఒక లొకేషన్ కాదుఅదొక సజీవ పాత్ర. అహంకారం పొటమరించిన ఒడిస్సీయస్ కి బుద్ధి చెప్పే అంతరాత్మకి సంకేతం సముద్రం. యుద్ధం పేరుతో చేసిన ఘోరాలు చాలు. ఇప్పుడు ఇల్లు అనే అంతరాత్మకి తిరిగి వెళ్ళాలంటే ఆత్మశుద్ధి చేసుకోనిదే వీల్లేదని సముద్ర దేవుడు సృష్టించే ఆటంకాలు.


ప్రయాణంలో ప్రతి ద్వీపం,.ప్రతి రాక్షసుడు, ప్రతి దేవత...అతను ఎదుర్కొనే ఒక అంతర్గత బలహీనతకి ప్రతీకలు. సైరన్లు : ఆత్మ శుద్ధికి అడ్డుపడే ఫీలింగ్. సగం పక్షి, సగం స్త్రీ రూపంలో వుండే జీవులు. అందమైన పాటలతో నావికుల్నిఆకర్షించి, మార్పు అనే తీరం చేరకుండా ముంచేసే ఒడిస్సీయస్ లోని నెగెటివ్ ఫీలింగ్స్. దీన్ని జయించాలి.

సిర్సీ : ఈ మంత్రగత్తె జంతు ప్రవృత్తికి – ఫీలింగ్స్ కి సింబల్.  మనుషుల్ని నీచ స్థాయిలో పందులుగా మార్చేస్తుంది. అంటే ఒడిస్సీయస్‌ తనలో వున్న జంతు ప్రవృత్తి అనే ఫీలింగ్ ని జయించాలన్న మాట.

స్కైల్లా అండ్ చారిబ్డిస్ : ఒకవైపు ఆరు తలల రాక్షసి (స్కైల్లా) ఓడలోని మనుషుల్ని  ఎత్తుకుపోతుంది. మరోవైపు సముద్రంలో పెద్ద సుడిగుండం (చారిబ్డిస్) ఓడని  మింగేయడానికి చూస్తుంది. అంటే తనలోని దురాశ, దుర్నీతి అనే రెండు అత్మవినాశక ప్రవృత్తుల్ని అంతమొందించుకుని బయటపడాలన్న మాట.

కాలిప్సో : ఒడిస్సీయస్‌ని  ప్రేమించి, అతడికి అమరత్వం ప్రసాదిస్తానని ఆశచూపి తన ద్వీపంలో ఏడు సంవత్సరాల పాటు బంధించే వాంప్. అంటే తనది కాని దానిపట్ల వ్యామోహం పెంచుకునే బలహీనత. దీన్ని అతను జయించాలి. దీంట్లో ఏడు సంవత్సరాలనే కాలపరిమితి దేనికి? దేనికంటే - ఇంగ్లీషులో  సెవెన్ ఇయర్స్ ఇచ్ అంటారు. వివాహంలో లేదా ఓ దీర్ఘకాలిక సంబంధంలో ఆనందం, సంతృప్తి అనేవి  ఏడేళ్ళ  తర్వాత తగ్గిపోతాయని ఓ నమ్మకం. అందుకని భార్య వున్న అతడ్ని ఆమె ఏడు సంవత్సరాల పాటు బంధించి వుంచింది. 

సైక్లాప్స్ : ఈ ఒంటికన్ను రాక్షసుడు  పక్షపాతానికి సంకేతం. ఇతను మనుషుల్ని తింటాడు. అంటే ఒంటి కన్నుతో పక్షపాతం కూడదని, రాజుగా రెండుకళ్ళతో సమన్యాయం చేయాలనీ ఒడిస్సీయస్ తెలుసుకుని, వాడి ఒంటికన్నుని (తనలోని ఒంటి కన్నుని)  పొడిచేసి పారిపోతాడు.

ఇలా ‘ఒడిస్సీ’ లోని రాక్షసులు కేవలం ఫాంటసీ పాత్రలు కాదు. వాటికి తాత్విక అర్ధాలున్నాయి. మన ఊహకందిన అర్ధాలు ఇవీ. మనో వైజ్ఞానికులు ఇంకా బాగా చెప్పవచ్చేమో. ఈ ప్రతీకల్ని కేవలం దృశ్య వైభవంగా కాకుండా, లోతయిన భావోద్వేగ స్థాయిలో చూపడం గొప్ప విజయంగా నిలిచింది.

ఈ సినిమాలో విలన్ లేడు. కానీ సముద్రం ఒక ప్రత్యర్థి. దేవతలు, రాక్షసులు  ప్రత్యర్ధులు, కాలం ఒక ప్రత్యర్ధి, అతడి అహంకారం (ఇగో) అసలు ప్రత్యర్ధి!  ఈ సినిమా వేసే తాత్విక ప్రశ్నలు - నిజమైన విజయం అంటే  ఏమిటి? ఇంటి విలువ ఎప్పుడు తెలుస్తుంది? యుద్ధంలో గెలిచినవాడు జీవితంలో కూడా గెలుస్తాడా? మనిషిని  ముందుకు నడిపించేది అహంకారమా, ప్రేమా? ఈ ప్రశ్నలే ఒడిస్సీని శాశ్వత క్లాసిక్‌గా నిలబెడతాయి.

3/d  ఆ ఇద్దరి పక్కన మరి ఇతను?



ఇక్కడ యాదృచ్చికంగా అశోక చక్రవర్తి గుర్తుకు రాక మానడు. ఒడిస్సీయస్, అశోకుడు ఒకే నాణేనికి రెండు ముఖాలుగా కనబడతారు. యుద్ధంతో చివరికి ఇద్దరూ నేర్చుకున్నది ఒకటే. ఇద్దరూ క్రూరమైన యుద్ధంలో తమ తొలి పరాక్రమంతో గుర్తింపు పొందారు, కానీ ఇద్దరూ దాని తర్వాత కలిగే వినాశకర భావోద్వేగ పరిణామాల్నికూడా  ఎదుర్కొన్నారు. ట్రోజన్ యుద్ధపు  నైతిక మూల్యాన్ని ఒడిస్సీయస్ నెమ్మదిగా గ్రహించడం, అప్పుడతడికి కలిగిన దుఃఖం, కళింగ యుద్ధం తర్వాత అశోకుడికి కలిగిన ప్రగాఢ పశ్చాత్తాపమూ ఒకటే కదా?

ఘోర ప్రాణనష్టాన్ని చూడడం ఆ ఇద్దరి ప్రపంచ దృక్పథాన్ని పూర్తిగా మార్చుకునేలా ప్రేరేపించిందే. ఒడిస్సీయస్, తన హక్కు అయిన ఇంటికి  తిరిగి చేరుకోవాలని తపించే విజేత నుంచి, మరింత వివేకవంతుడైన, సంయమనం గల నాయకుడిగా పరివర్తన చెందడం; అదేవిధంగా, అశోకుడు దురాక్రమణ విజయాల్ని విడనాడి, అహింసకి తలవంచి, బౌద్ధమతాన్నిస్వీక్కరించి,  దాని వ్యాప్తికి పాటు పడే ఆథ్యాత్మిక మార్గాన నడవడం - తేడా ఏమిటంటే ఒకటి పురాణం, మరొకటి చరిత్ర. బాగానే వుంది- మరి ఇప్పుడు నడుస్తున్న చరిత్ర? అందులో ట్రంప్? వాట్ ఎబౌట్ ది గ్రేట్ డోనాల్డ్ ట్రంప్? తను ఒడిస్సీయస్-అశోకుడుల పక్కకొచ్చి ఇంకెప్పుడు  నించుంటాడని!

4. నటనలు- సాంకేతికాలు


ఒడిస్సియస్ గా మాట్ డామన్ పదేళ్ళ ఆత్మశోధన  ప్రయాణంలో  జుట్టు నెరిసి, కళ్ళల్లో అలసట పెరిగి విరాగిలా అద్భుతంగా కనిపిస్తాడు. చివరికి బిచ్చగాడి మారువేషం హైలైట్. కండ బలం కంటే బుద్ధి బలంతో  యుద్ధాలు గెలిచే రాజు నుంచి ఒక మనిషిగా,  వివిధ ఎపిసోడ్లలో వివిధ ఎమోషన్స్ ని అనుభవించక తప్పని పరిస్థితులకి ప్రమోటయ్యే క్యారక్టర్ ఆర్క్ ని చక్కగా నిలబెట్టుకుంటూ పోయాడు. నోలన్ ఇతడ్ని ఒక పర్ఫెక్ట్ హీరోలా కాకుండా, తప్పులు చేసే, అహంకారం వున్న ఒక సాధారణ మనిషిగానే చూపించాడు.

భార్య పెనెలోప్ గా ఏన్ హాథ్వే  నటించింది. గ్రీకు పురాణాల్లో పెనెలోప్ అంటే పతివ్రత, ఓర్పుకి  ప్రతీక. కానీ ఈ సినిమాలో  ఆమెకి  కొంత ఆధునికతని జోడించారు. భర్త లేకపోయినా సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ, శత్రువుల వ్యూహాల్ని  తిప్పికొట్టే బలమైన రాజకీయ నాయకురాలిగా ఆమె పాత్ర, నటన ఆకట్టుకుంటాయి.

కొడుకు టెలిమాకస్ గా టామ్ హాలండ్ తండ్రిని చూడకుండానే పెరిగి, అతడి గురించిన  కథలు వింటూ పెరిగిన కుమారుడు. తండ్రి ఇమేజి తన మీద కలిగించే వొత్తిడిని, చివర్లో తండ్రితో కలిసి చేసే పోరాటాన్నీ  చాలా ఎమోషనల్‌గా క్యారీ చేశారు’

పెళ్ళికోసం పెనలోప్ ని వేధించే  జిత్తులమారి  ప్రేమికుడు ఆంటినస్ పాత్రలో, ప్యాటిన్సన్ కూడా అంతే ఆకట్టుకుంటాడు. అతడి నటన ఈ సినిమాలోని అతి పెద్ద హైలైట్లలో ఒకటి.

సాంకేతికంగా – భారీ గ్రాఫిక్స్ తో, ఇప్పుడు ఏఐతో కూడా, డిజైనర్ పురాణాలూ డిజైనర్ చరిత్రలూ కప్పుకుని వచ్చేస్తున్న నేటి కాలపు సినిమాలకి దూరంగా, పీరియెడ్ వాతావరణాన్ని సహజత్వంతో ప్రెజెంట్ చేసిన విధానం నోలన్ అజేయ క్రియేటివిటీకి ప్రబల నిదర్శనంగా వుంటుంది. సిజిఐ ని అవతలికి నెట్టి, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తో చిత్రీకరించిన దృశ్యాలు ప్రేక్షకుల్ని నిజంగా ప్రాచీన కాలంలోకి తీసికెళ్ళి పోతాయి. 70% ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ నే  ఉపయోగించారు. సినిమా ప్రారంభంలో వచ్చే ట్రోజన్ గుర్రాన్ని కలపతో  నిజంగానే 80 అడుగుల ఎత్తుతో నిర్మించారు. సముద్రంలో వచ్చే చాలా సీన్లని  స్టూడియో పూల్స్‌లో కాకుండా, మాల్టా తీరంలో నిజమైన ఓడల్ని తయారు చేసి చిత్రీకరించారు. దీని కోసం నటీనటులు నెలల తరబడి సముద్ర ప్రయాణ శిక్షణ తీసుకున్నారు. అందుకే ఆ విజువల్స్‌లో అంత సహజత్వం కనిపిస్తుంది.

సినిమాలో సముద్రం కేవలం ఒక లొకేషన్ కాదు, అదొక సజీవ పాత్ర. లూడ్విగ్ గోరాన్సన్ అందించిన సౌండ్ డిజైన్, సముద్రపు అలల చప్పుడుని ఒక భయంకర  రాక్షసుడి గర్జనలా థియేటర్లలో ప్రతిధ్వనిస్తుంది. మోత బరువు ఐమాక్స్ కెమెరాలతో  తీసిన సముద్రపు సుడిగుండాల షాట్స్, మనల్ని ఇరుకు గొట్టంలో పడి ఊపిరాడక గిలగిల కొట్టుకుంటున్నట్టు చేస్తాయి. విశాలమైన సముద్ర దృశ్యాలు హీరో ఒంటరితనాన్ని మరింత బలంగా తెలియ
జేస్తాయి. ఛాయాగ్రాహకుడు హోయిట్ వాన్ హోయిటెమా ఈ పౌరాణిక ప్రపంచపు బేలతనాన్ని, సౌందర్యాన్నీ అద్భుతమైన డిటెయిలింగ్ తో చిత్రీకరించాడు.

జెన్నిఫర్  లేమ్ ఎడిటింగ్ లో ఒక కదిలించే సన్నివేశముంది- ఒడిస్సీయస్ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, అతడి భార్య ఇథాకాలో పడే వేదనని  సమాంతర ఎడిటింగ్ తో  చూపించడంతో, మనం ఆ ఇద్దరి మధ్య వున్న మానసిక బంధాన్ని బలంగా ఫీలవుతాం.

చెక్క గుర్రం, ట్రాయ్ విధ్వంసం, ఒంటికన్ను రాక్షసుడ్ని ఒడిస్సీయస్ ఎదుర్కోవడం వంటివి దృశ్యపరంగా ఆకట్టుకునే ఘట్టాల్లో కొన్ని. క్లయిమాక్స్ లో వచ్చే తండ్రీకొడుకులు కలిసి     శత్రువులందరినీ వేటాడే దృశ్యాన్ని నోలన్ ఒకే ఒక్క లాంగ్ షాట్  లో చిత్రీకరించడం ఒకెత్తు.  రక్తం ఏరులై పారుతున్నా, అందులో ఒక న్యాయం, ఒక కుటుంబపు ఆక్రోశం కన్పించి, సంతృప్తి వేస్తుంది ప్రేక్షకులకి.

5. చివరికేమిటి?

మతాలతో సంబంధం లేకుండా ఏ పురాణమైనా గాథగానే వుంటుంది, కథగా కాదు. ప్రపంచ పురాణాలని పరిశోధించిన జోసెఫ్ క్యాంబెల్ ఈ విషయమే కనుగొని, గాథలన్నిట్లో ఆయా పురాణ పాత్రల ప్రయాణ మెలా వుంటుందో పుస్తకం రాశాడు- ‘ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’. ఈ ప్రయాణం 17 మజిలీలుగా వుంటూ, ఆ మజిలీల్లో సబ్ కాన్షస్ మైండ్ ప్రతీకలతో పోరాడుతూ వెళ్ళి, చివరికి ఆథ్యాత్మిక  ఔన్నత్యాన్ని –లేదా మోక్షాన్ని పొందుతుంది పురాణ పాత్ర. సబ్ కాన్షస్ మైండ్ తో ఈ సంఘర్షణ క్షీరసాగర మథనమే. ఇలా పురాణాలు మనసు గురించి చెప్పి, దాన్ని ఎలా మేనేజ్ చేసుకుని బాగుపడలో బోధిస్తాయి. కానీ వేల సంవత్సరాలుగా మనుషులు మాత్రం  దీన్ని అర్ధం జేసుకోక, భక్తితో కేవలం పురాణ పురుషుల్ని పూజించి తరిస్తున్నారు. నేర్చుకునేదేమీ లేదు.

పురాణాలు అసలుకి చేసేది సైకో తెరఫీ అయితే, అవి గాథలు కాబట్టి కథాగమనం  నిదానంగా వుంటుంది. జోసెఫ్ క్యాంప్ బెల్ ఇలాటి  గాథల నిర్మాణాన్ని ‘మోనోమిత్’ అన్నాడు. ఇందులో పురాణ పురుషుడుకి 17 మజిలీలతో కూడిన సుదీర్ఘ  ప్రయాణం వుం టుందన్నాడు. ఏ మజిలికి ఏ ప్రయాణం ఎలా సాగుతుందో వివరించాడు. దీంతో హాలీవుడ్ దీన్నుపయోగించి సొమ్ము చేసుకోవాలని  స్టార్ వార్స్ సిరీస్, ఇండియానా జోన్స్ సిరీస్ వంటి సినిమాలు అనేకం ఉత్పత్తి చేసింది. తర్వాత 17 మజిలీలు ఈ కాలానికి అవసరం లేదని, మైకేల్ హాగ్ వచ్చేసి 10 కి కుదించాడు. అయినా కాలానికి తగ్గట్టు కథల వేగం పెరగలేదు. అప్పుడు సిడ్ ఫీల్డ్ రంగ ప్రవేశం చేసి, 10 మజిలీల్ని 5 మజిలీలకి కుదించి అమాంతం స్పీడు పెంచాడు. అలా 1990 ల నుంచీ హాలీవుడ్ సినిమా కథలు సిడ్ ఫీల్డ్ పేరు పెట్టిన త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ ‘పారాడైం’ తోనే వస్తున్నాయి ఇప్పటికీ.

ఈ నేపథ్యంలో క్రిస్టఫర్ నోలన్ వచ్చేసి ‘ఒడిస్సీ’  స్క్రీన్ ప్లేకి క్యాంప్ బెల్ మోనోమిత్ ని వాడుకున్నానని చెప్పాడు. మోతబరువు కెమెరాల్లాగా మోతబరువు గాథ అయిపోయింది. పైగా దీన్ని ఆ 17 ఏళ్ళ మాస్ కుర్ర ప్రేక్షకుల దగ్గర్నుంచీ, అంతకంటే పెద్దవాళ్ళ నీ టార్గెట్ చేసి తీశానన్నాడు. 17 ఏళ్ళ మాస్ కుర్ర ప్రేక్షకులో, ఇంకెవరో దీన్ని వినోదం కోసం కాకుండా  విజ్ఞానం కోసం చూస్తారనే నమ్ముతూ ముగిద్దాం!

-సికిందర్